April 21, 2013

అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ        
         అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ
ప్రకాష్ కనబడ్డం లేదుట !
సీతపిన్ని ఫోన్ చేసి ఇంటర్ ఫలితాలు వచ్చినప్పటి నించీ  దిగులుగావున్న  చలపతీ, సుజాతా, ఒక్కగానొక్క  పిల్లవాడు ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో పూర్తిగా కుంగి పోయారనీ, వాడు క్షేమంగా ఉన్నాడో లేదోనని తల్లడిల్లిపోతున్నారనీ చెప్పింది.
అప్పుడే తల్లిదండ్రుల ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకోలేక కుంగుబాటుకి గురైన కుర్రాడికి కౌన్సెలింగ్ చేసి వచ్చానేమో, చలపతి మీదా సుజాత మీదా చెప్పలేనంత కోపం వచ్చింది. చదువుకున్న మూర్ఖులు అనుకున్నాను. ఇలాంటి తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ మానసికరోగుల సంఖ్యా, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్యా పెరిగి పోతూనే ఉంటుంది. పరిమిత కుటుంబాలూ, పెద్దలెవరి జోక్యం లేకుండా పిల్లల్ని పెంచుకోడాలు, ఎవరికి వాళ్లే మిగిలిన వాళ్లంతా మూర్ఖులనీ, తాము మాత్రం పిల్లల్ని అద్భుతంగా పెంచగల విజ్ఞులమనీ విర్రవీగడం, ఆ పసి వెధవలకి ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకుందుకు అమ్మమ్మో, మామ్మో, తాతో దగ్గర ఉండే అవకాశం లేకపోవడం తలుచుకుంటే మనసు ఉసూరుమంది. తమ పెంపకంలో పిల్లలు తాము సాధించలేకపోయినవన్నీ సాధించి, గొప్ప ప్రయోజకులై రెండు చేతులా డబ్బూ, పేరూ సంపాదిస్తారనీ, అప్పుడు ప్రపంచమంతా తమని గుర్తించి హారతి పడుతుందనీ, ప్రతి జంటా ఆశల పేకమేడలు కట్టుకోవడం  నాకర్థం కాని ప్రశ్న అయికూర్చుంది. ఎదురింట్లోనో, పక్కవీధిలోనో, లేకపోతే బంధుమిత్రుల్లోనో పోటీ పరీక్షల్లో గొప్ప రాంకులు తెచ్చుకున్నవాళ్ళతో పోల్చి, వాడికన్నా నీకేం తక్కువ చేశాం?’ అంటూ ఆ పసి మనసుల మీద మోయలేని భారం పెట్టడం, వాళ్ళని గొప్పగా మోటివేట్ చేస్తున్నామనే భ్రమలో పరుగులు పెట్టడం... ఏమిటిదంతా?
పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితినర్థం చేసుకోలేకపోవచ్చు.. వాళ్ళకా  అనుభవం లేదు గనుక. ఈ తల్లి దండ్రుల కేమయింది ? ఒకప్పుడు వాళ్ళూ పిల్లలే గా? తమ ఆశల బరువుకి కుంగిపోయి, తమ ఆంక్షల తీవ్రతకి జడిసిపోయి ఆ పసివాళ్ళు వెనక్కి తీసుకోలేని అడుగేస్తే తలమీద పిడుగుపడ్డట్టు షాక్ కి గురవడమేమిటి? పోనీ అలా దెబ్బతిన్నవాళ్ళని చూసి పక్కవాళ్లైనా బుద్ధి తెచ్చుకుంటారా? అబ్బే.తమ పిల్లలు అలాంటి వాళ్ళు కారనుకుంటూ అదే తప్పు చేస్తూ పోతారు!  మూర్ఖులు !
స్నానం చేస్తున్నంతసేపూ ఈ మధ్య నాదగ్గరకొచ్చిన ఇలాంటి కేసులెన్నో గుర్తొచ్చాయి. తలనెప్పి సర్దుకుంటుందేమోనని తలారా చన్నీళ్ళ స్నానం చేసొచ్చి కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చున్నాను. నల్లబడుతున్న ఆకాశాన్ని, ఒకటొకటిగా తళతళలాడుతూ కానవస్తున్న చుక్కల్నీ చూస్తూ, వేడి కాఫీని ఆస్వాదిస్తుంటే అమ్మ ఫోను. సీత పిన్ని చెప్పిన విషయమే తనూ చెప్పి అమ్మలూ! ఒక్కసారి వెళ్ళి చూసిరా తల్లీ ! కార్లో పది నిముషాల ప్రయాణం ! వాళ్ళకేదైనా సాయం చెయ్యడానికవుతుందేమో చూడు. ఒక్కగానొక్కడువాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారన్నది  తెలిసిన విషయమే.. వాడేదన్నా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని భయపడిపోతున్నార్ట, సీత చెప్పింది! ఒక్కసారి విషయం కనుక్కుని, మాట్లాడి రా..అంది.
నేను వెళ్ళనమ్మా! నాకు చిరాకు. ఎంతమంది పిల్లలో ఇలా తల్లిదండ్రుల మూర్ఖత్వానికి బలైపోతుంటే ఈ పెద్దవాళ్ళకి వాళ్ళని చూసైనా బుద్ధిరాదేం? టెన్త్ రిజల్ట్స్ వచ్చీ రాకముందే  ప్రకాష్ ని ఆ బెస్ట్ బ్రెయిన్స్కాలేజీలో చేర్పించారని తెలిసినపుడు నేనేమన్నానో గుర్తుందా? గంటసేపు ఒకచోట కూర్చుని చదవడానికి ఆపసోపాలు పడిపోయేవాణ్ణి తీసుకెళ్ళి, ఏసీ రూములూ, గొప్పసదుపాయాలూ ఉన్న సూపర్ కాలేజీలో చేర్పిస్తే, కాలేజీ వాళ్ళే వాణ్ణి సానపట్టేసి, ఐఐటీ  పోటీ పరీక్షలో కోరుకున్న  రాంకు తెప్పించేస్తారని ఎలా అనుకున్నార్ట?” చిరాకు పడ్డాను.
ఈ హైదరాబాదు నిండా చుట్టాలే. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక అవసరం...అడిగినా అడక్కపోయినా అందరికీ సాయపడాలని అమ్మ తాపత్రయం. ఆవిడ కోరినట్టు జీవించాలంటే మనకంటూ కాస్తైనా సమయం మిగిలే అవకాశం ఉండదు. పైగా ఈ కాలంలో అడక్కుండా సాయానికి బయల్దేరితే దాన్ని అనవసర జోక్యం అంటారని ఆవిడకి తెలీదు.
నీలూ!అందరి సమస్యలూ ఒకలాగే ఉండవు! అయినా ఇది వాద వివాదాలకి సమయం కాదు. నీకు వీలవదంటే నాన్నగారికేదో ఏర్పాటు చేసి, నేనే వస్తాను. ఇలాంటి సమయంలో వాళ్ళకి పెద్ద వాళ్ళ అండ అవసరం. రాత్రి బస్సుకి బయల్దేరితే పొద్దుటికల్లా వాళ్ళింట్లో ఉంటాను. దేవుడి దయ వల్ల వాడు క్షేమంగా తిరిగొస్తే అప్పుడు నీ ఉపన్యాసాలన్నీ వినిపిద్దువు గాని !” అంది నిష్ఠూరంగా.
అమ్మా! ఇప్పుడే వచ్చానే ఆస్పత్రి నించీ...ఇవాళంతా వరసగా పేషెంట్లే ! తల వాచిపోయింది. ఇప్పుడే ఇంటికొచ్చి కాఫీ తాగుతున్నా. రేపు పొద్దున్నే  వెళ్తా. సరేనా ?” అన్నాను అనునయంగా.
సరే తల్లీ ! “ అని వాళ్ళతో కాస్త సామరస్యంగా ..అంటూ ఏదో చెప్పబోయింది.
అమ్మా! నాకు తెలీదా ఆ మాత్రం ? రోజుకి పది మందికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చేస్తున్నాసరే నీ దృష్టిలో మాత్రం వెర్రిపిల్లనే  అన్నా నవ్వుతూ.
సరేలే తల్లీ! ఏదో చాదస్తపు పీనుగునీ.. వదిలెయ్! ఆ కాఫీ తాగి అలాగే నిద్రపోయేవు. కాస్త చల్లగా పెరుగన్నం తిని పడుకోఅని ఒకటికి రెండు సార్లు చెప్పి పెట్టేసింది.
పొద్దున్నే తొమ్మిదింటికిచ్చిన ఎపాయింట్ మెంట్  కాన్సిల్ చేసి, ఉదయపు నడక ఎగ్గొట్టేసి, ఎనిమిదింటికే ఇంట్లోంచి బయటపడ్డాను. చలపతి ఇల్లు చేరేసరికి పావు తక్కువ తొమ్మిది. సరిగ్గా అరగంట ఉండి వెళ్ళిపోవాలనుకుంటూ లోపల అడుగుపెట్టా....
మూడో అంతస్తులోని అపార్ట్ మెంట్ తలుపు తెరిచే ఉంది. హాల్లో ఎవరూ కనిపించలేదు. బెల్ కొట్టనా వద్దా అనుకుంటుంటే గదిలోంచి బయటికి వస్తూ చలపతి కనిపించాడు. చెవిలో సెల్ ఫోను.
సరేలే అన్నయ్యా ! మేం బానే ఉన్నాంలే.. బెంగ పడకు. మళ్ళీ ఫోన్ చేస్తాలే అని పెట్టేసి, నన్ను పలకరించి, కూర్చోమని సోఫా చూపించాడు.
అమ్మా, సీతపిన్నీ ఫోన్ చేస్తే ఉండబట్టలేక వచ్చానురా. ఏమన్నా కబురు తెలిసిందా?” అన్నా.
చాలా థాంక్సక్కా. నీ బిజీ షెడ్యూల్ సర్దుకుని మా కోసం వచ్చావు...నిన్న రాత్రి  పదకొండింటికి రైల్వే స్టేషన్ లో కనబడ్డాడు....తీసుకొచ్చాంఅన్నాడు.
నాకు చెప్పలేనంత తెరిపిగా అనిపించింది.
హమ్మయ్య! చల్లటి వార్త చెప్పావురా. మనసు కుదుట పడింది!” సోఫాలో కూర్చుంటూ వాడి కళ్ళలోకి చూశాను. చాలా అలసిపోయినట్టు కనిపించాడు. వాడి కళ్ళలో కేవలం అలసటే కాక ఇంకేదో భావం కనిపించింది.
సుజాతేది?” అన్నాను. వాడు సమాధానం చెప్పేలోపే సెల్ ఫోనూ, లాండ్ లైనూ రెండూ మోగాయి. ఒకటి ఆన్ చేసి మాట్లాడుతూనే రెండోది తీశాడు. నా వైపు చూసి లోపలికెళ్ళుఅన్నట్టు చేత్తో చూపించాడు. వాడి మాటలు వింటూనే వంటింట్లోకి తొంగి చూసి,  అక్కడెవరూ కనపడక పడకగది కర్టెన్ తొలగించి లోపలికి చూశా.
సుజాత ఇంకా లేవలేదు! ఒంట్లో బాగానే ఉందా అని అనుమానం వచ్చి నుదుటి మీద చెయ్యి వేశాను. మామూలుగానే ఉంది గాని పడుకున్నతీరూ, సన్నని గురకా కొంచెం అసహజంగా అనిపించాయి. శబ్దం చెయ్యకుండా బయటికి వచ్చి రెండో గది వైపు కదిలాను. చలపతి ఇంకా ఫోను సంభాషణలోనే ఉన్నాడు, అటునించి వస్తున్న ప్రశ్నలకి జవాబులిచ్చే పనిలో. పిల్లాడు ఎప్పుడు వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, ఎక్కడ దొరికాడో ఇవే వివరాలు !
రెండో గదిలో మంచం మీద గోడకి జారగిలబడి కూర్చుని ఉన్నాడు ప్రకాష్. అప్పుడే లేచాడో ఏమో రేగిన జుట్టు నుదుటిమీద చిందర వందరగా ఉంది. కిటికీలోంచి బయటికి చూస్తున్నవాడు అలికిడికి తలతిప్పి నావైపు అభావంగా చూశాడు. ఫోనులో వాళ్ళ నాన్న మాటలు గదిలోకి వినిపిస్తున్నాయి.
లక్షన్నర కట్టానురా పిచ్చివెధవ లాగా. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందిట! ఎందుకొచ్చిన కుప్పిగంతులు? వాడికీ నాలాగే గుమాస్తా గిరీ చేసుకుంటూ చాలీచాలని బతుకు లాగించాలని రాసుంటే, నేనూ వాళ్ళమ్మా రెక్కలరగదీసుకుంటే జాతకం మారిపోతుందా?! ఆ విషయం వదిలెయ్..దొడ్డమ్మ బావుందా? పిల్లలూ, జానకీ కులాసే కదా?...”
వింటున్న నా మనసు మూలిగింది. ఊఁ..మరి నువ్వెందుకు గుమస్తాగిరీలో మిగిలావు ? వాడు సాధించాలని నువ్వు కోరుకుంటున్నది నువ్వు సాధించాలని మీ నాన్న కోరుకోలేదా? మరి తండ్రి కోరిక తీర్చావు కాదేం ? ఎప్పుడూ ఫస్టు క్లాసు మార్కులు తెచ్చుకోని నువ్వు, కొడుకు మాత్రం పోటీ పరీక్షల్లో మొదటి వరసలో నిలబడాలని ఎలా ఆశిస్తున్నావు? చలపతినీ, సుజాతనీ నిలబెట్టి అడగాలనిపించింది. తల్లిదండ్రుల తీరని కోరికలూ, పిల్లల పట్ల వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్.......ఆ బరువు కింద నలిగి పోతూ యుక్తవయసింకా వచ్చీ రాని పిల్లలు... తలుచుకుంటే ఏదో భయం కలిగింది. వీళ్ళకెదురయే అనుభవాలు వీళ్ళని ఏ తప్పు దారిలో నడవమని ప్రోత్సహిస్తాయో!
ప్రకాష్ మొహంలోకి చూశాను. వాడి మొహం ఆవేశంతో కందిపోయి కనిపించింది. దగ్గరకెళ్ళి వాడి చేతి మీద చెయ్యేస్తూ మంచం మీద కూర్చున్నా. నా మనసంతా వాడి పట్ల జాలితో నిండిపోయింది.
ఇన్నిన్ని పరీక్షలూ ఇంత కాంపిటీషన్ లేని రోజుల్లో కూడా యావరేజి మార్కులు తెచ్చుకుని, నన్ను మాత్రం నైంటీ పర్సెంట్ రాలేదనీ, నాలుగింటికే లేవలేదనీ చంపుకు తింటారు. రమేష్ గాడికి ట్రిపులైటీలో సీటొచ్చి నా చావుకొచ్చింది.. వాడు వాడే. నేను నేనే. వాడిలా నేనెలా ఉంటాను? ఎపుడూ కంపారిజనే. అందువల్లే నాకు వాడంటే అసహ్యం పుట్టింది. చదువంటే రోత పుట్టిందినా వైపు చూడకుండానే లోగొంతుకలో ద్వేషాన్ని కక్కుతూ అన్నాడు.
వాడికి దగ్గరగా జరిగి తల నిమురుతూ నీ బాధ నాకర్థమవుతోంది నాన్నా! కానీ, పిల్లల అభివృధ్ధి కోరి తల్లిదండ్రులేమైనా అంటే...నా మాట పూర్తి కాకుండానే
లేదత్తా! ఇది మేం ప్రోగ్రెస్ అవాలని కోరడం కాదు! వాళ్ళు చెయ్యలేనిది మేం చేసితీరాలని ఫోర్స్ చెయ్యడం!” ఆవేశంగా అన్నాడు.
వాడి చెయ్యి అనునయంగా నొక్కుతూ కొన్నాళ్ళు నా దగ్గరకొచ్చి ఉండకూడదూ? మామయ్య కూడా ఊళ్ళో లేరు కదా! లెటజ్ షేర్ సమ్ ఐడియాస్ ..! ?” అన్నాను.
కౌన్సిలింగా?” అన్నాడు అదోలా నవ్వుతూ.
వాణ్ణి పరిశీలనగా చూస్తూ మా పెద్ద వాళ్ళందరం మీ లాంటి పిల్లలనించి కౌన్సిలింగ్ తీసుకోవలసిన అవసరం ఉంది నాన్నా..నిజం!” అంటూ టైమ్ చూసుకున్నాను. వెంటనే బయల్దేరాలి. ప్రేమగా వాడి తల నిమిరి మళ్ళీ కలుద్దాం అంటూ బయట కొచ్చాను. ఫోన్ కాల్స్ నించి కాస్త విరామం దొరికినట్టుంది, చలపతి వంటింట్లో కాఫీ కలుపుతూ కనిపించాడు.
కాఫీ చేస్తున్నావా ? నాకేమీ వద్దురా .. టైమూ లేదు. ఈరోజు చాలా అపాయింట్మెంట్సున్నాయి.అన్నాను.
అవునా ?అయ్యో ..నీ బిజీ షెడ్యూల్ తెలిసినదే అనుకో..సుజాత కోసం కలిపాను. జస్ట్ ..హాఫ్ కప్పు తాగు అంటూ కప్పుల్లో కాఫీ పోశాడు. నాక్కొంచెం ఆశ్చర్యం వేసింది. మామూలుగా చలపతి వంటింట్లోకి అంతగా రాడు. ఇంటి పనంతా సుజాతే చురుగ్గా చేసుకుంటుంది. ఇవాళ ఇంతగా ఫోన్లొస్తుంటే తనలా పడుకుని ఉండడం, చలపతి  తనకి కాఫీ కలపడం .. నా ఆలోచనల్ని తుంపుతూ
మూడురోజులుగా తిండి మానేసింది. రాత్రి వాడొచ్చాక నాలుగు మెతుకులు తింది. అది ఇమడలేదు.గుండె పట్టేసినట్టుందని బాధ పడింది. చెడతిరిగి ఉన్నానేమో నాకు ఒళ్ళు తెలీకుండా నిద్ర పట్టేసింది. వాడి పక్కన పడుకుని ఉన్నవాణ్ణి పొద్దున్న లేచొచ్చి చూస్తే అప్పుడే వాంతి చేసుకునొచ్చి పడుకుంటోంది. కాస్త నిద్ర పట్టాక దుప్పటి కప్పి తలుపు దగ్గరేసి వచ్చాను. వరసగా ఫోన్ కాల్స్.. మూడురోజులుగా మేం ఎంతమందిని కనుక్కున్నామో అంతకు నాలుగు రెట్లు కాల్స్ వస్తాయి ..సహజమే కదా ..” పల్చగా నవ్వాడు.
ఏమనడానికీ తోచలేదు. కళ్ళతోనే సానుభూతి తెలియజేస్తూ కాఫీకప్పు అందుకున్నా.
ఇప్పుడే లేచి బాత్రూమ్ లో కెళ్ళింది. కాస్త కాఫీ తాగితే సర్దుకుంటుందిలేఅన్నాడు. ఈలోపు హాస్పిటల్ నించి ఫోన్ కాల్స్. సుజాత కోసం కొంతసేపు చూసి మళ్ళీ కలుద్దామని చెప్పి వచ్చేశాను.
సాయంత్రం దాకా పేషెంట్లతో గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. వేసవి సెలవుల్లో రాధపిన్ని ఇంటికి వెళ్ళడం, పిల్లలందరం కలిసి ఆడుకున్న అమాయకపు ఆటలూ గుర్తొచ్చాయి. బాబాయి యాభై దాటకుండానే పోవడం, అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు కావలసి ఉండడంతో అందరిలోకీ చిన్నవాడైన చలపతి డిగ్రీ పూర్తి చేస్తూనే ఉద్యోగంలో చేరిపోవల్సి వచ్చింది. రమ, రాజేశ్వరిలకి మంచి సంబంధాలు కుదిరి, పెళ్ళిళ్ళయి బాగా స్థిరపడ్డారు గాని , చలపతి మాత్రం  చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తూ మిగిలి పోయాడు.. ఒక్క సంతానమే చాలని, వాణ్ణి బాగా చదివించాలని భార్యా భర్తలిద్దరూ నిర్ణయించుకున్నపుడు రాధపిన్ని ఆయన అర్ధాంతరంగా మమ్మల్నొదిలేసి పోబట్టే కదా నా కొడుకిలాంటి నిర్ణయం తీసుకుని, చిన్నవెధవకి తోబుట్టువు లేకుండా చేశాడుఅని అమ్మ తో చెప్పుకుని బాధపడింది.
రెండేళ్ళ క్రితం రాధపిన్నికి బాగా సుస్తీ చేసి, ఆసుపత్రి లో చేర్పించారు. అపుడు అమ్మ వెళ్ళి పిన్ని దగ్గర రెండువారాల పాటు ఉంది. అప్పుడే ప్రకాష్ ని నేను గమనింపుగా చూసింది. అమ్మకోసం అయిదారు సార్లు వెళ్ళడంతో అంతకుముందే టెన్త్ పూర్తి చేసిన వాడితో నాకు కొంత సాన్నిహిత్యం ఏర్పడింది.
తర్వాత కొన్నాళ్ళకి వాణ్ణి బెస్ట్ బ్రెయిన్స్ కాలేజీలో ఇంటర్లో చేర్పించారని తెలిసినపుడు నాకు చాలా చిరాకనిపించింది. అక్కడ ఫీజులు చాలా ఎక్కువ. ప్రకాష్ తెలివితేటలున్న పిల్లవాడే అయినా శ్రద్ధ, శ్రమించే తత్వం ఎంత మాత్రం లేనివాడు. అలాంటి పిల్లాడిని తీసుకెళ్ళి  ఐఐటీ కోచింగులో బోలెడు ఫీజులు కట్టి చేర్పించి, వాడు సాధించలేని రాంకుల కోసం వాడిని రాచిరంపాన పెడితే ఏమవుతుందో నాకు తెలిసిన విషయమే. అప్పటికీ నా అభిప్రాయం చూచాయగా చలపతికి చెప్పాను.  ఇంకే కారణాలున్నాయో ఏమో గాని కట్టేసిన ఫీజు పైసా కూడా వాపసివ్వరని చెప్పడంతో నేనూ ఊరుకున్నాను. తర్వాత కొన్నాళ్ళకే రాధ పిన్ని పోయింది.
ఒకే ఊళ్ళో ఉన్నా ఉద్యోగాలూ, పిల్లల చదువులూ ఎవరి హడావిడిలో వాళ్ళం ఆ తర్వాత  కలుసు కోవడం పడలేదు. మొన్న వేసవిలో మా చిన్నమ్మాయి పెళ్ళికి చలపతి ఒక్కడే వచ్చాడు. ప్రకాష్ ఇంజనీరింగ్ ఎంట్రెన్సుల హడావిడిలో ఉన్నాడనీ, సుజాత వాడికి తోడుగా ఉండిపోవల్సి వచ్చిందనీ చెప్పాడు. మళ్ళీ ఇదే వాళ్ళని చూడడం !
పొద్దున్న పని హడావిడిలో సుజాతని పలకరించకుండానే వచ్చేశాను. ఇపుడు త్వరగా పని తెముల్చుకుని చలపతి ఇంటికి వెళ్ళి, ప్రకాష్ వస్తానంటే నాతో తీసుకు వెళ్దామనీ, రాకపోయినా పొద్దుటిలా మొక్కుబడిలా కాకుండా కాస్త తీరుబాటుగా కూర్చుని, ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడాలనీ అనిపించింది. అమ్మ ఫోను చేసినపుడెంత విసుక్కున్నా, అక్కడికి వెళ్ళాక ఆ కొద్దిసేపట్లోనే వాళ్ళ పట్ల చిన్నప్పటి ఆత్మీయత మళ్ళీ మొలకెత్తి  చిగుళ్ళేసినట్టైంది. వాళ్ళంతట వాళ్ళు అడక్కపోయినా ఆ ఇంట్లో అలముకుని ఉన్న నైరాశ్యానికి మూలం తెలుసుకుని, నాకు  చేతనైన సాయం చెయ్యాలనిపించింది. ప్రకాష్ కి అండగా నిలబడి వాడి మనసులోని బాధని చలపతికీ, సుజాతకీ అర్థమయ్యేలా సున్నితంగా తెలియజెప్పాలనిపించింది.
అవసరంలో ఆదుకోని బంధుత్వాల వల్ల ఉపయోగం ఏమిటేఅనే అమ్మ మాట గుర్తొచ్చింది. పెళ్ళిళ్ళలో పేరంటాలలో విందు భోజనాలు సేవించి, తోచిన బహుమతులిచ్చేసి రావడానికి బంధువులే కానక్కరలేదు కదా. ఈ పూట వీలయితే నలుగురం ఒకచోట కూర్చుని మాట్లాడుకోగలిగేలా ప్రయత్నించాలి.
నే వెళ్ళేసరికి చలపతి కూడా ఇంటికొచ్చేసి ఉన్నాడు. సుజాత సెలవులో ఉంది. ముగ్గురినీ హాల్లో సమావేశపరిచే ప్రయత్నం ఫలించింది.
ప్రకాష్! అయామ్ ష్యూర్ యు హావ్ యువరోన్ రీజన్స్ ...అవి మేం కూడా తెలుసుకుంటే మంచిది కదా.. ఎందుకిలా చేశావు? నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెపితే ఇంట్లో ఇప్పటికన్నా మేలైన వాతావరణం ఏర్పడుతుందిఅది అందరికీ మంచిది నాన్నా..ముందుగా ప్రకాష్ ని అడిగాను.
వాడు నోరు విప్పలేదు. ఎన్నివిధాల ప్రయత్నించినా నీకు తెలియదత్తా,ఇలాంటి డిస్కషన్స్ వేస్టత్తాఅంటూ  దాటేశాడు. కొంతసేపాగి చలపతే అన్నాడు పోన్లే అక్కా...ఏది ఎందుకు జరిగిందో వాడేమీ చెప్పక్క ర్లేదులే.. ఇక ముందేం చేద్దామనుకుంటున్నాడో చెపితే చాలు. ఇంటర్లో వీడికొచ్చిన మార్కులకి, ఎమ్సెట్ లో, ఏఐట్రిపులీ లో వచ్చిన రాంకులకీ చెప్పుకోదగ్గ ఏ కాలేజీలోనూ సీటురాదు. మానేజ్మెంట్ సీటు కొనే స్థోమత నాకు లేదు. మరి ఏం  చెయ్యాలో  ఆలోచించుకోవాలి కదా !”
మళ్ళీ ప్రకాష్ వైపు చూశాను. వాడి మొహం నిండా పరుచుకుని స్పష్టంగా కనిపిస్తున్న నిరసన జ్వాలలు ఏం చేస్తే చల్లారుతాయి?  ఏ పరిస్థితులు వాడిని ఇల్లొదిలి వెళ్ళేలా చేశాయి ? అవే పరిస్థితులు ఇంకా ఉంటే చక్కదిద్దడం ఎలా ? ఇవి తేలాలంటే వాడు పారిపోక ముందు ఏం జరిగిందో తెలియాలి. అక్కడ పడ్డ చిక్కుముళ్ళు విప్పాలి.
ప్రకాష్ నోటి నుంచి సమాధానం రాబట్టడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. ఒకసారి మొదలంటూ పెట్టాక ఒకటొకటిగా ఎన్నో సంఘటనలు  చెప్పుకుంటూ పోయాడు ! వాడి మేనత్త కొడుకు రమేష్ తో, క్లాస్ మేట్ చంద్రశేఖర్ తో,  పక్కింటి చక్రధర్ తో, సుగుణతో పోలుస్తూ తల్లీ తండ్రీ ఏమన్నారో, వాడు చదివే కాలేజీలో చేర్పించడానికి ఎన్ని లక్షలు గుమ్మరించారో చెపుతూ ఎంత ఒత్తిడి పెట్టారో చెప్పి, ఆ టెన్షన్ లో తను సరిగా పరీక్షలు రాయలేకపోయాననీ,  పాసవడమే గొప్ప అనే స్థితికి వచ్చాననీ చెపుతుంటే వాడి కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలిపోయాయి. మార్కులొచ్చాక సుజాత ఎన్ని మాటలందో, ఎంత తిరస్కారంగా చూసిందో చెపుతుంటే నా మనసు మెలిపెట్టి తిప్పినట్టయింది.
మాట్లాడితే ఎంత డబ్బు కట్టారో, ఎంత కష్ట పడ్డారో చెప్తారు. నా కోసం అంత కష్ట పడొద్దని చెప్పుచొక్కాతో కళ్ళూ , ముక్కూ తుడుచుకుంటూ ఉక్రోషంగా అన్నాడు.
ఆలోచిస్తూ సుజాత వైపు చూశాను. అభావంగా ఉన్న ఆ మొహం చూస్తే ఆశ్చర్యం వేసింది.
“  చలపతీ ! ... ఏమంటావురా ?” అన్నా మెల్లగా.
ఏమనగలనక్కా! చాలా పొరపాటు చేశాం. నిజమే..ఇప్పుడు వాడికేం చెయ్యాలనుందో అదే చెయ్యనీ.. వాడెలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం చర్చ నించి తప్పుకుంటున్నవాడిలా, కీలక పదవికి రాజీనామా చేసిన వాడిలా అన్నాడు.
మళ్ళీ సుజాతనే చూస్తూ సుజా! నువ్వొక విషయం  చెప్పాలి...ఇలా మీ విషయాల్లో అనవసరంగా కల్పించుకుంటున్నాననుకోవడం లేదు గదా! పొద్దున్న చూసి వెళ్ళాక కొంచెం తీరిగ్గా మాట్లాడాలనిపించి మళ్ళీ వచ్చాను అన్నాను. ఈ సమావేశం ముగ్గురికీ ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది. ఇష్టం లేదనే కంటే దీనివల్ల ఉపయోగం ఉండదనుకుంటున్నారంటే సమంజసంగా ఉంటుందేమో.
చీర అంచు వేళ్ళతో సాపు చేస్తూ  లేదొదినా!  ఈ రోజుల్లో ఎవరి విషయం ఎవరిక్కావాలి? ఎంతోమంది నీ సలహా కోసం ఎదురు చూస్తూంటారు. మా మీద ఆపేక్షకొద్దీ నువ్విలా ఇంటికొచ్చి మరీ ..ఆగిపోయింది.
అబ్బా అలా ఫార్మల్ గా అయిపోకు సుజా...కుటుంబసభ్యులు ముగ్గురూ ఒకచోట కూర్చుని మనసుకి కష్టం అనిపించిన విషయాలు ఘర్షణ లేకుండా చర్చించుకోవచ్చు కదా అనీ..వాడి మాటలన్నీ విన్నావు కదా! ఇపుడు నీ మనసులో ఏముందో చెప్పుసాధ్యమైనంత మృదువుగా అన్నాను.
తలెత్తి ఏదో చెప్పబోయిన సుజాత తిరస్కారంగా ఉన్న కొడుకు మొహం చూసి ఆగిపోయింది. నేను చెప్పేదేం లేదు వదినా ! వాడన్నవన్నీ నిజమేఅని ఊరుకుంది.
అలా అంటే ఎలా సుజా! కొంచెం సానుకూలంగా ఆలోచించు! వాడి వయసెంతని? ప్రతిమనిషికీ ఒక కెపాసిటీ ఉంటుంది కదా..దాన్ని మించి సాధించాలంటే సాధ్యమా ? వాడు గొప్ప ఇంజనీర్ కావాలనీ, ఐఐటీ లోనో, బిట్స్ లోనో చదవాలనీ మీకు కోరిక ఉండి ఉండొచ్చు. అది సాధించాలనే తపన వాడిలో లేకపోయినా, అందుకు తగిన తెలివితేటలూ , ధారణశక్తీ తక్కువైనా వాడికది సాధ్యమవదు ! మనం సాధించలేనిదాన్ని, మన మనసు కోరుతోంది గనక వాడి నెత్తిన రుద్దడం సరికాదు కదా. అందులోనూ నువ్వూ చలపతీ ఒకటై పోయి వాడిని మానసికంగా ఒంటరి వాడిని చేశారేమో ఆలోచించుకోండి. వాడిలో ఈ ఇల్లూ, ఈ కుటుంబం తనదనే భావం లేకుండా పోవడానికి కారణమేమిటి ? ఇపుడు చూడు...
నా మాటలు పూర్తి కాకుండానే అవునొదినా ! ప్రపంచమంతా చిన్నపిల్లలూ, వృధ్ధులూ నిస్సహాయులనీ , బలహీనులనీ, మధ్యవయసు వాళ్ళంతా బలవంతులూ క్రూరులూ అనీ అనుకుంటుందినవ్వింది సుజాత.
            ఆ మాటలకి  అవాక్కై, తేరుకుంటూ అదేం మాట సుజా? వేరే వాళ్ళతో తరచూ కంపేర్ చేస్తుంటే  కష్టంగా ఉందంటున్నాడు వాడు. వాడి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనది కాదంటావా?  అన్నాను.
          “అవునొదినా వాడి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినేలా ప్రవర్తించి పొరబాటు చేశాం. వాడి క్లాసులోనే వాడి లాగే పెరిగిన కుర్రాళ్ళు శ్రద్ధతో, క్రమశిక్షణతో చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటుంటే వాళ్ళతో వీడిని పోల్చడం తప్పే! మార్కులు మరీ తక్కువొచ్చినపుడు అడగడం తప్పే...క్లాసులో సరిగా పాఠాలు చెప్పడం లేదంటే మరి మిగిలిన పిల్లలెలా చదవగలుగు తున్నారని అడగడం తప్పే. లెక్చరర్స్ ని వాడూ వీడూ, ఇడియెట్,స్టుపిడ్ అంటే అలా అనద్దని వారించడం తప్పే! విద్యార్థిగా శ్రద్ధ పెట్టి చదవాల్సిన టైమ్లో గంటలుగంటలు టీవీ చూడద్దనీ, పనికిరాని వీడియో గేమ్స్ ఆడద్దనీ చెప్పడం తప్పేగోడకి చేరబడి కింద కూర్చున్న సుజాత మాటల్లో కనిపించకుండా దాక్కున్న ఆవేశం! అదురుతున్న పెదవులూ, ఎర్రబడ్డ ముక్కూ, సన్నని నీటిపొరతో తడిగా మెరుస్తున్న పెద్ద కళ్ళూ, గంజి లేక వంటికి అతుక్కుపోయిన  నూలు చీరా....
        “సుజా! ప్లీజ్ ..నేనలా అన్నానా ? ఇది తప్పు, ఇది ఒప్పు అని నేనేమీ క్లాసిఫై చెయ్యడం లేదు. అలా చెప్పడానికి
నేనెవర్ని? వాడు పరాయి వాడు కాదు మీ ఇద్దరికీ కొడుకు. వాడి మీదే పంచప్రాణాలూ పెట్టుకుని ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఎంత బాధో ఊహించగలను కాబట్టే చెపుతున్నా. పరిస్థితులెలా వచ్చినా పిల్లలకీ తల్లిదండ్రులకీ మధ్య కమ్యూనికేషన్ తెగిపోకూడదు! అందుకే కలిసి మాట్లాడుకుందాం అంటున్నా. రెండు పక్షాలుగా విడిపోయి కాకుండా, ఎవరికి వాళ్ళం అవతలి వాళ్ళ దృష్టికోణాన్ని అర్ధం చేసుకుందామనే ధోరణితో చర్చించుకుందామంటున్నాఅనునయంగా అంటూ చలపతి వైపు చూశాను. సుజాతకి కొంచెం దూరంలో పేము కుర్చీలో  కూర్చుని బాల్కనీ బయటి ఆకాశాన్ని చూస్తున్నాడు వాడు. రసహీనమైన పల్చని నవ్వు వాడి పెదవుల మీద.
           “మా పంచప్రాణాలూ వాడి మీద పెట్టుకున్నాం గాని వాడికి మా మీద ఎలాంటి భావం ఉందో మాకు తెలీదు వదినా!
ఎపుడైనా చెట్టునించి కాయకి పోషణ అందుతుంది గాని కాయ నించి చెట్టుకి రాదుగా! నువ్వింత అభిమానంతో తాపత్రయ పడుతున్నావు గనక  సరే అంటున్నా....తప్పకుండా చర్చించు కుందాం...టెన్త్ తర్వాత బెస్ట్ బ్రెయిన్స్ కాలేజీలో  ఎందుకోసం చేరాడో, ఎవరి కోరిక మీద చేరాడో వాడినడగు అంది నన్ను సూటిగా చూస్తూ.
             ప్రకాష్ వైపు ప్రశ్నార్థకంగా చూశా. వాడు మాట్లాడకుండా గోడ వైపు చూస్తూ కూర్చున్నాడు.
పోటీపరీక్షలొద్దనుకున్నవాడు ఐఐటీలో సీటుకోసం కోచింగిచ్చే కాలేజీలో చేర్పించమని అంత హఠం ఎందుకు చేశాడో అడుగు. లక్షన్నర ఫీజా? పుస్తకాలకీ, వాన్ లో వెళ్ళి రావడానికి ఇంకో యాభై వేలా? మా లాంటి వాళ్ళ కి అందుబాటులో ఉండే చదువేనా అది ? మనింటి దగ్గర కాలేజీ ఫలితాలు బావున్నాయి కద నాన్నా అంటే  ససేమిరా.. వింటేనా ? వాడి స్కూలు ఫ్రెండ్స్ సురేషూ, సందీపూ, బాబీ, బుజ్జీ, వెంకూ, టెంకూ అంతా అక్కడ చేరిపోతున్నారు. వీడూ అక్కడే చేరాలి! వాళ్ళకి ఎక్కీ తొక్కీ డబ్బుంది. మనకేముంది ? రెక్కల కష్టంతో ఈ ఫ్లాట్ మీద లోను కట్టుకుంటూ ఎలాగో మానేజ్ చేస్తున్నాం. మా లాంటి వాళ్ళ పిల్లలు ఎంత బాధ్యతగా ఉండాలి ?
ఐఐటీ లేదా బిట్స్ లో చదవాలని గాఢమైన కోరిక ఉండి, అందుకోసం ఎంతైనా కష్టపడతానని వాడు సిద్ధపడి ఉంటే, శ్రద్ధతో చదివి ఉంటే,  ఇంత ఫీజు కట్టినందుకు సీటు రాక పోయినా మేం బాధపడేవాళ్ళం కాదు. అసలా కోరికే లేని వాడికి ఇంత హైఫై కాలేజీ ఎందుకు? వేసవి ఎండ తెలీకుండా చదువు సాగడానికి ఏసీ రూములు, పొద్దున్న ఆరింటి నించి రాత్రి పదకొండు దాకా తెరిచి ఉంచే సూపర్ లైబ్రరీ, ఎప్పుడు డౌట్స్ వొస్తే  అప్పుడే క్లియర్ చేసేసే ఫాకల్టీ  అంటూ చెప్పిందే చెప్పి, రెండు రోజుల పాటు అలిగి, తిండి మానేసి, మమ్మల్ని ఒప్పించి  ఈ కాలేజీలో చేరినవాడు, తన లక్ష్యం చేరాలని ప్రయత్నం చెయ్యాలా వద్దా ? నేను స్కూలు నించి నాలుగున్నరకి ఇల్లు చేరతాను. వాడి క్లాసులు ఒంటిగంటకే అయిపోతాయి. కాలేజీ లైబ్రరీ లోనో, స్టడీ ఏరియా లోనో కూర్చుని హోమ్ వర్క్ చేసుకోవచ్చు. వచ్చిన డౌట్స్ వచ్చినట్టుగా క్లారిఫై చేసుకోవచ్చు. ఆ సౌకర్యాలకోసమే కదా అంతడబ్బు కట్టింది! ఏదీ లేదు...కాలేజ్ అవర్స్ అయిపోగానే ఇంటికొచ్చేసి ఏం చేసేవాడో వాడికే తెలియాలి. నేను నాలుగింటికి లేచి ఇంటి పనీ, వంట పనీ పూర్తి చేసి, ఆదరా బాదరా తెమిలి, వాడికి డబ్బా కట్టిచ్చి, ఎనిమిదింటికల్లా స్కూలు బస్సెక్కితే, పెట్టిన తిండి లంచవర్లో వాడికిష్టమైతే తినడం, లేకపోతే ఫ్రెండ్స్ తో పక్కనున్న ఫుడ్ జాయింట్ లో కాలక్షేపం చేసుకోవడం ! ఏమిట్రా ఇదీ అంటే విసుగు. ఏంటమ్మా ! బుర్ర వేడెక్కి పోతే  కాస్సేపు  కాంటీన్ కి వెళ్ళడం కూడా తప్పేనా? ‘ అంటూ అలక !” మంద్ర స్వరంతో అన్నిటికీ అలవాటు పడిపోయినట్టు చెప్పుకుపోతోంది సుజాత.
అప్పటిదాకా చలనం లేకుండా వింటూ కూర్చున్న ప్రకాష్ చివాల్న లేచి వెళ్ళి పోబోయాడు. వాడి చెయ్యి పట్టుకుని ఆగు నాన్నా..మన వెర్షన్ చెప్పినంత సేపూ అమ్మా నాన్నా కదలకుండా విన్నారు కదా...వాళ్ళు చెప్పేది మనమూ వినాలి !” అన్నాను.
ఒక నిముషం నిశ్శబ్దం తర్వాత విరక్తి నిండిన చిన్న నవ్వు నవ్వి, మళ్ళీ మెల్లిగా చెప్పడం మొదలు పెట్టింది సుజాత ఆ కాలేజిలో ముప్పాతిక వంతు పిల్లలు డబ్బుకి లోటు లేని ఇళ్ళనించి వచ్చిన వాళ్ళే. మిగిలిన కొద్ది మందీ తెలివి తేటలొకటే కాకుండా రాత్రీ పగలూ శ్రమించి, భవిష్యత్తుకి  పునాదులేసుకోవాలనే కోరిక కూడా ఉన్నవాళ్ళు ! మనం ఈ రెండు కోవలకీ చెందని వాళ్ళం. ఈ విషయం ఎంత వివరించి చెప్పినా తిండి మానేసి హఠం చేసి, వాడి పట్ల మాకున్న ప్రేమని, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి ఆయుధంలా వాడుకుని, తను కోరుకున్న చోట చేరాడు. రెండేళ్ళ చదువు గురించి ఎన్ని ప్రామిస్ లు చేశాడో లెక్క లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి, ఆ మాట ఇస్తున్నప్పుడు కూడా లేకపోతే  ఏమనాలి?
వాడి పాఠాలు నా ప్రైమరీ టీచర్ స్థాయికి అర్థమయ్యేవి కావు. పేరెంట్స్ మీట్ కి వెళ్ళినపుడల్లా ఖాళీ వర్క్ బుక్సూ, పూర్తి కాని ఆన్సర్ షీట్సూ చూపించి లెక్చరర్స్ అడిగే ప్రశ్నలకి మొదట్లో అయితే దిమ్మెరపోయామంటే నమ్ము. ఏమిటిరా ఇదీ  అంటే  తన సీబీయస్సీ సిలబస్ కీ, వీళ్ళఇంటర్ మీడియెట్ సిలబస్ కీ చాలా తేడా ఉందనీ, మెల్లిగా పికప్ చేసేస్తాననీ వాగ్దానాలు !.. మాకూ బోల్డంత అనుభవమేమీ లేదు గదా ఇలాంటి వాటిల్లో? వాడేం చెపితే అది నమ్ముతూ వచ్చాం. ఎప్పుడూ లేనిది స్పెషల్ క్లాసులనీ , కంబైండ్ స్టడీస్ అనీ చెప్పి కొన్ని సార్లు సినిమాలకీ, షికార్లకీ కూడా చెక్కేశాడు. ఎంత ప్రేమగా పెంచాం? ఎంత నమ్మకం ఉంచాం వాడి మీద? మాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి ?”
నెమ్మదిగా మాట్లాడుతున్నా , పదునుగా, ఆవేదనగా ఉన్న ఆ మాటలు కళ్ళప్పగించి వింటూండి పోయాను.
ప్రకాష్ కుర్చీలో ఇబ్బందిగా, అసహనంగా కూర్చున్నాడు. కొంతసేపటి మౌనం తర్వాత
పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వాళ్ళలా పెర్ ఫామ్ చెయ్యాలని ఆశించడం, ఆదేశించడం తప్పని అందరూ అంటున్నారు. నేనూ అలాగే అనుకున్నాను. నా చిన్నపుడు అనేవారు స్పర్ధయా వర్ధతే విద్యాఅని. ఎవరిలో మంచి కనిపించినా నేర్చుకోవచ్చు, స్ఫూర్తి పొందచ్చు. కానీ ఇపుడు చదువు పేర రాచి రంపాన పెట్టేయడానికీ, సున్నితంగా సజెస్టివ్ గా ఇతరుల్లో నేర్చుకోదగ్గ అంశాలని సూచించడానికీ తేడా తెలుసుకోలేకుండా ఉన్నారు పిల్లలు! విద్యార్ధి దశలో క్రమశిక్షణ ఎంత అవసరమో, కోతిలా గంతులేసే మనసుని నిగ్రహించడం ఎంత ముఖ్యమో తెలిసీ, వాళ్ళకిష్టమైనట్టు వాళ్ళని చదువుకోనీయమనీ, వాళ్ళు హాండిల్ చెయ్యలేనంత స్వేచ్ఛని వాళ్ళకివ్వమనీ  సలహాలు చెప్పేవాళ్ళు, తమ ప్రయోగాలన్నీ ఇతరుల పిల్లల మీద చేసేవాళ్ళు  ఎక్కువై పోయారు. పిల్లలు హద్దు మీరితే గట్టిగా గద్దించే ధైర్యం తల్లిదండ్రులకి లేదు ప్రస్తుతం. కొన్నాళ్ళాగితే మనదేశంలో కూడా తల్లిదండ్రులు కోప్పడ్డారని పిల్లలు కంప్లైంట్ చేస్తే, తీసుకెళ్ళి జైల్లో పారేస్తారేమో! ఆ చట్టాల పుణ్యమా అని అమెరికన్లెంత బాగుపడ్డారో నాకు తెలీదులే...
మా అక్క కొడుకు ఇంట్లో తల్లికి అన్నివిధాలా సాయపడుతూ చదువు లోనూ రాణిస్తున్నాడు. మరి మా ఇంట్లో ? లేచిందగ్గర్నించి, పడుకునే దాకా తెమలని పని తో సతమతమైపోతున్నా అయ్యో అమ్మ అలిసిపోతోందేఅన్న ఆలోచన కూడా లేదు వాడికి. ఏదైనా చిన్న పని చెప్పబోతే, కాలేజిలో తనెంత టైరై పోయాడో , ఇంకా ఎంత వర్కుందో వివరాలు !!
మేం ఎవరితోనూ వాడిని పోల్చకూడదు గాని వాడు మాత్రం సందీప్ స్పోర్ట్స్ షూస్ కొనుక్కున్నాడనీ, బాబీ బర్త్ డే పీజా హట్ లో సెలబ్రేట్ చేసుకున్నాడనీ, సుధీర్ రోజూ బెంజ్ కార్లో వస్తాడనీ  పోల్చుకోవచ్చు !”
సుజాత ఒక్కక్షణం ఆగగానే చలపతి అందుకుని,ఎంతసేపైనా ఇదిలా సాగుతూనే ఉంటుందిలే అక్కా!ఒకరోజు రెండురోజుల కథ కాదు కదా.. రెండేళ్ళ యాక్షన్, రియాక్షన్, ఇనాక్షన్ స్టోరీ....ఇంక ఇవాళ్టికి ఆపేద్దాం.. కొంచెం కాఫీ తాగి వేరే కబుర్లు చెప్పుకుందాం...అంటూ లేచాడు. నాకు విసుగొస్తుందేమో అన్న భయం, ఇన్నాళ్ళుగా కొడుకు తెలుసుకుందుకు ప్రయత్నించని తమ మనో వేదన ఇవాళైనా వాడికర్థమయేలా చెప్పగలగాలన్న తాపత్రయం రెండూ చలపతి ముఖంలో కనిపిస్తూనే  ఉన్నాయి.
చలపతి వంటింటి వైపు వెళ్తుంటే సుజాత వాడివైపు చూస్తూ మీ తమ్ముడి వైపొక్కసారి చూడు వదినా ! జుట్టంతా పలచబడి బట్టతలైపోయింది. నిద్రచాలక కళ్ళచుట్టూ చారలు...మనిషెంత తగ్గిపోయారో చూశావా? ఆఫీసులో విపరీతమైన పని వత్తిడి. ఈ రిసెషన్ పుణ్యమా అని ఎపుడు ఊడతాయో తెలీని ఉద్యోగాలు.. ఇపుడు పెరిగిపోయిన ఖర్చుల కోసం సాయంత్రాలు వేరే చోట పార్ట్ టైమ్ జాబ్ లో చేరారు. ఇంటికొచ్చి వెళ్ళడానికి కుదరక అక్కడే ఏదో ఉడిపి హోటల్లో రెండిడ్లీలు తిని, రాత్రి పదింటి దాకా పని చేసి ఇంటికొస్తారు. ప్రైవేటు స్కూల్లో టీచరుగా నా జీవితం మీకు తెలీనిది కాదు. వాడికిపుడు పద్ధెనిమిదేళ్ళు. ఓటుహక్కు వచ్చేసింది. పాలకులనెన్నుకోగల సమర్ధుడు! కానీ నీలాంటి విజ్ఞుల దృష్టిలో నిస్సహాయుడు. తల్లిదండ్రుల క్రౌర్యానికి బలైపోతున్న పసివాడు. నీ దాకా ఎందుకు.. వాడి దృష్టిలో కూడా అంతే..
చలపతి  ఆ మాటలకి కంగారుగా వెనక్కొచ్చి సుజా ! ఏమిటది ? ఏం మాట్లాడుతున్నావు?” అన్నాడు.
నువ్వుండు చలపతీ ! చెప్పనీఅంటూ వారించాను.
యాభయ్యేళ్ళ తండ్రీ, నలభయ్యేడేళ్ళ తల్లీ తనకవసరమైనవన్నీ అమర్చి పెట్టాలని కోరుకునే వాడికి, ఆ సంసారానికి తన కంట్రిబ్యూషన్ ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం లేదా? మోనిటరీ గా అడగడం లేదు. రాత్రి పదింటికి ఇంటికొచ్చే తండ్రి మనసు సంతోషపడేలాగా ఒక ప్రేమ నిండిన మాట ! ఎంత చదువు చదివేస్తున్నా చిన్నపాటి డైవర్షన్ లాగా కాస్త మంచినీళ్ళందించడం, చేతిలో బాగ్ అందుకోవడం... ఏదీ లేదు! ఏదైనా చెప్పబోతే వినేందుకు సంసిద్ధత లేదు. అమెరికా లోలా స్వేచ్ఛ కావాలి.... వాళ్ళలా పదహారేళ్ళకే తమ కాళ్ళమీద తాము నిలబడాలనే కాంక్ష లేదు.వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లేబర్  మనకెలా నచ్చుతుంది? వేరే పిల్లల్లో ఏదైనా  సుగుణం కనిపిస్తే మేం చెప్పకూడదు. వాడికేవేవో అర్థాలు తోస్తాయి! వాడు మాత్రం తన స్నేహితుల పేరెంట్స్ తో అస్తమానూ మమ్మల్ని పోల్చి మేమెంత పనికిమాలిన తల్లిదండ్రులమో చెప్పకుండానే మాకర్థమయ్యేలా  చెయ్యచ్చు. బాబీ వాళ్ళమ్మ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాణ్ణి పికప్ చేసుకుంటుంది! ప్రియాంకా వాళ్ళమ్మ బిజినెస్ ఎగ్జిక్యూటివ్! చాలా మోడర్న్ గా, స్టైలిష్ గా ఉంటుంది. శాండీ వాళ్ళ నాన్న సింగపూర్ నించీ, ఆస్ట్రేలియా నించీ మంచి మంచి గిఫ్టులు తెస్తాడు...!!
ఒకసారి కాలేజిలో పేరెంట్స్ మీట్ కి వెళితే వాడికి మా పక్కన కూచోడానికే నామోషీ అయింది ! మమ్మల్ని పిలిచేదాకా కారిడార్లోనే తచ్చాడాడు! నిలదీసి అడిగితే ఇదీ విషయం! నువ్వింకాస్త బాగా తయారవచ్చు కదా..ఇలా అప్పలమ్మలా ఎందుకుంటావ్అని విసుక్కున్నాడు. నేను తెల్లబోయాను !”
సుజాత మాటల ప్రవాహంలో కొట్టుకుపోతూ మొదటిసారిగా వాళ్ళిద్దరినీ గమనించాను. నిజమే రెండేళ్ళలో ఇద్దరిలో ఎంత మార్పొచ్చింది! పదేళ్ళ వయసు పెరిగినట్టున్నారు! కళ్ళల్లో ఎంత ఉదాశీనత!
నా చిన్నపుడు అమ్మా, నాన్నా, మామ్మా అంతా చెప్పేవారు...వాళ్ళమ్మాయిని చూడు ఎంత శ్రద్ధ ! వీళ్ళమ్మాయిని చూడు ఎంత పనితనం! వాణ్ణి చూడు ఎంత పొదుపు, వీడికెంత వ్యవహార జ్ఞానం,.....వినయం, సహనం, మాటతీరు...ఒకటి కాదు, ఎవరిలో ఏ మంచి కనపడినా చెపుతుంటే వింటూ, జీవితానికి కావలసినవన్నీ నేర్చుకుంటూ ఎదిగాం. ఇవాళ పిల్లల ముందు ఎవరినీ మెచ్చుకోకూడదు. ఎవరితోనూ పోల్చకూడదు. నువ్వింతవాడివి, అంతవాడివి అంటూ వాళ్ళనే పొగుడుతూ, చిన్న చిన్న పనులక్కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి. వాళ్ళే సర్వ శ్రేష్ఠులని తీర్మానిస్తే  ఇంకెవర్ని చూసి నేర్చుకుంటారో మరి? తప్పిజారి, విసిగి పోయి, ఒకమాటన్నామంటే ఇల్లొదిలి పారిపోతారు ! ఇంకా ఏమైనా కూడా చెయ్యచ్చు!!"
 తలూపుతూ ఊఁ..ఏమైనా చెయ్యచ్చు! అపుడు పిల్లాడినీ కోల్పోయి, సమాజం సానుభూతీ కోల్పోయి, జీవచ్ఛవాల్లా బతుకీడ్వాల్సి వస్తుంది...
పసిప్రాయం నించీ వాళ్ళ అవసరాలన్నీ అనుక్షణం గమనిస్తూ, ప్రతీదీ నేర్పిస్తూ, మంచి చెడులు వివరిస్తూ ఇన్నేళ్ళూ పెంచుకుని, ఇవాళ అవసరమనిపించిన ఒకమాట స్వతంత్రంగా అనేందుకు లేదు. సహజంగా యధాలాపంగా మాట్లాడ్డానికి వీల్లేదు. జాగ్రత్తగా మసలుకోవాలి! ...నాకు తెలీకడుగుతాను వదినా.. ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకిస్తున్న స్వేచ్ఛవల్ల అంతా మంచే జరుగుతోందంటావా? చాలా ఇళ్ళల్లో తల్లిదండ్రులు పిల్లల్ని చూసి భయపడుతున్నారని నీకు తెలుసా? చాలా చోట్ల పిల్లలకీ పేరెంట్స్ కీ మధ్య సంబంధం తుమ్మితే ఊడే ముక్కులా తయారైందంటే కాదనగలవా?
"మాకన్నా వాడు బాగా బతకాలనే కోరికతో వాడు కోరిన చోట తల తాకట్టు పెట్టి చేర్పించాం గాని, రేపు వాడు ఫలానా ఇన్స్ టిట్యూట్ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడని చెప్పుకుని గర్వపడాలనో, మా తీరని కోరికలన్నీ వాడి నెత్తిన రుద్దాలనో కాదు. ఆఫీసులోనూ, ఇంట్లోనూ ఎన్నో కమిట్ మెంట్స్, ప్రెషర్స్ ఎదుర్కొంటూ, అపురూపంగా పెంచుకున్న పిల్లలు తృణీకరిస్తే, అవమానం పాలు చేస్తే, బతుకెంత రోత అనిపించినా మా లాంటి వాళ్ళు ఎక్కడికీ పారిపోలేరుగా? బతికి తీరాల్సిందే! వాడి ప్రవర్తనకి కుంగి పోయి మేం ఎటన్నా పారిపోతే వాడు మమ్మల్ని వెతికి తీసుకొస్తాడంటావా?” పెదవుల మీద నవ్వు పులుముకుంటూ అడిగింది.
ఆ శుష్కహాసం బరువుగా నా గుండెని తాకింది. ఇంతలో చలపతి కాఫీ కప్పులున్న ట్రే పట్టుకొచ్చాడు. ముందుగా ప్రకాష్ దగ్గరకెళ్ళి బోర్నవిటా తీసుకో నాన్నాఅంటూ విడిగా పెట్టిన మగ్గు తీసి వాడికిచ్చాడు.
కళ్ళెత్తి వాడు వాళ్ళనాన్నని చూస్తూంటే తడిగా ఉన్న వాడి కళ్ళు అద్దాల్లా తళతళలాడాయి. బోర్నవిటా మగ్గు అందుకుంటూ అయామ్ సారీ నాన్నా!...” అనబోయాడు. గొంతుకేదో అడ్డం పడ్డట్టయింది. కళ్ళ నించి రెండు ముత్యాలు రాలి పడ్డాయి. చెప్పలేకపోయినది కళ్ళతో వ్యక్తపరుస్తూ వాళ్ళమ్మ వైపు చూశాడు.
కాఫీ తాగి కొంత సేపు కూర్చున్నాక ఇంటికి బయల్దేరుతుంటే కారు దాకా వచ్చి థాంక్స్ చెపుతూ వీడ్కోలిచ్చారు చలపతీ, సుజాతా. వాళ్ళనించి నేనివాళ నేర్చుకున్నదానికి మాటల్లో కృతజ్ఞత చెప్పాలనిపించక అలాగే వచ్చేశాను.

                                         *     *    *   *
(2013 ఉగాది కథల పోటీలొ ప్రధమ బహుమతి పొంది, 25-4-13 ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమైన కథ)


April 12, 2013

తుల్జా భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు


   
                                                                         
          భూమిక అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. మార్చి పన్నెండున ఉదయం పది గంటలనుండి సాయంత్రం అయిదు గంటలదాకా భూమిక సభ్యులంతా ఆక్స్ ఫాం ఇండియా ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సంస్థలతో కలిసి జరుపుకోబోయే ఉత్సవానికి ముందుగానే ఆహ్వానాలందడంతో సరిగా పది అయ్యేసరికి నేనూ మరొక రచయిత్రి శ్రీమతి సుజల గారూ కాచిగూడాలోని తుల్జా భవన్ కి చేరుకున్నాం. పూల సజ్జలోంచి కొండ మల్లెలు విచ్చుకుంటున్నట్టు ఎదురుగా నవ్వులు పంచుతూ సత్యవతి. మేము లోపలికి అడుగు పెట్టీ పెట్టక ముందే ఎదురొచ్చి ఆప్యాయంగా హత్తుకుంది.కలుసుకుని చాలా రోజులైందేమో ఇద్దరం  మైత్రీ బంధంలో ఒక్క క్షణం పరిసరాలు మరిచాం.తేరుకునేసరికి చేతిలో కెమేరా క్లిక్ చేస్తూ సుజాతా మూర్తి గారు.
తుల్జా భవన్ ప్రాంగణమంతా షామియానాలకింద తెల్లని వస్త్రంతో అందంగా అలంకరిచబడి ఉంది.వేదిక ధవళ కాంతులతో అతిధులకోసం ఎదురుచూస్తోంది.అటూ ఇటూ వరసగా కర్రలు పాతి ,తెలుపు రంగు వస్త్రాలు చుట్టి సిద్ధం చేసిన స్టాల్స్. అన్నీ మహిళలకి సంబంధించిన సమస్యలూ,వాటిని ఎదుర్కొనే విధానాలూ, వారికి తోడ్పడే చట్టాలూ...వీటి గురించి తెలియజేసే చిత్రాలతో నిండి కనిపించాయి.ఒక వైపు ఎండిన ఆకులూ ,పూరేకులతో ముక్తవరం వసంత లక్ష్మి గారు తయారు చేసిన అందమైన కళాఖండాలు ప్రదర్శనకు తయారవుతున్నాయి.రెండొ వైపు ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన మహిళలు తయారుచేసిన అందమైన ఎంబ్రాయిడరీ చీరలూ ,వస్త్రాలూ. APMSS, అస్మిత ,ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ ,SAFA India,షాహీన్,REDS, SWARD సంస్థలు , రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్ధులు  స్టాల్స్ ఏర్పాటు చేశారు.
శ్రీవిద్యా స్పెషల్ స్కూల్ విద్యార్ధులు  ఉప్పొంగే ఉత్సాహంతొ ఒకవైపు కుర్చీల్లో సర్దుకుంటుంటే రెండో వైపు రెయిన్ బో హోంస్ విద్యార్ధులు హరివిల్లులై విస్తరించారు. ఎదురు చూస్తున్న అతిధులంతా వచ్చేసరికి మరో గంట పట్టింది.
ముందుగా శ్రీవిద్యా స్పెషల్ స్కూల్ విద్యార్ధులు  కొన్ని పాటలకి నాట్యం చేసారు.వారెన్నుకున్న కళాప్రదర్శనలో వాళ్ళు చూపించిన నిమగ్నత ముచ్చట గొలిపింది.వాళ్ళకి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయినులు అక్కడే నిలబడి స్వంత తల్లుల్లాగా ఆతుర పడడం చూస్తే తల్లిదండ్రుల పక్కనే గురువుకి దైవసమానమైన  స్థానం ఎందుకిచ్చారో అర్ధమైనట్టనిపించింది!
సత్యవతి అప్పటిదాకా చేస్తున్న తన పర్యవేక్షణ ముగించి , చురుగ్గా సభ ప్రారంభించింది. ఆహూతులంతా వేదిక నలంకరించగానే అందర్నీ పరిచయం చేసింది .
ఎదురుగా కూర్చుని ఉన్న చిన్నారుల్ని ఉద్దేశ్యించి ఈరోజు ప్రత్యేకత ఏమిటని అడిగింది నవ్వుతూ.
వాళ్ళు కోలాహలంగా మహిళాదినోత్సవం అన్నారు.
ఇది ఉత్సవమేనా ? “అని సత్యవతి ప్రశ్నించగానే ఏమాత్రం తడబాటు లేకుండా అవునని వాళ్ళు జవాబిచ్చారు.
ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండగ ?మనం ఏమన్నా సాధించమా ?” అనడిగింది.
అవును సాధించాం అని ముక్త కంఠం తో పిల్లలంతా సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఏం సాధించాం ? “అని సత్య అడగ్గానే మన హక్కులు అన్నారు వాళ్ళు.
మన హక్కులు కొన్ని సాధించాం.. ఇంకా కొన్ని సాధించాలి కదా ? “అంటే అవునన్నారు.
ముఖ్యంగా ఏం సాధించాల్సి ఉంది?’ అంటే స్త్రీలకు భద్రత అని కొంచెం పెద్ద పిల్లలు చెప్పారు.
నిర్భయకి ముందూ తరవాతా దేశ యువతలో వచ్చిన మార్పుని ప్రస్తావించి ఈనాటి ఉత్సవం అంతా ఒక ఫ్రేం లో బిగించినట్టు కాకుండా కలిసి మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుందామని సూచించింది సత్య. ముందుగా ఆక్స్ఫాం  ప్రోగ్రాం ఆఫీసర్ రంజన గారిని మాట్లాడమని కోరింది.రంజన నేటి స్త్రీలూ, పిల్లలూ ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి కొద్ది సేపు మాట్లాడి మనమంతా వాటినెలా ఎదుర్కోవచ్చో వివరించి,మనమంతా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఎంతో అందంగా చేయగలమని చెపుతూ ముగించారు.
తర్వాత SWARD ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్ధాయిలో మహిళ లంతా కలిసి మహిళా దినోత్సవం మొదటిసారి జరుపుకుని వంద సంవత్సరాలు దాటిందనీ, మన గ్రామాల్లో ఈ ఉత్సవం  జరుపుకోవడం మొదలైనది ఎనభయ్యవ దశకం నుంచని చెప్పారు.మహిళలకి ఓటుహక్కు , వేతనాల్లో సమానత్వపు హక్కు  ఇలా ఎన్నో సాధించినా ఇంకా ఆడవాళ్ల హక్కుల్ని కాలరాస్తూ హింస జరుగుతూనే ఉంది.మహిళకి. ఇంకా తన శరీరంపై తనకు హక్కు లేని విధంగా జీవిస్తూ ఉంది.రేప్ అంటే అదే కదా!’అన్నారు. గృహ హింసకి,రేప్ కి గురైన అమ్మాయిలు చాలా కుంగుబాటుకి లోనౌతారు.సరిగ్గా మాట్లాడలేరు.కేవలం అలాంటి వాళ్ళని మాట్లాడించడానికే దాదాపు ఏడెనిమిది సిట్టింగ్స్ తీసుకోవలసి వస్తుంది.ఇంక వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం అవసరమౌతుందో ఊహించవచ్చు అన్నారు.
తర్వాత ప్రముఖ నటి జమున గారమ్మాయి, చిత్రకారిణి స్రవంతి జూలూరి మాట్లాడారు.వంద సంవత్సరాలుగా అవనిలో సగం,ఆకాశంలో సగం అంటూ స్త్రీలు ఉద్యమిస్తున్నా female feticide, domestic violence, rape వంటి నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయే గాని తగ్గుముఖం పట్టకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. మహిళలు మౌనంగా హింసని భరించినన్నాళ్ళూ , ప్రతిఘటించకుండా పరువు కోసం పాకులాడినంతకాలమూ ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఒక గృహ హింస బాధితురాలిగా ,హింసని ప్రతిఘటించి బయటికి వచ్చిన స్త్రీగా తోటి స్త్రీలు తమపై,తమ తోటి వారిపై జరుగుతున్న హింసను వ్యతిరేకించాలనిజాగో స్త్రీఅనే శీర్షికతో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశాను.నా రక్షణ కోసం కరాటే నేర్చుకున్నాను.ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నానుఅన్నారు.
చాలా సందర్భాలలో గృహ హింసకి లోనై బయట పడిన స్త్రీ తనని తాను నిందించుకుంటుంది.తనవల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని నమ్ముతూ గిల్ట్ ఫీలింగ్కి లోనవుతుంది.అది సరికాదు.నిర్భయ సంఘటన తర్వాత సమాజపు ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది.హింసని సమాజం కూడా ఎదిరించాల్సిన ఆవశ్యకత ఉందని, అప్పుడే కాలం చెల్లిన చట్టాల్లో మార్పు వస్తుందని నిర్భయ ఉదంతం తెలియజేసిందన్నారు.ఒకవైపు చట్టం హక్కులకోసం పోరాడమంటుంది. మరోవైపు బాధితులనే పీడిస్తుంది.కేరళలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసినపుడు ఆమెపైనే కేసు రిజిస్టర్ అయింది.ఇలాంటపుడు చట్టం ఎవరి వైపుందా అని అనుమానం వస్తుందన్నారు. ఎప్పుడైతే మౌనం వీడి మనం మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతామో, సహించడం మాని ఎదిరించడం నేర్చుకుంటామో అప్పుడే సమాజంలో మంచి మార్పుసాధ్యమౌతుందని చెపుతూ తన ప్రసంగాన్నిముగించారు.
శ్రీవిద్య ప్రత్యేక పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతి వెంకట్ గారు మాట్లాడుతూ అన్నిరకాల వైకల్యాల కన్నా మానసిక వైకల్యం ఎంతో బాధాకరమని,అలాంటి వైకల్యానికి లోనైన పిల్లల్ని జనజీవన స్రవంతిలోకి తీసుకు రావడం చాలా కష్టమనీ చెప్పి ,వాళ్ళని తమ పనులు తామే చేసుకోగలిగేలా తీర్చిదిద్దడమే తమ ముందున్నపెద్ద సవాలు అన్నారు.
తర్వాత మాధవి గారు ప్రసంగిస్తూ సమాజంలో సగభాగమైన మహిళల హక్కులకు సంబంధించి, వారు గౌరవాదరాలతో జీవించే అవకాశాల గురించి ఇలాంటి సభ జరుగుతున్నపుడు అందులో అధిక భాగం స్త్రీలే ఉంటే ఆ సభ సఫలం కానట్టే అన్నారు.మగవాళ్ళు కూడా సమసంఖ్యలో పాల్గొన్నపుడే,తమతో సహజీవనం సాగించే మహిళల మనోభావాలు , అవసరాలు వారికి అర్ధమై, ఆ సభ లక్ష్యం నెరవేరుతుందనీ ,patriarchal society లో సరైన మార్పు రావాలంటే ఆ భావజాలానికి అలవాటు పడ్డ స్త్రీ పురుషులిరువురూ మారాలని చెప్పారు.కేవలం హింస పోవడంతోనే మంచి మార్పు రాదు.వ్యక్తి సరైన గౌరవం పొందుతూ జీవించగలగాలి.ఇలాంటి  విషయాల్లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించాలంటే జనం నుంచి ప్రొటెస్ట్ రావాలి.దాన్ని మీడియా ఫోకస్ చెయ్యాలి.నిర్భయ విషయంలో రెండూ జరిగాయి.అన్నిసార్లూ అలా జరగదు.ఎందుకంటే దానికి ఎన్నో కారణాలుంటాయి.ఇదీ అని చెప్పలేం. 2000 సంవత్సరంలో ఇంఫాల్‌ లో-- విమానాశ్రయం సమీపంలో సైన్యం 10 మంది పౌరులను కాల్చిచంపినందుకు నిరసనగా,  క్రూరమైన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా)కు వ్యతిరేకంగా  మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిళ  ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.   దీక్షమొదలుపెట్టి  12 సంవత్సరాలు పూర్తయ్యాయి. క్రితం సంవత్సరం అన్నా హజారేకు మద్దతుగా ఆమె ఒక ప్రకటన చేసేవరకు ఆమెగురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఆ ప్రకటన తర్వాతే అంతా తనని గమనించారు. తనప్రాంతంలో ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడుతూ చివరికి ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది.అది నేరమని తనపై కేసు పెట్టింది ప్రభుత్వం.విచారణ జరుగుతోంది. ఇప్పుడీ  విషయం మీడియాలో కనిపిస్తోంది. అలాగే సూర్యనెల్లి కేసు.ట్రయల్ కోర్టు నించి సుప్రీమ్ కోర్టుదాకా సుదీర్ఘ ప్రయాణం ! నిర్బయ తర్వాత లైంగిక అత్యాచారాలు ఇంకా పెరిగాయని అంతా అంటున్నారు.అత్యాచారాలు పెరగలేదు. వాటిని పరువు పోతుందని భావిస్తూ మౌనంగా భరించే స్థితి నించి, ప్రతిఘటించి , ధైర్యంగా రిపోర్ట్ చేసే స్థితి వచ్చింది.అంతే.ఇప్పుడు సమాజం నించి సపోర్ట్ లభించి,సరైన శిక్షలు సకాలంలో పడితే ఇలాంటి అత్యాచారాలూ,హింసలూ తగ్గుముఖం పడతాయనడంలో సందేహంలేదని చెపుతూ ముగించారు.
మహిళా కమిషన్ కార్యదర్శి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రభుత్వం సదుద్దేశ్యంతో స్త్రీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా అది సామాన్య ప్రజ వరకు వచ్చేసరికి, మధ్యలో పనిచేసే ఎందరో వ్యక్తుల వల్ల,వారి చిత్తశుద్ధి లోపం వల్ల, కొంత dilute అయిపోతుంది. దానికి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. సమాజంలో సరైన మార్పు రావాలంటే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని gender sensitization చేయాలి. రేపటి పౌరుల తయారీలో కుటుంబం పాత్ర చాలా ఉంది.పిల్లల్ని పెంచేటపుడు,ఏది సాధించినా , సాధించకపోయినా మంచి పౌరులుగా మాత్రం మిగలాలని వారికి నేర్పాలి. ఆడపిల్లలకి good touch, bad touch మధ్య తేడాని తెలియజెప్పాలి.ఇంట్లో,పనిచేసే ప్రదేశాల్లో లైంగిక దాడి జరిగే సూచన కనబడితే వెంటనే ఎలా అప్రమత్తం కావాలో చెప్పాలి.చేతికి ఏది దొరికితే దానితో తమని రక్షించుకుంటూ , నలుగురికీ వినిపించేలా అరుస్తూ ప్రతిఘటించాలని ఆడపిల్లలకి నేర్పించాలి. ఉత్తర ప్రదేశ్ లోని గులాబీ దండు నుంచి స్ఫూర్తి పొందిన మన రాష్ట్రపు  సమతా దండుసభ్యులు వంగపూలరంగు చీరలు ధరించి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ  ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడతారు. సమతా దండుపేరిట ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన వీరు సాటి మహిళల సమస్యలపై సమరభేరి మోగిస్తారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పది గ్రామాల్లో వీరు సేవలందిస్తున్నారు. గృహహింస, బాల్య వివాహాలు, క ట్నం వేధింపులు, ఆస్తిహక్కు, సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో వీరు మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. సమాజ సేవకు చదువు, హోదాతో పనిలేదని వీరు నిరూపిస్తూ మేధా పాట్కర్ చేతుల మీదుగా నవీన అవార్డు కూడా పొందారు. బాధలను వౌనంగా భరించకుండా మహిళలు నిరసన గళం విప్పినపుడే మార్పు సాధ్యమౌతుందని చెపుతూ బాధిత స్త్రీలకు బాసటగా నిలిచిన భూమికను అభినందించారు రాజ్యలక్ష్మి గారు.
తర్వాత వికలాంగ మహిళల తరఫున కొల్లి నాగేశ్వర రావుగారు ప్రసంగించారు. అడ్వొకేట్ శేషవేణి గారు మాట్లాడుతూ “A promise is a promise-To end violence against women” అంటూ ఈ సంవత్సరం UN ప్రకటించిన నినాదాన్ని గుర్తు చేశారు. చాలా మంది తమ పక్కింట్లోనో, తెలిసిన చోటో గృహ హింస జరుగుతుంటే తమకు సంబందించిన వారు కాకపోవడంతో మౌనంగా ఉండిపోతారనీ, domestic violence కి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చనీ, వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదనీ వివరించారు. ఈ విషయం చాలామందికి తెలియదనీ,దీనికి ప్రచారం అవసరమని చెప్పారు.
కార్యక్రమం జరుగుతుండగా  అమన్ వేదిక రెయిన్బౌ హోమ్స్ నుంచి సాహితి అనే ఎనిమిదేళ్ల అమ్మాయిని పిలిచి మాట్లాడమని కోరింది సత్యవతి. ఇంకా పసి ప్రాయం వీడని ఆ పాప ధైర్యంగా మైక్ అందుకుని తల్లిదండ్రులు తమ కన్న పిల్లల ని పెంచేటపుడు ఆడపిల్లలకీ మగపిల్లలకీ మధ్య చూపించే వ్యత్యాసాన్ని ప్రశ్నించింది.మగ పిల్లలు ఏడిస్తే ఆడపిల్లలా ఏడుస్తావేమిరా అంటారనీ,ఆడపిల్లలు హాయిగా నవ్వితే ఏమిటది మగపిల్లల్లాగా?”అంటూ తిడతారనీ , పుస్తకాల సంచీ బడిలో పడేసి ఆటలకి పారిపోయే మగపిల్లల్ని సంతోషంగా బడికి పంపుతారనీ,శ్రద్ధగా చదువుకునే ఆడపిల్లల్ని చదువు మానిపించి ఇంటి పనిలో పెట్టేస్తారనీ  చెప్పగానే అంతా ఆపాప పరిశీలనకీ,అన్యాయాన్ని ప్రశ్నించిన తీరుకీ హర్షధ్వానాలు చేశారు.
సభ పూర్తవుతూనే అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాం. విరామం తర్వాత శ్రీ విద్య పాఠశాల నుంచి specially abled పిల్లలు హృదయంగమంగా బృంద నాట్యాలు చేశారు. వారందరి తరఫునా ఒక పాప తమకు శిక్షణ నిచ్చే గురువు గారి గురించి పసి హృదయంతో మనసారా పొగుడుతుంటే అక్కడున్నవాళ్ళ కళ్ళు చెమర్చాయి.
అలాగే సామాజిక అంశాలపై రెయిన్ బౌ హోమ్స్ పిల్లలు ప్రదర్శించిన నాటికలు. వాళ్ళని చూస్తుంటే ఆర్దికంగా  పై తరగతిలో  పుట్టి అన్ని సౌకర్యాల మధ్య పెరుగుతున్న పిల్లల కన్నా తమ హక్కులూ బాధ్యతల గురించి తెలుసుకోవడంలో వీళ్ళెంత ముందున్నారో అనిపించి ఆశ్చర్యం కలిగింది. పాత నగరం నుంచి వచ్చిన షాహీన్ బృందం  ఘోషాని ప్రశ్నిస్తూ ఖవ్వాలీని ప్రదర్శించారు.
చుట్టూ ఏర్పాటు చేసిన అంగళ్ళలో స్రవంతి గీసిన చిత్రాలు,వసంత లక్ష్మి గారి కళాకృతులు,షాహీన్ సంస్థ వారి ఎంబ్రాయిడరీ చీరలూ,స్త్రీ హక్కులూ చట్టాల గురించిన అవగాహన కోసం ప్రదర్శనకు పెట్టిన ప్లకార్డులూ ,బొమ్మలూ తీరిగ్గా ఆస్వాదించి వెనుదిరిగాం నేనూ,సుజలగారూ. బిందువుగా మొదలై సింధువుగా మారబోతున్న మహిళా శక్తి కి నిదర్శనం అక్కడ కనిపించి, ప్రకృతిలో -- సంఖ్యలోనూ,సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి ఆవశ్యకమైన మార్పు త్వరలో రాబోతోందన్నఆశతో ఇల్లు చేరాం.