November 29, 2013

                          పుష్య విలాసం 
        పువ్వుల మాసం..పుష్య మాసం!
          వాకిట్లో ఏమాత్రం జాగా వున్నా నేల మీదో, కుండీల్లోనో బంతులూ చేమంతులూ పొందిగ్గా సర్దుకుని పువ్వులు సింగారించుకునే కాలం!
          సూర్యుడొచ్చేసరికల్లా తయారైపోవాలని రాత్రంతా కురిసిన మంచుబిందువుల్లో స్నానమాడి, పసి మొగ్గల్ని తప్పించుకుంటూ పైకి సర్దుకున్న  ముగ్ధ పూబాలలు మనసారా విచ్చుకుని, తొలికిరణాలతో భానుడు తమను తాకే క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూసే సన్నివేశం  !
        హేమంత యామిని బద్ధకంగా వెళ్తూ వెళ్తూ  చలి గాలినీ, తెలి మంచునీ వెనకే వదిలేసిన సందర్భం !
        ఇళ్ళ గోడలు రంగులు వెలిసినా, పగుళ్ళు తేలినా , ముంగిళ్ళలో మాత్రం ముగ్గులూ, గొబ్బిళ్ళూ, గొబ్బిళ్ళ కొప్పుల్లో రంగు రంగుల పువ్వులూ మెరిసి పోతుంటే  పుష్య లక్ష్మి వీధుల్లో సంచరించే సమయం!
      పరిచారకులు చీకటి తెరలన్నీ తొలగించి 'శ్రీ సూర్యనారాయణ గారొస్తున్నారహో ' అని ప్రకటించి చాలా సేపయినా  ఆయన గారి దర్శనమింకా కాలేదు. మెత్తని మబ్బుల రజాయి వెనక ఇంకా నిద్రిస్తూనే ఉన్నట్టున్నాడాయన.
     ' ఆయనకైతే చెల్లుతుంది..మనకట్టా కుదురుద్దా?..హ్హు ..' అనుకున్నాడు  సూర్యా రావు. అతనిక్కూడా  వెచ్చగా దుప్పటి ముసుగు పెట్టుకుని పడుకోవాలని వుంది. అయినా గిరాకీ టైము వదిలేస్తే లాభం లేదని  చీకటితో లేచి కాఫీకూడా తాగకుండా అయిదున్నరకే టౌను సెంటరుకొచ్చి ఆటో నిలుపుకుని కూర్చున్నాడు. 
     కొంచెం దూరంలో రామాలయం కనిపిస్తోంది. గేటు ముందు తెల్లని ముగ్గులు మెరుస్తున్నాయి. సూర్యారావొచ్చేసరికి పూజారి గారమ్మాయి కళ్ళాపి జల్లి ముగ్గులు పెడుతోంది. ఆకుపచ్చని తడి నేల మీద తెల్లని మెలికల ముగ్గు చూడగానే కాంతి చేతివేళ్ళ సందుల్లోంచి వొంపులు తిరుగుతూ జారే ముగ్గుపిండి గుర్తొచ్చింది. కాంతి మొండితనమూ, ఒళ్ళుపొగరూ గుర్తొచ్చి లోపలి కోపం అగ్గిలాగా రాజుకుంది మళ్ళీ .
      ఇంకా నగర వాసనలు పూర్తిగా అంటుకోని ఊరు కావడంతో ప్రతి వీధి లోనూ ముగ్గులూ, గొబ్బిళ్ళూ , కాస్త పొద్దెక్కేసరికి ఎగిరే గాలి పటాలూ .పుష్య మాసమంతా కనిపించే దృశ్యాలే! వాటిలో అసాధారణమైనదేమీ లేదు.
      మామూలుగా లేనిది తన ఇంటి వాతావరణమే! రోజూ తెల్లవారక ముందే తనని లేపి, తను కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి వీధిలో పెద్ద పెద్ద ముగ్గులేసి వచ్చి కమ్మని కాఫీ కలుపుతుంది కాంతి. గుమ్మంలో కూర్చుని  'ముగ్గు ఇంత బావుంది.. అంత బావుంద ' ని పొగుడుతూ కాఫీ తాగేసి, చీకటి తెరలింకా విచ్చుకోక ముందే ఆటో తీసుకుని టౌను సెంటర్ కి రావడం అలవాటు తనకి.
      ఈ పండగల్లో దూరప్రాంతాలనించి రాత్రి  బస్సెక్కి తెల్లారేసరికి  టౌనుకొచ్చి చుట్టుపక్కల పల్లెలకి వెళ్లే  జనాలని తన ఆటోలో తీసుకెళ్ళి దింపడం, అలా సంపాదించిన అదనపు ఆదాయంతో భార్యకీ, పిల్లాడికీ బట్టలూ, ఇంటిక్కావల్సిన సరుకులూ కొనడం తనకెంతో సంతోషాన్నిచ్చే విషయాలు. ఈసారి ఎప్పటిలా కాలేదు. రాబడి బాగానే వుంది గాని తన బతుకే బాలేదు !  
      తాముండే ఇంటికి ఐమూలగా వున్న ఇంటి మేడ మీద కాలేజీ లెక్చరర్ ఒకతను వచ్చి చేరాడు ఈ మధ్యే. వాడొచ్చినప్పట్నించీ తనకీ, కాంతికీ మధ్య కీచులాటలు మొదలయ్యాయి. వీధి దీపపు మసక వెలుతుర్లో అర్ధగంటసేపు కళ్ళాపి జల్లుతూ ముగ్గులు తీరుస్తూ ఈవిడ హొయలు పోవడం, అంతసేపూ మేడమీద పచార్లు చేస్తూ తన కళాహృదయం చాటుకుంటూఆ బేవర్సుగాడు పోజులు కొట్టడం తను సహించలేక పోతున్నాడు.
      తన గుండెల్లో గుడిగంటలు మోగించిన బారెడు జడా, కుచ్చెళ్ళు దోపిన సన్నని నడుమూ ఇపుడు అలారం బెల్లు లా మోగుతూ అసహనాన్ని కలిగిస్తున్నాయి! వాడలా చూస్తున్నాడని తెలిసినపుడు చెయ్యాల్సిన పని గబ గబా పూర్తిచేసుకు రావాలా? ఉహూ
    తన మానాన తను చుక్కలు లెక్కేసుకుంటూ, మధ్యలో ముగ్గు రేఖని ' ఇటు తిప్పనా ..అటు తిప్పనా? ' అని వేళ్ళతో, కళ్ళతో విన్యాసాలు చేసుకుంటూ, ముందుకు పడే జడని వెనక్కి విసురుకుంటూ అర్థగంట సేపు ఇంటి ముందు రోడ్డు మీద తాండవం చేస్తుంది. చూసి చూసి ఇక భరించ లేక వీధి వాకిట్లో ఆ నాట్యభంగిమలక్కర్లేదనీ, తన ప్రతిభంతా చాటుకుంటూ ముగ్గులేసి ఎవర్నీ ఉద్ధరించక్కర్లేదనీ గట్టిగా వార్నింగిచ్చాడు తను.
    ’పుష్య మాసం వాకిట్లో ముగ్గు లేసుకోకుండా ఎవరూ వుంచుకోరనీ, ‘ఆయనెవడో వాళ్ళింటి ముందు పచార్లు చేస్తుంటే మనం మనింట్లో పనులు మానేసుకోవాలా?’ అనీ ఎదురు తిరిగింది! పండగ దగ్గరకొస్తున్న కొద్దీ తన మాట ఆవగింజంత  కూడా ఖాతరు చెయ్యకుండా పత్రికల్లో వచ్చే కొత్త కొత్త ముగ్గులు నేర్చుకుని మరీ వేయడం మొదలెట్టింది! తన పద్ధతి మార్చుకోలేదు సరికదా, కనీసం  దగ్గర కూర్చుని మొగుడి బాధేమిటో కనుక్కుందుకు ప్రయత్నం కూడా చెయ్యలేదు.
      ఈ విషయమై ఇద్దరూ ఘర్షణ పడి వారమైంది. ఒళ్ళూ పై తెలీని కోపంలో తనేదేదో వాగేశాడు. ముంచుకొచ్చిన ఆవేశంలో నోటికొచ్చిన మాటలన్నీ అనేసాడు. అపుడు కాంతి చూసిన చూపు తన మనసులో నాటుకు పోయింది. అందులో భావం ఏమిటో అర్ధం  కాని చిక్కు ప్రశ్నై గుర్తొచ్చినపుడల్లా  చికాకు పెడుతోంది.
     ఆ రోజునించీ ఇద్దరి మధ్యా మాటల్లేవు. తను డ్యూటీకెక్కే వరకు తన చుట్టే తిరుగుతూ, ఇల్లు చేరేసరికి నవ్వు మొహంతో ఎదురొస్తూ, మనసులో అనుకుంటే చాలు చెప్పకుండానే గ్రహించి అందుకనుగుణంగా మసులుకుంటూ ఇన్నాళ్ళూ గడిపి ఇప్పుడేమయ్యిందని ఇలా తయారయింది? ఆ లెక్చరర్ గాడిముందు, ఆటో తోలుకునే మొగుడు పనికిమాలిన వాడిలాగా కనిపిస్తున్నాడా?
          నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేసరికి పెట్టెలో బట్టలు సర్దుకుంటూ కనిపించింది కాంతి.  ' పోతే  ఫో ' అనుకున్నాడు తను కసిగా. పిల్లాడి హా ఫియర్లీ  పరీక్షలు ఇవాల్టితో అయిపోతాయి. పండక్కి పుట్టింటికి రమ్మని వాళ్ళ వాళ్ళు పిలిచారు. తనని కూడా పిలిచారు గాని తను వెళ్ళబోవడం లేదు.
      ఈ మధ్య కాలంలో తను అనుభవించినంత అశాంతి పెళ్ళైన ఆరేళ్ళలో ఎపుడూ అనుభవించలేదు. పెద్ద గొప్ప సంపాదన కాకపోయినా ఇన్నాళ్ళూ ఒకరికొకరుగా బతికారు. పరిచయస్థులేగాని తనకి వేరే చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఉన్న ఒక్క అన్నగారితో పెద్ద సఖ్యత లేదు. మనసులోని ఆవేదన విప్పి చెప్పుకోగల దగ్గరి వాళ్ళెవరూ లేరు.
      నిన్న మధ్యాన్నం పెద్ద బజార్లో వెళుతుంటే డాక్టర్ త్రివిక్రమ రావు గారి క్లినిక్ కనిపించింది. ఆయనకి సైకియాట్రిస్టుగా మంచి పేరుంది. ఒక్కసారి చూడ్డానికి రెండొందలు పుచ్చుకుంటాట్ట! అసలు మానసిక సమస్యలకి డాక్టర్లు ఎలా చికిత్స చేస్తారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏమైనా ఉపశమనం దొరుకుతుందో లేదో తనకి తెలీదు. ఒక్కసారి వెళ్ళినంత మాత్రాన ఏమీ అవదనీ, అడపా దడపా అలా వెళ్తూనే ఉండాలనీ, వెళ్ళినపుడల్లా  రెండేసి వందలు సమర్పించుకోవాలనీ ఒకసారెపుడో ప్రకాశం అన్నాడు. ఆలోచించిన కొద్దీ పిచ్చిపట్టేలా వుంది!
      ఆటో లో కూర్చుని ఆలోచనల్లో మునిగి తేలుతున్న సూర్యారావు వేగంగా వచ్చి ఆగిన బస్సు శబ్దానికి ఉలిక్కి పడ్డాడు. బిలబిలా పది పన్నెండుమంది మంది దిగాక వెనకగా ఇద్దరు స్త్రీలు దిగడం కనిపించింది. ముందు దిగిన వాళ్ళంతా చిన్న చిన్న బాగులు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
      చివరికి దిగిన ఆడవాళ్ళిద్దరూ మాత్రం రెండు పెద్ద పెట్టెలూ, సంచులతో ఆయాసపడుతూ దిగుతుంటే ముందుకెళ్ళి,"ఆటో కావాలామ్మా?" అనడిగాడు సూర్యా రావు.
     “తుక్కులూరు పోవాలి వస్తావా?" అడిగింది  ఇద్దరిలో  పెద్దామె.
      "వస్తానమ్మా " అన్నాడు సామాను అందుకుంటూ.
     సామాను ఆటోలో పెడుతుంటే ముందు ఏం తీసుకుంటావో చెప్పు " అంది చిన్నామె.  వెనక్కి   తిరిగి ఆమెని తేరిపార చూశాదు సూర్యారావు.
      ఐదారునెల్ల కడుపుతో వుందామె.
     "రోడ్డు మీదా ? ఊళ్ళోకి పోవాలా?"అడిగాడు.
     "అడ్డరోడ్డులో ఊరి దాకా  పోవాలి" అంది పెద్దావిడ.
     "డెబ్భై రూపాయలివ్వండమ్మా" అన్నాడు సంచులు కూడా లోపల సర్దేస్తూ.
      పెద్దామె ఓ నవ్వు నవ్వి "ఇంకా నయ్యంవంద అడిగావు కాదు" అంది.
      పండక్కి ఉండకుండా పుట్టింటికి పోతున్న భార్యా కొడుకూ గుర్తొచ్చి ఎవడికోసం సంపాదించాలి అనుకున్నాడు .
          "మీ ఇష్టమమ్మా ..డెబ్భై రూపాయలిస్తే వస్తా"”  అన్నాడు నిర్లక్ష్యంగా.
           "వద్దులే నాయనా .సామాను కింద పెట్టెయ్యి " అంది పెద్దామె.
            సామాను తీసి విసురుగా కింద పెట్టెశాడు సూర్యారావు.
           "ఈ బరువు దింపి ఆటోలో పెట్టినందుకే పదిరూపాయలు పుచ్చుకుంటారు" అన్నాడు చిరాగ్గా. చిన్నామె పొట్ట మీద రాసుకుంటూ రోడ్డు పక్కగా నిలుచుంది. 'వొట్టి మనిషి కాదని తెలిసి ఇష్టమొచ్చినట్టడుగుతారు  గొణుక్కుంది పెద్దామె.
           వాళ్ళని పట్టించుకోకుండా ఆటోలో కూర్చున్నాడు సూర్యారావు. అతనికి ఆడవాళ్ళందరి మీదా కోపంగా వుంది. 'లాంగ్ జర్నీ తర్వాత బాత్రూంకి పోవల్సి వుంటుంది. కాంతి చాలా అవస్థ పడేది ఆటైం లో' అని తలచుకున్నాడు. అస్థిమితంగా నిలుచున్న చిన్నామెని చూస్తూ 'అట్టాగే కష్టపడుఅనుకున్నాడు కసిగా. 
          'ఈమెకేమవుతుందో? కూతురో కోడలో' అనుకున్నాడు పెద్దామె వైపు చూపు పారేస్తూ.
         ' కూతురే అయి వుంటుంది.మొగుడితో దెబ్బలాడుంటుంది.వాడి మానాన్న వాణ్ణొదిలేసి రావే అని ఈవిడెళ్ళి కూతుర్ని వెంట పెట్టుకు తీసుకొచ్చి వుంటుంది. ఆ పిచ్చి వెధవ పండక్కి ఒక్కడే అక్కడ ఏడుస్తూ వుంటాడు. పెళ్ళాన్ని అతిగా ప్రేమించే వెధవలందరి గతీ అంతే' అనుకున్నాడు విరక్తిగా.
           అంతలోనే నవ్వొచ్చిందతనికిపుట్టింట్లో నాలుగు రోజులుండమని అతనే పంపాడేమో!  రెండ్రోజులాగి పండక్కి అతనూ అత్తారింటికెళ్ళి అరిసెలూ, పులిహారా, గారెలూ మెక్కుతాడేమో. బామ్మరిదినీ, పక్కింటి పిల్లల్నీ వెంటేసుకుని గాలిపటాలెగరేస్తూ పొలాల్లో షికార్లు తిరుగుతాడేమో ! తన గతి ఇలా వుందని అందరూ ఇలాగే వుంటారనుకోవడమెందుకు??’ అనుకున్నాడు .
         ఈలోపు పెద్దామె బాతు నడకతో కొంచెం ముందుకెళ్ళి ఇద్దరు ముగ్గురు రిక్షావాళ్ళని కదిపి చూసింది.
        "ఈ పెట్టెల్తో రిక్షాలో ఎట్టా కూచుంటామే?"  విసుక్కుంటూ ' ఈ రిక్షా ఎప్పటికెళ్ళేను ఇంటికి?'అని గొణుక్కుంది  చిన్నామె.
     బేరం కుదరలేదేమో  ఇంక తప్పదన్నట్టు పెద్దామె ఆటో దగ్గరకొచ్చి "యాభై ఇస్తాలే పదవయ్యా బాబూ" అంది.
    "రానమ్మా..డెబ్భైకి తక్కువకి రాను. గిట్టదు" నిర్లక్ష్యంగా అని " ఇంకా మాట్లాడితే ఎనభై అడుగుతా  ఆ సామానంతా ఎత్తి మళ్ళీ ఆటోలో పెట్టాలంటే " అన్నాడు.
      చిన్నామె కళ్ళెత్తి ఒక్కసారి సూర్యా రావు వైపు చూసింది.
    ' బుజాలనిండా బలం, ఆడదానిలా  శారీరకంగా అవస్థ పడాల్సిన అవసరం లేనపుడు అట్టా అనక ఎట్టంటావులే' అన్నట్టనిపించి చురుక్కుమంది సూర్యా రావుకి. ఒక్క క్షణం తప్పు చేసినవాడిలా చూపు తిప్పుకున్నాడు.
        "అరవయ్యిస్తాలే.. పద నాయనా. ఆడకూతుళ్ళు గదా అని ఎంత పడితే అంత అడగ్గూడదు బాబూ..." అంది పెద్దామె.
        మరో మాట మాట్లాడకుండా సామానెత్తి ఆటోలో పెట్టాడు సూర్యా రావు. ఆడవాళ్ళిద్దరూ ఆటో ఎక్కి సర్దుకుని కూర్చున్నాక  బండి తుక్కులూరు దారి పట్టించాడు. అడ్డదిడ్డంగా ఎదురయ్యే  ట్రాఫిక్ ని తప్పుకుంటూ ఆటో ముందుకు పోతుంటే తల్లీ కూతుళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు.
         ఊరి పొలిమేర దాటేసరికి మెల్లిగా మాట్లాడుకుంటున్నా, వాళ్ళ మాటలు ముందుకన్నా  స్పష్టంగా వినిపించసాగాయి .
         "అయితే  చివరికి  ఏంటంటాడూ? నాకేం అర్ధం కావట్లేదు" అంటొంది పెద్దామె.
         "ఎంత సేపూ ఒకటే మాట అమ్మా..ఆ తప్పిపోయిన సమ్మంధం ఎందుకు తప్పిపోయిందీ అంటాడు. 'ఎర్రగా బుర్రగా వున్నాడు వాణ్ణి మనసులో పెట్టుకుని, గతి లేక నన్నుకట్టుకున్నావ్'  అంటాడు. వాళ్ళొచ్చొచ్చి మా  వీధి లోనే కాపురం పెట్టడం నా చావు కొచ్చింది" ముక్కు ఎగ బీలుస్తూ అంటోంది చిన్నామె.
        "అంత చదువుకున్నోడికి ఇంతకన్నా బుర్రుంటుందనుకుని పొరపాటు పడ్డాం.. అయినా ఏడిస్తే యావవుతుందీ? నీకయినా తెలివిగా కాపరం చక్కదిద్దుకునే నేర్పు ఏడిసింది గాదు" అంది నిట్టూరుస్తూ తల్లి.
           అద్దంలోంచి వెనక్కి చూశాడు సూర్యారావు.
           చిన్నామె బుగ్గల మీదుగా కన్నీరు కారుతుంటే మాట్లాడ్డం ఇష్టం లేనట్టు బయటికి చూస్తూ కూర్చుంది.
        పెద్దామె నొచ్చుకున్నట్టు కూతురి బుజాల చుట్టూ చెయ్యేసి,"అదిగాదమ్మలూ.. అట్టాంటిదేవీ లేదూ..పదివేల కట్నం తక్కువైందని ఆళ్ళు లేచెళ్ళిపొయ్యారు. అంత కటిక వాణ్ణి నేనెట్టా ఇష్ట పడతానూ అని సముదాయించి చెప్పుకోవద్దా? అతను కోడి పుంజు మాదిరి ఎగిరి పడితే నువ్వూ అంత కన్నా ఎగిరెగిరి పడితే ఎట్టా నాన్నా?" అనునయంగా అంది పెద్దామె.
           బుస్సుమని తలెత్తి "ఎందుకు చెప్పాలమ్మా? ఎందుకు చెప్పాలీ?...ఎంత ప్రేమగా చూసుకున్నా ఇన్నాళ్ళూ? పెళ్ళైన వెంటనే టైఫాయిడొస్తే రాత్రీ పగలూ కాసుకున్నా. తగ్గాక ఏదడిగితే అది వొండి పెట్టా. నాలుగు నెలల్లో పాపాయి కూడా పుట్టబోతాంది. ఇంతేనా నాగురించి అతనికి తెల్సిందీ? రూపం వొక్కటే చూస్తారా ఎవరైనా? ఈ మగాళ్ళు ఎంత ప్రేమగా చూసుకుంటే అంత నెత్తినెక్కి తొక్కేస్తారని తెలిసింది" అంది అమ్మలు కళ్ళు తుడుచుకుంటూ.
        "నేనొకటి చెబుతా ఇను చిన్నమ్మలూ! మగాళ్ళు పైకెంత కటువుగా ఉన్నా లోపల మనసు చిన్నపిల్లాడి మాదిరి  ఉంటదమ్మా.. నువ్వే మంచోడివి. నువ్వే అందమైనోడివి అని మెచ్చుకుంటా వుండాలి. అవుతలోడు  తనకన్నా బాగున్నాడనో, ఎక్కువ సంపాదిస్తాడనో ఆణ్ణి  ఇష్టపడతాదేమో పెళ్ళాం అని బెంగా, దిగులూ ఉంటై కొంత మందికి."
           తల్లి మాట పూర్తి కాకముందే అందుకుని "ఆ..సిగ్గులేకపోతేసరి! పక్కింటామె నీకన్నా తెల్లగా అందంగా వుంది కదా అని ఆమే మా అమ్మ ఐతే బావుణ్ణనుకుంటానా? శ్రీనివాసులు బాబాయికి నాన్న కన్నా ఎక్కువ డబ్బుండాదని ఆయనే మా నాన్న అయితే బావుండేదనుకుంటానా? తాళికట్టించుకుని, యాడాదిగా అతనే లోకవని బతికి ఆయన బిడ్డకి తల్లి కాబోతూ, పదివేల కట్నం తక్కువైందని పీటల మీంచి లేచెల్లిపోయిన ముదనష్టపు ఎదవని మనసులో పెట్టుకుంటానా? రేపు పుట్టే పాపాయి అందంగా లేకపోతే దాన్ని తోసేసి పక్కింటోళ్ళ పాపాయిని ఎత్తుకోని ముద్దులాడతానా? ఈ మగాళ్ళకి బుర్రలుండవా? మాటనేముందు ముందూ ఎనకా అలోసించరా? .థూ" అంది అమ్మలు.
              సూర్యా రావుకి కొరడాతొ ఛెళ్ళున కొట్టినట్టయింది.
             వాళ్ళ పెళ్ళై ఇంకా యాడాదే…….తన పెళ్ళై ఆరేళ్ళయింది. స్కూలుకెళ్తున్న కొడుకున్నాడు! భార్యనర్ధం  చేసుకోడంలో తనే పొరపాటు చేశాడా?
           "అట్టా చికాకు పడితే ఎట్టా చిన్నమ్మలూ? మొగోడు అనుమానపడ్డా ఆడది సముదాయిచ్చి చెప్పాలి గాని, అతనొక మాటంటే ఆవె పది మాటలని ఈదిన బడితే ఎవురికి నష్టం చెప్పూ?"అంది తల్లి.
           "అవున్లే..రాముడి కాలం నించీ పెళ్ళాన్ననుమానించడంలో తప్పేం లేదనీ, మొగోడికి పెళ్ళాం శీలమ్మీద అనుమానవొస్తే తను నిప్పులాంటిదని నిరూపించుకునే అవుసరమూ, బాద్యతా ఆడదానిదేననీ  పద పద్దాక చెపుతూ వొచ్చారుగా మీరంతా..కాపురం పోతుందేవో అనే బయం ఆడదానికే ఎందుకుండాలో నాకర్దం కావట్లేదమ్మా? నేను చావనైనా చస్తాను గాని నువ్వన్నట్టు సముదాయిచ్చి చెప్పను గాక చెప్పను" రోషంగా అంది అమ్మలు.
            "ఏ మాట బడితే ఆమాట అనబాక తల్లీ.ఒక్కగానొక్క బిడ్డ మాకు బరువుగాదు. నువ్వెళ్ళిన్నాటినించీ ఇల్లంతా బోసిపోయింది. ఏదో అక్కడ సుకంగా వున్నావని అనుకుని సర్దుకున్నాం గాని……… సర్లే ఇప్పుడే నాన్న కేం చెప్పమాకు . మెల్లగా నేనే టయం చూసుకోని చెపుతా.సరేనా?"వీపు మీద రాస్తూ అంది తల్లి. 
      ఆటో తుక్కులూరు అడ్డరోడ్డు చేరింది. మలుపు తిప్పి గతుకుల రోడ్డు మీద నెమ్మదిగా పోనిచ్చాడు సూర్యారావు, అమ్మలుకి ఇబ్బంది కలక్కుండా. అటూ ఇటూ పొలాల్లో వరి కుప్పలూ, కోసిన వరి మొదళ్ళూ పసిడి వర్ణంలో  మెరిసి పోతున్నాయి. మధ్యలో అక్కడక్కడ కారబ్బంతి పూల తోటలు, ఆకుపచ్చని తివాచీ మీద ఎర్రపూలు పరుచుకున్నట్టు కాంతులీనుతున్నాయి. ఎక్కువ వెడల్పు లేని మట్టి రోడ్డు గతుకుల మీద ఆటో ఎగిరిపడుతోంది. పైరగాలి ఆటో లోకి రివ్వుమంటూ వీచింది.
           వేగం తగ్గిస్తూ చలిగాలి కొడ్తోంది..షాలు కప్పుకో చెల్లెమ్మా " అన్నాడు అప్రయత్నంగా.
          అమ్మలు ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ భుజాన వున్న షాలు పూర్తిగా కప్పుకుంది.
        "చలిగాలికి జలుబు చెసిందంటే ఓ పట్టాన తగ్గి చావదు. ఇ ట్టాంటప్పుడు మందులేసుకునేది అంత మంచిది గాదు" అన్నాడు ఎదురొచ్చిన గంగిరెడ్ల వాళ్ళని తప్పిస్తూ.
        "అట్టా చెప్పు నాయనా!" అని "అదుగో ఆ ఎత్తరుగుల పెంకుటింటి ముందు ఆపు బాబూ" అంది పెద్దామె. గతుకుల్లో పడకుండా జాగ్రత్తగా పోనిచ్చి ఇంటి ముందు పెట్టిన ముగ్గు పాడవకుండా, గొబ్బిళ్ళకి చక్రాలు తగలకుండా గోడ పక్కగా ఆపాడు సూర్యారావు.
        "అమ్మా..ఆయనకి ఎనభై  ఇచ్చెయ్యి..బేరాలాడకు" అంటూ చేతిసంచీ ఒకటీ పట్టుకుని హడావుడిగా ఇంట్లోకి వెళిపోయింది అమ్మలు.
           "అబ్బో అంత కోపమా చెల్లెమ్మా?" అంటూ సామాను ఇంటి అరుగు మీద పెట్టాడు సూర్యారావు. అరుగు పక్కనే నిలుచుని రొంటినుంచి పర్సు తీసి చిల్లర నోట్లు లెక్క పెడుతున్న పెద్దామెని చూడ నట్టుగా ఆటో వెనక్కి తిప్పుకుని వేగం పెంచాడు.
          "ఏందయ్యో! డబ్బులు తీసుకోకండా పోతన్నావూ?" అంటూ పెద్దామె అరిచింది.
           "చెల్లెమ్మకింకా నేనే ఇవ్వాలిలే పెద్దమ్మా..డాక్టర్ ఫీజ్" నవ్వుతూ అంటూ, రివ్వుమని ఆటోని ముందుకి పోనిచ్చాడు సూర్యారావు.
          తెల్లబోయి నిలుచున్న పెద్దామె, వెనకే వచ్చి నిలుచున్న భర్తతో "ఏంటంటాడూఅట్టా పోతన్నాడేంటి కిరాయి తీసుకోకండా?" అంది.
            "ఏంటో డాక్టర్ ఫీజంటన్నాడు" అన్నాడాయన వింతగా చూస్తూ.
             "ఏంటేంటీ? మన బిడ్డకి డాక్టర్ ఫీజు మనవిచ్చుకోలేవా? ఆడికేవన్నా పిచ్చెక్కిందా?"అందామె కోపమూ చిరాకూ కలగలిపిన స్వరంతో.
         మబ్బుల రజాయి దట్టంగా కప్పేసినా, విధి నిర్వహణలో తనని మించిన వాళ్ళు లేరని నిరూపిస్తూ బారెడెత్తున నవ్వుతూ నిలుచున్నాడు సూర్యుడు. మలుపు తిరిగి మెయిన్ రోడ్డెక్కుతుంటే దారి పక్కన చెట్టు నిండుగా ఫక్కుమంటున్న పున్నాగలు పరిమళాలు రువ్వాయి. పెళ్ళయ్యాక అత్తగారింట్లో మొదటి పండక్కి,  ఆ పూలతో వంకీ జడేసుకుని, తన వైపు వోరగా చూసిన కాంతి కళ్ళలో తళుక్కుమన్న అనురాగం గుర్తొచ్చి మోహపరవశుడయ్యాడు సూర్యారావు.
       'ఎంత దూరవనీ ముఫై కిలోమీటర్లు! ఆటో లోనే పోవచ్చు ముగ్గురంఅక్కడ ఊళ్ళో తిరిగేందుగ్గూడా ఆటో చేతిలో వుంటది' అనుకున్నాడు హుషారుగా.


                                                             ***

                                             (27 నవంబర్,2013, నవ్య వారపత్రిక)

                                                                                                                    


                                                                                                                    ***