May 1, 2014

సుహానా సఫర్ ..ఇదొక తెరుచుకున్న కొత్త కిటికీ!

        (ఏప్రిల్ భూమిక స్త్రీవాద పత్రిక లో రచయిత్రుల నిజామాబాద్ యాత్ర గురించిన నా వ్యాసం )

     భూమిక బృందం, స్నేహ సౌరభాల సుమ గుచ్ఛమై, జనవరి 20వ తేదీన హైదరాబాదు నుంచి నిజామాబాద్ కి ప్రయాణమయింది. ముందుగా అనేక విద్యా సంస్థల అధినేత అయిన అమృత లత గారి ఊరు ‘ఆర్మూరు’ చేరాం . చిరునవ్వులతో ఆప్యాయంగా ఎదురొచ్చి, అందరినీ ఆలింగనం చేసుకున్నారు అమృత లత గారు, నెల్లుట్ల రమాదేవి గారు! ప్రయాణపు అలసట తీరేలా వేడి టీ, బిస్కెట్లు అందరికీ అందాయి. అమృత లత గారి విద్యాలయాల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్న మహిళా శక్తి అంతా అక్కడ సమావేశమై మాకోసం ఎదురు చూస్తోంది. ఎంతటి అంకిత భావం... ఎంతటి ఐక్యత ! వాళ్ళందరినీ చూసి, మాట కలిపేసరికి మనసు నిండిపోయింది.
    అప్పటికే మాకోసం కార్యక్రమమంతా తయారుగా పెట్టుకున్న అమృత లత గారు మా వెంట రమాదేవి గారిని గైడ్ గా పంపిస్తూ, తాము నడిపిస్తున్న విద్యాలయాలన్నీ చూపించి, తాను స్వయంగా కట్టించి నిర్వహిస్తున్న ప్రశాంత సుందరమైన అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తీసుకు రమ్మని చెప్పారు . ఆమె స్థాపించి, ఎంతో సమర్ధవంతంగా నడుపుతున్న స్కూళ్ళు, కాలేజీలు చూసి, దేవాలయం చేరేసరికి అమృత గారు కూడా అక్కడికి చేరారు . ఆవేళ ఆకాశమంతా వెన్నెల పరుచుకుంది . ఏ విధమైన రణ గొణ ధ్వనులూ లేవు . ఆలయ ప్రాంగణం లో గుత్తులు గుత్తులుగా పూసి సౌరభాలు వెదజల్లుతున్న పూల చెట్లు ! పచ్చని పచ్చిక . అ ప్రాంగణ మంతా వ్యాపించిన ప్రశాంతత. వాతావరణం కూడా అటు చలి గాని, ఇటు వేడి గాని లేని, అత్యంత ఆహ్లాదకర వాతావరణం ! ఆగి ఆగి మోగుతున్న గుడి గంటలు మనసుకెంతో సాంత్వన కలిగించాయి .


      అక్కడినించీ కదలాలని లేక పోయినా ముందుకి సాగాలి గనక మళ్ళీ బస్సెక్కి ప్రయాణం సాగించాం . అక్కడికి దగ్గరలో ఉన్న ఆదర్శ గ్రామం అంకాపూర్ గురించి, ఆ వూరి రైతులకి రుణాలు ఇస్తూ వారితో చక్కని సంబంధ బాంధవ్యాలు నెరపుతున్న బ్యాంకు మేనేజర్ రమాదేవి గారి మాటల్లో వింటూ, నవ్వుల్లో మునిగి పోతూ ‘లాలన’ వృద్ధాశ్రమం చేరాం . అక్కడ కూడా అంతే .. పచ్చని చెట్లూ , పచ్చికా , పూల మొక్కలూ . ప్రశాంత వాతావరణం ! అక్కడ ఆశ్రయం పొందే వారి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా వారి సోదరులు నడుపుతున్న 'లాలన' వృద్ధాశ్రమంలో యాభై మంది వృద్ధులకి ప్రేమ పూర్వకమైన ఆలనా పాలనా లభిస్తోంది.

అక్కడి వృద్ధులతో మాట్లాడి బయటికి వస్తూ “ కొన్నేళ్ళ తర్వాత నాకూ ఇక్కడ చోటు కావాలి ” అంటూ అంతా తమ వసతులు బుక్ చేసుకున్నారు ! “తప్పకుండా” అని హామీ ఇస్తూ “ఆ వయసొస్తే నేనూ ఇక్కడే “ అంటూ అమృత గారు ! నిర్వహణ బాధ్యతంతా అన్నిచోట్లా మహిళా మణులే ! మా వెంట ఉండి, పెల్లుబికే ఉత్సాహంతో, నవ్వుల పువ్వులు వెదజల్లుతూ, ఆ ప్రాంత విశేషాలు వివరిస్తూవచ్చిన ప్రౌఢ పసిడి బొమ్మ నెల్లుట్ల రమాదేవి గారిని చూస్తే ఈమెకింత శక్తి, ఉత్సాహం ఎక్కడివా అని ఆశ్చర్యం కలిగింది ! చల్లని వెన్నెల్లో పూల మొక్కలు పంచుతున్న సుగంధాలు పీలుస్తూ కొద్దిసేపు ఆరుబయట కబుర్లు చెప్పుకుని వెనక్కి ప్రయాణమయ్యాం .

    అమృత గారి ఇల్లు చేరేసరికి శుచిగా రుచిగా భోజనం సిద్ధం !
    భోజనాలు పూర్తై ఇంక నిద్రపోవచ్చనుకుంటుంటే అక్కడి స్టాఫ్ లో ఒకరు నవ్వుతూ " అప్పుడే ? భలేవారే ! తిన్నదంతా అరిగే దాకా ఆట లాడిస్తారు మేడం ! " అని నవ్వుకుంటూ చెప్పారు. వాళ్ళందరిలో నడివయసు చేరుతున్నా యుక్త వయస్కుల కుండే ఉత్సాహం!

     పోర్టికో పక్కనున్న ఆవరణలో భోజనాలయ్యాక సాగిన సమావేశం, చిన్న చిన్న skits తో , ఆటలతో ఉత్సాహంగా స్ఫూర్తివంతంగా నడిచింది ! తెలియకుండానే అందరం కాలేజీ పిల్లలమైపోయాం ! అర్ధరాత్రి అయింది. ‘శుభరాత్రి’ చెప్పుకుని వరసగా పరచిన పక్కల మీదికి చేరాం . మా అందరి ప్రతి అవసరాన్ని ఎంతో శ్రద్ధతో గుర్తుంచుకుని మా విశ్రాంతికి ఏర్పాటు చేశారు అమృత గారి బృందం !

     రోజూ ఆహ్లాదకరమైన ప్రభాత పవనాల్ని ఎంతగా కోల్పోతామో ఇలా వచ్చినపుడే తెలుస్తుందనుకుంటా . పొద్దున్నే చేసే ప్రయాణాలు ఎంత బావుంటాయో . అందులోనూ, ప్రయాణించే వారందరినీ కలిపి కట్టే అంతస్సూత్రం ఒకటి ఉన్నపుడు మరీను ! తెల్లారేసరికి, అంటే ఆరింటికల్లా పాతికమందీ స్నానాలు ముగించి టీ కాఫీలు అందుకుని , బస్సెక్కేశామంటే అది సత్యవతి నిర్వహణా సామర్ధ్యమే! అమృత గారి అతిధి సత్కారాల మహత్యమే !

    తిన్నగా శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ దగ్గరికి చేరాం ఉదయభానుడి తో పోటీ పడుతూ ! చలి చలి గాలుల్లో చక చకా నడుస్తూ Dam పైకి చేరేసరికి, ఎదురుగా… నవ భారత నిర్మాణం కోసం కలలు గని, ఈ ప్రాజెక్టు రూపకల్పనలో పాల్గొని, శంకు స్థాపన చేసిన నెహ్రూ శిలా విగ్రహం !

   కాసేపు అక్కడ సరదాగా కాలక్షేపం చేసి పుచ్చెర జలపాతం దగ్గరకి ప్రయాణమయ్యాం. జలపాతం దగ్గరకి చేరేసరికి సుమారు తొమ్మిది గంటలయింది !

    అక్కడ రాతి గుట్టల పైన, చెట్ల కింద, వేడి వేడి పూరీ కూరా, స్వీటూ సిద్ధం ! వెనకే అన్నపూర్ణలా అమృత గారు, రమాదేవి గారు ! కొసరి కొసరి వడ్డిస్తే హాయిగా సేవించి కబుర్లు చెప్పుకుని జలపాతధారల కిందకి చేరిపోయాం! ప్రపంచాన్ని మర్చిపోయి ఆ నీటి ధారల కింద మై మరచిపోయాం ! ఆ నీళ్ళు పైనుంచి మా తలల మీద , వీపుల మీద దరువులేశాయి ! ఆటలాడాయి ! మా మనసు ఇక వేరే దేని మీదికీ పోకుండా ఆకట్టేసి కట్టేశాయి! అలా కాలం మరచి పోయి ఆ నీళ్ళతో ఆడుకుని , బాల్య స్మృతుల్ని గుర్తు తెచ్చుకుని , పసి వాళ్ళలా స్వచ్ఛ మానసాలతో మళ్ళీ రాళ్ళూ గుట్టలూ ఎక్కి, అమృత గారి బృందం ఆడించిన ఆటల్లో చురుగ్గా పాల్గొన్నాం.


     అక్కడి నించీ కుంతల జలపాతం దగ్గరికి ప్రయాణం . ప్రవహించె ఆ ప్రకృతిని తిలకించి పరవశించి, పొలాల మధ్య farm house ప్రాంగణం లో అమృత గారందించిన విందు భోజనం ఆరగించి, తర్వాత సమీపంలో ఉన్న అడవుల్లోకి ట్రాక్టర్ మీద (ఎత్తు పల్లాల దారి మీద ఇంకే four wheeler నడవదు ) తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణించి గోండ్ తెగకు సంబంధించిన " బుర్క రేగడి " గూడేనికి వెళ్లాం .     సహజమైన జీవనానికి మనమంతా ఎంత దూరమై పోయామో అలాంటి చోట్ల చూ స్తే తెలుస్తుంది. తీసుకునే ఆహారం ఆ చుట్టుపక్కలే పండుతుంది. నివసించే పాకలన్నీ చుట్టుపక్కల దొరికే వస్తువులతొనె నిర్మించుకుంటారు. పాడి పశువులూ, మేకలూ , సంఖ్యలో వారితో సరిసమానంగా ఉంటాయి. సహజీవనం వాళ్ళ జీవన సూత్రం !

     అక్కడంతా వాళ్ళు మా కోసం చేసిన ఏర్పాట్లు కనిపించాయి. అమృత గారి ఏర్పాట్లలొ భాగంగా అక్కడికక్కడ తయారు చేసిన మొక్కజొన్న గారెలూ , బజ్జీలూ ! అమృత గారూ మీకు సమ ఉజ్జీ లేరండీ!

    ఇంతలో ఉన్నట్టుండి వెనక నుంచి డప్పుల చప్పుళ్ళు .. కాలి అందెల సవ్వళ్ళు .. కోలాహలం ! అక్కడి గిరిజనుల సంప్రదాయ నృత్యం మొదలైంది. అంతా అడుగులు కలిపాం ! భలే సరదాగా సాగింది సమయం ! చూస్తూండగా గోధూళి వేళయింది! ఆవులూ, ఎడ్లూ గణ గణా ఇళ్ళకి తిరిగొచ్చాయి. వెనకే మేకలు ! ఆ దృశ్యం మనోహరంగా కనిపించింది .
     మెల్లిగా వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి మళ్ళీ ట్రాక్టర్ ట్రక్కులో క్రిక్కిరిసి సర్దుకుని, విశాలాకాశమంతా పరుచుకున్న సంధ్య వెలుగుల్ని కళ్ళనిండా నింపుకుంటూ, మౌన గీతాల్ని మనసంతా పులుముకుంటూ, తిరుగు ప్రయాణ మయాం. అలా వెళ్తుంటే సంధ్యాసుందరి, హేమంత యామినితో కలిసి ఒకటే జుగల్ బందీ ! ఇక్కడ ట్రక్కులో చిక్కుకున్న పిల్లకాయలంతా(వయసులో కాదనుకోండి ) ఒకటే అల్లరి ! దారికడ్డు వచ్చిన పిల్ల వాగుల్ని దాటేటపుడు' ఓ' అంటూ ఒక్కసారిగా అరవడం, చింత చెట్టు కిందకి రాగానే " నంది కొండ వాగుల్లోన …. నల్ల తుమ్మ నీడల్లొన , నీడల్లే ఉన్నా! నీతో వస్తున్నా! యహహా " అని ఒకరినొకరు భయ పెట్టుకోవడం ! నవ్వుల్లో మునిగి లేచి, గుర్తొచ్చిన పాటలు పాడుకోవడం ..    " రెల్లు పూల పానుపు పైనా ..చల్లినారమ్మా వెన్నెల చల్లినారమ్మా" , " యే రాత్ భీగీ భీగీ " , "సుహానా సఫర్ " ఏ రాతే, ఎ మౌసం, నదీ కా కినారా! ఎ చంచల్ హవా " అలా, ఆ వెన్నెల వేళ పొలాల అందాల్ని మనసులో దాచుకుంటూ ఎన్ని పాటలు పాడుకున్నామో ! ఒకరి పట్ల ఒకరం ఎంతటి ఆత్మీయత మూటగట్టుకున్నామో !

      రాత్రి వెనక్కి వచ్చే సరికి మా కోసం మరో surprise సిద్ధంగా ఉంది farm house దగ్గర . అమృత గారి బృందంలో అత్యంత సమర్ధంగా కళాశాలల నిర్వహణ సాగించే principals , secretaries అంతా కలిసి, సరదాగా మాకోసమే చిన్ని చిన్ని నాటకాలు వేశారు . అన్నీ సామాజిక రుగ్మతల మీదే . అదేమి ఉత్సాహమో ! చెంగు చెంగుమంటూ యువతరాన్ని మించిన ఆ ఆనందోత్సాహాలు, ఆ నైపుణ్యం వాళ్ళకెలా వస్తాయో ! అవయ్యాక వాళ్ళతో కలిసి భోజనం చేసి, వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి బస్సెక్కాం .      అక్కడినించి తిన్నగా ఉట్నూరు చేరి అక్కడ బస చేసి , మళ్ళీ పొద్దున్నే ఆరింటికి చక్కగా తయారైపోయి, ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రయాణం ! ప్రయాణపు ఏర్పాట్లన్నిటిలో ‘గలగలా సాగే సెలయేరు’ గీతది ఒక ముఖ్య భూమిక. సమర్ధతకు మారుపేరుగా పేరు తెచ్చుకుంటూ తహసీల్దారు నుంచి deputy కలెక్టర్ గా పదోన్నతి పొందిన శుభ వార్త ప్రయాణం చివరిలో మాతో పంచుకుంది తను!     ముందు  ఆర్గానిక్ ఫార్మింగ్ సాగిస్తున్న రైతుల్ని ఝరి గ్రామంలో కలుసుకుని , నేటివ్ విత్తనాలు అంతరించి పోకుండా వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకుని , వారందించిన ఉడికించిన మచ్చ కందులు రుచి చూశాం . ఈ రకం కందులు అతి వృష్టినీ తట్టుకుంటాయి అనా వృష్టినీ తట్టుకుంటాయి . నిలవ ఉంచితే ఇరవై సంవత్సరాల తరవాతైనా మొలకెత్తుతాయి ! దిగుబడి తక్కువ ,కానీ తొక్క దళసరిగా ఉండే ఈ రకాన్ని పురుగు ఆశించదు ! పోషకాల గని ! చాలా రుచికరంగా కూడా ఉంటుంది ! బీటీ పంటల వెర్రిలో , బహుళ జాతి కంపెనీల వలలో పడి మన సహజ సంపద లన్నిటినీ నాశనం చేసుకుంటున్న మనకి ఇలాంటి వ్యక్తులూ, సంస్థలే లేకపోతే భవిష్యత్తు అంధకారమే కదా అనిపించింది !


        ఆ రైతుల మాటలూ , స్థానికుల పాటలు విని , తిన్నగా “కొమరం భీమ్” స్మారక చిహ్నమున్న జోడేఘాట్ కి ప్రయాణమయ్యాం .. ప్రకృతి కాంత సుందర విన్యాసాలని చూస్తూ కొండ కోనలు దాటాం.


ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూ అమరుడైన 'కొమరం భీమ్' స్మారకాన్ని దర్శించి, నివాళులర్పించి, మళ్ళీ ప్రయాణం.      గోండ్లు , ఓజాల గూడేలలో వారు తయారు చేస్తున్న కళా రూపాల్ని చూసి, కొన్ని కొనుగోలు చేసి , వాళ్ళతో కలిసి భోజనం చేశాం . వాళ్ళు సాధిస్తున్న ప్రగతి గురించి వారి మాటల్లోనే విన్నాం. మనసంతా నిండిపోగా, గ్రామీణాభివృద్ధి కి , మహిళాభ్యుదయానికి సంబంధించిన అలాంటి కలని సాకారం చేస్తున్న' మహిళా సమత' ప్రాజెక్ట్ డైరెక్టర్, మాతో కలిసి ప్రయాణం చేస్తున్న సుందర సౌజన్య మూర్తి ‘ప్రశాంతి’ ని మనసారా అభినందిస్తూ వాళ్లకి వీడ్కోలిచ్చాం. ఆదివాసులతో సంభాషించేందుకు సాయం చెయ్యడానికి మాతోపాటు వచ్చిన సకృబాయి తదితరులు బస్సు దాకా వచ్చారు. బస్సెక్కిన నాకు కిటికీలోంచి కనిపించిన దృశ్యం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రశాంతిని ఒక్కొక్కరూ విడవలేక విడవలేక వీడ్కోలివ్వడం ...చివరగా సకృ బాయి తనని హత్తుకుని కృతజ్ఞతతో ఉద్వేగంతో కన్నీరు మున్నీరవ్వడం ... ఎంత ప్రేమ తను వారికందిస్తే వాళ్ళలా స్పందించి ఉంటారు అనే భావన నన్ను ముగ్ధురాలిని చేసింది. నా కళ్ళు చెమర్చాయి!

     ఇంక వెళ్ళాలి ... ‘సమత నిలయం’ లో చిన్నారులు మాకోసం ఎదురుచూస్తున్నారు. ఎంత త్వరగా వెళ్లాలనుకున్నా అక్కడికి చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నరైంది. పసి వాళ్ళు నిద్రలో మునిగే సమయం ... అయినా వాళ్ళ కుటీర సముదాయాల్లో హడావిడే. ఎందఱో అమ్మలూ అక్కలూ వస్తున్నారని ! సత్య కనపడగానే ‘అమ్మమ్మా’ అంటూ పరుగులతో వచ్చి, తనని అల్లుకుపోయిన పిల్లలంతా ఆర్త హృదయాల్లాగా కనపడలేదు. వెలుగుతున్న చిరుదివ్వెల్లాగా కాంతులు చిమ్ముతున్నారు ! సమత నిలయం మామూలు అనాధాశ్రమం లాంటిది కాదు. ఆకారంలోనే కాదు, నిర్వహణలో కూడా అది ఒక శాంతి ధామమే ! అక్కడి పిల్లలకున్నసామాజిక అవగాహన , చురుకుదనం , ఉత్సాహం చూస్తే వాళ్ళు ప్రత్యేకంగా కనిపించారు. ఇక్కడ ఇతర ఆశ్రమాల్లోలాగా పెద్ద హాలూ, వరసగా పరచిన చాపలూ .... అలా లేదు. విడి విడి కుటీరాలు . ఒక్కో దాంట్లో అయిదారుగురు పిల్లలూ , వారికి ఒక foster mother ! ఆ పిల్లలంతా వేరు వేరు వయసుల వాళ్ళు సరిగ్గా ఒక కుటుంబంలాగా ! ఈ చిన్నారులు కుటుంబాన్ని మిస్ కాకూడదని ఎంతో ఆలోచించి , ప్రయత్నించి , ఇలా ఏర్పాటు చేసిన ప్రశాంతిని ఎంత మెచ్చుకున్నా తక్కువే !
     మా భోజనాల కన్నా వాళ్ళతో ముఖా ముఖీయే ముఖ్యమనుకున్నామ్ అందరం . ఆలస్యమైనా పరవాలేదని, మా కోసం నిద్రపోకుండా ఎదురు చూస్తున్న పిల్లలందరితో కబుర్లు చెప్పాలనుకున్నాం . వాళ్ళు కూడా పన్నెండు వరకూ పడుకోమన్నా వినకుండా వారి నాట్యాలతో, జోకులతో, పాటలతో , కబుర్లతో మా మనసులు దోచుకున్నారు !
     రెండు రోజుల్లో ఎన్ని అనుభవాలు ! ఎంత వైరుధ్యం ! రాత్రి పన్నెండుకి బస్సెక్కి తెల్లవారి నాలుగున్నరకి భాగ్యనగరం చేరేదాకా నిద్రా మెలకువా కాని స్థితిలో ఎన్నో కలలు. ఇంతకన్నా మెరుగైన రేపటి కోసం ! ఇలాంటి ఒక వినూత్నమైన అనుభవాన్నందించి, మా అందరి కోసం ఒక కొత్త కిటికీ తలుపులు తెరిచిన సత్యకీ , ప్రశాంతి , అమృత లత గారికీ మాటల్లో ఏం చెప్పగలం ?                                                                         ***