April 26, 2014

నవమి నాటి వెన్నెల - సమ్మోహనమీ రామలీల

(ఏప్రిల్ 8 వ తేదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా నది పత్రిక కోరిన ప్రత్యేక వ్యాసం) 
 
(Illustration credits to Sri Bapu )
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే|సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ సంపూర్ణంగా చేసిన ఫలితం లభిస్తుందని ఆర్యోక్తి .

శ్రీ రామ నవమి 
   దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు  సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే  దశరధ తనయుడై , కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా  జరుపుకుంటాం. అత్యంత పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు , ధీరుడు, శూరుడు , కరుణాంతరంగుడు , ఆర్త రక్షకుడు , పితృ వాక్పరిపాలకుడు , సత్య వచనుడు , ఏక పత్నీవ్రతుడు , మాట తప్పనివాడు , మృదుభాషణుడు , ధర్మమూర్తిమోహనాకారుడు అయిన  శ్రీరాముని మనసారా ఆరాధించే భక్తులెవరైనా ఉదార హృదయాన్ని , స్వచ్చమైన మనసునీ , సహృదయతనీ సొంతం చేసుకునినిర్మోహులై  జీవించ గలుగుతారన్నది భక్త జనుల  అనుభవం. నిజమైన రామ భక్తులు జీవితకాలమంతా తమ    స్వామి సద్గుణాలకు ప్రతినిధులై జీవిస్తారనీ, రాముని  సుగుణాలను తమలో పెంపొందించుకునేందుకు శక్తిమేరకు  ప్రయత్నం చేయని భక్తులు నిజమైన  రామభక్తులు కాలేరనీ, పెద్దలు చెపుతారు.
 శ్రీ రామ జననం , వివాహం , పట్టాభిషేకం 

రాముని జగదుద్దారుని సురరిపుభీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ ధాముని కనులార కనుగొన 
దొరకునా ఇటువంటి సేవ ?

 అంటూ వాగ్గేయకారుడు త్యాగరాజు తన జీవిత కాలమంతా సేవించి కీర్తించిన శ్రీ రాముడు, త్రేతా యుగం లో వసంత ఋతువు, చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో జన్మించాడని ఆదికవి వాల్మీకి వర్ణించాడు. 

       ఈ మధ్యనే, ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థకు చెందిన శాస్త్రజ్ఞులు , రామాయణంలో వాల్మీకి వర్ణించిన గ్రహ స్థితి వివరాలు పరిగణనలోకి తీసుకుని, 'ప్లానెటేరియం సాఫ్ట్ వేర్' ఉపయోగించి, శ్రీరాముని జన్మ జనవరి 10 వ తేదీ క్రీస్తు పూర్వం 5114 వ సంవత్సరం లో అయోధ్యా నగరం లో జరిగినట్టుగా  నిర్ధారించడం  జరిగింది. భారతీయ కాలెండర్ ప్రకారం ఇది చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం పన్నెండూ ఒంటి గంటల మధ్య కాలం . ఇదే సాఫ్ట్ వేర్ ని విశ్వం లోని అనేక గ్రహాల , నక్షత్రాల స్థితి గతుల్ని నిర్ధారించేందుకు నెహ్రు ప్లానెటేరియం , NASA సంస్థలు కూడా ఉపయోగించుతూ ఉండడం చూస్తే  ఇలాంటి ఆధునిక సాంకేతికత లేని రోజుల నుంచి  మన పూర్వీకులు "శ్రీరామ నవమి" ని  ఇదే రోజున జరుపుకుంటూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శ్రీరాముడు కల్పిత పురాణాల లోని పాత్ర కాదనీ, చరిత్ర లో ఒక భాగమనీ అర్ధమవుతుంది. 
   
    Space imagery, underwater explorations, radio carbon dating వంటి అత్యాధునిక పద్ధతుల ద్వారా ఈ శాస్త్రజ్ఞులు రామాయణం లోని పాత్రలు , సన్నివేశాలు అభూత కల్పనలు కావనీ , రామాయణం మన నేల  పైన, వేల సంవత్సరాల క్రితం నిజంగా జరిగిందనీ నిర్దారించగలిగారు. రాముని జన్మ సమయం , జీవిత  విశేషాలే కాక వనవాసపు పదమూడో సంవత్సరంలో దండకారణ్యం లో రామునికీ, ఖర దూషణులకీ మధ్య జరిగిన పోరుతో సహా అనేక సంఘటనలు వాల్మీకి  వివరించిన విధంగానే జరిగాయనడానికి ఆధారాలు చూపించగలిగారు !
    
     శ్రీరామ కల్యాణం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే  జరిగింది.  పద్నాలుగేళ్ళ వనవాసం , తర్వాత రావణ సంహారం జరిగాక శ్రీ రామ పట్టాభిషేకం కూడా ఇదే తిధి నాడు జరిగిందని హిందువులు విశ్వసిస్తారు.  
రామ కథ :
   అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు.. కౌసల్య,సుమిత్ర , కైకేయి. సంతానం లేని దశరధ మహారాజుకి వశిష్ట మహాముని  పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇస్తాడు . కుల గురువు ఆదేశానుసారం దశరథుడు ష్య శృంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళి,ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకునివచ్చి  పుత్రా కామేష్టి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి అందించగా దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య కైకేయికి ఇచ్చి , వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య సుమిత్ర కు ఇవ్వవలసిందిగా  కోరతాడు. యజ్ఞ ఫలం సేవించిన ఫలితంగా దశరథునికి నలుగురు పుత్రులు జన్మిస్తారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య శ్రీ రామునికి జన్మనివ్వగా కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నలకు జన్మనిస్తారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం రావణుని అంతమొందించడానికి అవతరించిన శ్రీ మహా విష్ణువు అవతారం కాగా తన స్వామిని అనుక్షణమూ వెన్నంటి ఉండి  కాపాడుకునే ఆది శేషుడే లక్ష్మణుడై జన్మించాడనీ , శ్రీ మహా లక్ష్మి సీతాదేవిగా అవతారమెత్తిందని రామ కథ తెలియజేస్తుంది. 
    రాకుమారులు నలుగురూ విద్యాభ్యాసం ముగించాక జనకుని తనయ సీత కోసం ఏర్పాటు చేసిన స్వయంవరంలో శివుని విల్లు  విరిచి సీతాదేవిని పరిణయ మాడతాడు రామచంద్రుడు. తరువాత దశరథుడు శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు చేస్తుండగా కైకేయి తన చెలికత్తె మంధర దుర్బోధలకు తలవొగ్గి రాముని పదునాలుగేళ్ళ వనవాసానికి పంపమనీ, తన కుమారుడైన భరతునికి పట్టం కట్టమనీ చెప్పి, భర్త తనకు ఎపుడో ఇచ్చిన రెండు వరాలనూ ఈ విధంగా తీర్చమని  కోరుతుంది. ఆడిన మాట తప్పలేని దశరథుడు తన ప్రియ పుత్రుని అడవికి పంపి, పుత్ర వియోగం తట్టుకోలేక ప్రాణాలు విడుస్తాడు. భర్త వెంట సీతాదేవి, అన్నగారిని విడిచి ఉండలేని లక్ష్మణుడూ వనవాసానికి వెడలి పోగా లక్ష్మణుని భార్య పద్నాలుగేళ్ళూ నిద్రాదేవిని ఆహ్వానించి భర్త వియోగాన్ని భరిస్తుంది. వనవాసంలో సీతారాముల అన్యోన్య దాంపత్యానికి ఆటంకం కలిగిస్తూ రావణాసురుడు సీతను అపహరించి, తనను స్వీకరించమని కోరతాడు . అందుకు నిరాకరించిన సీతను లంకాపురిలోని  అశోక వనంలో ఉంచి, రాక్షస వనితలను కాపలా పెట్టగా , ఎంతో ప్రయాస కోర్చి, హనుమంతుని సహాయంతో  శ్రీ రాముడు సీత జాడ కనుగొంటాడు. రావణ సంహారం చేసి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వస్తాడు. రామ రాజ్యం స్థాపించి సోదరుల అండ దండలతో సుభిక్షంగా, ధర్మ బద్ధంగా రాజ్య పాలన సాగిస్తాడు.  
   హిమాలయాల ఔన్నత్యం , సాగర గాంభీర్యం , భూమాతకు సాటి రాగల సహనం  తన వ్యక్తిత్వంలో పొందుపరచుకున్న శ్రీ రాముడు, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణా ప్రతిభావంతంగా నెరవేర్చాడు. తనను నమ్మి 'నేను నీవాడిని' అన్న భక్తుడికి తాను  సర్వవేళలా అభయమిస్తానని ప్రకటించి ప్రజల దుఖాలలో స్వయంగా పాలుపంచుకుంటూ, పండుగలలో వారితో పాటు ఉత్సవాలలో పాల్గొంటూ, ఔదార్యంతో , సహానుభూతితో, ప్రజలకు దగ్గరై , ధర్మ పాలన సాగిస్తూ , 'సుపరిపాలనకు ప్రతీక' అంటే 'రామ రాజ్యమే' అనే విధంగా రాజ్యం చేసాడు. అందుకే దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువులు భావిస్తారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని ఆశించిన గాంధీజీ కూడా రామభక్తుడే .' హే  రామ్' .. ఈ రెండు పదాలే  ఆయన చివరి పలుకులు. 
ఉత్సవ విశేషాలు 
శ్రీ రామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. దేవాలయాలను అందంగా విద్యుద్దీపాల  కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరాముని తో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి , నైవేద్యం సమర్పించి ప్రసాదం అందరికీ పంచుతారు. బెల్లం, మిరియాలు, మంచి నీళ్ళు కలిపి తయారు చేసే పానకం , నానబెట్టిన పెసర పప్పు తో తయారు చేసే వడ పప్పు, శ్రీ రామనవమి నాటి ముఖ్య నైవేద్యాలు. ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఉత్సవ మూర్తుల ఊరేగింపు లో రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం భక్తుల మనసులో ఉత్సాహాన్ని, ఐక్యతా భావాన్ని కలిగిస్తుంది . 

 
సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కాబట్టి  ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథంలో రాముడు, లక్ష్మణుడు, సీత , హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తుల ఊరేగింపు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు, నినాదాలతో యాత్ర సాగిపోతుంది . శ్రీ వైష్ణవులే కాక శైవులు కూడా జరుపుకునే పండుగ ఇది. దక్షిణాదిన ఇది తొమ్మిది రోజుల పాటు సాగే ఉత్సవం. ఈ తొమ్మిది రోజులూ రామకధా గానం , సంప్రదాయ సంగీత కచేరీలూ రామాలయాలన్నిటిలో జరుగుతాయి. భక్తి , సంద్రమై పొంగిపొర్లుతుంది. చివరి రోజైన నవమి నాడు సీతారామ కల్యాణం మహా వైభవంగా జరుపుతారు 
రామ భక్తులైన వాగ్గేయకారులు 
  నేటి కర్ణాటక సంగీత సంపదలో అధిక భాగం  శ్రీ రామ భక్తులూ , వాగ్గేయ కారులూ  అయిన  రామ దాసు ( పదిహేడవ శతాబ్దం ), త్యాగరాజు (పద్దెనిమిదో శతాబ్దం ) రచించి స్వరపరచిన శతకాలూ , కృతులూకీర్తనలే అంటే సత్య దూరం కాదు.  

 
ప్రభుత్వ ధనంతో భద్రాచలం రామాలయాన్ని పునరుద్ధరించి చెరసాల పాలైభక్త రామదాసుగా పేరుపొందిన కంచెర్ల గోపన్న, చెరసాలలో హింసకు తట్టుకోలేని సమయంలో కూడా, ఆ రాముడినే వేడుకుంటూ  "ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్రా," అంటూ తాను  చేయించిన భూషణాలతో , తానమర్చిన వాహనాలలో, "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు"  అని దూషించి "తిట్టితినని ఆయాస పడవద్దు - ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్య " అంటూ క్షమాపణ కోరుతూ కీర్తించడం చూస్తే అతని అవిరళ భక్తికి  ఆశ్చర్యం కలుగుతుంది . కుతుబ్ షాహీ రాజుల వారసుడైన తానాషా కు మంత్రులైన అక్కన్న మాదన్నద్వయం లోని మాదన్నకు మేనల్లుడు  కంచెర్ల గోపన్న. ఇతడు తానాషా ప్రభుత్వం లో తహసీల్దారుగా పనిచేస్తూ తాను  నమ్మిన రామచంద్రుని సేవించుకుంటూ ఉండేవాడు.  
   
    ఒకసారి ఆయన భద్రాచలం లో జరుగుతున్న జాతర చూడబోయి, అక్కడ శిధిలావస్థలో ఉన్న రామాలయాన్ని చూసి మనస్తాపానికి లోనవుతాడు. రామ భక్తులకు భద్రాచలం ఎంతో  ప్రాముఖ్యత గల ప్రదేశం. వనవాస సమయంలో రాముడు భద్రాచలం దగ్గరున్న పర్ణశాలలో నివశించాడనీ , సీతాపహరణం తర్వాత ఆమెను వెదికే క్రమంలో శబరిని భద్రాచలం దగ్గరే కలుసుకున్నాడనీ భక్తుల విశ్వాసం . భాగవతాన్ని తెనిగించమని శ్రీ రాముడు, బమ్మెర పోతన కు కలలో కనిపించి చెప్పినది కూడా ఇక్కడే. ఇటువంటి పవిత్ర ప్రదేశం నిరాదరణకు గురై ఉండడం చూడలేక రామదాసు తన సమస్త సంపదా వెచ్చించి ఆలయ పునరుద్ధరణ చేపట్టాడనీ , అయినా సరిపోక ప్రభుత్వ ధనం నుంచి ఆరు లక్షల వెండి రూకలు ఖర్చు చేసి, ఆలయ పునర్నిర్మాణం పూర్తీ చేశాడనీ , ఈ విషయం తెలిసిన తానాషా , అతడు ఖర్చు చేసిన మొత్తం తిరిగి ఇచ్చేవరకు చెరసాలలో పెట్ట వలసిందిగా ఆజ్ఞాపించాడనీ , గోల్కొండ కోట లోని చెరసాలలో, తన స్వామిని కీర్తనల ద్వారా వేడుకుంటూ రామదాసు శిక్ష అనుభవించాడనీ చరిత్ర చెపుతోంది. 

    అలా కొంత కాలం గడిచాక ఒక నాటి అర్థరాత్రి వేళ రామ లక్ష్మణులిద్దరూ రామోజీ, లక్ష్మోజీ అనే ఇద్దరు యోధుల వేషంలో తానాషా అంతః పురం లో ప్రవేశించి రామదాసు ఖర్చు చేసిన ఆరు లక్షల వెండి రూకల బదులుగా అంతే  సంఖ్యలో బంగారు  రూకలు సమర్పించి , దానికి రసీదు అడిగి తీసుకున్నారనీ ,ఆ రసీదును జైలు అధికారికి అదే రాత్రి చూపించి రామదాసును విడుదల చేయించారనీ ప్రాచుర్యంలో ఉన్న రామదాసు గాధ చెపుతుంది . జీవిత కాలపు తన భక్తికి ఫలంగా తన కళ్ళతో తాను  రామ లక్ష్మణులను చూడలేక పోయినపుడు  జైలు నుంచి విడుదలై మాత్రం ప్రయోజనమేమిటిఅని రామదాసు విలపించాడని ప్రతీతి. 

    జరిగినదంతా సమీక్షించి చూసుకున్న తానాషా , అదంతా శ్రీ రాముని దయగా, మాయగా తెలుసుకుని తనకు అందిన బంగారు నాణాలన్నిటినీ, భద్రాచల రామాలయానికే కానుక గా సమర్పించాడనీ , అప్పటి నుంచీ ప్రతి శ్రీరామ నవమికీ, ప్రభుత్వం నుంచి ఈ ఆలయానికి 'శ్రీరామ నవమి కానుక'గా బహుమతులందడం ఆనవాయితీ అయిందని చెప్పుకుంటారు. భద్రాచలం లో భక్త రామదాసుచే నిర్మించబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి , సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను, తన తలపై పెట్టుకుని తీసుకువచ్చి స్వామికి అర్పించడం నేటికీ ఆనవాయితీగా కొనసాగుతోంది. 

    అదే విధంగా రాముని స్తుతిస్తూ అద్భుత ప్రతిభాశాలి త్యాగరాజు సృజించిన అసంఖ్యాకమైన కృతులలో కొన్నైనా లేకుండా దక్షిణాదిన ఏ సంగీత కచేరీ సాగదంటే అతిశయోక్తి కాదు. భారత దేశంలో రామాలయం ఒక్కటైనా  లేని గ్రామం గాని, పట్టణం గాని లేదంటే ఆశ్చర్యం లేదు. రామ భక్తుడైన త్యాగరాజు జీవితం కూడా చిత్ర విచిత్రమైన మహిమలతో సాగడం , అతని రామ భక్తి కి ఎన్నో పరీక్షలెదురవడం  సంగీతాభిమానులకు తెలిసిన కథే. 
  
ఆదర్శ దాంపత్యం 

   తొలి చూపు లోనే సీతా రాముల హృదయాలు పరస్పరం రాగరంజితమయ్యాయని వాల్మీకి వర్ణన. సీతా స్వయంవర ఘట్టం దగ్గరి నుంచి , సీతారామ లక్ష్మణులు వనవాసానికి ప్రయాణమవడం వరకూ , రాజ మందిరాలలో సీతాదేవి పొందిన ఆత్మీయతానురాగాలు అపురూపమనిపిస్తాయి. వనవాస కాలంలో అంతకు మించిన అద్వితీయమైన దాంపత్య జీవన మధురిమను , సహజీవన మాధురినీ సీతాదేవి రాముని సాహచర్యంలో  పొందినదని  రామాయణం  చెపుతుంది. అగ్ని పరీక్ష , సీతా వనవాసం సన్నివేశాలలో నాటి రాజ ధర్మాన్ననుసరించి రాముడు అనుసరించిన మార్గం విమర్శకుల అధిక్షేపణకు గురైనా వివాహానంతరం కలిసి ఉన్నంత కాలం సీతారాముల అనురాగపూర్వకమైన జీవనం, సీతాపహరణం  తరువాత రాముడు అనుభవించిన వేదనా, తన భార్యను రక్షించి వెనక్కి తెచ్చుకోవడంలో రాముడు చూపిన పరాక్రమం వారి దాంపత్యాన్ని ఆదర్శ దాంపత్యంగా నిర్వచిస్తాయి. ఆ కాలంలో బహుభార్యాత్వం రాజులకు సహజమే అయినారాముడు పాటించిన ఏక పత్నీవ్రతమే సీత పట్ల రాముని ప్రేమకు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు . 
రామనామ స్మరణ
   కాశీలో జీవిస్తూ , ఆ పుణ్యక్షేత్రం లోనే మరణించే వారికి , మరణ సమయాన ఆ భక్త వశంకరుడే రామనామ తారకమంత్రాన్ని  వారి కుడి చెవిలో చెప్పి, సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్త రామదాసు " శ్రీరామ నీ నామ మేమి రుచిరా ! ఎంతోరుచిరా, మరి ఎంతో రుచిరా" అని కీర్తించాడు.  
   రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు రాఅనగానే  నోరు తెరచుకుని లోపలి పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామాగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయనీ , ‘అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు పెదవులు మూసుకుపోయి బయటి ప్రపంచపు  పాపాలేవీ మనలోకి ప్రవేశించలేవనీ , అందువల్లనే మానవులకు రామనామ స్మరణమిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందనీ రామ భక్తుల విశ్వాసం ! 
   నేటి అల్లకల్లోల రాజకీయ పరిస్థితిలో దేశ పౌరుల్లో కనిపిస్తున్న ఎరుక , ఆలోచనాత్మకత  మరో రామరాజ్యం సిద్ధించే దిశలో ఓటర్లను నడిపిస్తుందని ఆకాంక్షిద్దాం. 

                                                        ******