September 12, 2014

‘ప్రపంచ శాంతి దినోత్సవం’--- వారణాసి నాగలక్ష్మి

(సెప్టెంబర్ 21, 'ప్రపంచ శాంతి దినోత్సవ' సందర్భంగా 'నది' మాస పత్రిక కోరిన ప్రత్యేక వ్యాసం)
యుద్ధ రహిత సమాజం కోసంహింస లేని జీవనం కోసం ఉద్దేశించబడినదే ‘ప్రపంచ శాంతి దినోత్సవం. అనేక దేశాలూరాజకీయ సమూహాలూ కలిసి మొదటగా ఈ పండుగని 1982 లో జరుపుకున్నాయి.తర్వాత 2002 నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, సెప్టెంబర్ 21వ తేదీని శాశ్వత శాంతి దినోత్సవ తేదీగా ప్రకటించింది. ఐరాస అప్పటి నుంచి ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి కృషి  సలుపుతోంది. అంతర్జాతీయంగా అహింస,శాంతిసోదరభావాల సాధన కోసం ప్రతి ఏటా  ఈ శాంతి దినోత్సవం (International Day of Peace)  జరుపుకుంటున్నాము.
శాంతియుత జీవనం కోసం పాటుపడేలా  మానవాళికి స్ఫూర్తినివ్వడం,శాంతి సుహృద్భావాలు  ప్రజల మధ్య పెంపొందేలా కృషి చేయడం ఈ రెండే   ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడంలోని ప్రధానోద్దేశ్యాలు. వీటినిసాధించడం కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజలతో మమేకమై ఈ ఉత్సవాన్నినిర్వహిస్తాయి. 
ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా తప్ప మిగిలిన అన్ని దేశాల బాలలూ విరాళంగా ఇచ్చిన నాణాల నుండి తయారైన 'శాంతి ఘంట'ను  మోగించిఈ పండగని న్యూయార్క్ నగరంలో ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయం లో మొదటిసారిగా జరుపుకున్నారు.  ఘంట పై నున్నసంపూర్ణ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి!'అన్న నినాదంప్రాణికోటి మనుగడకు శాంతి ఎంత  అవసరమో తెలియజేస్తుంది. ప్రతి యుద్ధం లోనూ అనివార్యంగా జరిగే  జననష్టం  గురించి ప్రజలకి తెలియ జేయడం కోసంఈ శాంతి ఘంటని యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఆఫ్ జపాన్,ఐక్య రాజ్య సమితికి కానుకగా ఇచ్చింది. 
            ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ ఉత్సవ సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో, వెస్ట్ కోర్ట్ తోట ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి ఘంటను  మోగిస్తారుఅనేక  సంస్థలుదేశాలు, ప్రపంచ శాంతి కోసం తమవంతు ప్రయత్నాలు చేయడానికిఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన ఈ రోజున అనేక కార్యక్రమాలుసమావేశాలు నిర్వహిస్తారుదేశాలు,జాతులుసమూహాల  మధ్య  తీవ్ర ఘర్షణలు నిరంతరంగా సాగుతూనే ఉన్నా ఈ రోజు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూశాంతి కోసం అవసరమైన కొన్ని తీర్మానాలు చేస్తారు. 
            2013 లో శాంతి కాముకతను ఒక విద్యగా గరపవలసిన ఆవశ్యకతను గుర్తించిన  ఐక్య రాజ్య సమితి ఈ రోజుని శాంతి విద్య కోసం అంకితం చేసింది. 2008 సెప్టెంబర్ 21 నాడు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని 'మహాత్మా గాంధీ అహింసా పురస్కారా'నికి  తొలిసారిగా రెవరెండ్ ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టూటూ ఎంపికయ్యారు.ప్రపంచ శాంతిని పాదుకొల్పడంలో డెస్మండ్ టూటూ చేసిన అవిరాళ కృషిని గుర్తించిన ది జేమ్స్ మాడిసన్ యూనివర్శిటి (జేఎమ్‌యూ)లోని మహాత్మా గాంధీ ప్రపంచ స్థాయి అహింసా కేంద్రం ఆయనకు పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది.
వ్యక్తులుసంస్థలూదేశాలూ తమ ఆధిపత్యపు పోరులో హింసకు పాల్పడడం విధ్వంసానికి పూనుకోవడం అనాదిగా జరుగుతూనే ఉంది.  ఒక దేశ భూభాగం పై మరో దేశం దురాక్రమణ సాగించడంరాజకీయంగా దృఢమైన,అభివృద్ధి చెందుతున్న దేశంలో ఉగ్రవాద కార్య కలాపాలకు చేయూతనిచ్చిఅల్లకల్లోలం  సృష్టించిబలహీనపరచి తమ ఆధిపత్యాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేయడంఆ దేశం లోని ప్రకృతి వనరుల్ని కొల్లగొట్టి,తమ ఇంధన అవసరాలను తీర్చుకోవడం సాధారణమైపోయింది. అనేక దేశాలలోచమురు నిల్వల కోసం ఆయిల్ కంపెనీలు చేపట్టే కార్య క్రమాల వల్ల  ఆదివాసీ తెగల వారెందరో నిర్వాసితులవుతున్నారు.  
ఏ దేశం లో పుట్టి పెరిగినా  చదువు కోసమోఉద్యోగ రీత్యానో,విదేశాలెన్నో తిరుగుతూపరాయి దేశంలో స్థిరపడుతున్న వాళ్ళు ఎందరో. స్వదేశంలోనే ఉంటున్నా అనేక దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నవ్యక్తులెందరో. ఒక దేశంలో ఉదయపు అల్పాహారం సేవించిమరో దేశంలో మధ్యాహ్న భోజనం కానిచ్చిరాత్రి భోజనం ఇంకొక దేశం లో ఆరగిస్తున్న వ్యక్తులు ఇటీవలి కాలంలో తరచుగా తారసపడుతున్నారు. సాంకేతికంగా చూస్తే  ప్రపంచమే ఒక కుగ్రామమైపోయిందన్న మాట నిజం. ప్రపంచంలో ఎక్కడున్నవాళ్లతోనైనా ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్టుగా వీడియో చాటింగ్ చేయగలగడం ఇప్పుడు సుసాధ్యమైపోయింది. ఫలితంగా కులమత ప్రాంతీయ భేదాలు కరిగిపోయి మనుషులంతా ఒక్కటే అన్న భావన పెరుగుతున్నా మరో వైపు అంతే వేగంతో మత తత్త్వ శక్తులు వృద్ధి పొందుతున్నాయి.  
మత  మార్పిడుల ద్వారాపర మతాల పట్ల అసహనాన్ని రేకెత్తించడం ద్వారా అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ తీవ్రవాదులు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుంటే,  సహజ పరిసరాల్లో ప్రశాంతం గా జీవిస్తున్న ఆదివాసులని కుతంత్రాల ద్వారా నిర్వాసితుల్ని చేసిప్రకృతి  వనరుల కోసం  ఆయా ప్రాంతాలనూచిన్న చిన్నదేశాలనూ లోబరచుకునే వ్యవహారాలు  జాతీయంగాఅంతర్జాతీయంగాఎక్కువవుతున్నాయి. పరాయి దేశాల వనరుల్ని దోపిడీ చేయడంఆయా దేశాలు అందుకు ఒప్పుకోనపుడు దౌర్జన్యానికి తెగబడడం …. అగ్ర రాజ్యాలకి అలవాటైన  వైనాన్ని జాన్ పెర్కిన్స్ రాసిన 'కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్ మాన్ కళ్ళకి కట్టి చూపిస్తుంది. 
ప్రస్తుతం కొనసాగుతున్న పాలస్తీనాఇజ్రాయెల్ యుద్ధ పరిణామంగా ఈ మధ్య కూలిన రెండు పౌర విమానాలలో ఒకటి  ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన సౌత్ చైనా సముద్రంలో మాయమైపోగామరొకటి జూలై నెలలో రష్యా సరిహద్దు దగ్గర ఉక్రెయిన్ లో కూల్చివేయబడింది. ఈ దుర్ఘటనల్లో అయిదు వందలమందికి పైగా చనిపోయారు. గాజా పై ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోతున్నవారిలో ఎక్కువమంది బాంబు దాడుల్లో కూలుతున్న ఇళ్ల కింద పడి మరణిస్తున్నారు. గాజా ప్రభుత్వం హమాస్ కావాలనే ఇళ్ల మధ్య నుండి రాకెట్ లు ప్రయోగిస్తోందని,తద్వారా పౌరులను మానవ కవచంగా ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
అయితే  గాజా కేవలం 40 కి.మీ పొడవు, 10 కి.మీ వెడల్పు ఉన్న చిన్న భూభాగం. ఈ భూభాగంలో 18 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రత్యేకంగా యుద్ధ క్షేత్రాలను నిర్మించుకునే వసతి గాజాలో లేదు. గాజా ప్రజలు ఏం చేసినా ఆ పరిమిత భూభాగంలోనే జరుపుకోవాలి. ప్రభుత్వ భవనాలుజనావాసాలుమిలట్రీ బ్యారక్స్ అంటూ వేరు వేరుగా నిర్మించుకునే వసతి అక్కడ లేదు. ఇజ్రాయెల్ చెప్పుకుంటున్నవిధంగా దాడుల్లో చనిపోయే వారంతా మిలిటెంట్లు కాదు. ప్రధానంగా మరణించేది పసి పిల్లలుస్త్రీలే. దాడుల్లో బ్రతికి బైటపడేవారి పరిస్ధితి ఎలా ఉంటుందంటే, దానికంటే చనిపోయి ఉంటేనే బాగుండేది అనుకునేంత ఘోరంగా ఉంటుంది. కళ్ళుకాళ్ళుచేతులు ఇలా శరీరంలో ఒక్కో భాగం కోల్పోయి జీవితాంతం కసిక్రోధాలను తమలో నిక్షిప్తం చేసుకుని బతికే సామాన్య పౌరులెందరో ! ఇలాంటి యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అశాంతి అలముకుంటుంది. ఇందువల్ల ముందు తరాలు ఎదుర్కునే దుష్ఫలితాలు ఇన్నీ అన్నీ కావు!
2001 లో జరిగిన 9/11 ట్విన్ టవర్ల కూల్చివేతనిఅమెరికా తన వేలితో తన కన్నే పొడుచుకున్న సంఘటనగా చెప్పుకోవచ్చుసౌదీ అరేబియా లో అమెరికా సైనిక దళాల నిలుపుదలఇజ్రాయెల్ కి అమెరికా అందిస్తున్నసహకారంఅమెరికా సాగిస్తున్న ఇరాక్ వ్యతిరేక కార్యకలాపాలే  ఈ దాడికి కారణాలుగా ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ 2004 లో ప్రకటించాడు. తన స్వప్రయోజనాల కోసం  ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పరోక్షంగా ప్రోత్సహించిన అమెరికాఈ సంఘటన లో దాదాపు మూడు వేల మంది వృత్తి నిపుణులైన సాధారణ పౌరులు  మృతి చెందడం తో నివ్వెరపొయింది . అప్పటిదాకా భారత్ లాంటి శాంతి కాముక దేశాలకి ధర్మ పన్నాలు వల్లిస్తూ వచ్చిహఠాత్తుగా 'వార్ ఆన్ టెర్రర్ పేర ఆఫ్ఘనిస్తాన్ లోకి దురాక్రమణ సాగించింది.  అత్యవసర పరిస్థితిలో చాలా దేశాలు తమ ఉగ్రవాద వ్యతిరేక చట్టాలని బలోపేతం చేసుకున్నాయి. మే 2011 లో బిన్ లాడెన్ మృతి తో  ఒక అధ్యాయం ముగిసింది. 9/11 తర్వాత అమెరికాపాక్ బాంధవ్యం కూడా మారక తప్పలేదు .
స్వాతంత్ర్యానంతరం పాకీస్తాన్భారత్ ల మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయి. ప్రతిసారీ యుద్ధ విరమణ సమయంలో ఎన్ని శాంతి ఒప్పందాలు జరిగినా పాకిస్తాన్  మాత్రం మన దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాలనే కాశ్మీర్ సంక్షోభాన్ని కొనసాగిస్తోంది. ఫలితంగా ఉగ్రవాదంచొరబాట్ల విషవలయంలో కాశ్మీర్ చిక్కుకుంది. కాశ్మీర్ అశాంతి వల్ల సుమారు మూడు లక్షల మంది కాశ్మీరీ పండిట్లు లోయను వీడి బలవంతంగా పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం తమ జన్మభూమిలో నివసిస్తున్న కాశ్మీరీ పండిట్లు కేవలం మూడున్నర వేల మంది మాత్రమే!
 తుషార సమీరాలసుమ సుగంధాలస్ఫటిక జలాశయాలసుందర దృశ్య మాలికల కాశ్మీర్‌ భూభాగంలో మెల్లమెల్లగా ఉగ్రవాదం స్థిర నివాసం ఏర్పరచుకుంది! మంచుకొండల మధ్య మానవత్వం సమాధి చేయబడుతోంది ! అక్కడి జీవితాలు క్షణ భంగురాలైపోయాయి ! 

ఇటు కాశ్మీర్ లోఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ మరో వైపు బలూచిస్తాన్ లో విచ్చలవిడిగా పాక్‌సైన్యపు  అరాచకాన్నికొనసాగిస్తోంది. బలూచిస్తాన్పాకిస్తాన్ దేశ విస్తీర్ణం లో సగ భాగాన్ని ఆక్రమించినా జనాభాలో మాత్రం కేవలం ఐదుశాతం మాత్రమే ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. జనావాసానికి అనుకూలం కాని ఈ ప్రాంతాల్లో చమురుసహజ వాయు నిక్షేపాలూరాగి లాంటి ఖనిజాలూ ఉండడం వల్ల ఆ ప్రాంతాన్ని వదులుకోవడం పాకిస్తాన్ కి  ఇష్టం లేదుఎలాంటి పరిస్థితుల్లోనూ బలూచిస్తాన్ స్వాతంత్ర్యానికి అంగీకరించకూడదని పాకిస్తాన్ అమెరికా దేశాల సంకల్పం. అందువల్లనే బలూచ్ జాతి ఉద్యమకారుల మీద తీవ్రవాదుల ముద్ర వేసి అమానుషమైన అణచివేత చర్యలు చేపడుతున్నారు. 
ఐక్య రాజ్య సమితిప్రపంచ శాంతి దినోత్సవం ప్రారంభించినప్పటి నుంచి,నేటి వరకు తన కార్య కలాపాలను విస్తృత పరచుకుంటూఅంతర్జాతీయంగా వీలైనంత ఎక్కువమంది వ్యక్తులనూసంస్థలనూ తమ కార్యక్రమాలలోకి చేర్చుకుంటూ,  దేశాలన్నీ జాతీయంగా , అంతర్జాతీయంగా శాంతి సుహృద్భావాలను ఒక సంప్రదాయంగా కొనసాగించేలా ప్రయత్నిస్తోంది. క్యాచ్ దెమ్ యంగ్ అనే పద్ధతిలో పాఠ శాల స్థాయి లోనే ఎన్నో శాంతి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, ఎదిగే పిల్లలు స్నేహపూరిత వాతావరణాన్ని కోరుకునేలా,అందుకోసం తమ వంతు ప్రయత్నం నిరంతరం సాగించేలా ప్రోత్సహిస్తోంది. ప్రతి సంవత్సరం ఒక కొత్త  శాంతి సందేశాన్ని లేదా ఆలోచనను అందిస్తూలేదా ఒక మంచి ప్రశ్నను సంధిస్తూలేత మనసుల్లో శాంతి బీజాలను నాటుతూసంస్థలకు దిశా నిర్దేశాన్ని చేస్తూ  ముందుకు సాగుతోంది.  కిందటేడాది  మీరెవరితో సంధి చేసుకుంటారు / శాంతి కోరుకుంటారు ? ' (who will you make peace with ?)  అనే ప్రశ్నని  శాంతి దినోత్సవ సందేశంగా అందించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న చోట్ల మాత్రమే కాకుండా మన ఇళ్ళలోవీధుల్లో ,బడులలో  హింసని విడిచిపెట్టే దిశగా ఆలోచన సాగించాలని కోరింది. ఇరవై మూడుAK 47 రైఫిల్స్ నికళాకారులు ఇరవై మూడు అందమైన కళా ఖండాలుగా తీర్చి,'ఆకా శాంతి పేర ఏర్పరచిన  ఎగ్జిబిషన్ లో  ప్రదర్శించారు. హింసతో భీభత్సమయ్యే జీవనం శాంతిని పాటిస్తే ఎంత కళాత్మకంగా మారుతుందో సందేశాత్మకంగా చూపించారు. 

పాశ్చాత్య దేశాల పట్ల  ప్రాచ్య దేశాలు వెర్రి వ్యామోహాన్ని ప్రదర్శిస్తుంటే, ఆ దేశాలు తూర్పు తిరిగి దండం పెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ నేపధ్యంలో మన ప్రాచీన  జీవన విధానాన్ని గుర్తుచేసుకుంటేహిందూసిక్కు,ముస్లింబహాయి...  ప్రతి మతం లోనూ సమాజం  శాంతి సౌఖ్యాలతో నడవడం కోసం ఎన్నో శాంతి సూత్రాలు కనిపిస్తాయి. వేదాలలోవేదాలలోని ఉపనిషత్తులలో శాంతి మంత్రాల ప్రస్తావన ఉంది. హిందువుల ఇళ్ళలో శుభకార్యాలలో తప్పక వినిపించే  శాంతి మంత్రాలు సర్వత్రా శాంతి సౌఖ్యాలు వెల్లివిరియాలనే భావాన్ని వ్యక్తం చేస్తాయి.  శాంతి మంత్రాలలో భావం ఈ విధంగా ఉంటుంది.
     సర్వేశాం స్వస్థిర్ భవతు
     సర్వేశాం శాంతిర్ భవతు
     సర్వేశాం పూర్ణం భవతు
     సర్వేశాం మంగళం భవతు
అందరికీ మంచి జరుగుగాక ! అందరికీ శాంతి చేకూరుగాక ! సర్వులూ సంపూర్ణులగు గాక ! అందరికీ మంగళమగుగాక !
      
     సర్వే  భవంతు సుఖినః 
     సర్వే  సంతు నిరామయః 
     సర్వే  భద్రాణి పశ్యన్తు 
     మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ 
అందరూ సంతోషంగా ఉందురు గాక ! అందరూ ఆరోగ్యంగా ఉందురు గాక ! మంచినే  అందరూ ఆస్వాదించెదరు గాక! ఎవ్వరికీ దుఖం కలగకుండు గాక !
     "ఓం ద్వాయౌ: శాంతిరంతరిక్షం  శాంతి:
      పృధ్వీ శాంతిరాప: శాంతిరోషధయ: శాంతి:/
      వనస్పతయ: శాంతిర్విశ్వే దేవా:శాంతిర్బ్ర్ హ్మశాంతి:
      సర్వం శాంతి: శాంతిరేవ శాంతి: సామా శాంతి రేధి //
              ఓం శాంతి: శాంతి: శాంతి:


'ఆకాశం శాంతితో ఉండు గాక ! వాయుమండలం శాంతితో ఉండు గాక! పృథ్వి శాంతితో ఉండుగాక! జలం శాంతితో ఉండు గాక! ఔషధాలు శాంతి గలిగించుగాక! వృక్షాలు శాంతితో ఉండు గాక! విశ్వ కిరణాలు శాంతితో ఉండు గాక! అంతరాత్మ శాంతితో ఉండు గాక! సమస్తమూ  శాంతితో ఉండు గాక! శాంతి కూడా శాంతిమయమౌ గాక! 
శాంతి మంత్రాల చివరన  ఓమ్ శాంతిః అని మూడు సార్లు చెప్పడం లో విశేషం,ఆ కార్యం మూడు రకాల ఆటంకాలనుంచి బయటపడాలని.
 ఆ మూడు విధాల ఆటంకాలు ఏవంటే :
1. మన వల్ల వాటిల్లే ఆటంకాలు, అంటే శారీరక రుగ్మతమానసిక రుగ్మత లాంటివి.
2. ఇతర జీవరాశుల వలన వాటిల్లే ఆటంకాలు.
3. ప్రకృతి శక్తుల వలన సంభవించే ఆటంకాలువర్షంపిడుగుఅగ్నిలాంటి వాటి వలన సంభవించేవి. 

ప్రతి శుభకార్యంలోనూ, పాల్గొనే సభ్యులంతా ఆ కార్యంఈ మూడు రకాల ఆటంకాలనుంచి బయట పడాలని ప్రార్థిస్తూశాంతిని కోరుతూతమ చుట్టూ సానుకూల ప్రకంపనాలను సృష్టించుకోవాలని  ఈ శాంతి మంత్రాలను చదివేవారు. ఏ  మతానికి చెందిన వారైనా మతమూ వద్దు మానవత్వమే తమ మతమని భావించే వారైనాప్రాణికోటి శాంతి సౌఖ్యాలతో సహజీవనం సాగించినపుడే తమ వ్యక్తిగత జీవనం కూడా శాంతియుతంగా సాగుతుందని తెలుసుకోవలసిన అవసరముంది.    
వ్యక్తిగత శాంతే సమాజ శాంతి. సమాజ శాంతే  ప్రపంచ శాంతి! సమాజంలో ఒక మూల అశాంతి ప్రజ్వరిల్లుతుంటే ఆ సమాజం సుస్థిరంగాప్రశాంతంగా ఎలా ఉండలేదో,  ప్రపంచంలో కొన్నిదేశాలలో ఆ రోజుకారోజు పెచ్చుపెరుగుతున్న హింసాత్మకత ఎపుడో ఒకపుడు మిగిలిన దేశాలకూ పాకిపోక తప్పదు. ఈ నిజాన్నిమనం గుర్తించగలిగితేమన పరిసరాల్లో శాంతి వనాలని పెంచి సంరక్షించుకోగలిగితే  ప్రపంచ శాంతి సుసాధ్యమవుతుంది.