మళ్లీ మనిషిగా..
ఈ పదేళ్లలో ఉద్యోగాల్లో,
జీతాల్లో, వాటితో పాటు ఎగువ మధ్య తరగతి జీవితాల్లో వచ్చిన మార్పుల్ని ఎత్తిచూపిస్తున్నట్టుంది,
హైటెక్ సిటీలో మెరిసిపోతున్న హోండా షో రూమ్. ఎదురొచ్చి నన్నూ, స్వాతినీ లోపలికి తీసుకెళ్ళినతను
కూడా అతికినట్టున్న నీలం రంగు సూట్లో హుందాగా మెరిసిపోతున్నాడు.
రమేష్ పేరూ నే వచ్చిన
పనీ చెప్పి, ముకుంద్ ని కలవాలన్నాను. తనే ముకుంద్ అంటూ పరిచయం చేసుకున్నాడు.
లోపల గుండ్రటి టీ
టేబుల్స్ చుట్టూ నాలుగేసి కుర్చీలు వేసి ఉన్నాయి. వచ్చిన కస్టమర్స్ కి అతి శ్రధ్ధగా
మర్యాదలందిస్తున్నారు, ముకుంద్ లాంటి వాళ్లే మరికొందరు. అతను చూపించిన కుర్చీల్లో కూర్చుని,
కొనదల్చిన కారు వివరాలు చెప్పాను. అవన్నీ అలవాటే అన్నట్టుగా స్పెసిఫికేషన్స్ తెలియజేసే
పత్రాలు తెచ్చి, వివరాలన్నీనింపమని ఇచ్చాడు. నేనవి ఒకటొకటిగా నింపుతుంటే, ఒళ్లో పాపాయికి షోరూమ్ లో కార్లు చూపిస్తూ కూర్చుంది స్వాతి.
ముకుంద్ చెప్తున్న
వివరాలు శ్రధ్ధగా వింటుంటే ఇన్నాళ్ళ తర్వాత నేను కావాలనుకున్న ఒక లగ్జరీని పొందబోతున్న
ఉత్సాహం ఒకవైపు, నే వేసుకున్న బడ్జెట్ సరిపోతుందా అన్నసందేహం ఒకవైపూ, నా ఎన్నిక సరైనదేనా
అనే ఆందోళన మరో వైపూ పొట్టలో సీతాకోక చిలకల్ని ఎగరేశాయి.
టెస్ట్ డ్రైవ్ కోసం కారు తెరిచి లోపల కూర్చోగానే
శరీరమంతా ఒక ప్రకంపన.. రోడ్డు మీద రివ్వున దూసుకుపోతున్న కార్లో ముందు ముందు మా ప్రయాణాల్ని
తల్చుకుంటుంటే, కారు బేసిక్ మోడల్ కీ, మిడ్ రేంజ్ వేరియంట్ కీ మధ్య, ఖరీదులో ఉన్నతేడా
మనసులోకి వచ్చి చికాకు పెట్టింది. ఈ కారే నా స్థోమతకి కొంచెం పైన ఉంది. చిన్న చిన్న
అదనపు సౌకర్యాలకి ఇంకో యాభైవేలు. బేసిక్ మోడల్ చాలని స్వాతి వాదిస్తున్నా నా మనసు లోలోపలే
లెక్కలు కట్టడం మొదలు పెట్టింది.
కష్టపడి పైకొచ్చిన
నాబోటి వాళ్లంతా మొదట ఆల్టో లాంటి కారేదో కొంటారు. మెల్లిగా ఎప్పుడో కాస్త మెరుగైన
కార్లలో ఏదో ఒకటి ఎంచుకుంటారు. కానీ నాకు అలా కొనాలనిపించలేదు. అఖిల్ పుట్టినపుడు స్వాతి
చాలాసార్లు అంది, చిన్న కారొకటి కొనుక్కుందాం సెకండ్ హాండ్ దయినా సరే అని. అలా నాకు
నచ్చలేదు. కొనేదేదో మనసుకి నచ్చిందే కొనాలని గట్టిగా అనుకున్నా. ఎలాగూ స్వాతి పసివాడితో
తీరిక లేకుండా ఉంది. రెండేళ్లకే మళ్ళీ ప్రెగ్నెన్సీ. తనెక్కువగా పుట్టింట్లోనే గడిపాల్సి
వస్తుందని తెలుసు కనకా, అత్తగారిల్లు కూడా హైదరాబాదే గనకా ఇన్నాళ్లూ కారు కొనకుండానే
గడిపేశాను.
కంపెనీ తరఫున ఎక్కడికి పంపితే అక్కడికి కాదనకుండా వెళ్ళాను. అంకిత
పుట్టేసరికి హోండా సిటీ కొనగలిగే స్థితి వచ్చింది. ఒక్కోసారి మనం చక చకా ఎదుగుతున్నామనుకుంటాం.
కావాలనుకున్నది సొంతం చేసుకునే సమయం వచ్చిందనుకునేసరికి, ఆ ఎదుగుదల సరిపోని పరిస్థితి
ఏర్పడుతుంది! ప్చ్..
డ్రైవ్ పూర్తై స్వాతిని
ఇంట్లో దింపేసి ఆఫీస్ కి వెళ్ళిపోయాను. రమేష్ పుణ్యమా అని యాభైవేలకి పైగా తగ్గింపు
దొరికింది. చిన్న చిన్న అదనపు సౌకర్యాలు కావాలనుకుంటే ఇంకో యాభైవేలు సర్దాలి.
ఆఫీస్ పనిలో మునిగివున్నా
ఆలోచనలు బడ్జెట్ చుట్టూ తిరుగుతున్నాయి. రమేష్ కి ఒకసారి థాంక్స్ చెప్పాలని గుర్తొచ్చింది.
వాడి సెల్ కి ఫోన్ చేశాను. ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నాడు.
ఇంతలో “ఎవరో వెంకట్రామయ్య
గార్ట. నీ కోసం వచ్చారు” అంటూ స్వాతి ఫోన్ చేసింది.
“వెంకట్రామయ్య గారా?
ఎవరబ్బా.. ఎక్కణ్నించి వచ్చారు?”
“గొల్ల పల్లి నించి
వచ్చార్ట.... మనింటి కోసం తిరిగి తిరిగి వెతుక్కుంటూ వచ్చారు పాపం” అంది.
రకరకాలుగా పరిభ్రమిస్తున్న ఆలోచనల్ని అదుపు
చేస్తూ “గుర్తురావట్లేదే… ఎలా ఉన్నాడాయన?” అన్నాను.
“అరవై పైనే ఉండచ్చు
వయసు. సన్నగా పొడుగ్గా ఉన్నారు … బతికి చెడ్డవాడిలా కనిపిస్తున్నారు. కూర్చోమని కాస్త
మజ్జిగ ఇచ్చి నీకు ఫోన్ చేస్తున్నా”
స్వాతి మీద చాలా
చిరాకూ, కోపం వచ్చాయి. ఎవర్ని పడితే వాళ్లని ఇలాగే లోపలికి రానిస్తుంది!
“నీకేం పిచ్చా? ఏ
దొంగవెధవో అయినా ఇలాగే మజ్జిగా కాఫీ ఇస్తావా?”
“అబ్బా అంత తెలీదా
శశీ? మీ పాత ఇంట్లో అత్తయ్యా మామయ్యాతో ఆయన కూడా ఉన్నఫొటో చూపించారు. నీతో మాట్లాడాలని అడిగారు పాపం. మీరంతా
గొల్లపల్లి వదిలేసి వచ్చేశాక మీ వివరాలు తెలియ లేదనీ, పంటలన్నీ నష్టమై పరిస్థితి అంత
బాగా లేదనీ అంటే బాధనిపించింది. కూతురి పెళ్ళి కుదిరిందిట. నువ్వేమైనా సాయం చేస్తావేమో అని వచ్చార్ట!”
మెరుపు మెరిసినట్టయింది.
ఈయనకి నా ఎడ్రెస్ ఎలా తెలిసిందీ?
ఇంతలో రమేష్ నించి
ఫోన్, ఆఫీస్ లాండ్ లైన్ కి. వాణ్ని హోల్డ్ లో పెట్టి, “స్వాతీ ఆయన కో వెయ్యి రూపాయలిచ్చి
పంపెయ్యి” అన్నా. అటు వైపొక క్షణం మౌనం.
“ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నారు”
“ఇప్పుడు చాలా బిజీగా
ఉన్నాను స్వాతీ…తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి పంపెయ్. ఫోన్ నంబర్ తీసుకో”
“పెళ్ళి ఈ శని వారమే
శశీ. మీ ఊరివాడు. బతికి చెడ్డ రైతు” స్వాతి ఫోన్ మధ్యలోనే కట్ చేసి, రమేష్ తో “ఎక్కడున్నావురా?”
అన్నా.
“శశీ! సతీష్ ఇంక
లేడురా” రమేష్ గొంతు దుఃఖంతో బరువుగా వినపడింది.
అవాక్కయ్యాను. ఎక్కడో
గొల్లపల్లి నించి ఈ వెంకట్రామయ్య, ఇంతటి మహా నగరంలో నా ఇల్లు కనుక్కుని రావడమేమిటి? ఇటు చూస్తే, పూనా నించి స్నేహితుడి గృహప్రవేశం కోసం
వచ్చిన రమేష్ తమ్ముడు ఈ ఊళ్లో చనిపోవడమేమిటి?
“అదేమిట్రా? ఎలా?”
గొంతు పెగుల్చుకుంటూ అడిగాను.
“నిన్న వాడి ఫ్రెండ్ గృహప్రవేశానికి వెళ్ళారు కదా వాడూ అనితా.
సిటీకి దూరంగా ఎక్కడో మారుమూల కాలనీ కదా అని నా కారు తీసుకెళ్లమన్నాను. నేను కాబ్ లో
వెళ్లిపోయా. అక్కణ్నించి వెనక్కి వస్తూ ఛాతీలో నెప్పిఅన్నాట్ట. మరీ ఎక్కువయ్యేసరికి
రోడ్ పక్కన కారాపి, లిఫ్ట్ కోసం ప్రయత్నించార్ట. అక్కడంతా నిర్మానుష్యంగా ఉండడం, ఫోన్
చార్జ్ అయిపోవడంతో అనిత చాలా భయపడింది. చాలాసేపు లిఫ్ట్ దొరకలేదుట. చివరికి ఏదో బస్సెక్కి
సిటీకొస్తూ బస్సులో ఎవరిదో ఫోన్ తీసుకుని, నాకు ఫోన్ చేసింది. కొలీగ్ కారు తీసుకెళ్ళి
మధ్యదారిలో వాళ్లని కలుసుకుని కేర్ హాస్పిటల్ కి తీసుకెళ్లాను. కారు కీస్ ఇచ్చి ఇద్దరు
కుర్రాళ్లని పంపి కారు తెప్పించాను. రాత్రంతా జాగారమే. పొద్దున్న పదింటికి…. బాడీ తీసుకెళ్లమని
ఇచ్చేశారు”
వెంటనే బయల్దేరి
రమేష్ ఇంటికి వెళ్ళాను. అప్పటిదాకా ఏ అనారోగ్యమూ లేకుండా వయసులో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా
ఈ లోకాన్ని వదిలిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో రమేష్ ఇంట్లో ఎదురుగా కనిపించింది. అనిత,
ఆమె తల్లిదండ్రులు, తోబుట్టువులు, రమేష్ కుటుంబం .. అంతా శోక సముద్రంలో కొట్టుకుపోతూ
కనిపిస్తున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి.
హాల్లో ఒక పక్కగా
సోఫాలో కూర్చున్న రమేష్ వాళ్ల నాన్నగార్ని చూస్తే మనసు ద్రవించిపోయింది. వయసు మీదపడి
వంగిపోయిన నడుము. బూడిదరంగులోకి తిరిగిన కనుపాపలు. పిడుగులా నెత్తిన పడ్డ కొడుకు మరణ
వార్త. షాక్ లో ఉన్న ఆయన వాలకం చూస్తూ అప్రయత్నంగా అటు వైపు అడుగులేశాను.
హఠాత్తుగా ఆయన దృష్టి
నామీద పడింది. ఒక్క క్షణంలో ఆ ముఖ కవళికలు మారిపోయాయి. ఆవేశంగా లేచి తూలుతూ వచ్చి నా
కాలర్ పట్టుకుని ఊపేస్తూ, “ దుర్మార్గుడా! నా కొడుకుని పొట్టన పెట్టుకున్నావు కదరా
రాక్షసుడా!” అంటూ అరిచాడాయన.
నిర్ఘాంతపోయాను.
“అంకుల్! నేను
.. శశిధర్ ని” అంటూ చెప్పబోయాను.
ఆయన ఎడం చేత్తో నా
కాలర్ ని అలాగే గుంజి పట్టుకుని, కుడి చేత్తో నా చెంప ఛెళ్ళుమనేలా ఒక్కటిచ్చాడు. అంత
శక్తి ఎలా వచ్చిందో. ఒక్క క్షణం నా కళ్ళు బైర్లు కమ్మాయి. చెంప భగ్గున మండిపోయింది. శరీరం లోని రక్తమంతా మొహం లోకి వచ్చేసినట్టనిపించింది.
హాల్లో అంతా మా వైపు తిరిగారు. లోపల్నించి రమేష్
పరిగెత్తుకు వచ్చాడు. నా కాలర్ విడిపించడానికి ప్రయత్నిస్తూ “ నాన్నా! వీడు శశి.. మర్చిపోయారా?” అని నాతో “ సారీరా శశీ. ఎక్స్ ట్రీమ్లీ సారీ! నాన్నగారు..తెలుసు
కదా అల్జీమర్స్ అడ్వాన్స్ అవుతోందని..ఇంతలో ఈ షాక్ ” అన్నాడు.
“శశా? ఎవడా శశి?
మూర్ఖుడా! మర్చిపోయావా వీడు ఏలూరు నించీ కార్లో వస్తుంటే మన కారాపి నన్ను కత్తితో పొడిచి
మీ అమ్మ మెళ్లో నగలు దోచుకుపోయిన దొంగ వెధవ. గుర్తు లేదా?.. నీ పెళ్ళాం ఏదిరా త్రాష్టుడా!
దొంగ పురిటి నెప్పులు నటించి, మానవత్వంతో కారాపినందుకు ఇద్దరూ కలిసి నిలువుదోపిడీ చేశారు?
సిగ్గులేదురా? ” అష్ట వంకర్లు తిరిగిన ఆయన మొహంలో క్రోధం, అసహ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే
దిగ్భ్రాంతితో నిలబడిపోయాను.
“అంకుల్! మీరు పొరబడుతున్నారు.
నేను శశిధర్ని.. రమేష్ స్నేహితుణ్ని..” తడబడుతూ చెప్పేంతలో “నోరుముయ్ త్రాష్టుడా..
నీలాంటి వెధవల వల్లే మనిషి మీద మనిషికి నమ్మకం పోయింది. మానవత్వం మంటగలిసింది. క్షేమంగా
ఉండాలంటే ఎవడికీ సాయం చెయ్యకూడదనే ఆలోచన కలుగుతోంది” అన్నారు రొప్పుతూ.
ఆయన అరుపులకి అంతా
గుమిగూడుతుంటే, నా కాలర్ విడిపించుకుని షర్ట్ సరిచేసుకున్నాను. మనసంతా అవమాన భారంతో
భగభగలాడింది. రమేష్ నా చెయ్యి పట్టుకుని పక్కనున్న గ్రిల్డ్ వరండాలోకి తీసుకొచ్చి కుర్చీలో
కూర్చోపెట్టాడు. మాటల్లో చెప్పలేని భావాన్ని కళ్ళతో పలికిస్తూనా చేతులు పట్టుకుని క్షమాపణగా
చూశాడు.
నన్ను నేను సంబాళించుకుంటూ “ఏం పర్వాలేదులేరా.. అంత
అర్ధం చేసుకోలేనా.. నువ్వెళ్లు” అని వాణ్ణి లోపలికి పంపించాను. గుమ్మంలోంచి సతీష్ శవం
కనిపిస్తోంది. సన్న సన్నగా ఏడుపులూ పరామర్శలూ మధ్య రమేష్ వాళ్ల నాన్నగారి మాటలు కూడా
ఆగి ఆగి వినిపిస్తున్నాయి.
“దొంగ వెధవల్లారా!
మీకు దోచుకోవాలనుకుంటే దోచుకోండిరా! సినిమాకొచ్చిన వాళ్ల పర్సులు కొట్టేయండి. ఎవడూ
సినిమా చూడ్డం మానడు. రోడ్డు మీద నడిచే ఆడవాళ్ల గొలుసులు లాగేయండి. ఎవడూ రోడ్డు మీద
నడవడం ఆపేయడు..రైలు స్టేషన్ లో పెట్టెలు కొట్టెయ్యండి. ఎవ్వడూ ప్రయాణాలు ఆపెయ్యడు.
..
“మానవత్వాన్ని పాతరేసే
పన్లు మాత్రం చెయ్యకండిరా నాయనల్లారా! ప్రాణాపాయంలో ఉన్నట్టు నటించి,సాయానికొచ్చిన
వాళ్లని పొడిచి మరీ దోచుకోకండిరా! మీవల్ల ఎవ్వరూ ఎవ్వరికీ సాయం చెయ్యడానికి రాకుండా పోతార్రా. ఎంత అవసరమైనా ఎవడి
చావు వాడిని చావమని వదిలేస్తార్రా కిరాతకుల్లారా”
దిమ్మెక్కిన తలలోకి
ఆ మాటల అంతరార్థం దిగుతుంటే, జరగవలసిన పనుల గురించి కనుక్కుంటూ, నాకు తోచిన పనులు అందుకుంటూ
గడిపాను. చూస్తూండగానే అంతిమ యాత్రకి అంతా సిధ్ధమైంది. తండ్రి ఉన్నవాళ్లు శ్మశానానికి
వెళ్లకూడదన్నారు. ఇక అక్కడుండి చేసేదేం లేదని ఇంటికి బయల్దేరాను.
మోటర్ సైకిలెక్కుతుంటే
రమేష్ వచ్చాడు. చెమ్మగిల్లిన కళ్లతో వాడివైపు చూశాను.
“దూర ప్రయాణాలు కార్లో
వెళ్తుంటే నాన్న ఎప్పుడూ చెప్పేవారు.. ఎవరన్నా లిఫ్ట్ అడిగితే కారాపకండిరా అంటూ. నిండు చూలాలిలా, రోడ్డు మధ్య నెప్పులు పడుతున్నట్టు
హెల్ప్ లెస్ గా కనపడ్డ స్త్రీ మోసం చేస్తుందనుకోలేదేమో, ఆ దారిదోపిడీ… దోపిడీని మించి
తన భుజమ్మీద కత్తితో పొడిచి, అమ్మనీ నాన్నగార్నీ భయ భ్రాంతుల్ని చేసి దోచుకోవడం … ఆ
సంఘటన ఆయన మీద అలా ప్రభావం చూపించింది. ‘మంచికి పోయి ప్రాణాపాయం తెచ్చుకోవద్దు నాన్నా’
అంటూ ఒకటికి నాలుగుసార్లు చెప్పే వారు. ఇప్పుడు సతీష్…” గద్గదమయిన గొంతుని కంట్రోల్
చేసుకుంటూ “టైమ్ కి సహాయం దొరికుంటే వాడు బతికేవాడు. అనిత చెప్పింది, దాదాపు గంట సేపు…
అయిదారు కార్లు అటునించి వచ్చినా ఎవరూ ఆపలేదుట. వాణ్ని పోగొట్టుకున్న బాధలో నాన్నగారు
..” బరువుగా అన్నాడు.
“అదేం పర్లేదురా..
మీమీద వచ్చిపడ్డ కష్టంతో పోలిస్తే ఇదెంత చిన్నవిషయం!” వాడి భుజం మీద చెయ్యేస్తూ “నన్ను
చూసి అలా ఎందుకు రియాక్ట్ అయారో, అది మాత్రం అర్థం కాలేదు” అన్నాను వద్దనుకుంటూనే.
“నీ షర్ట్ చూసి అనుకుంటా!
‘అదే గళ్ల షర్ట్’ అంటున్నారు వినలేదా. ఉంగరాల జుట్టో, కళ్లో, ముక్కో ఇంకా ఎక్కడో ఏదో పోలిక కనిపించి ఉండచ్చు కూడా....” సాలోచనగా
అన్నాడు.
లోపల్నించి ఎవరో
రమేష్ ని పిలిచారు. “శశీ....ఇదంతా మనసులో పెట్టుకోకు..ప్లీజ్” అనేసి లోపలికి వెళ్ళిపోయాడు.
ఇల్లు చేరేసరికి
స్వాతి ఎదురొచ్చింది దిగులు మొహంతో. “గీజర్లో వేణ్నీళ్ళున్నాయి. ఏవీ ముట్టుకోకుండా
స్నానం చేసి రా” అంది క్లుప్తంగా. తలారా స్నానం చేసి, ఏదో తిన్నాననిపించి మంచం మీద
వాలాను. లోపలేదో అశాంతి. ఆ గిన్నెలవీ సర్దేసి వచ్చి పక్కమీద కూర్చుంది స్వాతి. అటు
జరిగి, తన ఒళ్లో తల పెట్టుకున్నా.
కొంతసేపటి
నిశ్శబ్దం.. కొంత ఓదార్పు.
“వెంకట్రామయ్య గారి విషయం ఏమయింది స్వాతీ? ఏం చేశావు
ఇందాక?” అడిగాను.
“ఫోన్ నంబర్ తీసుకోమన్నావుగా..
తీసుకున్నా. మాట్లాడతావా?” ఆత్రంగా అడిగింది.
“ఆయన
మావూరి మోతుబరి రైతు స్వాతీ. చిన్నపుడు మేమంతా చిన్నాచితకా సాయాలు ఆయన్నించి అందుకున్న
జ్ఞాపకాలున్నాయి. ఆయనా తన పిల్లల చదువు విషయంలో ఏవైనా అనుమానాలొస్తే నాన్నదగ్గరకి వచ్చేవారు.
నేను పై చదువుకి వెళ్ళిపోయాక అప్పటి జ్ఞాపకాలన్నీ మరుగున పడిపోయాయి. అలా ఎలా మర్చిపోయానో..
అప్ వార్డ్లీ మొబైల్ అంటారే, ఆ బాపతు మనుషుల్లో ఒకణ్ని నేను. చక చకా ఎదగాలనే తాపత్రయంలో
నేనెక్కి వచ్చిన మెట్లనే మర్చిపోయాను!
“ ఆయన నీతో చెప్పని
విషయం ఒకటుంది... చదువు కోసం హైదరాబాద్ కి వస్తున్నపుడు ప్రయాణానికీ, హాస్టల్ ఫీజులకీ
ఆయన దగ్గర నేను కొంత డబ్బు తీసుకున్నాను. డిగ్రీ క్వాలిఫికేషన్ తో వచ్చిన ఉద్యోగం వదిలేసి,
పీజీలో చేరడం నాన్నకి ఇష్టం లేకపోయింది. అందుకని నాన్ననడక్కుండా వెంకట్రామయ్య గార్నడిగి
అవసరమైన మొత్తం తీసుకున్నాను. ఎంత తీసుకున్నానో కూడా గుర్తులేదు. ఆయన అప్పట్లో… చిన్న
మొత్తాలే అనుకో, చదువుకునే కుర్రాళ్లకి లేదనకుండా సాయం చేసేవాడు. తిరిగిస్తానని ఆయనా
అనుకుని ఉండడు. తీసుకున్నపుడు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలనే అనుకున్నాను గాని తర్వాత ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను!”
నా తల నిమురుతూ నిశ్శబ్దంగా
కూర్చుంది స్వాతి. రమేష్ ఇంట్లో జరిగిందంతా చెప్పి, “పెద్దాయన తిట్టిన తిట్లకీ, కొట్టిన
చెంప దెబ్బకీ, వెంకట్రామయ్య గారి విషయంలో పొద్దున నేను ప్రవర్తించిన తీరు జ్ఞాపకం వచ్చింది
స్వాతీ! ఒక వ్యక్తి ప్రతిఫలం ఆశించకుండా మనకి సాయం చేస్తే అతనికి అవసరం వచ్చినపుడు
అడక్కుండానే మనమూ సాయం చెయ్యాలి. అడిగినా మొహం చాటేసే వాళ్ళకి ఇలాంటి చెంపదెబ్బ అవసరమే”
అన్నాను. స్వాతి ఆ చెంప మీద మృదువుగా రాసింది.
కాసేపటి మౌనం తర్వాత
“వాళ్లమ్మాయి పెళ్ళి ఎప్పుట్ట?” అడిగాను.
“ఈ శనివారమే” అంది.
లోపలి బాధనించి ఉపశమనం
కోసం ప్రయత్నిస్తూ స్వాతినడిగాను, నా ఫోన్ పట్టుకురమ్మని.
***
No comments:
Post a Comment