May 15, 2015

కథన రంగం

http://magazine.saarangabooks.com/2015/04/29/%E0%B0%86%E0%B0%B2%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%87-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B2/

సారంగ జాల పత్రికలో నా వ్యాసం - కథన రంగంసారంగMay 2nd 2015)


                                     ‘ఆలస్యం చేస్తే కథల పిట్టలు ఎగిరిపోతాయి
                                       
      వందెకరాల్లో వనవాసానికనువైన తాటాకుల కుటీరం తాతగారిది. మైనింగ్ ఇంజనీరైన తాతగారు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకెళ్లిన వ్యక్తి. స్వాతంత్ర్యం వచ్చాక చదువుకున్న వాళ్లంతా ఆఫీసుల్లో ఉద్యోగాలకి ప్రయత్నించకుండా సమృధ్ధి గా పంటలు పండించాలని కోరుకుని వందెకరాల అడవి చవగ్గా వస్తుంటే కొనడం, అప్పటికి వ్యవసాయ రంగంలో పట్టా పుచ్చుకున్న నాన్నగారు ఆయనకి  తోడుగా ఆ అడవికి వెళ్లడం జరిగింది. 

     ఆ అడవిలో స్వయంగా ఒక పర్ణశాల నిర్మించి, అక్కడ ఉంటూ, రాళ్ళూ రప్పలూ పొదలూ తుప్పలూ తొలగించి, నూతులు తవ్వి, కొద్ది కొద్దిగా ఆ భూమిని వ్యవసాయ యోగ్యంగా చేస్తూ వచ్చారు నాన్నగారు. వర్షాధారమైన నేలని మామిడి , నిమ్మ, జామ, సపోటా తోటలుగా, వరి పొలంగా మార్చారు. లాండ్ మార్ట్ గేజ్ బాంక్ లో పొలాన్ని కుదువ పెట్టి రకరకాల కూరగాయలు, ఇతర పంటలు పండించేవారు. నలభై సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా అక్కడ తయారయిన పచ్చని తోట, పాడి పశువుల సమూహానికి, ఎంత కట్టినా తీరని బాంక్ లోను తోడయింది.

        నాకు ఊహ తెలిసినప్పటి నించీ ఎటు చూసినా పచ్చని చెట్లూ, పశువులూ , పక్షులూ, వీచే గాలిలో తేలి వచ్చే అడవి పూల వాసనలూ. చూస్తున్నకొద్దీ మనశ్శరీరాల్ని ఆవహించే ప్రకృతి సౌందర్యం.

       ‘అరణ్యక నవల ( సూరంపూడి  సీతారాం గారు తెలుగులోకి  అనువదించిన  ' వనవాసి ' ) లో భిభూతి భూషణ్ బందోపాధ్యాయ అంటారు- 'అరణ్య ప్రకృతి నా కళ్ళపై ఏదో మాయ కప్పి వేసింది . .. ఏకాంత స్థలం అంటే, నక్షత్ర మయమైన విశాల వినువీధి అంటే వ్యామోహం. ఇవి నన్నెంత  ప్రబలంగా ఆవహించాయంటే  కొద్దిరోజుల పాటు పాట్నా వెళ్లవలసొస్తే,  అక్కడ తారు వేసి గట్లు పోసిన రోడ్ల పరిధులు దాటి, మళ్ళీ ఎప్పటికి  'లవటులియా' కానన వీధుల్లో పడగలనా అని ప్రాణం కొట్టుకు పోయింది. కప్పు బోర్లించినట్టుండే  నీలాకాశం కింద, మైదానాల తరవాత మైదానాలు, అడవుల పైన అడవులు ఎక్కడుంటాయో, ఎక్కడ మానవ నిర్మితమైన రాజ మార్గాలుండవో, ఎక్కడ ఇటుక గోడలుండవో, ఎక్కడ మోటార్ హారన్ ధ్వనులు వినబడవో, గాఢ రాత్రి నిద్రాభంగమైన సమయంలో దూరాన అంధకార వనంలో కేవలం నక్కల చీకటి ఘోషలు మాత్రమే  ఎక్కడ వినవస్తాయో, ఆ కాననాలకి ఎప్పుడు పోయి వాలుదునా అని మనస్సు కొట్టు మిట్టాడి పోయింది' ...' దుర్బల చిత్తులైనవారు ఆ సౌందర్యం చూడకపోవడం మంచిదని నా అభిప్రాయం. దీని స్వరూపం సర్వ నాశన కరమైనది. ఈ మాయా మోహంలో పడిన వారు తప్పించుకుని బయటపడడం అసంభవం .. అయితే ఈ మాట కూడా చెప్పాలి. ప్రకృతి ఈ స్వరూపాన్ని చూడగలగడం మహా భాగ్యం. ఈ  ప్రకృతిని, నీరవ నిశీధులలో, వెన్నెలలో, చీకటిలో చూసే అదృష్టం సులభ సాధ్యమే అయితే పృధ్వి అంతా కవులతో పిచ్చివారితో నిండి పోదా?' అని.

      ‘లవటులియా అడవులేమో గాని నేను పెరిగిన పరిసరాల్లో, చుట్టుపక్కల రెండు మైళ్ళ దూరం వరకు ఇంకొక్క ఇల్లుకూడా లేని ఏకాంతం.  పొలంగా రూపుదిద్దుకుంటున్న అడవి మధ్య, ఒంటరి ఇంట్లో, మా కుటుంబ సభ్యుల మధ్య  ఇరవయ్యేళ్ళు వచ్చేవరకు పెరగడం నిజంగా మహా భాగ్యమే. ఆ మాయా మోహం నన్నూ ఆవహించి, ఈనాటికీ వదిలిపెట్టలేదు. (నా కథలన్నీ వర్ణనాత్మకంగా, క్లుప్తతకి కొంత దూరంగా ఉండడానికి నా నేపధ్యం కారణమేమో అనిపిస్తుంది!). గీత రచన పట్ల, చిత్రలేఖనం పట్ల అభిరుచి కలగడానికి కూడా ఈ వాతావరణం దోహదం చేసిందనుకుంటాను. లోపల నిరంతరం కదిలే ప్రకృతి దృశ్యాలు చిత్రాలుగా మారాలని మారాం చేయడం, తీరా ప్రయత్నిస్తే, ఊహలో కనపడ్డ సౌందర్యం కాగితం మీద చేరేసరికి  ఆశాభంగం కలిగి మళ్ళీ కొన్నాళ్ళు కుంచెకి  దూరంగా ఉండడం.  

 సుమాల తాకగానే సుగంధాల సవారీ ,
 వనాలు చేరగానే వసంతాల కేళీ,
 పూల మ్రోల వాలి మధుపాలు మధువు గ్రోలి,
 నలుదిశలా ఉల్లాసం ఊయలూగాలి

కోకిలమ్మ తీరి, ఆ కొమ్మ చివర చేరి, మురిపాల పూతలేరి చేసింది కచేరీ,
మామిడమ్మ తీరి, కొసరి చిగురులేరి, తేనె జాలువారే  కంఠ మాధురి-
కుసుమాల సొగసు చూసి భ్రమరాల కనులు చెదరి, ఝంకార సంగతులతో వనమెల్ల సందడి,
అందాలు జాలువారే మందార పూల చేరి , భృంగాలు తనివితీర చేసేను అల్లరి

గుబులు నీ గుండెల్లో గూడు కట్టనీయకు ,
చేదు గురుతులేవి నీ మదిని చేరనీయకు
వసంతం రాలేదని వనిని వదలి పోవకు
శిశిరంలో చిగురు కోరి చింతించకు

మబ్బులున్న ఆకాశం మరచిందా మందహాసం?
అగ్ని మింగి కడలెపుడూ చూపలేదు నిరుత్సాహం
శీత కాలాన చిరు ఎండకు చలి కాచుకో
శ్రావణాన చినుకుల్లో చేను పండించుకో

    … ఇలా కేవలం ప్రకృతి సౌందర్యం మీదే ఎన్నో పాటలు అల్లుకుంటూ ఉండేదాన్ని( పై పాటలకి ఇక్కడ ఒక్కొక్క చరణమే ఇచ్చాను).

       అడపా దడపా వస్తూ కుదిరినంతకాలం మాతో ఉండిపోతూ ఎందరో బంధు మిత్రులు. వేసవి సెలవుల్లో వచ్చిన  పిల్లలందరితో కలిసి  పెద్ద వానర సైన్యంలా తోటలోకి  పరుగులు తీయడం,  మల్లె తోటల్లో మొగ్గలూ, మామిడి తోపుల్లో పచ్చికాయలు కోసుకుంటూ, ఆటల్లో పాటల్లో మాటల్లో పడి,  కనుచీకటి వేళ  చేల గట్ల వెంట పరుగులు తీస్తూ ఇల్లు చేరడం ఇప్పటికీ కళ్ళ ముందు కదిలే సజీవ చిత్రం.  

       పిల్లలందరికీ పెద్ద బావిలో ఈతలు నేర్పించి, రాత్రి పూట ఆరుబయట అందర్నీ తన చుట్టూ చేర్చుకుని, ఒంటరి ఇంటి చుట్టూ భయం గొలిపే చీకటిని తన మాటల వెన్నెలతో వెలిగించి, జీవితాన్ని ఎలా ఈదాలో శిక్షణ ఇచ్చే నాన్నగారు అందించిన  ఆశావహ దృక్పథం. (‘ఎంత ఆశావాదమండీ.. ఎలా సాధ్య మైందీ? మాక్కొంత అప్పివ్వరాదూ?’ అనడిగిన ప్రముఖ కథకులకి ఇదే జవాబు )

      అంతమందినీ ఆదరించి, ఆర్ధికంగా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నా తోటలో పండిన వాటితోనే వండి వడ్డించిన అమ్మా, మామ్మా కలలా తోచే వాస్తవం.  

      అంతులేని ఆకాశం నీలంగా, ఎగిరే కొంగలూ, ఎండలో మబ్బులూ  తెల్లగా, మెరప చేలూ, కారబ్బంతి తోటలూ ఎర్రగా, వరిపొలాలు లేత పచ్చగా, ఆకు పచ్చగా, పసుపు పచ్చగా ... 'ఎన్నిపూవులెన్నిరంగులెన్ని సొగసులిచ్చాడో గమనిస్తూ, ఆస్వాదిస్తూ, రైతు జీవితంలోని  వ్యధలూ, వృధా ప్రయాసలూ, ఆశా భంగాలూ, ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలూ అనురాగాలూ స్వార్ధాలూ అపార్ధాలూ అర్ధం చేసుకుందుకు ప్రయత్నిస్తుంటే ఏదైనా రాయాలనే తపన మొదలైంది. ఇంట్లో సాహిత్య వాతావరణం ఎంత మాత్రం లేకపోయినా  నాకన్నా పెద్దవాళ్ళతో విభేదించినపుడు ఎదురుగా చెప్పలేని భావాలని అక్షరాల్లోకి కుదించడం అలవాటైంది. వార పత్రికలు  తప్ప గొప్ప సాహిత్యం ఏదీ అందుబాటులో లేని వాతావరణంవల్ల  నా రాతలకి మెరుగులు దిద్దుకునే వీలుండేది కాదు.

        ఆరు కిలోమీటర్ల దూరంలో నూజివీడు ఊరు. ఏడేళ్ళ ప్రాయంలో తిన్నగా మూడో తరగతిలో కూర్చోపెట్టారు సంవత్సరం మధ్యలో. చదువుకోసం అంతదూరం వెళ్ళాల్సి వచ్చేది. దారంతా నిర్మానుష్యంగా ఉండేది. అన్నలిద్దరి  సైకిళ్ళమీద వెనక కూర్చుని నేనూ మా చెల్లెలు. ఏనాడూ ఏ ఆపదా ఎదుర్కోకుండానే చదువు పూర్తి  చేసి మొదటి సారిగా ఊరు వదిలి  హైదరాబాద్ ప్రయాణం. కేంద్రీయ విశ్వ విద్యాలయంలో పై చదువు. చిత్ర లేఖనం లో విద్యాభ్యాసం కొనసాగించవచ్చని తెలియక రసాయన శాస్త్రం లోకి   ప్రవేశించాను. చదువు కొనసాగిస్తుంటే తెలిసింది మానవ సంబంధాలకీ, రసాయనిక బంధాలకీ చాలా సారూప్యత ఉందని. 

        పదహారేళ్ళ వయసులో బడికీ, కళాశాలకీ మధ్య కనపడ్డ తేడాని నేపథ్యంగా తీసుకుని ఒక కథ రాసి నూజివీడు సాహితీసమితిలో చదవడం, తెలుగు లెక్చరర్ శ్రీ యమ్వీయల్ గారి ప్రశంస పొందడం, యూనివర్సిటీలో స్నేహితురాలి కబుర్లలో దొర్లిన ఒక సంఘటన 'మనసు మనసుకీ మధ్య' కథగా జ్యోతి వారపత్రిక లో అచ్చవడం, దానికి బాపూగారు మధ్య పేజీకి రెండు వైపులా విస్తరించిన బొమ్మ వేయడం యుక్తవయసు జ్ఞాపకాలు.

        చెట్టూ పుట్టా పిట్టా ఏది కనిపించినా మనసులో కదిలే పద మాలికలు లలితగీతాలుగా రూపొంది 2003లో వానచినుకులు గేయ సంపుటిగా రూపుదిద్దుకున్నాయి. మొదటి పుస్తకం పాటల పుస్తకమే. దాన్ని హిందూ వార్తా పత్రికకి సమీక్ష కోసం పంపితే వాళ్లు అనుకోని విధంగా నన్ను ఇంటర్వ్యూ చేసి, మెట్రో ప్లస్ లో ‘A rain song’  పేర ప్రముఖంగా ప్రచురించడం , ఆ పుస్తకానికి తెలుగు విశ్వ విద్యాలయం నించి ఇరవై వేల నగదు బహుమతితో సాహితీ పురస్కారం లభించడం మంచి ప్రోత్సాహాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలో అప్పటికి రాసిన కథలు రెండు పదులైనా లేకపోయినా వాటన్నిటినీ కలిపి 'ఆలంబన'  కథా సంపుటిగా వేసుకున్నాను. దానికి ముందుమాట రాసిన ఛాయాదేవిగారికి ఆ కథలు నచ్చి, తన అత్తగారి పేర తానందించే అబ్బూరి రుక్మిణమ్మ పురస్కారానికి నన్నెన్నుకోవడంతో నేనూ కథలు రాయగలను అనే ధైర్యం కలిగింది. 

        అప్పట్లో మన దేశంలోకి కొత్తగా వస్తున్న ఇంటర్నెట్ విప్లవం గురించి, అక్కడక్కడ కనిపిస్తున్న నెట్ సెంటర్ల గురించి ఆలోచిస్తుంటే కలిగిన ఆలోచనలనే  ‘ఆసరా కథగా మలిచి కౌముది పత్రికకి పంపితే బహుమతి లభించింది. ఆ కథ ప్రచురించ బడ్డ కొద్ది రోజులకే కథలో నేను వర్ణించిన సంఘటన నిజంగా జరగడం, ‘ప్రేమికుల్ని వంచిస్తున్న ఇంటర్నెట్ సీజ్ పేర ఈనాడులో వార్త రావడం జరిగింది. కథకు లభించిన బహుమతి కన్నా కారా మాస్టారి పలకరింపు, స్వయంగా మా ఇంటికి వచ్చి ఆయన అందించిన ఆత్మీయమైన ఆశీస్సు గొప్ప సంతృప్తినిచ్చాయి. బొమ్మలూ పాటలూ అలా ఉంచి కథ పైన ఎక్కువగా దృష్టి పెట్టమని ఆయనన్న  మాటలతో, స్వతహాగా చాలా తక్కువగా కథలు రాసే నేను  ఆ తర్వాత  కొంచెం  వేగం పెంచి ఆసరా కథా సంపుటికి సరిపడా కథలు రాసి, పుస్తకాన్ని వెలువరించాను 2010లో. నా పుస్తకాలకి ముఖచిత్రాలూ, లోపల చిన్న చిన్న స్కెచ్ లూ నేనే వేసుకోవడం ఒక అలవాటయింది. కొండవీటి సత్యవతి కోరిక మీద భూమిక స్త్రీవాద పత్రికలో మూడేళ్ల పాటు కథలకి బొమ్మలు వేశాను. కొంతమంది ఇతర రచయితల పుస్తకాలకి కూడా ముఖ చిత్రాలు వేశాను.

 మనో వృక్షం పై వాలే పిట్టలు ఆలోచనలు. వాటిని పట్టుకుని కథలుగా మార్చుకోవచ్చు. ఆలస్యం చేస్తే అవి ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోయినవి ఎగిరిపోగా మిగిలిన కాసినీ  దాదాపు అరవై కథలై, నా పేరు కథకుల సరసన నిలబెట్టాయి.

మనో మందిరంలో చెల్లా చెదరుగా కదలాడే ఇతివృత్తాలు, ఆగకుండా రొద పెడుతూంటే శాంతి ఉండదు. వాటిని కథలుగానో, కవితలుగానో,పాటలుగానో మార్చి, వాటి వాటి స్థానాల్లోకి చేర్చేవరకూ ఏదో అవిశ్రాంత స్థితి. పాతవి రూపం దిద్దుకునే సరికి ఏవో కొత్త ఆలోచనల కలరవాలు మళ్ళీ మొదలవుతాయి. సాహితీ సృజన కొద్దో గొప్పో అలవాటైతే ఇక ఆ 'మనిషికి సుఖము లేదంతే. మబ్బులై ముసిరే సృజనాత్మక ఆలోచనలతో మనసు బరువెక్కితే అవి సాహిత్యమై కురిశాక కలిగే మనశ్శాంతి అనిర్వచనీయమైనది. ఒకసారి అలవాటైతే అదొక వ్యసనమైపోతుందేమో.

                                                                        ***