June 5, 2013

     ‘అమ్మ నీ కంచంలో వడ్డించిన ప్రతిసారీ 
      పిల్లలు తిన్నారా అని ఆరాలు తీస్తావు..

      నీకోసం   నువ్వాలోచించుకున్న క్షణాలెన్ని?     
      నిజం చెప్పు
 అంటూ ఒక తండ్రిని కొడుకు ప్రశ్నించే కవిత చదివినపుడు నూటికి తొంభైమంది పిల్లలకు గుర్తొచ్చేది అనుణమూ వారి శ్రేయస్సు కోసమే పరితపించిన  తండ్రి రూపమే. నవమాపాలు మోసి పిల్లల్ని కని వారి బాగోగులే తన జీవన పరమావధిగా తాపత్రయపడే తల్లి ప్రేమను వర్ణించే నవలలూ, కథలూ , కవితలూ, పాటలూ ఎన్నో. పసి పిల్లల మానసిక దైహిక అవసరాలరీత్యా వారి బాల్యం అంతా అమ్మ చుట్టూ తిరుగుతుంది. అందుకే అమ్మతో అనుబంధం సులభంగా, సహజంగా ఏర్పడుతుంది. అయితే తండ్రి శ్రమ, అభిమానం, తాపత్రయం అన్నీ పరోక్షమైనవి కావడంతో  పిల్లలకు అవసరమైన సదుపాయాలను సమకూరుస్తూ వారికి ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడే తండ్రికి, సాహిత్యంలో సముచిత స్థానం లభించలేదనే చెప్పాలి. పిల్లల జీవితంలో తండ్రి పాత్ర ఎంత కీలకమైనదైనా గత శతాబ్ది వరకు తండ్రితో పిల్లలకు గల అనుబంధాన్ని ఒక పండుగగా జరుపుకునే  ఆచారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేదు.
ఈ నేపథ్యంలో తల్లితో పాటు తండ్రికి కూడా సమాన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో , బాధ్యత గల పౌరులుగా పిల్లల్ని తీర్చిదిద్దే తండ్రి  ప్రాముఖ్యతను గుర్తించాలనే ఆకాంక్షతో  ఫాదర్స్‌ డే అనే అందమైన ఉత్సవం రూపుదిద్దుకుంది. వందేళ్లుగా అనేక దేశాలు జూన్ నెల మూడవ ఆదివారం నాడు ఈ పండుగను జరుపుకుంటున్నాయి. ఇతర రోజుల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్న  దేశాలు కూడా కొన్ని ఉన్నాయి.
    మొదటి సారిగా  ఫాదర్స్‌ డే ఉత్సవాల అవసరాన్ని గుర్తించినది  సొనారా స్మార్ట్ డాడ్ అనే మహిళ.. ఈమె ఒక కవయిత్రి , చిత్రకారిణి కూడా.ఆమె వాషింగ్‌టన్‌లోని స్పొకన్‌కు చెందింది. ఆధునిక ఫాదర్స్ డే ఉత్సవాలకు ఆమె ఆలోచనే మూలం. అందుకే ఈమెను మదర్ ఆఫ్ ఫాదర్స్ డే గా చెప్పుకుంటారు.1898 వ సంవత్సరంలో ఆమె తల్లి  ఎల్లెన్ విక్టోరియా చీక్ స్మార్ట్ , తన ఆరవ సంతానానికి జన్మనిస్తూ మరణించింది. ఆమెనూ, ఆమెకన్న చిన్నవాళ్లైన తమ్ముళ్లను పెంచి పెద్దచేయవలసిన బాధ్యత పూర్తిగా ఆమె తండ్రి విలియమ్‌ జాక్సన్‌ స్మార్ట్‌ పై పడింది. భార్యపోయిన వ్యక్తి పునర్వివాహం చేసుకునే అవకాశం ఉన్నా కూడా, సంసార సుఖానికి ప్రాముఖ్యతనివ్వకుండా తండ్రిగా తన పాత్రను నిర్వహించడానికే  సొనొరా తండ్రి విలియమ్ జాక్సన్ స్మార్ట్ ఇష్టపడ్డాడు. వ్యవసాయం చేస్తూనే ఆరుగురు బిడ్డలకీ తల్లి లేని లోటు తెలీకుండా పెంచాడు
     అప్పటికి  సొనారా కు పదహారు సంవత్సరాలు. ఒక్కతే ఆడపిల్ల, అందరు పిల్లల్లోకీ పెద్దదైన సొనారా తనకన్న చిన్నవాళ్లైన తమ్ముళ్లను పెంచడంలో తండ్రికి సంపూర్ణంగా సహకరించింది. పసిగుడ్డైన మార్షల్ ను తనే తల్లి తండ్రి అయ్యి పాలు పట్టటం, స్నానం చేయించడంజోల పాడి నిద్రపుచ్చటం వగైరా పనులన్నీ చేసి తల్లి పాత్రను అద్భుతంగా పోషించి, తమని కంటికి రెప్పలా కాపాడిన తండ్రిని సొనొరా దైవంలా భావించింది. ఆ తండ్రి రుణాన్ని తీర్చుకోవటం కోసం బాగా ఆలోచించింది . 1909 లో మదర్స్ డే నాడు చర్చిలో ప్రవచనాలను విన్న సొనారాకు తల్లిలాగే తన పిల్లల కోసం ఎంతటి త్యాగానికైనా వెనుకాడని తండ్రి కి సంబంధించి ఎలాంటి ఉత్సవం  లేకపోవడం బాధ కలిగించింది. తన తండ్రి మిగిలిన తండ్రులలా కాదు. తమ కోసం ఎంతో త్యాగం చేసిన మానవతా మూర్తి. అందుకే ఆయన జన్మదినాన్ని తండ్రులందరి జన్మదినంగా జరపాలని ఆమె అనుకుంది. వెంటనే ఆమె స్పోకన్ మినిస్టీరియల్ అలయన్స్ ని కలుసుకుని తన ఆలోచనను వారితో పంచుకుంది.తన తండ్రి పుట్టినరోజైన జూన్ ఐదవ తేదీనే ఫాదర్స్ డే గా జరుపుకోవాలని సూచించింది. ఈ పుట్టిన రోజు కేవలం తన తండ్రిదే కాదని, తండ్రులందరిదీ అనీ, సమాజం  లో తండ్రులు నిర్వహిస్తున్న పాత్రను మొత్తం ప్రపంచం తెలుసుకొనే రోజని, పిల్లలకి విలువలు నేర్పే రోజని, దీన్ని ఉత్సవం గా జరుపుకోవాలని కోరింది.  మదర్స్ డే వున్నపుడు ఫాదర్స్‌ డే ఎందుకు నిర్వహించరాదని ప్రశ్నించింది. అంతా నవ్వుకున్నా కూడా ఆమె ఫాదర్స్‌ డేగుర్తిం పు కోసం నిజాయితీగా తీవ్రంగా ప్రయత్నించింది . అప్పటికి ఉత్సవ సన్నాహాలకు తగినంత సమయం లేదన్న కారణంతో  జూన్ 5 వ తేదీ కాకుండా ,ఆ నెలలో మూడవ ఆదివారాన్ని స్పోకన్ మినిస్టీరియల్ అలయన్స్ ఫాదర్స్ డే గా నిర్ధారించింది. 1910 జూన్‌ 19వ తేదీన స్పోకన్‌లో తొలి ఫాదర్స్‌ డే జరుపుకున్నపుడు ఆమె అంతులేని ఆనందాన్ని పొందింది.
అంతకు ముందే 1907 లో వెస్ట్ వర్జీనియా లో గ్రేస్ గోల్డెన్ క్లేటన్ అనే మహిళ గని ప్రమాదంలో   తన తండ్రే కాక దాదాపు 250 మంది తండ్రులు ప్రాణాలు కోల్పోయినపుడు తనే కాక దాదాపు వెయ్యిమంది పిల్లలు తండ్రుల్ని కోల్పోవడాన్ని ప్రస్తావించి, ఆ తండ్రులందరి జ్ఞాపకార్ధం ఏటా  ఒక ఉత్సవం  జరుపుకోవాలని సూచించింది. ఈ సూచన వెంటనే కార్య రూపం దాల్చినా అనేక ఇతర కారణాల వల్ల తరువాతి సంవత్సరాలలో మళ్లీ జరుపుకోవడం తటస్థించలేదు.
       1910లో ఫాదర్స్ డే మొదటిసారిగా జరుపబడినా,1913 లో ఈ పండుగను జాతీయ పండుగగా గుర్తించేందుకు బిల్లు ప్రవేశపెట్టబడినా , 1930 వరకు దీనికంత ప్రాముఖ్యత లభించలేదు. చాలాకాలంపాటు  నగరవాసులు ఈ పండుగను , రకరకాల టై లూ, బహుమతులుగా ఇవ్వదగ్గ కళాకృతులూ  అమ్ముకునే వ్యాపారస్థుల స్వార్ధప్రయోజనాల కోసం ఏర్పాటయిన ఉత్సవంగా పరిగణించారు . పత్రికలూ ఎంతగానో పరిహసించాయి. కాలక్రమేణా 1980 నాటికి ఈ పండుగ విశిష్టతను గుర్తించి , ఫాదర్స్ డే అంటే క్రిస్టమస్ తర్వాత అంతటి పండుగగా భావించడం మొదలయింది. తల్లులను గౌరవించి ,వారి త్యాగాన్ని గుర్తించే మదర్స్ డే ని జాతీయ పండుగగా ఒప్పుకున్న ప్రభుత్వం అనేక దశాబ్దాల పాటు తండ్రులను, వారి సేవలను గుర్తించే ఫాదర్స్ డే ని జాతీయ పండుగగా ఒప్పుకోకపోవడం అన్యాయమంటూ శాసనసభలో నిరసన ప్రకటితమయింది. 1966 లో మొదటిసారిగా జూన్ మూడవ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్ధారిస్తూ ప్రెసిడెంట్  లిండన్ .బి జాన్సన్ ఒక ప్రకటన జారీ చేశారు.1972 లో ప్రెసిడెంట్ రిఛర్డ్ నిక్సన్ నేతృత్వంలో ఇది జాతీయ పండుగగా రూపుదిద్దుకుంది.
ఈ పండుగ పుట్టింది అమెరికా లోనే  అయినా త్వరలోనే అన్ని ప్రపంచ దేశాలకు పాకింది. అయితే ఈ పండుగ ఈనాటిది కాదనీ , నాలుగు వేల సంవత్సరాల క్రితమే ఎల్ముసు అనే బాబిలోనియన్ కుర్రవాడు తన తండ్రికి మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువుని కోరుతూ మట్టి పలకపై తన ఆకాంక్ష ను లిఖించిన ఆధారాలున్నాయనీ,  ఒక కథనం.
           ఏది ఏమైనా నేటి తండ్రులు భార్య గర్భం దాల్చిన దగ్గర్నించి ఆమెతో సమానంగా ఆమెను, ఆమె కడుపున వున్న బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రసవ సమయంలోనూ, ప్రసవానంతరం కూడా స్ర్తీతో సమానంగా ,ఒక్కొక్కసారి స్ర్తీకన్నా ఎక్కువగా పుట్టిన బిడ్డని సాకుతున్న తండ్రుల సంఖ్య గణనీయంగా పెరిగింది . కొన్ని చోట్ల పురుషునికి కూడా మెటర్నటీ లీవ్‌ లభించడం చూస్తే బిడ్డ పెంపకంలో నేటి తండ్రులు ఎటువంటి పాత్రను పోషించాలని కోరుకుంటున్నారో అర్థమవుతుంది. పెత్తనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా , ఇంటి పనుల్లో చేదోడు, వాదోడుగా ఉంటూ,పిల్లలకి స్నేహితుల్లా వ్యవహరిస్తున్న నేటి తండ్రులు పిల్లల భావోద్వేగాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు. స్త్రీలు కూడా కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా ఆర్థికంగా సంసారం నడపడంలో పాలు పంచుకుంటూండడం వల్ల ఆమె ఉద్యోగ రీత్యా, ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడినప్పుడు సంతోషంగా అదనపు బాధ్యతలు మోయడానికి ముందుకు వస్తున్నారు. సహనం, ప్రేమ, అనురాగం, అభిమానం అందించడం లోనూ, పిల్లల ఆలనా, పాలనా చూసుకోవడం లోనూ  తల్లులను మించిపోతు న్నారు. తరతరాలుగా పసి పిల్లల పెంపకం తల్లికి మాత్రమే చెందిన విషయంగా సమాజం భావించడం వల్ల  తల్లులు పాపాయిల విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలనేర్పరచుకుంటారు. తండ్రులు ఈ విషయంలో కొత్త దృక్కోణాన్ని కలిగి ఉండే అవకాశం, అది పాపాయి చక్కని ఎదుగుదలకి దోహదపడే అవకాశం లేకపోలేదు.
సామాన్యంగా తల్లి   పిల్లల పట్ల తనకున్న ప్రేమను వ్యక్త పరచినట్టుగా  తండ్రి వ్యక్తపరచలేడు. ముఖ్యంగా ఆ పిల్లలు ఆడపిల్లలైనపుడు మనసులో వారి పట్ల పొంగే అవ్యాజమైన అనురాగాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచడం అతనికి కష్టసాధ్యమౌతుంది. అలాగే మగపిల్లల విషయంలో కన్నా ఆడపిల్లల విషయంలో నేటి సమాజంలో, స్త్రీ పట్ల పెచ్చుపెరుగుతున్న హింసల నేపధ్యంలో తండ్రుల మనసుల్లో ఎన్నో భయాలు, బెంగలూ చోటుచేసుకుంటున్నాయి. కన్నబిడ్డలో తనను కన్న తల్లిని చూసుకునే తండ్రులు కూతురిపై అధికమైన ప్రేమని చూపించడం కూడా పరిపాటే. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెకు పెళ్లి చేసి పంపి ,ఆమె అత్తవారింటికి వెళ్లిపోయాక ఆ లోటుకి అలవాటు పడలేక చిక్కి సగమయ్యే తండ్రులు ఎందరో. ఎంతగానో వెతికి చూసి , ఎన్నో ఆరాలు తీసి అన్నిటికన్నా మంచి సంబంధం అనుకుని, పెళ్లి చేసి పంపాక , తన కూతురు అత్తవారింట్లో హింసకు గురౌతోందని తెలిస్తే ఆ తండ్రి గుండె పగిలి పోతుంది. పూర్వకాలంలో లాగా బతుకైనా చావైనా పెళ్లైన పిల్లకు అత్తవారింట్లోనే అనే ధోరణి నేటి తండ్రుల్లో తగ్గిందనే చెప్పాలి. ఆధునికకాలానికి తగినట్టుగా నేటి తండ్రులు తమ కూతుళ్లని,  తమని తాము కాపాడుకోగలిగేలా, ఎలాంటి సమస్యల్నైనా ధైర్యంగా ఎదుర్కోగలిగేలా , ఆర్ధికంగా ఎవరిమీదా ఆధారపడకుండా ఉండేలాగా పెంచుతున్నారు.
        ఆడపిల్లకు పెళ్లిచేసి పంపాక , కూతురింట్లో పుట్టింటివారు ఒక పూటకు మించి ఉండకూడదని భావించే ఒక తండ్రి కూతురికెన్నో సంబంధాలు చూసి, అన్నివిధాలా సరిపోయిన సంబంధాన్ని ఒకే ఒక్క కారణం వల్ల వదులుకుంటాడు. అదేమిటంటే పెళ్లికొడుకు ఇంటి కి వీధిలో అరుగు లేదని. అదేమిటని ప్రశ్నించిన వారికి , పిల్లని చూడకుండా వారం రోజులుకూడా ఉండలేను కదా, తరచుగా వెళ్లినపుడల్లా కాస్త నడుం వాల్చుకుందుకు వీధరుగైనా లేకపోతే ఎట్లా ? ’అని ప్రశ్నిస్తాడు. శకుంతలను అత్తవారింటికి పంపే సమయంలో కణ్వ మహర్షి అంటాడు...ఎవరిబిడ్డనో సాకిన నాకే కూతుర్ని అత్తవారింటికి సాగనంపే వేళ ఇంత బాధగా ఉంటే, తన రక్తం పంచుకు పుట్టిన కుమార్తెను అల్లుడికి అప్పచెప్పాలంటే ఆ తండ్రికి ఎంత బాధగా ఉంటుందో కదా అని.
కొన్ని కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టిందనగానే అదేదో భార్య చేసిన మహాపరాధంగా భావించి, ఆమెనూ, అప్పుడే పుట్టిన అభం శుభం తెలియని పసిపాపనూ హింసించే తండ్రులూ లేకపోలేదు. కూతురికీ కొడుకుకీ మధ్య వివక్ష చూపే వాళ్లూ , పరువుకోసం కూతురి ప్రాణాలు తీసేవాళ్లూ , పుట్టబోయేది ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యకి వెనుకాడని వాళ్లూ మన దేశంలో తక్కువేం కాకపోయినా కూతుర్ని ప్రాణాధికంగా ప్రేమించి , సర్వావస్ధల్లోనూ ఆమెకు అండగా నిలవాలని ప్రయత్నించే తండ్రుల సంఖ్యతో పోలిస్తే మాత్రం తక్కువే. అలాగే తల్లిదండ్రుల్ని వృధ్ధాప్యంలో నిర్లక్ష్యం చేసే కొడుకులతో పోలిస్తే , కన్నవారిని కడుపులో పెట్టుకునే కూతుళ్ళ సంఖ్య గణనీయమనే చెప్పాలి.
                      ‘ ముళ్ళబాటలో నీవు నడిచావు , పూలతోటలో మమ్ము నడిపావు
                     ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో, పరమాన్నం మాకు దాచి ఉంచావు
అంటూ తమ అభివృధ్ధి కోసం అనుక్షణం తాపత్రయపడిన తండ్రిని తలచుకుంటూ  పిల్లలు పాడే ఓ నాన్నా!నీ మనసే వెన్న , అమృతం కన్నా అది ఎంతో మిన్న అన్న సినారే సినీ గీతం ఆర్ద్ర భావాలను  చిందించే అమృత వర్షమంటే అతిశయోక్తి కాదు. డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు సంకలనం చేసిన అపురూప గ్రంథం 'మా నాన్నగారు'  పుస్తకంలో ఎందరో ప్రముఖులు వారి వారి జీవితాలను వారి తండ్రులెలా ప్రభావితం చేశారో చెపుతూ తమ బాల్యానుభూతులను పాఠకులతో పంచుకున్నారు.
       పిల్లలెప్పుడూ పెద్దలు చెప్పిన మాటల మీద కన్నా  వాళ్ల చేష్టలమీదే తమ దృష్టి నిలుపుతారు. పూర్వం పెద్దల్ని గౌరవించడం, అతిథులను ఆదరించడం, కష్టాల్లో ఉన్నవారికి సాయపడడం, గురువుల్ని పూజించడం, వృద్ధులకు ఆసరా అందించడం , నీతి మార్గంలో చరించడం ....ప్రతి వ్యక్తీ ఆచరించవలసిన ధర్మాలుగా పెద్దలు చెప్పేవారు, ఆచరించి చూపేవారు. ప్రతి తండ్రీ తాను నమ్మిన విలువల్నిపాటిస్తూ, తాను నడిచిన సన్మార్గంలో తన పిల్లలని కూడా నడిపించాలని ప్రయత్నించేవాడు. దాని ఫలితం ఆనాటి సమాజంలో కనిపించేది. నేటి పత్రికల్లో, టీవీల్లో రోజూ కనిపించే నేరాలూ, ఘోరాలూ, అవినీతి , అక్రమాలకు కారణాలన్వేషిస్తే మనకి ఇట్టే అర్ధమైపోతుంది , తండ్రికే లేని నైతిక విలువలు పిల్లలకు రావడం అసంభవమని. పూర్వం పిల్లల్లో నేరస్వభావం కనిపిస్తే తండ్రి వెంటనే వారిని సరిదిద్దేవాడు.ఇప్పుడు చాలా ఇళ్లలో ఆ పరిస్థితి లేదు.
     అయితే ఆ రోజుల్లో ఇంట్లో పిల్లల బహుముఖవికాసానికి అవసరమైన స్వేచ్ఛ లభించేది కాదు, స్నేహపూరిత వాతావరణం ఉండేది కాదు. కాస్త చనువిస్తే నెత్తినెక్కి తొక్కుతారనే భావంతో పిల్లల్ని ఆమడ దూరంలో నిలబెట్టేవారు నాటి తండ్రులు. ఇప్పుడున్నపరుగు పందాలు ఆనాడుండేవి కాదు. డబ్బుకంటే, కీర్తి ప్రతిష్టలకు ఎక్కువ విలువ లభించేది. ఆ నాటి తండ్రి కుటుంబానికి ఏ చిన్న అపకీర్తి వచ్చినా సహించేవాడు కాదు. అక్రమార్జనకు, అత్యాశకు, ప్రలోభాలకు గురికావడం ఆ నాటి తండ్రి స్వభావం కాదు.
నువ్వేది నాటావో దాని ఫలాన్నే నువ్వు కోసుకోగలుగుతావని ఒక ఆంగ్ల సామెత. తండ్రి ప్రవర్తనా తీరు, ఆలోచనా ధోరణి, భావోద్వేగాలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలు ప్రయోజకులైనా, అడ్డదారులు తొక్కినా  తండ్రి పెంపకమే మూలం అవుతుందంటారు సైకాలజిస్టులు. తండ్రి పాటించే విలువలే కుటుంబాన్నీ, సంఘాన్నీకూడా నిలబెడతాయన్నది దీర్ఘకాలపు పరిశీలన తర్వాత నిర్దారణ అయిన విషయం. దీన్నిబట్టి ఆరోగ్యకరమైన సమాజనిర్మాణంలో తండ్రుల పాత్ర ఎంత ప్రముఖమైనదో మనకర్ధమౌతుంది.
ఎంత ధనవంతులైనా సామాన్యమైన జీవితాన్ని అనుసరించాలని నేర్పిన మా నాన్నే నాకు స్ఫూర్తి. ఇంట్లో ఖరీదైన ఫంక్షన్‌లను ఏర్పాటు చేయడం మాకెవ్వరికీ ఇష్టం ఉండదు. సంపదను ఖర్చు చేయడమంటే.. విలువైన మానవ వనరుల్ని వృథా చేయడమేనని భావిస్తాను.అన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కుమారుడు రోహన్ ని చూస్తే, ఒక తండ్రి తన సంతానాన్ని ఎంతగా ప్రభావితం చేయగలడో అర్ధమవుతుంది.
   ఈ సంవత్సరం జూన్ నెల, పదహారవ తేదీన రాబోయే ఫాదర్స్ డే నాడు ,పిల్లల  అభివృధ్ధి , ఆనందం , సుఖశాంతులే తన జీవితాశయమన్నట్టు తపించి, వారిని సన్మార్గంలో నడిపించిన  తండ్రులందరికీ నివాళులర్పిద్దాం ! స్త్రీ హింస , లింగ వివక్ష లకు పాల్పడే తండ్రుల్లోనూ, తండ్రి నుంచి ఆస్తి పాస్తులనాశించి , వారి యోగక్షేమాలను మరచిన సంతానం లోనూ గుర్తించదగ్గ మార్పు రావాలని కోరుకుందాం. వారి ప్రవర్తనే వారి పిల్లలకు మార్గదర్శకమౌతుందని పెద్దలూ, పిల్లలూ కూడా గ్రహిస్తారని ఆశిద్దాం !