April 7, 2012

అమృత ఘడియల అద్వితీయ - అక్షయ తృతీయ

-------- వారణాసి నాగలక్ష్మి
వైశాఖ శుద్ధ తదియ నే అక్షయ తృతీయ గా పిలుస్తారు.
సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది ,తరిగి పోనిది అని అర్థం.
హిందూ పంచాంగంప్రకారం అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభ కరమైన ముహూర్త కాలంగా భావిస్తారు. సూర్య చంద్రులిరువురూ అత్యంత ప్రకా శమానంగా భాసించే రోజిది.
ఈ నాడు ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని , ఈ రోజు మొత్తం శుభ కరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసిన పనిలేదని హిందువులు నమ్ముతారు.కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఈ రోజు పిల్లర్ పని మొదలుపెట్టుకోవడం , నూతన వ్యాపారానికి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం , వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.
ఈ రోజు ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృ తమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ హిందువుల నమ్మకం.ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానం లో గడుపుతారు.నిత్యావసర వస్తువులనూ,వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహం పై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు.అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.
అక్షయ తృతీయ, ఉగాది ,విజయదశమి….ఈ మూడు రోజులు సమృ ద్ధినీ , అదృష్టాన్నీ అంద చేసే పండుగ రోజులు గా హిందువులు నమ్ముతారు .ముహూర్తం వెతుక్కునే పని లేదు కనుక పామరులు కూడా పండుగ రోజున తాము ప్రారంభించ దలచిన ముఖ్యమైన పనులకు శ్రద్ధాసక్తులతో శ్రీ కారం చుడతారు.
వేద వ్యాసుడు చెపుతుండగా ,విఘ్న నాయకుడైన వినాయకుడు అక్షయ తృతీయ నాడే మహా భారత కథను లిఖించే మహత్కార్యాన్ని ప్రారంభించాడని చెపుతారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని పుట్టిన రోజు కూడా ఈ రోజే .గోవా మరియు ఇతర కొంకణ ప్రాంతాలను పరశురామ క్షేత్రాలుగా ఈ నాటికీ గుర్తిస్తారు.అక్షయ తృతీయ ని పరమ పవిత్ర దినం గా ఇక్కడివారు భావిస్తారు. త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు మొదలైందనీ ,ఆ నాడే పవిత్ర గంగానది దివి నుండి భువికి దిగి వచ్చిందనీ మరో కథనం.
ఈ పర్వ దినం జప,తప,దాన,స్నాన,హవన, హోమాల వంటి పుణ్య కార్యాలు ఆచరించేందుకు పవిత్రమైనదిగా ,కొత్త బంధాలను ఏర్పరచుకోవడానికి, గృహ నిర్మాణానికీ ,గృహ ప్రవేశాలకూ ,వెండి బంగారాలూ,నగలూ కొనుక్కుందుకు శుభకరమైనదిగా భావించినా, కొన్నిచోట్ల లౌకికకార్యాలను పూర్తిగా మరచి ఆధ్యాత్మిక కార్యాలలో నిమగ్నమై, పుణ్యాన్ని సముపార్జించుకునే రోజుగా అక్షయ తృతీయ ను పరిగణిస్తారు .
అక్షయ తృతీయ గురించిన కథలలో ప్రముఖ మైనది కృష్ణ సుదాముల కథ.పేద బ్రాహ్మడైన సుదాముడు ఆర్ధిక సాయాన్నర్ధించాలని అత్యంత ప్రయాస మీద శ్రీ కృష్ణుని చూడవస్తాడు.చిన్ననాటి స్నేహితుడైనా ప్రస్తుతం మహారాజైన శ్రీ కృష్ణుడికి తను కానుకగా తెచ్చిన అటుకుల మూటను అందించడానికి ఎంతో సిగ్గుపడతాడు.కృష్ణుడే స్నేహితుడి నుంచీ ఆ మూటను చనువుగా లాక్కుని తనకిష్టమైన అటుకులని ఆప్యాయంగా భుజిస్తాడు. సుదాముడిని అతిధి దేవుడిగా ఆదరిస్తాడు. మహారాజు ఆతిధ్యానికి ఉక్కిరిబిక్కిరైన సుదాముడు తను వచ్చిన పని బయట పెట్టలేక రిక్త హస్తాలతో ఇల్లు చేరతాడు.ఆ సమయానికి అతని పూరి పాక సుందరభవనం గా మారిపోయి కనిపిస్తుంది.భార్యాపిల్లలు విలువైన వస్త్రాలు కట్టుకుని ఎదురొస్తారు .సుదాముడు అదంతా శ్రీకృష్ణుడి కృప అని గ్రహిస్తాడు.తాను కోరదలచిన దానికన్నా ఎన్నో రెట్లు విలువైన సంపదను అనుగ్రహించి తన దారిద్ర్యాన్ని నిర్మూలించిన శ్రీ కృష్ణుడికి మనసులోనే ప్రణామాలందిస్తాడు సుదాముడు.
అలాగే వనవాసం లో ఉన్న పాండవులు శ్రీ కృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే.అందుకే ఈ నాడు భగవంతునికర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ , కొనుగోలు చేసిన దేదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. ఈ రోజు వేకువ జామునే లేచి ,మహా విష్ణు అవతారాలనూ, లక్ష్మీ దేవినీ పూవులతో ,తులసీ దళాలతో అర్చిస్తారు. శ్రద్ధాసక్తులున్నవారు లక్ష్మీ కుబేర హోమాన్ని చేయించుకుంటారు. దానాలలోకెల్లా అన్నదానం మేలైనదని భావించే హిందువులు ఈ రోజు పేదలకు అన్నదానాలు నిర్వహిస్తారు.
ఒరిస్సా లో వ్యవసాయపు పనులకు ముఖ్యంగా దుక్కి దున్ని పొలం సాగు పనులు మొదలు పెట్టడానికి ఈ రోజు మంచిదని భావిస్తారు.పూరి లో జగన్నాథ రథ యాత్ర కు రథాల నిర్మాణం ఈ రోజే మొదలవుతుంది .బెంగాలీలు అక్షయ తృతీయ నాడు లక్ష్మీ గణపతులను పూజించి కొత్త జమా ఖర్చుల పుస్తకాన్ని ప్రారంభిస్తారు.కుబేరుడు కూడా ఈ రోజు లక్ష్మీ దేవి ని పూజించేవాడని పురాణ కథ.
జైన మతం లో అక్షయ తృతీయ పర్వ దినానికి ఎంతో ప్రాథాన్యత ఉంది.జైనుల మొదటి తీర్థంకరుడైన రిషభ దేవుడు జ్ఞాన సిద్ధి పొందాక, లౌకిక సుఖాలన్నిటినీ త్యజించి, సన్యాసా శ్రమాన్ని స్వీకరించి ,ప్రతిరోజూ భిక్షాటనకు వెళ్ళేవాడు .ఆ శకానికి మొదటి సన్యాసి అతడే కావడం వల్ల సన్యాసుల జీవన విధానం తెలియని అయోధ్య వాసులు నగలూ,బంగారమూ ,మణి మాణిక్యాలూ ,ఆశ్వాలూ ,విలువైన వస్త్రాలే కాక కన్యా మణులను కూడా తమ ప్రియతముడైన మహారాజుకి అర్పించ సిద్ధప డేవారు.రిషభ దేవుడు పిడికెడు అన్నాన్ని అర్దిస్తున్నాడని ఎవరికీ అర్ధం కాలేదు.అందువల్ల ఆయన ఒక సంవత్సరం పాటు నిరాహారుడై ఉండ వలసి వచ్చింది.చివరికి ఆయన మనుమడైన శ్రేయాంశ కుమారుడు తాతగారి మనోభావాన్ని అర్థం చేసుకుని చెరకు రసాన్ని అందించాడని ఇతిహాసం చెపుతోంది..ఆ విధంగా రిషభ దేవుని ఉపవాసం పూర్తయిన రోజే అక్షయ తృతీయ కావడంతో జైనుల పవిత్ర దినం గా ఈ అక్షయ తృతీయ ప్రాశస్త్యం పొందింది.ఇప్పటికీ ఈ పర్వ దినాన జైనులు రోజంతా ఉపవాసముండి ,చెరుకు రసం సేవించి, వారి ఉపవాస దీక్షను ముగిస్తారు.అక్షయ తృతీయ నాడు ఇచ్చే దానాలూ,కానుకలూ అక్షయమవుతాయని నమ్ముతారు.
హిందూ మతం లో ఉపవాసమనేది భౌతికావసరాలను తగ్గించుకుని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి దోహదం చేస్తుందనీ ,ఆత్మ కూ శరీరానికీ మధ్య అనుకూల వాతావరణాన్ని సృష్టించి ఆత్మ పరమాత్మల అనుసంధానానికి సహాయ పడుతుందనీ పెద్దలు చెపుతారు.దైనందిన జీవితపు పరుగుల్లో వ్యక్తికి ఆధ్యాత్మిక సాధన సాగించడం అంత తేలికైన విషయం కాదు.మనో నిగ్రహాన్ని సాధించే క్రమంలో శరీరాన్ని క్రమ శిక్షణలో పెట్టుకోవడం అవసరమవుతుంది.
ఒకటి రెండు దశాబ్దాల క్రితం తో పోలిస్తే ఇప్పటి కాలంలో సమయా సమయాలు పాటించకుండా మితిమీరి భుజించడం ఎక్కువగా కనిపిస్తోంది.జీవనమే పరుగు ప్రయాణమై పోవడంతో బజారులో దొరికే instant foods వైపు చాలామంది మొగ్గుచూపుతున్నారు.వాటిలో పోషకాల విలువ తక్కువ అన్నది అందరికీ తెలిసిన విషయమే.ఫలితం ఊబకాయం.ఈ నేపధ్యం లో మన పూర్వీకులు క్రమం తప్పకుండా పాటించి సత్ఫలితా లనుభవించిన ఉపవాసపు ఉపయోగాల వైపు దృష్టి సారిస్తున్నారు మన వాళ్ళు .ఆహారం మనిషి ఇంద్రియాలను సంతృప్తి పరుస్తే ఉపవాసం ఇంద్రియ నిగ్రహాన్ని, తద్వారా ఆధ్యాత్మిక చింతననీ పెంపొందిస్తుంది. పొట్ట నిండితే మేధ సుషుప్తావస్థలోకి జారుకుంటుంది.ఊబ కాయానికీ, వివేకానికీ విలోమ సంబంధం వుందని ఆధునిక పరిశోధనలు తెలియ జేస్తున్న నేపధ్యం లో ఉపవాసాన్ని పుణ్యం కోరేవారేకాక ,ఆరోగ్యం కోరేవారు కూడా పాటిస్తున్నారు.ఉపవాసం పాటించే సంపన్నులకు అన్నార్తుల ఆకలి దప్పుల బాధ అనుభవమై వారి పట్ల సానుభూతి కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.
పర్వ దినాలలో సామా న్యులైనా , భాగ్య వంతులైనా వారి వారి శక్త్యానుసారం ఉత్సవాలను జరుపుకుని సంబర పడతారు.బంధు మిత్రులతో ఉల్లాసంగా కాలం గడపాలని ప్రయత్నిస్తారు. మతసంబంధమైన పండుగలలో దైవ భక్తీ ,సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేయడం జరుగు తుంది కనుక ఈ భావ పరంపరను తమ వ్యాపారాభివృద్ధికి అనువుగా మలచుకుంటారు వ్యాపారులు.అక్షయ తృతీయ నాడు కొన్న వెండి బంగారాలు అక్షయమవుతాయనీ ,ఇల్లు వాకిళ్ళు కొనడం వల్ల భాగ్యాభివృద్ధి జరుగుతుందనీ రక రకాల ప్రకటనలతో వినియోగదారులకు గాలం వేస్తారు.ఇటీవలి కాలంలో పెరిగిపోయిన వస్తు వినిమయ సంస్కృతి వల్ల వీలయినన్ని వస్తువులూ నగలూ కొని సొంతం చేసుకోవాలనీ ,వస్తువులతో ఇల్లూ, నగలతో శరీరాలూ నింపుకుని తమ భాగ్యాన్ని ప్రదర్శించుకోవాలనే యావ పెరిగి పోవడం కూడా వీరి వ్యాపార ధోరణికి సహకరిస్తోంది.
పొదుపు ఒక అవలక్షణంగా ,రేపటి గురించి ఆలోచించి ప్రణాళికా బద్ధంగా జీవించడం ఒక చాదస్తంగా భావించే వ్యక్తుల సంఖ్య పెరిగి పోతూండడం వీరికి లాభిస్తోంది. భావానికి కాక వస్తువు కీ , అవసరానికి కాక ఆర్భాటపు ప్రదర్శనకూ, పంచుకోవడానికి కాక సొంతం చేసుకుని దాచుకోవడా నికీ ప్రాధాన్యత పెరిగినపుడు సమాజంలో అసమానత తీవ్రమవుతుంది.వర్గ వైషమ్యాలు పెచ్చుపెరుగుతాయి. పొందలేని వాటి గురించిన తపన అసంతృప్తి దారి తీస్తుంది. ఇలాంటపుడు నిరాడంబరతనూ , ప్రశాంతతనూ అందించేది ఆధ్యాత్మికత మాత్రమే !మన ఆలోచనా విధానం ,జీవన శైలి ల లో ప్రస్తుత కాలం లో వచ్చిన మార్పుల ని అర్థం చేసుకుంటే , ఇవాళ మనం వింటున్న recession యొక్క మూలం , లక్షల కుటుంబాలలో అది కలిగించిన అల్లకల్లోలానికి కారణం అవగతమవుతుంది. ఈ నేపధ్యంలో పరుగుపందెంలా జీవనం గడుపుతున్న ప్రజానీకానికి ఎండవేళ తరు ఛాయలా,దాహార్తునికి మంచినీటి కొలనులా కనిపించి, కరుణించేది ఆధ్యాత్మికతే.
అతివలు ఆభరణాలను , పురుషులు విలువైన వాహనాలను కోరుకోవడం సహజం.అలాగే షేర్స్ లో పెట్టుబడులు పెట్టే మగ వారి సంఖ్యా తక్కువేమీ కాదు. అప్పు చేసైనా సరే వస్తువుని సొంతం చేసుకోవాలనే ఆలోచన పురుగులా దొలిచేయడం ,దానికి ఆచారమూ, సంప్రదాయమనే ముసుగులు తగిలించి, ఆడంబరాలను ఆహ్వానించడం చాలా కుటుంబాలలో కనిపిస్తుంది.ఉన్నదానితోనే కోరుకున్న దానిని పొందాలనే నియమాన్నవలంబిస్తే ,వ్యాపార ప్రకటనల వలలో పడకుండా పురాతన సంప్రదాయాలలో కుటుంబానికి అందుబాటులో ఉన్న వాటినీ , శ్రేయస్కరమైన వాటినీ పాటిస్తే,చిత్త శాంతీ ,సమాజ శ్రేయస్సూ రెండూ లభిస్తాయి.