January 19, 2016



నా కథ 'విముక్త' గురించిన ప్రస్తావన ఉన్న ఈ వ్యాసాన్ని ఒక ఫ్రెండ్ నాకు పంపించారు.
ఆంధ్ర జ్యోతిలో వచ్చిన 'మన కథల్లో మానవ సంబంధాలు' వ్యాసం link ఇక్కడ --
http://epaper.andhrajyothy.com/detailednews…
   'విముక్త' లో మామ్మగారి పరిస్థితి గురించి హృదయ విదారకంగా వర్ణించాననడం సరికాదు. కథలో జయ తో పాటుగా పాఠకుడు ప్రయాణించేలా కథని నడపడం జరిగింది. జయకి మామ్మగారితో అనుబంధం వల్ల ఆమె ఆవిడ పక్షాన ఆలోచిస్తుంది. చివరికి మామ్మగారి వదనంలో ఎంతో కాలంగా చోటు చేసుకున్న విచారరేఖ ఎందువల్ల మాయమయిందో తెలియక ఆశ్చర్యపోతుంది. 
   ఆవిడ ఆలోచనలో కలిగిన మార్పు జయకీ, పాఠకులకీ కూడా పుస్తకంలో ఆవిడ రాసుకున్న నాలుగు వాక్యాల ద్వారా ఒక్కసారే తెలిసేలా కథా నిర్మాణం చేయడం జరిగింది. మూడేళ్ల జయ కొడుకు తప్పిపోయినపుడు తన ఆకలి తనకి తెలియని పసి వాడు తల్లికి దూరమై ఎలా బతుకుతాడని జయ దుఖించడం గమనించిన మామ్మగారు, తన కొడుకు అలా ఆధారపడ్ద స్థితిలో లేడనీ, తను లేకపోయినా తన లోటు అతనికేమీ ఉండదనీ అర్ధం చేసుకుంటుంది.     
    మామ్మగారు కొడుకు పట్ల తన పాశం తననెలా లాగుతోందో తెలుసుకున్న క్రమాన్నికథలో వివరించడం జరిగింది. ఆ పాశం సృష్టిలోని ప్రతి బిడ్డ పట్లా ప్రతి తల్లికీ ఉండడం, 'సృష్టి సవ్యంగా కొనసాగడం కోసం ఏర్పడ్డ ఆవశ్యకత'గా ఆమె అర్ధం చేసుకుంటుంది. ఎదిగిన కొడుకు పట్ల తనకి గల విపరీతమైన మమకారం తన ఇహపరాలకు మంచిది కాదని ఆమె తెలుసుకుని, అతని పట్ల తన పాశాన్ని జయించగానే ఆమెకు మరణం సిధ్ధిస్తుంది. అంతే గాని వ్యాసకర్త రాసినట్టు అది ఇచ్చామరణం కాదు.
    'చివరికి మరణాన్ని కోరుకోవడాన్ని ఆ సమస్యకి పరిష్కారంగా చూపుతుంది' అని వ్యాసకర్త తేల్చేయడం, కథని ఆమె సరిగ్గా అర్ధం చేసుకోలేదని తెలియజేస్తుంది. పాశవిముక్తే ఆమె సమస్యకి పరిష్కారం. అది జరిగి ఆమెకు మరణం సిధ్ధించింది. అదే స్థితిలో మరొక వ్యక్తి ఇంకా ఎన్నో ఏళ్లు బతక వచ్చు, అదే డిటాచ్మెంట్ తో, ప్రశాంత చిత్తంతో.
     పాశ విముక్తి జరగగానే ఆమెకి లభించిన ప్రశాంతత 'విముక్త' కథలోని ముఖ్యాంశం. 
    'అదే రోజు' తను చనిపోతుందని ఆమెకు తెలిసినట్టు నేను రాయలేదు. కాకపోతే ఆసన్నమైన మరణాన్ని ఆమె ఫీల్ అయింది. 
     ఆమె ఇచ్చామరణాన్ని స్వీకరించగల శక్తి గలదైతే అంతకుముందు "ఆ భగవంతుడు ముసలాళ్లందరికీ కావాలనుకున్నపుడు వెళ్ళిపోగలిగే ఇచ్చాశక్తి ఇస్తే బావుండేదనిపిస్తుంది"-" ఆ పైవాడైనా, 'నీ పనులన్నీ చేసేశావు కదే ముసలిదానా .. ఇంక రా' అని వెనక్కి రప్పించుకోడు" అనాల్సిన అవసరం ఏముంది?
అలాగే ఈ వాక్యం తర్వాత
     ".. శరీరానికి ఏ ఇబ్బంది వచ్చినా అపర ధన్వంతరి నా కొడుకే .. వెంటనే మందూ, మాకూ పడిపోతాయి. ఆ యముడైనా ఎలా పట్టుకుపోతాడు పాపం " అక్కసుగా అన్నారు--అన్న వాక్యంలో -- 
    వద్దనుకున్నా పొడిగించబడుతున్నజీవితం పట్ల ఉక్రోషాన్ని చూపే 'అక్కసు'మాటని హైలైట్ చేసి 'కృష్ణారామా అనుకోవాల్సి రావడం పట్ల' అక్కసుగా వర్ణించారు వ్యాసకర్త!
    కొడుకు పట్ల తన పాశాన్ని జయించగానే ఆమె మనసు తేటనీటి కొలనులా తెరిపిన పడుతుంది. కథలో 'ఆఖరి రోజే కాదు అంతకు నాలుగు రోజుల ముందు నించీ, కారణం ఏమిటో గాని ఆవిడ చాలా స్థిమితంగా, తేటనీటి కొలనులా అనిపించారు. నీరెండలో కమలంలా వెలుగుతూ కనిపించారు' అన్న వాక్యాలు ఈ విషయాన్ని సూచిస్తాయి.
    ఆ స్థితిలో ఆమెకు మరణం సిధ్ధిస్తుంది. తన ప్రశాంత మానసిక స్థితిలో ఆమె రాసుకున్న వాక్యాలు జయ చదువుతుంది--
   "వాడేమి పసివాడా, అమ్మ కనపడక పొతే బెంగ పడడానికి? వాడి గురించి నాకింత వ్యాకులత అవసరమా? బంగా వయసులో అయితే వదిలి వెళ్ళరాదు. ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగపడడని ఖరారుగా తెలుస్తుందో అప్పుడు ఆ తల్లి తన బిడ్డని, తన పాశం నుంచి విముక్తుడిని చెయ్యాలి. అతడినే పట్టుకు వేళ్ళాడుతూ వెనక్కి లాగరాదు. నేను పోతే ఇతడెట్లా బతుకుతాడు అనేంతగా ఒక ఎదిగిన బిడ్డ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటే, అది ఆ తల్లి ఇహ పరాలకి మంచిది గాదు. సంతానం తల్లి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటే ఆ తల్లి ముక్తిని పొందడమెలా ? "
    ఇక్కడ స్పష్టంగా, ఆఖరి దశలో మామ్మగారి మానసిక స్థితి తెలుస్తోంది కదా. జయ కూడా  మామ్మగారి స్థితిని ఆమె రాసిన వాక్యాలు చదివి తెలుసుకుంది. పాఠకులూ అలాగే తెలుసుకోవాలని రచయితగా నేను భావించాను.
ఇక కథలోని సంఘటనల దగ్గరికి వస్తే-
--------------------------
లోపల రాజారావు గారు మామ్మగారితో మాట్లాడుతున్నారు. విషయమేమిటో అర్ధం కాలేదు గాని " బుద్ధిలేకపోతే సరి... ఏళ్ళొచ్చాయి ఎందుకూ " విసురుగా అన్నమాట చెవిలో పడింది.
--------------------------
జారి పడి కాలు విరిగిన మామ్మగారితో కొడుకు రాజారావు జయ సమక్షంలో అంటాడు...
" మళ్ళీ పనికిమాలిన అభిమానం ఒకటి. వాడూ నేనూ లేవదీస్తున్నాం కదా , మాట్టాడకుండా ఊరుకోదు .. ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఆ కాలు పనికి రాకుండా పోతుంది... ఇప్పుడే చెప్తున్నా " అన్నారు గదిమినట్టు
--------------------------
     మానవసంబంధాల గురించి చర్చిస్తున్న వ్యాసంలో వ్యాసకర్త , కొడుకు తల్లితో కటువుగా మాట్లాడితే ఆ తీరుని 'తల్లి హుందాగా స్వీకరించా'లనడం, ఆ తల్లి బాధపడితే 'అది సమర్ధించ వలసిన విషయం కాదు, సర్ది చెప్పవలసిన విషయం' అనడం వింతగా ఉంది.
    "కథ ఆ పని చేయకపోగా ఆ విషయాన్ని హృదయ విదారకమైన విషయంగా వర్ణించి చివరికి మరణాన్ని కోరుకోవడాన్ని ఆ సమస్యకి పరిష్కారంగా చూపుతుంది. ఇది ఇహానికీ పరానికీ కూడా పనికిరాని పరిష్కారం" అనడం ఆశ్చర్యకరంగా ఉంది. 
    కొడుకు సరిగా చూడక కాదు, శరీరం సహకరించని స్థితిలో చాలా మంది వృధ్ధులు అలా కోరుకుంటారు. మా పెద తాతగారు, మా తాతగారు, మామ్మగారు, నా భర్త బామ్మగారు, మా మామగారు .. ఇందరి అంత్య దశలు నేను దగ్గరగా చూశాను. ప్రస్తుతం బెడ్ రిడెన్ స్థితిలో మా నాన్నగారున్నారు. శరీరం దుర్బలమైపోయి ఇతరులమీదే ఆధారపడి బతుకుతున్న ముసలివారెందరో సహజ సునాయాస మరణాన్ని వరంగా కోరుకుంటూ ఉండడాన్ని ప్రత్యక్షంగా చూశాను. 
    మా వారి బామ్మ ఎన్నోసార్లు అనేవారు," ఈ శరీరం పనికిరానిదైపోయిందమ్మా. ఆ పైవాడు చూస్తే నన్ను మరిచిపోయాడు! అందరినీ తీసుకుపోతున్నాడు గాని నన్నిక్కడే వదిలేశాడు. వాడి చిట్టాలో నేను లేను" అంటూ.
    జీవితపు ఈ కోణాన్నిఅతి దగ్గరగా చూసిన వ్యక్తిగా ఈ కథ రాశాను. 
    ఆదర్శానికీ ఆచరణకీ మధ్యలో ఉంటుంది - వ్యక్తుల సంఘర్షణ. 
    అది కథలో ప్రతిఫలించకూడదనీ, ఆదర్శాలతోనే కథ నింపాలనీ అంటే అది నీతి కథగా రూపొందుతుంది.
     ఈ కథ చదవాలనుకునే పాఠకులకోసం లింక్
http://vanalakshmi.blogspot.in/2014/07/blog-post.html

    పాఠకులు వారి స్పందనను comments లింక్ నొక్కి పొందుపరచ వచ్చు

No comments:

Post a Comment