October 1, 2013

మానవాళికే పండుగరోజు - గాంధీజీ పుట్టినరోజు


పుట్టినరోజు పండగే అందరికీ—మరి
పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?
                                       అంటూ ఒక గానకోకిల తీయగా ప్రశ్నిస్తే జవాబివ్వడం అంత తేలికేం కాదు. తమ పుట్టుక వల్ల ప్రపంచానికేమీ ఒరగకపోయినా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. పారతంత్ర్యంలో మగ్గుతున్న కోట్లమంది జీవితాలలోకి వెలుగురేకలని , స్వేఛ్ఛావాయవుల్ని ప్రసరింపజేసి, అసంఖ్యాకుల హృదయ మందిరాలలో సుస్థిరంగా నిలిచిపోగల మహనీయులు మాత్రం అరుదుగా జన్మిస్తారు. వారి పుట్టినరోజెప్పుడో వారికక్కర్లేదు. వారి దృష్టంతా లోకహితంపైనే. నిరంతరం మానవసేవలో తలమునకలుగా జీవించి తమ లక్ష్యసాధనలోనే వారు తనువు చాలిస్తారు. వాళ్లు చిరాయువులు ! వారి పుట్టినరోజు వేడుకలు కోట్లాది సజ్జనుల హృదయాలలో ఏటేటా జరుగుతూనే ఉంటాయి!

             అత్యంత సాధారణమైన రూపం వెనుక అనుక్షణం తనను తాను ఉన్నతీకరించుకోగల అంతరంగాన్నిదాచుకుని, తన జీవిత పరమార్ధమేమిటో తెలుసుకుని, తన లక్ష్యాన్ని నిర్ధారించుకుని, ఆ లక్ష్యసాధనలో అలుపులేని ప్రయాణం సాగించి, తాను ఆరాధించిన పురాణపురుషుల సరసన నిలబడగలిగే వ్యక్తిత్వ వైశిష్ట్యాన్ని సంపాదించుకున్న మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ పుట్టినరోజు, భారతీయులకే కాదు ప్రపంచ ప్రజలందరికీ పండుగరోజే ! మానవాళి మనుగడకి, శాంతి సౌభ్రతృత్వాల, సత్యమూ, అహింసల ఆవశ్యకతని చాటిచెప్పిన గాంధీగారి జన్మదినమైన అక్టోబరు రెండవ తేదీని గాంధీజయంతిగా భారతీయులంతా జరుపుకుంటే ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’ గా వందకు పైగా దేశాలు పాటిస్తున్నాయి.

          మహాత్ముడుగా, జాతిపితగా భారతీయులందరికీ చిరస్మరణీయుడై, ప్రాత:పూజనీయుడైన బాపూజీ పుట్టిన తేదీ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ లోని 114 సభ్యదేశాలు తీర్మానించడంచూస్తే ఈ అణుయుగంలో అహింస ప్రాముఖ్యత ఎంతో అర్ధమౌతుంది. హింసను నమ్ముకున్నవారు ఆ హింసకే బలికాక తప్పదన్నది చరిత్ర నేర్పిన పాఠం. ప్రపంచంలో ఎక్కడ హింస చెలరేగినా గాంధీ తత్త్వం, అహింసా మార్గం చర్చకు వస్తాయి. అసాధారణమైనవి ఆయన అనుభవాలు కాదు, ఆ అనుభవాలకి ఆయన ప్రతి స్పందన ! సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటాల్లోని సాహసాన్ని, త్యాగాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, ఆయన పుట్టిన రోజుని అంతర్జాతీయ అహింసా దినోత్సవం, మానవ హక్కుల దినం, సత్యాగ్రహ దినోత్సవంగా నిర్వహించాలని సూచించింది. దీంతో భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా గాంధీ జయంతి ఒక పండుగరోజైంది.

         బాపూజీ భారతీయులకందించిన వారసత్వ సంపద అమూల్యమైనది. శతాబ్దాలపాటు భరతజాతిని దాస్య శృంఖలాలలో బంధించిన బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఆయన ఎన్నుకున్న ఆయుధాలు సహాయ నిరాకరణ , సత్యాగ్రహాలే . అహింసా మార్గంలో రెండు శతాబ్దాల సుదీర్ఘ దాస్యానికి చరమగీతం పాడి, భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించడమనేది చరిత్రలోనే ఒక అపూర్వ సంఘటన . అంతవరకూ ప్రపంచంలో రాజ్య విస్తరణ కోసం, లేదా తమ రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం ఎంతటి రక్తపాతానికైనా వెనకాడని పాలకులే మనకు తెలుసు. శాంతి కాముకులైన రాజులు కూడా అవసరార్ధం యుద్ధాలకు సిద్ధపడడం కొత్త విషయం కాదు. ‘విజయమో , వీరస్వర్గమో’ అన్న నినాదం ధీరత్వానికి చిహ్నం గా వాడేవారు. అనాదిగా పాతుకుపోయిన ఆ భావజాలపు ఒత్తిడి నుంచి తప్పించుకుని ఒక కొత్త సిద్ధాంతాన్ని ఏర్పరచుకోవడమే గొప్ప అనుకుంటే తన చుట్టూ పెల్లుబుకుతున్న ఆగ్రహ జ్వాలలను నిలవరించి, భౌతిక వాదులకు అర్థంకాని ఆత్మగతమైన ప్రభంజనాన్ని సృష్టించి, లక్ష్య సాధనకొక కొత్త ఒరవడి చుట్టడం గాంధీజీ సాధించిన అసాధారణ విజయం.

        గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా, పోరు బందర్ సంస్ధానంలో దివాన్ గా పని చేసే కరంచంద్ గాంధీ, హిందూసంప్రదాయాలను శ్రద్ధతో పాటించే సాధ్వీమణి పుత్లీ బాయిలకు 1869 అక్టోబర్ 2 వ తేదీన జన్మించారు. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. ఆయన ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియ వాడ్‌లో కొనసాగింది. విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీజీ ఇందుకు నిరాకరించారు.

        మెట్రిక్యులేషన్ పాసయ్యాక ఉన్నత చదువుల నిమిత్తం గాంధిజీ ఇంగ్లాండ్ వెళ్ళి, న్యాయవాద విద్యను అభ్యసించారు. తరువాత దేశానికి తిరిగొచ్చి న్యాయవాద వృత్తిని చేపట్టి మూడేళ్ళపాటు బొంబాయి, రాజ్కోట్‌లలో ప్రాక్టీసు చేశారు. 1893లో దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీజీ 20 సంవత్సరాలకు పైగా అక్కడే నివాసమున్నారు. అక్కడ జాతి వివక్షకు గురై అవమానాలనెదుర్కొన్నారు. ఆ అవమానాలే ఆయనలోని నాయకత్వ లక్షణాలను ప్రస్ఫుటింపచేశాయి. 1915 జనవరి 9 వ తేదిన దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చి, 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమాన్ని స్దాపించారు. సత్యాచరణ, అహింసా మార్గాన్ని అనుసరించవలసిన విధానమూ తన అనుచరులకు బోధించారు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించిన గాంధీజీని మొదటిసారిగా రవీంద్ర నాథ్ ఠాగూర్ మహాత్మా అని సంబోధించారు.

        భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రత్యేక పాత్ర పోషించిన సత్యాగ్రహం మొదటిసారిగా 1916లో బీహారు లోని చంపారన్ జిల్లాలో జరిగింది. అయితే అప్పటికి ఈ నిరసన వ్రతానికి సత్యాగ్రహమనే పేరు పెట్టడం జరగలేదు. బీహార్ లో తీన్ కథియా అనే పద్ధతి వల్ల రైతులు, తమ భూముల్లో పండించిన పంటను బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విన్న చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతానికి వచ్చి కాపాడమని ఆయనను ఆహ్వాంచారు.

        గాంధీజీ చంపారన్ లో ఆశ్రమాన్ని స్ధాపించి అక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాల పై తన అనుయాయులతో, స్ధానికులతో ఒక సర్వే జరిపించారు. అక్కడి వారి విశ్వాసాన్ని గెలుచుకుని ఆ గ్రామాలలో సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభించారు. విద్యాలయాలు, వైద్యశాలలు నిర్మించి, పర్దా పద్ధతిని, అస్పృశ్యతను, స్త్రీలపై అణచివేతను నిర్మూలించేలా కృషిచేశారు. అక్కడి స్దానికుల్లో అలజడికి కారకుడవుతున్నారన్న కారణం చూపి ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. గాంధీజీ విడుదల కోసం లక్షలమంది జనం, జైళ్లముందు, పోలీస్ స్టేషన్ల ముందు, కోర్టుల ముందు నిరసనకు దిగడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం, నెహ్రూతో సహా అనేక అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారిని ఆకట్టుకున్నాయి.

         అలాగే గుజరాత్ లోని ఖేదా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమని రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు నిరసనగా 1918 లో గాంధీజీ సత్యాగ్రహం ప్రారంభించారు. బాధిత రైతులంతా కలిసికట్టుగా కనపరిచిన ఐక్యతా, క్రమశిక్షణా, సత్యాగ్రహంలో పాల్గొంటున్న రైతులకి స్ధానికులందించిన ఆశ్రయం ప్రభుత్వాన్ని నివ్వెరపోయేలా చేశాయి. జప్తు చేయబడ్డ పొలాలను కొన్నవారిని అక్కడి సమాజం వెలివేసింది. బాధిత రైతులకు వారి వారి పొలాలు తిరిగి లభించే దాకా గుజరాతీలంతా కలిసికట్టుగా పనిచేయడంతో ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేయక తప్పలేదు. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పనివారి వేతనాలు పెంచాలని సత్యాగ్రహం చేపట్టి, మిల్లు యజమానులను అంగీకరింప జేసి, కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలకు కారకుడయ్యారు గాంధీజీ. స్ధానికంగా తను చేపట్టిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయాన్ని సాధించిన తర్వాత గాంధీజీ దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లింది.

         విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్టాన్ని చేసింది. గాంధీజీ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాలని సూచించారు. ఈ పిలుపుకు స్పందించిన దేశ ప్రజలు ఉత్సాహంతో కదలి వచ్చారు. 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభ, గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ నిరాకరణోద్యమ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం నిర్బంధించింది. అనంతరం వెల్లువెత్తిన స్వాతంత్య్ర సమర జ్వాలలకి తలవొగ్గిన బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. అభివృద్ధి పథంలో స్వతంత్ర భారతం సాగించదలచిన ప్రయాణాన్ని చూడక ముందే, 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యారు.

          అత్యంత నిరాడంబరుడైనా జాతి యావత్తునూ ఒక్క తాటిపైన నడిపించగల సమ్మోహన శక్తి ఆయన సొంతం. అచంచలమైన ఆత్మవిశ్వాసం, అలుపెరుగని పోరాట పటిమ, స్వాతంత్ర్య సముపార్జన కోసం ఆయన ఎన్నుకున్న మార్గం విశిష్టమైన ఆయన వ్యక్తిత్వాన్ని చాటిచెపుతాయి. తన జీవితాన్ని తెరిచిన పుస్తకంగా చేసి తన భావాలను, భవిష్యత్ ప్రణాళికలను భారతీయులందరితో పంచుకుంటూ దేశమాత స్వేఛ్ఛ కోసం పోరు సాగించిన ఆయన శాంతియుత సమర వ్యూహం నేతలందరికీ అనుసరణీయమైంది. కనకవర్షాన్ని కురిపించగల న్యాయవాదవృత్తిని వదిలేసి దేశభవిత కోసం తన సర్వస్వాన్నీ సమర్పించిన మహాత్ముడి జీవితం ఆద్యంతమూ ఆదర్శప్రాయమే. సత్యానికి అఖండమైన, అనంతమైన శక్తి ఉందని నమ్మిన ఆయన, నిరంతర సత్యశోధనలో జీవనయానం సాగిస్తూ తన జీవితాన్నేఒక సందేశంగా భావితరాలకందించారు. ఆయన అందించిన ఆ మహా సందేశం కేవలం భారత జాతికే కాక విశ్వ మంతటికీ దారి చూపగల దివ్యతేజం, విశ్వ శాంతికై ఎగరేసిన శ్వేత కేతనం. కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు

            'కమ్మగా బతికితే గాంధీయుగం , మనిషి కడుపునిండా తింటే గాంధీ జగం

            మనిషి శివుడవడమే గాంధీయుగం, బాపు ననుసరిస్తే చాలు మనమందరం''

          1918 లోనే హిబ్బర్ట్ జర్నల్ లో గిల్బర్ట్ ముర్రే అనే మేధావి, గాంధీజీ గురించి ఈ విధంగా రాశాడు “సాధారణ వ్యక్తుల్ని పిరికివారుగా మార్చేసే రాజకీయ వాతావరణంలో గాంధీజీ అసాధారణ వ్యక్తిత్వం శృంఖలాలు తెంచుకుంది. భౌతిక సుఖాలని , ఐశ్వర్యాన్ని, పదవిని ఖాతరు చేయని, పొగడ్తలకు లొంగని, తాను నమ్మినదాన్ని ఆచరించితీరాలనే దృఢనిశ్చయంతో ఉన్న వ్యక్తితో వ్యవహరించేటపుడు అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అతనొక ప్రమాదకరమైన, ఇబ్బందికరమైన శత్రువు.. ఎందుకంటే అతని శరీరాన్నేగాని అతని ఆత్మని జయించడం ఎవరికీ సాధ్యంకాదు “

         మనసా వాచా ఆస్తికుడైన గాంధీజీ భగవత్సక్షాత్కరం కోసం గుహలలో తపస్సు సాగించకుండా , తనకవసరమైన తపో మందిరాన్ని తన అంతరంగంలోనే నిర్మించుకోవడం భారతీయులంతా చేసుకున్న పుణ్యమని చెప్పచ్చు. చరిత్రలో గాంధీజీ స్ధానం ఏమిటో అప్పుడే నిర్ణయించడం సాధ్యం కాదని చరిత్రకారుల భావన. అభివృధ్ధి చెందని దేశాలలో చెలరేగుతున్న కల్లోలాల దృష్ట్యా, పేద ధనిక వర్గాల మధ్య చోటు చేసుకుంటున్న సామాజిక అసమానత, అసూయ , ఆవేశ కావేషాల దృష్ట్యా, కళ్లాలు లేని సాంకేతిక విప్లవం పరుస్తున్న నీడల దృష్ట్యా , ప్రపంచమంతటా అణుశక్తి నీడలో అల్లల్లాడుతున్న శాంతి భద్రతల దృష్ట్యా గమనిస్తే, రానున్న కాలంలో గాంధీ తత్త్వమూ, ఆయన ఆలోచనలు, మార్గదర్శక సూత్రాలూ మరింత ప్రాముఖ్యతని సంతరించుకుంటాయన్నది నిర్వివాదాంశం.

         తన మేధాశక్తితో ప్రపంచాన్ని దిగ్భ్రమపరచిన ఐన్ స్టీన్ “ గాంధీ లాంటి మహాపురుషుడు ఈ భూమిపై నడిచాడంటే భావితరాలు నమ్మకపోవచ్చు” అనడం, అలాంటి అసాధారణ దేశభక్తుల త్యాగ ఫలాలని అనుభవిస్తూ కూడా వారి మరణానంతరం వారిపై బురద జల్లే స్వార్ధజీవులకు అర్ధం కాని విషయం ! తమ స్వంత నియోజక వర్గంలోనైనా అడుగు ముందుకు వేయాలంటే భద్రతా దళాల పై ఆధారపడే ప్రజా ప్రతినిధులూ, ప్రజాస్వామిక దేశంలో నివసిస్తూ కూడా ఓట్లను మురగబెడుతూ, అల్లర్లూ, మారణకాండలు జరిగినపుడు మాత్రం ప్రభుత్వాన్ని తూర్పారబట్టే పౌరులూ, గాంధీజీ లాంటి యుగపురుషుడిని అర్ధం చేసుకోలేకపోవడం వింతేమీ కాదేమో ! నిరంతరం టీవీ తెరలకతుక్కుపోయి అందులో కనిపించే అసహజత్వానికి అలవాటు పడిపోయిన జనానికి , అణువణువునా జాత్యహంకారం నిండిపోయి నిరంకుశులైన బ్రిటిష్ వారి కబంధహస్తాలనించి దేశమాతకు దాస్యవిముక్తిని కల్పించడం గొప్ప విషయంగా తోచకపోవచ్చు ! ఓ చెంప పగలగొడితే మరో చెంపచూపిస్తూ, ఎడతెగని లాఠీ దెబ్బలకు రక్తమోడే శరీరాలనప్పగించి ‘వందేమాతర’మంటూ నినదించే శక్తి వారికి ఎలా వచ్చిందో నేటి తరానికి అర్ధం కావడం కష్టం.

         ఏ అధికారపు ఆధిపత్యాన్ని గాంధీ నిరసించారో అదే అధికార దర్పం, ఆధిపత్యం దేశంలో ఈనాడు రాజ్యమేలుతోంది. ‘పాలకులు, పాలక పార్టీలు ప్రజలను శాసించే స్థాయికి చేరుకోవడం అత్యంత విషాదకర పరిణామమనీ, పార్టీ అనేది అధికార కేంద్రంగా తయారై ప్రజలపై నియంతృత్వం చేస్తుందనీ‘ ఆయన ఆనాడే హెచ్చరించారు. భారత జాతి మొత్తం చేసిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా వచ్చిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కాంగ్రెస్ పార్టీ తన సొంత జాగీరుగా మార్చుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గాంధీ భయాలన్నీ ఈనాడు నిజమయ్యాయి.

         గ్రామ స్వరాజ్యాన్ని కోరుకుని పారిశ్రామికీకరణను వ్యతిరేకించిన ఆయన మాతృభూమిలో ఈనాడు విచ్చలవిడిగా పారిశ్రామికీకరణ జరిగిపోతోంది. చేత రాట్నం పట్టి , చేనేతను మన స్వాతంత్ర్య పోరాట సాధనంగా , సాధికారతా చిహ్నంగా పరిగణించిన గాంధీ పుట్టిన దేశంలో నేత పనివారికి భుక్తి కరువై ఆత్మహత్యలకు పాల్పడే అగత్యమేర్పడింది. స్వదేశీ ఉద్యమాన్ని మనసా వాచా బలపరచి, దేశక్షేమానికి, పురోగతికి స్వదేశీ వస్తువుల ఉత్పాదకత, వినియోగం అవసరమని ఉద్ఘాటించిన నేలపైన గ్లోబలైజేషన్ పుణ్యమా అని చైనా బజార్లు చెలరేగిపోతున్నాయి. డాలర్ షాపులు ధగధగ లాడుతున్నాయి. ఆడంబరాలకు ఆమడ దూరంలో నిలచిన ఆయన దేశీయులిపుడు ఆధునాతన విదేశీ వస్తువుల కోసం , వాహనాలకోసం తహతహలాడుతూ ఎంత ధరైనా చెల్లించడానికి సిధ్దపడుతున్నారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైతే ఆయన వారసత్వాన్ని ఎలుగెత్తి చాటుకుంటోందో ఆ ప్రభుత్వమే మంచినీళ్లు దొరకని గ్రామాల్లోనైనా మద్యం మాత్రం నిరంతరాయంగా దొరికేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ గ్రామ సీమలు సర్వతోముఖాభివృధ్ధిని సాధించాలని ఆయన ఆరాట పడ్డారో ఆ గ్రామాలలో పంటపొలాలన్నీ చేపల చెరువులై వొట్టిపోయాయి. సెజ్ లు గా మారి అన్నదాతల జీవనోపాధిని ఛిద్రంచేసి, పసిడి కాంతుల ధాన్యాగారాలను, గుప్పిట్లో ఇమిడిపోయి చిటికెలో కరిగిపోయే నోట్లకట్టలుగా మార్చేస్తున్నాయి. ఏ స్వయం సమృధ్ధి జీవగర్రై మనని కాపాడుతుందని ఆయన నొక్కి వక్కాణించారో ఆ స్వయం సమృధ్ధి విఛ్ఛిన్నమయేలా నేడు ఆహార పంటలపై జెనెటిక్ మోడిఫికేషన్ జరిగి, ఆ పంటలు స్వార్ధపరుల కుట్రల కారణంగా దేశీయ పంటల్లోకి చొచ్చుకు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వాల హ్రస్వ దృష్టి కారణంగా మన అన్నదాతలు, వారి వెంటే మనమూ విదేశీ విత్తన కంపెనీల వలల్లో చిక్కుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం ! మహాత్ముని పుట్టినరోజు, కార్యాలయాలన్నిటికీ సెలవు రోజై , ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అన్న జాతిపిత సందేశానికి వ్యతిరేకంగా ఉత్పాదకతకు కళ్లెం వేస్తోంది. ఆర్ధిక మాంద్యంతో తల్లడిల్లుతున్న దేశంలో ఇక ఈ ప్రత్యేకదినాన్ని తలుచుకుని సంబరపడేందుకేం మిగిలింది ??

         శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల మన జీవినవిధానం ఎంతో ప్రభావితమైంది. సమాజంలో ఎంతటి మార్పులు చోటుచేసుకున్నా, గాంధీ జీవన విధానమే ఇప్పటికీ ఆదర్శప్రాయమని ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్ర సమరంలో ఆయన ఎంచుకున్న 'అహింస' ఆయుధమే ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలకు వజ్రాయుధమై, విజయసాధనమవడం గాంధీజీ దార్శనికతకు ఉదాహరణ.

              చిక్కని చీకటిని నిరసించే గొంతులెన్నో, చక్కని వెలుగిచ్చే మౌన దివ్వెలు కొన్నే!

              కీర్తి కాంతుల్లో వెలిగి పోయేవారు ఎందరో, స్ఫూర్తి కిరణాల వెలుగై నిల్చే వారు కొందరే !

         శ్రీనివాస్ నాగులపల్లి గారు కవిత్వీకరించినట్టు, చిక్కని చీకటిలో స్వయంప్రకాశమై , మౌన దీపమై, స్ఫూర్తి కిరణపుంజమై ధగధ్ధగాయమానంగా వెలిగి, అజరామరమై నిలిచిపోయిన బాపూజీ పుట్టినరోజు మానవాళికే పండగరోజు. ‘అర్ధరాత్రి స్త్రీ నిర్భయంగా సంచరించగలిగిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టుగా భావిస్తా’నన్న బాపూజీ, మళ్లీ జన్మిస్తే, భారతంలో ప్రతిరోజూ చోటుచేసుకుంటున్న అత్యాచార పర్వాలనుంచి, తాను కోరిన నిజమైన స్వాతంత్ర్యసాధనకి మార్గనిర్దశనం చేసేవారేమో!