February 28, 2012


అమ్మ - పెద్దమ్మ
                 --------------- వారణాసి నాగలక్ష్మి                
నవ మాసాలూ మోసి 
అణువుకి శిశువు రూపమిస్తుంది 
బిడ్డకు జన్మ నిస్తూ 
తాను పునర్జన్మనెత్తుతుంది  !
ఎండిన కట్టెలూ  , పచ్చి దినుసులూ 
తెచ్చుకుని తన వేళ్ళతో 
షడ్రుచులూ తయారు చేస్తుంది
పచ్చడి మెతుకులు తనకుంచుకుని 
విస్తరినిండా విందు భోజనం 
వెంటపడి  తినిపిస్తుంది  ! 
అది అమ్మ !

మనిషి తిని పారేసిన విత్తులో 
జీవమై నిరీక్షించి 
తొలకరి జల్లులకే   పులకించి  
మొలకెత్తి చిగుళ్లేసి 
చెత్తా, మట్టీ , కుళ్ళూ మధ్య లోంచి 
తన వేళ్ళని చొప్పించి 
ఆకుల్లో ఆహారం తయారు చేసి
అడక్కుండానే అందిస్తుంది !
పనికిరాని గాలులు తను తీసుకుని 
ప్రాణ వాయువు ని  మనకందిస్తుంది
గుక్కెడు నీళ్ళివ్వకపోయినా   
కురిసే వాన చుక్కలతోనే సర్దుకుని 
శాఖోప శాఖలుగా విస్తరిస్తుంది 
కమ్మని గాలీ ,చల్లని నీడా పంచిస్తుంది  
కొమ్మలు నరికేసినా కిమ్మనదు  
రాళ్ళేసి కొట్టినా పళ్ళే విదిలిస్తుంది    
ఎండైనా వానైనా   
తన నీడకు చేరినవారెవరైనా 
ఆప్యాయంగా హృదయానికి  హత్తుకుంటుంది   
ఇది ఇంకా పెద్దమ్మ !

February 2, 2012

నది మాసపత్రికలో ఈ నెల వ్యాలేన్టైన్స్ డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం


 

నది మాస పత్రిక లో ఈనెల వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం


Page 2

Hyderabad Literary Festival

           తారామతి బారాదరి లో ఈ సంవత్సరపు హైదరాబాద్ సాహితీ ఉత్సవాలు మూడురోజుల పాటు జరిగాయి.జనవరి 17 ,18 ,19 తారీకుల్లో. ' Recent trends in Telugu fiction' అంశం మీద  చర్చా కార్యక్రమం లో ప్రముఖ రచయిత సలీం గారు ,'కథ' సంపాదకులు నవీన్ గారు ,muse india వెబ్ పత్రిక ఎడిటర్ శ్రీ ఆత్రేయ శర్మ గార్లతో పాటు నేను కూడా పాల్గొన్నాను.నవీన్ గారు చెప్పినట్టు సంవత్సరానికి రెండువేల కథలు ప్రచురితమవుతుంటే గత రెండు దశాబ్దాలలో వచ్చిన ముప్ఫై నలభై వేల కధలు నాలాంటి కథకులే కాదు విమర్శకులు కూడా చదవడం చాలా కష్ట సాధ్యం.మంచి సాహిత్యానికి వేదిక గా నిలిచే కొన్ని మాస, వార పత్రికలనీ, పేరొందిన రచయితల కథా సంపుటాలనీ,కథా సంకలనాలనీ చదివినపుడు  నాకేర్పడిన అభిప్రాయాలని అక్కడ సభలో పాల్గొన్న వారితో పంచుకోవడం జరిగింది.

                  Latest trends in Telugu fiction
                                                                                                 ----Varanasi Nagalakshmi

                సంవత్సరానికి 1500 నించీ 2000  వరకూ కథలు ప్రచురింప బడుతుంటే గత ఇరవై సంవత్సరాలలో వచ్చిన సుమారు ముప్ఫై నలభై వేల కథలన్నీ చదివి సమీక్షించడం సాధ్యమయ్యే పని కాదు.ఇవికాక నవలలు కూడా చాలానే వెలువడ్డాయి.ఈ శీర్షిక కింద నేను చెప్పగలిగింది నేనింతవరకూ చదివిన సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని  వ్యక్తం చేసిన వ్యక్తిగతాభిప్రాయం  మాత్రమే.
             రచయితలు ఎక్కువగా ఎన్నుకొంటున్న కథాంశాలు :తెలుగు లో   ఇటీవల  అంటే గత రెండు దశాబ్దాలుగా  వస్తున్న కాల్పనిక  సాహిత్యాన్ని గమనిస్తే రచయితలు ఎక్కువగా ఎన్నుకుంటున్న కథాంశాలు  ఇలా వున్నాయి -అందివచ్చిన అవకాశాల పేర దూర దేశాల్లో స్థిర పడ్డ పిల్లలూ,దేశం లో ఒంటరిగా మిగిలి పోయిన వృద్ధులైన తల్లిదండ్రులూ ,వారి మానసిక శారీరక సమస్యలూ ... ఈ అంశం మీద ప్రతి కథా సంకలనం  ( లేదా ఒకే రచయిత యొక్క కథల సంపుటి ) లోనూ కనీసం ఒక్క కథ అయినా కనిపిస్తుంది.అలాగే పంట పొలాలు సెజ్ లుగా ,టౌన్షిప్ లు గా రూపాంతరం చెందడం,రైతులు తమ వృత్తిని కోల్పోవడం ..ఈ అంశం కూడా చాలా విరివిగా రాయబడింది.
రాయల  సీమ  factionism , చైల్డ్ లేబర్ ,అత్తా కోడళ్ళ ఆరళ్ళు ,ఆట పాటలు లేకుండా కేవలం రాంకుల పరుగు పందెం లో పావులైన విద్యార్థులు ...వీటి గురించి చాలా కథ లొచ్చాయి.ప్రేమ కథలు  అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉండేవే గాని శృంగార కథలూ సరస మైన కథల పేర అనైతికతను ప్రోత్సహించేలా లెక్కకు మించిన కథలు వచ్చి impressionable age లో ఉన్న యువతీ యువకుల్ని పెడ దారి పట్టించా యి. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు 
              సమాజాన్ని ప్రభావితం చేస్తున్న కీలకాంశాలన్నీ  కథల్లో తగు మోతాదులో చోటు చేసుకున్నాయా అంటే లేదనే చెప్పాలి. స్త్రీ శిశువుల భ్రూణ హత్యలు ఎంత ఘోర రూపం దాల్చాయో  ఏ వార్తా పత్రిక తిరగేసినా వెంటనే తెలిసి పోతుంది.ఇవాళ స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తి దేశంలో ఎక్కడా సమానం గా లేదు. అన్ని రాష్ట్రాల లోనూ స్త్రీ శిశువుల సంఖ్య తక్కువగానే ఉంది.ఆర్ధిక కారణాల కన్నా ,సాంస్కృతికమైన  కారణాలే ఈ స్థితికి దారితీసాయని (పురుషాధిక్య సమాజం ) పరిశోధనలు చెపుతున్నాయి. అయితే సాహిత్యం లో ఈ విషయానికి తగినంత ప్రాముఖ్యత లభించలేదు .ఏ కారణాలు ఇలాంటి పరిస్థితి కి దారితీసాయి,ఇలా పుట్టకముందే ఆడ శిశువులు మరణిస్తుంటే రాబోయే తరం ఎలాంటి విపత్తుని ఎదుర్కోబోతోంది ఈ అంశాల మీద విరివిగా కథలూ నవలలూ వచ్చి వుండాల్సింది.వాస్తవానికి   విషయం మీద చాలా తక్కువ రచనలు వెలువడ్డాయి.అలాగే బెల్ట్ షాపుల నేపధ్యం లో తాగుడు వ్యసనం ఎన్నో మధ్య తరగతి ,దిగువ తరగతి జీవితాల్ని చిన్నా భిన్నం చేస్తున్నట్టు వార్తా పత్రికలూ ,సైకియాట్రిస్తుల  పరిశీలనలూ చెపుతుంటే కేవలం బాధితుల కథలూ కథనాలే వెలుగు చూసాయి గాని ,మూలాల నుంచీ ఈ సమస్య రచనల్లో చర్చించ బడలేదు.మేధో మధనం జరగలేదు.పరిష్కారం సూచించబడలేదు. alcoholism పుట్టుకవ్యాప్తి  ,దాన్నించి బయట పడవేయగల institutions వివరాలూ తగినంతగా కథానుగుణం గా చిత్రితమైతే  బావుండేది.
దాదాపు పూర్తిగా అలక్ష్యం చేయబడ్డ అంశం drug addiction . ఇవాల్టి సమాజంలో ఈ వ్యాధి కోరలు చాచి అతి త్వరగా వ్యాపిస్తుంటే తెలుగు సాహిత్యంలో  మాత్రం ఒకటీ అరా తప్ప ఈ విషయం  కథాంశం గా తీసుకుని మలచిన కథలు,నవలలూ దాదాపు లేవని చెప్పచ్చు.
రాజకీయాల లో ఉన్న  వ్యక్తుల గురించిన వాస్తవ చిత్రణతో కూడిన  రచనలు కూడా తక్కువగా వచ్చాయి .
భిన్న 'వాదాలఆవశ్యకత ప్రభావం : సాహిత్యంలో స్త్రీ వాదం దళిత వాదం మైనారిటీ వాదం  ..ఇలా రక రకాల వాదాలు ఆయా వర్గాల అనుభవాలనూ ,వారి ప్రత్యేక సమస్యలనూ శక్తివంతంగా చెప్పగలుగుతాయి గనుక వాటి ఆవశ్యకత తప్పనిసరిగా వుందని చెప్పాలి.అణచివేత కు గురైన వ్యక్తి అనుభవాన్ని ఆ వ్యక్తే చెప్పినపుడు ఆ కథనం లో బలం ఎక్కువ. ఇతరుల కథనం లో అదే అంశంసానుభూతిసహానుభూతి ,ఊహ ల మిశ్రమమవుతుంది.ఏ ఒక్క రచనా ఒక జీవన విధానాన్ని సంపూర్ణంగా చిత్రీకరించలేదు.అసంఖ్యాకమైన రచనలు  ఒకే వర్గానికి చెందిన అనేకుల మనోభావాలను అనుభవాలను వ్యక్తం చేసినపుడు అన్ని దృక్కోణాల నుంచీ చూడగా ఆ సమస్య చదువరికి బాగా అర్థమయ్యే ఆవకాశం ఉంది.  చిన్నవైనా పెద్దవైనా అనేక సమస్యలకి,అనేక అనుభవాలకి  ఒకే వేదిక లభించడం వల్ల ఆ ప్రత్యేక వర్గం యొక్క జీవన రీతి అవగతం అవుతుంది.వారి వేదన అర్థమవుతుంది. సమాజంలో మెల్లగానో ,వేగం గానో సానుకూలమైన మార్పు సాధ్యమవుతుంది.ఈ వాదాలకు పరిమితమైన రచయితలు కొంతమందితమ వర్గం వారందరినీ బాధితులు గానూ ,ఇతరులందరినీ నేరస్తులుగానూ పరిగణించడం కొంత అలజడికిఅవాంఛనీయ  పరిణామాలకి దారితీసే ఆవకాశం ఉంది. ఎప్పుడైనా  నిర్లక్ష్యం  చేయబడ్డ ,అణచివేయబడ్డ వర్గం నించి చాలా కాలంగా పోగుపడ్డ ఆక్రోశం  తిరుగుబాటు గా రూపొందినపుడు  మొదటిదశలో   అది చాలా తీవ్రంగా వుంటుంది.తరువాత కాలంలో మెల్లగా సమస్థితికి చేరుతుంది . 
     రచనలు దేశ సమైక్యతకూ సంఘీ భావానికి తోడ్పడుతున్నాయా  ?  రాజకీయాలలో కనిపించే స్వార్ధపూరిత ధోరణి సాహిత్యంలో అంతగా లేక పోవడం వల్ల  లంచగొండితనంఉగ్రవాదం మతసామరస్యం వంటి కథాంశాల మీద వచ్చిన కొన్ని రచనలు లలితం గానో బలంగానో సమైక్యతా భావాలనిసంఘీ భావాన్నిమొలకెత్తిన్చడం లో సఫలమవుతున్నాయని చెప్పవచ్చు.
    ఇక మాండలికాల  విషయానికొస్తే ఉత్తరాంధ్ర ,కోస్తా ,రాయలసీమ ,తెలంగాణా మాండలికాలలో విరివిగా వచ్చిన రచనల వల్ల సగటు తెలుగువ్యక్తికి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల పలుకుబళ్ళూ కొద్దో గొప్పో పరిచయమయ్యాయి.అన్ని రకాల మాండలికాలూ రచనల్లో శాశ్వతమయ్యాయి.భాష భద్రపరచబడింది.నేటి యువత (రేపటి తరం ) మాట్లాడే భాషలో తెలుగు పదాలు అతి తక్కువైపోయిన సందర్భంలో ఇది ఒక మంచి పరిణామం.రేపటి పరిశోధకుల కైనా మన భాషలోని పద జాలం పరిమళ సహితంగా ఈ రచనల్లో దొరుకుతుందని నమ్మ వచ్చు.
    తెలుగు సాహిత్యం పై ఇతర భారతీయ భాషలవిదేశీ భాషల లోని సాహిత్య ప్రభావందేశంలో  వివిధ  ప్రాంతాల్లో  స్థిరపడుతున్న  తెలుగు  వారు  ఎక్కువవుతున్న  కొద్దీ ఆయా ప్రాంతాల సాహిత్యాన్ని చదివి తమ మాతృ  భాషలోని  సాహిత్యంతో పోల్చి చూడడం ,రెండు భాషల్లోనూ చదువుతూ మాతృ భాషలో రాస్తూ వుండడం ఇతర భాషల నుంచి తెలుగు లోకి విరివిగా అనువాదాలు రావడం ......ఈ కారణాలవల్ల  తెలుగు సాహిత్యం మీద ఇతర భాషా సాహిత్యం ప్రభావం అనివార్యంగా వుంటుంది.అదేవిధంగా విదేశీ సాహిత్య ప్రభావం కూడా.ఈ విషయంలో  Muse India  వంటి పత్రికలుతాము అందుకుంటున్న రచనల మధ్య సామీప్యాన్ని గుర్తించి సరియైన సాధికారికమైన అభిప్రాయాన్ని అందించగలుగుతాయని నా నమ్మకం.