"మానవ్!!మానవ్!!" భయంగా ఆదుర్దాగా పిలుస్తున్నారు మానవ్ స్నేహితులు.మానవ్ చుట్టూ మూగిన జనం, డాక్టర్ విలియమ్స్ అదిలించడంతో దూరంగా తొలిగారు.గాలి తగిలేలా దుస్తుల్ని వదులు చేసి, చురుగ్గా పల్స్ పరీక్షించి, అతని గుండె తిరిగి శ్వాస అందుకోవడం కోసం ప్రయత్నించ సాగాడు డాక్టర్ విలియమ్స్.'బంజీ జంపింగ్' క్రీడలో పాల్గొనాలని మానవ్ వెంట వచ్చిన స్నేహితులు ముగ్గురూ అవాక్కుగా, బెదురుగా నిరీక్షణలో మునిగారు.మానవ్ జీవం పుంజుకోవాలని ఎవరికి వారు తమ తమ మతాలు తమకు నేర్పిన రీతుల్లో ప్రార్థించుకుంటున్నారు.
మానవ్ జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు!
* *
వేల సంవత్సరాలుగా అనంతమైన ప్రయాణం!పొరలు పొరలుగా విడిపోతున్న ఎన్నో అనుభవాలు, అనుభూతులు,భయాలు, శారీరక మానసిక గాయాలు...ఏదో అభద్రత.వెనక్కి వెనక్కి ప్రయాణిస్తున్న కొద్దీ ఏదో గుబులు!ఎక్కడికో ఇష్టంలేని, బాధాకరమైన ప్రదేశానికి ఎందుకనో ఈ ప్రయాణం!తన ప్రమేయం లేకుండానే తన శరీరం అలా తేలికగా వెళ్ళిపోతోంది!శరీరమా?
కాదు...మనసు కాబోలు!ఉహు..మనసు కాదు..ఎంతమాత్రం కాదు.మనసే ఐతే ఎవరి మనసు? మానవ్ మనసా?మరి ఆ ప్రయాణాన్ని కిటికీలోంచి చూస్తున్నట్టు గమనిస్తున్న తనెవరు?
ఇది కలా నిజమా?శరీరాన్ని ఆకులతో కప్పుకుని, అడవి మృగాలతో,పాములతో పాటుగా చెట్లూ పుట్టలూ లోయలూ గుట్టలూ...ప్రకృతిని ఇతర జీవాలతో పంచుకుంటూ బతుకుతున్న అతడెవరు? తనే!??అమ్మో!..అలా ఎలా బతికాడో అపుడు?అదేమిటి? ... ఆ చెట్టునల్లుకున్న బలమైన తీగలతో వేళ్ళాడుతోంది! అది కొండచిలువ!నోరుతెరచి తనవైపే సాగుతోంది!మానవ్ గమనించడం లేదు .. అయ్యో!
మానవ్!గమనించి చూసుకో...జాగ్రత్త!
ఈ జాగ్రత్త చెపుతున్నదెవరు? తనే కదా!తనంటే?మానవ్! అమ్మయ్య! మానవ్ చటుక్కున మరో బలమైన తీగని పట్టుకుని సర్రున జారి, బారెడు దూరం జరిగాడు క్షణకాలంలో .అతనికివన్నీ అలవాటే కాబోలు!అయినా భయమే.గుండె దడదడలాడుతోంది. ప్రాణం ఎంత తీపి!
అమ్మయ్య! చేరింది సురక్షితమైన జాగాలానే ఉంది!అయినా ఏం భద్రతో ఏమో!చీకటి పడిపోతోంది.వెలిగించిన కాగడా రెపరెపలాడుతోంది.ఆ వెలుగునీడల్లో మానవ్ కళ్ళలో కదలాడుతున్న భయం. భయం...దాహం... భయం...నీరసం...భయం...నిద్ర!
బంగారు కిరణాలు...వెలుగులు. రంగుల ఈకల వలువలు! చెట్టుకింద చేత చురకత్తితో నిలుచున్న అతను తనే!నిగనిగలాడే శరీరంతో తన పక్కనున్న స్త్రీ కళ్ళు తెల్లగా ప్రకాశవంతంగా ఎంత బావున్నాయి! ఎత్తైన చెట్ల కొమ్మలన్నీ పైన ఒకదానితో ఒకటి అల్లుకుపోయి అందమైన పందిరిలా ఏర్పడ్డాయి. వాటికి వేళ్ళాడే సన్నని పూల తీగలు.
కండలు తిరిగిన తన బాహువుల్ని గర్వంగా చూసుకుని ఆమె వైపు కాంక్షగా చూశాడు తను. ఆమె నవ్వుల మెరుపుల్లో మైమరచాడు తను!
అయ్యో! ఆ మూల గుట్టల వెనుకనుంచి పొదల మాటున దాక్కుంటూ వస్తున్న ఆ కోయవాడు….ఎవడువాడు?
తననేం చేయాలని వస్తున్నాడు?
అయ్యయ్యో! ఆ స్త్రీ మోజులో,పులిని చంపిన విజయోత్సాహంలో, పొంచివున్న ప్రమాదాన్ని గమనించలేని, పసిగట్టలేని అజాగ్రత్తకు ఎలా లోనయ్యాడో మానవ్! బల్లెం ఎత్తి ఆ కోయవాడు అటువైపే గురిచూస్తున్నాడు!అంతా తెరమీద చిత్రంలా తనకెలా కనిపిస్తోంది? తను మానవ్ కాడా?తనని తనే ఎలా చూసుకుంటున్నాడు?
బల్లెం రివ్వున వచ్చి తన వీపులో గుచ్చుకుంది.గుండెనదిమిన చేయి వెచ్చని రక్తంలో తడిసింది... కళ్ళు బైర్లు కమ్మయి. ఏమిటీ అభద్రత? సృష్టిలోని జీవజాలమంతటికీ ఈ భద్రతా రాహిత్యం ఎందువల్ల?
కొద్ది క్షణాలో,రోజులో,వారాలో?...నిశ్ శబ్దం.చీకటి...మెల్లగా తన చుట్టూ వెలుగువలయాలు...
ఎక్కడికో తను ప్రయాణిస్తున్నాడు! అబ్బో! తనెంత బాగా గుర్రపుస్వారీ చేస్తున్నాడు! ఎపుడు నేర్చుకున్నాడో! తను ఒంటరిగా లేడు.వెంట ఎంతోమంది సైనికులు...తోటి సైనికాధికారులు!ఎర్రటి తలపాగాలు.
నడుముకి వేళ్ళాడుతున్న కరవాలాలు.అస్పష్టంగా వినిపిస్తున్న మాటలు.కొందరి కళ్ళలో విజయకాంక్ష. మరికొందరిలో సందేహం,బెదురు.అయినా అందరిలోనూ ఓ కసి!యుద్ధానికి కాబోలు ఈ ప్రయాణం!
గుర్రాల డెక్కల చప్పుడు.కొండ దారుల్లో,మైదానాల్లో ఎంతసేపీ ప్రయాణం?
అదుగో ...ఎదురుగా శరవేగంతో వస్తున్న శత్రుసైన్యం!బాణాలు...బల్లేలు.. .ఢీకొన్న సైనిక బలాలు!ఉద్వేగంతో,వేడెక్కిన శరీరంతో ప్రత్యర్థి మీదకు దూకుతున్న ఆ వీరుడు తనే!ఎంతమందిని హతమార్చాడో క్షణాల మీద!తన కళ్ళ ముందంతా జివ్వున చిమ్ముతున్న రుధిర ధారలే!ఆ స్వైర విహారం చేస్తున్న వ్యక్తి తనేనా?ఎవరికైనా ఎంతచిన్న గాయమైనా చలించే మనసు కాదూ తనది? మరి ఆ శూరుడు,ఆ వజ్ర కఠిన హృదయుడు ఎవరు?
ఆ! ఏమిటా ఏమరుపాటు? తన చెయ్యి క్షణకాలం ఆలస్యంగా కదిలిందేం? ఫ్రత్యర్ధి నుంచి వచ్చిన బాణం తన గుండెని చీల్చింది.చివ్వున రక్తం చిమ్మింది.అయిపోయింది... మానవ్! నీ పని అయిపోయింది!ఏమిటీ దు:ఖం?తన మరణం తానే చూసుకుని దు:ఖించడం ఏమిటి?వింత కాదూ?
ఆలోచనలు అలసిపోయాయి!అంతటి శోకమూ క్షణికమై చీకటిలో కరిగిపోయింది!
వింతైన ప్రశాంతత..దూరం నుంచి చల్లని వెలుగు.కాలమే సముద్రంగా మారగా ఆ వెలుగు వైపు ఈదుతూ ఓ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు 'తనే'! మానవ్!
గమనించే లోపే కదలిపోతున్న ఎన్నో దృశ్యాలు...చేతికర్రతో వడివడిగా సాగిపోతున్న ఆ వ్యక్తి తనకి తెలుసు!! ఆయన..ఆయన బాపూజీ! ఆయన వెనకే కదిలే జనసముద్రంలో ఒకడుగా తను! దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో ఆ మహనీయుని వెనక తనూ నడిచాడన్న మాట! అయితే
తను ధన్యుడే!
అన్యాయాన్నెదిరించాలి! దురాక్రమణని ఖండించాలి!పరపీడన అంతం కావాలి!
స్వాతంత్ర్&యం రావాలి !
"వందేమాతరం!"
ఎన్నో నినాదాలు!నరనరానా ఆవహించిన ఉద్వేగం,ఉద్రేకం.సముద్రకెరటాల్ లా ముందుకు పరుగులు తీస్తున్న జనంలో తనొక కణంగా కలిసిపోయాడు! ఏదో ఙ్ఞాపకం తెరలాగా తన కళ్ళ ముందు పరుచుకుంది.ఇంటి దగ్గర ఎదురుచూస్తున్న అమ్మ!మూగగా కళ్ళతో సంభాషించే భార్య!నిండుచూలాలైన తన అర్ధాంగి.ఆమె తలపుకొస్తే చాలు గుండె తలుపులు తెరుచుకుని వెల్లువయ్యే అనురాగం!మరి ఇలా తనవాళ్ళని వదిలి ఈ ఉద్యమంలో ఎందుకు పాల్గొన్నాడు తను? ఈ యఙ్ఞంలో తనను తానే ఒక సమిధగా సమర్పించుకుంటున్నాడా? తుపాకుల్ని,తూటాల్ని మానవ శరీరాలు ఎంతసేపు ఎదిరించగలవు?తనగుండెలో సన్నని గుబులు. ఆ తెల్లవాడి తూటాకి తను బలైపోతే తన భార్య, తన లేడి కళ్ళ ప్రియబాంధవి ఏమైపోతుంది?ఇంకా పుట్టని తన బిడ్డ?కళ్ళారా తన బిడ్డని తను ఒక్కసారైనా చూసుకోగలుగుతాడా?తనలా కాకుండా వాడు స్వతంత్రభారతంలో జన్మించగలుగుతాడా?
చెవులు చీలుస్తూ తూటాల చప్పుళ్ళు! నినాదాల మధ్య హాహాకారాలు! తొడతొక్కిడి. వందేమాతరం! వందేమాతరం!వందే...ఆ...ఆ!మండుతు న్న నిప్పుకణికె తన కుడిచెవిలోంచి రివ్వున దూసుకుపోయింది.తన మనుగడని శాసించే అత్యంత ప్రముఖమైన శరీరభాగం చిద్రమైన అనుభూతి!తీవ్రమైన బాధతో శరీరం గిలగిలలాడింది.క్షణకాలంలో అంతా ముగిసింది.
ఆహా! ఎంతటి విశ్రాంతి!
కొలనులో తేలుతున్న పూవులాగా తన మానసం!
హాయిగొలిపే నిశ్శబ్దం!
చల్లని వెలుగు...విశ్రాంతి!
కొలను మెల్లగా నదిగా మారి ముందుకి ప్రవహిస్తున్న అనుభూతి.మళ్ళీ ప్రయాణం....
పచ్చని పల్లె.పాత పెంకుటిల్లు.ముందుకి వాలినట్టున్న వసారాలో ఎందుకో అంతమంది జనం! ముతక చీరలూ,నీరుకావి పంచెలూ , నీరసపు మొహాలూ! ఏమైందని అంత దిగులు?తనకు తెలుసు ఏమైందో!నిన్నా మొన్నా జరిగిన సంఘటనల్లాగా,రోజువారీ ప్రయాణాల్లాగా ఇవన్నీ తనకి గోచరించడం ఎంత వింత! . . .
To read further, please follow the link : http://kinige.com/kbook.php? id=441
To read further, please follow the link : http://kinige.com/kbook.php?
" 'నువు కోరినవన్నీ తక్షణమే పొందగలిగే స్థితి లభిస్తే నువ్వేమైపోతావు మానవ్ ?' మేలుకుంటున్న మానవ్ చెవిలో కొద్ది క్షణాల పాటు ఆ ప్రశ్న ప్రతిధ్వనించింది.మెల్లగా అతనికి పూర్తి మెలకువ వచ్చింది.మళ్ళీ అతని అవిశ్రాంత ప్రయాణం మొదలయ్యింది!"
ReplyDelete-అవును, మానవుడు నిత్య, నిరంతరన్వేషి. ఎడిసన్ బల్బ్, ఫోనోగ్రాఫ్, రికార్డులు, సినీ కెమేరా మొదలైనవి కనిపెట్టాక అంతటితో ప్రగతి ఆగితే ఈ విమానాలు, కంప్యూటర్లు వచ్చిఉండెడివి కావు. రానున్నవి గ్రహాంతర ప్రయాణాలు.
చాలా బాగుంది. నిజమే యుగాలు గా తరాలు గా ఈ అవిశ్రాంత పోరాటం ఈ అవిశ్రాంతపు వెతుకులాట సాగుతూనే వుంది.. ఆగిన క్షణం మనిషి మనుగడ అనే పదానికి అర్ధం పోతుంది కదా. ఎంత గానో ఆలోచింప చేసింది ఈ కధ. ధన్యవాదాలు.
ReplyDeleteరావు గారూ, భావన గారూ,
ReplyDeleteమీ ప్రతిస్పందనలకు ధన్యవాదాలు!