March 26, 2013


పరుగెత్తే వసంతాలు !

---------------------------------------------------------------------------       
గతం గాయాల గేయమై కాలానికి గాలమేస్తూంటే
ముందుకి సాగలేక ఆగిపోయా !
రేపటి కోసం ఇంద్రధనుసు రంగుల్లో
నిన్నరాత్రి కన్న కలలేవీ కనిపించక
అదేపనిగా వెతుక్కున్నా !
కాగితపు పడవలెక్కి
రేపటి తీరానికి ప్రయాణమైన నా కలలన్నీ
తెల్లారక ముందే ముంచెత్తిన జడి వానకి తడిసి
గుమ్మం పక్కనుంచే
కొట్టుకుపోతూ కనిపించాయి !
గమ్యం తాలూకు ఊహా చిత్రాలెన్నో
గదిగోడలనిండా వేలాడుతూ ఉండేవి...
అవన్నీ ఏవీ??
ఉండబట్టలేక ఇల్లంతా తిరిగేశా
ఉన్మాదినై ఆకాశమంతా వెతికేశా
గాలిపటాలై ఎగరబోయి
ఎండుకొమ్మలకి చిక్కుకుపోయిన నా ఊహలన్నీ 
చివికి చిరిగిపోయి కనిపించాయి..
నిస్పృహ నిలువెల్లా ఆవరించినా
నిలబడక తప్పదు,నడవక పోతే గడవదు!
ఎదురుగా చేరాల్సిన 'టార్గెట్స్ ' భయపెడుతున్నాయి!
ఓ సరదా ప్రేమ కథకి వస్తువు కావాలి , వెంటనే !
అనురాగ రాగంలో ఒదిగే ఉల్లాస గీతం కావాలి , తక్షణమే !
గడువు దాటిపోతోంది....
ఆత్రంగా అసహనంగా వీధిలోకి అడుగేశా
వసంతాలు '1K రన్' లో పాల్గొంటూ కనిపించాయి !
ఆ కళ్ళలో రాత్రి మెరిసిన నక్షత్రాలన్నీ తళుక్కు మన్నాయి
వాటినిండా అంతరిక్షాన్నంతటినీ వెలిగించగల ఆశలు తళతళలాడాయి !
ఆ నవ్వుల్లోంచీ జారిన మల్లెలతో దారంతా పూలబాటై పోయింది!
ఎంత సుగంధం !
మధుర గేయాలతో నా పుస్తకం నిండిపోయింది !
వెతుక్కుంటున్న  వస్తువు దొరికేసరికి
 మనసు దూది పింజై తేలిపోయింది !


                                  *     *      *

March 9, 2013

మార్చి నెల ' తెలుగు వెలుగు ' లో ప్రచురించబడిన నా కథ ' పుట్టిల్లు'                                                                                                  

ఆమె తనకేమీ కాదు! తమ కారిడార్ లోనే చివరి అపార్ట్ మెంట్ వాళ్ళది. వాళ్ళు వచ్చి ఆర్నెల్లయింది గాని ఆమె ఎవరితోనూ అంతగా కలవదు.తనే చొరవ తీసుకుని పలకరించి, వివరాలడిగితే 'ప్రేమ పెళ్ళి అనీ, రెండు వైపుల వాళ్ళూ అంగీకరించక పోవడంతో ఎదిరించి పెళ్ళిచేసుకున్నా'మనీ చెప్పింది. పేరు సమీర. వస్తూనో ,వెళ్తూనో ఎదురుపడినా, కారిడార్లో పక్క ఫ్లాట్స్ వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటున్నా మాటలు కలపదు.మొదట్లో పొగరు అనుకుంది తను.
వారం క్రితం తను చెత్తబుట్ట బయట పెట్టడానికి వెళ్ళినపుడే ఆ అమ్మాయి కూడా వచ్చింది.
కంటి దగ్గర కమిలిపోయి నల్లగా కనిపించింది.కుడి చెంప వాచి వుంది.బుట్ట కింద పెడుతూ అప్రయత్నంగా ముఖం చిట్లించి ఇస్స్అంటూ వింత శబ్దం చేసింది. ఆ శబ్దం తనలో ఏవో జ్ఞాపకాలని తట్టి లేపింది. కాలో, కీలో , నడుమో ఎక్కడో ఉన్నట్టుండి కలుక్కుమన్నపుడు పూర్ణత్త నాలుకతో ఇస్స్ అనే శబ్దం చేస్తూ ముఖం చిట్లించేది. మొదట్లో అ శబ్దం ఏమిటో అర్ధం కాకపోయినా తర్వాతెపుడో తెలుసుకునే సందర్భం వచ్చింది. 
అదే శబ్దం ఇప్పుడు వినపడగానే తను చటుక్కున సమీర దగ్గరకెళ్ళి, మొహంలోకి తేరిపార చూస్తూ, "సమీరా! అదేమిటలా వుంది కన్ను? ఒంట్లో బానే వుందా?"అనడిగింది.
ఆమె గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోతూ  ”ఆఫ్ కోర్స్ బానే ఉన్నాను ...పొద్దున్నే కొంచెం కళ్ళు తిరిగి గుమ్మానికి కొట్టుకున్నా" అంది .
తను వదలకుండా గుమ్మం దాకా వెళ్ళి " సమీరా! నే చెప్పేది ఒక్క మాట వినండి. ఏదైనా సమస్య వుంటే దాన్ని చిన్నతనంగా భావించి దాచి పెట్టకండి.నామోషీ గా అనుకోకండి. ప్రతి మనిషికీ ఉన్నంతలో గౌరవంగా,భద్రత గల జీవితాన్ని గడిపే హక్కుంది కదా ! మీకేదైనా సాయం అవసరమైతే పక్కనే మేమున్నామని గుర్తుంచుకోండి" అని చెప్పి వచ్చేసింది.
చుట్టుపక్కల అందరితో కలుపుగోరుగా ఉంటూ అందరితో కలిసిపోయే మనస్తత్వం తనది. వేణు కూడా మధూ! మధూ అంటూ ఇంట్లో ఉన్నంతసేపూ తన సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తూ, తన అభిప్రాయాలకి విలువనిస్తూ ఉంటాడు. అతని సహకారం ఉండబట్టే తనూ తోటివాళ్ళ సమస్యలకి స్పందిస్తూ, ఎవరికైనా సాయం అవసరమైనపుడు ముందుకడుగేయగలుగుతోంది.ఒకవేళ తను చేసే పని అతనికి నచ్చకపోయినా ,తన వ్యక్తిత్వాన్ని గౌరవించి తోడుగా నిలబడతాడని తెలుసు. ఆ ధీమా తోనే సమీర విషయంలో స్వతంత్రించి , సాయం అవసరమైతే చేస్తానని మాట ఇచ్చింది. అయినా తన సాయాన్ని అంత తొందరగా సమీర స్వీకరిస్తుందని మాత్రం ఊహించలేదు.
సరిగ్గా వారం కూడా కాకముందే ఆదివారం పొద్దున్నే వేణు ఉదయపు నడక  కోసం వెళ్తూ తెరిచి వదిలేసిన తలుపు గుండా సుడిగాలిలా లోపలికొచ్చింది సమీర. ఒంటి నిండా దెబ్బలు ,సగం ఊడిన జుట్టు,ఎర్రబడ్డ కళ్ళనిండా కసి, దు:ఖం ....ఆమెని సముదాయించి, కాస్త కాఫీ తాగించి, రెండో పడగ్గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట పనిలో పడింది . 
వేణు వచ్చాక జరిగిందంతా విని " ఏమిటిది మధూ?మనమేం చెయ్యగలుగుతాం? ' అన్నాడు తెల్లబోతూ.
ఏమో..ఏం చెయ్యగలుగుతామో తెలుసుకోవాలి! ఆ అమ్మాయికి దగ్గరివాళ్ళెవరూ లేరు.కిందటి మాటు మన పక్కవాళ్ళతో సమీర వొంటి మీద కమిలిన గుర్తుల గురించి చెపితే అంతా వాణ్ణి చీదరించుకున్నారు. ఎవరూ అండగా లేరు కదా అని పెళ్ళాంతో ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించినా, సంఘ భయం కూడా లేకుండా ఉంటాడంటావా వేణూ?"అంది జాలిగా మొహం పెట్టి.
ఎప్పుడూ ఎదుర్కోని విషయం కావడంతో వేణుకి ఏమనడానికీ తోచలేదు.
ఆ అమ్మాయి ఎవరో, అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళయిందో లేదో, వాళ్లెలాంటి వాళ్ళో ఏమీ తెలీకుండా ఇంత తొందరపాటేమిటి మధూ నీకు?” అన్నాడు కోపమూ,అమెనేమీ అనలేని నిస్సహాయతా కలిపి.
ఏమీ తెలీదు కనక అలాంటి స్థితిలో ఉన్న సాటి ఆడ మనిషిని బయటికి తోలేయలేను కదా వేణూ! కొంచెం అర్థం చేసుకో.రెండు రోజులు ఆశ్రయమిస్తే తనకి కొంచెం ఆలోచించుకునే వ్యవధి వస్తుంది కదా! మనమేం తనకి బాండు రాయడం లేదు కదా ఎప్పటికీ చూస్తామని!  కొంచెం తోడుండి ఒక పోలీసు కంప్లైంట్ ఇప్పిస్తే  పరిస్థితిలో మార్పొస్తుందేమో!"అంది అభ్యర్ధనగా.
వేణు ఆలొచిస్తూ మాధవి మొహంలోకి చూశాడు.
స్పందన కోల్పోయి, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ద్వీపంగా బతుకుతున్న సమాజంలో మాధవి వేరుగా కనిపించింది అతనికి. తెలియకుండానే చిన్న నవ్వు పెదవిపై మొలిచి కళ్ళదాకా పాకింది. అతని ప్రతిచర్య కోసం ఎదురుచూస్తున్న మాధవికి ఆ నవ్వు సుశీల నవ్వులా కనిపించింది.సహనం ,సహకారగుణం నిండిన వ్యక్తిత్వాలు చిందించే నవ్వులన్నీ ఒకలాగే ఉంటాయేమో అనిపించింది.తను రామారావైతే అతను సుశీల అనుకుంది నవ్వుకుంటూ.
                                                       ********   *********
పప్పు రుబ్బుతున్న సుశీల మనసు పరి పరి విధాల పోతోంది. అత్తగారలా ఎందుకు చేశారో ...మొన్న సాయంత్రం మునిమాపు వేళ పొలం నించి ఇంటికొస్తూనే తన దగ్గరేమైనా డబ్బుందా అని అడిగాడు రామారావు. వంగతోటలో కలుపు తీయడానికొచ్చిన పనివాళ్ళకి తప్పనిసరిగా కూలి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి..అప్పటికే అరకొరగా ఉన్న సరుకులతో ఇల్లు నడుస్తోంది. ఇంటి నిండా వేసవి సెలవులకని వచ్చిన పిల్లలు...రామారావు అక్కచెల్లెళ్ళ, తమ్ముళ్ళ పిల్లలు.
మెరకపొలం.వర్షాధారం!సాగు కోసం తవ్విన బావుల్లో నీటి ఆధారంగానే, అంతంత మాత్రంగా వ్యవసాయం సాగుతోంది.ఈ సారి టొమాటోలు విరగ కాశాయి.కూలీల్ని పెట్టి,బస్తాల నిండా నింపి, మార్కెట్టుకి తోలించడానికి అయిన ఖర్చు కూడా కిట్టలేదు.ఇటు వంగతోట నిండా కలుపు పెరిగి ఎన్ని నీళ్ళూ దానికే చాలడం లేదు.మూడు రోజుల పాటు పదేసి మంది కూలీలని పెట్టి తను కూడా పని అందుకుంటూ మొత్తం కలుపు తీయించాడు రామారావు. మొన్నటికి కలుపు తీత పూర్తయింది.పని చేసిన కూలీలకి డబ్బిచ్చి పంపించాలి.అప్పటికే రెండు రోజులు వాయిదా వేసినందుకు ఏ రోజు కూలితో ఆ రోజు గడుపుకునే కష్ట జీవులు గట్టిగా ఏమనలేక గొణుక్కున్నారు. ఒక్కోసారి వాళ్ల జీవితమే నయమనిపిస్తుంది....చేసిన పనికి కూలి తీసుకుని వెళ్ళిపోతారు.మార్కెట్టు లాభ నష్టాలతో పనిలేకుండా, పెట్టుబడీ,బాంకు లోన్లూ, వాయిదాలతో సంబంధం లేకుండా !
బయటెంత ప్రయత్నించినా అప్పు పుట్టక తననడిగాడతను.సరుకులు తెచ్చాక రూపాయి కూడా మిగల్లేదు తన దగ్గర. ఇక తప్పనిసరై అత్తగారి దగ్గర కెళ్ళి "అమ్మా! నీ దగ్గరేమైనా డబ్బుందా?"అనడిగాడు ఇబ్బంది పడుతూ.
ఆవిడ విస్తుపోతూ "నా దగ్గరెక్కణ్ణుంచి వస్తుందిరా ?అబ్బే.."అంది.
అంతకు ముందే ఏదో మాటల మధ్య "వాడికెంత డబ్బూ చాలదు"అనడం గుర్తొచ్చి చివుక్కుమంది తన మనసు. వర్షాధారమైన మెరకపొలమయ్యె.అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి అయినా మిగిలిన ముగ్గురూ పట్నంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.ఇక్కడేమో విత్తనాలూ, ఎరువులూ,పురుగు మందులూ, కూలీలూ, ఎప్పుడు చూసినా సరిగ్గా ఉండని కరెంటుతో మోటార్లు కాలిపోయో, పైపులు పాడయ్యో ఏదో ఒక రిపైరు రావడం....అన్నీ ఖర్చులే! అకాలంగా వర్షం వచ్చినా , రావాల్సినపుడు రాకపోయినా నష్టమే నష్టం. నెలలతరబడి కాపాడుకుంటూ వచ్చిన పంట నేల పాలైపోతుంది.ఒకవేళ సమృద్ధిగా పండి మార్కెట్ చేరినా ధర పలకదు ! తనకు తెలిసినంతలో అతనేనాడూ తన కోసం పది రూపాయలు ఖర్చు పెట్టుకున్నది లేదు. ఆయన చేసే ఖర్చంతా పొలం కోసమే. అదెవరికి అర్థమవుతుంది ? నిట్టూర్చింది సుశీల పొత్రాన్ని ఎడం చేతిలోకి మార్చుకుని ,మెత్తగా పొంగుతున్న పిండిని కుడిచేత్తో తోసుకుంటూ.
మొన్న తన దగ్గర డబ్బు లేదన్న ఆవిడ ,ఇవ్వాళ మధ్యాహ్న భోజనాల తర్వాత పూర్ణ కుటుంబం తిరుగు ప్రయాణమై వెళ్తూ, కాళ్ళకి దండం పెట్టినపుడు పిల్లలు ముగ్గురికీ పదేసి రూపాయలివ్వడమే గాక పూర్ణకీ,చలపతి అన్నయ్య గారికీ చెరో వందా ఇచ్చి బట్టలు కొనుక్కోమనడం సుశీలకి మింగుడు పడ లేదు.
అసలు పూర్ణ ని చూసినా తనకి ఆశ్చర్యమే.ఉన్నట్టుండి వస్తుంది పిల్లలతో. రెండు రోజులుండి వెళ్తుంది.ఈ సారి ఏకంగా వారం రోజులుండిపోయింది.అప్పటికే వేసవి సెలవులకి వచ్చిన పిల్లల్తో ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది.పొలం లో ఇల్లు కావడంతో పొలం పని వాళ్ళే గాని ఇంటి పనికి ఎవరూ రారు. పొద్దున్నే వండుకుని అన్నం మూట గట్టుకుని కూలి పన్లకి పోతారు ఆడా మగా అంతా.మండే ఎండల్లో తనకీ ,అత్తగారికీ ఎడతెరిపిలేని పని.తెల్లవారక ముందే లేచి, కసవూడ్చి ,కళ్ళాపి జల్లి ,ముగ్గులు తీర్చి ,ఆవులూ,గేదెల పాలు పితికి , పిల్లలందరికీ ఆవుపాలు కాచిచ్చి,తమకి కాఫీలు కలిపి ,మసిబారిన గిన్నెలూ,దేవుడి సామానూ , విడి విడిగా తోముకుని ,పిల్లలకి చద్దెన్నాలు పెట్టి తోటలోకి పంపి ,స్నానం ,పూజ ముగించుకుని ,కట్టెపుల్లల పొయ్యి మీద వంట కానిచ్చి ,పిల్లల ఆటలూ పాటలూ అయి తిరిగొచ్చి స్నానాలు కానిచ్చాక వాళ్ళకి హాల్లో వరసగా అరిటాకుల్లో భోజనాలు వడ్డించి ,వాళ్ళ తగవులు తీర్చి, తమ భోజనాలు కానిచ్చాక అరగంటైనా ఆయాసం తీర్చుకునే వెసులుబాటు ఉంటుందో లేదో..మేటెడు బట్టలు పెరటి బావి దగ్గర  పడేసుకుని నీళ్ళకి బోరు పంపు కొట్టుకుంటూ మేనకోడళ్ళు రేవతినీ,సుమతినీ అడ్డం వేసుకుని చాకలి రేవులా బట్టలుతికి ఆరేయడం... ఇంతట్లోకే కాఫీ, టీలకోసం జనమంతా ఎదురు చూపులు !
పొలంలో పండిన బియ్యంతో అన్నం వండి అందులోకి ,రకరకాలు లేక పోయినా తోటలో ఏ కూరగాయలు పండిస్తే వాటితోనే మార్చి మార్చి పులుసూ, కూరా ,పచ్చడీ అమరుస్తూ నెట్టుకొస్తున్నారు తానూ అత్తగారూ కలిసి. ఇంతమంది వస్తే తమ పశువుల పాడి సరిపోదు. పాల కేంద్రం నించి పాలు కొనాల్సిందే..
ఆవిడకి తెలియందేముంది?ఇలాంటి పరిస్థితుల్లో పూర్ణకి అంత డబ్బు చులాగ్గా ఎలా ఇచ్చేశారు? రామారావు తప్పనిసరై డబ్బడిగితే 'నాదగ్గరెక్కడుందిరా ?' అన్నావిడకి ఇంతట్లోకే ఎక్కణ్ణుంచి వచ్చింది ఇంత డబ్బు? ఆలోచిస్తూ గిన్నెలోకి రుబ్బిన పిండి తీస్తున్న సుశీలకి మనసొప్ప లేదు ఆవిడ అబద్ధం చెప్పిందనుకోవడానికి. ఇంతా చేసి పూర్ణ ఆవిడ సొంత కూతురైనా  కాదే.అక్క కూతురు.
పూర్ణ పాపం మంచిదే. మొగుడు అనుమానం మనిషని చూచాయగా తెలుసు గాని భార్యనలా కొడతాడని ఇన్నాళ్ళూ తమకి తెలియదు.
ఎప్పుడొచ్చినా అన్ని పనుల్లోకీ సాయం వచ్చే మనిషి ఈ సారి రెండు రోజులు జ్వరంతో మంచం మీదే ఉంది. ఎంతో మొహమాట పడింది పాపం.తగ్గాక కూడ మొహం చిట్లిస్తూ ఇస్స్ ఇస్స్ అంటూ వింత శబ్దాలు చేస్తుంటే ఏమిటో అనుకుంది తను.అత్తగారు నిలదీసి అడిగి, ఒత్తిడి పెడితే, వీపు మీద జాకెట్టు పైకెత్తి చూపించింది  వీపంతా ఎర్రని చారలూ,సిగరెట్టుతో కాల్చిన మచ్చలూ. తనకైతే ఒళ్ళు జలదరించింది.ఆ నెప్పికే కాబోలు మొహం చిట్లిస్తూ వింత శబ్దాలు చేస్తూ ఎవరికీ తెలియకుండా భరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అంత బాధలోనూ అతికించుకున్న చిరునవ్వు మాత్రం చెదరదు.. ఆశ్చర్యమే!ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా ఇలాంటి దెబ్బలు దాచుకునే వచ్చిందేమో పాపం! మనసు కరిగి, ఏవైనా చేతిలో పెట్టాలనిపించి ఇచ్చారేమో అత్తగారు . ఇస్తే తనకేం బాధ లేదు గాని ,ఆ డబ్బు ఉండీ లేదని ఆవిడెందుకు చెప్పారో తల్చుకుంటే వింత గానూ,ఒకింత బాధగానూ ఉంది.
రోలు శుభ్రం చేసి పిండి గిన్నె తీసుకుని లోపలికి నడిచింది సుశీల. చీకటి పడుతోంది.
వీధి వరండాలోనూ,హాల్లోనూ పిల్లలగోల. ఇంక ఆకలి అంటూ నిలవనియ్యరు అనుకుంటూ గబగబ పోపుకి కావల్సినవి సిద్ధం చెసి ఉప్మా తయారు చేసి, బయటికి వచ్చింది.పిల్లలంతా అత్తా! దొడ్డమ్మా!'అంటూ చుట్టుముట్టారు.
"ఇవాళ పౌర్ణమి కదా..అంతా వరండా బైట వెన్నెల్లో తిందాం"అంటూ గోల. రేవతీ ,సుమతీ నువు కూర్చో అత్తా! మేం అందిస్తాంఅన్నారు.సరే అయితే అని వెళ్ళి, రెండు చెంబులు నీళ్ళు దిమ్మరించుకుని, స్నానం కానిచ్చి, మెత్తని నూలు చీర చుట్టుకుని వచ్చేసరికి బయట ఆవరణలో నవారు మంచాలు వాల్చి ఉన్నాయి,అరుగు దగ్గరగా.రామారావుతో సహా అంతా మంచాల మీదా ,అరుగు గట్ల మీదా కూర్చుని కబుర్లాడుతున్నారు.రేవతి పెద్ద పెద్ద బాదం ఆకుల్లో ఉప్మా పెట్టి, నల్చుకుందుకు నిమ్మకాయ బద్ద వేసి ఇస్తుంటే,తన కూతుళ్ళు పదేళ్ళ మాధవీ,తొమ్మిదేళ్ళ భార్గవీ అందరికీ అందిస్తున్నారు. పుచ్చ పువ్వులా మెరిసి పోతున్న వెన్నెల్లో పిల్లలంతా దేవదూతల్లా కనిపిస్తున్నారు!
వాళ్ళ మధ్య కూర్చుని ఉన్న రామారావు ఆలమంద మధ్య గోపాలుడిలా ఉన్నాడు. వరండా మెట్లు దిగి మంచాల దగ్గరకొచ్చింది సుశీల. పిల్లలు పక్కకి జరిగి చోటిచ్చారు.చల్లగాలి హాయిగా మేను తాకుతుంటే ,కురిసే వెండి వెన్నెల మనసు నాహ్లాద పరుస్తుంటే ముగ్ధురాలై కూర్చుంది. రోజంతా పని చేసి అలసిపోయిన సుశీల మీద రామారావు చూపుల వెన్నెల పరుచుకుంది!
చిలికిన మజ్జిగ గిన్నె,నాలుగు గ్లాసులూ పట్టుకొచ్చింది సుమతి. కబుర్ల మధ్య ఉప్మా కరిగిపోయింది.గ్లాసుల్లో అందరికీ మజ్జిగ అందింది.పిల్లలేవో పాటలు పాడారు.వీళ్ళందరినీ చూస్తూ జాబిల్లి తీరిగ్గా ప్రయాణం సాగించాడు.నిద్ర ముంచుకొస్తుంటే ఒక్కక్కళ్ళే  ముందుగా పరుచుకున్న పక్కలమీదికి చేరారు.
అరుగు మీది పెద్ద మంచం మీద మనవరాలి పక్కనే పడుకున్న రుక్మిణమ్మ దగ్గరకొచ్చి, పక్కనే కూర్చున్నాడు రామారావు. లోపలికెళ్ళబోతున్న సుశీల కూడా ఆగి, పక్కనున్న గట్టు మీద కూర్చుంది.
నిద్ర పట్టిం దా అమ్మా?"అడిగాడు రామారావు మృదువుగా.
"లేదురా ఇంకా "అంది రుక్మిణమ్మ.
"పూర్ణక్క వెళ్ళింది పాపం "అన్నాడు సాలోచనగా.
"అవునురా!..అదొట్టి పిచ్చిది.ప్చ్...వారం క్రితం అదొచ్చినప్పుడు చెప్పద్దూ ...నాక్కొంచెం విసుగే వచ్చింది. ఇటు చూస్తే చేతిలో రూపాయి ఆడడం లేదు.అటు చూస్తే ఇంటి నిండా పిల్లలు..సెలవులు మామయ్యింట్లో గడపాలని ఆశతో వచ్చారు.అది(సుశీల) మాత్రం ఎంత పనని చేస్తుందీ? ఇంటినుంచి బయల్దేరి, ఇక్కడికి రావాలనుకున్నది పెందరాళే తెమిలి రావాలా?ఈ అడవిలో అత్యవసరమైతే రెండిడ్లీలు పొట్లం కట్టించుకు రావాలన్న వీలవదుగదా! ఆఖరి వరసకి సుశీలా , నేనూ ,అక్కయ్య గారి పిల్లలిద్దరూ కూర్చుని రెండు ముద్దలు కతికేసరికి వచ్చింది ముగ్గురు పిల్లల్నేసుకుని. అప్పుడిది నాలుగు ముద్దల్లో భోజనం ముగించి, మళ్ళీ పొయ్యి వెలిగించి, అన్నం వండి పెట్టింది పాపం"
మౌనంగా కూర్చుని వింటున్న సుశీల కల్పించుకుని " అదేమిటత్తయ్యా! అదేమంత కష్టమనీ…. ఆడపడుచుకి అంత మాత్రం చెయ్యమా ఏమిటి?"
చేస్తావు లేవే..నాకే కొంచెం విసుగొచ్చింది అంత మాత్రం ఇంగితం లేదేమా అని. ...అదేమో వస్తూనే జ్వరపడిందా..పిల్లల పని నీ మీదే పడిందయ్యె సగం! " ఒక్కనిముషం ఆగి "రాముడూ! దాని మొగుడొట్టి అనుమానపు వెధవరా.ఏదో కోపిష్ఠి వాడు తిడతాడు,సాధిస్తాడనుకున్నాను గాని ఇలా ఉచ్ఛం, నీచం తెలీకుండా పెళ్ళాన్ని, ముగ్గురు పిల్లల తల్లిని కొడతాడనుకోలేదు. వీపు మీద వాతలూ..సిగరెట్టు దెబ్బలూను..ఉన్నట్టుండి బయల్దేరి వచ్చేసినట్టుంది..ఏం చెప్పిందో ఏమో..పిల్ల వెధవలు కూడా ఇంటి విషయాలు నోరిప్పి చెపితే వొట్టు" అంది.
"అవునమ్మా! నాకూ తెలిసిందిలే...సుశీల చెప్పింది.నిన్న తోటలో మామిడి కాయల దొంగని పట్టుకున్నాం కదా..కాశిగాడూ,వీరయ్యా వాణ్ణి రెక్కలు వెనక్కి కట్టి ఇంటి దాకా లాక్కొచ్చారు.పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళడానికి పూర్ణక్క మొగుడూ అప్పుడే వచ్చాడు.ఆ దొంగని ఎడా పెడా వాయిస్తుంటే వణుక్కుంటూ చూశాడు"అన్నాడు రామారావు చెయ్యి మడిచి ,పిడికిలి బిగించి, కండలు చూసుకుంటూ.
రుక్మిణమ్మ నవ్వింది."రెండ్రోజుల క్రితం వాడు కార్డు రాసి పడేశాడుగా వస్తున్నానూ, పూర్ణనీ పిల్లల్నీ తీసుకెళ్ళడానికనీ? ఇంట్లో గడవద్దూ పెళ్ళాం లేకుండా? నిన్న ఆ కార్డు చదివాక పూర్ణ ఏం చేసిందనుకున్నావ్ ? నాచేతికి రెండొందల ముప్ఫై రూపాయలిచ్చింది" అంటూ కొడుకు వైపు,కోడలి వైపు చూసింది ఉత్కంఠ నింపుతూ.
రామారావు తెల్లబోయి ఆ! అదేమిటి?"అన్నాడు.
"అదే మరి! ఆ డబ్బు పిల్లలు ముగ్గురికీ ,తమ ఇద్దరికీ ఇచ్చి బట్టలు కొనుక్కోమని చెప్పమంది. ఏం చెయ్యను? మనంత మనం అలా ఇవ్వగలిగేలా లేదు గదా పరిస్థితీ?సరేనని తీసుకున్నా" పొట్టమీదున్న మనవరాలి చేతిని నిమురుతూ అంది రుక్మిణమ్మ.
"అదా సంగతీ?"ఆలోచిస్తూ ఆగాడు రామారావు.
"ఎందుకలా చేసిందో ఏమోరా"
"ఎందుకేమిటమ్మా?దానికి పుట్టిల్లు లేదు. అది వెళితే గౌరవంగా చూసే దిక్కు లేదు. వాడికి పెళ్ళాం అంటే అలుసు.నాలుగు తన్నినా అడిగే వాడు లేడని ధీమా. తన్నులు తిని అది బయల్దేరి మనింటికి వచ్చినా ఒకరోజో, రెండు రోజులో అయాక ఇక్కడుండే వీల్లేక అదే తిరిగొస్తుందని వాడి నమ్మకం. అలా వెంటనే వెళ్ళక పోయే సరికి వాడే వచ్చాడు.వచ్చిన వాడికి ఇంకోడి దేహ శుద్ధి చేస్తూ నేను కనపడ్డాను.అది యాదృచ్ఛిక మనుకో ..అప్పటికే విషయం తెలుసు గనుక వెధవ్వేషాలు వేస్తే కాళ్ళు విరిచి చేతికిస్తానని చెప్పా.ఎవరిని ఉద్దేశించి అన్నానా అని చలపతి బావక్కూడా అనుమానం వచ్చే ఉంటుంది
"అది సరే ..దాని బ్బే నాకిచ్చి, వాళ్ళకి మళ్ళీ ఇమ్మనడం ఎందుకూ?"
"అదేనమ్మా...ఏదో దిక్కులేక వస్తే ఓ మూల ఉండనిచ్చామన్నట్టు కాకుండా ఆప్యాయంగా, ఆదరణగా , ఇంటి ఆడపడుచుగానే చూసుకుంటామనే భావం అతనిలో కలగాలని అలా చేసి ఉంటుంది.అది దాచుకున్న డబ్బేదో తెచ్చుకుని ఇలా ఖర్చు పెట్టిందనుకుంటా. మన ఆర్ధిక ఇబ్బందులు దానికీ తెలుసుగా.ఇలా స్థాన బలం ,దేహ బలం ,బంధు ప్రీతీ అన్నీ ఉన్న తమ్ముడు తనకి అండ గా ఉన్నాడని చూపించుకుందుకు ఇలా చేసిందన్న మాట!
"నిజమేరా..పోనీలే....కాస్త వాడు తిన్నగా ఉంటే చాలు.అంతకంటే ఏం కావాలి?"అంది రుక్మిణమ్మ నిట్టూరుస్తూ.
"ఉంటాడమ్మా..నాకేం అనుమానం లేదు" అని
వొట్టిదో ,గట్టిదో ఆడపిల్ల కొక పుట్టిల్లు ఉండాలమ్మా! తనని గౌరవంగా చూస్తూ, కష్టం వస్తే 'నీకు మేమున్నాం తల్లీ' అని ఆసరా ఇచ్చే చోటుండాలి.పట్టు పీతాంబరాలు పెట్టక పోయినా, ప్రేమగా పలకరించి, ఆదరణగా,ఆప్యాయంగా  ఓ ముద్ద అన్నం పెట్టే చోటుండాలి! చదువూ సంధ్యా చెప్పించకుండా నలుగురాడపిల్లల్లో పెద్దదని చిన్నప్పుడే పెళ్ళి చేసి, బరువొదిలించుకుంది దొడ్డమ్మ.ఇప్పుడు చూస్తే తోడ బుట్టిన వాళ్లందరిలో హీన స్థితిలో ఉంది. వాళ్ళెవరూ పెద్దగా ఆదరించరు దీన్ని. ముగ్గురు చిన్నపిల్లల్తో ఎక్కడికి పోతుంది?"అన్నాడు.
మరే...పోన్లే నాన్నా! అందరికీ నువ్వే అండ. నీకు ఆ రామచంద్రుడే అండ గా ఉండాలిరా..ఇంక పడుకోండి .బాగా పొద్దుపోయింది" అంది రుక్మిణమ్మ.
పక్కనే పడుకున్న మనవరాలు మాధవి పక్కకి తిరిగి, మామ్మమీద కాలు వేసి, విన్న మాటల్ని మననం చేసుకుంటూ నిద్రలోకి జారింది. భర్త వెనకే లోపలికి నడిచిన సుశీల పెదవుల మీద చిన్న చిరునవ్వు మొలిచి కళ్ళల్లోకి పాకింది.
                                                   **********        ***********
సమీర పడుకున్న గది తలుపు దగ్గరగా వేసి బయటికి వస్తూ గోడ గడియారం వైపు చూసింది మాధవి. రాత్రి పదిన్నరయింది.ఆదివారం! మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని, పైకప్పు చూస్తున్న వేణు ఆమెని చూడగానే ఉక్రోషంగా  " అయిందా దేశసేవ? వెధవ మొగుడు ఎప్పుడూ ఉంటాడుగా..ఎంత సేపన్నా ఎదురుచూస్తాడు! వాడికి పనేం ఉందీ?ఆపదల్లో ఆడవాళ్ళంటే ఎప్పుడో గాని దొరకరు! వాళ్ళకి అండా దండా అందిస్తే పేరుకి పేరూ,పుణ్యానికి పుణ్యం!" అన్నాడు .అతని స్వరం నిండా కోపపు సెగలూ పొగలూ.
మాధవి నవ్వింది.కూడా తెచ్చిన మంచినీళ్ళ సీసా, మంచం పక్కనున్న బల్ల మీద పెట్టి అతని పక్కనే కూర్చుని ,వేళ్ళతో అతని జుట్టు సవరించి, చెంప మీద ప్రేమగా రాస్తూ " అంత కోపమెందుకురా కన్నయ్యా! అది మాత్రం ఏం చేస్తుందీ పాపం...సాటి మనిషికి కాస్త ఆసరా అందించడం తప్పు కాదు నాన్నా!" అంది వణుకుతున్న గొంతుతో.
వేణుకి ఫక్కున నవ్వొచ్చింది.ఆ గొంతు అతని బామ్మది.ఆవిడకి మాధవి అంటే విపరీతమైన ఆపేక్ష. వేణు అంటే ఒకటే గారం.కన్నయ్యా అని పిలుస్తూ యశోదమ్మ లాగే అతన్ని ముద్దు చేసేది.మొదట్లో ముద్దుల మనవడి భార్యగా మాధవిని అపురూపం చేసినా, ఆమె వ్యక్తిత్వం గమనించాక అభిమానం పెంచుకుంది.ఆవిడ ప్రస్తావన వస్తే వేణు త్వరగా చల్లారతాడని మాధవికి తెలుసు.
వెంటనే నవ్వినా ,మళ్ళీ కోపం తెచ్చుకుంటూ "ఎప్పుడూ మా బామ్మని తీసుకొస్తావు మన తగవుల్లోకి.ఆవిడేమో నిన్ను నా నెత్తి మీదకెక్కించి ,స్వర్గం లో కూర్చుని చిద్విలాసంగా చూస్తోంది! అవతలికి ఫో! నాతో మాట్లాడకు" అన్నాడు ఆమె చేతిని తోసేస్తూ.
అయ్యొ! అయ్యొ! వాడి కళ్ళు చూడవే ...కాయలు కాసేశాయే అమ్మడూ! మొగుడంటే  మరీ అంత నిర్లక్ష్యం తగదే అమ్మాయీ..వెళ్ళు వెళ్ళి వాడి పని చూడు!" ....సారీ అమ్మమ్మా! తప్పైపోయింది! ఇప్పుడే వెళ్తున్నా!"
సరిగ్గా ఆవిడలాగే దీర్ఘాలు తీస్తూ , గొంతు మార్చిమాట్లాడుతున్న మాధవిని చూస్తే వేణుకి నవ్వూ, ఆశ్చర్యం ముంచుకొచ్చాయి.అలక వదిలేసి ఆమె బుగ్గలు సాగదీస్తూ "అది గొంతా? ఏదైనా యంత్రమా? సరిగ్గా మా బామ్మ లాగే ఎలా అంటావే రాక్షసీ?"అన్నాడు.
నేనేమన్నానూ? ఆవిడే స్వర్గం నించీ మందలించారు తన మనవణ్ణి సరిగ్గా చూసుకోవడం లేదని. వెంటనే నా తప్పు తెలిసొచ్చి మన్నించమన్నాను" అంది కొంటెగా చూస్తూ.
చాల్లే వేషాలు!..ఏమిటీ పిచ్చి చెప్పు? ! ఆ అమ్మాయెవరు? మనమెవరు? మనకేం సంబంధం? ఇంకా మన పెళ్ళై మూడేళ్ళైనా కాలేదు.అప్పుడే నామీద ఇంత నిర్లక్ష్యం! ఆదివారమనైనా లేదు.ఆఫీసు నించి అలిసిపోయి వచ్చాడే పిచ్చి వెధవ... ఇంచుక చేలాంచలముతో స్వేదమునొత్తుట లేదు..ప్రేమతో కేశములు సవరించుట లేదు.అలసిన పతికి సత్తువ నిచ్చుటకు వేడి వేడి తేనీరైన అందించుట లేదు" అన్నాడు మళ్ళీ అలుగుతూ.
"అబ్బ క్షమించెయ్యరా బాబూ వేణూ! ఇవాళ్టికిలా కానిచ్చెయ్యెహె!"అంది కళ్ళలో మెరుపులు కురిపిస్తూ, పెదవుల్లోంచి మల్లెలు దొర్లిస్తూ.
 ముగ్ధుడైపోయి "సరే అలాక్కానీ" అనేశాడు వేణు.
కాసేపటి తర్వాత అతని కైదండ మీద తలానించి  పడుకున్న మాధవి మెల్లిగా చెప్పింది
"వేణూ! ఎందరో బాధిత స్త్రీలు! ఇవాల్టి ఈనాడులో చదివాను ఆడవాళ్ళ మీద జరిగే నేరాల్లో యాభై శాతం అత్తింట్లో భర్త ,అత్త మామలు,వాళ్ళ బంధువుల నుంచే ట తెలుసా?ఎవరైతే తనకి అండ గా నిలబడతారని ఆశించి పెళ్ళి చేసుకుంటుందోఎవరికోసమైతే ఎన్నో రకాలుగా సర్దుకుందుకు సిద్ధ పడుతుందో, అతని నుంచే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి ఎదురైతే ఆ అమ్మాయి ఏమవాలీ?"
మంద్ర స్థాయిలో ఆమె అన్న మాటలు అతని చెవిలోకి తరంగాలుగా వ్యాపించాయి.
ఆమె చేతిని తన పెదవికానించుకుంటూ " మధూ! దీన్ని బట్టి మన దేశంలో ఎంత మంది మూర్ఖులున్నారో తెలియడం లేదూ? అందచందాలూ, తెలివితేటలూ,గొప్ప చదువూ ..ఏవి వున్నా, లేకపోయినా సహజంగా ఆడవాళ్ళు ఇంటిని స్వర్గంగా మార్చగల శక్తి ఉన్నవాళ్ళు. అలా కానివాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అయినా వాళ్ళని హింసించి, పైశాచికానందం పొందే వాళ్ళని మూర్ఖులనక ఏమంటాం?"అన్నాడు నిద్ర కంఠంతో.
" అలాంటి హింస ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో తెలుసా ? ...ఎక్కడైతే ప్రతిఘటన బలహీనంగా ఉంటుందోఎక్కడైతే స్త్రీకి అండా, దండా లభించే అవకాశం లేదో, ఎక్కడైతే నేరానికి తగిన శిక్ష వెంటనే పడదో .......అక్కడ" మృదువుగా అంది.
"నిజమే కావచ్చు మధూ! కానీ నేరాలన్నిటికీ శిక్షలు మనం వెయ్యలేం  కదా!"
వెయ్యలేకపోవచ్చు..కానీ సమాజమే విక్టిమ్ కి అండగా నిలబడాలి వేణూ! నాన్న ఎప్పుడూ అనేవారు వొట్టిదో గట్టిదో ఆడపిల్లకో పుట్టిల్లు ఉండాలమ్మా'అని.మనసుకి చాలా కష్టం కలిగినపుడు 'నే పుట్టింటికి పోతా'అనగలిగే అవకాశం ఉండాలనే వారు! జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసి, పెళ్ళి చేసుకున్న వ్యక్తితో బతుకు కన్నా చావే మేలనిపించే స్థితి వస్తే 'అమ్మలూ! నీకు మేమున్నాం అనే పుట్టిల్లో, దానికి సమానమైన చోటో లేకపోవడమే బాధాకరమైతే, ఉండి కూడా అక్కడ అండా, ఆదరణా దొరకవన్న నిరాశ కలిగే పరిస్థితి ఇంకా అన్యాయం కదా! అసలు  ఆడపిల్లకి పుట్టింట్లో తగిన అండ ఉందని తెలిస్తే చాలా మటుకు కేసుల్లో గృహ హింస తగ్గు ముఖం పడుతుంది. చట్టం ఆడవాళ్ళ వైపే ఉన్నా కూడా ఇంకా సొంత ఇంట్లోనే ఆడవాళ్లమీద దాడులు జరగడానికి కారణం ఒక్కటే...పుట్టిల్లే లేకపోవడం,లేదా తల్లిదండ్రులూ,అన్నదమ్ములూ ఇంటి ఆడపడుచుకి అండగా నిలబడక పోవడం! .." మెల్లగా చెప్పుకు పోతున్న మాధవి వేణు నిద్ర పోతున్నట్టు గమనించి ఆగిపోయింది. అతని దుప్పటి సరిచేసి ,తనూ పక్కకి తిరిగి పడుకుంది. ఒంటి నిండా దెబ్బలతో ఉన్న సమీర స్థానంలో ధైర్యంగా స్వతంత్రంగా బతుకుతున్న సమీరని ఊహించుకుంటూ నిద్రలోకి జారుకుంది.