December 19, 2012


రంగుమారిన నందివర్థనాలు
                    


అద్దంలో చూసుకున్నాను
ఎంతకీ అంతుపట్టక...
ఎక్కడో గాయమైంది
వెతికినా కనిపించని చోట!
పండీ పండని కేశాల్ని
ఒత్తుగా కప్పుకున్న కపాలం లోనా ?
అబ్బే..అక్కడ కాకపోవచ్చనిపించింది

కొంచెం కిందికి చూశాను...
బీటలు బారినా శిధిలావస్థకి
చేరని భవనంలా నా వదనం
ముడుతలు ఇంకా పేరుకోని ఫాలభాగం..
దాని వెనక అయ్యుంటుందా?   ఏమో...

ఒకప్పటి తెల్లటి నందివర్థనాల స్థానంలో
నీరుకావి పంచ పీలికల్లా నా కళ్లు...
వాటిలో దశాబ్దాల దుఖాశ్రువుల నకళ్ళు..
దెబ్బతిన్న పక్షుల్లా నిందిస్తున్న దృక్కులు!

ఎందుకలా ??
ఎవరి తప్పుకో చెదరి పోయిందేం నా కల ?
వేళ్ల మీద పెయిన్ బామ్ చూసుకుంటూ
గాయమెక్కడో వెతుక్కున్నాను

మెల్లగా ఎగసిపడే మధ్యాహ్నకెరటంలా నా హృదయం
ఆ సముద్రాంతర్భాగంలో ఎక్కడని వెతకను?
భూమ్మీద మూడొంతులు నీరే ఉందిట !
ఎక్కడని రాయనీ లేపనాన్ని?

చెలియలి కట్ట వెనకే విరిగి పడే దు­ఖం
ఎప్పుడో ఏ పౌర్ణమికో రెప్పల్ని తోసుకుని పొంగుతుంది
మళ్ళీ మర్నాడే ఏమీ జరగనట్టు సర్దుకుంటుంది
ఇలాంటప్పుడు నా బాల్యం నాకిచ్చెయ్ అంటే ఎవరిస్తారు?

ఒకప్పటి చల్లటి తెల్లటి ప్రభాత కుసుమాలు ,
ఆ నంది వర్ధనాలు….మందారాలయ్యాయంటే
మళ్లీ కాలేవు ...మంచి ముత్యాలు
ఒకసారి జీరలు తేలాయంటే
ఇక ఎప్పటికీ కావవి – వెన్నెల వాకిళ్ళు!
స్ఫటిక స్వచ్ఛత కోల్పోయాక
నిలవవు పసి నవ్వుల లోగిళ్ళు..

అయినా ..నా పిచ్చిగాని ఇవన్నీ
పై పూతలకు లొంగని లోతైన గాయాలు !

                    **********

( నవ్య వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక 2006)

December 17, 2012


సం'సారం'


ఇటు ఇరుగమ్మ
అటు పొరుగమ్మ
అనంగీకారంగా
ఒకింత తృణీకారంగా
కారం కారంగా.... !

అయిపోయిన లీవూ
చేయక తప్పని కొలువూ
ఒడిలో పాపాయికి తోడు
బడికెళ్ళే బుజ్జాయి
రాత్రంతా నిద్ర లేని కళ్ళూ
సలుపుతున్న ఒళ్ళూ
వేడి కాఫీ నాకిచ్చి
ముద్దలూ , ముద్దులూ వాడికిచ్చి
బడికి పోయే బండెక్కించి
ప్రేమ పొంగే కళ్ళతో
జ్వరానికి మందేస్తావు !

అవ్వ !!  ‘మొగుడు ఆవిడేనమ్మా!
అతనేమో వట్టి వాజమ్మ! “
పక్కింటి అసూయో, అనసూయో !
ఎవరు భార్యోఎవరు భర్తో ..
మనకైనా తెలుస్తేగా...
ఎక్కడుంటుందో తెలీని
 ఆ మనసంతా మమతేగా !

రోజులు నెలలవుతూ
నెలలు సంవత్సరాలవుతూ
తీరిక లేని ఉద్యోగాలు
పని తెమలని ఉదయాలవుతుంటే
నే వేసిన జడకీ , నువ్వేసిన జడకీ
జంట కుదరక
బుంగ మూతితో మన పాపాయి!

మరీ ఇంతగా పని పంచుకోవాలా?
నే ఉప్పేసిన కూరలోనే నువ్వూ వేస్తే
ఆ వంట రుచేం కావాలోయీ ??
నొక్కగా నొక్కగా పక్కిళ్ళ బుగ్గలు
సొట్టలవుతాయి!
ఎవరేమన్నా నీ పెదవులపై
చిరునవ్వులే ఒలుకుతాయి!
నీ సంపాదన నా సంచీలో పెడితే
లెక్కపెట్టి నే ససేమిరాఅంటే
సర్దుకుని సరేరా అంటావు!!

జీవితంలో ఒకరికి ఒకరైతే
ఇతర్ల గొడవుండదు సుమా!
అమృతంలో మునిగి పోయినా
చావుండదుగా  నేస్తమా !

(నవ్య వారపత్రిక లో ప్రచురితం)

December 14, 2012
















ఆగని ప్రయాణం

      -------------వారణాసి నాగలక్ష్మి

ఒక మేఘం తడిపేసి పోతుంది
ఒక రాగం కుదిపేసి పోతుంది
గుండెల్లో తడి ఉంటే  ఒక భావం
పాటై పోయి మనసంతా చుట్టేసి పోతుంది !

ఒక మొగ్గ చిగురుల్లో పుడుతుంది
లేతాకుల పొత్తిలి లో సొమ్మసిల్లి నిద్రిస్తుంది
తొలి కిరణం   పిలిచిందంటే
పులకిస్తూ వికసించేసి పరిమళమైపోతుంది !

ఒక తలపు హృదయంలో జనిస్తుంది
మదిలోపల మథనై మమకారమవుతుంది
మమతలతో    పొదరిల్లేసి మధుర
స్వప్నాల ధారలతో రంగవల్లికలల్లేస్తుంది !

ఒక జల సెలయేరై పరిగెడుతుంది
నేస్తాల జతకట్టేసి నది తానై నర్తిస్తుంది
సాగరసంగమానికి సమాయత్తమౌతూనే
వెచ్చని గగన విహారం విలాసంగా సాగిస్తుంది !

ఒక రేఖ చుక్కలుగా విడిపోతుంది
చిరాకు పరాకులతో ఛిన్నాభిన్నమౌతుంది
చక్కని రూపం కోల్పోయి
చిక్కు ప్రశ్నై మిగులుతుంది చిన్నబోయి నిలుస్తుంది!

పుట్టిన ప్రతిజీవీ ప్రయాసకు లోనౌతుంది
తనదైన ప్రయాణాన్ని తపిస్తూ సాగిస్తుంది
ముందుకు పోతున్నట్టు భ్రమిస్తూ
ఆగని చక్రభ్రమణంలో ఆత్రంగా పాల్గొంటుంది !


(కౌముది లో వెలువడిన నా కవిత)