September 6, 2017

పండుగలూ- ప్రకృతీ


స్వయంగా తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమ
మా చిన్నపుడు పండగ వస్తోందంటే ఎంత సంతోషమో. బడికి సెలవు. అలా అని బడి ఉన్నప్పుడైనా ఇప్పటి పిల్లల్లా పొద్దున్న ఎనిమిదింటి నుంచీ రాత్రి పది దాకా పుస్తకాలతో, కంప్యూటర్లతో కుస్తీలేం పట్టలేదు మా తరం. చదివినది జీర్ణమయే లోపే కొత్తపాఠాలు కూరేసే రోజులు కావవి. మొక్కల్లో తిరిగి పూలూ, ఆకులూ తెచ్చి ద్వారబంధాలని అలంకరించడం, బంధు మిత్రులతో కలిసి సమయం గడపడం. పూజలూ పండుగలూ అయాక మిగిలే నిర్మాల్యమైనా, భోజనాలు చేసిన విస్తరాకులైనా, అరిటాకులైనా అన్నీ తేలిగ్గా మట్టిలో కలిసిపోయేవి.  
ఇప్పుడు పండుగ అంటే భయమేస్తోంది. ఒక్కో పండుగకీ మనం భూమ్మీద వదిలే, నీళ్లలోనూ, గాలిలోనూ కలిపే కాలుష్యాల గురించి తలుచుకుంటే, కూర్చున్న కొమ్మని నరుక్కునే మనిషికథ గుర్తుకురాక మానదు. ఒక్క దీపావళి రోజున కాలి బూడిదయ్యే బాణసంచాతో, విస్ఫోటించే వాతావరణ కాలుష్యం చూస్తే కళ్లు తిరుగుతున్నాయి. దీంతో మనుషులు పొందే అనుభూతిని ఆనందమంటారా? మనో వికారమంటారా? పిల్లలతో పాటుగా పెద్దలూ, వెయ్యీ రెండువేల టపాసుల పట్టీలని ఎగిరెగిరి పేలుస్తూ, బోలెడు డబ్బు ఖర్చుపెట్టి రాకెట్లు కొని అవి ఆకాశంలోకి దూసుకెళ్తూ ఆకాశ హర్మ్యాల బాల్కనీల్లోకి కూడా దూరిపోయి, అగ్నిప్రమాదాలకి కారణమవుతుంటే, నిర్లక్ష్యంగా అదే పని మళ్లీ మళ్లీ చేయడాన్ని విజ్ఞత అనీ సత్సంప్రదాయమనీ అనీ అనగలమా? పసిపిల్లలతో బాణసంచా తయారు చేయిస్తున్నారని తెలిసినా, వాటిని కొని ఈ అనైతికతని పెంచి పోషిస్తుంటే, దాన్ని పండుగ అని ఎలా అంటాం?
చెరువులు కాలుష్య కాసారాలైపోతుంటే, ఉన్నవి చాలనట్టు ఇప్పుడు భారీ దుర్గా మాత విగ్రహాలని తెచ్చి, వాటికి కూడా వినాయక చవితి పండుగలాగే పదిరోజులపాటు సామూహిక పూజలు చేసి నిమజ్జనం చేసే పద్ధతిని ఉత్తర భారతం నించి దిగుమతి చేసుకున్నారు మనవాళ్లు. ఇలా వాతలు పెట్టుకోవడంలో మన తెలుగువాళ్లని మించిన వాళ్లు లేరేమో.
సన్నిధానంఅనే బ్లాగ్ లో ఈ విధంగా వినాయక చవితి గురించి రాశారు
మన దేశం నూటికి నూరు శాతం వ్యవసాయ ప్రధాన దేశం అన్నది గుర్తుంచుకోవాలి. మనం చేసే ప్రతీ పనిలోనూ ఏదో రకంగా వ్యవసాయ సంబంధ అంశాలు చోటు చేసుకోవటం గమనిస్తే అర్థమవుతుంది. వినాయక చవితి కూడా అంతే. వినాయకుడు స్థూలంగా భూమికి ప్రతీక. ఆయన ఏనుగు ముఖం బుద్ధికి చిహ్నం. ఆయనకు ఉండే ఏక దంతం రైతు పొలంలో పట్టే నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు తూర్పార బట్టే చేటలకు సంకేతం. ఆయన పెద్ద బొజ్జ పండిన వడ్లను పోసేందుకు ఉపయోగించే గాదెకు గుర్తు. ఎలుకల్ని వాహనంగా చేసుకోవటం అంటే పంటల్ని పాడు చేసే ఎలుకలను నియంత్రించటానికి గుర్తు. పొట్టపై పాముల్ని బిగించి కట్టుకోవటం కూడా దానికే ప్రతీక. వినాయకుడి వ్రతాన్ని చేసేప్పుడు మనం 21 రకాల పత్రాలను వినియోగిస్తాం. జాజి, మారేడు, మాచీపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంటపొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే.అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడు. వినాయకుడిని పూజించటం అంటే మనకు అన్నం పెట్టే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే.’
అజ్ఞాత చిత్రకారుడి మనోహర చిత్రం- ప్రకృతిలో ప్రశాంతంగా
పైన వ్యాసకర్త  వివరించిన ఉద్దేశ్యాలకీ ఈనాడు మనం చేసుకుంటున్న పండుగవిధానానికీ, దాని పరిణామాలకీ ఎంతటి సంబంధం ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. కేవలం మూడు నాలుగు దశాబ్దాల క్రితం కూడా వినాయక చవితి పర్యావరణ హితంగానే ఉండేది. మట్టిప్రతిమలే తప్ప రంగువేసిన బొమ్మలు తక్కువగా ఉండేవి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు ఆ రోజుల్లో అసలు చూడనేలేదు. చాలా ఇళ్లలో వినాయకుడి బొమ్మలే కాదు దీపావళి బాణసంచా, సంక్రాంతికి పాలుపొంగించేందుకు వాడే పిడకలు స్వయంగా తయారు చేసుకునేవారు. వాకిట్లో ముగ్గుకి వరిపిండి వాడేవారు
సరే ఎన్నో మార్పులొచ్చాయి కాలంతో పాటు. కానీ పంచభూతాలతో ఏర్పడి, చివరికి మళ్లీ పంచ భూతాల్లోనే కలిసిపోవలసిన మనుషులం వాటినెంతగా కలుషితం చేస్తున్నామో గమనిస్తే మనసు భారమైపోక మానదు.
 
బుద్ధం శరణం గచ్ఛామి
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యాన్ని గమనిస్తే, అంతకు ముందు ఇంటిపూజకే పరిమితమైన పూజా విధానం 1893లో బాల గంగాధర తిలక్ అధ్వర్యంలో మహారాష్ట్రలో సామూహిక ఉత్సవమయిందని తెలుస్తుంది. హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య సుహృద్భావాన్ని పెంచడానికి, జాతీయతాభావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడుతాయని తిలక్ భావించారట. మారుతున్న కాలంతో పాటు వచ్చిన మార్పులవల్ల మనిషి ఆడంబరాలకి ప్రాధాన్యతనిస్తూ, పర్యావరణ స్పృహని కోల్పోవడం వల్ల ఎన్నో అవాంఛనీయ ధోరణులు తలెత్తడం, మంచికన్నా చెడు ఎక్కువకావడం విషాదకరం.ఈ మధ్యకాలంలో చూస్తే, వినాయక చవితికి ఆర్నెల్ల ముందే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే గణేశ విగ్రహాల తయారీ మొదలైపోతోంది. కాలనీల మధ్య పోటీ, ‘మా బొమ్మ పెద్దదంటే మా బొమ్మ ఇంకా పెద్దదిఅంటూ గొప్పలు చెప్పుకుంటూ, విషపు రంగులు పులిమిన యాభై అరవై అడుగుల ఎత్తున్నPOP విగ్రహాల్ని కూడళ్లలో, రోడ్లు తవ్వి, స్తంభాలు పాతి, మండపాలు కట్టి, వాటిలో ప్రతిష్ఠించడం, పదిరోజుల తర్వాత అతి కష్టం మీద వాటిని తరలించి చెరువుల్లో నిమజ్జనం చేసి, ఆ నీటిని విషతుల్యం చేయడం ఏటేటా జరిగే కార్యక్రమం.  భక్త సమూహాలు తమ వ్యక్తిగతమైన వెర్రిపోకడల్ని వినాయకుడికీ అంటగట్టడం చూస్తే ఇది భక్తేనా అనిపిస్తుంది. సిక్స్ పాక్ గణేశా, సూపర్ మాన్ గణేశా, స్పైడర్ మాన్ గణేశా అంటూ వ్యాపార వర్గాలు పిల్లల్ని ఆకట్టుకునే కొత్తకొత్త ప్రయత్నాలు చేస్తుంటే, అలాంటి ధోరణి నుంచి తమ పిల్లల్ని, తమ సంస్కృతినీ కాపాడుకోలేని పెద్దల నిస్సహాయతా, తమవైన విలువలేమిటో తెలియని, తెలుసుకోవాలనే తపన కూడా కరువైన యువ దంపతులూ, పిల్లలేవి అడిగితే అవి ఎలాగైనా అందివ్వడమే తమ కర్తవ్యం అనుకునే తల్లిదండ్రులూ! మొత్తం మీద అన్నిరకాల దాడులకీ అనుకూలంగా, నాలుగు వైపులా తెరిచిపెట్టిన ద్వారాలతో ఇంటి భద్రత ఎవరికీ పట్టనట్టున్న మన మనో మందిరాలు! వెరసి ఇదీ నేటి మన పరిస్థితి.

వినాయక నిమజ్జనం నిన్నటితో పూర్తయింది. పర్యావరణం గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా మొత్తుకున్నా వేలకొద్దీ POP విగ్రహాలు ఈ పండుగ సందర్భంగా మార్కెట్లోకీ, వీధుల్లోకీ వచ్చేసి, మన నీటి వనరుల్లోకి చేరిపోయాయి.ఈ పదిరోజుల్లో హుసేన్ సాగర్ లో నిమజ్జనమైన తొంభై శాతం విగ్రహాలు రసాయనిక రంగులు పూసిన POP ప్రతిమలే! మన చెరువులన్నీ ఇలా కలుషితమైపోతుంటే, ఆ కాలుష్యం రకరకాలుగా మన శరీరాల్లోకి చేరుతుంటే, అదేదో అత్యంత ఆనందకరమైన విషయంలాగా ప్రజాప్రతినిధులతో సహా నగర జనాభా వీధుల్లో బారులు తీరీ, నాట్యాలు చేసీ, టీవీలకి కళ్ళప్పగించీ నిమజ్జన తతంగాన్ని చూశారు.
          మైకుల్లో సినిమా పాటలూ, జనరంజకమైన సినిమా పాటల బాణీననుసరించి రాసిన భక్తి పాటలూ, చెవులు గింగుర్లెత్తే డప్పులూ పదిరోజుల పాటు వాతావరణాన్ని ధ్వని కాలుష్యంతో నింపేశాయి. ప్రసాదాల పేర వేల కొద్దీ ప్లాస్టిక్ డిస్పోజబుల్ పళ్లాలు, గ్లాసులూ వీధుల్లో చెత్తకుప్పల పరిమాణాన్ని ఘనంగా పెంచాయి. మొన్ననే శుభ్రపరచిన హుస్సెన్ సాగర్ లో, లారీల్లోనే గాని తరలించడానికి సాధ్యం కాని POP విగ్రహాల నిమజ్జనం జరుపుతుంటే, ఆ పర్యావరణ వ్యతిరేక కార్యక్రమాన్ని టీవీలు గొప్పగా ప్రసారం చేశాయి. జరుగుతున్న నష్టాన్ని చర్చకు పెట్టే కార్యక్రమాలు తక్కువగానూ, విధ్వంసాన్ని వేడుకగా చూపే కార్యక్రమాలు ఎక్కువగానూ టీవీలని నడిపించాయి. ఆఖరికి ప్రతి ఏటా అన్నిటికన్నా పెద్ద విగ్రహాన్ని స్థాపించి పదిరోజుల పూజల తర్వాత హుసేన్ సాగర్లో నిమజ్జనం చేసే ఆనవాయితీ గల ప్రసిద్ధ కాలనీకి మంత్రి వర్యులు కూడా వచ్చి అక్కడి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమకు తమ వందనాలర్పించి వెళ్లారంటే, పర్యావరణం పట్ల మన నిర్లక్ష్యానికిది పరాకాష్ట అనిపించడం లేదూ?
ఒకప్పుడు పండుగలంటే ప్రకృతికి దగ్గరగా వెళ్లే సమయాలుగా తోచేది. సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం కూడా జనాభా ఇంతగా నగరాల్లో కేంద్రీకృతమైపోలేదు.
ఇళ్లు ఎంత చిన్నవైనా కాస్తో కూస్తో నేల ఉండేది. రెండో మూడో మొక్కలూ, చెట్లూ ఉండేవి. పెరట్లో కూరపాదులుండేవి. మనిషికీ మట్టికీ మధ్య అనుబంధం ఇంతగా తెగిపోలేదు. రాను రాను మన కాళ్లు మట్టికి తగిలే సందర్భాలు కరువైపోతున్నాయి. హృదయ స్పందనలు తగ్గిపోతూ, ఆటుపోట్లకి తట్టుకునే శక్తి మృగ్యమైపోతూ, చిన్న చిన్న సమస్యలకే మనుషులు తమ ప్రాణాలు తీసుకోవడమో, ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడటమో చేస్తున్నారు!
ఇవన్నీ చెప్పాక, అక్కడక్కడ కనిపిస్తున్న ఆశారేఖల గురించి చెప్పకపోతే సరికాదు. గత రెండు మూడేళ్లుగా  వినాయకుని మట్టిప్రతిమల్ని అన్నిచోట్లా అందుబాటులో ఉంచుతున్న పర్యావరణ ప్రేమికుల సంఖ్య మెల్లిగా పెరుగుతోంది. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో వర్క్ షాపులు నిర్వహించి పిల్లలకి మట్టి ప్రతిమలు తయారు చెయ్యడం నేర్పిస్తున్నారు వాలంటీర్లు. బడి పిల్లలకి పర్యావరణ స్పృహ కలిగించడంలో పాఠశాలల యాజమాన్యాలూ, ఉపాధ్యాయులూ సఫలీకృతులవుతున్నారు. తల్లిదండ్రులు చెత్త బయట పారేస్తుంటే పిల్లలు అది తప్పని చెపుతున్నారు!                                                   నగరంలో అనేకచోట్ల భారీ మట్టి విగ్రహాల నిమజ్జనాన్ని ఉన్నచోటే పైపు నీళ్లద్వారా పూర్తి చేశారని వార్తాపత్రికలు చెప్పాయి. మల్కాజ్ గిరిలో 32 అడుగుల మట్టి విగ్రహం పర్యావరణహితంగా నిమజ్జనమయిందని ఈనాడు పత్రిక రాసింది.
మట్టితో గణేశ ప్రతిమల తయారీ కార్యశాలలో వందకి పైగా చిన్నారులు పాల్గొన్నారు
     వెయ్యికి పైగా అపార్ట్మెంట్లున్న మా నివాస సముదాయంలో, కొందరు స్వచ్ఛంద కార్యకర్తల కృషి ఫలితంగా, గత ఆరేడేళ్లుగా సాగుతున్నట్టే ఈ ఏడాదీ మట్టి గణపతి తయారీలో కార్యశాల నడిచింది. పిల్లలు వందల సంఖ్యలో పాల్గొని మట్టి ప్రతిమల్ని తయారు చేశారు. తాము చేసిన బొమ్మలకే పూజలు చేసుకున్నారు. దాదాపు ఏడెనిమిది వందల కుటుంబాలు వినాయక పూజ చేసుకుంటే కేవలం పదిమంది కూడా లేరు POP ప్రతిమలని పూజకోసం తెచ్చుకున్న వాళ్లు. సామూహిక పూజ కోసం వెయ్యి కుటుంబాలూ కలిసి దాదాపు ఏడెనిమిది వందల కుటుంబాలు వినాయక పూజ చేసుకుంటే కేవలం పదిమంది కూడా లేరు POP ప్రతిమలని పూజకోసం తెచ్చుకున్న వాళ్లు. మా గేటెడ్ కమ్యూనిటీ ఆవరణలోనే పిల్లలంతా నిమజ్జన కార్యక్రమం పూర్తిచేయడం ఈ ఏటి ప్రత్యేకత. అంతే కాదు, సామూహిక భోజనాలు పదిరోజులపాటూ జరిగినా, చాలా మంది తమ తమ పళ్లాలను ఇంటి నుంచి తెచ్చుకుని వాటిల్లోనే భోజనం చేయడం ఎంత ముచ్చటగా అనిపించిందో.  
 తొంభై శాతానికి పైగా మట్టి ప్రతిమలే!

వెయ్యి కుటుంబాలూ కలిసి పూజించిన మట్టిప్రతిమ

 తమ ఇళ్లలోనే బాల్కనీల్లో ఒక బకెట్లో నీళ్లు నింపివినాయక నిమజ్జనం చేసుకుని ఆ నీటిని తమ కుండీల్లో మొక్కలకి అందించిన కుటుంబాల సంఖ్య చెప్పుకోదగ్గంత కనిపించింది ఈ సారి
పండుగ అనే కాదు రోజూ కూడా, దాదాపు మూడు వందల కుటుంబాలం కలిసి, కొందరు వాలంటీర్ల ప్రోద్బలంతో, వంటింటి తడి చెత్త అంతా ఏరోజుకారోజు  తీసుకెళ్లి, కంపోస్ట్ పిట్స్ లో వేసేలా, అది మా కమ్యూనిటీలోనే ఎరువుగా తయారయేలా ఏర్పాటు చేసుకున్నాం. మూడునెల్లకోసారి మంచి ఆర్గానిక్ ఎరువు మా వంటిళ్ల చెత్తనించి వస్తుంది. దాన్ని మా కుండీల్లో మొక్కలకి వాడుకుంటాం. కొంత అమ్మకానికి కూడా పంపుతాం
ఇంక ప్లాస్టిక్ సంచులూ, పాల కవర్లూ, వార్తా పత్రికలూ, అట్టపెట్టెలూ, ఇలా పొడి చెత్త అంతా వారంలో రెండుసార్లు విడిగా తీసుకుపోయి, రీ సైక్లింగ్ కి పంపుతారు. వీటి నుంచి వచ్చే డబ్బు వీటి నిర్వహణకీ, పనివాళ్లకీ సరిపోతుంది. ఇక మేం వ్యర్ధాలుగా బయటికి పంపేవాటి పరిమాణం ఎంత తక్కువ అంటే నెలకొక పావు బకెట్ కూడా ఉండదు. మొత్తం అన్ని కుటుంబాలూ ఇలా మారడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 
తమ ఇళ్లలోనే బాల్కనీల్లో ఒక బకెట్లో నీళ్లు నింపివినాయక నిమజ్జనం చేసుకుని ఆ నీటిని తమ కుండీల్లో మొక్కలకి అందించిన కుటుంబాల సంఖ్య చెప్పుకోదగ్గదిగానే ఉంది. Leave no trace అని విదేశాల్లో పిల్లలకు నేర్పుతున్నారు. (https://lnt.org/learn/7-principles). మనమూ అలా నేర్పాలి. ముందు మనం నేర్చుకోవాలి. వాడేసి పారేసే (use and throw) వస్తువులు, తయారవుతూ అందుబాటులో దొరుకుతున్నంతకాలం మార్పు పూర్తిగా రాదు. స్వచ్ఛంద సంస్థలూ, సామాన్య పౌరులే కాదు, ప్రభుత్వాలు కూడా వేగంగా స్పందించాల్సి ఉంది!
                                                                                                                    

                                       ***