December 30, 2011

వానచినుకులనాస్వాదించే మిత్రులందరికీ నూతన సంవత్సర  శుభాకాంక్షలు !     

December 28, 2011

2 . పొంచి ఉన్న ఎడారి 


ఇది ఒకప్పుడు శ్రమ  జీవుల బృందావనం
ఇక్కడ పాలూ పెరుగూ వెన్నా నెయ్యీ పొంగి పొర్లేవి!
చీకటితో మేలుకోవడం పని చేస్తూ పాడుకోవడం
మంచిని మెచ్చుకోవడం వెంట తెచ్చుకోవడం
దీపం కొండెక్కేలోగా  ఆదమరచి నిద్రపోవడం
 అలవాటు వీళ్ళకి !

ఒక్కసారిగా ఎక్కడెక్కడినుంచో
డబ్బు సంచులు ఇక్కడికొచ్చాయి !
నిలవుంటే మురిగిపోయే పాడిపంటల స్థానాన్ని
దాచినకొద్దీ పిల్లల్ని పెట్టే కాసులాక్రమించాయి !
దాచినకొద్దీ ఇంకా  దాచాలని 
దోచుకునైనా వీలైనంత  దాచుకోవాలని
తపన మొదలైంది !

పంచుకోవడం ఆత్మీయత పెంచుకోవడం ఎప్పటి మాటో....
ఇపుడంతా అమ్ముకోవడం కొనుక్కోవడమే !

విద్యుద్దీపాల వెలుగుల్లో
సహజమైన వెలుగు చీకట్లతో పనిలేక
రాత్రీ పగలూ ఏకమైపోయాయి !
గ్లోబలైజేషన్ పుణ్యమా అని
కార్యాలయం ,గృహప్రాంగణం ---
సరిహద్దుగీత చెరిగిపోయింది !
పని వుంటే పగలు ,పని ముగిస్తే రాత్రి !

ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు
ఇల్లు చేరాక దొరికే తీరుబాటుని మింగేస్తోంది
ఆహార నిద్రాదుల విషయంలో మనిషికీ ప్రకృతికీ సంబంధం తెగిపోయింది
అందమైన సూర్యోదయాన్ని చూసినా
అందరికీ గుర్తొస్తున్నది మరో తెమలని పనిదినమే !
ఏసీ స్విచ్చేస్తే  చల్లదనం
ఫ్రిజ్  తెరిస్తే శీతల పానీయం
అవెన్  లో పొగలు కక్కే ఆహారం
వీటికి అలవాటు పడ్డ ప్రాణానికి
ప్రాణ వాయువు పెద్దక్కకి
 ప్రాణం మీదికొచ్చిందని తెలిసినా
పట్టించుకునే ఓపిక లేదు

కనిపించని కాంతి తరంగాల విన్యాసాలలో
మునిగి తేలుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నా
సుఖలాలస నుంచీ పుట్టిన అలసత్వం
నిన్న    రాదు   .రేపు   లేదు..నేడే  నిజం  అంటోంది  !
పంట  పొలాలన్నీ  సెజ్  లుగా  మారాక
సేద్యం  లేదు..స్వేదం లేదు..
రేపటితరం గురించి ఆలోచించే సమయం లేదు..
రైతు గుండెల్లో  మిగిలిందొకటే.. ఖేదం !


మెక్డోనాల్డ్స్ ,కే ఎఫ్ సి ,పీజా జాయింట్లు 
మన వీధుల్లోకి చొచ్చుకుని వచ్చి
కోచ్ పోటేటోలని తయారు చేస్తుంటే
భారతంలో కూడా యువ శరీరాలు భారమైపోతున్నాయి !

"నాగరకత కి ముందు అడవులూ..
నాగరకత అంతాన ఎడారులూ "


అని పెద్దలు చెప్పిన మాట 
పచ్చి వాస్తవమై ఎదురుగా నిలిచింది !
పొంచి వున్న ఆ ఎడారిని తరిమి కొట్టకపోతే 
మానవాళి మనుగడ ప్రశ్నార్ధకమై    నిలుస్తుంది!
తలదాచుకుందుకు తల్లి ఒడి మిగలకుండా పోతుంది !!






బాసర క్షేత్రం లో జరిగిన కవి సమ్మేళనం లో చదివిన నా రెండు కవితలు :


1 . సృజనా ! నా ప్రియ సోదరీ !


పట్టరాని ఆనందాన్ని పంచుకునే తోడులేక
గాలిబుడగై  మనసూగిపోతుంటే
తుళ్ళిపడే మనో భావాలన్నిటినీ
పదాల సుమ గుచ్చాలుగా
కాగితాలపైకి పోగుచేసి
పరిమళాలన్నీ  మోసుకుంటూ వెళ్ళింది నువ్వే కదా !

ఆ సుమ గంధం వ్యాపించినంత మేరా
ఈ ఒంటరి సంతోషాన్ని పంచుకుంటూ
మురిసి విరిసిన వదనాలెన్నని లెక్కించను?

కమ్మేసిన వేదనతో గుండె బరువెక్కి పోయి
ప్రెషర్ కుకర్ లా పేలడానికి సిద్ధమైనపుడు
సేఫ్టీ వాల్వ్ లా తెరుచుకుని
దుఃఖపు  ఆవిరిని అక్షర సమూహంగా మార్చి
సాహితీ గగనం లోకి పరుగులు పెట్టించిందీ  నువ్వే !

నా ఒంటరి కంటం వెలువరించిన ఆక్రందనకి
ప్రతిస్పందిస్తూ చెమరించిన నయనాలెన్నని  వర్ణించను?
రోదనైన వేదనకి స్పందించని హృదయాలే
కష్టం కావ్యమై కదను తొక్కితే
కరతాళధ్వనులతో స్వాగతించాయి !

సృజనా! నా ప్రియ సోదరీ !  


నీవిచ్చిన స్ఫూర్తి తో నే గొంతెత్తి ,
ఎదురైన వ్యధిత హృదయాలన్నిటికీ  చెపుతున్నా ..
సంతోషమైనా సంతాపమైనా
గుండె గదిని మూసి భావోద్వేగాలను ఆవిరిగా పేర్చుకోవద్దని
వాటిని సిరాగా మార్చి కలాలు నింపుకోమని
మనసు రెక్కలు తెరిచి మేఘసందేశానికి శ్రీకారం చుట్టమని !

వీచేగాలీ వెల్లువెత్తే కెరటాలూ కూడా 
నిపుణుడైన నావికుడి చేతిలో కీలుబోమ్మలవుతాయట
శోధిస్తే వేదన శోభించే కావ్యమవుతుంది
ప్రయత్నిస్తే సృజన ప్రతి ఒకరికీ సాధ్యమవుతుంది
హృదయ ఘోషలోంచి కళాఖండం జనిస్తుంది !



 
                   *                              *                               *                                *