సిరివెన్నెలలో విరిసిన ‘నంది’వర్ధనాలు--వారణాసి నాగలక్ష్మి
వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు? దానికి
సిరి కూడా తోడైతే ఆ వైభోగమే వేరు. ఆయనదెంత సిరిగల సాహిత్యం కాకపోతే ప్రతి కవీ
కలవరించే, భావుకుడైన ప్రతివ్యక్తీ పలవరించే వెన్నెలనే తన పేరుగా పొందుతారు! తను
గీత రచయితగా పనిచేసిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల ఆ తరువాత
ముప్ఫయ్యేళ్లకే మరో పది నందులు గెల్చుకున్నారు. గొప్ప పాటల్ని రాయడమే కాదు వాటిలో
వ్యక్తమైన జీవన తాత్వికతనీ, ఔదార్యాన్నీ, సానుకూల దృక్పథాన్నీ, వ్యక్తిత్వ
వికాసాన్నీ ఆచరణలో కూడా చూపించే అచ్చమైన కవి శాస్త్రి గారు.
కవి రాతతో పాటు పాటకి దాని సొంత తలరాత
కూడా ఉంటుందనీ, ఆ పాట వీధిన పడ్డ తరువాతే దాని బతుకేవిటో తెలుస్తుందనీ అంటారాయన. ఏ
సన్నివేశానికయినా ఏ సినిమాలోనయినా తన గుండెలోతుల్లోంచి ఉబికి వచ్చే భావధార
ఆధారంగానే పాటలు రాసే అరుదైన రచయితల్లో సీతారామశాస్త్రి గారొకరు. లలితమైన సినీ
గీతాలకి కావ్యగౌరవం తెచ్చిన గీత రచయితల్లో ఆయనది ప్రథమ శ్రేణి. కవి రాసిన
సాహిత్యానికి సంగీతం తోడైతే పాటవుతుంది. దానికి దృశ్యం జతై ప్రేక్షకుడికి అందుతుంది. ఫొటోగ్రఫీ రంగం ఎంతో
ప్రగతి సాధించిన ఈ రోజుల్లో సాహిత్యం పెద్ద గొప్పగా లేకపోయినా సంగీతం, చిత్రీకరణ అద్భుతంగా
కుదిరినపుడు సినిమాలో ఆ పాటలు మనని ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ సినిమా లేకపోయినా
కేవలం గీతంగా కూడా స్వయం పరిపుష్టత గల పాటలు కొన్నే ఉంటాయి. శాస్త్రిగారి పాటలు
అలాంటివి.
సన్నివేశానికి కూర్చిన సంగీతానికి
తగినట్టుగా పాటని రాసేటపుడు కూడా సందర్భాన్ని బట్టి లలిత లలిత పదగుచ్ఛాలనూ, గంభీర శబ్ద
సమూహాలనూ అందమైన నగలో రత్న మాణిక్యాలను శ్రద్ధగా అమర్చినట్టుగా పాటని
తీర్చిదిద్దడం ఆయనకలవాటు.
మేం బెంగుళూరులో కొత్త గా కాపురం
పెట్టిన రోజులవి. ఎప్పుడు రేడియో పెట్టినా సిరివెన్నెల చిత్ర గీతాలు వినిపిస్తూనే
ఉండేవి. అయినా చాలదన్నట్టు శర్మ గారు ఆ సినిమా గీతాలున్న కాసెట్ కొని తెచ్చారు. ‘విరించినై
విరచించితినీ ఈ కవనం-విపంచినై వినిపించితినీ ఈగీతం’ పాట మొదటిసారి వినిపించగానే
అంతవరకూ సంగీతం మీదే ఎక్కువగా ఆధారపడి మనగలిగే సినిమా పాటల మధ్య ఈ పాట విభిన్నంగా,
పరిమళభరితంగా తోచింది. వింటున్న కొద్దీ మథురంగా అనిపించడం, విన్నవెంటనే అర్ధంకాని
సాహిత్యపు సొగసులు వినగా వినగా అవగతమవడం, సాహిత్యాన్ని అర్ధం చేసుకుని వినడం వల్ల
మరింత మనోహరంగా తోచడంతో ఈ రచయిత ఎవరా అని పేరు తెలుసుకుని అప్పట్లోనే ఆయన పట్ల
అభిమానం పెంచుకున్నాం ఇద్దరం. ఆ పాటకి ఆ సంవత్సరం(1986) గీత రచయితగా సీతారామ
శాస్త్రి గారు నంది పురస్కారం అందుకున్నారని తెలిసి సంతోషించాం.
ఇక్కడ నా నేపథ్యం గురించి కొంచెం
చెప్పాలి. చుట్టూ పొలాలూ మధ్యలో మా ఒంటరి ఇల్లూ. కొద్దిమంది కూలీలని వెంట
పెట్టుకుని నాన్నగారు స్వయంగా తోటలోని రాళ్లతో కట్టిన ఇల్లు మాది. వందెకరాల అడవిని
పంట పొలంగా మార్చే క్రమంలో వనవాసిగా మారిన నాన్నగారు, ఆయన వెనకే అమ్మా, మామ్మా,
తాతగారూ, మేం నలుగురు పిల్లలం … ఏడాదికొకసారి
సెలవులివ్వగానే బంధుమిత్రుల పిల్లలందరూ చిలక గుంపులా ఒక్కసారిగా వచ్చి వాలిపోయే ఫలవృక్షం
మా తోట. మాకు ఇరుగుపొరుగూ ఎవరయ్యా అంటే పక్షులూ
పశువులూ పాములూ.. ఇవే.
మేం తలెత్తితే కనపడేది వినీల గగనమే.
ప్రాగ్దిశ వీణియపై పరుచుకున్న దినకర మయూఖ తంత్రులే అక్కడ పొద్దుపొడుపు దృశ్యాలు. జాగృత
విహంగ తతుల కిలకిలరావాలే మాకు సుప్రభాత సంగీతం. చేతన పొందేందుకు కావలసిన సహజ సుందర
పరిసరాలు. హృదయ మృదంగ ధ్వానం
వినిపించేందుకు కావలసిన నిశ్శబ్ద గంభీర వాతావరణం. విశాల ప్రకృతి మధ్యలో ఒంటరి
కుటుంబంగా పెరగడం వల్ల మా కుటుంబ సభ్యుల మధ్య అవ్యాజమైన గాఢమైన అనుబంధం. అలా
పంతొమ్మిదేళ్లు ఇరుగూ పొరుగూ అన్న మాటకి అర్ధమే తెలియకుండా పెరిగి ఒక్కసారిగా
భాగ్యనగరంలో ఎమ్మెస్సీ చదువుకి వచ్చిన నా పరిస్థితి నీటి కొలనులోంచి గట్టుమీద పడ్డ
చేపపిల్లలా అయింది. తర్వాత కిద్వాయ్ కాన్సర్ అసుపత్రిలో వైద్యుడైన శర్మ గారితో
వివాహం, బెంగుళూరులో కొత్త కాపురం పెట్టడం జరిగి, పుట్టి పెరిగిన పచ్చటి పరిసరాలు
వదిలి మహానగరానికి వెళ్లిన నాకు ఒక రోజు పొద్దున్నే ‘ఈ గాలీ ఈ నీరు సెలయేరూ..
ననుగన్న నా వాళ్లూ… నాకళ్ల లోగిళ్లు’ అన్న మధురగీతం వినగానే కళ్లు రెండూ కన్నీటి కొలనులై
పోయాయి.
అందరిలాగే ఆ తర్వాత కొన్నాళ్లకి కొత్త జీవితం అలవాటైంది.
అప్పట్లో బాలకృష్ణప్రసాద్ గారి మథుర కంఠంలో
అన్నమయ్య కృతులు కాసెట్స్ గా లభించేవి. ‘చక్కని తల్లికి చాంగుభళా,
పలుకుతేనెల తల్లి పవళించెనూ’ మొదలైన కృతులు వింటూ ఒకరోజు కొత్తగా ‘తెలవారదేమో
స్వామీ’ పాట విన్నాను. అన్నమయ్య కృతినే సినిమాలోకి తీసుకున్నారేమో అనుకున్న నాకు
తర్వాత తెలిసింది అది ‘శ్రుతి లయలు’ సినిమాలో సీతారామశాస్త్రి గారు రాసిన పాట అని.
సర్వాంగ సుందరమైన ఆ సినిమాలోని ఈ పాటకి ఆ సంవత్సరం (1987) నంది అవార్డ్ లభించింది.
వరసగా రెండు సంవత్సరాలు ఒక కొత్త రచయిత పాటలకి ఈ
పురస్కారం లభించడం అబ్బురంగా తోచింది. అదే రచయిత రాబోయే కాలంలో ఎన్నో రికార్డులు
నెలకొల్పుతారనీ, తన రికార్డులు తానే తిరగరాస్తారనీ అప్పుడు తెలియదుగా.
ఆ తర్వాతి సంవత్సరం ‘స్వర్ణ కమలం’ సినిమా
వచ్చింది. అందమైన తారాగణంతో, ప్రతిభావంతుడైన దర్శకుడి సారధ్యంలో యువ హృదయాలను
గిలిగింతలు పెట్టేలా, మన సంప్రదాయ కళల పట్ల మక్కువ కలిగేలా తీసిన ఆ ప్రేమకథా కళా
చిత్రంలోని పాటల్లో సంగీతమూ, సాహిత్యం ఒకదాన్ని మించి ఒకటి పోటీపడగా ‘శోభలీనే
సోయగాల’ భానుప్రియ నాట్యం ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంది.
ఈ సినిమాలో మీనాక్షి ఆశలకీ;
ఆమెని అమితంగా ఇష్టపడుతున్న చంద్రం ఆశయాలకీ - నింగికీ నేలకీ ఉన్నంత దూరం. తండ్రి నేర్పిన నృత్యం పట్ల ఆసక్తి గానీ, అభిమానం గానీ లేని మీనాక్షిని ఎలాగైనా అనునయించి ఆమెలో కళ పట్ల
అంకితభావం మొలకెత్తించాలని చంద్రం ప్రయత్నం. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణని
ప్రతిబింబిస్తూ, వారి మధ్యనున్న భావ వైరుధ్యాలకి అద్దం పడుతూ రాయాల్సిన మూడు పాటలు
రచయిత ప్రతిభకి ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. ఒక రచయితగా ఈ సందర్భంలో తానెదుర్కొన్న
క్లిష్టతని శాస్త్రి గారే స్వయంగా వివరించడం జరిగింది.
వీటిలో మొదటిదైన
‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ పాటలో ‘మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా? వయ్యారి వానజల్లై దిగిరానా?
సంద్రంలో పొంగుతున్న అలనైపోనా? సందెల్లో
రంగులెన్నో చిలికేనా?’ అని మీనాక్షి చేత
పలికిస్తూ ఆమె స్వేచ్ఛాప్రియత్వాన్ని, చంచలత్వాన్నీ వ్యక్తపరచే గొప్ప
భావచిత్రాన్ని లిఖించారు శాస్త్రి గారు. చివర్లో ‘నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా’ అంటూ ఆ వయసు
కన్నెపిల్లల మనసుల్లో కదలాడే అమాయకపు ఆశల్ని అత్యంత సహజంగా చూపించారు. ‘మబ్బుల్లో
తూలుతున్న మెరుపు’ అన్న ప్రయోగం ఇంతకు ముందెవరూ చెయ్యనిది. ఇలాంటి ప్రయోగాలు తన మూడు
దశాబ్దాల సినీ ప్రస్థానంలో శాస్త్రి గారు లెక్కకు మించి చేశారు.
అలాగే రెండోదైన ‘ఘల్లు ఘల్లు మంటూ
మెరుపల్లె తుళ్లు’పాటలో ‘నల్ల
మబ్బు చల్లనీ చల్లని చిరుజల్లు, పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్లు’ అని భావుకుడైన
చంద్రం అన్నపుడు, ఎల్లలక్కర్లేని అల్లరిపిల్ల మీనాక్షి ‘వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు, ఎల్లలన్నవే ఎరగని
వేగంతో వెళ్లు’ అంటుంది. ‘లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో
సుమబాలగ తూగాలి’ అనడంలో నృత్యకారిణిగా ఆమె సాధించాలని తను కోరుకుంటున్న గమ్యాన్ని
సూచిస్తూనే, ఆమెనొక సుమబాలగా భావిస్తూ అతను చేసే అపురూపం వినిపిస్తుంది.
‘వలలో వొదుగునా విహరించే చిరుగాలి, సెలయేటికి నటనం నేర్పించే గురువేడి?’
అనడంలో మీనాక్షి పెంకితనం, తర్కంతో బాటు ఏ చట్రంలోనూ ఇమడడానికి ఇష్టపడని ఆమె
స్వభావం కనిపిస్తుంది. రెండో చరణం కూడా అంతే సరళంగా సమర్ధంగా మీనాక్షి, చంద్రంల
సంవాదాన్ని ప్రతిబింబిస్తుంది. ‘కమ్మని
కలల పాట ఏరాగం అంటారు?’ అన్నమీనాక్షి ప్రశ్నకి జవాబుగా ‘కలలా కరగడమా జీవితాన పరమార్ధం?’
అని అతను తిరిగి ప్రశ్నించడం సినిమా మొత్తం కథని, అతని వ్యధని ఒక్క వాక్యంలో
ఇమిడ్చినట్టనిపిస్తుంది. ఒక అద్భుత కళాకారిణి జీవితం ఒక ఉన్నతమైన లక్ష్యం లేకుండా
కలలా కరిగిపోరాదనే గదా అతని తాపత్రయమంతా? ‘వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ’ అని ఆమె అంటే ‘హద్దులు దాటరాదు ఆశల వాహిని’ అని హెచ్చరిస్తాడతను.
పాట మొత్తానికి మకుటాయమానమైన వాక్యం- ‘నటరాజస్వామి జటాజూటిలోన చేరకుంటె విరుచుకుపడు సురగంగకు విలువేముందీ?...
విలువేముంది?’
ఇక మూడో పాటలో చంద్రం మీనాక్షిని సంబోధిస్తూ,
‘శివపూజకు
చివురించిన సిరిసిరిమువ్వా’
అంటాడు. నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూవుని కాకుండా, నాట్యానికి సంబంధించిన ‘మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వు’ని- కాలి మువ్వని
ఎన్నుకున్నానని వివరిస్తూ శాస్త్రి గారంటారు ‘వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే
సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని,
సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక
విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు
సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరించనీవా? అని చంద్రం పాడాల్సిన పల్లవి రాసాను’
అని.
ఇంత అద్భుతమైన పల్లవి రాశాక మీనాక్షి తరఫు
వాదనని అంతే శక్తివంతంగా రాయాల్సిన అవసరం వచ్చింది. ఆమె కవయిత్రి కాదు. మామూలు
మనిషి. అయినా చంద్రం ఆరోపణకి దీటైన సమాధానం ఇవ్వకపోతే
మీనాక్షి పల్లవి వెలవెల పోతుంది. ఒక పదిహేను రోజుల పాటు తానే మీనాక్షి అయిపోయి తన సర్వశక్తుల్నీ, ఆలోచనా తీవ్రతని వినియోగించి శాస్త్రి
గారందించిన పల్లవి ఎంత సరళంగా సమంజసంగా ఉందో శ్రోతలకి తెలిసిందే.
పరుగాపక పయనించవె తలపుల నావా!- కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా?- మదికోరిన మధుసీమలు జయించిరావా?
ఎదిరించిన సుడిగాలిని జయించినావా?- మదికోరిన మధుసీమలు జయించిరావా?
నట్టనడి సముద్రం మధ్య, కెరటాలతో
సయ్యాటలాడుతూ అక్కడే నిలబడదు ఓడ. ఆ అలలకి ఎదురీది తీరానికి
పయనిస్తుంది. చరణాల్లో కూడా ఇదే సంయమనం కనిపిస్తుంది.
‘పడమర పడగలపై మెరిసే తారలకై..
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై.. ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ.. నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ’ అని చంద్రం విన్నపం చేస్తే
తూరుపు వేదికపై వేకువ నర్తకివై.. ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ.. నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ’ అని చంద్రం విన్నపం చేస్తే
‘తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని
మొక్కలా.. ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా.. ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా.. వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా’
అవధి లేని అందముంది అవనికి నలు దిక్కులా.. ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతి రోజొక నవగీతిక స్వాగతించగా.. వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా’
అంటూ తానెన్నుకున్న మార్గాన్ని
సూచిస్తుంది మీనాక్షి.
లలిత చరణ జనితం
నీ సహజ విలాసం.. జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో… వికసిత శతదళ శోభల సువర్ణ కమలం’
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో… వికసిత శతదళ శోభల సువర్ణ కమలం’
అని చంద్రం చేత చెప్పించి చివరగా ఎవరికైనా స్వధర్మం శ్రేయమనీ,
పరధర్మం భయావహమనీ స్వస్తి వాక్యం పలికిస్తారు రచయిత.
మూడు పాటలూ ఈ రెండు పాత్రల మధ్యే చిత్రీకరించబడేటపుడు,
మూడింటిలోనూ మార్పులేని వారి జీవన దృక్పథాలూ, సంఘర్షణలే వ్యక్తమయేటపుడు పునరుక్తి
లేకుండా ఏపాటకి ఆపాటే శభాషనేలా రాయడం శాస్త్రి గారి ప్రతిభ. ‘ఆకాశంలో ఆశల హరివిల్లు, ఘల్లు
ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు, శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా’- వరసగా ఈ
మూడు పాటలూ చదివితే ఆయన చేసిన కత్తిమీద సాము మనకర్ధమౌతుంది. అలాగే ఏ పాత్రకి ఆ
పాత్ర స్వభావం, సంస్కారం ప్రతిఫలించేలాంటి భాషనే రాయడంలో కూడా అద్భుత ప్రతిభ
కనపరచారు రచయిత.
‘చెప్పాల్సిన
విషయం చాలా గొప్పదీ, విస్తృతమైనదీ, లోతైనదీ
అయినప్పుడు, దాన్ని ఒక పల్లవీ, రెండు
చరణాల్లో ఇమిడ్చి, వీలయినంత సరళంగా చెప్పవలసి వచ్చినపుడు అదే
నిజమైన క్లిష్టత. అయితే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురయితే ఏ కవీ కష్టంగా
భావించడు, ఇష్టపడతాడు. కవిగా తన సత్తా
చూపించాలి అని అనుకునే ఎవరికైనా, సరైన ఛాలెంజ్ ఎదురైతే ఎంతో
ఆనందం కలుగుతుంది. తన సర్వశక్తుల్నీ ధారపోసే అవకాశం దొరికిన సంతోషం అది’
అంటూ శాస్త్రి గారు ఈ పాటల గురించి చెప్పడం, గీత రచనని ఆయన ఎలాంటి సవాలుగా
స్వీకరిస్తారో తెలియజేస్తుంది.
ఇక ముచ్చటగా మూడో ఏడాది మూడవ నందిని
సీతారామ శాస్త్రిగారి ఇంటికి మోసుకొచ్చిన పాట ‘అందెల రవమిది పదములదా?’ - తండ్రి మరణానికి కారకుడిగా
చంద్రాన్ని నిందించిన మీనాక్షిని, గురుపౌర్ణమి నాడు తండ్రి దగ్గర విద్య నేర్చిన
శిష్యులంతా కలిసి ఆయనకు అంజలి ఘటిస్తూ గురుపూజోత్సవం జరిపే చోటికి తీసుకువెడతాడు
చంద్రం. ఆ శిష్యులలో గురువు గారి పట్ల వ్యక్తమవుతున్న భక్తి గౌరవాలను, ఆయన
ఆరాధించిన కళ పట్ల వారికున్న అంకిత భావాన్ని చూసిన మీనాక్షిలో జరిగిన హృదయ మథనాన్ని,
మీనాక్షిగా నటించిన భానుప్రియ అద్భుతంగా ప్రదర్శించింది.
ఒక నాట్య కళాకారిణి తనలోని కళాత్మకత జాగృతం కాగా,
ధ్యానమగ్నయై నృత్యం చేసినపుడు రవళించే అందెల మథురధ్వని పదములదెలా అవుతుంది? కాదుకదా!
అది అంబరమంటిన హృదయానిది! ‘అమృతగానమిది
పెదవులదా?’ ఉహు..అది అమితానందం పొందిన ఎద చేసే సవ్వడి! కళ్లారా ఆమెని
తిలకిస్తూ, ఆమెలోని మార్పుని గ్రహించి ముగ్ధుడైన చంద్రం ‘సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా
- బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా’ అంటూ ఆమె వెంట
నడుస్తాడు. ఆమె ‘మువ్వలు ఉరుముల సవ్వడులై - మెలికలు మెరుపుల మెలకువలై – మేను హర్షవర్ష మేఘమై
- మేని విసురు వాయువేగమై’పోగా ‘అంగభంగిమలు గంగపొంగులై హావభావములు
నింగిరంగులై –రసఝరులు జాలువారేలా’ సాగే
లాస్యలీలని అతడు పులకితుడై తిలకిస్తాడు. శివ పంచాక్షరిని పునర్నిర్వచిస్తాడు. ‘భరతమె నిరతము భాగ్యమ’ని ఆమె
గ్రహిస్తుంది. ఆమెలో చంద్రం కోరుకున్న మార్పు సిద్ధిస్తుంది. ఇంత కీలకమైన
సన్నివేశాన్ని అయిదు నిముషాల పాటలో ఇమిడ్చిన అక్షరశిల్పి దగ్గరకి నంది నడచి రాకుండా
ఎలా ఉంటుంది? ఇంతవరకు సినిమా చరిత్రలో వరసగా మూడేళ్ల పాటు నంది పురస్కారం ఒకే గీత రచయితని
వరించినది లేదు.
తర్వాత మూడు సంవత్సరాల పాటు నంది పురస్కారాలు ఇవ్వడం
జరగలేదు. తర్వాత 92 లో ‘ఆకాశంలో
సూర్యుడుండడు సంధ్య వేళకి’ అన్న పాటకి గాను ఈ పురస్కారం, ‘పదివేల పాటల
పదనిధి’ వేటూరి సుందర రామ మూర్తి గారికి లభించింది. తర్వాతి సంవత్సరంనించి
సిరివెన్నెల జైత్ర యాత్ర మళ్లీ మొదలయిందని చెప్పవచ్చు. 93 నుంచి 99 వరకు సినీ
గీతాలకి ప్రకటించిన నంది పురస్కారాలన్నీ(96 లోనూ, 98లోనూ ఈ పురస్కారాలు ప్రకటించలేదు)
సిరివెన్నెలనే వరించాయి. 1993 లో వచ్చిన గాయం సినిమాలో
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
- సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
- అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
అంటూ
శాస్త్రి గారడిగిన ప్రశ్న జనసామాన్యంలో తరచుగా తలెత్తే ఆవేదనకి అక్షరరూపమే.
చరణాల్లో ‘ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం- కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి
కపోతం’ - ‘కులమతాల దావానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
- కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందు సంద్రం’ వంటి
పదగుచ్ఛాలు సన్నివేశానికి రాసిన పాటలో భాగాలే అయినా సమకాలీన సమాజంమీద ఎక్కుపెట్టిన
తూటాలు. పాటంటే సంగీతంతో మేళవించబడి, సినిమాలోని దృశ్యమాలిక వల్ల పరిపుష్టమయే
గేయమే అయినా శాస్త్రి గారికి సంబంధించినంత వరకు అది స్వయంప్రతిపత్తి గల కావ్యమే!
ఆ
తర్వాతి సంవత్సరం, అంటే 1994 లో సిరివెన్నెల సీతారామశాస్త్రి
గారికి ఉత్తమ గీతరచయితగా నంది పురస్కారం మాత్రమే కాక కళా సాగర్
పురస్కారం, మనస్విని పురస్కారం కూడా తెచ్చిపెట్టిన పాట ‘ చిలుకా ఏ తోడు లేక’’ శుభ
లగ్నం సినిమాకోసం రాసినది. పాట ఒక్కటీ చదివినా సినిమా కథంతా అర్ధమయ్యేంత పస గలిగిన
పాట. వివాహబంధం అంటే మూడో మనిషితో
పంచుకోలేని అనుబంధమని తెలుసుకోలేక, డబ్బు మీది వ్యామోహంతో తన పసుపుకుంకుమలనే
అమ్ముకున్న ఇల్లాలి కథ ఇతివృత్తంగా తీసిన సినిమా శుభలగ్నం.
చిలకా ఏతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక? - తెలిసి అడుగేసినావె
ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చేజారాక?- లాభం
ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం చేజారాక?
అనే
పల్లవి చదివితే రెండు గీతల్లో బాపూజీ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారుడు
గుర్తొస్తాడు. సన్నివేశాన్ని తక్కువపదాల్లో వర్ణించాలన్నా, తక్కువ గీతల్లో
చిత్రించాలన్నా అనవసరమైన భాగాలన్నిటిని తొలగించాల్సి వస్తుంది. అత్యంత ప్రాధాన్యత
గల విషయాన్ని గుర్తించగల నైపుణ్యం అవసరమవుతుంది. ఆ నైపుణ్యం శాస్త్రి గారి సొంతం.
ఎందుకంటే ఆయన గీత రచయిత మాత్రమే కాదు, జ్ఞాని, వేదాంతి కూడా.
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే- వెలుగుల్నే వెలివేసే
కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే- అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
అని తర్వాతి
చరణంలో ఆమె ఎన్నుకున్న మార్గంలోని విషాదాన్ని కళ్లకి కట్టిస్తారిలా-
‘అనురాగం కొనగలిగే ధనముందా లోకంలో?- మమకారం విలువెంతో
మరిచావా సిరిమైకంలో?
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవసలో- తీరా నువు
కను తెరిచాక తీరం కనపడదే ఇంకా’
‘కురిసే కాసుల జడిలో తడిసి నిరుపేద’
అనడం ఎంత భావగర్భితమైన ప్రయోగం! ఎంతటి ధనరాశుల మధ్య నిలబడినా ఆప్యాయతా, అనురాగం
అందించే సాహచర్యం లేనపుడు ఆ జీవితం వెలుగులేని అమావాశ్య రాత్రే, సొంతమని చెప్పుకునే
వాళ్లు లేని అనాథ బతుకే. ఉద్వేగం, ఉద్రేకం నిండిన సన్నివేశం డిమాండ్ చేయనంతవరకు,
శాస్త్రి గారి పాటలనిండా లేలేత పూరేకుల్లాంటి పదాలే కనిపిస్తాయి.
1995 లో వచ్చిన ‘శ్రీకారం’ సినిమా కోసం శాస్త్రి గారు రాసిన ‘మనసు కాస్త కలతపడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు- కనుల నీరు తుడుచువారు ఎవరూ
లేరని చితి ఒడికి చేరకు’ అనే పాట సరళ గంభీరంగా కనిపిస్తూనే ఎంతో
స్ఫూర్తివంతమైన సందేశాన్నిస్తుంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకి పాల్పడే
యువతకి ఒక మేల్కొలుపు లాంటిదీ గీతం. వేటాడువేళలో పోరాడాలని ప్రబోధిస్తూ, ‘తనువే మోడైనా కూలిపోదు తరువేదైనా’
అని గుర్తుచేస్తారు. ‘ఊపిరి
పోసే స్త్రీ బేలయై నేలకూలితే నేలపై ప్రాణముండద’ని అనునయిస్తారు! రెండో
చరణంలో స్త్రీ తనని అణచిపెట్టే వాడిని కాళియై ఎలా కాలికింద అణగదొక్కాలో చెప్పి,
జీవితాన్ని అర్ధంతరంగా ముగించేద్దామనుకున్నపుడు ‘ఆ ఆయువునే ఆయుధంగా వాడి చూడ’మని రాసిన అయన కలం,
కత్తికన్నా వేల రెట్లు పదునైనది కాదని ఎవరనగలరు? అందుకే మరి, మరో నంది
ఈశ్వరానుగ్రహమై శాస్త్రి గారిని చేరింది. దీనితో శాస్త్రి గారి రెండో హాట్రిక్
పూర్తయింది.
నక్సలిజం నేపథ్యంగా
వచ్చిన ‘సింధూరం’ సినిమా 1997 లో విడుదలయింది.
'కృష్ణ వంశీ' దర్శకత్వంలో విడుదలయిన ఈ
చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ నీ, ఫిలిం ఫేర్
అవార్డునీ గెలుచుకుంది.
చిత్ర నిర్మాణం పూర్తయి, ప్రీవ్యూ చూసి బయటకు వచ్చిన
తరువాత అప్పటికప్పుడు శాస్త్రి గారి లో పెల్లుబికిన
కవితావేశం ‘అర్ధ
శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా!’ పాటగా రూపొందిందని వినికిడి.
స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు
దాటినా మన రాజకీయాలలోని కుళ్లు ప్రక్షాళన కాలేదు. నాయకుల దృక్పథాలలో ఆదర్శాలకి చోటు
దొరకలేదు. ‘సమూహక్షేమం
పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ- మొత్తం దేశం
తగలడుతోందని నిజం తెలుసుకోరే!, తెలిసి భుజం కలిపి రారే!’
అని చేసే ఆక్రందన దేశం పట్ల ప్రేమా, ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదనా ఉన్న ప్రతి
వ్యక్తినీ కదిలిస్తుంది. ఏదో ఒక సానుకూలమైన మార్పుకోసం ప్రయత్నించమని
పురికొల్పుతుంది. ‘ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం- ఈ చిచ్చుల సింధూరం?’ అన్న ప్రశ్న రగిలే జ్వాలై దహిస్తుంది. ‘జవాబు
చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ‘ అన్న సంబోధన మనని తూటాలా
తాకుతుంది.
యువత పోరుబాట పడితే, ధర్మాగ్రహం చట్టవ్యతిరేకమైతే ‘తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి
ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే - నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా
సింధూరం’ అన్న వాక్యం చదివితే ఏ సంగీతపు సహకారం లేకపోయినా శరీరం
గగుర్పొడుస్తుంది. లోలోపల ఒక దుఃఖం ఘనీభవిస్తుంది. ‘వేకువ వైపా, చీకటి
లోకా ఎటు నడిపేవమ్మా, గతి తోచని భారతమా!’ అన్న
రచయిత ప్రశ్న ప్రతీకాత్మకమై, మనమీదే ఎక్కుపెట్టినట్టనిపిస్తుంది. ‘శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన
బహుమానం-
ఈ రక్తపు సింధూరం’ అని చదివితే మనసు కుత్తుక
తెగి విలవిలలాడే శాంతి కపోతాన్నిదర్శించక మానదు. ‘చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద
భారతమా!’ అంటూ సంధించిన రామ బాణం లాంటి ఈ పాటకి, 1997లో నంది పురస్కారం
అందినపుడు ప్రేక్షకులంతా, శ్రోతలంతా ఆ నిర్ణయంతో సంపూర్ణంగా ఏకీభవించే ఉంటారు.
మౌనంగా తమ మనసుల్లో ఆ పద ప్రయోక్తకి తలవంచి నమస్కరించి ఉంటారు.
1999 లో వచ్చిన ప్రేమకథ సినిమాకోసం ‘దేవుడు కరుణిస్తాడనీ, వరములు కురిపిస్తాడనీ నమ్మలేదు
’ అనే పాటకి శాస్త్రి గారు వరసగా అయిదవ నందిని అందుకున్నారు. ఇది ఆయనకి లభించిన
నంది పురస్కారాల్లో ఎనిమిదవది. తరువాత 2005 లో చక్రం సినిమాకోసం రాసిన ‘జగమంత
కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది ‘ పాటకీ, 2008 లో గమ్యం సినిమాకి రాసిన ‘ఎంతవరకు ఎందుకొరకు ఇంతపరుగు అని
అడక్కు’ అనే పాటకీ మరి రెండు నందుల్ని సొంతం చేసుకున్నారు.
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం
నాది-సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
కవినై కవితనై భార్యనై భర్తనై - మల్లెల దారిలో మంచు ఏడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల - నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం - కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ
రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని- జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై కంటను మంటను
నేనై - మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై
రవినై
శశినై దివమై నిశినై - నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై
ప్రతినిముషం కంటున్నాను నిరంతరం -
కిరణాల్ని
కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని- చరణాల చలనాన కనరాని
గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని-
ఇలా జలపాతంలా ఉధృతంగా పొంగి ప్రవహించిన ఈ పాట
వింటుంటే మహా కవి శ్రీశ్రీ గుర్తుకురాక మానడు. ఈ పాట, శాస్త్రి గారు తన గురించి
తానే రాసుకున్న ఆత్మ గీతంలా కనిపిస్తుంది.
అలాగే ‘ఎంతవరకు ఎందుకొరకు’ పాట కూడా శాస్త్రి గారి తాత్వికతనీ,
వసుధైకకుటుంబంగా జగమంతా బతకాలనే ఆకాంక్షనీ ప్రతిబింబిస్తుంది. ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు -
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు - ప్రశ్నలోనే
బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు - అన్న శాస్త్రి గారి సాహిత్యంలో ప్రతి
వాక్యమూ తత్త్వసారమే.
‘ప్రపంచం నీలో ఉన్నదని
చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా? ‘ అనడిగి ‘తెలిస్తే ప్రతీ చోట నిన్ను
నువ్వే కలుసుకుని పలకరించుకోవా?’ అన్న వాక్యాన్ని జతచేయడం చూస్తే నారాయణ సూక్తంలోని ‘నీలతోయద
మధ్యస్థా.. పరమాత్మా వ్యవస్థితః’ అన్న శ్లోకం గుర్తొస్తుంది. ప్రతి వ్యక్తి హృదయంలోనూ
అదే భగవంతుడు కొలువై ఉన్నపుడు మనుషులంతా ఒకటే అవాలి కదా అన్న ఆలోచన కలుగుతుంది.
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు - అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు - పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది- మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి - వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా
కాదా –
ఇలా
వరసగా శాస్త్రి గారి గేయ సాహిత్యాన్ని చదువుతూ పోతుంటే ఆ గాఢతకి కళ్లు తిరుగుతాయి!
శతృవులు నీలోని లోపాలే -స్నేహితులు నీకున్న ఇష్టాలే- ఋతువులు
నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం - మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టుక చావు
రెండే రెండు - నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో
కానీ –
ఈ
పాటనే రోజూ వింటూ ఉంటే అదే ఒక వ్యక్తిత్వ వికాస గీతమై మనిషిని తీర్చి దిద్దుతుంది.
ఒక స్నేహ సౌభ్రాతృత్వానికి దారితీస్తుంది. ఇంతటి మహోన్నత సాహిత్యం కేవలం తెలుగుకే
పరిమితమై పోబట్టి కదా కిందటి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న గేయ
రచయిత బాబ్ డైలాన్ లా మన సిరివెన్నెలకూ ఆ పురస్కారం దక్కే అవకాశం లేకుండా పోయింది?
2013లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె
చెట్టు’ సినిమాలో ‘మరీ అంతగా.. మహా చింతగా.. మొహం ముడుచుకోకలా....’ పాట
గమ్మత్తుగా సాగి పెదవులపై నవ్వులు పూయిస్తూనే, హృదయానికొక కొత్త
వికాసాన్నందిస్తుంది. ‘ఎండలను
దండిస్తామా? వానలను నిందిస్తామా? చలిని ఎటో తరిమేస్తామా ఛీ
పొమ్మనీ?
కస్సుమని కలహిస్తామా ? ఉస్సురని విలపిస్తామా? రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ? -- సాటి మనుషులతో
మాత్రం సాగనని ఎందుకు పంతం? పూటకొక పేచీపెడుతూ ఏం
సాధిస్తామంటే ఏం చెపుతాం?’
ఇంత సరదాగా, సరళంగా నేర్పే వ్యక్తిత్వపాఠాలెక్కడ
దొరుకుతాయి శాస్త్రిగారి సాహిత్యంలో తప్ప?
‘మనుషులనిపించే ఋజువు.. మమతలను పెంచే ఋతువు..మనసులను తెరిచే హితవు..
వందేళ్ళయినా వాడని చిరునవ్వు’ అంటూ వాడని
చిరునవ్వుకి సులభమైన సూత్రాలు ఎవరందించగలరు శాస్తి గారు తప్ప?
ఇలా నందినందుకున్న పాటలతో పాటుగా ఆనతినీయరా హరా, నా పాట పంచామృతం, భం భం బోలే శంఖం మ్రోగెలే,
కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ, ముసుగు వేయొద్దు మనసు మీద, మేఘాలలో
చేరిపొమ్మన్నది, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నువ్వెవరైనా నేనెవరైనా, ఏ
శ్వాసలో చేరితే, నీతోనె ఆగేన సంగీతం, తరలి రాద తనే వసంతం, నీ ప్రశ్నలు నీవే ఎవరో
బదులివ్వరుగా, రంగేళీ హోలీ హంగామా కేళీ …ఇలా ఎన్నో ఆణిముత్యాలమూటల్ని పాటలుగా
శాస్త్రి గారు అందించారు. ఇప్పటికి పదకొండు నంది పురస్కారాలతో పాటు, కళాసాగర్,
మనస్విని, కిన్నెర, భరతముని, ఆఫ్జా, ఫిలిమ్ ఫేర్, బుల్లితెర అవార్డులెన్నో ఆయన్ని
వరించాయి. రామాయణాన్ని మూడు ముక్కల్లో చెప్పమని అడిగిందెవరో నాకు తెలీదు గాని,
సిరివెన్నెల సీతారామాయణాన్ని మూడు రోజుల్లో వ్యాసంగా రాసివ్వమని అడిగింది మాత్రం
వాసిరెడ్డి నవీన్ గారే. కవిగా ఆయన పది పంక్తుల్లో ఒక పాట రాసిస్తారు గాని ఆయన
పాటని విశ్లేషించాలంటే పాటకో పేజీ అయినా కావాలి. అలాంటిది మూడు వేల పైచిలుకు
పాటలు, శివ దర్పణం వంటి ఇంకా ఎన్నోకవితలూ వ్యాసాలూ శ్లోకాలూ రాసిన సిరివెన్నెల
గురించి ఒక్క వ్యాసంలో ఇమిడ్చే ప్రయత్నం హాస్యాస్పదం. అయినా ‘కొండ
అద్దమందు..’అన్నట్టు ఒక చిన్న ప్రయత్నం చేశాను. గత మూడేళ్లుగా నంది అవార్డులు
ప్రకటించడం జరగలేదు గాని శాస్త్రి గారు ఈ మూడేళ్లలో సృజించిన పాటలెన్నో ఆ
పురస్కారానికే వన్నె తేగలవి ఉన్నాయి. సిరివెన్నెలలో ఆయన పాటల వేణువూదుతుంటే
ఆలమందలా నందులెన్నో ఆయన్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. ఆ గీతామృతం అందుకునే
భాగ్యం మనదే.
ఒక గీత రచయితగా తన గీతాలనిండా సురభిళ పదగుచ్ఛాలను కూర్చినా, ఆహ్లాద
చంద్రికలను పేర్చినా, ప్రపంచమంతటా అలముకుంటున్న విద్వేషాన్నీ, అశాంతినీ, మానవజీవితాలలోని
కల్లోలాన్నీ తలచి వేదనలో, శోధనలో మునిగిపోయే మానవతా వాది శాస్త్రి గారు. విస్తారమైన
పదసంపద, అనర్గళ వాగ్ఝరీ ఆయన సొత్తు కావడంతో అవకాశం దొరికినపుడల్లా పాఠకులతో, ప్రేక్షకులతో
అంతర్జాలం ద్వారా ముఖాముఖిగా ముచ్చటిస్తూ ‘తన కవితాధార తనది మాత్రమే కాదనీ దాన్ని ఆస్వాదించే
ప్రతి మనిషిదీ’ అని చెప్పి తన టార్గెట్ ఆడియెన్స్ ని తనదైన ఒక బృందంగా సమకూర్చుకుంటూ,
‘మనని మనం సంస్కరించుకుంటూ, ఈ మాలిన్యాన్ని వదిలించుకుంటూ మరొక మెరుగైన ప్రపంచాన్ని
నిర్మించుకుందా’మని అభ్యర్ధించే ఆశావాది. ఇవాల్టి సినీ గీత రచయితల్లో అత్యధిక ప్రాధాన్యతని
పొందుతున్న రచయితగా ‘చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష’ అంటూ సేఫ్ జోన్ లో నిలిచిపోకుండా
తన పాఠకులతో ఒక ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరచుకుంటూ వారితో సంభాషిస్తూ ‘ఇది కాదు జీవించే
విధానం, దీన్ని మించిన ఉన్నతమైన మానవ జీవన ప్రమాణాలున్నాయి. అక్కడికి పయనమై వెళదాం,
ఇంతకన్నా సుహృద్భావ సమన్వితమైన సమాజాన్ని నిర్మించుకుందాం’ అని ప్రతిపాదించే వైతాళికుడాయన.
సినిమాకి ఎంత జనాకర్షణ ఉన్నా సినిమా పాట సాహిత్యం పట్ల
సాహితీవేత్తలూ, కవుల్లో కొంత చులకన భావం కనపడడం పరిపాటి. గేయ
రచయితగా ఎంత పేరు సంపాదించుకున్నా కవులుగా తమని నిరూపించుకోవడానికి వారు ఇతర
సాహితీ ప్రక్రియల్లో ప్రయత్నించాల్సి వస్తూ ఉంటుంది. కేవలం సినీగీతాల రచన తోనే ఒక
మహోన్నత స్థానాన్ని సంపాదించుకుని, తన ఉనికిని కాపాడుకుంటూ,
తను నమ్మిన సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా తెలుగు సాహిత్య
చరిత్రలో ఒక తారాస్థాయికి చేరుకొని అక్కడ దశాబ్దాల తరబడి నిలకడగా నిలబడగలగడం అసాధారణమని చెప్పక తప్పదు. సినిమాలోని
సన్నివేశానికి అతికేలా పాటని రాస్తూనే, సమాజానికవసరమైన
సందేశాన్ని అందించగలగడం సామాన్యమైన విషయం కాదు. సినీ గీతరచనలో ఆయన అడుగిడని విభాగం
లేదు. ఒకే భావాన్ని అనేక సినిమాల్లో మళ్లీ మళ్లీ రాయాల్సి వచ్చినా ఎన్నుకునే
పదసమూహాల్లోనూ, గతిలోనూ మార్పు చేస్తూ కొత్త అద్భుతాలని
ఆవిష్కరిస్తూ కొన్ని వేల పాటలు రాశారు.
‘మూడు దశాబ్దాల నిరంతర సాహితీ యాత్రకి ఫలంగా పద్మశ్రీ రాలేదని బాధ
పడ్డారా’ అన్న ప్రశ్నకి ‘మెడల్ కోసం మెడలు వంచడం నాకు చేత కాదు’ అన్న శాస్త్రి గారు
ఏ సినిమా కోసం రాసినా తల ఎత్తుకు తిరగ్గలిగే సాహిత్యాన్నే సృజించారు. ‘కావ్యేషు నాటకం
రమ్యం అన్న వాక్యానికి పరిపూర్ణ రూపం సినిమా. అలాంటి సినిమాలో ఒక భాగమైనందుకు ఎప్పుడూ
గర్విస్తా’నని చెప్పుకునే సిరివెన్నెల, పాలనీ నీటినీ సులువుగా వేరు చేయగల రాయంచ. ప్రచండతాపాన్ని
తానందుకుని సిరివెన్నెలని మనకందించగల చందమామ. తనను తాను తిట్టుకున్నట్టుగా ఎవరూ తనని
తిట్టలేరనీ, తనని తాను మెచ్చుకున్నట్టుగా ఎవరూ తనని మెచ్చుకోలేరనీ చెపుతూ, మనిషిగా
ఎదగాలంటే ఎవరిని వారే విమర్శించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని చెప్పే శాస్త్రిగారు
నిరంతరం చేసే పని అదే. తనలోని కవిని తాత్వికుడూ, ఆ తాత్వికుణ్ని మనిషీ డామినేట్ చేస్తాడని
చెప్తూ మనిషితనానికే పెద్దపీట వేసే సిరివెన్నెల వ్యక్తిగా ఎంత ఉన్నతులో ఆయన్నెరిగిన
వారందరికీ తెలిసిన విషయమే. దిగజారిన పాత్రల మీద పాటలు రాసేటపుడు
కూడా తన విలువలని దిగజారనీయని కవి శాస్త్రిగారు.
ఉన్నతమైన తన ప్రమాణాలద్వారా ఆయన సినిమా రంగంలో తన
తోటి రచయితలకీ, తన తరవాతి తరాల రచయితలకీ మార్గ నిర్దేశనం
చేశారంటే అతిశయోక్తి కాదు.
వేటూరి సుందర రామమూర్తి గారి గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు
తెలుగు భాష పునర్వైభవానికి దారి తీసే మార్గదర్శక సూత్రాలు కూడా. ‘పాల
పళ్ళు కూడా ఊడని పసిప్రాయంలోనే భారత భాగవతాలూ, భగవద్గీత,
ప్రాచీన పద్యవాజ్ఞ్మయం, దాశరధీ శతకాది శతకాలూ,
భర్తృహరి సుభాషితాలు, అమరకోశం, పెద్దబాలశిక్ష…. ఇంకా ఇలాంటి వన్నీ కంఠతా పట్టించిన
మన తెలుగింటి విద్యాబోధన- తరాలు మారుతున్న కొద్దీ ఏ విధంగా ‘చిన్న’బోతోందో గమనిస్తే, ఇంట్లో, వీధుల్లో,
పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలా అన్ని చోట్లా మన పిల్లలకి ఎలాంటి మాటతీరు
అలవడుతుందో అర్థం చేసుకోగలిగితే, క్రమక్రమంగా ‘గ్రంధ పఠనం’, ‘అధ్యయనం’ , ‘వినడం’
లాంటి ‘కసరత్తు’ కరువై,
దంతాలూ, జిహ్వా, స్వరతంత్రులూ,
అన్నీ సత్తువుడిగి, దివ్యభాషాపీయూషాస్వాదనకి
అనర్హమై, పలుకులు నత్తినత్తిగా, నంగినంగిగా
తయారై, ఆంధ్రభాష ఎలాంటి దుర్దశకి లోనైందో గుర్తిస్తే,
ఈనాటి అవకతవక శిక్షణ మనకి ఎంత ‘పెద్ద’ బాల ‘శిక్ష’ గా పరిణమించిందో
అని బాధపడగలిగితే, మనం ఏ సంపదని కోల్పోతున్నామో తెలుస్తుంది.
పండితులు, పెద్దలు, భాషావేత్తలు,
విజ్ఞులు, కవులూ ఈ పరిస్థితిని
ఉపేక్షిస్తున్నారు.
‘గొప్ప భావాలను కూడా చిన్న మాటల్లో చెప్పగలగడం చాలా గొప్ప విషయం’
అన్న అభిప్రాయం తప్పని ఎవరూ అనరు. అది నిజంగా గొప్పే. కాని, ఆ అభిప్రాయం అంతకంతకూ బలం పుంజుకుంటూ ఒక నిజాన్ని విస్మరిస్తోంది.
కేవలం నాదం ద్వారానే ప్రాణనాడుల్ని
మీటగలిగే సత్తా ఉన్న ఆంధ్రవాణిలోని వేదతుల్యమైన నాదమహిమని అలక్ష్యం చేయడం ద్వారా
మనం, ‘భాషకి
అందని భావం లేదు’ అనే ఐశ్వర్యాన్ని వదులుకుని, ‘ఏ భాషకీ అందనిదే భావం’ అని అనుకోవలసిన
దారిద్ర్యాన్ని వరిస్తున్నాం. ‘అందరికీ అర్థం కావడం’ అనే లక్ష్యం కోసం, సినిమా పాట రాన్రానూ ఓ అరవై
డెబ్భె మాటలకి పరిమితమై పోతోంది. ‘అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు’ అని తెలుసుకుంటే – ‘ఏవో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచి పోతున్నాయి కదా,
ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి,
భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం’ అనుకునే
విపరీత ధోరణి మానుకుంటే – మనకి అర్థం అయేలా మనకి
అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప
విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం’ అంటూ చేంబోలు
సీతారామశాస్త్రి గారు, అదే.. మన సిరివెన్నెల చేసిన సూచన, భాషద్వారా తన సంస్కృతిని
పదిలపరచుకోవాలనుకునే తెలుగు జాతికి సరైనదారి చూపే వెలుగు దివ్వె.
***