February 28, 2012


అమ్మ - పెద్దమ్మ
                 --------------- వారణాసి నాగలక్ష్మి                
నవ మాసాలూ మోసి 
అణువుకి శిశువు రూపమిస్తుంది 
బిడ్డకు జన్మ నిస్తూ 
తాను పునర్జన్మనెత్తుతుంది  !
ఎండిన కట్టెలూ  , పచ్చి దినుసులూ 
తెచ్చుకుని తన వేళ్ళతో 
షడ్రుచులూ తయారు చేస్తుంది
పచ్చడి మెతుకులు తనకుంచుకుని 
విస్తరినిండా విందు భోజనం 
వెంటపడి  తినిపిస్తుంది  ! 
అది అమ్మ !

మనిషి తిని పారేసిన విత్తులో 
జీవమై నిరీక్షించి 
తొలకరి జల్లులకే   పులకించి  
మొలకెత్తి చిగుళ్లేసి 
చెత్తా, మట్టీ , కుళ్ళూ మధ్య లోంచి 
తన వేళ్ళని చొప్పించి 
ఆకుల్లో ఆహారం తయారు చేసి
అడక్కుండానే అందిస్తుంది !
పనికిరాని గాలులు తను తీసుకుని 
ప్రాణ వాయువు ని  మనకందిస్తుంది
గుక్కెడు నీళ్ళివ్వకపోయినా   
కురిసే వాన చుక్కలతోనే సర్దుకుని 
శాఖోప శాఖలుగా విస్తరిస్తుంది 
కమ్మని గాలీ ,చల్లని నీడా పంచిస్తుంది  
కొమ్మలు నరికేసినా కిమ్మనదు  
రాళ్ళేసి కొట్టినా పళ్ళే విదిలిస్తుంది    
ఎండైనా వానైనా   
తన నీడకు చేరినవారెవరైనా 
ఆప్యాయంగా హృదయానికి  హత్తుకుంటుంది   
ఇది ఇంకా పెద్దమ్మ !

No comments:

Post a Comment