January 9, 2013

నది,జనవరి లో ప్రచురితమైన సంక్రాంతి ప్రత్యేక వ్యాసం


          హేమంత సీమంతిని - సంక్రాంతి శుభకామిని !
                                   


ఏటి పొడుగునా ఎన్ని పండుగలున్నా అన్నదాతకి అత్యంత ప్రియమైన పండుగ సంక్రాంతి పండుగే.శ్రమకు తగిన ఫలితం లభించే సమయమే నిజమైన పండుగ సమయం. వ్యక్తిగతమైన విలాసాలూ, సౌకర్యాలూ,భోగభాగ్యాలూ కాదు అసలైన పండుగని ఆవిష్కరించేది. పదిమందితో పంచుకున్నదే పరమాన్నం,పదుగురితో కలిసి పరవశించినదే పండుగ  సమయం! ‘ పంచుకుంటే దుఃఖం సగమౌతుంది,ఆనందం రెట్టింపవుతుందన్నమాట అక్షరసత్యం. సంతోషాన్ని నలుగురితో పంచుకుంటూ సమూహంలో ఒకరుగా కలిసిపోగలిగే అవకాశం లేనపుడూ, ఎంతటి ఆనందాన్నైనా ఎదలోనే  ఇముడ్చుకోవలసి వచ్చినపుడూ, మనిషి వేదనకి లోనుకాక తప్పదు. రాత్రింబగళ్ళు కష్టిస్తూ, దేశానికి వెన్నెముకగా కీర్తించబడే రైతు తన కష్టానికి ప్రతి ఫలాన్నందుకుని, తోటి శ్రమ జీవులతో ఆ ఫలాన్నిపంచుకునే విశిష్ట సన్నివేశం మనకి సంక్రాంతి పండుగలో కనబడుతుంది. వ్యవసాయం కర్షకుడొకడే సాగించే వ్యవహారం కాదు. అదొక ఉమ్మడి వ్యవస్థ.ఆ వ్యవస్థలో భాగస్వాములైన వారంతా పంట చేతికందినపుడు ఉప్పొంగే హృదయాలతో చేసుకునే పండుగే సంక్రాంతి పండుగ.
 ‘సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. అశ్వని ,భరణి మొదలైన ఇరవయ్యేడు నక్షత్రాలలో ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున  108 పాదాలుగా నక్షత్ర విభజన చేసి తిరిగి ఆ 108 పాదాలనూ మేషాది ద్వాదశ రాశులుగా విభజించారు. సూర్యుడు ఈ పన్నెండు రాశుల్లో నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు.అలా పూర్వరాశి నుంచి ఉత్తర రాశి లోకి ప్రవేశించిన రోజుని ఆ నెలకి సంబంధించిన మాస సంక్రాంతి గా వ్యవహరిస్తారు.మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు వచ్చే మకర సంక్రాంతి కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మకరరాశితో సూర్యుడు కలిసినప్పుడు సూర్యగమనం  ఉత్తరదిశగా మారుతుంది. ఈ రోజున సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు .సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుందనీ, ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారనీ పురాణాలు పేర్కొంటున్నాయి .అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుంది.   కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు సూర్యగమనం దక్షిణ దిశగా ప్రారంభమై దక్షిణాయణం వస్తుంది.
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. మనం వాడే గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయసాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. గ్రెగోరియను కాలెండరు ప్రకారం సంవత్సరం మారినపుడు ఈ పండుగల తేదీలు కూడా మారిపోతాయి.

పుష్య మాసంలో జనవరి 14 న వచ్చే సంక్రాంతి నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని హిందువులు నమ్ముతారు.ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది కాబట్టి ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందమని పెద్దలు చెపుతారు. ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని కలిగిస్తుందని విశ్వాసిస్తారు. అంచేతే స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు దక్షిణాయనంలో అంపశయ్య పై చేరినా, ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేంతవరకు నిరీక్షించి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజుకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి (మాఘ శుద్ధ ఏకాదశి) నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడని మహాభారత కథ చెపుతుంది. ఉత్తరాయణ కాలంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, ఇంటి వాకిలిని రంగవల్లికలతో అలంకరించి ప్రతి నిత్యం సూర్యభగవానుని అనుగ్రహం పొందిన వారికి సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయని హిందువులు నమ్ముతారు.
సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి. "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని వెంట తెచ్చే పండుగ కనుక దీనిని "సంక్రాంతి"గా పిలుస్తారు.మకరం అంటే మొసలి. వదలకుండా పట్టుకుని ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ,మోక్ష మార్గానికి అనర్హులను చేయడంలో శీతకాలం మొసలి లా కీలక పాత్ర వహిస్తుందనీ ,ఈ మకర సంక్రమణ పుణ్యదినాలలో శక్తికి తగినట్లు పుణ్య కార్యాలూ, దానధర్మాలూ చేస్తూ కైవల్యాన్ని పొందవచ్చుననీ పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్ఠమైనదనీ, ప్రత్యేకించి ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు,దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తే విశేష ఫలం లభిస్తుందనీ , ఈ కాలంలో చేసే గోదానం వలన స్వర్గ వాసం కలుగుతుందనీ పెద్దల నమ్మకం.
సంక్రాంతి మూడు రోజుల పండుగ.దీనిని పెద్ద పండుగగా పరిగణిస్తారు.  సంక్రాంతి పండుగ భిన్నత్వంలో ఏకత్వాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లలో సంక్రాంతి  అనితమిళనాడు లోపొంగల్ అనిమహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్‌ సంక్రాంతి  అనిపంజాబు, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు ముచ్చటగా జరుపుకుంటారు. నగర వాసులెలా జరుపుకున్నా, పల్లీయులు  మాత్రం ప్రకృతినీ , పర్యావరణాన్నీ, సహజీవన సూత్రాలనూ రంగరించుకుంటూ ఈ పండుగ చేసుకుంటారు.రైతులు అనేక కష్టనష్టాలకోర్చి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వచ్చే ఈ పండుగని రైతుల పండుగగా వ్యవహరిస్తారు.
పూర్వం లక్ష్మీదేవి పేదలకు వరాలిస్తూ అస్పృశ్యుల ఇండ్లలోకి ప్రవేశించిందనీ, అప్పుడు జగన్నాథుడు తన సోదరుడైన బలభద్రుని ప్రేరణతో ఆమెను వెలివేశాడనీ , దీంతో గృహలక్ష్మి బాధ్యతలనుండి విముక్త అయిన లక్ష్మీదేవి ఏ విధమైన చింత లేకుండా మార్గశిర, పుష్య, ధనుర్మాసాల్లో మరింత విరివిగా పేదల ఇళ్ళకు వెళ్లి వరాలు ఇవ్వడం ప్రారంభించిందని పురాణ కథ. ఇలా ధనుర్మాసంలో వీధులలో సంచరించే లక్ష్మీ దేవి, రంగవల్లికలతో అలంకరించబడిన తమ ఇంటికి తప్పక వస్తుందని నమ్ముతూ , లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ , ప్రతి ఇంటా ముంగిట్లో కళ్ళాపి జల్లి, రంగు రంగుల ముగ్గులు పెడతారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు .ఈ పిండి ని ముక్కులతో పొడుచుకుంటూ తినే పిచికలూ, పక్షులూ ,కీటకాలూ ఇంటి ముంగిళ్ళను ఆహ్లాదభరితం చేస్తాయి.పండుగ నెల రోజులూ కన్నెపిల్లలు ఆవుపేడతో గొబ్బిళ్ళు చేసి పసుపు కుంకుమలద్ది , లక్ష్మీ దేవి మెత్తని పాదాలు పెట్టేందుకు వీలుగా గొబ్బిళ్ళిపై  పెద్ద పెద్ద తామర, గుమ్మడి పువ్వులు వుంచుతారు. గొబ్బి పూజ చేసి, భూమాతని గొబ్బి లక్ష్మిగా కొలుస్తూసుబ్బీ గొబ్బెమ్మా ! సుబ్బణ్ణియ్యావే అంటూ తమ కోరికలు నివేదించుకుంటారు. ఈ పూజలతో సంతుష్టురాలైన భూమాత అనేక వరాలను ప్రసాదిస్తుందని విశ్వస్తారు. కన్నెపిల్లలు పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలను (గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు)  సూచిస్తాయి. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు సౌభాగ్య చిహ్నాలు. మధ్యన ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో సందె గొబ్బెమ్మ పేరంటం పెట్టుకుని, బాలికలంతా కృష్ణుని ప్రార్ధిస్తూ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు.
రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశాన్ని సూచిస్తుంది. ఒక పద్దతిలో పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు, ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యుణ్ణి సూచిస్తుంది. ఇక వివిధ ఆకారాలతో వేసే ముగ్గులు వివిధరాశులని సూచిస్తాయంటారు. సూర్యుని రధం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారడాన్ని సూచిస్తూ  సంక్రాంతి నాటి రధం ముగ్గు ని కనుమ నాడు ఉత్తరం వైపుగా మళ్లిస్తారు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ రంగవల్లులు తీరుస్తారు.
ఈ పెద్ద పండుగలో మొదటి రోజైన  "భోగి" పండుగ నాడు తొలికిరణాలు పలకరించక ముందే ఇంటిముందు భోగిమంటను వెలిగిస్తారు. ఇంట్లోని పాతవస్తువులు, పనికిరాని సామగ్రి,చిత్తు కాగితాలు పోగుచేసి ఈ మంటల్లో వేస్తారు.ఇంటినిండా పోగుపడిన చెత్త వల్ల ఏర్పడే అననుకూల వాతావరణం తొలగిపోయి,గృహసీమ శుభ్రపడి,  జీవితంలో కొత్త కాంతి వెల్లివిరుస్తుందని విశ్వసిస్తారు.దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ భోగిమంటలని వెలిగిస్తారు. కష్టకాలంలో వాడుకున్న చింపిరి చాపలు, విరిగిన కొయ్యలు భోగి మంటల్లో వేసి దారిద్ర్యాన్నీ,చలినీ ఊరి నుంచి తరిమేయాలని సంకల్పిస్తారు. భోగినాటి సాయంకాలం పిల్లలపై భోగి పండ్లు పోస్తారు. ముద్దులొలికే పసి పిల్లల నుండి కౌమారంలోకి అడుగు పెడుతున్న బాలబాలికల వరకూపిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టి రేగుపండ్లలో చేమంతి, బంతి పూరేకలు, అక్షింతలు, చిల్లర నాణేలు,చెఱకు ముక్కలు, పాలకాయలు కలిపి పిల్లల తలలపై పోసి దిష్టి తొలగిస్తారు. పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పసుపు, కుంకుమలు అందిస్తారు. రేగు పండ్లని బదరీ ఫలాలనికూడా అంటారు. వీటిని విష్ణుమూర్తి స్వరూపాలుగా భావిస్తూ పసివారిపై  ఫలాలను పోసి హారతులివ్వడం వల్ల విష్ణుమూర్తి కరుణాకటాక్షాలు లభిస్తాయని విశ్వసిస్తారు. తెల్లవారు జామునే లేచి భోగిమంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంలో పిల్లలు ఆనందోత్సాలతో పాల్గొంటారు.కన్నెముత్తైదువులు బంతి, చేమంతులతో అందంగా అలంకరించుకుని "గొబ్బియల్లో...! గొబ్బియల్లో...!" అంటూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడి పేరంటం పెట్టుకుంటారు. కొలని దోపరికి గొబ్బిళ్ళో ,యదుకుల స్వామికి గొబ్బిళ్ళో అంటూ  గోకులాన్ని తన చిలిపి చేష్టలతోఅలరిస్తూ, ఎదురొచ్చిన ఆపదలనుంచీ తనవారిని రక్షిస్తూనిలిచిన కృష్ణుణ్ణి కీర్తిస్తారు.
రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, పొంగలి తయారు చేస్తారు.  అరిసెలు,  బొబ్బట్లు, జంతికలు,చక్కిలాలు,పాలతాలుకలు, సేమియా పాయసం,  పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలనీ,మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా ఇవ్వాలనీ శాస్త్రం చెపుతుంది.
సంక్రాంతి పండుగ సంబరాలను వీక్షించాలంటే పల్లెటూళ్ళకి పయనమవాల్సిందే.తెలవారక ముందే, మంచుతెరలు వీడకముందే వాకిళ్ళు శుభ్రపరచి, ఆకుపచ్చని తడి నేలలపై  ముత్యాల ముగ్గులు తీర్చిదిద్దే ముద్దుగుమ్మలొకవైపూ, విచ్చుకున్న వెలుగు రేకలు నిశాదేవి కురుల్లో నక్షత్రకాంతులై తళతళలాడే వరకూ వినువీధంతటా విహరించే గాలి పటాలింకొక వైపూ,సంధ్య కాంతుల్లో రంగు రంగుల దుస్తులు ధరించిన కన్నె పిల్లలు గొబ్బి తడుతూ చేసే బృంద నాట్యాలు మరొక వైపూ పల్లె వీధుల్ని కళకళలాడిస్తాయి.సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడు తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు. మరదళ్ల పరాచికాలూ,మృష్టాన్న భోజనాల నడుమ నవదంపతులు మరింత చేరువై తమ అనుబంధాన్ని దృఢంగా మలుచుకుంటారు.                                                                               
సంక్రాంతి రోజులలో పల్లెల్లో కనిపించే సుందర దృశ్యాలెన్నో.చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత గంగిరెద్దుల వాళ్ళు చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెడ్లు మనమిచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలూపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగుతాయి. “అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ, చూడ వచ్చిన చిన్నారులను దీవిస్తూ, మంగళ వాక్యాలు పలుకుతూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తుంటే యజమానులు కొత్తధాన్యాన్ని కొలిచి ఇస్తారు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని నమ్మకం .  ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తుంటే,  ముందు వెనుకల చెరో ప్రమధునితో కదలి వచ్చే గంగిరెద్దు, గృహస్థునీ, అతని కుటుంబాన్నీ  ఆశీర్వదించ వచ్చిన శంకర పరివారాన్ని సూచిస్తుంది. ముంగిట నిలిచిన వృషభం, నేలనుండి వచ్చిన పంటకు సంకేతం. గృహస్థు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ , దానిని తాము ఆమోదిస్తున్నామంటూ ఇంటింటికీ తిరుగుతారు వృషభసహిత శంకర పరివారం.
హరిలో రంగ హరీ “ అంటూ, భ్రూ మధ్యనుండి నడినెత్తి వరకు తీర్చిన తిరుమణి పట్టెలతో, నున్నగా గీసిన గుండు పైన  గుమ్మడి కాయ ఆకారంలో ఉండే రాగి అక్షయపాత్రని కదలకుండా నిలుపుకుని ,ఘల్లుఘల్లుమనే కంచు గజ్జెలతో చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ ‘హరిదాసులు ప్రత్యక్షమవుతారు. ఈ గుండ్రని పాత్ర  భూమిని సూచిస్తుంది.దీనిని తలపై ధరించిన వ్యక్తి భూమిని ఉద్ధరించే శ్రీహరికి సమానుడని సూచన. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం . హరిదాసులు ఇలా  హరినామ సంకీర్తనలు చేస్తూ వచ్చి"కృష్ణార్పణం" అంటూ ఇంటి ముంగిట భిక్షను స్వీకరిస్తారు.       
 రుద్రాక్షపూసలతో కుట్టిన గోపురాకారపు టోపీ దాల్చి,నుదుటిపై విభూతి కట్లు దిద్దుకుని,గణగణ గంట మోగిస్తూ శంఖమూదిస్తూ హరహరా పాహి! మాంపాహి అంటూ జంగమదేవర తరలి వస్తాడు.పిట్టదొరలుబుడబుక్కలవాళ్లు వారివారి కళలను ప్రదర్శించి యజమానులిచ్చే  కానుకలను భుజాన వేసుకుని దాతల ఇళ్ళు పాడి పంటలతో కళకళలాడాలని దీవించిపోతారు.
మూడవ రోజయిన కనుమనాడు వ్యవసాయంలో తమకు ఎంతో  చేదోడువాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపుతూ పండుగ జరుపుతారు. పాలిచ్చే గోవులను మహాలక్ష్మిగా భావిస్తూ శ్రద్ధతో స్నానం చేయించి పసుపురాసి, కుంకుమ దిద్ది పూజిస్తారు.పొలం దున్నే ఎద్దులను బసవేశ్వరునిగా కొలుస్తూ శుభ్రంగా కడిగి ,కొమ్ములకి రంగులు వేసి,తిలకం తీర్చి, మెడలో మువ్వలు కడతారు.తెలక పిండీ,పచ్చగడ్డీ,అరటి పళ్లూ నైవేద్యంగా తినిపిస్తారు. వనభోజనాలను ,ఎద్దుబళ్ళపందేలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతూ ఆ రోజున కోళ్ల పందేలు, పొట్టేళ్ల పందేలు పెడతారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.
నుమ నాడు మినుము తినాలనేది సామెత. మినుము లో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక గారెలు తప్పనిసరిగా చేసుకుంటారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. ఈరోజున పెళ్లి అయిన ఆడపిల్లలు "సావిత్రి గౌరివ్రతం" అనే బొమ్మల నోము పడతారు. అఖండ జ్యోతి వెలిగించి , గౌరీ దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నైవేద్యం చేసి,చివరగా ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థంలో నిమజ్జనం చేస్తారు. 
ఈ సంక్రాతి పండుగని ఎందరో కవులూ ,రచయితలూ అనేక విధాలుగా వర్ణించినా మనకి వెంటనే గుర్తొచ్చేది దేవులపల్లి కృష్మశాస్త్రి గారు రచించిన రావమ్మా మహాలక్ష్మీ! రావమ్మా ! అనే పాటే.తెలుగింటి సంక్రాంతి లా ఉంటుందో తేట తెలుగు పదాలలో రమణీయంగా చూపిస్తూ ,కడివెడు నీళ్ళతో కళ్ళాపి చల్లడం,కావెడు పసుపు గడపకు పూయడం,ముత్యాల ముగ్గులు తీర్చడం వర్ణిస్తూ  పాటను సాగించి, చివరి చరణంలో    
                                                     
పాలిచ్చే గోవులకీ పసుపూ కుంకం!
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం!
గాదుల్లో ధాన్యం , కావిళ్ళ భాగ్యం..
కష్టించే కాపులకూ కలకాలం సౌఖ్యం !
అంటూ కవి మంగళ వాక్యం పలుకుతారు.
 సంక్రాంతి పండుగ అణువణువునా మనిషి ప్రకృతితో చేయవలసిన సహజీవనం  తాలూకు సూత్రాలు కనపడతాయి.వ్యక్తి తాను పొందిన సంపదను నలుగురితో పంచుకోవాలనే ఉద్బోధ కనిపిస్తుంది.జీవన యానంలో తనకు సాయపడిన   పశు పక్ష్యాదులను పూజించి ఆదరించాల్సిన బాధ్యతను అతనికి గుర్తు చేసే సంస్కృతి పొందుపరచబడి ఉంది.నిండైన రంగులు మనిషిని ఉత్తేజ పరిచి కుంగుబాటు ధోరణినీ,నిరాశనీ తరిమేసి మానసికోల్లాసాన్ని అందిస్తాయని వైద్యవిజ్ఞానం నేడు చెపుతోంది.తరతరాలుగా మన జీవన విధానంలో అంతర్లీనమైన పండుగల ప్రధానోద్దేశ్యంకూడా అదే.యాత్రికమైన జీవనం లో నూతనోత్సాహాన్ని నింపుతూ,ఋతువులు మారుతుంటే వచ్చేవాతావరణమార్పులకి తగినట్టుగా శరీరాన్ని సిద్ధ పరుస్తూ,మానవ సంబంధాలను మెరుగు పరుస్తూ,సమాజం మరింత ఆరోగ్యవంతంగా రూపొందేలా చేయడమే  పండుగల మూల సూత్రం.ఇది గ్రహించి ఆడంబరాన్నితగ్గించుకుంటూ మానవతా భావాన్ని పెంచుకుంటూ ఈ సంక్రాతి వేళ మనమంతా సంక్రాంతి ని, అదే ..నిజమైన అభ్యుదయాన్ని సాధించాలని కోరుకుందాం !
                                              ****    ***    ****