June 28, 2019

'ఛాయా మార్గం'- వారణాసి నాగలక్ష్మి



                                                             ఛాయా మార్గం
           
                                                                                      
         
              అబ్బూరి ఛాయాదేవి గారు గోదావరీ తీరాన రాజమండ్రిలో 1933వ సంవత్సరం అక్టోబర్ 13 న జన్మించారు. కుటుంబ వ్యవస్థలోని పురుషాధిక్యత, స్త్రీల పట్ల సమాజంలో కనిపించే వివక్ష, వివాహ వ్యవస్థలో స్త్రీ ఎదుర్కొంటున్న అసమానత, వృత్తి ఉద్యోగాల్లో తరచుగా స్త్రీలు ఎదుర్కోవలసి వస్తున్న వ్యతిరేకత, లైంగిక హింస -- వ్యవస్థలోని ఈ లోపాల పట్ల తన అసమ్మతిని కథా సాహిత్యంలో ప్రతిభావంతంగా వ్యక్తపరిచిన తెలుగు రచయిత్రులలో ఈమెది ప్రథమ శ్రేణి అని చెప్పవచ్చు. అరవయ్యవ దశకంలో  ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలొ లైబ్రేరియన్ గానూ, 1998 నుండి 2002 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యురాలు గానూ తమ సేవలందించిన ఈమెకు  1996 లో తెలుగు విశ్వ విద్యాలయం నుండి 'రచయిత్రి ఉత్తమ రచన' పురస్కారం, సుశీలా నారాయణ రెడ్డి స్మారక సాహితీ పురస్కారం, 2000 లో కళాసాగర్ సాహితీ పురస్కారం, అభినందన 'దుర్గాబాయ్   దేశ్ ముఖ్ ' పురస్కారం, పీవీ నరసింహారావు మెమోరియల్ స్వర్ణ కంకణం, 2003లో రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 2009 లో కలైంజర్ ఎమ్ కరుణానిధి పోర్ట్ లీ పురస్కారం, 2010 లో 'రంగవల్లి స్మారక పురస్కారం' , 2011 లో అజో విభో కందాళం యు.ఎస్.ఏ వారి 'ప్రతిభా మూర్తి పురస్కారం' లభించాయి.
          2005 వ సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించిన శ్రీమతి అబ్బూరి చాయాదేవి 'తన మార్గం' కథా సంపుటి లో 28 కథలున్నాయి. ముందుమాటలో, తన కథలు చాలా మటుకు కుటుంబంలోనూ, సమాజం లోనూ తాను చూసిన స్థితిగతుల గురించీ, స్త్రీ పురుష వివక్ష గురించీ రాసినవే అనీ, తన తోటి స్త్రీల అనుభవాలను కూడా తనకు జరిగినట్లుగానే స్పందించి ఎక్కువగా ఉత్తమ పురుషలోనే రాశాననీ  ఛాయాదేవి గారు చెప్పుకున్నారు. మధ్యతరగతి కుటుంబనేపథ్యంలో,  స్త్రీ  విద్యావతి అయినా కూడా ఆమెకి ఎదురయ్యే సమస్యలను, ఆమె మానసిక స్థితిని, భావోద్వేగాలను చక్కని సమన్వయంతో  కథలుగా మలచి, 1965  నుంచి  2001 వరకు  ప్రచురించ బడ్డ కథలని 'తన మార్గం' కథా సంపుటిగా వెలువరించారు . దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో మధ్యతరగతి స్త్రీల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులను, ఘర్షణ లేకుండా కుటుంబజీవనం సాగాలని ప్రయత్నించే స్త్రీ వ్యక్తిగతంగా కోల్పోయే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను, పురుషాధిక్య సమాజంలో స్త్రీ ఎదుర్కొనే మానసిక సంక్షోభాన్నీ ఈ కథలు ప్రతిభావంతంగా ప్రదర్శిస్తాయి.

           యాభయ్యవదశకంలో 'భర్తనెలాఎన్నుకోవాలి' అన్నఅంశంమీద రేడియోలో ప్రసంగించినపుడు, ఛాయాదేవిగారికి 'ఎలాంటి వ్యక్తిని చేసుకుంటా'వన్న ప్రశ్న ఎదురైంది. కట్నంతీసుకోనివాడు, నవ్వించేవాడు, నవ్వనిచ్చేవాడు అయిన వ్యక్తి చేసుకుంటా"నని సమాధానం ఇచ్చిన ఆమె, అటువంటి వ్యక్తినే వివాహమాడారు. అబ్బూరి వరద రాజేశ్వరరావు గారిలో ఆమెకు వరద గోదావరిలా 'గల గలా నవ్విస్తూ, నవ్వనిచ్చే' భర్త లభించారు. నిశిత పరిశీలనా దృష్టి నిండిన ఆమె కథా రచనకు ఆయన సాహచర్యంలో సునిశిత హాస్యం, మృదువైన వ్యంగ్యం తోడయ్యాయి.  తండ్రి నిస్సంగత్వం, వదినగారి రచనా వ్యాసంగపు ప్రేరణ, అన్నగారి హేతువాద ధోరణి, ఉన్నత విద్య నేర్పిన విశాల దృక్పథం, మామగారి నించి, భర్త నించి వచ్చిన సాహితీ ప్రియత్వం, లైబ్రేరియన్ ఉద్యోగంలో అందిన ప్రపంచ సాహితీ సాంగత్యం... అన్నీ ఆమె రచనా వ్యాసంగానికి మెరుగులు దిద్దాయి. 

              రచనా కాలం అంతర్జాల యుగానికి ముందు కాలం. చదువుకున్న స్త్రీ ఇంటికే పరిమితమై పోవలసిన పరిస్థితి వచ్చినపుడు ఆమెకెదురయ్యే అస్తిత్వ, ఆర్ధిక, మానసిక సమస్యల్ని, ఎంత చదువుకున్న స్త్రీ అయినా పెళ్లయ్యాక భర్తకి నీడలా బతకాల్సిరావడాన్ని, ఛాయాదేవి గారి కథలు చర్చించాయి. అప్పటివరకు అలా బతకడాన్ని సహజంగా భావించిన వాతావరణంలో 'సమాజం ఇలా ఎందుకుంది ?' అనే ప్రశ్నసంధించడమే ఒక విశేషం కాగా తను జీవిస్తున్న సమాజంలోని సగటు స్త్రీలకన్నా ఎంతో ముందుకి నడచిన అభ్యుదయ దృక్పథాన్ని రచయిత్రి తన కథల్లో ప్రదర్శించారు.

             ఈ కథల ఇతివృత్తాలు విభిన్నమైనవీ, సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేవీ అయినప్పటికీ ఆ కాలంలో అత్యంత సాధారణంగా కనిపించిన సామాజిక రుగ్మతలు ఈ కథల్లో కనిపించవు. శారీరక హింస, వరకట్నపు వేధింపులు, తాగుబోతు భర్తలు, హత్యలు, ఆత్మ హత్యలు, అత్తింట్లో కోడలి కిరోసిన్ చావులు, ఇవేవీ ఈ కథల్లో వస్తువులు కావు. శరీరాన్ని జలదరింపజేసే అనాగరికత, క్రూరత్వం ఈ కథల్లో కనపడదు. 

            ఛాయాదేవిగారెన్నుకున్న ఇతివృత్తాలు వేరే స్థాయికి చెందినవి, కథన కౌశలం ఆ స్థాయికి తగినది. సమాజంలో నాగరికులుగా పరిగణించబడే సమూహాల్లో కూడా స్త్రీ ఎలాంటి వేదనకి గురవుతోందో, ఆమె దృక్పధంలోనూ, ఆమెతో సహజీవనం చేసే పురుషుడి దృక్పథంలోనూ, ఆమె పనిచేసే సంస్థలూ, వ్యవస్థల్లోనూ ఎలాంటి మార్పు రావలసిన అవసరం ఉందో ఈ కథలు సున్నితంగా తెలియజేస్తాయి. కుటుంబ వ్యవస్థ పట్లా, వైవాహిక బంధం పట్లా, సమాజంలోని స్నేహబంధాల పట్లా రచయిత్రికి గల సదభిప్రాయం ఆమె రచనల్లో వ్యక్తమవుతుంది. ఆ బంధాలలో, ఆ వ్యవస్థలో రావలసిన మౌలికమైన మార్పులని స్పృశించడంలో ఆమె కనపరచిన సున్నితత్వమే, ఆమెని పాఠకులకు దగ్గరయేలా చేసి, వారి మనసులో గాఢమైన ముద్ర వేసేందుకు దోహదపడిందని చెప్పవచ్చు. 

             మంచికథ సమాజంలోని అంతర్గతమైన అలజడినీ, వైరుధ్యాన్నీ చూపించగలగాలి. వార్తాపత్రికల్లాగా విషయాన్ని వివరిస్తే సరిపోదు. కేవలం సమకాలీన సమాజాన్ని కథల్లో ప్రతిబింబింపజేస్తే చాలదు. సమాజంలోని  వైరుధ్యాన్నీ, అలజడినీ వ్యక్త పరుస్తూ, కథ చదివిన వ్యక్తి చూపు మరింత సంస్కారవంతంగా మారేలా, భావాలలో చైతన్యం నిండేలా చేయగలిగితేనే ఆ కథ మంచికథ అవుతుంది.

            సంస్కృతి, సంప్రదాయం జనసామాన్యపు ఆచార వ్యవహారాల్లో భాగంగా కొనసాగుతూనే ఉంటాయి.  ఆ అలవాట్లలో,  నమ్మకాలలో, విధి విధానాల్లో కాలానుగుణంగా రావలసిన మార్పుల్ని సూచించి, సమాజ హితానికి తోడ్పడేలా పనిచేసేదే సాహిత్యం.  ఇతివృత్తం ఎంత గొప్పదైనా దాని వెనుక ఉన్న తాత్త్వికతని స్పర్శించలేని కథ గొప్పకథ కాలేదు. ధ్వనికీ, శ్రావ్యమైన సంగీతానికీ ఉన్న భేదం లాంటిదే కథకీ , మంచికథకీ ఉండే భేదం. చాయాదేవిగారి కథన శైలి పాఠకులా భేదాన్ని అనుభూతించగలిగేలా, ఆ కథామృతాన్ని ఆస్వాదించగలిగేలా చేస్తుంది.

               ఈ సంపుటిలోని కథల్లో మొదటిదైన 'ప్రయాణం' కథ నిడివిని బట్టి పెద్దకథగా చెప్పుకోవచ్చు. ఇది 1965 లో రచించినది. 'శీలం' అన్న పదం కేవలం స్త్రీలకి సంబంధించినదిగా ప్రస్తావించబడే కాలంలో, అత్యా చారానికి గురైన స్త్రీకి ఆత్మహత్య లేదా వివాహ యోగ్యతలేని ఒంటరి జీవితం పరిష్కారాలుగా చూపించే కాలంలో, రచయిత్రి ఈ కథని నడిపిన తీరు చూస్తే,  స్త్రీవాదం బలంగా రూపుదిద్దుకోవడానికి ఎంతో ముందే ఈ కథ ద్వారా ఆమె చూపించిన దార్శనికత ఆశ్చర్యం గొలుపుతుంది.

           'ప్రయాణం' శీర్షిక కూడా ఈ కథకి అర్థవంతంగా అమరింది. మూర్తిని ప్రేమించిన రమ, తల్లీతండ్రీ శేఖరంతో కుదిర్చిన సంబంధాన్ని కాదంటుంది. ఇంట్లోవాళ్ళ ప్రతికూలతని ఎదుర్కొని, రైలెక్కి వాల్తేరులో హాస్టల్ కి బయల్దేరుతుంది. దారిలో రాజమండ్రిలో స్నేహితురాలు సుధ కనపడి, ఒకరోజు తనతో ఉండమని బతిమాలి తీసుకెడుతుంది. ఆ రాత్రి ఆమె భర్త, రమపై అత్యాచారం చేస్తాడు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్యనభ్యసించి, అభ్యుదయ మార్గంలో నడుస్తున్న యువతి, అనుకోని విధంగా అత్యాచారానికి గురైనపుడు ఎలా స్పందిస్తుందో, ఎలాంటి భావ సంచలనానికి గురవుతుందో, రమ పాత్ర ద్వారా చూపించడంలో రచయిత్రి  గొప్ప ప్రతిభ ప్రదర్శించారు. 

             మర్నాడు సుధ వెంట వచ్చి రమని రైలెక్కిస్తుంది. ప్రయాణంలో ' పుండు మీద ముసిరే ఈగల్లాంటి ' ఆలోచనల్తో, మానసిక వేదనతో సతమతమై చివరికి రైల్లో పరిచయమైన సాధువు మార్గదర్శకత్వంలో సన్యాసం పుచ్చుకోవాలని నిశ్చయించుకుంటుంది రమ. వాల్తేరు చేరాక మూర్తి బలవంతంమీద జరిగినదంతా అతనికి చెపుతుంది. అప్పటిదాకా ఆమె తోడులేనిదే బతకలేనన్న అతడు ' నీళ్ళలో పడ్డ ఎలక లాగా, బయటికి రాలేక, నీటిలో నిలవలేకా గిలగిలలాడతాడు'. చివరికి సన్యా స మార్గంలో సాగిపోవాలనుకున్న రమకి రైల్వే స్టేషన్ లో ఎదురైన శేఖరం, కొద్దిసేపు ఆమెతో మాట్లాడే అవకాశం ఇమ్మని అడిగి, ఆమె అపోహలన్నీ తీరుస్తాడు.   

            తను సరైన దారిలో పోతున్నా రాంగ్ రూట్ లో ఎదురొచ్చిన వాహనం, తన వాహనాన్ని ఢీ కొడితే, దాన్ని తన తప్పుగా భావించనట్టే , స్త్రీ ప్రమేయం లేకుండానే ఆమె శరీరం మీద దాడి జరిగినపుడు దాన్ని 'శీల భంగం' గా భావించడం సరి కాదనే అవగాహన, భావ చైతన్యం, శేఖరం పాత్ర ద్వారా ఈ కథలో ప్రదర్శితమవుతుంది.  స్త్రీ పురుషుల మధ్య ప్రేమ తొలిచూపులోనే జనిస్తుందనే పాప్యులర్ భావనకి శస్త్ర చికిత్స చేస్తూ శేఖరం ఇలా అంటాడు "... చూడగానే కలిగే భావం ప్రేమ కాదు. పైపై పరిచయాలతో ఏర్పడే స్నేహమూ ప్రేమ కాదు. అది మోహమైనా అవుతుంది. ఆకర్షణ అయినా అవుతుంది....ఏదో ఒక ధ్యేయం పెట్టుకుని సహజీవనం చెయ్యటంలో ప్రేమ అవిర్భవించి, క్రమ క్రమంగా విస్తృతమవుతుంది. అల్ప విషయాలలో వచ్చే మనస్పర్ధలకు అప్పుడు విలువ ఉండదు. అటువంటి ప్రేమ అన్ని ఒడిదుడుకులకూ తట్టుకోగలుగుతుంది"- యువతకి అవసరమైన ఒక చక్కని సందేశాన్ని శేఖరం చేత సందర్భోచితంగా చెప్పిస్తారు రచయిత్రి. 

            రమ రైలుకి బయల్దేరే సన్నివేశం, రైల్లో సాగిన ప్రయాణపు వర్ణన, దారిలో తారస పడ్డ స్నేహితురాలు, సాధువు, మూర్తిల ప్రవర్తన .... అత్యంత సహజంగా, ఆయా సంఘటనలని ప్రత్యక్షంగా చూస్తున్నట్టనిపించే కథనం తో పాఠకులని కథ వెంట పరుగులు తీయిస్తారు రచయిత్రి. కథాగమనాన్ని పరిపుష్టం చేసే  చిన్న చిన్న వివరాలు ఇస్తూనే అనవసర వివరాల విషయంలో క్లుప్తత పాటించడం వల్ల కథ వేగంగా సాగినట్టనిపిస్తుంది.

            ఒక కుతూహలాన్ని రేకెత్తించేలా ఎత్తుగడ మీద శ్రధ్ధ చూపించడం వల్లా, ఉత్తమ పురుష లో నడిచే కథలో పదాడంబరం లేకపోవడం వల్లా, పాఠకులు ప్రధాన పాత్రతో మమేకమై, కథలో లీనమైపోతారు. వస్తు వైవిధ్యంతో పాటు కథన శైలీ, శిల్పాలలోని విలక్షణత ఈ కథల్ని తెలుగులో వచ్చిన ఉత్తమ కథల సరసన నిలబెడుతుంది. మొదటిసారి చదివినపుడు కథాక్రమం, ముగింపు ఏమిటా అన్న ఉత్కంఠ, కథని చక చకా చదివించినా, మళ్ళీ చదివినపుడు సరళమైన పొందికైన వాక్యాల్లో రచయిత్రి పొదిగిన భావాలు పూలలో దాగిన పరిమళంలా గుప్పుమంటూ ఆహ్లాదం కలిగిస్తాయి. 

            ఉదాహరణకి, ఇంటి నుంచి మళ్ళీ హాస్టల్ కి బయల్దేరి వెళ్ళబోతున్న రమ, తండ్రి ఆగ్రహాన్నీ, తిరస్కారాన్నీ చూసి, ' .. నన్ను క్షమించండి  అని అడగడం అసందర్భంగా తోచింది .. ఆయన మీద  నాకు ప్రేమా, గౌరవం లేవని కాదు. నా మీద కూడా నాకు ప్రేమా, గౌరవం ఉన్నాయి. నేను చెయ్యదలచిన పని తప్పు కానపుదు, అది నా జీవితానికి సంబంధించిన ముఖ్యాంశం అయినపుడు, అమ్మ మనసు కష్టపెట్టుకుంటుందనీ, నాన్నగారు కోపగిస్తారనీ తలవొగ్గడం నాకు చాతకాదు' అనుకుంటుంది.  

               దుర్ఘటన తర్వాత నిశ్చేష్ట అయిన రమ స్వగతాన్ని వర్ణిస్తూ 'గోదావరిలో దూకుదామా అనుకున్నాను,  చీర కొంగుతో ఉరిపోసుకుందామా అనుకున్నాను - ఏదీ చెయ్యలేదు.... నేను మామూలు మనిషినయేట్లు ఏదన్నా జరిగితే బావుండు ననుకున్నాను...' అంటారు. ఆనాటి సమాజంలో ఆత్మహత్యే శరణ్యం అని సగటు యువతి భావించే పరిస్థితిలో రమ ఆలోచనాధోరణిలో ఒక ధీరత్వం స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. 

            ' పోనీ సుధ మాట్లాడదేం ? తెలుసునా ? తెలిస్తే ఎందుకు ఊరుకుంది? ముందే తెలుసా? తరువాత తెలిసిందా? ముందే తెలిస్తే ఎలా ఒప్పుకుంది ? తరువాత ఎలా తెలిసింది?'  -- ఇలాంటి వాక్యాలు, ఉత్తమ పురుషలో సాగే ప్రధాన పాత్ర మానసిక సంచలనాన్ని పాఠకుడికి సూటిగా చేరవేస్తాయి. చైతన్య స్రవంతిగా తర్వాతి కాలంలో మొదలైన కథన ప్రక్రియ, ఇక్కడే మనకి గోచరిస్తుంది.  

             మర్నాడు సుధ తోడుగా వచ్చి రమని రైలెక్కిస్తుంది. జరిగినదంతా సుధకి తెలుసని స్టేషన్ చేరాక రమకి తెలుస్తుంది. రమతో తన సంసారపు లోటుపాట్లని చెప్పుకుంటూ "స్వల్ప విషయంలోనైనా నన్ను నిర్లక్ష్యం చేస్తే నేను నిస్పృహ చెందిపోతాను... ఆయన్ని పదేపదే అడుగుతాను- నన్ను ప్రేమిస్తున్నారా, నేనంటే మీకు ప్రేమేనా అని " అంటుంది సుధ. భర్తే సర్వస్వం అని, అతడినే కేంద్రంగా చేసుకుని, వెన్నెముకలేని జీవితాలు గడిపే సగటు స్త్రీల ప్రతినిధిగా సుధ కనిపిస్తుంది.

             జరిగినదంతా రమ, మూర్తికి చెప్పే సన్నివేశం ఎంతో సహజంగా, ఆర్ద్రంగా చిత్రిస్తారు రచయిత్రి. వివాహమే వద్దనుకుని సన్యాసం పుచ్చుకుందామని నిర్ణయించుకున్నా కూడా, విషయం తెలిశాక మూర్తి ప్రవర్తించిన తీరుకి కుంగిపోతుంది రమ 'అనుకున్నదే తీరా జరిగేటప్పటికి  అంతులేని బాధ అంతరాంతరాల్లో. ఇంకా మూర్తి నన్ను అర్ధం చేసుకుని వివాహం చేసుకుంటాడనే  కొన ఊపిరితో ఉండడం వల్లనా? అతనిపై ఆశ నాలో ఓ మూల స్థావరం ఏర్పరచుకుని ఉండడాన్ని నేను అణుమాత్రమైనా గ్రహించలేదా ? లేదా గ్రహించీ, నన్ను నేను మభ్యపెట్టుకోజూచానా? ' అని వేదనతో కుమిలిపోతుంది. తన రచనల్లోని పాత్రల అంతరంగ సంక్షోభాన్ని చిత్రీకరించడంలో రచయిత్రి అసాధారణ ప్రతిభ చూపారనడానికి ఇలాంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి.

             చదువుకుని ఉద్యోగం చేస్తున్న యువతి పెళ్ళి చేసుకోగానే, భర్తే కేంద్రంగా తిరిగే ఉపగ్రహంలా మారిపోవడాన్ని, ఆ మార్పు వల్ల ఆమె ఎదుర్కోవలసి వచ్చే నిరాశ, నిరాదరణల్ని 'ఉపగ్రహం' కథలో చిత్రిస్తారు రచయిత్రి. ఈ పరిణామం వెనక ఆడపిల్లల పెంపకంలో, వాళ్ళ ఆలోచనల్ని పెద్దలు నియంత్రించే విధానంలో ఉన్న లోపాన్ని ఎత్తిచూపిస్తారు.

          ' భోజనమైపోయి ఆయన వక్కపొడి వేసుకుంటున్నపుడైనా వంటకాల గురించి రెండు ముక్కలు ఏమయినా అంటారేమో' అని ఎదురు చూసి, చివరికి "చారు బాగా కుదిరిందా?" అని అడుగుతుంది నాయకి. "లేకపోతే చెప్పేవాణ్ణిగా" అంటాడామె భర్త. చన్నీళ్ళు మీద పోసినట్టవుతుందామెకు.  'మర్నాడు మళ్ళీ అదే కార్యక్రమం. పొద్దున్న పాలవాడు బెల్ కొట్టడంతో ప్రారంభమైన పని, రాత్రి ఆయన అటు తిరిగి పడుకోవడంతో ఆఖరు' 'ఆయన కోరుకున్న విధంగా అన్నీ అమరుతున్నాయి.... నేను ఆయన జీవితంలో కేవలం మరొక అదనపు సౌఖ్యాన్ని మాత్రమేనా? ' అని వేదనకి లోనవుతుందామె. 

          సరదాగా ఒక సినిమాకి వెళ్ళాలని భార్య కోరిన కోరికకి  "ఆదివారం అప్పటికప్పుడు వెళితే టికట్లు దొరకడానికి మీ అమ్మమ్మగారి ఊరనుకున్నావా?" అని కొట్టిపారేస్తాడు భర్త. తర్వాతి ఆదివారానికి ఆమె ముందుగానే టికెట్లు తెప్పించి ఉంచుతుంది. "మీరలా తప్పించుకుంటారని నాకు తెలుసు" అంటూ గర్వంగా టికెట్లు తీసి చూపిస్తుంది. వెంటనే నల్లి కుట్టినట్టు లేచి కూర్చుని "ఎందుకిలా నన్ను హింసిస్తావ్? మూడు గంటలు కూర్చుని నేనా వెధవ సినిమాలు భరించలేను" అంటాడతను. మాటా మాటా వచ్చి "నన్ను నీ కొంగుకి ముడేసుకోవాలని చూస్తావు" అని అతను అన్నపుడు "నా కొంగుకి ముడేసుకోగలదాన్నైతే మీ చుట్టూ ఉపగ్రహంలా ఎందుకు తిరుగుతాను?" అని దుఃఖ పడుతుందామె. ఈ కథ చదివిన ఎందరో స్త్రీలు అమెతో తమని పోల్చుకోకుండా ఉండలేరు. భర్త కోసం, పిల్లల కోసం తన ప్రాధమ్యాలన్నీ మార్చుకున్న స్త్రీ, తనకోసం వారి ప్రాధమ్యాలు ఏమీ మారనప్పుడు పొందే బాధని ఈ కథలో సున్నితంగా చూపిస్తారు. 

           బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు విశ్రాంతి లేని జీవితం గడిపే స్త్రీలు సుఖవంతమైన నిద్ర కోసం ఎంతగా తపిస్తారో చెప్పే 'సుఖాంతం' కథలో, తీరా తీరుబాటు లభించే సమయానికి నిద్రమాత్ర వేసుకున్నా కంటి మీదికి కునుకే రాని స్థితి ఎదురవుతుంది, మలి వయసులోని కథా నాయకికి. హాయిగా నిద్ర పోవాలనే గాఢమైన కోరికతో చివరికి గుప్పెడు నిద్రమాత్రల్ని తీసుకుని, భర్తకి చిన్న ఉత్తరం రాసి పెడుతుంది ఆమె - ' ఏమండీ, కంగారు పడకండి. నిద్రపోతున్నానంతే. ఆత్మహత్య చేసుకున్నానని అపార్ధం చేసుకోకండి' అని. ఆమె కోరుకున్న నిద్ర ఆమెకి లభించినందువల్ల ఆ కథకు 'సుఖాంతం' అనే పేరు సరిపోయినా, నిజానికి సగటు స్త్రీ ఎదుర్కొనే దయనీయ పరిస్థితికి అద్దం పట్టిన కథ అది.

          మూడునాళ్ళ ముచ్చట కథ లో,  స్త్రీల నెలసరి సమస్యని చుట్టి ఉన్న మూఢాచారాన్ని వస్తువుగా తీసుకుని, స్త్రీల మనస్తత్వంలో రావలసిన మార్పుని సూచిస్తారు రచయిత్రి. 'స్వల్ప విషయాల గురించి కూడా అదేపనిగా ఆలోచించి బాధ పడతావు. ఒక పక్క పెద్ద వాళ్ళన్నా, ఆచార వ్యవహారాలన్నాగౌరవమూ, భయమూ. మరో పక్క నీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని పట్టుదల. ఈ రెండిటి మధ్యా నలిగిపోతున్నావు. నవ్య మార్గాన్నీ నీకు నచ్చిన మార్గాన్నీ అనుసరించాలంటే, ధైర్యం చేసి పెద్దవాళ్ళకి ఎదురు తిరగటం తప్పదు' అని సముదాయిస్తాడామె భర్త. 

           పెద్ద వృక్షాన్ని తనలో దాచిన చిన్న విత్తులాంటి  ' బోన్ సాయ్ బతుకు' కథ, ఈ సంపుటిలోని కథలన్నిటిలో తలమానికమైనదని చెప్పవచ్చు. అయిదు పేజీల చిన్న కథలో ఆడపిల్లల పెంపకానికీ, వారి పరాధీనతకీ గల సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు  ఛాయాదేవి గారు. చదువు చెప్పించకుండా చిన్నతనంలోనే పెళ్లి చేసి పంపేసిన అక్కగారు, పెద్ద చదువు చదివి ఉద్యోగం చేసుకుంటూ ఢిల్లీలో ఉంటూన్న చెల్లెలి ఇంటికి వచ్చి, అక్కడ కుండీలలో పెంచుతున్న వృక్షాలని చూసి, "నిక్షేపంలా కింద పెరట్లో పెరగాల్సిన చెట్లని పూలమొక్కల్లా కుండీల్లో వేస్తే అవి ఎట్లా పెరుగుతాయే!" అని ఆశ్చర్య పోతుంది, బాధ పడుతుంది.

          అంతలోనే గాలి దుమారం రేగి వర్షం ముంచుకొచ్చేసరికి, కుండీల్లోని బోన్ సాయ్ మొక్కల్ని చెల్లెలు చూరు కిందకి లాగుతుంటే, వీధిలోని  పెద్ద తురాయి చెట్టు కింద తలదాచుకుంటున్న జనాన్ని తన చెల్లెలికి చూపిస్తుంది అక్క. 'బయట విశాలంగా, స్వేచ్ఛగా పెరిగిన తురాయి చెట్టు ఎంత గాలిదుమారం వచ్చినా చెక్కు చెదరక పోగా పదిమందికి ఆసరా ఇవ్వగలుగుతుందనీ, ‘అపురూపంగా కుండీలో పెంచిన మర్రిచెట్టులాంటి మహావృక్షాన్ని వెయ్యికళ్ళతో కాపాడవలసి వస్తుంద'నీ అంటూ, మగవాడికీ, ఆడదానికీ మధ్య పెంపకంలోని తేడావల్లనే ఆడదాని బతుకు కూడా బోన్ సాయ్ మాదిరిగా అయిందని చెపుతుంది. 'తనే ఒకరి మీద ఆధార పడినపుడు మరొకరికి నీడ కూడా ఎలా ఇవ్వగలద'ని ప్రశ్నిస్తుంది. 

           నిర్దేశించిన పరిధి దాటి ఒక్క అంగుళం కూడా పెరగకుండా, ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ పెంచే బోన్ సాయ్ వృక్షాల మాదిరి గానే, రకరకాల ఆంక్షల మధ్య, కట్టడుల మధ్య పెంచడం వల్లనే మహా వృక్షాల్లా విస్తరించగల శక్తి ఉండీ, ఆడపిల్లలు మరుగుజ్జు వృక్షాలలాగా పరాధీనంగా, సంకోచ సందేహాల మధ్య జీవించవలసి వస్తోందని ఈ కథ సూచిస్తుంది. విశిష్టమైన ఈ కథను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2000 సంవత్సరంలో పదవ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది.

          'శ్రీమతి-ఉద్యోగిని' కథలో ఉద్యోగం చేసే స్త్రీలు ఇంటా బయటా తమ బాధ్యతలని నిర్వహించడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవాలని పరిశోధనకి వచ్చిన విద్యార్ధిని, ఉద్యోగిని అయిన శ్రీమతిని అనేక ప్రశ్నలు వేస్తుంది. సంసారంలో భార్యా భర్తల మధ్య అవగాహన సరిగా ఉండి, ఇంటి పని పంచుకు చేసుకునే పధ్ధతి ఉంటే, ఆ ఇంట్లో సమస్యలంతగా ఉండవనే ముగింపునిస్తారు చివరికి. కథనంలో చమత్కృతి ఆపకుండా చదివిస్తుంది. "మీవారిపై మీకెటువంటి భావం ఉంది?" అనడిగినపుడు 'ప్రేమా, గౌరవం' అనీ, "మీపై మీవారికి ఎటువంటి భావం ఉంది?" అన్నపుడు 'ప్రేమ, అధికారం' అని జవాబిస్తుంది నాయకి! 

         ' కర్త, కర్మ, క్రియ'  కథలో ఉద్యోగం చేసే స్త్రీలు కార్యాలయాల్లో ఎదుర్కొనే లైంగిక హింసనీ, అవమానాలనీ, కుంగుబాటునీ అత్యంత సరళంగా చిత్రీకరించారు రచయిత్రి. పై అధికారి  తనని శారీరకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తే వ్యతిరేకించిన వనజ, ఆమె మీద కసి పెంచుకుని ఆమె వృత్తి నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, అసభ్య వ్యాఖ్యానాలు చేస్తూ ఆమెని మానసికంగా వేధించే గౌరీశంకర్ ల మధ్య నడిచిన కథ ఇది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఎదుర్కోవలసి వచ్చే హింసల్లో ఇది చాలా బాధాకరమైనది. అవమానాన్ని దిగమింగి, తామే ఆయా సన్నివేశాలని వర్ణిస్తూ, సంబంధిత అధికారికి రిపోర్ట్ చెయ్యాలంటే ఏ స్త్రీకయినా అంతతేలికైన పని కాదు. రిపోర్ట్ చేయడానికి సందేహిస్తారు కాబట్టే తేలిగ్గా ఇలాంటి నీచానికి ఒడిగడుతుంటారు చపలబుద్ధి గల కుసంస్కారులు.

          ఈ కథలో తను ఎదుర్కొంటున్న అసలు సమస్యని వనజ నోరు విప్పి చెప్పలేకపోతుంది. తనకి రావలసిన ప్రొమోషన్ విషయంలోనూ, ఇతర వివక్షల విషయంలోనూ డైరెక్టర్ జనరల్ సారధికి అర్జీ పెట్టుకుంటుంది గాని పై అధికారి అసభ్య ప్రవర్తన గురించి చెప్పలేకపోతుంది. అందువల్ల ఆమెకి 'పని చేతకాద'ని పై అధికారికీ, 'అది పచ్చి భోగంది, దానితో తిరిగితే మీకు ఒరిగేదేముంది. శ్రధ్ధగా పనిచేస్తే మంచి పొజిషన్స్ వస్తాయ'ని ఆశపెడుతూ కిందివాళ్ళకీ చెప్తూ, ఆమెని కించపరుస్తూంటాడు గౌరీశంకర్. ఆమె గురించి తెలిసిన వాళ్ళు కూడా, ఆమెకి తోడుగా ఉంటే తమకేం ముప్పు వస్తుందో అని తప్పుకు తిరుగుతారు. 

        అలాంటి పరిస్థితుల్లో ఎంత వేదనకి గురైనా ముందుకి సాగి, పై అధికారికి పదే పదే అర్జీలు పెట్టుకుని, చివరికి పదోన్నతి సాధిస్తుంది వనజ. ఆమె విజయానికి కసితో రగిలిపోయినా,  పై చెయ్యి తనదే అని చూపించడానికి, ఆమెని పిలిపించి ఆర్డర్ కాగితం చేతికిస్తూ   " ఆ చేసేదేదో ఆయన్తో చేసే బదులు నాతోనే చేస్తే సరిపోయేదిగా " అంటాడు గౌరీ శంకర్. 1975 లో వచ్చిన ఈ కథని నాలుగు దశాబ్దాలు ముందుకి తీసుకు వస్తే ఈనాడు స్మార్ట్ ఫోన్ లలో, యువతులు ఎదుర్కుంటున్న అశ్లీల దృశ్యాల అప్ లోడింగ్ సంఘటనలు గుర్తొస్తాయి. తమపై 'ఫిర్యాదు చేస్తే ఈ వీడియోలు అప్లోడ్ చేస్తామ'ని బెదిరించి, అత్యాచారానికి గురైన యువతులని బ్లాక్ మెయిల్ చేసే నేరస్థుల సంఖ్య పెరుగుతోంది. సాంకేతికత దానికి సహాయం చేస్తోంది. నేరం చేసింది తామే అయినా, వంచితులైన వారు భయపడేలా, సమాజంలో స్త్రీల పట్ల ఉన్న వివక్షని నేరస్థులు తమకనుకూలంగా వాడుకుంటున్నారు.
             భర్త చనిపోతే  బాధను దిగమింగుకుని ముందుకు సాగాల్సిన స్త్రీకూడా, పరామర్శలంటూ వచ్చేవారికోసం తన దు:ఖాన్ని ప్రదర్శనకు పెట్టాల్సిన పరిస్థితిని చమత్కార ధోరణిలో చెప్పిన కథ 'నలుగురి కోసం'. దీపావళికి వారం ముందు చనిపోయిన మామయ్య భార్య,  చిన్నదీ, చక్కనిదీ అయిన అత్తయ్య కథ చెపుతూ పిట్టకథగా రాజకీయ నాయకులెవరైనా పోతే మీడియాలో వినిపించే శోకసంగీతాన్నిగురించి ప్రస్తావిస్తారు. 'ఇందిరమ్మ పోతే ఇంట్లో మనిషి పోయినట్టు బాధపడ్డవాళ్ళే, రోజూ ఏడుపుగొట్టు సంగీతం వినిపిస్తుంటే విసుక్కోవడం మొదలుపెడతారు.'...  'ఒకవేళ పేరున్నవిద్వాంసులచేత పాడిస్తే కొంప తీసి జనం ఆనందిస్తారేమోనని, ఊరూ పేరూ లేని వాళ్ళని పిలిపించి ఏడిపించారు....టీవీ న్యూస్ రీడర్లనీ ఎనౌన్సర్లనీ చూస్తే జాలేసింది. విచారంగా మొహం పెట్టకపోతే ఉద్యోగాలు పోతాయేమోనన్నంతగా బిగదీసుకుపోయారు' అంటూ చమత్కరిస్తారు.

           ఇంటి నిండా ఎలకలు స్వైర విహారం చేస్తుంటే ' మరీ ఇంత చాతకానితనం ఏమిటి ? ఓ పిల్లిని నాలుగు రోజులు ఇంట్లో వదిలేస్తే సరి" అని అత్తగారు అన్నపుడు, ' ఓ నాలుగు రోజులు మా ఇంటికి రావే అంటే ఏ పిల్లి వస్తుంది' అనుకుంటుంది కోడలు. చివరికెలాగో పిల్లిని పెంచుకుని, ఎలకలకి స్వస్తి చెప్పినా పిల్లి ఆగడాలు ఎక్కువైపోవడంతో " ఈ సారి అలాంటిదేదైనా జరిగితే, దాన్నీ నిన్నూ కూడా వీధిలోకి విసిరేస్తాను" అని వార్నింగ్ ఇచ్చి వెడతాడు భర్త. కథలో చిన్న మోతాదులోనే అయినా కుటుంబంలో స్త్రీ పురుష అసమానత కనిపిస్తుంది. పెంపుడు జంతువులని పెంచుకోవడం, ఒక వస్తువుని కొనితెచ్చుకోవడం లాంటిది కాదనీ, కావలసినపుడు వాడుకుని అక్కర్లేనపుడు బయట పడేసే వీలు ఉండదనీ , పిల్లల్లాగే పిల్లులకీ అల్లరీ, గారమూ, మంకుతనమూ, పెంచిన వారితో విడదీయరాని అనుబంధమూ ఉంటాయని  బ్రహ్మాస్త్రం కథ చెపుతుంది. 

          'స్పర్శ' కథలో, క్రమశిక్షణ పేర దూరంగా ఉంచడం వల్ల, తండ్రి స్పర్శ కోసం, ప్రేమ పూరితమైన పలకరింపు కోసం, ఆడపిల్లలు ఎలా తపించిపోతారో కళ్ళకి కట్టిస్తారు ఛాయా దేవి గారు. ముసలివాడై, కంటి చూపు తగ్గిపోయిన తండ్రి, స్పర్శ కోసం ఆరాట పడి, చూడాలని వచ్చిన కూతురి చేతిని ఆప్యాయంగా స్పృశిస్తుంటే కళ్ళనీళ్ళు తిరిగి, 'ఆయన ప్రేమ పూరితమైన స్పర్శ కోసం ఒకప్పుడు తపించిపోయానన్న సంగతి ఆయనకెప్పుడైనా స్ఫురించి ఉంటుందా?' అనుకుంటుంది నాయకి. చదువుతున్నపాఠకుల కళ్ళు కూడా చెమరించక మానవు.  

          వారం రోజుల్లో  'వెండి పండుగ' చేసుకోబోతున్న దంపతులు  ప్రొఫెసర్ గారు, ఆయన భార్యా. భర్త తన రిసెర్చ్ లో మునిగి ఉంటే, ఇంటి బాధ్యతంతా నిర్వహిస్తూ పాతికేళ్లూ సంసారాన్ని లాక్కొస్తుంది భార్య. వివాహ బంధానికి పాతికేళ్ళు నిండుతున్న సందర్భంగా ఉత్సవం జరుపుకోవాలని ఆమె ఆలోచిస్తున్న సమయంలో, భర్త తన విద్యార్ధినితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలుస్తుంది ఆమెకి. 'లేత నీలపు ఆకాశంలో అంతదాకా విరిసిన వెండి మబ్బు మాడిపోయి మసి పూసుకున్నట్లయింది. అంతవరకూ అంతెత్తున తేలియాడిన ఆ తెల్ల మబ్బుకి  నల్ల ముసుగు భారమై ఏ క్షణాన్నైనా కరిగి నీరై కురవబోతున్నట్టుంది' అంటూ పాతికేళ్ళు వచ్చినా పటిష్టతలేని వివాహ సౌధాన్ని తలచుకుని 'వెండి పండగేమిటి, వివాహమే దండగ'వుతుంటే అనుకుంటుందామె. భద్రత లేని వివాహ సౌధం 'పాతికేళ్ళు దాటినా కూలిపోకుండా నిలిచినందుకే వెండి పండగ చేసుకుంటారా' అని కలత చెందుతుంది.

           ఈ సంపుటి లోని మరో కలికితురాయి 'ఉడ్ రోజ్' కథ. ఇంటి చుట్టూ ఉన్నస్థలంలో సన్నజాజి లాంటి పూలతీగలో, గుమ్మడి లాంటి కాయగూరల పాదులో పెంచుకోవాలని వృధ్ధురాలైన తల్లి కోరుకుంటుంది. కొడుకూ కోడలూ మాత్రం బ్రహ్మజెముడు మొక్కలూ, క్రోటను మొక్కలూ వేస్తూ ఉంటారు. ఒకరోజు కోడలు శ్రధ్ధగా పాతిన ఉడ్ రోజ్ విత్తనాలు, మొలకలొచ్చి ఒకతీగ డాబా పైదాకా అల్లుకుంటుంది. పచ్చని బాకా పువ్వులు పూయడం మొదలు పెడుతుంది. అయిష్టంగానే అయినా దాన్ని రోజూ చూస్తూ ఉన్న తల్లికి మెల్లిగా దానితో ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఒకరోజు కోడలు తాజా గులాబీలతో పాటు, ఎండి పెళ పెళ లాడుతున్నట్టున్న ఉడ్ రోజ్ పూలని కూడా పూలవాజులో అమర్చుతుంది. తాజా పూలు యవ్వనాన్నీ, ఉడ్రోజ్ వార్దక్యాన్నీ సూచిస్తుందనీ, ఈ అలంకరణని 'ఇకబెనా' అంటారనీ అత్తగారికి చెపుతుంది.

           " అత్తాకోడళ్ళని పిలవ రాదా" అంటుంది పెద్దామె. ఇద్దరూ నవ్వుకుంటారు. 

           ఒకరోజు ఉన్నట్టుండి కొడుకు ఉడ్ రోజ్ తీగని సమూలంగా పీకి పారేస్తుంటే చూసి విలవిల్లాడుతుంది తల్లి. అడిగితే ' ఇల్లంతా ఆక్రమించేలా ఉందని పీకేశా'నని  చెప్తాడు కొడుకు. 'రేపు నా పరిస్థితీ అంతే అవుతుందా అనిపించింది .... మనిషికీ మనిషికీ మధ్య మమత ఆ తీగంత దట్టంగా పెరగకూడదేమో. అలా పెరిగితే పిల్లలైతే పెకలించి పారెయ్యగలరు. తల్లికి అల్లుకుపోవడమే తెలుసు' అంటూ ముగిస్తారు కథని. 

            కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటడం, అవకాశ వాదులు అలాంటి పరిస్థితుల్ని తమకి అనుకూలంగా మార్చుకుని సొమ్ముచేసుకోవడం అందరికీ తెలిసిన సాధారణ విషయమే అయినా ఛాయా దేవిగారు ఈ కథని నడిపిన తీరు, చివరికి ఇచ్చిన ముగింపు వాక్యం వల్ల ఈ రచనకి విలువ పెరిగింది. రోడ్డు మీద బండి పెట్టుకుని కూరలమ్ముకునే వాళ్ళు ఇలాంటి విపత్తుల వల్ల ఇంకా చితికి పోవడం, వీడియో కాసెట్లూ, కిరాణా సామాన్లూ అమ్మే వ్యాపారస్తులు ఇంకా పై స్థాయికి ఎదగడమూ చూసి ,   'భూమ్యాకర్షణ సూత్రాన్ని న్యూటన్ కనిపెట్టాడు. అయితే పై వాళ్ళు ఇంకా పైకి పోవడం, కింది వాళ్ళు ఇంకా కిందికి దిగజారిపోవడం, మధ్య వాళ్ళు మధ్యలో ఇరుక్కు పోవడం - ఈ సూత్రాన్ని ఏమంటారో ! దీనికి విరుగుడు ఎవరు కనిపెడతారో ' అనే వాక్యాలతో  అవకాశం కథ ముగుస్తుంది. 

            వ్యాపార సంస్కృతి చొరకూడని రంగాల్లో, ఆరోగ్య రంగం ఒకటి. కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీవీ, ఏసీ, సోఫాలూ, అన్ని భోగాలూ అమర్చి, వేలూ, లక్షల్లో ఫీజులు గుంజుతూ, అసలైనదైన చికిత్స విషయంలో మోసం చేసే అయిదు నక్షత్రాల ఆసుపత్రుల్లో  వైద్యం, నేతి బీరకాయల్లో నెయ్యి చందాన తయారయిందని చూపిస్తారు రచయిత్రి, 'ఆఖరికి అయిదు నక్షత్రాలు' కథలో. గుండెలో సన్నని నొప్పితో కార్డియాలజిస్ట్ దగ్గరకెళ్లిన మాధవరావుకి అత్యవసరంగా ఏంజియోగ్రామ్ తీయాలని చెప్పి, అదయ్యాక బైపాస్ చెయ్యాలని థియేటర్ కి తీసుకు వెళ్ళి, రాత్రి ఏడు గంటల వరకు ఆందోళనతో ఎదురుచూస్తున్న ఆప్తులని ఏ కబురూ లేకుండా ఉంచి, ఏడింటికి బెలూన్ థెరపీకి డబ్బు కట్టమని కబురు చేస్తారు. ముందుగా ఇచ్చిన రక్తం స్టాక్ అయిపోయిందని తొందర పెడతారు. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడించి, ఏం జరుగుతోందో చెప్పే దిక్కు కనపడకుండా చేసి, ఆఖరికి ఆశ లేదని తేలుస్తారు. చివరికి మనిషి పోయాక కూడా అరగంట వరకు భార్యా పిల్లలకి తెలియజేయకుండా ఉంచి, ఆత్రుత ఆపుకోలేక అటూఇటూ తిరిగి ఎదురైన డాక్టర్ ని "ఎలా ఉంది కండిషన్" అనడిగిన కూతురికి 'ప్రాణం పోయి అరగంటయిందనీ, వేరే కేసులో బిజీగా ఉండడం వల్ల చెప్పడానికవలేద'నీ చెప్తాడు డాక్టర్. 

             బంధుమిత్రులంతా పదే పదే రక్తం ఇవ్వాల్సి రావడం, పదే పదే డబ్బు చెల్లించాల్సి రావడం గురించి ప్రస్తావించి, ‘వాళ్ళకీ మాకూ 'రక్త' సంబంధమూ 'బిల్లు' సంబంధమూ తప్ప మరే విధమైన సంపర్కమూ లేకుండా చేశారు. చేతుల్లో పెట్టిన మనిషిని చీల్చి చెండాడారు. ముప్ఫయి ఆరుగంటల పాటు మరీచికలు చూపించి, మూఢ నిరీక్షణలో ముంచి మా గుండెలు మెలి పెట్టారు'
          'ఆఖరికి శవాన్ని తీసుకురావడానికి వెళ్ళినపుడు పన్నెండు వేలకి బిల్లు ఇచ్చారు. తీరా చూస్తే శవాల గది ఎయిర్ కండిషన్డ్ కూడా కాదు. అయినా అది మామూలు శవాల గది కాదు కదా అయిదు నక్షత్రాల శవ శాల ' 
          'నిజానికి మరణాన్ని కొనుక్కోవడానికి అంత దూరం అంత ప్రయాస పడి ఎవరూ వెళ్ళక్కర్లేదు. మనం పిలిచినా పిలవక పోయినా రావలసిన టైములో అదే వస్తుందని అర్ధమయింది' అనే వాక్యాలు కథకి ముగింపునిస్తాయి.

           పెళ్లి చూపులకొచ్చిన యోగ్యుడైన అబ్బాయి పెళ్లికూతురు అమూల్య తనకు నచ్చిందన్నా, తన పెళ్లి విషయంలో అమూల్య  ఒక పట్టాన నిర్ణయానికి రాలేక పోతుంది 'నిర్ణయం' కథలో. 

            'సతి' కథలో రచయిత్రిగా పేరు పడ్డ సత్యవతి అన్నగారు, పెళ్ళి చూపులకి వచ్చిన తిరుమల రావుతో "మా చెల్లెలు కథలు బాగా రాస్తుందండీ" అన్నపుడు, అతను 'ఓహో' అని ఊరుకుంటాడు. 'అతనికి చిన్నప్పటి నించీ కాకమ్మ కబుర్లూ, కలబొల్లి కథలూ అంటే ఇష్టం లేదు'--- తానే ఒక ప్రసిధ్ధ రచయిత్రి అయిన ఛాయాదేవిగారు, తిరుమలరావుని పాఠకులకు పరిచయం చేసేటపుడు ఇలాంటి వాక్యం రాయడం చూస్తే, ఒక పాత్రని ప్రవేశపెడుతూనే ఆ పాత్ర అంతరంగాన్ని సూటిగా చూడగలిగే శక్తిని పాఠకులకి అందించగల వాక్యాలని కథలో ఏర్చి కూర్చుతారనిపిస్తుంది. పెళ్ళయిన కొంత కాలానికి భర్త అందించిన వివరాలతో ఆమె కథ రాసి, రచయిత పేరుగా ఇద్దరి పేర్లూ కలిపి పెడతానన్నపుడు "నో.. నేను కథ రాశానంటే నా సంగతి తెలిసిన వాళ్ళంతా నవ్వుతారు" అంటాడు ఆమె భర్త. ఆ కథకి లభించిన ప్రశంసలని చూశాక అందులో తనకి కూడా భాగముందనిపిస్తుందతనికి.  చివరికి ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలతో 'సతి' అనే పేరు కలం పేరుగా పెట్టుకుందుకు ఒప్పుకుని, ఆమె కథా రచనకి తనూ పాలుపంచుకోవడం మొదలుపెడతాడు. అనూహ్యంగా మంచి పేరొస్తుంది 'సతి' రచనలకి.

          పిల్లలతో సంసార బాధ్యతలు పెరిగిపోయాక, తిరుమలరావు రచనా వ్యాసంగం కొనసాగించినా సత్యవతి అందులో పాలుపంచుకోలేక పోతుంది. పిల్లలు పెద్దవాళ్ళై ఆమెకు తీరిక లభించేసరికి తిరుమలరావు ఆమెతో సంప్రతించకుండా కథలు తానే రాసి పత్రికలకి పంపడం అలవాటు చేసుకుంటాడు. అలా ఒకసారి పత్రికలో వచ్చిన కథ చూసి సత్యవతి మనసు చివుక్కు మంటుంది.  ఇంతలో వృత్తిబాధ్యతలు నిర్వహిస్తూ ఒక దుర్ఘటనలో తిరుమలరావు ప్రాణాలు కోల్పోతాడు. దినపత్రికల్లో, రేడియోలో 'సతి' అకాల దుర్మరణం గురించిన వార్తలు వస్తాయి. సంతాప సందేశాలు అందుతాయి. పదోరోజు టౌన్ హాల్లో 'సతి' మరణానికి సంతాప సభ ఏర్పాటు చేస్తారు.  కానీ బొత్తిగా పదవరోజున ఆమె రాదని ఆమెని రమ్మని పిలవరు. సభలో "మళ్ళీ అటువంటి రచయిత ఉద్భవించడం సాధ్యం కాకపోవ"చ్చనే సంశయం వ్యక్తమవుతుంది. 'సతిలో అర్ధ భాగం ఇంకా బతికే ఉన్నదన్న స్పృహ ఎవరికీ కలగదు. 

            'అక్కడ జరిగిన "సాహితీ సతి" ఎవరి దృష్టికీ రాలేదు. సతి పేరుతో గాని సత్యవతి పేరుతో గాని మళ్ళీ కథ రాలేదు ఇంతవరకు' అన్న ముగింపు చదివితే, చనిపోయిన భర్తతో పాటు బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో భార్యను కూడా తగలబెట్టే  అలనాటి 'సతి' దురాచారం కళ్ళముందు కదిలి మనసు కలత చెందుతుంది. ఈ కథకి ప్రేరణ అప్పటి ప్రఖ్యాత రచయితలైన దంపతుల వాస్తవగాధే అని చెప్పుకుంటారు. 

            ఉద్యోగ రీత్యా పారిస్ వెళ్ళిన అమ్మాయి, కొత్త ప్రదేశంలో కాలక్షేపం కోసం, అవసరార్ధం, వయసులో తనకన్న పెద్దదైన స్త్రీతో స్నేహ పూర్వకంగా మసలి, సమ వయస్కుడైన అబ్బాయి తారసపడగానే ఆమెని తప్పించుకుని, అతనితో సన్నిహితంగా మెలుగుతుంది. అతనామె తనని ప్రేమిస్తోందని అపోహ పడతాడు. తీరా దేశానికి తిరిగి వచ్చాక అతని పరిచయాన్ని తుంచేసి, "అక్కడ పారిస్ లో ఒంటరిగా ఉన్నాం కాబట్టి స్నేహంగా తిరిగాను. అంతే" అని నిర్మొహమాటంగా చెపుతుంది.ఇది స్థాన మహిమ కథ.

            భర్త పోయిన స్త్రీని పలకరించడానికి వచ్చి, తమ హావ భావాలతో, మోటు ప్రశ్నలతో ఇబ్బంది కలిగించే భీమారావు లాంటి వ్యక్తుల మీద హాస్యస్ఫోరకమైన కథ 'ఎవరి ఏడుపు వారిది'. చివరి వాక్యం రచయిత్రి లోని సున్నితమైన హాస్యధోరణికి అద్దం పడుతుంది. 

            అటెండెంట్ రామ్ సింగ్  పోవడంతో అతని భార్య దమయంతికి అతని ఆఫీసులో స్వీపర్ ఉద్యోగం ఇస్తారు. తన పసిపాపని ఎక్కడా విడిచే వీలు లేక, నానా అవస్థలూ పడి పెంచుకున్న ఆమె, అయిదేళ్ళలో వ్యక్తిగా ఎదిగి 'కేడర్ లీడర్' గా ఎన్నుకోబడుతుంది. చివరికి తోటి ఉద్యోగినుల వీలుకోసం ఆఫీసులో క్రెష్ తెరవాలనే డిమాండ్ పెడుతూ అందర్నీ కలుపుకుని సమ్మెకి దిగుతుంది. చదువురాని దమయంతికున్న పాటి ఆలోచన ఇంత చదువుకున్నదాన్నినాకెందుకు రాలేదు అనుకుని, వాళ్ళ పక్షం వహిస్తుంది, అదే ఆఫీసులో పని చేసే నాయకి.

          ఒక మనిషి మరో మనిషి మీద అధికారం చలాయించినంత కాలం సంఘర్షణ తప్పదని తెలిపే 'సమతా రేఖ' కథ కేవలం సంభాషణలతోనే నడుస్తుంది.
         కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించాలని చర్చించుకుంటూ మధురవాణి పాత్రకి తగిన నటి దొరకలేదని తర్జన భర్జనలు పడుతున్న మిత్రసమితి సభ్యుల మాటలు విన్న సాధన భర్తని అడుగుతుంది ' తాను మధురవాణి గా నటిస్తా'నని. "నీకేమన్నా మతిపోయిందా? నలుగురూ ఏమనుకుంటారు?" అని భర్త ఆమెని కసురుకుంటాడు. 'మధురవాణి గా నటించడం అంత ఛీత్కరించదగ్గ విషయమా?  వేశ్యగా నటిస్తే వేశ్య అయిపోతుందా? ఆ వేశ్య దగ్గరికి పోయే విటుడిగా ఒక సంసారి నటిస్తే లేని తప్పు, ఆ వేశ్యగా తను నటిస్తే వస్తుందా ?' అని మధన పడ్ద సాధన మర్నాడు చర్చాసమయం లో "పోనీ నన్ను వెయ్య మంటారా ? నాకు కాలేజీ రోజుల్లో నటనలో బహుమతులొచ్చేవ"ని చెపుతుంది. నలుగురి మధ్యా అడిగే సరికి సత్య మూర్తికి ఇంక ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడుఉంది.  సాధన నవ్వుకుంటుంది- 'సమాజం ఏమనుకుంటుందో అనే భయం వదిలించుకోవడం ఎంత సులభం' అనుకుని. ధైర్య వాణి కథ ఇది.

        భర్త అంటే ఇంటికి యజమాన్యం వహించడం,  భార్య అంటే పతివ్రతా ధర్మం నిర్వర్తించడం -- ఈ రెండు విషయాలు తెలుసుకుంటే చాలంటూ మంగళ సూత్రాలు కళ్ళ కద్దుకునే పక్కింటి పిన్నిగారికి, సుగుణకి జరిగిన చర్చ ' రెండు కాదు ఇరవై రెండు'. హాస్యస్ఫోరకంగా సాగే ఈ కథలో,  ద్రౌపది సత్య భామకి చెప్పిన ఇరవై రెండు ఆదర్శ గృహిణి లక్షణాలు, పతివ్రతా ధర్మాలు, పిన్నిగారికి చదివి వినిపిస్తుంది సుగుణ. 'అందరి మెప్పు కోసం ఎంత చేసినా ఆ ద్రౌపది ఎన్ని అవమానాలు సహించవలసి వచ్చింది!' అనుకుని, 'అయినా అవి ద్రౌపది చెప్పిన సూత్రాలా? వాటిని చెప్పించినవాడు వ్యాసుడు కాడూ' అనుకుంటుంది సుగుణ.

            స్త్రీ పరాధీన గానే గాని బతుకు సాగించలేదని నమ్ముతూ, వృద్ధురాలైన తల్లికి స్వంత వ్యక్తిత్వం, భావ స్వాతంత్ర్యం, ఇష్టాయిష్టాలూ ఉండకూడదని భావిస్తూ, ఆమెని నిరాదరించే కొడుకులని వదిలిపెట్టి, స్వావలంబనతో జీవితాన్ని కొనసాగించే వర్ధనమ్మ కథ తొంభయ్యవ దశకానికి చాలా కొత్త ఇతివృత్తం. పురుషాధిక్య సమాజంలో స్త్రీని తమ స్వార్ధానికి తగినట్టుగా వాడుకుందామని చూసే వ్యక్తులు సొంత పిల్లలైనా వారికి దూరంగా స్వతంత్రంగా జీవిస్తూ, ఒంటరితనానికి, ప్రేమరాహిత్యానికి అలవాటు పడుతూ, తన మనసుకయ్యే గాయాలకు తానే మందు పూసుకుని, మనస్థైర్యంతో ముందుకు సాగే వర్ధనమ్మ ఎందరో తల్లులకు అంతవరకూ తోచని కొత్త మార్గాన్ని చూపిస్తుంది. బాల్యంలో తండ్రి చాటున, యవ్వనంలో భర్త చాటునా జీవించినా వృధ్ధాప్యంలో తను పెంచి పెద్ద చేసిన కొడుకులు కూడా తనని చులకన చేస్తే భరించలేని తల్లి 'తన మార్గా'న్ని హుందాగా ఎన్నుకోవడం ఈ కథలో  ఎంతో సమంజసంగా,  హృద్యంగా  కనిపిస్తుంది.

            'సతి' కథలో లాగే 'ఆయన కీర్తి వెనక' కథలో కూడా స్త్రీ ప్రతిభకు, సేవకు, విశ్రాంతి ఎరగని ఇంటి చాకిరీకి తగిన గుర్తింపు లేని వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రించి, చదివే పాఠకుల్లో సమాజంలో పాతుకుపోయిన వివక్ష పట్ల ఆలోచన రేకెత్తిస్తారు రచయిత్రి. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో స్త్రీల భాగస్వామ్యాన్ని, వాళ్ళకి అందవలసిన కీర్తి గౌరవాల విషయంలో జరిగిన అన్యాయాన్ని కళ్ళముందు నిలుపుతుంది ఈ కథ. 

            'మొగ్గు' కథ లో భర్త ఒకవైపు, కొడుకు ఒకవైపు అయినపుడు ఏ స్త్రీ కైనా 'భర్త పక్షం వహించాలా, కొడుకు పక్షం వహించాలా అని నిర్ణయించుకోవడం, అయిదేళ్ళకోసారి ఎవరికో ఒకరికి ఓటు వెయ్యడం అంత సులభం కాదు కదా' అనుకుంటుంది నాయకి. కొడుకు తమకి సమ్మతం కాని అమ్మాయిని పెళ్ళాడతానని పట్టు పట్టినందుకు ఆ పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదంటాడు భర్త. 'ఎంతైనా వాడు మన కొడుకు కదా' అని నచ్చ చెప్పబోతుంది ఆమె. 'నీకంత దురదగా ఉంటే నువ్వెళ్ళు' అంటాడు అతను.' సరే అయితే నే వెడతాను' అంటుంది ఆమె. 'వెడితే వెళ్ళు. మళ్ళీ రానక్కర్లేదు' అంటాడతను. తనతో సమానంగా చదువుకుని ఉద్యోగం చేస్తున్న భార్యను అంత మాట అన్నందుకు ఆమె కళ్ళలో నీరుబికి, 'వీళ్ళిద్దరి అండలో తప్ప నేను బతక లేనా' అనుకుంటుంది. నలుగురూ ఏమనుకుంటారో అన్న భయం నాకేనా ? వాళ్ళకుండదా అని ప్రశ్నించుకుంటుంది.  'నిజమే వాళ్లకుండదు. సమాజం ఆడదానిదే తప్పు అంటుందని ధైర్యం' అని నిట్టూర్చి, భర్త మాటల్ని అర్భకుడి ఆక్రోశంలా తీసుకుని వంటింట్లోకి వెడుతుంది, భార్యలా, బానిసలా కాకుండా ఆయన అవసరాలు తీర్చే తల్లిలా. 

            తన బాధ్యత విడిచి, భార్యను వదిలేసి వెళ్ళిపోయిన పురుషుడు తనకిష్టమైన యువతితో సుఖ సంతోషాలతో జీవించగలుగు తాడు గాని, మొగుడు వదిలేసిన స్త్రీని సమాజం చులకనగా చూస్తుంది. తప్పు ఆమెది కాకపోయినా వెంటపడి వేధిస్తూ చేయని నేరానికి దోషిగా నిలబెడుతుంది. ఆ స్త్రీకి ఒక కూతురు కూడా ఉంటే ఆ పిల్ల పెళ్ళి ఒక సమస్య అయిపోతుంది. ఏ సంబంధం వచ్చినా 'తండ్రి ఏడనీ, తండ్రి తాలూకు బంధువులే'రనీ అడుగుతారు. పిల్ల తల్లిని ఒక ఆటంకంగా భావిస్తారు. అదే మగ పిల్లవాడైతే తల్లి బాధ్యత వదిలేస్తే, వాడు మంచివాడనిపించుకోడు. తల్లి సంరక్షణలో అతనికి సహకరించని భార్య స్వార్ధపరురాలనిపించుకుంటుంది. 'ప్రశ్నార్ధకం' కథ లో ఈ తరహా వివక్షని ప్రశ్నిస్తారు రచయిత్రి. అయితే కథాంతంలో 'కొడుకైతేనేమిటి, కూతురైతేనేమిటి, వాళ్ళ దగ్గర అసలు నేనెందుకుండాలి ? నా ఇంట్లో ఉన్న స్వతంత్రం వాళ్ళ దగ్గర నాకు ఉంటుందా?' అని స్వతంత్రంగా జీవించాలని నిశ్చయించుకుంటుంది నాయిక.

         పరిధి దాటిన వేళ కథలో,  గృహప్రవేశానికి రమ్మని మరీమరీ రాస్తే వృధ్ధ దంపతులిద్దరూ కొడుకింటికి వస్తారు. కోడలి తల్లిదండ్రులు మూడో నాడే వెళ్ళి పోతారు. వీళ్ళూ అలాగే వెళ్ళిపోవాలని అనుకున్నారేమో అంతకన్నా ఉండిపోయేసరికి యువజంటకి ఇబ్బందిగా ఉంటుంది. రాక రాక వచ్చాం కదా నాలుగురోజులుండి వెళ్దామని ఆగిన తల్లికీ తండ్రికీ, పిల్లల అంటీ ముట్టని ధోరణి అర్ధమవుతూనే ఉంటుంది. ఒక్క పూట కూడా మానకూడదని డాక్టరు చెప్పిన  బీపీ మందులు అయిపోవడం, కొడుక్కీ కోడలికీ చెప్పినా వాళ్ళు మర్చిపోవడం అయ్యాక 'నోట్లో నాలుక ఉందికదా, బయటకెళ్ళి తెచ్చుకుందామని వెళ్ళిన తల్లి, దారి తప్పి కొంత ఆలస్యంగా ఇల్లు చేరుతుంది.

           ఈ లోపు ధ్యానంలో ఉన్న ఆమె భర్తా, ఆఫీసు మధ్యలో వచ్చేసిన కొడుకూ, ఫోన్ లో కోడలూ అంతా ఆమెని బోనులో నిలబెట్టినట్టు ప్రశ్నిస్తారు. మందులకోసం వెళ్ళానని ఆమె చెప్పిన మాట ఎవరూ నమ్మరు. 'ఇంట్లో చెప్పకుండా అలా ఎందుకు వెళ్ళా'వని కూతురు ఆరా తీస్తుంటే "ఏం? మగవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎన్నింటికి వస్తారో చెప్పి వెడుతున్నారా?" అని ఎదురడుగుతుంది తల్లి. ఆ మాటలు విన్న ఆమె భర్త "మగవాడితో వంతా? మగవాళ్ళూ ఆడవాళ్ళూ ఒకటేనా ?" అంటాడు ఉద్రేకంగా. 

          మనవలే నయం, ప్రేమా ఆప్యాయతా చూపించకపోయినా తన ధైర్యాన్ని మెచ్చుకున్నారని సంతోషిస్తుంది.  భర్త పరాయి పిల్ల కి దగ్గరవుతున్నందుకు దుఃఖపడి గడప దాటినా  కడుపులో బిడ్డనీ, పసి పిల్లవాడినీ తలుచుకుని, పదోక్లాసు చదువుకి ఉద్యోగం దొరకదని ఆలోచించి, అభిమానం చంపుకుని, ఇంట్లోకి నడిచిన రోజులు గుర్తు తెచ్చుకుంటుంది. ఇల్లు విడిచి వెళ్ళాలంటే ఇదివరకున్న భయాలు ఇప్పుడు లేవని అనుకుంటూ, భయపెట్టేవి పరిస్థితులూ సమాజమూ కాదనీ, మనసులోని ఆలోచనలూ, సమాజం గురించి మనం కల్పించుకున్న భయాలూ అని తెలుసుకుంటుంది. 

         ఈ సంపుటిలోని కథలన్నీ వరసగా చదివితే రచయిత్రి రచనా పరిణామ క్రమం, ఆమె ఆలోచనల్లో క్రమంగా వచ్చిన పరిణతి  అర్ధమవుతాయి. సమకాలీన సమాజం కన్నా ఆమె ఎపుడూ కొన్ని దశాబ్దాలు ముందే ఉన్నారని కూడా అవగతమవుతుంది. స్త్రీ దృక్పధం నించి రాసినవే అయినా  తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి కూడా పరిస్థితులతో, కుటుంబంతో రాజీ పడి సర్దుకుపోయే ధోరణిలో ఉంటాయి తొలినాళ్లలో ఆమె సృష్టించిన పాత్రలు. ఉపగ్రహం, సుఖాంతం, నలుగురి కోసం, బ్రహ్మాస్త్రం, వెండి పండుగ, ఉడ్ రోజ్ వంటి కథల్లో ఈ ధోరణి చూడవచ్చు. ఆనాటికి అలా గుర్తించడం, వాటిని ప్రశ్నించడమే విశేషం.  తొంభయ్యవ దశకం తర్వాత రాసిన మార్పు, ధైర్యవాణి, పరిధి దాటిన వేళ, తన మార్గం కథల్లో తనకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకుని, ఇతరుల అభిప్రాయాలతో, అనుమతితో పనిలేకుండా ఆదారిలో పయనించే ధైర్యాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ ప్రదర్శిస్తాయి ఛాయాదేవి గారి స్త్రీ పాత్రలు. ఈ కథలు చదివిన పాఠకుల్లో కూడా ఈ భావాల ప్రభావం ఎంతో కొంత పడక మానదు. 

               'తన మార్గం' లోని కథలన్నీ సూటిగా సరళంగా ఉంటాయి. అయినా అవి లోతుగా ఆలోచించవలసిన భావాలని,  పరిస్థితులని ఆవిష్కరిస్తాయి. తెలియని విషయాల గురించి ఊహించి రాసిన కథల కోవకి చెందని ఈ కథలు మన ఎదురుగా కనిపిస్తూ మనం పెద్దగా దృష్టి పెట్టని బియ్యంలో రాళ్లలాంటి, నడిచే దారిలో ముళ్లలాంటి అంశాలని చూపించి, వాటిని ఏరేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తాయి. రచనా కాలంలోనే కాక ఈనాటికీ కనిపించీ కనిపించకుండా దాగివుండి, స్త్రీవికాసానికి అడ్డుపడే, స్త్రీని అణచివేతకు గురిచేసే సమస్యలను ఆనాడే గుర్తించి, ఎత్తిచూపించి, పాఠకుడు వాటి గురించి ఆలోచించకుండా ఉండలేని పరిస్థితిని కల్పించడంలో రచయిత్రి కథన కౌశలం, వాడిన భాషల ప్రభావం చెప్పుకోతగ్గది. 

                అబ్బూరి ఛాయాదేవిగారి రచనలు కన్నడ, తమిళ, మలయాళ, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోకి అనువదించబడ్డాయి. 'అనగా అనగా'( పిల్లల కథలు, 1955), 'అపరిచిత లేఖ - ఇతర కథలు' స్టెఫాన్ త్స్వైక్ ఆస్ట్రియన్ రచయిత కథల తెలుగు అనువాదం (1956), అబ్బూరి చాయాదేవి కథలు ( కథా సంపుటి, 1991 ), మృత్యుంజయ ( పెద్ద కథ, 1993), మన జీవితాలు జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు, వ్యాసచిత్రాలు(1995), బొమ్మలు చేయడం (1996), చైనాలో ఛాయా చిత్రాలు (2002) -- వారు వెలువరించిన ఇతర గ్రంధాలు. 
             చాలా కాలంగా బాగ్ లింగంపల్లి లోని తమ స్వంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తూ ఉండిన ఛాయాదేవి గారు, ఆరోగ్య కారణాల వల్ల 2012 లో, కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ వారి వృధ్ధాశ్రమంలో చేరారు. ఎనభయ్యవ పడిలో కూడా  ఎక్కడున్నా పరిసరాలను తనకనుగుణంగా మార్చుకుంటూ, తను వాడే ప్రతి వస్తువునూ కళాత్మకంగా తీర్చి దిద్దుకుంటూ,  సానుకూల దృక్పధంతో, తరగని చైతన్యశీలతతో, చెదరని మందహాసంతో  ఎందరికో స్ఫూర్తినందిస్తూ జీవించిన ఛాయాదేవి గారు, 2019 వ సంవత్సరం, జూన్ నెల 28 తేదీ తెల్లవారు జామున పరమపదించారు.       
                                                           ఇది ఛాయా మార్గం.
                             
                                                               ***

( పై వ్యాసంలో ఆఖరి పంక్తి తప్ప మిగిలినదంతా 'కాల్పనిక సాహిత్యం- రచయిత్రుల కృషి'శీర్షికన తెలుగు విశ్వ విద్యాలయంలో, 04-04-15 తేదీన, లేఖిని అధ్వర్యంలో జరిగిన సదస్సులో నేను సమర్పించిన పత్రం 'ఛాయా మార్గం'లోనిది.)