August 16, 2012


వాకపల్లి జీవచ్చవం - అరకులోయలో మ్యూజియం !












కొండదారుల్లో మీ గుండె దారిని వెతుక్కుంటూ 
మిట్ట పల్లాల లోంచి మీ పసుపు పొలాల్లోకి ప్రవేశించాం …..
దారిలో ఎగుడు దిగుళ్ళన్నీమీ ఇళ్ళ నాక్రమించిన  దిగుళ్ళ లా 
గతుకుల కాలిబాటలు చితికిన మీ బతుకుల్లా కనిపించి ....
వాకపల్లి చేరక ముందే మేం వాక్కు మరిచిపోయాం !   
భావరహితమైన మీ ముఖాలు, పొడిబారిన మీకళ్ళు 
ఇన్నాళ్ళుగా మీరెక్కి దిగిన కార్యాలయాల శుష్క వాగ్దానాలనీ 
న్యాయ పోరాటంలో మీకెదురైన ఎండ మావుల్నీ 
కాలయాపన వల్ల కొడిగడుతున్న మీ ఆశా దీపాలనీ 
దృశ్య మాలికలుగా మా మనసుల్లోకి చేరవేశాయి !

సభ్య నాగరిక సమాజ ప్రతినిధులుగా 
మమ్మల్ని మీరు గుర్తిస్తుంటే 
మా తలలు సిగ్గుతో నేలకు వంగాయి !
దోషిని శిక్షించాకే నిర్దోషిని అక్కున చేర్చుకునే 
మీ న్యాయ స్థానాన్ని చూసి 
దోషులకి  కంచె  కట్టి కాపాడే మా వ్యవస్థ వెల వెల పోయింది !
ట్టూ బొట్టూ భాషా జీవన విధానం అంతటా 
అనాదిగా మీ సంస్కృతిని పరి రక్షించుకుంటూ మీరుంటే ..
మీ స్వచ్ఛ దరహాస వదనాలపై ఆకస్మిక దాడి చేసి 
కన్నీరెరుగని ఆ కళ్ళలోంచి 
కడవలకొద్దీ దుఖాశ్రువుల్ని తోడి తీశాం !
దిగులు గుబుళ్ళని మీ కళ్ళ చుట్టూ వలయాలుగా పేర్చి 
మొహాలపై   ముడుతలుగా తీర్చి 
కనుల కొలనుల్లో నైరాశ్యపు నీలిమని దట్టంగా పట్టించాం !
మిమ్మల్ని చీల్చి చెండాడి 
మీ పసివాళ్ళ మనస్సులో ఎప్పటికీ చెరిగిపోని 
భయానక భీభత్స చలన చిత్రాలని 
చులాగ్గా చొప్పించాం!
మిమ్మల్ని జీవచ్చవాల్ని  చేసి 
అరకులోయలో మేమొక మ్యూజియం నిర్మించుకున్నాం!
మీ ఆట పాటల్నీ ,ఇల్లూ వాకిళ్ళనీ ,పెళ్లి పేరంటాలనీ 
ఎన్నో విశిష్ట సన్నివేశాల్నీ 
అందమైన నిలువెత్తు బొమ్మలుగా ప్రతిష్టించుకున్నాం !
తుపాకులూ మారణాయుధాలేకాదు    
కెమేరాలూ వీడియోలూ కూడా లోపలికి రాలేని విధంగా 
పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నాం!
ప్రవేశ రుసుమిచ్చి లోపలికి వెళితే 
అక్కడ మిమ్మల్ని చూసేందుకే గాని 
ముట్టుకుందు కూ  పట్టుకుందుకూ అనుమతి లేదు !
అక్కడ అత్యాచారాలు కుదరవు!
తల్లులారా ! ఇక భయం లేదు !
మీ సంస్కృతి అక్కడ భద్రంగా నిలుస్తుంది ! 

        *       *        *       *

2008 లో భూమిక రచయిత్రులతో కలిసి అబ్బూరి చాయాదేవి గారు,కొండవీటి సత్యవతిల నాయకత్వంలో వాకపల్లి కి వెళ్లి బాధిత మహిళలని కలిసి వారి ఆక్రందన విన్నప్పుడు కలిగిన వేదన నుంచి జనించిన కవిత.  

ఏప్రిల్ 27 , 2012 నాడు  నిందితులపై పునర్విచారణకు ఆదేశించిన  హై కోర్టు న్యాయ మూర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తూ )
    

August 14, 2012

త్వరలో వెలువడ బోయే శ్రీవల్లీ రాధిక కథల సంపుటి లో కథల కోసం కొన్ని బొమ్మలు

దంపతుల మధ్య ధర్మ యుతమైన సాహచర్యాన్ని  నిర్వచించిన కథ.  సహ ధర్మ  చారిణి  

 సత్తెమ్మ చేయించిన సత్య దర్శనం - సత్యం

సౌందర్యం కేవలం కనుముక్కుతీరుకూ, శరీర లావణ్యానికీ సంబంధించినదా లేక చూసే వ్యక్తి అంతరంగంలో రేకెత్తే భావపరంపరకు సంబంధించినదా ?అందాన్ని కవితాత్మకంగా నిర్వచించిన సుందరికి తన కవితకర్ధం ఏమిటో తెలియజెప్పిన సంఘటన ! ' సౌందర్యం'  

మనసు కోరినవన్నీ అందిస్తూ దానికి బానిసై నడుస్తూ,  వత్తిడి ని అధిగమించడానికి అదే మార్గమని నమ్మే అమ్మాయి,   ఇంద్రియ సుఖాలను కోరే మనసుని  తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం ద్వారా   జ్ఞాని అయిన వ్యక్తి , వత్తిడినెలా  జయిస్తాడో    తెలుసుకున్న వైనం- ' విముక్తి ' కథ 

August 13, 2012

పేరు మారిన నగరం

ఉదయ  కిరణాలన్నీఆటోలో ఇరుక్కున్న
 బాల భానుళ్లై
భూ భారాన్ని వీపుల కెక్కించుకుని
 బడికి పోతున్నాయి!
విస్తరించిన తరు శాఖల ఛాయల్లో
విశ్రమించిన ఇళ్ళన్నీ
తరువుల్ని తరిమేసి
 ఆకాశాన్ని ఆక్రమిస్తున్నాయి !
పెరిగిన వత్తిడికి పగిలిన గొట్టాలలో తాగునీరూ  
మురుగు నీరూ చెట్టా పట్టాలేసుకుంటున్నాయి
ప్రతి వీధీ ఒక టిఫిన్ సెంటరే !
రకరకాల రుచులు తిరిగి తిరిగి మరిగే నూనెలో
కరకర లాడుతున్నాయి 
ప్లాస్టిక్ గ్లాసుల్లో టీ కాఫీలై పొగలు కక్కుతున్నాయి 
నగరం తిని తాగి పారేసిన చెత్త,  మట్టిలో  కలవనని మొరాయిస్తోంది 
సిటీ సివిక్ సెన్సంతా  చేటల్లోకెక్కి   
ప్రహరీ మీంచి వీధిలోకి దూకుతోంది 
అంతుపట్టని రోగాలు 
కార్పొరేటు ఆసుపత్రుల కంప్యూటర్లలో
భారీ బిల్లులై ఆత్రంగా బయటికొస్తున్నాయి ! 
డిస్కౌంట్ల వలలనిండా కస్టమర్ల కరెన్సీ చేపలే !
ఆకర్షించే ప్యాకేజీలు ఇంటికొచ్చి 
గార్బెజిగా రూపాంతరం చెంది 
చెత్తకుప్పలపై ఆటలాడి,
మురుగు కాల్వల్లో స్నానమాడుతున్నాయి !
వార్తా పత్రిక లో మొదటి పేజీ వార్త -
నగరం పేరు నరకం గా మారుస్తారట  !
జనంలో మృగ్యమైన పాపభీతి దైవ భక్తిగా మారి 
మైకుల్లో విజృంభించి కాలనీల కర్ణ భేరిని చేదిస్తోంది ! 
అసహనం వాహనాలెక్కి
జనం చెవులు చిల్లులు పొడుస్తోంది 
ఆగిన కారుల ఆగని హారన్లకి  
నగరం హాహాకారం చేస్తోంది !
పక్కవాడి గొడవ పట్టని తనం 
ఉగ్రవాదానికి పీఠం వేస్తోంది 
గ్లోబలైజేషన్ పిశాచం, గోరీ లోంచి పైకొచ్చి 
నిశీధిని శాసిస్తోంది,
ప్రకృతి నియమాలను పరిహసిస్తోంది !
నడిరేయి ఏ జాములోనో నిశ్శబ్దంగా  నడిచొచ్చి 
అలసిన కళ్ళకి చీకటి పరదాలేసి,
మానని గాయాలకి చల్లని లేపనాలద్ది 
జోలపాడి నిదురపుచ్చే ప్రియబాంధవి 
'యామిని' ఏదీ?
కనిపించదేం  ? 
అయ్యో ! ఆమె మరణించిందా ?
దయచేసి శబ్దం చేయకండి ...
రెండు నిముషాలు మౌనం పాటిద్దాం  !

(నది మాసపత్రిక  లో ప్రచురితమైన కవిత )

August 7, 2012

మురళి














వెదురు బొంగుని వేణువుగా ఊదుతూ
పొలాల కావల బీడంతా తిరుగుతాడు
పసుల   కాసే   ఆ     పసివాడు..

పెద్దల సేవా పిల్లల ఆలనా
పెద్దింటి కోడలిగా పనుల్లో సతమతమై
మనసూ తనువూ అలసిన వేళ..
అనుకోకుండా వినిపిస్తుంది వాడి మురళి
చల్లని పిల్ల గాలిలా  వచ్చి నన్ను చుట్టేసి కట్టేస్తుంది!

మబ్బు పట్టిన మధ్యాన్నం ఒకలా
గుబులు పుట్టే శిశిర సంధ్యలో ఇంకోలా
చిక్కని మౌనం  కప్పిన చీకటిలో మరోలా..
వెన్నెల్లోనూ, కొమ్మల నీడల్లోనూ
విరిసే పూలమీదా,తడిసిన ఆకుల మీదా ....
అంతటా ఆ పాట వ్యాపిస్తుంది

పాపాయికి పాల బువ్వా , బుజ్జాయికి గోరుముద్దా
తినిపించి ,జోకొట్టి నిదురపుచ్చి,
పతి సాన్నిధ్యంలో  పవళించే  వేళ
ఆ పాట అలలు అలలుగా తేలి  వస్తుంది. .

వచ్చీరాని వాడి పాట..
 గాలివాటున వొచ్చేసి
నా గుండెలో  గూడు కట్టేస్తుంది..
వాడి అవ్యక్త భావాలెన్నిటినో
నా మస్తిష్కంలో పేరుస్తుంది..
ఆ పాటలోని తడి నా కంటిలోకి జారి
కన్నీరై పోతుంది ...

ఎవరింటి పసి వాడో ..ఎవరింట పని వాడో ..
పిడికెడన్నమైనా   తిన్నాడో..  పస్తున్నాడో..
అమ్మ గోరుముద్దల రుచి తెలుసో లేదో ..
పాల బుగ్గల పసితనం కరిగిందో లేదో..

ఊరుమాటు మణిగేదాకా   గొడ్ల పనీ ఇంటి పనీ  కానిచ్చి
దొర కోసం పక్క పరిచి కాళ్ళు పిసుకుతాడు కాబోలు!
లోకమంతా కలల్లో తేలే  వేళ
మురళి తీసి మోవికానిస్తాడు !
జాబిల్లి చల్లదనం, వెన్న ముద్ద కమ్మదనం
కన్నయ్య కన్నుల్లో జాలువారే  కరుణరసం
రంగరించి రసం తీసి వేణువులో చొప్పిస్తాడు !

వెతలన్ని మరపిస్తూ వెదురునే మురిపిస్తాడు !
తల్లడిల్లే హృదయాలని తల్లిలా ఊరడిస్తాడు..
వేదననే నవ్వించే వేదాంతి తానై
అమ్మలకే జోలపాడి జోకొడ తాడు  ! 

August 6, 2012

కర్మయోగి

 ముందుకొచ్చి తొంగి చూస్తూ చప్పరించి వెనకడుగేస్తూ 
ఎంతసేపో ఎదురుతెన్నులు చూశాక
దూరంగా...ఆకాశం నేలా కలిసే చోట
చుక్కలా ప్రత్యక్షమౌతావు  !     
వంపులు తిరుగుతూ, తోకచుక్కలా సాగుతూ ముందుకొస్తావు   
చెవులు గింగుర్లెత్తిస్తూ   దృష్టి పథాన్నాక్రమిస్తావు   
రొప్పుతూ రోజుతూ దగ్గరకొచ్చి నిట్టూరుస్తూ ఆగుతావు 
లోపల్నుంచి మనుషుల్నీ వస్తువుల్నీ బయటికి నెట్టేస్తూ 
చుట్టుముట్టిన కొత్తవాళ్ళని 
ఆత్రంగా ,అస్తవ్యస్తంగా ,అయస్కాంతంలా నీలోకి లాక్కుంటావు !
ఆయాసం  తీరేదాకా , స్వేద బిందువులారేదాకా   
కాస్తంత విశ్రాంతి తీసుకుంటావో లేదో 
భారంగా శరీరాన్నీడుస్తూ   మళ్ళీ ప్రయాణమౌతావు ...   
రవ్వంత దూరం సాగేసరికి సత్తువొస్తుంది కాబోలు
సర్రున దూసుకుపోతావు ! 
కిటికీ రెప్పలు తెరిచి పక్క చూపులు చూసుకుంటూ 
పగలనక రాత్రనక పరుగులు పెడతావు !

పంట పొలాలు పచ్చటి తివాచీ పరచినా 
నదులూ కాలువలూ రవ్వల పువ్వులు విసిరినా
వెండి మబ్బుల గాలిపటాలు వినువీధిలో విహరించినా
చెట్లూ గట్లూ ఉత్సాహం పట్టలేక పరుగులు తీసినా 
అలా  కళ్ళప్పగిస్తావే గాని నీలో ఏమార్పూ కనపడదు !
కొండ అంచుల్లోనూ, అడవి నట్టింట్లోనూ,లోయ వాలుల్లోనూ 
పైకి పోయే పొగని పట్టుకు వేళ్ళాడుతూ
పూరిపాకలు కనపడగానే 'కుహూ..'అని పలకరిస్తావు
ఆమని వస్తోందని ఆశలు కల్పిస్తావు ! 

ఎక్కడో  ఎప్పుడో ఓ చోట ఆగనా వద్దా అని ఆలోచనలో పడతావు 
తక్కుతూ తారుతూ నిక్కుతూ నీలుగుతూ 
జనంలో కొస్తావు...ఒకటే మొహమాటం నీకు 
అంతటి  సంకోచం నీకే గాని 
నీకోసం ఎదురు చూసేవాళ్ల౦దరికీ   ఎంత సంబరమో !
వేల చేతులతో నిన్ను తడిమి 
టీలూ కాఫీలూ పూలూ పళ్ళూ ఇడ్లీ వడా పూరీ ఉప్మా 
ఒకటేమిటి  సమస్తం అందిస్తారు 
కాలక్షేపానికి వార పత్రికలూ వార్తా పత్రికలూ పల్లీలూ బఠానీలూ 
అన్నీ తెచ్చిచ్చి తీసుకోమని  ప్రాధేయ పడతారు  !

అలాంటపుడు నీకెంత నిర్లక్ష్యమో !
పుచ్చుకున్నంత  పుచ్చుకుని విదిలించి పారేస్తావు !
వెంటపడి వేడుకుంటుంటే నిర్దయగా వదిలేసి ముందుకి సాగిపోతావు
ఎంత కాఠిన్యం అనిపిస్తు౦దొకోసారి  !
అది కాఠిన్యం కాదు కర్తవ్యం అంటావు !

ఆ మూల నించీ ఈ మూల దాకా రోజుల తరబడి ప్రయాణాలు సాగిస్తావా 
ఎక్కడో ఒక చోట కాళ్ళు బారజాపి నిద్రకు పడతావు 
కదలవు మెదలవు 
కుంభకర్ణుడి  తమ్ముడిలా 
చప్పుడన్నది లేకుండా పడి వుంటావు 
దిక్కులేని జీవాలు నిన్నాసరా చేసుకుని 
నీ నీడన చోటు చూసుకున్నా, ఎక్కి తొక్కినా 
కిమ్మనకుండా ఊరుకుంటావు  !
అపుడేమో నీ జాలి గుండెకి కళ్ళు చెమ్మగిల్లి చూపు మసకేస్తుంది !

బడలిక తీరి కాస్తంత శక్తి పుంజుకోగానే 
' ద  షో మస్ట్ గో ఆన్ ' అంటూ 
ఆగమని నీ వెంటపడే వాళ్ళని 
అదిలించి విదిలించి ఎలాగో వొదిలించుకుని 
ముందుకి సాగిపోతావు  !

గొప్ప కర్మయోగివి సుమా నువ్వు !                                                      


August 4, 2012

భూమిక ,ఇంకా ఇతర పత్రికలలో కథలూ కవితలకు నా బొమ్మలు ..

ఆడపిల్ల వద్దనుకుని మొగ్గలోనే తుంపేసిన తండ్రికథ. 
 అవసాన దశ, అపస్మారక స్థితి ,కూతురికోసం తపన . కొండవీటి సత్యవతి కథ కు బొమ్మ. 


              అవసాన దశలో తల్లీ.. ...రెక్క లొచ్చాక  ఎగిరిపోయిన కొడుకు .
              మనసు కాలుష్యపు కడగండ్లు దోర్నాదుల సుబ్బమ్మ గారి  కథకు బొమ్మ  
              Nov '11 ,భూమిక స్త్రీవాద పత్రిక. 

గ్లోబలైజేషన్ లో భూమి కోల్పోయి అంగడి వస్తువైన స్త్రీ  కథ 
అభివృద్ధికి అటువైపు - కొండవీటి సత్యవతి కథ ,భూమిక స్త్రీవాద పత్రిక ,మే '10  



సాటిలైట్  లాంచింగ్ లో సఫలమైన భారత్..వైద్యమందక కాన్పు కష్టమై ప్రాణాలొదిలిన  సామాన్య స్త్రీ. 

చిన్నప్పుడే పెళ్ళైపోయి బాల్యానికి దూరమైన తల్లి , తన పాపను గొప్పగా చదివించాలనే
 తపనతో రోజూ అక్షరాలు దిద్దిస్తూ బిడ్డ గురించి బంగారు కలలు కంటూ, గుండెపోటుతో అర్ధాంతరంగా 
 తనువు చాలిస్తుంది.పక్కింటి పెద్దామె దృష్టి కోణం నించీ సాగిన 
పింగళి(భట్టిప్రోలు)బాలాదేవి కథ 'బేబీ ' .



హనీమూన్  లో  పరస్పరం  భావాలను  పంచుకుని  దగ్గరైన  జంట.కొండవీటి సత్యవతి కథ  

ఉద్యమంలో పాల్గొని మరణించిన కొడుకుని  వీరుడిగా తలచి గర్వపడే ఇంట్లో, తనను గృహ హింసకు లోను చేసే భర్త నెదిరించి పుట్టింటికి వచ్చిన   ఆడపడుచుకి అండ దండలూ,ఆశ్రయమూ,  గొంతెత్తి మాట్లాడగలిగే స్వేచ్చా  దొరక్కపోగా తిరస్కారం ,అవమానం ఎదురవడం ఎంత విచారకరం!
భూమిక జూన్ '11
  
అత్యాచారానికి గురై అపస్మారక స్థితిలో వీధిలో వదిలేయబడ్డ అమ్మాయి తెలివి వచ్చేసరికి, ఎదురుగా ఒక ప్రముఖ టీవీ చానల్  లో  విలేఖరిగా పని చేస్తున్న తన స్నేహితుడు కనపడి స్నేహంగా పలకరించగానే దుఃఖిస్తూ తన కథ చెప్పుకుంటుంది.ఉద్యోగంలో sensational న్యూస్ కోసం తనపై విపరీతంగా వస్తున్నా వత్తిడి అతన్ని ఆమె కథనే న్యూస్ లో చూపించేలా చేస్తుంది.తన తండ్రి కీ విషయం తెలిస్తే గుండె పగిలి పోతుందని ఆమె విలపించిన విషయం గుర్తుండీ ఆ స్నేహితుడే ఆ వార్తను టీవీ చానల్ కి  వీడియో తో సహా అందించడం,ఇతర విలేఖరులూ గుమికూడడం ... గగుర్పొడిచే  కథాంశం.

తన శీలాన్నీ తనకు రావలసిన ఆకుకూర మడి నీ  ప్రభుత్వాధికారి దోచుకు పోతూ
ఒక చిన్న చెక్కు తనకు పారేస్తే చేష్టలుడిగిన బాలిక గురించి సీతారత్నం గారు 
రాసిన కథ 

'మాట్లాడుకుందాం '
వర్షం వచ్చి కరెంటు పోయి టీవీ , టేలిఫోనూ పనిచేయకపోవడంతో ఒకరితో ఒకరు మనసు విప్పి 
 మాట్లాడుకుని తిరిగి దగ్గరైన భార్యా భర్తల మీద  కొండవీటి సత్యవతి రాసిన కథ


అమ్మకేం తీసుకెళ్ళాలి ?కథ.
భూమిక స్త్రీవాద పత్రిక - జూలై '11



వన్య మృగాల సంరక్షణ కోసం అనుమతి లేనిదే సినిమాల్లో జంతువుల చేత బలవంతాన నటింపచేయ  కూడదని చట్టం ఉంది.కానీ  డబ్బు కి ఆశపడి  పసి పిల్లల్ని( వాళ్ళు ఏడ్చి కక్కటిల్లి పోతున్నా)  సినిమా చిత్రీకరణలో వాడుకుందుకు తల్లితండ్రులే ఎగబడి  పంపడాన్ని నిరోధించే వ్యవస్థ ఇంకా రాలేదు.
           చమ్కీ చీరలో గుచ్చుకునే నగలతో హీరోయిన్ కమోనీ,...ఆర్క్ లైట్లూ,కొత్తమొహాలూ,ఎత్తుకోవడం చేతకాని హీరోయిన్ చేతిలో నలిగిపోయి జ్వరం తెచ్చుకున్న   పసివాడు నందూ..డబ్బాశ,సినిమా మోజూ మితిమీరిన భర్త నించీ కొడుకుని కాపాడుకోవడం కోసం సతమతమైపోయిన తల్లి నిర్మల. కొడుకునెత్తుకుని  అందమైన ఫోటో తీయించుకోవాలనుకున్న నిర్మలకు ఆకోరిక తీరదు సరికదా , తన కొడుకుని ఎత్తుకున్న కమోనీ ఫోటోని గోడకి తగిలిస్తూ నందూకి  మరో సినిమాలో ఆఫరొచ్చిందని   భర్త చెపుతాడు.
               గోడ మీది బొమ్మ - వారణాసి నాగలక్ష్మి కథ ,భూమిక స్త్రీవాద పత్రిక 
స్త్రీని చులకనగా ఆటబొమ్మలా చూసే వినయ్ అమెరికా వాస్తవ్యుడు.చిన్న వయసులోనే సద్భావాలూ సేవానిరతీ ఉన్న అందమైన అమ్మాయి నవ్య .స్వదేశంలో ఒంటరి వాళ్లైన అతని తల్లి దండ్రులకి వారానికోసారి వస్తూ సహాయ పడుతున్న నవ్య అతన్ని వివాహమాడడానికి నిరాకరించడానికి దారితీసిన సంఘటనల సమాహారం...నవ్యానుబంధం కథ .
భూమిక స్త్రీవాద పత్రిక

చిన్నప్పుడు తను ఎంతో ఇష్టంగా బొమ్మలు గీసేదని ,ప్రకృతిని చూసి పరవశించేదనీ  మరిచిపోయి
గృహిణిగా అనుక్షణం బాహ్యా లంకరణ కే  ప్రాధాన్యమిస్తూ తన అస్తిత్వాన్నే కోల్పోయిన
ఒక అమ్మ తన పుట్టింటికి వెళ్లి మళ్ళీ జీవం పొందిన 
వైనం!
వివేచన కథ 




August 3, 2012






                        

  



వీడని రక్షా బంధనం-వాడని మమతకు వందనం ! 
                                                 ---------- వారణాసి నాగలక్ష్మి        

                "నేను నా ఆత్మ కోసం వెతికాను.కానీ నా ఆత్మ నాకు కనిపించలేదు.  నేను నా దైవం కోసం వెతికాను.కానీ దైవం కూడా నాకు కనిపించలేదు.  నేను నా సోదరుని కోసం వెతికినపుడు  నేను ఆశించిన మూడూ నాకు లభించాయి !"

              సోదరుడంటే ఏమిటో ఒక సోదరి ఇచ్చిన నిర్వచనమది !

             ఒక అన్నగారు తన చెల్లెలు వేయిమందిలో ఒకతె అని పువ్వులూ,తారలూ చెపుతున్నాయంటూ ,తామిద్దరూ జీవించినంతకాలం కలిసే ఉంటామని చెపుతూ ఆర్ద్రంగా పాడిన పాట,ఒక హిందీ చిత్ర గీతం, మనందరం ఎన్నొ సార్లు విన్నదే. తెలుగు సినీ గీతాల్లో కూడా అన్నాచెల్లెళ్ళ అనురాగాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రచించారు గీత రచయితలు.

              'అన్నా! నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్య ఫలం' అని ఒక చెల్లి తలచుకుంటే అన్నయ్య లాంటి కన్నయ్య వుంటే కన్నులే అక్కర్లేదనీ , ఆ అన్నయ్య చల్లగ నవ్వక పోతే  వెన్నెలెంత విరిసినా నిరుపయోగమనీ  మరో చెల్లెమ్మ పాడుకుంటుంది.కథల్లోనూ, కవితల్లోనూ ఎంతగా వర్ణించినా ఆ అనుబంధపు గాఢతా ,పవిత్రతా అనుభవైకవేద్యమే గాని వర్ణించసాధ్యమైనది కాదంటారు ఆ భాగ్యాన్ని పొందిన అదృష్టవంతులు.  
           మన దేశం వర్ణశోభితమైన పండుగలకూ, ఉల్లాస ఉత్సాహాలకు  మారుపేరైన ఉత్సవాలకీ పెట్టింది పేరు!   పరిమళ భరితమైన ,వన్నెవన్నెల  పువ్వులూ,ఒంపులు తిరిగే రంగ వల్లులూ, చవులూరించే విందు భోజనాలూ,రుచికరమైన మిఠాయిలూ,నూతన వస్త్రాలూ,బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసుకునే ఆచార వ్యవహారాలూ…..లైఫ్ ఈజె సెలబ్రేషన్ అనే ధోరణిని మనలో పెంపొందిస్తాయి !  
                సోదరీ సోదరుల మధ్య గల అనురాగ బంధాన్ని  శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే రాఖీ  పండుగ ఉత్సవం గా  జరుపుకుంటారు. ఆ అనుబంధంలోని ప్రేమనూ,ఆప్యాయతనూ ఈ పండుగ రోజున ఒకరికొకరు ప్రకటించుకుంటారు.అక్కచెల్లెళ్ళు తమ సోదరులు ఆయురారోగ్య ఐశ్వర్యాలను , సకల భోగ భాగ్యాలనూ పొందాలని ప్రార్ధించుకుంటారు.అన్నదమ్ములు తమ సోదరీ మణుల చేత కుడిచేతి మణికట్టుకు రాఖీ కట్టించుకుని ,వారందించిన మిఠాయిలు తిని,తమకు తోచిన బహుమతులందించి , వారికే ఆపదా రాకుండా రక్షించుకుంటామనీ, జీవితాంతం వారి మంచి చెడ్డలు చూసుకుంటామనీ మాట ఇస్తారు.
                  సున్నితమైన అన్నా చెల్లెళ్ళ  మధురానుబంధాన్ని  నాజూకైన రంగుల పట్టుదారంతో చేసిన కళాత్మకమైన రాఖీ బంధనం ప్రతీకాత్మకంగా సూచిస్తుంది.  అందంగా అలంకరించిన రాఖీ   దారం  పవిత్ర సూత్రమై, అత్యంత సుందరమైన అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని వీడని బంధంగా నిలుపుతుందని  నమ్ముతారు. ఈ పండుగ కొక సామాజిక ప్రయోజనమూ వుందని తోస్తుంది. పుట్టుకతో సహోదరులు కాకపోయినా మానసికంగా సోదర భావం కలిగి వున్న ఇద్దరు స్త్రీ పురుషులు రాఖీ బంధనంతో ఆ పవిత్ర బంధాన్ని అనుభూతించగలుగుతారు.ఆ స్త్రీ తను రాఖీ కట్టిన వ్యక్తిని సోదరుడుగా భావించి అతని సర్వతోముఖాభివృద్ధినీ, సుఖ శాంతులనూ కోరుతుంది.ఆ పురుషుడు తనకు రాఖీ కట్టి సోదరిగా మారిన స్త్రీ యొక్క రక్షణ తన కర్తవ్యంగా భావిస్తాడు. ఇలాంటి పండుగల వల్ల ఆ సమాజం చక్కని కట్టుబాట్లకు లోబడి నడిచే ఆదర్శ సమాజంగా రూపొందే సావకాశం ఏర్పడుతుది.

            భావనలే అలోచనలవుతాయి.అలోచనలే ఆచరణలకు దారితీస్తాయి. సత్కార్యాచరణను ప్రొత్సహించే సంప్రదాయాలు చక్కని సమాజ నిర్మాణానికి దోహదం చేస్తాయి.

           సాధారణంగా మనం జరుపుకునే ప్రతి పండుగ గురించీ పురాణాలలో  బహు విధాలైన  ప్రస్తావనలు  కనిపిస్తూ వుంటాయి. శ్రీ కృష్ణుడి చేతి మణికట్టుకి గాయమైనపుడు ద్రౌపది తన పట్టుచీర కొంగుని చింపి గాయానికి కట్టు కట్టిందనీ, ఆ చర్యతో   ద్రౌపది తన పట్ల ప్రకటించిన సోదర ప్రేమకు విచలితుడైన శ్రీ కృష్ణుడు ఆ తరువాత అనేక దశాబ్దాల పాటు ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ,ఎన్నో  సందర్భాలలో ఆమెను ఆదుకున్నాడనీ మహా భారత కథ చెపుతుంది. శ్రీ కృష్ణుడు రాఖీ బంధనం నాడు వరుసకు చెల్లెలైన ద్రౌపదికి తానిచ్చిన మాటను ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఆమె మానరక్షణ చేయడం ద్వారా నిలబెట్టుకున్నాడని తెలుస్తొంది.

         విష్ణు భక్తుడైన బలి చక్రవర్తి సామ్రాజ్యంలో శ్రావణ పౌర్ణమి నాడు మారువేషంలో మహా లక్ష్మి స్వయంగా వచ్చి బలి చక్రవర్తి చేతికి రాఖీ కట్టిందనీ, ప్రతిగా  బహుమతి కోరుకొమ్మని చక్రవర్తి అడిగినపుడు తన సౌధాన్నీ, భార్య సాన్నిధ్యాన్నీ వదలి వచ్చి భక్తుని రక్షణలో మునిగిపోయిన మహా విష్ణువుని తనకు తిరిగి ప్రసాదించమని లక్ష్మీ దేవి కోరుకుందనీ ఒక కథ.తన చేతికి రాఖీ కట్టిన స్త్రీ సాక్షాత్తూ మహ లక్ష్మి అని తెలిసిన బలి చక్రవర్తి ఆమె  చేత రాఖీ కట్టించుకున్న తన భాగ్యానికి పొంగిపోయి, విష్ణు మూర్తిని ప్రార్ధించి ఆమె కోరిక తీర్చాడని ఈ కథ తెలియజేస్తుంది.
                    యమధర్మరాజు సోదరి అయిన యమునా నది తన సోదరుడికి రాఖీ కట్టి, బహుమతిగా చిరాయువుని పొందిందని మరో కథ.తన చెల్లెలి అనురాగానికి ముగ్ధుడైన యముడు ,ఇకముందు ఎవరైతే తమ  సోదరి చేత రాఖీ కట్టించుకుని, ఆమె రక్షణ బాధ్యత స్వీకరిస్తారో  వారికి మరణం వుండదని వరమిచ్చినట్టుగా ఈ కథలో చెప్పబడింది!
               గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్  రాజా పురుషోత్తముడి పై యుద్ధానికి సిద్ధపడినపుడు, పురుషోత్తముడి పరాక్రమం గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య ,హిందూ యువతి అయిన రుక్సానా, పురుషోత్తముని చేతికి రాఖీ కట్టి ,బహుమతిగా తనను సౌభాగ్యవతిగా దీవించమని కోరుతుంది.సోదర భావం మూర్తీభవించిన పురుషోత్తముడు ఆమెకు మాట ఇస్తాడు .యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం మీద నుంచి పడిపోయినపుడు, అతన్ని తుదముట్టించబోయిన పురుషోత్తముడికి మణికట్టుకున్న  రాఖీ కనిపించి తానిచ్చిన మాట గుర్తుకొస్తుంది.అలెగ్జాండర్ని ప్రాణాలతో విడిచిపెట్టి ఆ కారణంగా యుద్ధంలో ఓడిపోతాడు పురుషోత్తముడు.రాజ్యాలూ,సంపదలే కాక ప్రాణాలు కూడా సోదరికోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ  సోదరుల సరసన రాజా పురుషోత్తముడు చరిత్రలో నిలిచిపోయాడు !
              గుజరాత్ సుల్తానైన బహదూర్ షా చిత్తూరు మీదకి దండెత్తి వచ్చినపుడు వారినెదిరించే శక్తి తమ సేనలకు లేదని గ్రహించివితంతువైన చిత్తూరు మహారాణి కర్ణావతి , మొఘలు చక్రవర్తి హుమాయూను సహాయమర్ధిస్తూ  రాఖీని పంపిందని చరిత్ర చెపుతోంది. రాఖీ అందుకున్న హుమాయూను చక్రవర్తి తక్షణమే తన సేనలతో బయలుదేరి  చిత్తూరు చేరేసరికే, చిత్తూరు కోటను హుమాయూను వశపరచుకున్నాడనీ , పదమూడువేలమంది అంతఃపుర  కాంతలతో రాణి ప్రాయోపవేశం చేసిందనీ ,హుమాయూను చిత్తూరు చేరగానే బహదూర్ షా ను పారద్రోలి, కర్ణావతి కుమారుడైన విక్రంజీత్ సింగ్ కి రాజ్యం కట్టబెట్టాడనీ , అప్పటినుండి రాఖీ పౌర్ణమి మరింత ప్రాచుర్యంలోకొచ్చిందనీ చెప్తారు.

                రాఖీ పండుగ నాడు లక్ష్మీ దేవిని పూజించి, గంధమూ ,కుంకుమతో అందంగా అలంకరించిన పళ్ళెంలో  తిలకమూ,బియ్యమూ,వత్తులు వేసి నూనె నింపిన ప్రమిద తో పళ్ళేన్ని సిద్ధం చేస్తారు.ఒక పక్కగా తాజాగా తయారు చేసిన మిఠాయిలనూ ,రాఖీలనూ  అమర్చుతారు.అన్న దమ్ములనూ లేదా సోదర భావమున్న ఇతర బంధుమిత్రులనూ కూర్చోపెట్టి, వారికి తిలకం దిద్దుతారు.వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రార్ధన చేసి రాఖీని కుడిచేతి మణికట్టుకు బంధిస్తారు.దీపం వెలిగించి హారతిస్తారు.సోదరిని ఎప్పటికీ ప్రేమానురాగాలతో చూసుకుంటాననీ, జీవితాంతమూ ఆమె రక్షణ బాధ్యత వహిస్తాననీ వచిస్తూ సోదరులిచ్చిన బహుమతిని  స్వీకరించి, వారికి మిఠాయిలను తినిపిస్తారు.

           సమాజంలో ఒకవైపు అశాంతీ, అనైతికతా,అత్యాచారాలూ  పెచ్చుపెరుగుతున్న తరుణంలో ఇటువంటి పండుగల ద్వారా సద్భావాలూ ,సత్సంప్రదాయాలూ వ్యాప్తి చెందడం హర్షణీయం.అయితే ఈ ఉత్సవాలు కేవలం కాలక్షేపానికో ,తమ అంతస్తునూ, ఐశ్వర్యాన్నీ నలుగురికీ ప్రదర్శించుకుందుకో కాకుండా ఈ పండుగలోని మూల సూత్రాన్ని అర్ధం చేసుకుని తదనుగుణంగా తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటే మరింత మెరుగైన సమాజంలో మనమంతా నివసించగలుగుతాం.చక్కని క్షేమ కరమైన సమాజాన్ని భావితరాలకందించ గలుగుతాం !
            దక్షిణాది రాష్ట్రాలలో శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అంటారు. ఈ రోజు నదిలో స్నానం చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని  ధరించి గాయత్రీ మంత్ర జపమాచరించి పాత జంధ్యాన్ని విసర్జిస్తారు. మూడు పోగుల యజ్ఞోపవీతం వటువు చేసే కర్మలన్నిటినీ మనసా(గాయత్రీదేవి),వాచా (సరస్వతీ దేవి),కర్మణా(సావిత్రీ దేవి)చేయాలని (త్రికరణ శుద్ధిని సాధించాలని) సూచిస్తుంది.
            నూతన యజ్ఞోపవీత ధారణతో  'ఇకపై మేలైన ప్రవర్తనను కలిగివుంటానని దృఢంగా సంకల్పిస్తూ , గడచిన  సంవత్సర కాలంలో తాను చేసిన పాపాలకు క్షమాపణ వేడుతూ పాత యజ్ఞోపవీతాన్ని    విడి చిపెడతారు. ఈ మార్పునే ఉపక్రమ అంటారు. ఉపక్రమ అంటే ప్రారంభమని (ఉపక్రమించడం)అర్ధం.
మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రోజు భక్తులు సముద్రతీరానికి వెళ్ళి కొబ్బరికాయలు సమర్పించే ఆచారం ఉంది.అందువల్ల దీన్ని నారికేళ పూర్ణిమ అనీ నార్లీ పూర్ణిమ అని కూడా  అంటారు.ఈ రోజే హయగ్రీవ జయంతి కూడా.మధు కైటభులనే రాక్షసులు వేదాలను తస్కరించి సాగర గర్భంలో దాచారనీ, మహావిష్ణువు మానవ శరీరమూ, గుర్రపు తలా గల హయగ్రీవుడి రూపం దాల్చి రాక్షస సమ్హారం చేసి వేదాలను తిరిగి తీసుకు వచ్చాడని పురాణ కథ.వేదాలలోని జ్ఞాన సంపదను తిరిగి మానవాళికందించిన హయగ్రీవుణ్ణి విద్యాదాతగా,జ్ఞానదాతగా కొలుస్తారు!
           'రేషం కీ డోరీ సే సంసార్ బాంధా హై 'అని ఒక హిందీ కవి చెప్పినట్టు మనిషికీ మనిషికీ మధ్య గల అనుబంధాలే సంసార జగత్తుని నడిపిస్తున్నాయి.ఆ అనుబంధాలు వాటి వాటి పరిధుల్లో క్షేమకరంగా సాగినంతకాలం సమాజమూ సవ్యదిశలో ముందుకు సాగుతుంది!.

              ఈ పండుగకు నెలరోజుల ముందునుంచే రాఖీలనమ్మే షాపులు బజారు నిండా దర్శనమిస్తాయి.పరుగు జీవితంలో తీరిక చిక్కని వారు బజారులో దొరికే స్వీట్లూ,రాఖీలతో ఈ పండుగ జరుపుకున్నా ,సమయమూ ,సరదా రెండూ వున్న వాళ్ళు స్వీట్లతో పాటు రాఖీలను కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు.
 తమ సృజనాత్మకతకు తగినట్టుగా రాఖీని ఎన్నొ రకాలుగా తయారు చేయవచ్చు.తేలికగా చేసుకోగలిగే ఒక పద్ధతిని చూద్దాం.

       పాతిక అంగుళాల పొడవున్న పట్టుదారపు పోగులని తీసుకోండి.ఇష్టాన్ని బట్టి నాలుగైదు వేర్వేరు రంగుల్ని కూడా ఎన్నుకోవచ్చు.

             ఒక నూలు దారంతో ఈ దారాల పోగుకి నాలుగోవంతు భాగం దగ్గర ఒక ముడిని వేయండి.ముడికి ఒక వైపు పొడుగ్గా వున్న దారాల పోగుని రెండు సమాన భాగాలుగా విడదీసి రెండిటినీ విడి విడిగా జడల మాదిరిగా అల్లుకుంటూ రండి .అల్లిక పూర్తి కాగానే చివరలను ముడి వేసి అంచులని టూత్ బ్రష్ లాంటి గట్టి బ్రష్ ఉపయోగించి కుచ్చులుగా చేయాలి. ముడికి రెండో వైపున్న ఒకవంతు భాగాన్ని టూత్ బ్రష్ లాంటి గట్టి బ్రష్ తో దువ్వి విడి విడి దారాలని కుచ్చుగా తయారు చెయ్యండి
           ఇలా తయారైన బేసిక్ రాఖీ మీద పూసలూ,తళుకులూ 'ఇన్స్ టంట్ గ్లూ' తో అంటించి అందంగా,ఆకర్షణీయంగా అలంకరించుకోవచ్చు.

            ఇవాళ్టి ఫ్రెండ్షిప్ బాండ్స్ ఈ రాఖీల రూపాంతరాలుగా చెప్పుకోవచ్చు.పరిచయం స్నేహపు పరిధిని దాటి ముందుకు పోతుంటే, అది ఇష్టం లేని అమ్మాయి రాఖీ కట్టడం ద్వారా 'మనం స్నేహితులుగానే ఉండిపోదా'మని మృదువుగా తెలియ జేసే పద్ధతి ఈ రోజుల్లో కళాశాల ప్రాంగణాలలో కనిపిస్తూవుంది.

          స్నేహం, ప్రేమగా పెళ్ళిగా పరిణమించాలనీ, ఆ విషయంలో ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో పనిలేకుండా తను కోరినదే జరిగితీరాలనీ మూర్ఖంగా అలోచిస్తూ,తన దారికి రాని అమ్మాయిల మీద పైశాచికంగా యాసిడ్ దాడులకు పూనుకునే అబ్బాయిల్లో మంచి మార్పు రావాలనీ ,లివ్ అండ్ లెట్ లివ్ సూత్రాన్ని పాటిస్తూ,  రవీంద్ర కవీంద్రులు కోరినట్టుగా మనమంతా వసుధైక కుటుంబంలో భాగంగా జీవించాలనీ  ఈ సందర్భంగా కోరుకుందాం. ఈ సంవత్సరం ఆగస్టు రెండవ తారీఖున రాబోయే రాఖీ పండుగ సౌభ్రాతృత్వాన్నీ, సద్భావనా సమృద్ధినీ అందిస్తుందని ఆశిద్దాం !


               *                                        *                                           *