November 11, 2014

అమ్మ ఒక రూపం కాదు

                                                                                               
                   అమ్మ ఒక రూపం కాదు
                                            ---- వారణాసి నాగలక్ష్మి
  'ఇవాళ బుజ్జిగాడు చెప్పిన అమ్మ లాంటి టీచర్ ని కలుసుకొవాలి' అనుకుంది మాధురి, అప్పుడే కడుక్కుని వచ్చిన మొహానికి మాయిశ్చరైజర్ రాసుకుంటూ.
బుజ్జిగాడి బడి పన్నెండింటికి అయిపోతుంది. ఎల్ కేజీ పిల్లల బడి గంట కొట్టక ముందే తను వాడి తరగతి గది ముందుకు చేరాలి. గంట కొట్టేశారంటే పిల్లలంతా బడి ఆవరణలో పరుగులు తీస్తారు. ఇవాళ అమ్మలాంటి ఆ టీచర్ ని కలుసుకుని, రాహుల్ బాబు ఎలా చదువుతున్నాడో కనుక్కోవాలి. అలా అనుకోగానే మాధురికి నవ్వొచ్చింది. ముద్దులొలికి పోయే బూరెబుగ్గల పసివాడికి, మూడేళ్ళ చంటివాడికి చదువేమిటి నా మొహం ?’ అనుకుంది.
 రాసుకున్న మాయిశ్చరైజర్ కాస్త చర్మంలోకి ఇంకగానే పల్చగా పౌడర్ రాసుకుని, విశాలమైన కళ్ళకి కాటుక తీర్చింది. అద్దంలో తన కళ్ళు చేపల్లా మిలమిలలాడాయి. తీరైన కనుబొమలు విల్లులా వంగి కళ్ళకి మరింత అందాన్నిచ్చాయి. రోజూ ఏడుస్తూ బడికి వెళ్ళే బుజ్జిగాడు ఇవాళ ఉత్సాహంగా తయారై వెళ్ళడంతో తన మనసు కూడా ఉల్లాసంగా తయారైంది. సన్నగా కూనిరాగం తీస్తూ బొట్టు పెట్టుకుంది.
జుట్టు మరోసారి దువ్వి క్లిప్పు పెట్టుకుంటుంటే మొదటిసారిగా బుజ్జిగాడిని స్కూలుకి తీసుకెళ్ళినపుడు ప్రీ ప్రైమరీ సెక్షన్లో కనిపించిన టీచర్లు గుర్తొచ్చారు. తీర్చి దిద్దిన కనుబొమలూ, మస్కారా, ఐ లైనర్లతో అలంకరించిన కళ్ళూ,లిప్ స్టిక్ అద్దిన పెదవులూ, ఖరీదైన డిజైనర్ చీరలు.... ఎవరికి వారే బుల్లి తెర మీద కదిలే మోడల్స్ లా కనిపించారు.వాళ్ళలో ఎవరిని చూసి తనలా ఉందనుకున్నాడో మరి, అమ్మలాంటి టీచర్ అంటూ అంత ఇష్టం పెంచుకున్నాడు!’ అనుకుంది.
నిన్నో మొన్నో నడకలు నేర్చిన తన బంగారు కొండ... బడిలో చేరి అప్పుడే పది రోజులైపోయింది!' ఆశ్చర్యంగా తలుచుకుంది. నిన్నటికి తొమ్మిది రోజులు..మొన్నటికి ఎనిమిది రోజులు.. కానీ మొన్న అప్పుడే ఎనిమిది రోజులైపోయింది అనిపించలేదు తనకి !
 అవును ...ఎలా అనిపిస్తుందీ? మిగిలిన పిల్లలంతా నాలుగో రోజుకల్లా కొత్త వాతావరణానికి అలవాటు పడిపోయి, కొత్త స్నేహితులతో, కొత్త ఆటలతో ఎల్ కే జీ తరగతి గదిలో భాగాలైపోయినా, బుజ్జిగాడు మాత్రం రోజూ ఏడుపే! తనెంత నిరాశ పడిపోయిందో....ఇదేమిటీ పిల్లవాడిలా రోజూ ఏడ్చి రాగాలు పెడుతుంటే ఎలాగా అని. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వాడికి స్కూలు నచ్చలేదు. రోజూ పొద్దున్న లేస్తూనే ఏడుస్తూ ఇవ్వాల స్కూలుకి పోనూ అంటూ రాగాలు పెట్టఢం ! ఎంత సముదాయించినా వినకపోవడం...
తమ గారాల మూటని, మమతల పెన్నిధిని అలా బలవంతాన లాక్కెళ్ళి, ఎత్తైన ప్రహరీ గోడల వెనక దాక్కున్న భూతం లాంటి బడికి అప్పగించి రావడం తలుచుకుంటేనే మాధురి మనసు విలవిల్లాడి పోయింది.
అలాంటిది  ఉన్నట్టుండి మొన్న మధ్యాన్నం ఇంటికి రాగానే అమ్మా ..! ఇవ్వాలేమైందో తెల్సా ?” అంటూ మా క్లాసులోకి కొత్త టీచరొచ్చారు తెల్సా?”అన్నాడు ఉత్సాహంగా.  
హడావుడిగా పుస్తకం తెరిచి మాధురికి చూపించి మెరిసే కళ్ళతో గొప్పలు పోయాడు. హఠాత్తుగా పొంగుకొచ్చిన వాడి ఉత్సాహానికి ఆశ్చర్యపోతూ, పుస్తకం లోకి కుతూహలంగా చూసింది మాధురి. అందులో బుజ్జిగాడు రాసిన వంకరటింకర రాతల పక్కనే  గుడ్ అని తీరైన అక్షరాల్లో రాసి ఉంది. పక్కనే నాలుగు గీతల్లో నవ్వుతున్న పిల్లాడి మొహం వేసి ఉంది.
        ఆ ప్రోత్సాహక వ్యాఖ్య తననుద్దేశించే రాసినట్టనిపించి, మనసంతా హాయిగా అయిపోయింది మాధురికి. అమ్మయ్య! పిల్లాడు ఇవాళ కాస్త ఉత్సాహంగా ఉన్నాడని సంతోషం కలిగింది. నిన్న పొద్దున్నకూడా స్కూలుకి పేచీ పెట్టకుండా వెళ్ళాడు. మధ్యాహ్నం తను కాళ్ళూ చేతులూ కడిగి బట్టలు మారుస్తున్నంత సేపూ  వాడి కబుర్లనిండా ఆ టీచర్ ప్రస్తావనే.
            అమ్మా! అమ్మా!  మా స్కూల్లో అమ్మలాంటి టీచర్ ఏం చెప్పారో తెల్సా?” అంటూ విప్పారిన కళ్ళతో వాడు ప్రశ్నించడం గుర్తొచ్చి నవ్వుకుంది మాధురి. స్కూల్లో ప్రిన్స్ పల్ దగ్గర్నించి, టీచింగ్ అసిస్టెంట్స్ వరకు, ఆధునాతనంగా అలంకరించుకుని బొమ్మల్లా కనపడే టీచర్లందరినీ గుర్తుతెచ్చుకుంటూ వాళ్ళలో ఎవరో మరి వాడికంతగా నచ్చిన టీచర్ ! తను వాళ్ళంత అందంగా కనిపిస్తోంది కాబోలు  బుజ్జిముండకి ?’ మురిసిపోతూ అనుకుంది.
ఆ టీచర్ ఎవరైతేనేం తన బంగారు కొండ ఏడవకుండా బడికి వెళ్ళేలా చేసింది కృతజ్ఞతగా అనుకుంటూ ఇల్లు తాళం పెట్టి, ఆటో ఎక్కింది. స్కూలు వైపుగా సాగుతున్న ఆటో అమూల్య డైరీ ఫామ్  దాటుతుంటే  గ్రిల్ గేటు వెనక నల్లటి పెద్ద పెద్ద గేదెలు కనిపించాయి. వాటిని చూసి నవ్వుకుంటూ గేదెలంటే ఆవులు అనుకుంది .
సరిగ్గా స్కూల్లో చేరడానికి రెండు రోజుల ముందు బుజ్జిగాడు తనతోపాటు ఆ డైరీఫామ్ కి వచ్చాడు. తను రోజూ అక్కణ్ణించే పాలు కొనుక్కొస్తుంది. అప్పటిదాకా బొమ్మల పుస్తకాలు చూపించి ఆవు గురించీ, ఆవు ఇచ్చే పాల గురించీ, బుజ్జిగాడు ఆ పాలుతాగి భీముడిలా బలంగా  అయిపోవడం గురించీ చెప్పిన కథలన్నీ అక్కడికెళ్ళగానే గుర్తొచ్చాయి కాబోలు వాడికి .
పాలు కొనుక్కుని వెనక్కొస్తుంటే తన చేయి పట్టుకుని నడుస్తున్నవాడు కాస్తా ఆగిపోయి అమ్మా ! అని మధురంగా పిలిచి, ఏదో కనిపెట్టినవాడిలాగాగేదెలంటే ఆవులు కదా?!!” అన్నాడు. అలా అంటున్నపుడు వాడి పసి మొహం ముద్దులొలికిపోయింది. ఆ అమాయకపు ప్రశ్నకి తను అమాంతం వాడిని ఎత్తుకుని ఆ రోడ్డు మీదే ముద్దులాడింది.
మొన్నటికి మొన్న ? రాత్రివేళ వీధి గుమ్మంలో కూర్చుని చందమామని చూపిస్తూ సివాడికి గోరుముద్దలు తినిపిస్తోంది తను. అటూ ఇటూ మొహం తిప్పేస్తూ అల్లరి చేస్తుంటే, పండూ! దాదాయి చూశావా నీ వైపే చూస్తున్నాడు ? బుజ్జిబాబు మమ్మామ్ ఇంత మెల్లిగా తింటున్నాడేవిటీ ? అంటూ ఆశ్చర్యపోతున్నాడు అంది .
వాడలా ఆకాశంవైపు చూస్తూ ఉండిపోయి, అమ్మా! మరి ఆకాశంలో దాదాయి ఒక్కడే ఉంటాడా? వాడికి మమ్మామ్ ఒవ్వరు పెడతారూ?” అన్నాడు బెంగగా.
తను వాడిని హత్తుకుని, “దాదాయి వాళ్ళమ్మ దగ్గర మమ్మామ్  తినేసి,  ఆకాశంలో ఆడుకోడాంకి వస్తాడు నాన్నా ! కొంతసేపు ఆడుకుని, మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరకి వెళ్ళిపోతాడు బజ్జోడానికి”! అంది నమ్మకంగా.
అమ్మ మాటలంత నమ్మశక్యంగా తోచలేదు వాడికి. మరి  ఆకాశంలో ఒక్కడే ఎలా ఆడుకుంటాడూ ?” అడిగాడు అపనమ్మకంగా.
ఒక్కడే ఏమిటీ?  ఆ తెల్లటి మబ్బులన్నీ దాదాయితో ఆడుకోడాంకే వచ్చాయి, చూడు! ” అంది వాడికి కితకితలు పెడుతూ.
ఒక్కోసారి మబ్బులుండవు కదా ..అప్పడెవల్తో ఆడుకుంటాడూ?” అనడిగాడు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు.  వాడి బూరె బుగ్గల్లోంచి ఫిర్యాదు దూసుకొచ్చి, తనకెంతో నవ్వొచ్చింది. పసివాళ్ళని మభ్యపెట్టడం అంత తేలికేం కాదనుకుంది.
ప్రయాణం సాగుతున్నంతసేపూ మాధురి ఆలోచనలు బుజ్జిగాడి చుట్టూనే పరిభ్రమించాయి. స్కూలు ముందు ఆటో ఆగేసరికి ఆలోచనల్లోంచి బయటపడింది. చకచకా బుజ్జిగాడి తరగతి గది గుమ్మం పక్కకి చేరి, బడి గంటకోసం  ఎదురుచూస్తూ నిల్చుంది.
గది లోపలంతా కోలాహలంగా ఉంది. రంగు రంగుల కుర్చీలూ, బల్లల మధ్య చిట్టిపొట్టి పిల్లలు, పుస్తకాలు తిరగేస్తూ, బోర్డు వైపు చూస్తూ, పక్కపిల్లలతో చేతులూపుకుంటూ ఏదేదో చెప్పేస్తూ కనిపించారు.
ఇంక బుద్దిగా కూర్చోడం మా వల్లకాదు. తొందరగా గంట కొట్టెయ్యండిఅన్నట్టుంది వాళ్ళ వాలకం. కనిపిస్తున్నంతమేరలో బుజ్జిగాడు ఎక్కడున్నాడా అని వెతికాయి మాధురి కళ్ళు. ఎరుపుగళ్ళ చొక్కా, నీలం రంగు నిక్కరు .... అందరు మగపిల్లలవీ అవే దుస్తులు! అయిదారుగురు పిల్లలు బుజ్జిగాడిలాగే కనిపించి ఆశ్చర్యపోయింది మాధురి. ఇంతలో అమ్మా!” అంటూ పరుగెత్తుకుంటూ వచ్చాడు బుజ్జిగాడు,
గణగణా గంట మోగింది. కొడుకుని చూసి ఎన్నో ఏళ్ళైనట్టు అమాంతం వాడిని ఎత్తుకుని హత్తుకుంది మాధురి. బయటికి పరుగులతో వస్తున్నతోటి పిల్లల వైపు గర్వంగా చూస్తూ అమ్మమెడ చుట్టూ చేతులేశాడు రాహుల్. పొంగి పొర్లుతున్న మమతతో వాడి బుగ్గమీద తన ముక్కుని నొక్కి గాఢంగా వాసన పీల్చింది మాధురి. వాడి భాషలో అది అమ్మ పెట్టే వాసన ముద్దు! మాధురికి  వాడినలాగే ముద్దుపెట్టుకోవడం అలవాటు. పసి వాడికి ఇన్ఫెక్షన్ల రాకుండా ఉండాలని వాడికి తడి పెదవులని తగలనీయదామె. పిల్లవాడిని పండులా తయారుచేశాక రెండు అరచేతులమధ్యా వాడి బుగ్గల్ని అపురూపంగా పట్టుకుని పూలపొట్లాన్ని వాసన చూసినట్టు ఆ పరిమళాన్ని ఆఘ్రాణించడం ఆమె రోజువారీ చర్య. అమ్మ ముద్దు అందగానే వాడు కిలకిలా నవ్వాడు.
అనిర్వచనీయమైన పుత్ర పరిష్వంగ సుఖం అనుభవిస్తూ బుజ్జి బాబులూ! ఇవాళ నాకు అమ్మలాంటి టీచర్ని చూపిస్తానన్నావు గుర్తుందా ?”అడిగింది మాధురి.
వాడు వెంటనే తన చెయ్యి చాచి అగో !” అంటూ తరగతి గదిలో పిల్లల్ని జాగ్రత్తగా బయటికి పంపడంలో ఆయాకి సాయం చేస్తున్న టీచర్ వైపు చూపించాడు. ఆ చూపులో తన గొప్ప ఆస్తిని ప్రదర్శిస్తున్నట్టు ఏదో అతిశయం !
నవ్వుతూ అటు చూసిన మాధురికి ఎవరో ఛెళ్ళున చెంప మీద కొట్టినట్టయింది !
వాడు చూపించిన ఆ స్త్రీ మూర్తి నల్లగా పొడుగ్గా గడకర్రలా ఉంది. వొత్తులేని జుట్టు జడలా వేసుకుని ఉంది. పిల్లలతో నవ్వుతూ ఏదో చెపుతున్న ఆమె పలువరుసలో పై పన్నుఒకటి లేదు! మాధురి అపనమ్మకంగా చూసింది రాహుల్ వైపు..
రోజూ అద్దంలో కనిపించే  తన తీరైన ఆకృతీ, కలువ రేకుల్లాంటి కళ్ళూ, పసిమి వర్ణం గుర్తొచ్చాయి. ఎలా పోల్చాడు తనని ఆవిడతో? నమ్మలేకపోయింది.  మనసులో ఓ మూల గుచ్చుకున్నట్టైంది. అన్యమనస్కంగా లోపలికి నడిచి, తనని పరిచయం చేసుకుంది టీచర్ కి.
        ఆవిడ మాధురిని  నవ్వుతూ పలకరిస్తూనే గదిలో ఓ మూల నిద్రపోతున్న పిల్లాడిని లేపి, వాడి పుస్తకాల సంచీ, మంచినీళ్ల సీసా చేతికి అందించింది. రేపట్నించీ లంచ్ పూర్తిగా తినెయ్యాలి, కొంచెం కూడా పారె య్యకూడదు, సరేనా?” వాడికి  బుజ్జగించి చెప్పింది, ఇంకో పిల్లాడు బల్లమీద మర్చిపోయిన పెన్సిల్ తీసి వాడికందించింది. అందరు పిల్లలూ వెళ్ళేవరకూ శ్రద్ధగా వెంట ఉండి చూసుకుంది. చివరికి గదంతా కలయ జూసి సంతృప్తిగా తలాడిస్తూ మాధురి దగ్గరకొచ్చింది. 
         అమ్మ చంకనెక్కిన రాహుల్ ని  పలకరిస్తూ ఊ....మమ్మాస్ పెట్..  ఈజ్ దట్ యూ?” అంటూ దీర్ఘం తీసింది. వాడు సిగ్గుగా నవ్వాడు. తన టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్ళలో పెట్టిన  మందారపువ్వు అపురూపంగా పట్టుకుని  థాంక్యూ రాహుల్! నువ్విచ్చిన పువ్వు ఎంత బావుందో.....దీన్ని మా ఇంట్లో పూల వాజులో పెట్టుకుంటాను అంది ప్రేమగా. 
ఆ పువ్వుని చూసి మాధురి ఆశ్చర్యపోయింది. అది తను అపురూపంగా పెంచుకుంటున్న ముద్దమందారమొక్క తాజాగా పూసిన పువ్వు! ఎప్పుడు కోశాడో, తనకి కనపడకుండా ఎలా పట్టుకెళ్లాడో ?
అమ్మ కళ్ళలో కనిపించిన ప్రశ్నకి జవాబన్నట్టు దీదీలూ, భయ్యాలూ టీచర్లకి పువ్వులిస్తారు తెల్సా?” అన్నాడు రాహుల్.
టీచర్ నవ్వుతూ అమ్మకి చెప్పకుండా పువ్వులు కొయ్యకూ? చిన్న కాగితం మీద పువ్వు బొమ్మ వేసి ఇస్తేసుమా టీచర్ ఎంతో జాగ్రత్తగా  దాచుకుంటుంది. సరేనా?!” అంది.
 మాధురి తెప్పరిల్లి  రాహుల్ కి మీరంటే చాలా ఇష్టం! మీరు కొత్తగా వచ్చారా?” అనడిగింది.
ఆవిడ రాహుల్ తల మీంచి నిమురుతున్నట్టుగా చెయ్యి పోనిచ్చి, పూల వాసన చూసినట్టుగా ఆ చేతిని ముక్కుకానించుకుని గాలి పీల్చింది.
కొత్తేం కాదండీ... నేనిక్కడ పదేళ్ళుగా పని చేస్తున్నాను. బషీర్ బాగ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ అడిగితే ఇచ్చారు కానీ ఇక్కడి పేరెంట్స్ నేను వేరే స్కూలుకి వెళ్ళడానికి ఒప్పుకోవటం లేదన్చెప్పి మళ్ళీ ఇక్కడే వేశారు. మా కొత్త ఇంటికి ఈ స్కూలు బాగా దూరమైపోయింది. అందుకే ట్రాన్స్ఫర్ అడిగాను అంది.
అయ్యో! మరెలా మీకు? రానూ, పోనూ కష్టమేమో?” అంది మాధురి.
పర్లేదు లెండి..ఇప్పుడు ప్రిన్స్ పల్ మామ్ స్కూలు బస్సుదారి కొంచెం మార్చి మా ఇంటి మీంచి వెళ్లేలా చేశారు. పావుగంట ముందు బయల్దేరితే సరిపోతుందినవ్వుతూ అంది మాధురి కళ్ళలోకి చూస్తూ. ఆ కళ్ళలో ఏదో ఆత్మీయత.
ఆవిడ దగ్గర సెలవు తీసుకుని బయటికి వస్తున్న మాధురికి  సుమా టీచర్ బుజ్జిగాడికే కాక క్లాసు పిల్లలందరికీ అమ్మలా కనిపించింది! ఆటోలో ఆలోచనలో మునిగిన మాధురికి పిల్లల దృష్టిలో అమ్మ అనే పదం శాంతికీ, సౌఖ్యానికీ, భద్రతకీ ప్రతీకగా కనిపిస్తుందనీ, పిల్లలు అమ్మతో ఎవరినైనా పోల్చేటపుడు బాహ్యరూపాన్ని కాకుండా, ఆమె సన్నిధిలో దొరికే మానసిక సౌఖ్యాన్ని, ఆత్మీయతనీ అనుభూతి చెందడం ద్వారా ఆ వ్యక్తిని అమ్మతో పోల్చుకుంటారనీ అర్ధమైంది. పసిపిల్లలు బాహ్యాడంబరాలన్నిటినీ దాటి, లోపలున్న హృదయాన్ని ఎంత సులువుగా చూడగలుగుతారో అనుకుంది ఒళ్లో పిల్లాణ్ణి హత్తుకుంటూ. 

                                                 ***
( హంసిని జాల పత్రిక, 2013;  నది మాస పత్రిక - జన్మ దిన ప్రత్యేక కథా సంచిక, నవంబర్ ,2014)