వారధి
హిమాలయాల్లోని శివాలిక్ పర్వత శ్రేణుల మధ్యగా ప్రవహించి ప్రవహించి, ఋషీకేష్ అంతటా వీచే పిల్లతెమ్మెరల్ని తన నీటి ఆవిరితో చల్లగా
మారుస్తూ, తళ తళ మెరుస్తూ, గల గల లాడుతూ ముందుకి సాగిపోతోంది గంగమ్మ.
మే నెల కావడంతో సాయంత్రం అయిదుగంటలు దాటుతున్నా ఇంకా చల్లబడలేదు
వాతావరణం.
రెండు తీరాల మీదా కనుచూపు సారినంత మేరా ఆలయాలూ, ఆశ్రమాలూ, ఇళ్ళూ, బజార్లూ సంధ్యా సమయపు అరుణ కాంతుల్లో వింతగా మెరుస్తున్నాయి!
రాజేశ్వరి కొడుకు కుటుంబం తో పాటు మౌనంగా నడుస్తోంది.
నదిలోని అలల్లాగే ఆమె మనసులోనూ ఆలోచనలు సుళ్ళుతిరుగుతూ సాగిపోతున్నాయి. తను
ఒంటరిదైపోయిందంటే ఇంకా నమ్మ బుద్ధి కావడం లేదు! ప్రభాకరం తోటే తనదైన
జీవితం అంతమైపోయింది! అతను వెళ్ళిపోయినా తన ప్రాణం ఇంకా వుంది!! ఆ పైవాడు తీసుకెళ్ళేదాకా తను బతకాల్సిందే! ఒక్కర్తే బతకలేదు గనక కొడుకు కుటుంబం లోకి చొచ్చుకు వెళ్ళి, అక్కడ తనకో స్థానాన్ని ఏర్పరచుకోవాలి. తనకంటూ కొంత స్థలాన్ని
ఆక్రమించుకోవాలి!
ఏడాది దాటి పోయినా అతని నిష్క్రమణం తాలూకు గాయం ఇంకా ఇంత పచ్చిగా
వుందేమిటి? లోపలికీ బయటికీ తిరిగే గాలి ఊపిరితిత్తుల్లో ఇంత కల్లోలం
సృష్టిస్తోందేమిటి?
తన పక్కనే నడుస్తూ ఎస్సెల్లార్ కెమేరాతో ఫొటోలు తీసుకుంటున్న మైథిలి
తన కోడలు! విజయ్ పక్కనే నడుస్తూ గలగలా కబుర్లు చెపుతున్న పన్నెండేళ్ళ సుమన్ లా
ప్రకారం తన మనవడు! వాళ్ళు ఏడాది కోసారి వచ్చి తమతో వారమో, పదిరోజులో ఉండి వెళ్ళడానికీ, తనదైన ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ జీవన స్రవంతిలో కలిసిపోయి జీవించడానికీ
ఎంత తేడా! దీనికి తనెలా సర్దుకోగలదు?
తననిలా వదిలెసి వెళదామనుకున్న వ్యక్తి కనీసం తన జీవిక కవసరమైన చిన్న
చిన్న పనులు కూడా నేర్పకుండానే హఠాత్తుగా మాయమైపోయాడేమిటి?
"అమ్మా!మీరిక్కడే నిలబడండి..బోట్ టికెట్లు తీసుకొస్తా "ఆగి
తల్లి భుజాన్ని సుతారంగా తట్టి వెళ్ళాడు విజయ్.
"నాన్నా! నేనూ రావచ్చా?"అంటూ వెనకే వెళ్ళాడు సుమన్.
ఒక్క క్షణం ప్రభాకరం వెనక పరుగెత్తే చిన్నారి విజయ్ గుర్తొచ్చాడు
రాజేశ్వరికి. నిలుచున్న చోటు నుంచే మైథిలి వైపు చూసింది.కెమేరా అడ్జస్ట్ చేసుకుంటూ
నదిలో కదులుతున్న పడవల ఫొటోలు తీసుకుంటోందామె. ఆ ఫొటోలు దగ్గర పెట్టుకుని
పెయింటింగ్స్ చేస్తుంది! ఎంత ఆర్టిస్టయితే మాత్రం పవిత్రమైన గంగా హారతి కోసం
వెళుతూ ఆ పాంటూ షర్టూ ఏమిటి? ఆ జుట్టేమిటి?
టికెట్లు తీసుకుని విజయ్ వచ్చాడు. ముందుకి నడిచి బోటు ఆగే చోటికి
చేరారు. క్యూలో ముందున్న జనం ఎక్కేసరికి బోటు నిండింది. అయ్యో అనుకుంది రాజేశ్వరి. ఇంతలోనే అటునించి ఇంకో పడవ రావడం జనం
బిలబిలా దిగిపోవడం జరిగాయి. ఖాళీ పడవ లోకి నలుగురూ ఎక్కారు.
"ఇక్కడ కూచుందాం" అంటూ తనకి నచ్చిన చోటికి
పిలిచాడు సుమన్. వాడికళ్ళనిండా ఉత్సాహం.
ఎదురుగా కనిపిస్తున్న రాం ఝూలా వాడి దృష్టి నాకర్షించింది.
"నాన్నా! దీనికి పిల్లర్లు లేవేమిటి? ఇంత పొడుగున్న వంతెన పిల్లర్లు లేకపోతే పడిపోదా?" అడిగాడు.
"పండూ! వచ్చేముందు నీకేం చెప్పాను? ఇంటర్నెట్లో మనం వెళ్ళే చోటు గురించి అన్నీ చదవాలని చెప్పానా లేదా?" అన్నాడు విజయ్ నవ్వుతూ.
వాడు చిలిపిగా నవ్వాడు. "చూశాను నాన్నా! అదీ ..సస్పెన్స్షన్ బ్రిడ్జి..నదిలో పడవల ప్రయాణానికి
అస్సలు అడ్డం లేకుండా మనుషులు హాయిగా అటునించి ఇటూ, ఇటునించి అటూ వెళ్ళడానికి పనికొచ్చే వంతెన ఇది! దానికి అటూ ఇటూ పెద్ద
టవర్స్ వున్నాయి చూశారా? వాటి నించీ వేళ్ళాడే సపోర్ట్ కేబుల్సూ, వాటికి ఎటాచ్ చేసిన చిన్నకేబుల్సూ వంతెన పడిపోకుండా ఆపుతాయి!"
విజయ్ వాడి ఉంగరాల జుట్టు వేళ్ళతో చెరుపుతూ "దొంగా"
అన్నాడు.
రాజేశ్వరి మైథిలివైపు చూసింది. కొడుకు వంక చూస్తున్న ఆమె కళ్ళలో ఏదో
మెరుపు. వెంటనే చూపు తిప్పుకుంది రాజేశ్వరి.
"మనం వెనక్కొచ్చేటపుడు రాం ఝూలా మీంచి వస్తాం కదా!"అడిగాడు
మళ్ళీ.
విజయ్ అవుననగానే పిడికిలి బిగించి 'య్యెస్ ' అంటూ ఓ ఎక్స్ ప్రెషనిచ్చాడు.
చూస్తూండగానే బోటు నిండింది. ఎదురు బల్ల మీద కూర్చున్నవాడు కాస్తా లేచొచ్చి విజయ్ కీ, రాజేశ్వరికీ మధ్య కూర్చుంటూ "మామ్మా! రేపు మాతో రాఫ్టింగ్ కి
మీరూ రావాలి" అన్నాడు.
"లేదు నాన్నా! రేపు మీరు ముగ్గురూ వెళ్తారు.
పొద్దున్నే నీలకంఠేశ్వర స్వామి దర్శనానికి వెళ్తాం కదా! తర్వాత నేను గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాను. మీరేమో రివర్
రాఫ్టింగుకి వెళ్తారు. మీరు తిరిగొచ్చాక గంగా స్నానానికి వెళ్తాం అందరం!" అంది
రాజేశ్వరి.
వాడు రాజేశ్వరి చేతి మీదికి వాలిపోతూ "మామ్మా ప్లీజ్! మీరూ రావాలి మాతో" అన్నాడు.
రాజేశ్వరి వాడి మాటలకి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా బోటు బయటికి చూస్తూ
ఉండి పోయింది. పడవ నిండా జనం ఉన్నా ఎవ్వరూ మాట్లాడడం లేదు. ఎటు చూసినా సంధ్యా
సుందరి వయ్యారాలు పోతూ వుంది. ప్రతి దృశ్యం వైబ్రంట్ గా, అందంగా, పవిత్రంగా కనిపిస్తోంది. రాజేశ్వరి మనసంతా ఆవరించిన ఒంటరితనం వల్ల ఆ
దృశ్యాల్లోని సౌందర్యంలో కూడా విషాద ఛాయలు అలముకున్నట్టే తోచింది.
తనూ భర్తా ఒకరికొకరుగా జీవిస్తున్నపుడు ఏ సమస్యా తననంతగా బాధించలేదు.
ఒక్కడే కొడుకు. వాడిని పెంచి పెద్ద చేశారు. చదువూ సంధ్యా చెప్పించారు. తమకెంత
నచ్చకపోయినా వాడిష్టపడ్డ పిల్లని చేసుకుందుకు ఒప్పుకున్నారు. వాడి జీవితం వాడిది
అనుకున్నారు. ఎక్కడో సముద్రాల కవతల వాడూ, వాడి కుటుంబం….ఆ అమ్మాయి వాడి భార్య గానే తనకి కనిపిస్తుంది. తన
కోడలుగా ఎప్పుడూ అనిపించదు.
పొడుగాటి జడా, పచ్చగా మెరిసిపోయే శరీరం, కలువరేకుల్లాంటి కళ్ళూ, సంప్రదాయ కుటుంబం నించి వచ్చిన నీలిమని కోడలుగా చేసుకోవాలని తనెంతో
కోరుకుంది. ఆరడుగుల పొడుగూ, కోటేరేసిన ముక్కూ, వెన్నెల్లా నవ్వే విజయ్ బాబుకి తగిన పిల్ల అసలు దొరుకుతుందా
అనుకుంటుంటే నీలిమా వాళ్ళు పక్కింట్లోకి అద్దెకొచ్చారు. తను కోరుకున్నవన్నీ ఆ పిల్లలో కనిపించాయి. ఏం లాభం? అప్పటికే వాడి మనసులో మైథిలి తిష్ట వేసుకుంది. ప్రభాకరం కూడా ‘వాడికి నచ్చిన పిల్లని చేసుకోనీ’ అని తనని ఒప్పించారు. తాము ఒప్పుకోక పోయినా వాడు ఆ అమ్మాయి నే చేసుకునే వాడేమో! ఒప్పుకుని మర్యాద నిలుపుకున్నారు తామిద్దరూ.
ఒక్కడే కొడుకయినా వాడి కుటుంబం దూరంగా వుండడానికి తను అలవాటు పడిపోయింది.
ప్రభాకరం తననెంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ రోజుల్లో ఒకరు వెళ్ళిపోయి రెండోవారు
ఒంటరిగా మిగిలిపోతే ఏమవుతుందో అన్న ఆలోచనే తన మనసులోకి రాలేదు. ఎప్పటికీ తామిద్దరూ
కలిసే వుంటారన్నట్టుగా జీవించింది.
పరాకుగా కూర్చున్న తల్లినీ ఆవిడ మీదకు వాలిపోయి బతిమాలుతున్న సుమన్
నీ చూస్తూ ఆలోచనలో పడ్డాడు విజయ్. ముప్ఫై ఎనిమిదేళ్ళ దాంపత్య జీవితం వాళ్ళది.
ప్రభాకరం ఉన్నన్నాళ్ళూ రాజేశ్వరికి బయటి విషయాలేవీ తెలుసుకోవలసిన అవసరం రాలేదు.
ఆయన ఇష్టాయిష్టాలూ, అవసరాలూ
గమనించుకుంటూ, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆవిడా, ఆవిడ సరదాలు కొద్దో గొప్పో తీరుస్తూ, ఆవిడకవసరమైనవాటన్నిటికీ ఏర్పాటు చేస్తూ ఆయనా జీవించారు. తనకన్నా
పదేళ్ళు చిన్నదైన రాజేశ్వరిని చిన్నపిల్లలాగా ట్రీట్ చేస్తూ, సంఘంలో ఆవిడ గౌరవానికి భంగం రాకుండా చూసుకునేవారు ప్రభాకరం గారు.
ఒక ఆదివారం మధ్యాహ్నం భోజనాల వేళ తలనెప్పి ఎక్కువగా వుందనీ, అన్నం తినాలని లేదనీ ఆయన పడుకుంటే 'మీకు ఆకలి వేస్తున్నా తెలీదు. కాస్త పెరుగన్నం తినండి ..అదే తగ్గుతుంది ' అని బలవంతాన తినిపించింది రాజేశ్వరి. తిన్న కొద్ది సేపటికే వాంతి
చేసుకుని మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు ప్రభాకరం. మాసివ్ హార్ట్ ఎటాక్ అన్నారు.
కొడుకు కుటుంబంతో కబుర్ల కాలక్షేపం కోసం సంపాదించిన కంప్యూటర్ పరిజ్ఞానం అన్ని రకాల సైట్స్ లోనూ గుండెపోటుల గురించి చదివి
భర్తని చేజేతులా తనే చంపుకుందని నమ్మేందుకు పనికొచ్చింది.
అప్పటినించీ రాజేశ్వరిలో చాలా మార్పొచ్చింది. తిండిమీద ఆసక్తి
పోయింది. కొద్దినెలల్లోనే బరువు సగానికి తగ్గిపోయింది. ఎవరితోనూ మాట్లాడకుండా
నిస్సత్తువగా రోజు గడిపేస్తూ దగ్గరివాళ్ళెవరైనా
వచ్చి పలకరిస్తే భర్తని తన మూర్ఖత్వం వల్ల ఎలా చంపుకుందో వివరిస్తూ, అతను వెళ్ళిపోయాక తను బతకడంలో అర్ధం లేదన్నట్టు మాట్లాడుతూ అదో
ధోరణిలో పడిపోయింది.
అప్పటివరకూ తనకి మార్గదర్శకుడుగా ప్రభాకరం వుండడంతో రాజేశ్వరి
ఎప్పుడూ భవిష్యత్తు గురించి పెద్దగా ఆలోచించ లేదు.. వంటకి ఆధరువులూ, రాబోయే పండక్కి కొనవలసిన బట్టలూ, సరుకులూ, దగ్గర్లో వున్న శుభకార్యాలకి చెయ్యల్సిన ప్రయాణాలూ, ఇవ్వాల్సిన బహుమతులూ ...ఇవే ఆవిడ భవిష్యత్తు గురించిన ఆలోచనలూ, ప్రణాళికలూ ! భర్త చుట్టూ అల్లుకున్న జీవితం తప్ప ఆవిడకే సొంతమైన జీవితం ఏమీ లేదు.
హఠాత్తుగా ఆయన నిష్క్రమించేసరికి పిడుగుపాటుకి చెట్టు మాయమైతే దానినల్లుకున్న
తీగలా కుప్పకూలిపోయిందావిడ. ఈ విషయం అర్థం కాగానే విజయ్ మనసు బరువెక్కి పోయింది. తండ్రి
చిన్నపిల్ల లాగా పరిగణించిన రాజేశ్వరి అతనిక్కూడా చిన్నపిల్ల లాగే కనిపించింది.
ఆమెని జాగ్రత్తగా సాకాలని, మళ్ళీ ఆమె అరోగ్యంగా తిరిగేలా చూసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు.
మైథిలితో అతనికి చదువుకునే రోజులనించీ స్నేహం.
స్నేహితులనేర్పరచుకునేటపుడు ఎవరైనా
సాధారణంగా రూపురేఖలకన్నా మనస్తత్వానికీ, అనుకూలతకీ ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. వేవ్ లెంగ్త్ కలవక పోతే
గాఢమైన స్నేహం కుదరదు. అదే పెళ్ళిదగ్గరకొచ్చేసరికి రూపురేఖలూ, ఆస్తీ అంతస్తులూ, కులగోత్రాలూ ముఖ్యమౌతాయి. విజయ్ కి మైథిలితో స్నేహం అలాగే మొదలైంది. దృఢమైన వ్యక్తిత్వం, అచంచలమైన ఆత్మ విశ్వాసం, పరవళ్ళు తొక్కే ఉత్సాహం, జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోగల నేర్పు సొంతం చేసుకున్నట్టు కనిపించే ఆమె కేవలం స్నేహితురాలిగా ఉన్న రోజుల్లో, రాజేశ్వరి అతని పెళ్ళి ప్రస్తావన వచ్చినపుడల్లా తన
అందమైన కొడుక్కి కాబోయే భార్య, తన ఒక్కగానొక్క కోడలు ఎలా వుండాలో చెప్తూ ఉండేది. అతను నవ్వుతూ వినే వాడు. అప్పుడతనిక్కూడా ఆ లక్షణాలు నచ్చేవి.
మంచి
ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఇండియా వచ్చినపుడల్లా పెళ్ళిచూపులకి వెళ్ళడం ఎవరూ
నచ్చక వెనక్కి వెళ్ళిపోవడం జరిగేది. అప్పుడే అతనికి తన జీవన సహచరి ఎలా వుంటే
బావుంటుందో అర్థమైంది. పెళ్ళి వేళ దగ్గరికొచ్చేసరికి అతనికి
మైథిలి తప్ప ఎవరూ నచ్చలేదు. ఆమెతో జీవితం ఎప్పటికీ విసుగనిపించదని అతనికనిపించింది. మైథిలి కూడా తన గురించి అలాగే అనుకుంటోందని తెలిసి అతని మనసు ఎగిరి
గంతేసింది. తామిద్దరి మధ్యా ఏర్పడిన అనుబంధం చాలా అరుదైనదనీ, లక్షల్లో ఒకరికి దొరికే భాగ్యమనీ తోచడంతో తల్లిదండ్రులిద్దరికీ
నచ్చకపోయినా వాళ్ళని అయిష్టంగానైనా ఒప్పించి మైథిలిని పెళ్ళిచెసుకున్నాడు విజయ్.
తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ వున్నా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా
పెళ్ళిచేసుకోవలసి రావడం, తన భార్య తల్లికి దగ్గర కాలేకపోవడం విజయ్ ని కొంత కలవర పెట్టక పోలేదు. దానికి తోడు పెళ్ళయిన రెండేళ్ళకి మైథిలికి పిల్లలు పుట్టరని తెలిసింది! ఆ విషయాన్ని జీర్ణించుకుందుకు ఇంకెవరైనా అయితే ఎంత ప్రయాసకి
గురయ్యేవారో! కొద్దివారాల్లోనే తను ఆ దెబ్బ నించి కోలుకుంది. తర్వాత తనతో విపులంగా
మాట్లాడాలని వుందనీ, ఒక రోజంతా చర్చించుకుందామనీ అడిగింది. ఆరోజు తనకి స్పష్టంగా గుర్తుంది.
ఎంత సూటిగా ఈ విషయం గురించి మాట్లాడింది! సమస్య ఇదీ, 'నీ
రక్తం పంచుకు పుట్టిన పిల్లలే నీకు కావాలంటే నువ్వు మరో పెళ్ళి చేసుకుందుకు వీలుగా నీతో విడి పోవడానికి సిద్ధంగా వున్నా’నంది. నీ స్నేహాన్ని మించింది నాకేదీ లేదని తనంటే 'వుయ్ కెన్ రిమెయిన్ ఫ్రెండ్స్' అంది. ఆ మాటలకి తనామెని కొట్టినంత పని చేశాడు. తమ దాంపత్య జీవితంలో
చిన్నపాటి ఒడిదుడుకులేమైనా వుంటే అవి ఆ కొద్దికాలంలో ఎదురయినవే. అతి త్వరలోనే తామిద్దరూ కోలుకున్నారు. సుమన్ ని దత్తత
తీసుకున్నారు! ఇప్పుడు వాడు తమ రక్తం పంచుకు పుట్టిన సంతానం కాదనే ఊహే రాదు !
ఈ పెళ్ళితో విజయ్ ఎప్పుడో ఒకప్పుడు చాలా అసంతృప్తికి లోనవుతాడనీ, అప్పుడు చెయ్య గలిగిందేమీ ఉండదని రాజేశ్వరి భయపడింది. తాను ఎంపిక చేసిన పిల్లయితే విజయ్ ఇంకా ఎంతో సంతోషంగా వుండేవాడని
అనుకుంటూ, భర్తతో వాదిస్తూ వుండేది. మైథిలికి పిల్లలు పుట్టరని తెలిశాక
తననుకున్నంతా అయ్యిందని బాధపడింది.
మనసు సర్దుకుని ‘పోనీలే
టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నిస్తారేమో’ అనుకుంది గాని, ఇలా
అనాథ పిల్లవాడిని దత్తత చేసుకుంటారని అనుకోలేదు. కొడుకు విషయంలో అనుకున్నవేవీ
జరక్క పోవడంతో తనని తాను మానసికంగా అతని కుటుంబం నించి విడదీసుకుంది రాజేశ్వరి. పైకి అంతా సవ్యంగా కనిపించినా మైథిలిని ఆవిడ మనసుకి దగ్గరగా
రానివ్వలేదు. మనవడిని హృదయానికి హత్తుకోలేదు. ప్రభాకరానికి మరింత దగ్గరగా జరిగి
అతని తోడిదే లోకం అనుకుని ఆ జీవితానికి అలవాటు పడిపోయింది.
పడవ ఒడ్డుకి చేరేసరికి ఆలోచనా స్రవంతి ఆగింది. నలుగురూ కిందికి దిగి
పరమార్థ నికేతన్ వైపు దారి తీశారు. సుమన్ మామ్మ చెయ్యి పట్టుకున్నాడు.
రాజేశ్వరికి విజయ్ చిన్నతనం గుర్తొచ్చింది. వాడు పసివాడుగా ఉన్నపుడు
తల్లి తన చెయ్యి పట్టుకోవడం వాడికి నచ్చేది కాదు. ఎక్కడైనా తప్పిపోతాడేమో అని
చెయ్యి పట్టుకోబోతే విదిలించేసేవాడు 'అయామె బీగ్ బాయ్' అంటూ. అపుడు తను
"నువ్వు బిగ్ బాయ్ వి కదా! నేనేమో ముసలిదాన్నైపోతున్నా. సరిగ్గా నడవ గలనో
లేదో! నా చెయ్యి పట్టుకు నడిపి స్తావా ప్లీజ్?"అనడిగేది.
అపుడు వాడు తన చెయ్యి గట్టిగా పట్టుకుని నడిచేవాడు! సుమన్ చెయ్యి ఇవాళ చిన్నప్పటి విజయ్ చెయ్యిలాగే అనిపిస్తోంది!
దారికటూ ఇటూ ఎన్నో షాపులు. వాటి నిండా రంగు రంగుల కళాకృతులు..పూసలతో, సెమీ ప్రెషస్ స్టోన్స్ తో చేసిన గాజులూ, గొలుసులూ. ఇలా ఎక్కడికెళ్ళినా ప్రభాకరం తనతో ఓపిగ్గా ఆ షాపుల్లోకి
వచ్చేవారు. తనకి నచ్చినవేవో కొనివ్వడంలో ఆనందాన్ని పొందేవారు. రాజేశ్వరి కళ్ళు
చెమ్మగిల్లాయి.
మరికొంత దూరం నడిచి పరమార్థ నికేతన్ చేరారు. భక్తులూ, ఆధ్యాత్మిక సాధన కోసం వచ్చే వారికోసం దాదాపు వెయ్యి గదులతో, పూల మొక్కలూ, మందిరాలతో విశాలంగా ఉన్న ఆశ్రమ వాతావరణం వారిని సాదరంగా
ఆహ్వానించింది. పురాణాల్లోని రకరకాల సన్నివేశాల తాలూకు శిల్పాలు చూస్తూ సుమన్
అడిగే ప్రశ్నలకు విజయ్, మైథిలీ సమాధానాలు చెపుతుంటే రాజేశ్వరి వయసు మళ్ళిన స్త్రీలు, ముఖ్యంగా వితంతువులు కూర్చుని ప్రశాంతంగా భజన చేయడాన్ని గమనించి ఆగిపోయింది.
ఇలాంటి చోట ఉండిపోతే?
"అమ్మా! కొంచెం ముందుగా వెళ్ళి గంగ ఒడ్డున కూర్చుంటే బావుంటుంది. తర్వాత
ప్లేస్ దొరకదు" విజయ్ మాటలకి తెప్పరిల్లి అతని వెంట అడుగులేసింది. అంతా ఆశ్రమ ద్వారం
దాటి బయటికి వచ్చారు.
ఎదురుగా గంగా తీరానికి ముఖద్వారం లాగా అందమైన కమాను. దాని మీద
కృష్ణార్జునుల రధం! ఎంత అందంగా, శోభాయమానంగా తయారుచేశాడో ఆ శిల్పి! ఈ కమాను వల్ల, ఆ వెనక ప్రవహిస్తున్న గంగా మాత, జీవంతో పరవళ్ళు తొక్కుతూ, అందమైన చట్రంలో బిగించిన చిత్రంలా దృష్టి పధంలో ఇమిడిపోయింది!
ఆ నీటి మధ్యగా, నదీ
జలాల్లోంచి పైకి ఉద్భవించిన హిమ నగంలా తెల్లని మహాశివుని ప్రతిమ... జీవకళతో
మెరిసిపోతోంది! కమాను నుండి నది వరకూ సాగిన వెడల్పాటి మెట్లు! మంత్ర ముగ్ధలా
నిలబడిపోయింది రాజేశ్వరి.
"నాన్నా! ఇక్కడ చూడు మైటీ హనుమా! ఎంత పెద్ద స్టాట్యూనో చూశావా?" ఆశ్చర్యంగా అరిచాడు సుమన్.
"మనూ! ఇక్కడ మాట్లాడకుండా ఉండి ఈ వాతావరణాన్ని
ఫీల్ అవాలి మనం! చెప్పులు స్టాండ్ లో పెట్టి, ఇక్కడ మెట్ల మీద కూర్చుని, స్వామీజీ నిర్వహించే హవన్ కార్యక్రమాన్ని చూడాలి! ఆ శ్లోకాలు, స్తోత్రాలూ, ఆ మంత్ర పఠనం వల్ల ఈ వాతావరణమంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి.
మౌనంగా ఆ కంపనాలని ఫీల్ అయినపుడే మన శరీరంలో జరిగే అద్భుతాన్ని మనం ఎక్స్
పీరియెన్స్ చెయ్యగలుగుతాం! సరేనా?" అన్నాడు విజయ్ మృదువుగా.
వాడు నాగస్వరం విన్న నాగుపాములా తలూపాడు. నలుగురూ
వెళ్ళి ఆఖరి మెట్టుమీద నిలబడి చల్లని నీటితో కాళ్ళూ, చేతులూ, కళ్ళూ
కడుక్కుని కొద్దిగా పైకి నడిచి, మెట్టు మీద కూర్చున్నారు.
అప్పటికే అక్కడ హవన్ జరుగుతోంది. దాదాపు పాతిక మంది బాల వటువులు వేద పఠనం
చేస్తున్నారు.
గంగమ్మ పాదాల మృదు పద ధ్వని ఒక వైపు, ఏక కంఠంగా సాగుతున్న మంత్రోచ్ఛారణ మరోవైపూ! రాజేశ్వరి పక్కనే విజయ్, కింద మెట్టు మీద మైథిలీ, సుమన్ కూర్చున్నారు.
ఆ ప్రాంతమంతా ఎంతో పరిశుభ్రంగా అలంకరించబడి ఉంది.
ఎదురుగా గంగానదీ ప్రవాహం...ప్రవాహం మధ్యలో అర్థ చంద్రాకారపు వంతెన లాంటి నిర్మాణం
మీద ఎత్తుగా మహా శివుడు ధ్యాన మగ్నుడై ఉన్న శిల్పం.. ఆ వాతావరణం తనలోని బాధనీ, దిగులునీ, భయాలనీ చేత్తో తీసి పారేస్తున్నట్టనిపించి, మెల్లగా కళ్ళు మూసుకుంది రాజేశ్వరి. శృతిపక్వమైన
గొంతులనేకం కలిసి చేస్తున్న శ్లోక పఠనం తాలూకు ప్రకంపనలు ఆమె శరీరం లోకి
చొచ్చుకుపోయి, లోపల ముడులు ముడులుగా చుట్టుకుపోయిన చికాకులనీ, గుబుళ్ళనీ వదులు చేసి, సాపుచేసి, కనిపించని రోగాన్ని నయం చేసినట్టనిపించింది! మెల్లగా కళ్ళు తెరిచింది.
తను భూమి మీదే వుందా? తన మనసింత హాయిగా ఆహ్లాదంగా ఎలా అయింది? దాదాపు గంటసేపు ఆ అలౌకికానుభావాన్ని అనుభూతిస్తూ, ఆ తరంగాలని ఆస్వాదిస్తూ ఉండిపోయింది రాజేశ్వరి.
కాసేపటికి అత్యంత మార్దవమైన కంఠంతో స్వామీజి ప్రసంగం మొదలయింది ….పర్యావరణాన్ని, ముఖ్యంగా ప్రాణికోటి జీవం నిలిపే పవిత్ర గంగా జలాలని ఎలా నిర్మలంగా
వుంచుకోవాలో, మన వారసత్వ సంపదలనెలా కాపాడుకోవాలో గంభీరంగా చెప్పుకుపోతుంటే మంత్ర
ముగ్ధులైన అశేష ప్రజానీకంలో తనూ
ఒకతెగా వింటూండిపోయింది.
నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ
భాస్వరా
నీవారశూక వత్తన్వీ పీతాభాస్వత్యణూపమా
తస్యా శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత:
అందరిలోనూ అత్యంత సూక్ష్మ రూపాన నిలిచి ఉన్న పరమాత్మ
ఆ క్షణాన తన కళ్ళకు కనిపిస్తున్నట్టనిపించింది. అందరిలోనూ ఆ పరమాత్మ ఉన్నట్టయితే
ఒక్క వ్యక్తి మరణం తననింత దుఖ సముద్రంలోకి నెట్టేయడమేమిటి?
ఆ విశాల ప్రాంగణాన్నీ, గంగా నది ఉపరితలాన్నీ ఆవరిస్తున్నట్టుగా మధురమైన గానం మొదలయింది…కిందకి
ఉన్న విశాలమైన చప్టా మీద కొంత మంది మైమరచి నాట్యం చేస్తున్నారు !
సంధ్యా సమయమయింది. వరసగా మెట్ల మీద అమర్చిన ఇత్తడి
దీపపు సెమ్మెల్లో దీపాలు వెలిగించారు! ఏక కంఠంగా గాన లహరి
సాగింది. చీకట్లు ముసురుతున్న కొద్దీ ఎదురుగా ఉన్న మహాశివుని రూపం మరింత తెల్లగా
ప్రకాశమానంగా అయి మనసులోని దుఖాన్నంతటినీ
తనలో లయం చేసుకుంటున్నట్టనిపించింది !
తీరం కనిపించినంత మేరా చూపు సారించింది.కనీసం వెయ్యిమంది జనం వుండి
ఉంటారక్కడ..అయినా ఆ శ్రావ్యమైన గానం మినహా ఎంతటి నిశ్శబ్దం ! మెట్లెక్కి హారతి అందుకుంటోందా గంగమ్మ అన్నట్టు రెండు
మూడు మెట్ల పైదాకా వచ్చింది నీటి మట్టం.
చేతుల్లో దీపపు సెమ్మెలతో, పళ్ళేలలో ప్రమిదలతో
స్వామి శిష్యులంతా గంగమ్మకు హారతులిచ్చారు. ఒకరినుంచి మరొకరికి దీపాలు చేతులు మారాయి. ఎవరో రాజేశ్వరి చేతికి
అందించారు దీపమున్న పళ్ళేన్ని. తిరిగి దీపాలన్నీ శిష్యుల చేతుల్లోకి చేరాయి.
కార్యక్రమం ముగిసింది. అంతా హోమ భస్మాన్ని బొట్టుగా ధరించి నిశ్శబ్దంగా
వెనుదిరిగారు.
అప్పటికి దాదాపు ఎనిమిదయింది. మెల్లిగా వచ్చిన దారినే వెనక్కి నడిచి
రాం ఝూలా వంతెన చేరారు. సుమన్ గంతులేస్తూ ముందుకి పరుగెత్తాడు.
"నాన్నా!
ఈ వంతెన ఉయ్యాలలా ఊగుతోంది చూశారా?" ఆశ్చర్యంగా అడిగాడు .
"అందుకే
మరి దీన్ని ఝూలా అన్నారు!"నవ్వుతూ చెప్పాడు విజయ్.
ఒక అలౌకిక అనుభూతి పొందినట్టు జనమంతా దాదాపు మౌనంగా ఝూలా మీద నడిచి
పోతున్నారు. ఆ వొడ్డునుంచి ఈ వొడ్డు చేరడానికి పదినిముషాలు పట్టింది.
ఆ దరి, ఈ దరినీ కలిపే అందమైన వంతెన కన్నా
మనుషులనే
ఏకం చేసే మమతల వారధి మిన్న!
మానవతా భావం పెంచే మార్గమే మన లక్ష్యం
మనసుల్లో శాంతిని
పంచే ప్రతి యత్నపు ఫలితం… హర్షం!
చల్ల గాలిలో విజయ్ పాట హాయిగా చెవికి సోకింది. తననుద్దేశించే
పాడుతున్నాడా అనుకుంది రాజేశ్వరి.
రాత్రి
పడుకుంటే ఎంతోకాలం తర్వాత హాయిగా నిద్ర పట్టింది.
మర్నాడు
అయిదుగంటలకే లేచి స్నానాదులు ముగించుకుని ఆరింటికల్లా టాక్సీ ఎక్కి
నీలకంఠేశ్వరాలయానికి ప్రయాణమయ్యారు. ప్రభాత కిరణాలలో కొండ దారి కటూ ఇటూ చెట్ల
ఆకులు మెరిసి పోతున్నాయి. కారు పైకెక్కుతున్నకొద్దీ పర్వత శ్రేణులు రకరకాల ఛాయల్లో ఆకుపచ్చగా, నీలి పచ్చగా, లేత నీలంగా కనిపిస్తూ
కనువిందు చేస్తున్నాయి. వదిలించుకు పోతున్నా వెంట పడే అల్లరిపిల్లలా గంగానది ఎంత
దూరం వెళ్ళినా తమ వెంటే వస్తున్నట్టనిపించింది. అద్భుత సౌందర్య రాశిలా ఆకట్టుకుని
కళ్ళుతిప్పుకోనివ్వలేదు. గంటన్నర ప్రయాణం తర్వాత నీలకంఠుని ఆలయం చేరి దర్శనం
చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
సుమన్ మళ్ళీ మొదలు పెట్టాడు "మామ్మా! ప్లీజ్..మీరూ రండి
మాతో రాఫ్టింగ్ కి…చాలా బావుంటుంది ! చాలా సేఫ్..మేం
ఇదివరకు వెళ్ళాం !" అంటూ.
"నేను రాఫ్టింగూ, జంపింగూ చెయ్యలేను
నాన్నా! నువ్వూ, అమ్మ, నాన్నా వెళుదురుగాని " అంది రాజేశ్వరి.
"మరి గంగా హారతికి నేను రాలా? రాఫ్టింగ్ కి మీరూ
రావాలి. మ్యూచువల్ కో ఆపరేషన్!" అన్నాడు.
రాజేశ్వరికి
నవ్వొచ్చింది.
"నది
మీద బోట్ లో వెళ్ళడం, రాం ఝూలా మీద నడవడం నీకిష్టం గనక వచ్చావు! నా కోసం వచ్చావా?"అంది సరదాగా.
"ఏంకాదు.
అంత సేపు ఆ హారతిలో కూచోవడం ఏం బావుందీ? నదులకీ, కొండలకీ
హారతులిస్తారా ఎక్కడేనా? అమ్మా నాన్నా మీతో
వచ్చారు గనక నేనూ రావల్సొచ్చింది! నాన్న ఎప్పుడూ చెప్తారు మనం ఫామిలీ కనక
ఒకళ్ళకోసం ఒకళ్ళు కొన్ని పనులు ఇష్టం లేకపోయినా ప్రేమతో చెయ్యాలని"
తన వైపే
చూస్తున్న వాడి నల్లటి కళ్ళలో తనని కూడా తీసుకెళ్ళాలని ఎంత తాపత్రయం! ఆ క్షణంలో వాడెంతో
ముద్దొచ్చాడు రాజేశ్వరికి. వాడి కోసం వెళ్ళాలని కూడా అనిపించింది.
"నాకు నీళ్ళంటే భయం నాన్నా! రాఫ్టింగ్ లాంటి
ఎడ్వెంచర్స్ నేను చెయ్యలేను. నా వయసు అందుకు సహకరించదు" అంది రాజేశ్వరి వాడి
బుగ్గలు సాగతీస్తూ.
" ఫిఫ్టీ ఎయిట్ ఈజ్
నాట్ ఒల్డేజ్ మామ్మా! మొన్న పేపర్లో చదవలేదా లైఫ్ స్టార్ట్స్ ఎట్ ఫిఫ్టీ అని? ఇప్పుడే మీరు
ఇలాంటివి చెయ్యాలి! " అన్నాడు వాడు.
మనసులో ఎక్కడో కలుక్కుమంది..యాభయ్యేళ్లకి జీవితం మొదలయ్యేట్టయితే
యాభయ్యేడేళ్ళకి భర్తని కోల్పోయిన స్త్రీ ఏమవ్వాలి?
"మామ్మ అలా అంటుంది గాని తనకి నీళ్ళంటే చాలా
చాలా ఇష్టం రా మనూ! ఇలా రాపిడ్స్ లో ప్రయాణమంటే భయం గాని వాన నీళ్ళన్నా, సెలయేళ్ళన్నా
ఎంతిష్టమో!" అన్నాడు విజయ్ ముందు సీట్లోంచి.
"మీరూ రండి అత్తయ్యా! చాలా సేఫ్ ఇది. చిన్న
పిల్లలు కూడా చేస్తారు. ఒక్కసారి చేశారంటే ఇంక మీకు బోటు ప్రయాణం నచ్చదు. నదితో
స్నేహం చేస్తూ, నదితో పాటుగా సహజమైన
ప్రయాణం చేస్తున్నట్టుండే ఈ అనుభవం వేరే ఎక్కడా దొరకదు. నిన్నటి గంగా హారతి లాగే
ఇదీ ఒక అపూర్వమైన అనుభవం" అంది మైథిలి.
ఎంత దూరంలో నిలిపితే
అంత దూరంలోనే ఆగిపోయే మనస్తత్వం మైథిలిది. సాధారణంగా ఏ విషయం లోనూ నొక్కి చెప్పడం ఆమెకి అలవాటులేదు.
కానీ ఈ సారి అలా చెప్పాలని మైథిలికనిపించినట్టే ఆమె చెప్పిన మాటలు వినాలని
రాజేశ్వరికి అనిపించింది.
"లైఫ్
జాకెట్ వుంటుంది మామ్మా..నీళ్ళల్లో పడినా బలే బావుంటుంది.." ఉత్సాహంగా
అన్నాడు.
"నీ
మొహం! నీళ్ళలో పడనే పడం అత్తయ్యా! కావాలని కొంత మంది ఎక్కువ రాపిడ్స్ లేని చోట
నదిలోకి దూకి ఎంజాయ్ చేస్తారు!" అంది మైథిలి.
విజయ్
వైపు చూసింది రాజేశ్వరి.
"రా
అమ్మా! నీకు అలవాటు లేదు గనక అలా భయ పడుతున్నావు గాని నీకన్న పెద్దవాళ్ళూ, చిన్న చిన్న పిల్లలూ
కూడా వస్తారు" అన్నాడు విజయ్.
'సరే
ఏమవుతుంది మహా అయితే.. నీళ్ళలో పడిపోతే, మునిగిపోతే మాత్రం నష్టం ఏముందీ' అనిపించింది .
" సరే..భయమే
అయినా వీడి కోసం వస్తాను" అంది రాజేశ్వరి.
అంతా ఉత్సాహంగా
గెస్ట్ హౌస్ దారి పట్టారు. రాజేశ్వరి తప్పక ఒప్పుకుంది గాని ఆమె మనసులో దడగానే
వుంది. మధ్యాహ్న భోజనం అయ్యాక కొంత సేపు విశ్రాంతి తీసుకుని రాఫ్టింగ్ కోసం
బయల్దేరారు. రైలు ప్రయాణం కోసం పెట్టుకున్న కుర్తా పైజామా వేసుకుంది రాజేశ్వరి.
ముందుగా
బుక్ చేసిన మూడు టికెట్లతో పాటు మరో టికెట్ కావాలని అడిగాడు విజయ్.
"ఎందుకురా విజయ్
ఆరొందలు దండగ ! నాకు ఎంత మాత్రం రావాలని లేదు" అని మళ్ళీ మొదలు పెట్టింది
రాజేశ్వరి.
చిన్న
పిల్లని చూసినట్టు ఆమెని చూస్తూ భుజాల చుట్టూ చెయ్యి వేసి " ఇంకేం
మాట్లాడకు..నువ్వే అంటావ్ ఎంత బావుందో అని" అన్నాడు 'ఇంకేం
వినను' అన్నట్టు.
రాఫ్టింగ్
సరంజామాతో బాటు దాదాపు పదిమందితో జీప్ బయల్దేరింది. మళ్ళీ ఘాట్ సెక్షన్లో గంట సేపు
ప్రయాణం తర్వాత కొంత ఎగువనున్న నదీ తీరం చేరారు. మిగిలిన వాళ్ళంతా లైఫ్ జాకెట్లూ, తలకి హెల్మెట్లూ చక
చకా ధరించారు. రాజేశ్వరికి మైథిలి సాయం చేసింది.
గైడ్ వచ్చి అందరినీ
చెక్ చేశాడు. ఈ సాహస కృత్యంలో తమకి గాయాలయినా, ప్రాణాలు పోయినా అందుకు తమదే బాధ్యత అని రాసి ఉన్న పత్రాల మీద అంతా
సంతకాలు పెడుతుంటే వణికే చేతుల్తో తానూ సంతకం పెట్టింది రాజేశ్వరి. జీపు పైన వేసి కట్టిన
తెల్లని రాజ హంస లాంటి పాలీథీన్ రాఫ్ట్ ని మోసుకుంటూ తెచ్చి నది నీళ్ళలో వేశారు.
నదికి దూరంగా వున్నప్పుడు వేడిగా అనిపించినా నీటికి దగ్గరగా వచ్చేసరికి చల్లని
పిల్ల తెమ్మెరలు చుట్టి హాయిగా అనిపించింది. గైడ్ ముందుకొచ్చి ఏవో కొన్ని
సూచనలిచ్చాడు.
"ఆంటీజీ ! మీరు తెడ్డు వేస్తారా? ఊరికే కూర్చుంటారా? " అనడిగాడు.
జారుతున్నట్టున్న
తెప్ప అంచుని చూస్తూ "నేనా? ఉహు"అంది .
మైథిలి నవ్వుతూ "అత్తయ్యా! మీరిక్కడ ముందు కూర్చోండి..ఇది
బెస్ట్ వ్యూ! యూ విల్ ఎంజాయ్"
అంది.
ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు రాజేశ్వరి రాఫ్ట్ లోకెక్కి చెప్పిన చోట
కూర్చుంది. అటు నలుగురూ, ఇటు నలుగురూ తెడ్లు
పట్టుకుని కూర్చున్నారు రాఫ్ట్
అంచుల మీద.
“రెండు
చేతులతోనూ తెడ్లు పట్టుకుంటే మరి ఎత్తైన కెరటాలుగా రాపిడ్స్ వస్తే నీళ్ళలోకి
పడిపోరూ?” అంది రాజేశ్వరి
భయంగా.
"ఏం పడిపోరమ్మా! ఒక కాలు ఇక్కడా,
రెండో కాలు వెనకగా లాక్ చేసి పెట్టుకుంటాం, ఇందాక గైడ్
చెప్పాడుగా వినలేదా?”అన్నాడు
విజయ్.
“పసివాడు
వాడు కూడా తెడ్లు వెయ్యడమేమిట్రా?” అంది బెంగ పడుతూ.
”మామ్మా!నేనూ
నాన్నలా వెయ్య గలను! నువ్వే చూడు” అన్నాడు వాడు. ఇంక
చేసేదేం లేక “గంగమ్మా!
నువ్వే శరణు"అనుకుని మౌనంగా ముందుకి కూర్చుంది. ఆవిడకి చెరో వైపూ విజయ్, మైథిలీ కూర్చున్నారు.
అవి రెండూ గైడ్ స్థానం తర్వాత
అతి ముఖ్య స్థానాలని తెలిసి “ఎందుకురా
నాన్నా ఇలాంటి పనులు? కొంచెం వెనక్కి కూర్చుని ఎంజాయ్ చెయ్యకూడదూ? మీరీ పనిలో వుంటే
వాడినెవరు చూస్తారు?" అంది పొంగు కొస్తున్న
కోపాన్నీ, నిస్సహాయతనూ అదిమి పెడుతూ. 'తిక్క వేషాలు కాకపోతే ఆడదై వుండీ అంత లెక్కలేక పోవడం ఏమిటి?' అనుకుంది మైథిలి వైపు
నిరసనగా చూస్తూ.
అదంతా ఊహించిందే అన్నట్టు విజయ్ ఆమెని లక్ష్యపెట్టకుండా తెడ్డు వేయడానికి
సిధ్ధమైపోయాడు.
"ఫార్వార్డ్ పాడిల్...ఏక్ సాథ్!"అరిచాడు గైడ్. అంతా ఒకేసారి తెడ్డు
వేశారు సుశిక్షితులైన సైనికుల్లా!
నదిలో ముందుకి సాగింది రాఫ్ట్. కొన్ని క్షణాల్లోనే రాజేశ్వరి టెన్షన్
మాయమయింది.
నది పాడే సంగీతం తప్ప అంతా నిశ్శబ్దం! ఆహ్లాదకరమైన చల్లదనం. చుట్టూ కొండలు
సూర్య కిరణాలకి మెరుస్తున్నాయి. ఎదురుగా అనంత జలరాశి. అందాల రాశి ! అవి సూర్య
కిరణాలో, చంద్ర కిరణాలో తెలియనంత హాయైన చల్లదనం. ప్రకృతికింత
దగ్గరగా అసలెపుడైనా ఉన్నానా? అనుకుంది రాజేశ్వరి.
'గంగా! తెర పానీ అమృత్' వెనక కుర్రాడొకడు
పాటందుకున్నాడు. తెప్ప ముందుకి సాగింది అయిదునిముషాల పాటు.
"అబ్ ఆ
యేగీ పెహ్లీ రాపిడ్. ఆప్ సావధాన్ రహియే. మై జైసే బోలూ ఆప్ వైసేహీ
కర్నా"అన్నాడు గైడ్. రాజేశ్వరి గుండె గుభిల్లుమంది, ఎదురుగా
కొంత దూరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతూ అల్లిబిల్లిగా సుళ్ళుతిరుగుతున్న కెరటాలని
చూసి.
"మేడం,
మీరు మోకాళ్ళ మీద కూర్చుని తెప్ప రింగ్స్ ని గట్టిగా పట్టుకుని,
తల భాగం తెప్ప ముఖం దగ్గర పెట్టుకుని కూర్చోండి" అన్నాడు
హిందీలో. రాజేశ్వరి అంతకు ముందే చూపించిన విధంగా కూర్చుంది
అప్రయత్నంగా. గైడ్ సూచనలకనుగుణంగా అంతా తెడ్డు వేస్తున్నారు. దగ్గరగా వచ్చేస్తున్న
నిలువెత్తు కెరటాలు తమని మింగేయడానికొస్తున్న జలచరాల్లా అనిపించాయి రాజేశ్వరికి.
ఇంక ఏమయితే అదవుతుంది అనుకుని "గంగమ్మా! నా కుటుంబాన్ని కాపాడు. పసి వెధవ
నీళ్ళలోకి జారిపోకుండా కాపాడు!" పదే పదే అదే అనుకుంటూంటే తెప్ప కెరటాల
పైకెక్కి వాలులోకి జారింది.
విజయ్
"మనూ! పుల్ ద వాటర్! లాక్ యువర్ ఫీట్ "అంటూ కెరటాల ఎత్తుల మీంచి నీటిని
తెడ్డుతో లాగుతుంటే తనకి కుడివైపు కూర్చున్న మైథిలిని
ఓరకంట చూసింది రాజేశ్వరి. ఎంత ఆత్మ విశ్వాసం! సరిగ్గా విజయ్ లాగే తెడ్డు వేస్తూ
నీటిని లాగుతోంది. ఎత్తైన కెరటాలు చెళ్ళు చెళ్ళున ఎడా పెడా తెప్పని కొట్టాయి. అంతా
తడిసి ముద్దయ్యారు. పెద్ద కెరటం పైకెక్కి వాలు లోకి జారినపుడల్లా అంతా కేరింతలు
కొట్టారు ఉత్సహంతో. తనకటూ ఇటూ కొడుకూ కోడలూ
కనిపిస్తున్నారు గానీ కనపడకుండా వెనక ఉన్న సుమన్ గురించి ఆమె కి బెంగ గా వుంది.
ఆనందాతిరేకంతో సుమన్ పెడుతున్న కేకలు వినిపిస్తుంటే 'అమ్మయ్య!
నా మనవడు క్షేమం' అనుకుంటూ వుంది రాజేశ్వరి.
ఎలాగయితేనేం
మొదటి రాపిడ్ ని విజయ వంతంగా దాటారు. తెప్ప మళ్ళీ ప్రశాంత ప్రవాహంలోకి వచ్చింది.
రాజేశ్వరి మెల్లగా లేచి తన స్థానంలో కూర్చుంది. తెప్పలో జనం అంతా ఉతాహంతో
తుళ్ళిపడుతున్నారు. రాజేశ్వరి కేదో అర్థమయినట్టనిపించింది. రాపిడ్స్ వచ్చినపుడు
సాధారణంగా తెప్ప కెరటాలమీద ఉయ్యాలలూగుతూ సాగుతుంది. తెప్ప లోని గైడ్లిద్దరూ
అవసరమైనపుడు ఏం చెయ్యాలో చేసి తెప్పని కాపాడగల సమర్థులు. ఒకవేళ నీళ్ళలో పడినా లైఫ్
జాకెట్స్ వల్ల మునిగిపోకుండా ప్రవాహంతో పాటు ముందుకి సాగుతారు. తెప్పలోని వాళ్ళు
వాళ్ళని పైకి లాగుతారు. ఇంక నీళ్ళలో ఏ రాయో తగిలి గాయాలయ్యే అవకాశం లేకపోలేదు. ఆ
మాత్రం రిస్క్ తీసుకునే ఈ క్రీడకి వస్తారు మరి. అలా అనుకున్నాక ఆమె మనసు
నెమ్మదించింది.
పదినిముషాలు
ప్రశాంతంగా సాగిందో లేదో రెండో రాపిడ్ గురించి ప్రకటించాడు గైడ్! సర్దుకున్న
రాజేశ్వరి మనసు మళ్ళీ దడదడలాడింది. ఈ సారీ దాదాపు అలాగే కెరటాల సయ్యాటకి దీటుగా
తెప్ప సాగింది తెడ్ల సాయంతో. కేరింతలు మిన్నంటాయి. చొచ్చుకొచ్చిన కొండరాళ్ళని
తప్పుకుంటూ, బండరాళ్ళని దాటుకుంటూ ఈ నిరంతర ప్రయాణం
ఆవిడకి విసుగు రాదా అనుకుంది రాజేశ్వరి.
ఎన్ని
అడ్డంకులొచ్చినా వీలయితే వాటిని దాటుకుంటూ, వీలు
కాకపోతే తన దారి మార్చుకుంటూ సాగి పోయే గంగమ్మ తనకేదో పరమార్థం
బోధిస్తున్నట్టనిపించింది!
ముంచెత్తిన
కెరటాలకి వీడ్కోలిస్తూ ముందుకి సాగారు. ఆ ఉధృతం తగ్గి ప్రశాంత స్థితికి వచ్చేసరికి
"విజయ్! అత్తయ్య వణుకుతున్నారు. అయ్ థింక్ షి ఈజ్
గెట్టింగ్ కోల్డ్ " అంది మైథిలి.
" లేదు
లేదు..అయాం ఫైన్" అంది రాజేశ్వరి వణుకుతున్న పెదవుల్ని బిగించి పెడుతూ.
వెనక్కి తిరిగి సుమన్ ని చూసింది.
"మామ్మా!
ఎలా వుంది? సూపర్ వుంది కదా?" అన్నాడు ఈ చెవి నుంచి, ఆ చెవి
దాకా సాగిన నవ్వులతో.
'ఓరి పిడుగా !
' అనుకుంది రాజేశ్వరి.
మూడో
రాపిడ్ దాటేసరికి ఆమెకి భయం చాలావరకు తగ్గింది. రాపిడ్ దాటిన తరువాత వచ్చే
ప్రశాంతత ఒక అద్భుతంలా అనిపించింది! అప్పటికి దాదాపు
నాలుగ్గంటలై వుంటుంది సమయం.
"సాబ్! మీరు ఏమైనా చూయింగం లాంటివి తిన్నా చిన్న చిన్న రాపర్స్ కూడా గంగమ్మ
ఒడిలోకి విసరద్దు. వాటిని నా కివ్వండి. నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి చెత్త బుట్టలో
వేస్తాను"అన్నాడు గైడ్ హిందీలో. వెనక్కి తిరిగి అతన్ని పరీక్షగా చూసింది రాజేశ్వరి. ఇరవయ్యేళ్ళు వుంటాయో
వుండవో. వాళ్ళల్లో తెల్లనివాడి కిందే లెక్క. కొంచెం బొద్దుగా , నిర్లక్ష్యంగా,
' జీవితమే ఒక ఆట ..అది వెలుగు నీడల సయ్యాట' అని పాడుకుంటున్నట్టు వున్నాడు!
భయాన్ని
వదిలేస్తే జీవితం ఎంత బావుంటుందో కదా అనిపించింది ఆమెకి. దూరాన రేవు కనిపించింది. అక్కడ చాలా తెప్పలు నిలిచి ఉన్నాయి.
"సాబ్
మనం పది కిలో మీటర్లు ప్రయాణం చేశాం..ఇక్కడ అయిదు నిముషాలు ఆగుతాం. ఎవరికైనా మంచి
నీళ్ళు కావాలంటే తాగచ్చు" అన్నాడు గైడ్.
"ఇంకా
ఎంత దూరం?" అడిగింది రాజేశ్వరి .
"ఏమ్మా? అలసటగా వుందా? చలి వేస్తోందా?"చెయ్యి పట్టుకుంటూ అడిగాడు విజయ్.
"అదేం
లేదురా? తెలుసుకోవాలని అడిగానంతే!"అంది. నిజం గానే
ప్రకృతి ఒడిలో పవళించినట్టున్న ఈ అనుభవం బావున్నట్టే వుంది!
"ఇంకా పదహారు కిలో మీటర్లుందమ్మా! ఇక్కడినుంచి
ఇంకా కొన్ని రాఫ్టులు మనలాగే ప్రయాణిస్తాయి. ఇపుడింకో రకం ఎంజాయ్ మెంట్ " అన్నాడు. అయిదు నిముషాల్లో రాఫ్ట్ మళ్ళీ కదిలింది. కొత్తగా నీళ్ళలోకి
దిగుతున్న రాఫ్టులలో కాలేజీ కుర్రాళ్ళని చూస్తూ చేతులూపారు తెప్పలో వాళ్ళంతా. పైకి లేస్తూ, కిందికి జారుతూ, సుళ్ళుతిరుగుతూ రాపిడ్స్ దాటడం, లాహిరి లాహిరి
లాహిరిలో అన్నట్టు అలలతో సాగడం.
భయం
తగ్గాక, రాపిడ్స్ దగ్గరై ఎత్తుగా ఎగసిపడే కెరటాలు
సమీపించగానే, గంగమ్మ కెరటాల చేతులతో తనకి స్నానం
చేయిస్తున్నట్టనిపించి ముగ్ధురాలయింది రాజేశ్వరి. నది మధ్య ఈ స్వచ్చ జలాల్లో అమ్మ
తనంత తానే చేయించే స్నానానికీ, తను సాయంత్రం తీరంలో
చేద్దామనుకున్న స్నానానికీ ఎంత తేడా అనుకుంది..
నాలుగు గంటల నదీవిహారం తర్వాత ఇరవయ్యారు కిలోమీటర్ల ప్రయాణం చివరి దశ
కొచ్చింది. నది బాగా వెడల్పుగా గంభీరంగా అయింది.
గైడ్ ”ఇక్కడ అంతా నీళ్ళలోకి దిగచ్చు” అనగానే ఒకరి తర్వాత ఒకరు తెప్పమీంచి నీళ్ళలోకి దూకారు. మైథిలి కూడా దూకి, చేపలా ఈదుతూ జలకాలాడింది. గైడ్ దగ్గరున్న డ్రై బాగ్
లో పెట్టుకున్న సెల్ ఫోనులూ, కెమేరాలూ అడిగి తీసుకుని
ఫొటోలు తీసుకున్నారు. అక్కడికి దగ్గరలో వున్న కొండ అంచు(క్లిఫ్) ఎక్కి, ముఫ్ఫై అడుగుల ఎత్తు నుంచి ‘క్లిఫ్ జంపింగ్’ చేశారు. విజయ్, మైథిలీ మాత్రమే కాకుండా సుమన్
కూడా అలా దూకుతుంటే రాజేశ్వరి ఆశ్చర్య పోయింది. బిలబిల్లాడుతూ
వచ్చిన అమ్ముకునే వాళ్ళు మాగీ, చాయ్ అమ్ముతుంటే
రాజేశ్వరి టీ తాగింది. సుమన్ మాగీ తిన్నాడు. అంతా మళ్ళీ తెప్ప ఎక్కారు .
"నాన్నా! రాం ఝూలా దగ్గరకొచ్చేశాం!"
పొలికేక పెట్టాడు సుమన్.
వంతెన కింద నించి రాఫ్టు పోతుంటే "చూశావా
మనూ! నదిని డిస్టర్బ్ చెయ్యకుండా ఎలా ఈ ఉయ్యాల వంతెన కట్టుకున్నారో వీళ్ళు! ఈ గైడ్
కుర్రాడు కూడా చూసావా ఒక్క చిన్న ప్లాస్టిక్ రాపర్ కూడా నీళ్లలో వెయ్యకుండా
జాగ్రత్త తీసుకున్నాడు! తమకి బతుకు తెరువునిచ్చే గంగమ్మని వీళ్ళెంతగా పూజిస్తున్నారో గమనించావా? పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే ప్రకృతి మనకెంత
ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ ఇస్తుందో చూశావా! " అన్నాడు విజయ్.
" ఆఫ్ కోర్స్ నాన్నా! అయ్ లవ్ యూ బోత్ అండ్
మామ్మా ఫర్ దిస్ వండ్రఫుల్ ఎక్స్పీరియెన్స్!" అంటూ తండ్రి కి ముద్దు విసిరాడు వాడు.
కొద్దిసేపట్లో
లక్ష్మణ ఝూలా కూడా దాటి మొదట బయలు దేరిన చోటికి చేరారు. తెప్ప దిగుతున్న అందరిలోనూ
ఏదో పొంగి పొర్లే ఉత్సాహం ..ఉల్లాసం! రాజేశ్వరి
దిగబోతుంటే మైథిలి చెయ్యి అందించింది. ఆ చేతిని ఆప్యాయంగా పట్టుకుని కిందికి
దిగింది రాజేశ్వరి. ఆవలి ఒడ్డున నిన్న గంగా హారతి జరిపిన పరమార్థ నికేతన్
కనిపించింది. డ్రై బాగ్ లోంచి తమ వస్తువులు తీసుకుని, నలుగురితో
పాటూ రోడ్డు వైపుగా నడుస్తూ తన కుటుంబాన్ని క్షేమంగా ఒడ్డుకి చేర్చిన గంగమ్మకి మనసులో
నమస్కరించుకుంది రాజేశ్వరి.
"నాన్నా మళ్ళీ ఎప్పుడొద్దాం?" అన్నాడు
సుమన్ గునుస్తూ....
“ఇప్పటికిది
పూర్తై ఇల్లు చేరలేదు! అప్పుడే మళ్ళీ ఎప్పుడని అడుగుతున్నావా బుజ్జి గాడాని! వచ్చే ఏడాది వద్దాంలే" అంది రాజేశ్వరి.
**
**
**
( 2012 అనిల్
అవార్డ్స్ కథల పోటీలో సాధారణ బహుమతి కి ఎన్నికై డిసెంబర్ 'స్వాతి'
మాసపత్రిక లో ప్రచురితమై; Katha - 2012, Collection
of best short stories of the year 2012 లో చేర్చబడిన కథ )