August 3, 2014

స్నేహ బంధమూ ఎంత మధురమూ!

                          (ఆగస్ట్ మూడవ తేదీ 'ఫ్రెండ్  షిప్ డే' సందర్భంగా 'నది' మాస పత్రిక కోరిన ప్రత్యేక వ్యాసం )

                                                                                                                   - photo by VNL

ప్రతి ఏటా ఆగస్టు నెలలో మొదటి ఆదివారం నాడు వచ్చే' స్నేహితుల దినోత్సవం' పుట్టింది  అమెరికాలో, 1935 లోనే అయినా, స్నేహం పుట్టుక మాత్రం మనిషి పుట్టుకంత ప్రాచీనమైనది. కుల, మత , ప్రాంత, లింగ భేదాలు లేని స్నేహాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడంలో స్వదేశీ, విదేశీ భేదం లేకుండా ప్రపంచమంతా ఒక్కటయిందంటే, జీవితంలో ప్రతి ఒకరికీ స్నేహం ఎంత అపురూపమయినదో అర్ధమవుతుంది..

           
హాల్ మార్క్ గ్రీటింగ్ కార్డు తయారీదారుల సృష్టిగా చెప్పుకోబడే మైత్రీ దినోత్సవం నిజానికి  1919లో మొదలయిందని చెప్పుకుంటారు. పెద్ద ఎత్తున  స్నేహితులకోసం  ఒక రోజు కేటాయించి  పండుగ గా జరుపుకోవడమనేది అమెరికాలో 1935 లో ప్రారంభమై, కాలక్రమేణా అంతర్జాతీయం గా ప్రాచుర్యం పొంది 'ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే ' గా రూపాంతరం చెందడం జరిగింది. పెరుగ్వే లో మొదటి సారిగా ఈ 'అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం' ,1958 లో జూలై 20 నాడు  జరుపుకోబడింది.  ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ భార్య శ్రీమతి నానే అన్నన్, 1998 లో ఫ్రెండ్ షిప్ డే గౌరవార్ధం  'విన్నీ ది పూ' అనే కార్టూన్ కారెక్టర్ ని  ప్రపంచపు స్నేహ దూతగా (ఫ్రెండ్ షిప్ డే అంబాసిడర్ గా) ప్రకటించారు. 

ఆత్మీయ స్నేహితులకి ఈ మైత్రీ దినోత్సవం నాడు  పువ్వులూ, గ్రీటింగ్ కార్డులూ, స్నేహ సూత్రాలని  (ఫ్రెండ్ షిప్ బాండ్స్) ఇచ్చిపుచ్చుకోవడం ఒక అందమైన ఆచారం. వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో ఈ పండుగ జరుపుకుంటున్నా, 2011 లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ జూలై 30 వ తారీకుని అంతర్జాతీయ మైత్రీ దినోత్సవం గా అధికారికంగా ప్రకటించింది. అయినా  మనదేశం , మరికొన్ని దేశాలూ మాత్రం ఆగస్టు నెలలోని మొదటి ఆదివారాన్ని ' ఫ్రెండ్షిప్ డే'  పండుగగా జరుపుకుంటున్నాయి. ఈ ఫ్రెండ్షిప్ డే ఇటీవలి కాలంలో ముందెన్నడూ లేనంత ప్రాముఖ్యతని సంతరించుకోవడం వెనక, అంతర్జాలం ఉపయోగం లోకి రావడం, ఖర్చులేకుండా ఒకే లేఖని వందల మంది నేస్తాలకి  ఏక కాలంలో  పంపగలిగే సదుపాయం దొరకడం కారణాలుగా చెప్పుకోవచ్చు.

       
స్నేహపు భాష పదాలతో కాక  భావాలతో ఏర్పడుతుందంటారు. ఎటు చూసినా విభజన రేఖలే కనిపిస్తున్న నేటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని కలిపి ఉంచగల శక్తి ఒక్క స్నేహానికే ఉందంటే అది సత్య దూరం కాదు. మన ముందు నడుస్తూ ఎవరైనా మార్గ నిర్దేశనం చేస్తానంటే మనకు నచ్చచ్చు... నచ్చక పోవచ్చు. మన వెనక నడిచేవాడికి ఎప్పుడూ దారి చూపిస్తూ పోవాలంటే మనకి వీలు కాకపోవచ్చు. మనతో నడిచే వ్యక్తినే మనం మిత్రుడిగా భావించి మంచీ చెడూ పంచుకోగలుగుతాం. అలా మన కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్నవారినే మనం స్నేహితులుగా ఎంచి అభిమానిస్తాం, గౌరవిస్తాం. రచయితా, తత్త్వవేత్తా అయి  నోబెల్ బహుమతి అందుకున్న ఆల్బర్ట్ కేమస్ అంటాడు  ' నావెనక నడవకు, నేను నీకు తోవ చూపించలేకపోవచ్చు. నా ముందు నడవకు , నేను నిన్ను అనుసరించకపోవచ్చు. నా జతగా నడు, నా స్నేహితుడిగా ఉండిపో '. 

తోటి వాడి కష్టానికి సానుభూతి అందించడం ఎవరైనా చేస్తారు గాని గొప్ప హృదయం ఉన్నమిత్రుడు  మాత్రమే స్నేహితుని  విజయాన్ని మనసారా అభినందించగలుగుతాడు. నిజమైన స్నేహం జీవితంలోని మంచిని ద్విగుణీకృతం చేస్తుంది, చెడుని భాగించి ఆ ప్రభావాన్నితగ్గిస్తుంది. నా అన్నవారే లేని వాళ్లుండవచ్చు గాని స్నేహితులు లేని వాళ్ళు ఉండరు. తల్లిదండ్రులతో, బంధువులతో చెప్పుకోలేని సమస్యల్ని కూడా మిత్రుల దగ్గర చెప్పుకుని ఓదార్పు పొందడం, పరిష్కార మార్గాల కోసం ప్రయత్నించడం మనలో చాలామందికి అలవాటే.  
 సాధారణంగా స్నేహితులలో ఏదో ఒక సారూప్యత ఉంటుంది. అదే స్నేహం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. " నిజమా ? నువ్వూ అంతేనా ? నేను మాత్రమే అలా ఏమో అనుకున్నాఇన్నాళ్ళూ ! " స్నేహితుల మధ్య ఇలాంటి మాటలు వినపడడం రివాజు. ఇద్దరిమధ్య మౌనం కూడా హాయిగా ఉన్నపుడే వారి మధ్య స్నేహం ఉన్నట్టు అంటూ స్నేహాన్ని నిర్వచిస్తాడు గీత రచయిత డేవిడ్ టైసన్ జెంట్రీ . 

       '
నీవుంటే వేరే కనులెందుకు నీకంటే వేరే బతుకెందుకు, నీ బాట లోని అడుగులు నావి, నాపాట లోని మాటలు నీవి అంటూ స్నేహ బంధపు సౌందర్యాన్ని పాటలో పొదిగారు సినారె. అలాగే స్నేహ మాధుర్యాన్ని చవి చూసి ఆ బంధం కోసం, తను బతుకుతెరువు కోసం ఎన్నుకున్న మార్గాన్నే వదిలి మంచివాడైన ప్రతినాయకుడు   ' స్నేహమే నాకున్నదిస్నేహమేరా పెన్నిధి  ' అంటూ తన మిత్రుడి కోసం ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధపడతాడు.  అలాగే 'మంచి మిత్రులు'గా విడిపోయి చాలా కాలం తర్వాత కలుసుకోబోతున్న  ఇద్దరు స్నేహితులు తమతమ అనుభవాలను , తాము నేర్చుకున్న జీవిత పాఠాలను,  ఒకరితో ఒకరు చెప్పుకోవాలని ఆతురపడుతూ ' ఇంకా తెలవారదేమి? ఈ చీకటి విడిపోదేమి ? ' అంటూ పాడిన పాట, ఆ సినిమా విడుదలై అర్ధ శతాబ్దమైనా ఇంకా సినీ గీతాభిమానుల పెదవులపై నర్తిస్తూనే ఉంది . 

      '
వీడ్కోలుతో  కుంగిపోకు .. మళ్ళీ  కలవాలంటే విడిపోక తప్పదు. స్నేహితులైనట్టయితే  మరునిముషం లోనో, మరుజన్మలోనో కలవక తప్పదు' అంటాడు అమెరికన్ రచయిత రిచర్డ్ బక్. ప్రతిమనిషిలోనూ నిస్వార్థమనే ఒక ఆయస్కాంతం   ఉంటుందనీ , మనం ఇతరులకోసం జీవించ గలిగితే ఇతరులు మనకోసం జీవిస్తారనీ పరమ హంస యోగానంద సుభాషితంకలిసిమెలిసి ఉండగలగడం, ఒకరికోసం ఒకరు పోరాడగలగడం , అవసరమైనపుడు తీరికలేదనో, అలసిపోయాననో అనకుండా ఆపదలో ఆదుకోవడం, స్నేహంలో ముఖ్య మైన లక్షణాలు. తానందుకున్నది గుర్తుంచుకుని, తానిచ్చింది మర్చిపోవడంలోనే స్నేహం ఉంటుందంటాడు 'ది త్రీ మస్కేటీర్స్' రచించిన అలెక్జాండర్ డ్యుమాస్. సోక్రటీస్ చెప్పినట్టు స్నేహబంధంలోకి దూకేటపుడు తొందరపాటు తగదు. కానీ ఒకసారి అందులో చిక్కుకుంటే మాత్రం, ఆ బంధాన్ని స్థిరంగా, దృఢంగా నిలబెట్టుకోవాలి. 

       '
నెవర్ ఎక్స్ ప్లెయిన్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్రెండ్స్ డు నాట్ నీడిట్. యువర్ ఎనిమీస్ డోంట్ బిలీవిట్ ' అన్న ఆంగ్ల సూక్తి మనకి తెలిసిందే. ఈ సూక్తి లోనే స్నేహం లోని మాధుర్యం, స్నేహం అందించే   ఆలంబనా  తేట తెల్లమవుతాయి. ' నేను మారినపుడు మారిపోతూ, నేను తలూపినపుడు తానూ తలూపుతూ ఉండే స్నేహితుడు నాకక్కరలేదు. నా నీడ ఆ పని ఇంకా మెరుగ్గా చేస్తుంది!' అంటాడు గ్రీకు చరిత్రకారుడు ప్లుటార్క్. శత్రువొక్కడైనా ఎక్కువే. మిత్రులు వందమంది ఉన్నా తక్కువే అని స్వామి వివేకానంద పలికితే, అహంకారికి మిత్రులుండరని ఆస్కార్ వైల్డ్ తేల్చేసాడు ! 'నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పు. నీ గురించి నేను చెపుతాను ' అనడం, స్నేహితుల ప్రభావం మనిషి మీద ఎంతగా ఉంటుందో తెలియచేప్పడమే. 'మిత్రుల పట్ల నీకు గల భావాలని వారి మరణానంతరం ఇచ్చే ఉపన్యాసాల కోసమో, వారి సమాధి మీద లిఖించడం కోసమో అట్టి పెట్టుకోకు, ఆ భావాలని ఎప్పటికప్పుడు వ్యక్త పరచడం నేర్చుకో' అంటాడు అన్నా కుమ్మిన్స్. 

       పరవస్తు చిన్నయసూరి రచించిన పంచతంత్రం లోని మిత్ర లాభం , మిత్ర భేదం అనే రెండు భాగాల్లోనూ సన్మిత్రులంటే ఎవరు స్నేహపు గొప్పదనమేమిటి , మైత్రి ఎలాంటి వారితో చెయ్యాలి, ఆత్మీయ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టేవాళ్లని ఎలా గుర్తించాలి మొదలైన ఎన్నో తెలుసుకోవలసిన విషయాలని సరళంగా అర్ధమయ్యే రీతిలో పిల్లల కథలుగా మలిచి వివరించారు రచయిత. ఈ కథలన్నీ శ్రద్ధతో విన్న పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం సూర్య కిరణాలకి తామరలు విచ్చుకున్నంత సహజం గా , అలవోకగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. 

      
జీవితం లో మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకోవడం చాలా కష్టం. కొంతమంది పైకి చుర చుర లాడే ముఖాలతో కనిపిస్తారు. కానీ అవసరానికి ఆదుకుంటారు. కొందరు రాసుకు పూసుకు తిరుగుతారు కానీ అవసరమైనపుడు తప్పించుకు తిరుగుతారు. లోకంలో ఇలాంటి వాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు. మహా భారతం లోని శాంతి పర్వం లోని 'అరులన్ మిత్రులన్ దెలియ... ' అనే పద్యం మిత్రుల మధ్య అపార్ధాలు ఏర్పడకుండా చూసుకోవడం , శత్రువుల వల్ల  అనర్ధాలు కలగకుండా జాగ్రత్త పడడం ఎలాగో సూచిస్తుంది .

కూరిమి గల దినములలో

నేరములెన్నడును గలుగ నేరవు మరియా

కూరిమి విరసంబైనను

నేరములే తోచుచుండు నిక్కము సుమతీ !

అంటూ సుమతీ శతక కారుడు హెచ్చరించినట్టుగా చక్కని స్నేహం వెల్లి విరిసినన్నాళ్ళూ సంతోషకరంగా, సానుకూలంగా కనిపించిన విషయాలే మనస్పర్ధలు ఏర్పడినపుడు సహించరానివిగా కనపడడం మనందరికీ తెలిసిందే.
స్నేహమనే వృక్షం ఒక్కరోజులో పెరిగి పెద్దది కావడం జరగదు. స్నేహాన్ని నిదానంగా ఎదిగే చెట్టు తో పోలుస్తారు. ఆ చెట్టు పరిమళ భరితమైన పూలు పూయాలన్నా, రుచికరమైన ఫలాలనివ్వాలన్నా, మొక్కగా ఉన్ననాటి నుంచి, లేత మొక్కకి  శ్రద్ధతో నీరు పెట్టి, కలుపు తీసి, పశుపక్ష్యాదులు పాడు చేయకుండా జాగ్రత్త తీసుకున్నట్టే, ఓపికగా  పెంచి పోషించాల్సిన అవసరం ఉంది. ప్రతి స్నేహమూ ఎప్పుడో ఒకప్పుడు గతుకుల దారిలో ప్రయాణించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయం ఆ బంధపు దృఢ త్వాన్ని అన్ని రకాలుగా పరీక్షిస్తుంది . ఇరుపక్షాల మధ్యా ముందున్న ఆకర్షణ , ఆత్మీయతా మాయమైపోతున్నట్టనిపిస్తుంది. ఒకరి పట్ల ఒకరికున్న అభిప్రాయాలన్నీ మారిపోయినట్టూ, ఒకరి సమక్షం ఒకరికి గిట్టనట్టూ అనిపిస్తుంది . అలాంటపుడు ఆత్మావలోకన అవసరమవుతుంది. నిజమైన స్నేహపు లక్షణానొకసారి గుర్తుచేసుకోవలసి వస్తుంది. అహాన్ని కుదింపచేసుకుని, అవతలి వ్యక్తి  కోణం లోంచి ఆలోచించి, సానుకూలంగా స్పందించాల్సివస్తుంది. ఎవరికీ వారు స్వఛ్చందంగా ముందుకడుగు వేసి, మనసు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. 

        ఒకసారి ఈ కష్ట తరమైన ప్రయాణం పూర్తయితే ఆ స్నేహం శుద్ధి పొందినట్టే! మలినాలు కరిగిపోయినట్టే. అపుడొక కొత్త ప్రయాణం మొదలవుతుంది. పాత స్నేహమే కొత్త చిగుళ్ళు వేస్తూ  పెరిగి పెద్దదవుతుంది.  స్నేహమంటే పాతబడ్డ పరిచయం కాదు. ఎప్పుడూ వీడని అనుబంధం!  ఇక్కడ ఆ వ్యక్తి  ఎంత కాలంగా తెలుసనే విషయానికి ప్రాధాన్యత లేదు . ఒకసారి మైత్రి ఏర్పడ్డాక ఎప్పుడూ విడవక పోవడమే స్నేహం. నాలుగు దశాబ్దాల క్రితం 'ఛోడేంగే దమ్ అగర్, తేరా సాథ్ నా ఛోడేంగే' అంటూ ఇద్దరు మిత్రులు చేసిన విన్యాసాలు అభిమానులు మళ్ళీ మళ్ళీ చూసి మెచ్చుకున్నారంటే కారణం ఆ పాటలో ధ్వనించిన స్నేహమాధుర్యపు తీయదనమే. 

      'నేను నా శత్రువులందరినీ నాశనం చేసినట్టే కదా, వాళ్ళని గనక నా స్నేహితులుగా మార్చుకోగలిగితే' అన్న అబ్రహాం లింకన్ మాటలకీ, ‘మహోపనిషత్తు’ లో నిక్షిప్తమైన వసుధైవ కుటుంబకం అన్న ఉదాత్త భావనకీ సారూప్యత ఉంది. 'అయం బంధు రయం నేతి గణనా లఘుచేతసాం / ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం' (ఇతను నా బంధువు, ఇతను అన్యుడు అనే చింతన అల్పబుద్ధులకే. విశాలహృదయులకి వసుధంతా ఒకే కుటుంబం). 
 'మంచి మిత్రుడు నీ గురించి ఉన్నదున్నట్టుగా చెప్పేస్తాడు. అలా చెప్పేశాక అతనంత మంచి మిత్రుడిగా నీకు అనిపించక పోవచ్చు!' అన్న ఒక ఆంగ్ల సంపాదకుడి మాటలు గుర్తుంచుకోదగ్గవి. మన గురించి నిక్కచ్చిగా మన ముందు చెప్పగల వ్యక్తి మనమెప్పుడూ కోల్పోకూడని మిత్రుడని తెలుసుకోగలిగితే స్నేహితుల్ని సంపాదించుకోవడం, నిలబెట్టుకోవడం మనకి తెలిసినట్టే ! స్నేహితులంటే మనమే ఎన్నుకుని ఏర్పరచుకోగల  కుటుంబమేగా !
  
' సంపదలతో తులతూగుతున్నపుడు మన గురించి మన స్నేహితులకి తెలుస్తుంది. మనం ఆపదల్లో ఉన్నపుడు మన స్నేహితుల గురించి  మనకి తెలుస్తుంది!' అన్న ఆంగ్ల విమర్శకుడు జాన్ కొల్లిన్స్ పలుకులు అక్షర సత్యాలు. అవసరాల్లో, ఆనంద సమయాల్లో,  ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకుంటూ , నిజమైన మిత్రులకోసం  చెరగని చిరునవ్వునీ , తీయని పలకరింపునీచాచిన స్నేహ హస్తాన్నీ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునే వారి జీవితపు ఉద్యానవనం సతత హరితం ! అందులో స్నేహ సుమాలు ఏటి పొడుగునా పరిమళిస్తూనే ఉంటాయి !  

                                                            ***