March 14, 2012

రంగుల కేళి-జయ'హోళీ' ---- నది మాస పత్రిక (మార్చి)ప్రత్యేక వ్యాసం


------------- వారణాసి నాగలక్ష్మి

చలి విరిగి,ఇంకా ఎండలు పెరగక ముందుండే ఆహ్లాద కరమైన కాలం.!
వసంతం వస్తున్నానంటూ మురిపించే సమయం!
పంటలు ఇల్లు చేరి, గాదెల్లో ధాన్యం నిండి, రైతు మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకునే సందర్భం!
పాడిపంటలు సమృద్ధిగా కనిపిస్తూ ఉత్సవాలని ప్రేరేపించే తరుణం!
కొత్త ఆశలతో మనసులు కూనిరాగాలు తీస్తుంటే ,ఆనందోత్సాహాలతో ధవళ కాంతులు సప్త వర్ణాలుగా విచ్చుకుని నాట్య మాడే ఫాల్గుణ పౌర్ణమి నాడు ప్రకృతి కూడా వన్నె వన్నెల పువ్వుల వలువలు కట్టుకుని, మైమరపించే సుమ గంధాలు పులుముకుని, ముస్తాబై పండుగ నాహ్వానించే సన్నివేశం !
అదే హోళీ పండుగ నేపధ్యం !
మన దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎంతో ఉత్సాహం తో జరుపుకునే పండుగలలో హోళీ ఒకటి . ఈ పండుగ ఫాల్గుణ మాసం లో వచ్చే పౌర్ణమి నాడు వస్తుంది.చంద్రమానం ప్రకారం మాస నిర్ణయం రెండు పద్దతులుగా చేస్తారు.మొదటి పధ్ధతి ప్రకారం పౌర్ణమి తో నెల పూర్తయి, మరుసటి రోజునుంచీ కొత్త మాసం మొదలవుతుంది.దీన్ని ' పూర్ణి మంత' విధానం అంటారు.ఈ ప్రకారం ఫాల్గుణ పున్నమి తో సంవత్సరం ముగిసి మరుసటి రోజునుంచి వసంత ఋతువు ప్రవేశంతో నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. వసంతాగమనాన్నీ ,కొత్త సంవత్సరాన్నీ ఆహ్వానిస్తూ చేసుకునే పండుగ కనుక ఈ పండుగని వసంతోత్సవం అని కూడా అంటారు.
ఈ పండుగ గురించి రక రకాలైన కథలు ప్రాచుర్యంలో వున్నాయి.వాటిల్లో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడూ,అతని తండ్రి హిరణ్య కశిపుల గురించిన కథ ముఖ్యమైనది. హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుని హరి భక్తి నుంచి దూరం చేయలేక , కుపితుడై అతడిని చంపదలచి చితి పై తన సోదరి హోళిక వొడిలో కూర్చోనమని కుమారుని ఆదేశిస్తాడు. మంటల్లో ప్రవేశించినా దహనం కాని విధంగా వరం పొందిన హోళిక నూ, ఆమె ఒడిలోని ప్రహ్లాదుడినీ అగ్ని ముట్టడిస్తుంది. .ప్రహ్లాదుని నిర్మల భక్తికి మెచ్చిన నారాయణుడు అతడిని కాపాడగా, వరాన్ని పొందిన హోళిక ఒంటరిగా కాకుండా మరొక వ్యక్తితో కలిసి అగ్నిలో ప్రవేశించినందున అగ్ని దేవుని ఆగ్రహానికి గురై దహనమై పోతుంది. ఆనాటినుంచి నలుగురూ గుమిగూడే ఆవరణలో పెద్ద భోగిమంటను వెలిగించి హోళిక ను దగ్ధం చేస్తూ చెడు పై మంచి సాధించే గెలుపునీ ,భగవంతుని పట్ల భక్తునికి గల అవిరళ భక్తి పొందే విజయాన్నీ పండుగగా జరుపుకోవడం మొదలైనదని చెప్పుకుంటారు. ఈ రోజు ‘ హోళికా దహనం’ పేర పనికిరాని పాత సామానులనీ కాగితాలనీ మంటల్లో వేసి కొత్త భావాలకూ, మంచి మార్పులకూ స్వాగతం పలుకుతారు.
హోళీ గురించి మరొక కథ ఉంది.చిన్నపిల్లల్ని వేధించే దుండి రాక్షసిని పిల్లలంతా కలిసి హోళీ పండుగ నాడు తరిమికొట్టారనీ ,ఆ రోజునుంచీ ఈ పండుగ పిల్లల విజయోత్సవంగా జరుపుకోవడంకూడా మొదలైందనీ చెప్పుకుంటారు.అందుకే ఈ హోళికా దహనం వేళ పెద్దలు పిల్లల అల్లరికి అడ్డు చెప్పకపోవడం పరిపాటి.
పసిబాలుడైన చిన్ని కృష్ణుడి ప్రాణాలు హరించమని కంసుడు పూతన అనే రాక్షసిని పంపించగా ,కృష్ణుడు పాలతోపాటుగా పూతన ప్రాణాలనుకూడా హరించిన భాగవత కథ మనకు తెలిసినదే. శీతాకాలాన్ని పూతనగా ,చలికాలం అంతమై వాతావరణం వెచ్చబడదాన్ని పూతన సంహారంగా భావించడం ఈ పండుగకున్న మరో కోణం.
దక్షిణాదిన కామదేవుని పూజించే సాంప్రదాయముంది. సర్వమూ పరిత్యజించి తీవ్రమైన తపస్సులో మునిగిపోయిన శివుడిపై శక్తివంతమైన ప్రేమబాణాన్ని సంధించి, జనహితం కోసం తన ప్రాణాలకు తెగించి , శంకరునిలో పార్వతీ దేవి పై ప్రేమ మొలకెత్తేలా చేస్తాడు మన్మధుడు. తపోభంగమైన శివుడు ఆగ్రహోదగ్రుడై మూడోకన్ను తెరుస్తాడు.కామదేవుడు దగ్ధమై పోతాడు.తరువాత రతీదేవి ప్రార్ధననాలకించి శివుడు ఆమెకు మాత్రమే మనోరూపుడై కనిపించే విధంగా మన్మధుడికి ప్రాణ భిక్షనందిస్తాడు, మానసికమూ అలౌకికమూ అయిన ప్రేమ భౌతిక లాలసకు సంబంధించినది కాదనే సూచన ఈ పురాణ కథలో ఇమిడి ఉందంటారు.జగత్ కల్యాణం కోసం కామదేవుని త్యాగాన్ని శ్లాఘిస్తూ జరుపుకునే ఈ పండుగని కామోత్సవం అని కూడా అంటారు. .
బెంగాల్ లో ఊయలోత్సవంగా, డోలోత్సవంగా పిలవబడే ఈ పండుగ నాడు విద్యార్ధులు కేసర వర్ణం లేదా తెల్లని రంగు బట్టలు ధరించి ఏకతార, వీణ వంటి సంగీత వాద్యాలకనుగునంగా నర్తిస్తారు.నగర వీధుల్లో రాధా కృష్ణుల విగ్రహాలను పల్లకీ లో ఊరేగిస్తూ ఊయలూపుతూ భక్తి గీతాలను ఆలపిస్తారు. పురుషులు ఆబీర్ చల్లుతూ రంగు నీరు చిమ్ముతూ వెంట నడుస్తారు.ఇంటి పెద్ద ఉపవాసముండి , శ్రీ కృష్ణుడినీ , అగ్ని దేవుడినీ పూజించి కృష్ణ ప్రతిమకు గులాల్ పులిమి పిండివంటలు స్వామికి నైవేద్యం గా సమర్పిస్తారు. కృష్ణ భక్తులు ఎక్కువగా వుండే మధుర, బృందావన్ , నందగాంవ్ ప్రాంతాలు ఈ పండుగ సమయానికి యాత్రా స్థలాలుగా రూపు దిద్దుకుంటాయి. ఇక్కడ హోళీ ని పదహారు రోజుల పండుగ గా జరుపుతారు.
ఒరిస్సా లో కూడా హోళీ దాదాపు ఇదేవిధంగా జరిగినా రాదా కృష్ణుల స్థానంలో వీరు జగన్నాధుని పూజిస్తారు.గోవా లోనూ , కర్నాటక ,మహారాష్ట్ర ,కేరళ లోనూ కొంకణులు హోళీని శిశిరోత్సవంలో భాగంగా జరుపుకుంటారు. హోళీ మిలన్ పేర పరిచయస్తుల ఇళ్ళకు వెళ్లి హోళీ పాటలు పాడి , ఆత్మీయంగా రంగులు పులిమి స్నేహాన్నీ. సోదర ప్రేమనూ పంచుకుంటారు. ఉత్తర భారతంలో కొన్ని చోట్ల హోళీ నాటి సాయంత్రమే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పంచాంగ శ్రవణం చేస్తారు
గుజరాత్ లో ఈ పండుగ నాడు భోగిమంటలు వెలిగించి నృత్య గానాలతో సందడి చేస్తారు.వీధిలోనే ఎత్తుగా ఉట్టి కట్టి పిరమిడ్ ఆకారంలో ఒకరిపై ఒకరు ఎక్కుతూ ఉట్టి కొట్టాలని ప్రయత్నిస్తారు.వెన్నదొంగని ఆపే ప్రయత్నంలో భాగంగా ఆడపిల్లలు గోపిక వేష ధారులై ఉట్టి కొట్ట నివ్వకుండా రంగునీల్లు చల్లుతూ అడ్డుపడతారు. మహారాష్ట్ర లో ఇది ఐదురోజుల పండుగ.పండుగకు వారంరోజుల ముందే యువకులంతా కలిసి చందాలు పోగుచేస్తారు.ప్రతి కుటుంబం నైవేద్యానికి భోజన పదార్ధాలనూ, పిండివంటలనూ అందించి సంబరంలో పాలుపంచుకుంటుంది.. పాత శత్రుత్వాలేవున్నా మరచి పోయి సుహృద్భావాలను పెంపొందించుకోవాలని ఈ పండుగ సమయంలో పెద్దలు చెపుతారు. మణిపురి వాసులు ఇదే పండుగను ఆరు రోజుల పాటు చేసుకుంటారు.గడ్డి కప్పిన పూరి పాకను దహనం చేయడంతో ఇక్కడ పండుగ సంబరాలు మొదలవుతాయి.'తాబల్ చొంగ్బ ' అనే బృంద నాట్యం ఈ పండుగ సంబరాలలో మణిపురి వాసుల ప్రత్యేకత .
ఆంద్ర ప్రదేశ్ ,కర్నాటక లలో హోళీ పండుగ నాడు బడికి సెలవు . తెలంగాణా ప్రాంతంలో,హైదరాబాదులో హోళీ సంరంభం మిన్నంటే ఉత్సాహంతో ఒక రోజు ముందు నుంచే మొదలవుతుంది . కర్నాటక గ్రామ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి వంటచెరకు పోగు చేసి ' కామ దహనా'నికి వాడడం,చందాలు వసూలు చేసి ఉత్సవానికి ఖర్చు చేయడం పరిపాటి.
ఈ రంగుల పండుగ ముఖ్యంగా హిందువులదే అయినా ఈ పండుగ జరుపుకోవడం లో మత సామరస్యం వెల్లివిరిసేలా అన్ని మతాల వారూ ఉత్సాహంతో పాల్గొంటారు. హోళీ సంబరాలు జరుపుకునే వేళ వయసు, స్త్రీ పురుష వ్యత్యాసం,హోదా ,కుల మత భేదాలకు సంబంధించిన సామాజిక కట్టు బాట్లలో సడలింపు కనిపిస్తుంది. ధనిక ,పేద వర్గ విభేదాలు మరచి హిందువులంతా కలసి మెలసి ఈ పండుగ జరుపుకుంటారు. పాత చీపుర్లూ ,తట్ట బుట్టలూ , పనికిరాని చెక్క వస్తువులూ , కాగితాలూ , రాలిన ఎండుటాకులూ కుప్పగా పేర్చి దహనం చేస్తారు. హోళీ మంట తర్వాత మిగిలిన భస్మాన్ని బొట్టుగా ధరించి శరీరానికి పులుముకుంటారు. కొత్త చిగుళ్లకూ నవ చైతన్యానికీ స్వాగతం పలుకుతారు.
వస్తువులను పోగుచేసుకోవడం మనిషిలోని లోభగుణాన్ని సూచిస్తుంది.పనికిరాని వస్తువులు ఇంటినిండా పేరుకోవడం వల్ల సరైన గాలీ వెలుతురూ ప్రసరించే అవకాశం తగ్గిపోతుంది.సంవత్సరానికి ఒకసారయినా ఇంటినిండా పేరుకున్న అనవసరమైన వస్తువులు తీసేసి,మనం నివసించే గృహాన్ని ఆమూలాగ్రం శుభ్రపరచుకోవడం ఎంతైనా అవసరం .
ధవళ కాంతి లోనే సప్త వర్ణాలూ ఏకమై వున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమే.నీరెండ వేళ కురిసే చిరు జల్లుకి సూర్య కాంతి ఇంద్రధనుసుగా విచ్చుకుంటే, ‘ దివి నుంచీ భువికి నిచ్చెన వాలింద’ని మురిసిపోతారు భావుకులు .తెల్లని గూటిలో దాగిన రంగుల చిలకలు ' ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా?' అంటూ ఆకాశానికి ఎగిరినట్టుగా , ఏ అప్సరస స్వయంవరానికో హరివిల్లు సిద్ధమైనట్టుగా ఊహల మాలికలల్లుకుంటూ మైమరచిపోతారు. మనసుపై అందమైన రంగులు చేసే మాయ అది !
హోళీ పండుగ రంగుల వేడుక.!
యాంత్రిక మైపోయిన జీవితాలలో సరదాగా సాగి వచ్చే స్నేహ వీచిక !
బంధు మిత్రులే కాక ముఖ పరిచయస్తులు కూడా తోటివారిని పలకరించి, వారి జీవితం వర్ణ శోభితమై సుఖ సంతోషాలతో సాగాలని కోరుకునే సద్భావ సుమ మాలిక !
అయితే ఏ విషయంలోనైనా హద్దుంటేనే ముద్దు అన్న మాట ఇక్కడ వర్తిస్తుంది.హోళీ పండుగ పేర దారిన పోయే వారినీ ,ఆఫీసు పనిలోనో ,పరీక్షల హడావిడిలోనో ఉన్న వారిని బలవంతంగా చుట్టుముట్టి మొరటుగా మూర్ఖంగా వారికి రంగులు పులమడం,రంగు నీటి పిచికారీలతో వారిని నిలువెల్లా ముంచేయడం సమర్థ నీయం కాదు. ఇటీవల హోళీ వేడుకల్లో సహజమైన రంగుల స్థానంలో హానికరమైన రసాయనిక వర్ణాల వాడకం వల్ల అనేక చర్మరోగాలూ , కాన్సర్ కి దారితీసే అసౌకర్యాలూ ఎదురౌతున్నాయి. మనోల్లాసం ,సంతోషం కోరి పండుగ జరుపుకుంటూ కొత్త రోగాలను ఆహ్వానించడం మనకు తెలియకుండానే జరిగిపోతోంది.
నిజానికి హోళీ కి అవసరమైన రంగుల్ని ఇంట్లోనే తేలిగ్గా తయారు చేసుకోవచ్చు.
ఎర్ర చందనం పొడిని తీసుకుని గాని ,ఏదైనా పిండికి ఎండిన ఎర్ర మందారాలపొడిని కలపడం ద్వారా గాని ఎరుపు రంగుని, ఎండిన గుల్మొహర్ ఆకుల పొడిని గాని, హెన్నా పొడిని గాని ఆకుపచ్చ రంగుని తయారుచేసుకోవచ్చు.ఎర్ర చందనం పొడిని నీటిలో మరిగించగా వచ్చిన ద్రావణాన్ని డైల్యూట్ చేసి పిచికారీకి వాడుకోవచ్చు. పాలకూర ,కొత్తిమీర , పుదీనా ఆకుల్ని నూరి నీటిలో కలపడం ద్వారా ఆకుపచ్చరంగు నీటిని పొందవచ్చు.సెనగ పిండికి మూడోవంతు పసుపు కలిపి తే పసుపు రంగు తయారవుతుంది .ఎండిన బంతి,చేమంతి పూల పొడి అనేక చాయల్లో పసుపు రంగునిస్తుంది. బీట్ రూట్ ,కారెట్ దుంపల నుంచి మజెంతా ,కాషాయ వర్ణాలనీ పొందవచ్చు.
సహజ వర్ణాల వాడకం తగ్గిపోయిన కాలం గనుక హోళీ ఆటలో పిల్లలు పాల్గొంటుంటే వారికి పొడుగు చేతుల దుస్తులు వేయడం మంచిది.సాక్స్ కూడా వాడవచ్చు.తలకు నూనె,శరీరానికి మోయిశ్చరైజర్ లేదా బాడీ ఆయిల్ పట్టించడం వల్ల ఇతరులు ఒకవేళ రసాయనిక వర్ణాలు వాడినా అవి శరీరం లోకి వెంటనే ఇంకిపోకుండా వుంటాయి.స్నానం చేసినపుడు రంగులు తేలికగా వదిలి పోతాయి.స్నేహ పూర్వక వాతావరణం లేని చోట హోళీ ఆడకపోవడమే మేలని పిల్లలకి నచ్చచెప్పాలి .అదేవిధంగా చిన్నప్పటి నుంచి ఇతరుల స్వాతంత్ర్యాన్ని గౌరవించడం పిల్లలకి నేర్పాలి.ఎవరైనా హోళీ ఆడడం పట్ల ఆసక్తి కనపరచక పోతే వారి ఇష్టాన్ని గౌరవించాలని పిల్లలకు చెప్పాలి.పిల్లలు హోళీ అదే చోట అందుబాటులో బకెట్ నిండా నీళ్ళు ఉంచాలి.హోరెత్తే విధంగా పాటలు పెట్టడం, శబ్ద కాలుష్యంతో పరిసరాల్ని పాడుచేయడం తగదని నచ్చ చెప్పడం పెద్దల విధి.
పండుగలూ ,ఆ సందర్భాలలో మనం పాటించే ఆచార వ్యవహారాలూ మన జీవితం మరింత మెరుగవ డానికీ , సమాజం మరింత ఉన్నతమైనది గా రూపొందడానికీ ఏర్పాటుచేసినవే ! కాలానుగుణం గా అవసరమైన మార్పులు చేసుకుంటూ సదాచారాలను కాపాడుకుంటూ ముందుకు సాగడమే విజ్ఞుల లక్షణం. హానికారక రసాయనాలకు దూరంగా ,ప్రకృతికి దగ్గరగా ,ఇతరులకు ఇబ్బంది కలిగించని విధంగా, అందరికీ ఆమోదయోగ్యంగా , ఆనందకారకంగా, హుందాగా పండుగ జరుపుకునే వారందరికీ హోళీ రంగుల పండుగ శుభాకాంక్షలు !
* ***