April 21, 2013

అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ        
         అమ్మా నాన్నా ఓ కాలేజీ అబ్బాయీ
ప్రకాష్ కనబడ్డం లేదుట !
సీతపిన్ని ఫోన్ చేసి ఇంటర్ ఫలితాలు వచ్చినప్పటి నించీ  దిగులుగావున్న  చలపతీ, సుజాతా, ఒక్కగానొక్క  పిల్లవాడు ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో పూర్తిగా కుంగి పోయారనీ, వాడు క్షేమంగా ఉన్నాడో లేదోనని తల్లడిల్లిపోతున్నారనీ చెప్పింది.
అప్పుడే తల్లిదండ్రుల ఎక్స్ పెక్టేషన్స్ ని అందుకోలేక కుంగుబాటుకి గురైన కుర్రాడికి కౌన్సెలింగ్ చేసి వచ్చానేమో, చలపతి మీదా సుజాత మీదా చెప్పలేనంత కోపం వచ్చింది. చదువుకున్న మూర్ఖులు అనుకున్నాను. ఇలాంటి తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ మానసికరోగుల సంఖ్యా, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్యా పెరిగి పోతూనే ఉంటుంది. పరిమిత కుటుంబాలూ, పెద్దలెవరి జోక్యం లేకుండా పిల్లల్ని పెంచుకోడాలు, ఎవరికి వాళ్లే మిగిలిన వాళ్లంతా మూర్ఖులనీ, తాము మాత్రం పిల్లల్ని అద్భుతంగా పెంచగల విజ్ఞులమనీ విర్రవీగడం, ఆ పసి వెధవలకి ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకుందుకు అమ్మమ్మో, మామ్మో, తాతో దగ్గర ఉండే అవకాశం లేకపోవడం తలుచుకుంటే మనసు ఉసూరుమంది. తమ పెంపకంలో పిల్లలు తాము సాధించలేకపోయినవన్నీ సాధించి, గొప్ప ప్రయోజకులై రెండు చేతులా డబ్బూ, పేరూ సంపాదిస్తారనీ, అప్పుడు ప్రపంచమంతా తమని గుర్తించి హారతి పడుతుందనీ, ప్రతి జంటా ఆశల పేకమేడలు కట్టుకోవడం  నాకర్థం కాని ప్రశ్న అయికూర్చుంది. ఎదురింట్లోనో, పక్కవీధిలోనో, లేకపోతే బంధుమిత్రుల్లోనో పోటీ పరీక్షల్లో గొప్ప రాంకులు తెచ్చుకున్నవాళ్ళతో పోల్చి, వాడికన్నా నీకేం తక్కువ చేశాం?’ అంటూ ఆ పసి మనసుల మీద మోయలేని భారం పెట్టడం, వాళ్ళని గొప్పగా మోటివేట్ చేస్తున్నామనే భ్రమలో పరుగులు పెట్టడం... ఏమిటిదంతా?
పిల్లలు తల్లిదండ్రుల పరిస్థితినర్థం చేసుకోలేకపోవచ్చు.. వాళ్ళకా  అనుభవం లేదు గనుక. ఈ తల్లి దండ్రుల కేమయింది ? ఒకప్పుడు వాళ్ళూ పిల్లలే గా? తమ ఆశల బరువుకి కుంగిపోయి, తమ ఆంక్షల తీవ్రతకి జడిసిపోయి ఆ పసివాళ్ళు వెనక్కి తీసుకోలేని అడుగేస్తే తలమీద పిడుగుపడ్డట్టు షాక్ కి గురవడమేమిటి? పోనీ అలా దెబ్బతిన్నవాళ్ళని చూసి పక్కవాళ్లైనా బుద్ధి తెచ్చుకుంటారా? అబ్బే.తమ పిల్లలు అలాంటి వాళ్ళు కారనుకుంటూ అదే తప్పు చేస్తూ పోతారు!  మూర్ఖులు !
స్నానం చేస్తున్నంతసేపూ ఈ మధ్య నాదగ్గరకొచ్చిన ఇలాంటి కేసులెన్నో గుర్తొచ్చాయి. తలనెప్పి సర్దుకుంటుందేమోనని తలారా చన్నీళ్ళ స్నానం చేసొచ్చి కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చున్నాను. నల్లబడుతున్న ఆకాశాన్ని, ఒకటొకటిగా తళతళలాడుతూ కానవస్తున్న చుక్కల్నీ చూస్తూ, వేడి కాఫీని ఆస్వాదిస్తుంటే అమ్మ ఫోను. సీత పిన్ని చెప్పిన విషయమే తనూ చెప్పి అమ్మలూ! ఒక్కసారి వెళ్ళి చూసిరా తల్లీ ! కార్లో పది నిముషాల ప్రయాణం ! వాళ్ళకేదైనా సాయం చెయ్యడానికవుతుందేమో చూడు. ఒక్కగానొక్కడువాడి మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారన్నది  తెలిసిన విషయమే.. వాడేదన్నా అఘాయిత్యం చేసుకున్నాడేమో అని భయపడిపోతున్నార్ట, సీత చెప్పింది! ఒక్కసారి విషయం కనుక్కుని, మాట్లాడి రా..అంది.
నేను వెళ్ళనమ్మా! నాకు చిరాకు. ఎంతమంది పిల్లలో ఇలా తల్లిదండ్రుల మూర్ఖత్వానికి బలైపోతుంటే ఈ పెద్దవాళ్ళకి వాళ్ళని చూసైనా బుద్ధిరాదేం? టెన్త్ రిజల్ట్స్ వచ్చీ రాకముందే  ప్రకాష్ ని ఆ బెస్ట్ బ్రెయిన్స్కాలేజీలో చేర్పించారని తెలిసినపుడు నేనేమన్నానో గుర్తుందా? గంటసేపు ఒకచోట కూర్చుని చదవడానికి ఆపసోపాలు పడిపోయేవాణ్ణి తీసుకెళ్ళి, ఏసీ రూములూ, గొప్పసదుపాయాలూ ఉన్న సూపర్ కాలేజీలో చేర్పిస్తే, కాలేజీ వాళ్ళే వాణ్ణి సానపట్టేసి, ఐఐటీ  పోటీ పరీక్షలో కోరుకున్న  రాంకు తెప్పించేస్తారని ఎలా అనుకున్నార్ట?” చిరాకు పడ్డాను.
ఈ హైదరాబాదు నిండా చుట్టాలే. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక అవసరం...అడిగినా అడక్కపోయినా అందరికీ సాయపడాలని అమ్మ తాపత్రయం. ఆవిడ కోరినట్టు జీవించాలంటే మనకంటూ కాస్తైనా సమయం మిగిలే అవకాశం ఉండదు. పైగా ఈ కాలంలో అడక్కుండా సాయానికి బయల్దేరితే దాన్ని అనవసర జోక్యం అంటారని ఆవిడకి తెలీదు.
నీలూ!అందరి సమస్యలూ ఒకలాగే ఉండవు! అయినా ఇది వాద వివాదాలకి సమయం కాదు. నీకు వీలవదంటే నాన్నగారికేదో ఏర్పాటు చేసి, నేనే వస్తాను. ఇలాంటి సమయంలో వాళ్ళకి పెద్ద వాళ్ళ అండ అవసరం. రాత్రి బస్సుకి బయల్దేరితే పొద్దుటికల్లా వాళ్ళింట్లో ఉంటాను. దేవుడి దయ వల్ల వాడు క్షేమంగా తిరిగొస్తే అప్పుడు నీ ఉపన్యాసాలన్నీ వినిపిద్దువు గాని !” అంది నిష్ఠూరంగా.
అమ్మా! ఇప్పుడే వచ్చానే ఆస్పత్రి నించీ...ఇవాళంతా వరసగా పేషెంట్లే ! తల వాచిపోయింది. ఇప్పుడే ఇంటికొచ్చి కాఫీ తాగుతున్నా. రేపు పొద్దున్నే  వెళ్తా. సరేనా ?” అన్నాను అనునయంగా.
సరే తల్లీ ! “ అని వాళ్ళతో కాస్త సామరస్యంగా ..అంటూ ఏదో చెప్పబోయింది.
అమ్మా! నాకు తెలీదా ఆ మాత్రం ? రోజుకి పది మందికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చేస్తున్నాసరే నీ దృష్టిలో మాత్రం వెర్రిపిల్లనే  అన్నా నవ్వుతూ.
సరేలే తల్లీ! ఏదో చాదస్తపు పీనుగునీ.. వదిలెయ్! ఆ కాఫీ తాగి అలాగే నిద్రపోయేవు. కాస్త చల్లగా పెరుగన్నం తిని పడుకోఅని ఒకటికి రెండు సార్లు చెప్పి పెట్టేసింది.
పొద్దున్నే తొమ్మిదింటికిచ్చిన ఎపాయింట్ మెంట్  కాన్సిల్ చేసి, ఉదయపు నడక ఎగ్గొట్టేసి, ఎనిమిదింటికే ఇంట్లోంచి బయటపడ్డాను. చలపతి ఇల్లు చేరేసరికి పావు తక్కువ తొమ్మిది. సరిగ్గా అరగంట ఉండి వెళ్ళిపోవాలనుకుంటూ లోపల అడుగుపెట్టా....
మూడో అంతస్తులోని అపార్ట్ మెంట్ తలుపు తెరిచే ఉంది. హాల్లో ఎవరూ కనిపించలేదు. బెల్ కొట్టనా వద్దా అనుకుంటుంటే గదిలోంచి బయటికి వస్తూ చలపతి కనిపించాడు. చెవిలో సెల్ ఫోను.
సరేలే అన్నయ్యా ! మేం బానే ఉన్నాంలే.. బెంగ పడకు. మళ్ళీ ఫోన్ చేస్తాలే అని పెట్టేసి, నన్ను పలకరించి, కూర్చోమని సోఫా చూపించాడు.
అమ్మా, సీతపిన్నీ ఫోన్ చేస్తే ఉండబట్టలేక వచ్చానురా. ఏమన్నా కబురు తెలిసిందా?” అన్నా.
చాలా థాంక్సక్కా. నీ బిజీ షెడ్యూల్ సర్దుకుని మా కోసం వచ్చావు...నిన్న రాత్రి  పదకొండింటికి రైల్వే స్టేషన్ లో కనబడ్డాడు....తీసుకొచ్చాంఅన్నాడు.
నాకు చెప్పలేనంత తెరిపిగా అనిపించింది.
హమ్మయ్య! చల్లటి వార్త చెప్పావురా. మనసు కుదుట పడింది!” సోఫాలో కూర్చుంటూ వాడి కళ్ళలోకి చూశాను. చాలా అలసిపోయినట్టు కనిపించాడు. వాడి కళ్ళలో కేవలం అలసటే కాక ఇంకేదో భావం కనిపించింది.
సుజాతేది?” అన్నాను. వాడు సమాధానం చెప్పేలోపే సెల్ ఫోనూ, లాండ్ లైనూ రెండూ మోగాయి. ఒకటి ఆన్ చేసి మాట్లాడుతూనే రెండోది తీశాడు. నా వైపు చూసి లోపలికెళ్ళుఅన్నట్టు చేత్తో చూపించాడు. వాడి మాటలు వింటూనే వంటింట్లోకి తొంగి చూసి,  అక్కడెవరూ కనపడక పడకగది కర్టెన్ తొలగించి లోపలికి చూశా.
సుజాత ఇంకా లేవలేదు! ఒంట్లో బాగానే ఉందా అని అనుమానం వచ్చి నుదుటి మీద చెయ్యి వేశాను. మామూలుగానే ఉంది గాని పడుకున్నతీరూ, సన్నని గురకా కొంచెం అసహజంగా అనిపించాయి. శబ్దం చెయ్యకుండా బయటికి వచ్చి రెండో గది వైపు కదిలాను. చలపతి ఇంకా ఫోను సంభాషణలోనే ఉన్నాడు, అటునించి వస్తున్న ప్రశ్నలకి జవాబులిచ్చే పనిలో. పిల్లాడు ఎప్పుడు వెళ్ళాడో, ఎలా వెళ్ళాడో, ఎక్కడ దొరికాడో ఇవే వివరాలు !
రెండో గదిలో మంచం మీద గోడకి జారగిలబడి కూర్చుని ఉన్నాడు ప్రకాష్. అప్పుడే లేచాడో ఏమో రేగిన జుట్టు నుదుటిమీద చిందర వందరగా ఉంది. కిటికీలోంచి బయటికి చూస్తున్నవాడు అలికిడికి తలతిప్పి నావైపు అభావంగా చూశాడు. ఫోనులో వాళ్ళ నాన్న మాటలు గదిలోకి వినిపిస్తున్నాయి.
లక్షన్నర కట్టానురా పిచ్చివెధవ లాగా. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందిట! ఎందుకొచ్చిన కుప్పిగంతులు? వాడికీ నాలాగే గుమాస్తా గిరీ చేసుకుంటూ చాలీచాలని బతుకు లాగించాలని రాసుంటే, నేనూ వాళ్ళమ్మా రెక్కలరగదీసుకుంటే జాతకం మారిపోతుందా?! ఆ విషయం వదిలెయ్..దొడ్డమ్మ బావుందా? పిల్లలూ, జానకీ కులాసే కదా?...”
వింటున్న నా మనసు మూలిగింది. ఊఁ..మరి నువ్వెందుకు గుమస్తాగిరీలో మిగిలావు ? వాడు సాధించాలని నువ్వు కోరుకుంటున్నది నువ్వు సాధించాలని మీ నాన్న కోరుకోలేదా? మరి తండ్రి కోరిక తీర్చావు కాదేం ? ఎప్పుడూ ఫస్టు క్లాసు మార్కులు తెచ్చుకోని నువ్వు, కొడుకు మాత్రం పోటీ పరీక్షల్లో మొదటి వరసలో నిలబడాలని ఎలా ఆశిస్తున్నావు? చలపతినీ, సుజాతనీ నిలబెట్టి అడగాలనిపించింది. తల్లిదండ్రుల తీరని కోరికలూ, పిల్లల పట్ల వాళ్ళ ఎక్స్ పెక్టేషన్స్.......ఆ బరువు కింద నలిగి పోతూ యుక్తవయసింకా వచ్చీ రాని పిల్లలు... తలుచుకుంటే ఏదో భయం కలిగింది. వీళ్ళకెదురయే అనుభవాలు వీళ్ళని ఏ తప్పు దారిలో నడవమని ప్రోత్సహిస్తాయో!
ప్రకాష్ మొహంలోకి చూశాను. వాడి మొహం ఆవేశంతో కందిపోయి కనిపించింది. దగ్గరకెళ్ళి వాడి చేతి మీద చెయ్యేస్తూ మంచం మీద కూర్చున్నా. నా మనసంతా వాడి పట్ల జాలితో నిండిపోయింది.
ఇన్నిన్ని పరీక్షలూ ఇంత కాంపిటీషన్ లేని రోజుల్లో కూడా యావరేజి మార్కులు తెచ్చుకుని, నన్ను మాత్రం నైంటీ పర్సెంట్ రాలేదనీ, నాలుగింటికే లేవలేదనీ చంపుకు తింటారు. రమేష్ గాడికి ట్రిపులైటీలో సీటొచ్చి నా చావుకొచ్చింది.. వాడు వాడే. నేను నేనే. వాడిలా నేనెలా ఉంటాను? ఎపుడూ కంపారిజనే. అందువల్లే నాకు వాడంటే అసహ్యం పుట్టింది. చదువంటే రోత పుట్టిందినా వైపు చూడకుండానే లోగొంతుకలో ద్వేషాన్ని కక్కుతూ అన్నాడు.
వాడికి దగ్గరగా జరిగి తల నిమురుతూ నీ బాధ నాకర్థమవుతోంది నాన్నా! కానీ, పిల్లల అభివృధ్ధి కోరి తల్లిదండ్రులేమైనా అంటే...నా మాట పూర్తి కాకుండానే
లేదత్తా! ఇది మేం ప్రోగ్రెస్ అవాలని కోరడం కాదు! వాళ్ళు చెయ్యలేనిది మేం చేసితీరాలని ఫోర్స్ చెయ్యడం!” ఆవేశంగా అన్నాడు.
వాడి చెయ్యి అనునయంగా నొక్కుతూ కొన్నాళ్ళు నా దగ్గరకొచ్చి ఉండకూడదూ? మామయ్య కూడా ఊళ్ళో లేరు కదా! లెటజ్ షేర్ సమ్ ఐడియాస్ ..! ?” అన్నాను.
కౌన్సిలింగా?” అన్నాడు అదోలా నవ్వుతూ.
వాణ్ణి పరిశీలనగా చూస్తూ మా పెద్ద వాళ్ళందరం మీ లాంటి పిల్లలనించి కౌన్సిలింగ్ తీసుకోవలసిన అవసరం ఉంది నాన్నా..నిజం!” అంటూ టైమ్ చూసుకున్నాను. వెంటనే బయల్దేరాలి. ప్రేమగా వాడి తల నిమిరి మళ్ళీ కలుద్దాం అంటూ బయట కొచ్చాను. ఫోన్ కాల్స్ నించి కాస్త విరామం దొరికినట్టుంది, చలపతి వంటింట్లో కాఫీ కలుపుతూ కనిపించాడు.
కాఫీ చేస్తున్నావా ? నాకేమీ వద్దురా .. టైమూ లేదు. ఈరోజు చాలా అపాయింట్మెంట్సున్నాయి.అన్నాను.
అవునా ?అయ్యో ..నీ బిజీ షెడ్యూల్ తెలిసినదే అనుకో..సుజాత కోసం కలిపాను. జస్ట్ ..హాఫ్ కప్పు తాగు అంటూ కప్పుల్లో కాఫీ పోశాడు. నాక్కొంచెం ఆశ్చర్యం వేసింది. మామూలుగా చలపతి వంటింట్లోకి అంతగా రాడు. ఇంటి పనంతా సుజాతే చురుగ్గా చేసుకుంటుంది. ఇవాళ ఇంతగా ఫోన్లొస్తుంటే తనలా పడుకుని ఉండడం, చలపతి  తనకి కాఫీ కలపడం .. నా ఆలోచనల్ని తుంపుతూ
మూడురోజులుగా తిండి మానేసింది. రాత్రి వాడొచ్చాక నాలుగు మెతుకులు తింది. అది ఇమడలేదు.గుండె పట్టేసినట్టుందని బాధ పడింది. చెడతిరిగి ఉన్నానేమో నాకు ఒళ్ళు తెలీకుండా నిద్ర పట్టేసింది. వాడి పక్కన పడుకుని ఉన్నవాణ్ణి పొద్దున్న లేచొచ్చి చూస్తే అప్పుడే వాంతి చేసుకునొచ్చి పడుకుంటోంది. కాస్త నిద్ర పట్టాక దుప్పటి కప్పి తలుపు దగ్గరేసి వచ్చాను. వరసగా ఫోన్ కాల్స్.. మూడురోజులుగా మేం ఎంతమందిని కనుక్కున్నామో అంతకు నాలుగు రెట్లు కాల్స్ వస్తాయి ..సహజమే కదా ..” పల్చగా నవ్వాడు.
ఏమనడానికీ తోచలేదు. కళ్ళతోనే సానుభూతి తెలియజేస్తూ కాఫీకప్పు అందుకున్నా.
ఇప్పుడే లేచి బాత్రూమ్ లో కెళ్ళింది. కాస్త కాఫీ తాగితే సర్దుకుంటుందిలేఅన్నాడు. ఈలోపు హాస్పిటల్ నించి ఫోన్ కాల్స్. సుజాత కోసం కొంతసేపు చూసి మళ్ళీ కలుద్దామని చెప్పి వచ్చేశాను.
సాయంత్రం దాకా పేషెంట్లతో గడిచిపోయింది. మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. వేసవి సెలవుల్లో రాధపిన్ని ఇంటికి వెళ్ళడం, పిల్లలందరం కలిసి ఆడుకున్న అమాయకపు ఆటలూ గుర్తొచ్చాయి. బాబాయి యాభై దాటకుండానే పోవడం, అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు కావలసి ఉండడంతో అందరిలోకీ చిన్నవాడైన చలపతి డిగ్రీ పూర్తి చేస్తూనే ఉద్యోగంలో చేరిపోవల్సి వచ్చింది. రమ, రాజేశ్వరిలకి మంచి సంబంధాలు కుదిరి, పెళ్ళిళ్ళయి బాగా స్థిరపడ్డారు గాని , చలపతి మాత్రం  చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తూ మిగిలి పోయాడు.. ఒక్క సంతానమే చాలని, వాణ్ణి బాగా చదివించాలని భార్యా భర్తలిద్దరూ నిర్ణయించుకున్నపుడు రాధపిన్ని ఆయన అర్ధాంతరంగా మమ్మల్నొదిలేసి పోబట్టే కదా నా కొడుకిలాంటి నిర్ణయం తీసుకుని, చిన్నవెధవకి తోబుట్టువు లేకుండా చేశాడుఅని అమ్మ తో చెప్పుకుని బాధపడింది.
రెండేళ్ళ క్రితం రాధపిన్నికి బాగా సుస్తీ చేసి, ఆసుపత్రి లో చేర్పించారు. అపుడు అమ్మ వెళ్ళి పిన్ని దగ్గర రెండువారాల పాటు ఉంది. అప్పుడే ప్రకాష్ ని నేను గమనింపుగా చూసింది. అమ్మకోసం అయిదారు సార్లు వెళ్ళడంతో అంతకుముందే టెన్త్ పూర్తి చేసిన వాడితో నాకు కొంత సాన్నిహిత్యం ఏర్పడింది.
తర్వాత కొన్నాళ్ళకి వాణ్ణి బెస్ట్ బ్రెయిన్స్ కాలేజీలో ఇంటర్లో చేర్పించారని తెలిసినపుడు నాకు చాలా చిరాకనిపించింది. అక్కడ ఫీజులు చాలా ఎక్కువ. ప్రకాష్ తెలివితేటలున్న పిల్లవాడే అయినా శ్రద్ధ, శ్రమించే తత్వం ఎంత మాత్రం లేనివాడు. అలాంటి పిల్లాడిని తీసుకెళ్ళి  ఐఐటీ కోచింగులో బోలెడు ఫీజులు కట్టి చేర్పించి, వాడు సాధించలేని రాంకుల కోసం వాడిని రాచిరంపాన పెడితే ఏమవుతుందో నాకు తెలిసిన విషయమే. అప్పటికీ నా అభిప్రాయం చూచాయగా చలపతికి చెప్పాను.  ఇంకే కారణాలున్నాయో ఏమో గాని కట్టేసిన ఫీజు పైసా కూడా వాపసివ్వరని చెప్పడంతో నేనూ ఊరుకున్నాను. తర్వాత కొన్నాళ్ళకే రాధ పిన్ని పోయింది.
ఒకే ఊళ్ళో ఉన్నా ఉద్యోగాలూ, పిల్లల చదువులూ ఎవరి హడావిడిలో వాళ్ళం ఆ తర్వాత  కలుసు కోవడం పడలేదు. మొన్న వేసవిలో మా చిన్నమ్మాయి పెళ్ళికి చలపతి ఒక్కడే వచ్చాడు. ప్రకాష్ ఇంజనీరింగ్ ఎంట్రెన్సుల హడావిడిలో ఉన్నాడనీ, సుజాత వాడికి తోడుగా ఉండిపోవల్సి వచ్చిందనీ చెప్పాడు. మళ్ళీ ఇదే వాళ్ళని చూడడం !
పొద్దున్న పని హడావిడిలో సుజాతని పలకరించకుండానే వచ్చేశాను. ఇపుడు త్వరగా పని తెముల్చుకుని చలపతి ఇంటికి వెళ్ళి, ప్రకాష్ వస్తానంటే నాతో తీసుకు వెళ్దామనీ, రాకపోయినా పొద్దుటిలా మొక్కుబడిలా కాకుండా కాస్త తీరుబాటుగా కూర్చుని, ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడాలనీ అనిపించింది. అమ్మ ఫోను చేసినపుడెంత విసుక్కున్నా, అక్కడికి వెళ్ళాక ఆ కొద్దిసేపట్లోనే వాళ్ళ పట్ల చిన్నప్పటి ఆత్మీయత మళ్ళీ మొలకెత్తి  చిగుళ్ళేసినట్టైంది. వాళ్ళంతట వాళ్ళు అడక్కపోయినా ఆ ఇంట్లో అలముకుని ఉన్న నైరాశ్యానికి మూలం తెలుసుకుని, నాకు  చేతనైన సాయం చెయ్యాలనిపించింది. ప్రకాష్ కి అండగా నిలబడి వాడి మనసులోని బాధని చలపతికీ, సుజాతకీ అర్థమయ్యేలా సున్నితంగా తెలియజెప్పాలనిపించింది.
అవసరంలో ఆదుకోని బంధుత్వాల వల్ల ఉపయోగం ఏమిటేఅనే అమ్మ మాట గుర్తొచ్చింది. పెళ్ళిళ్ళలో పేరంటాలలో విందు భోజనాలు సేవించి, తోచిన బహుమతులిచ్చేసి రావడానికి బంధువులే కానక్కరలేదు కదా. ఈ పూట వీలయితే నలుగురం ఒకచోట కూర్చుని మాట్లాడుకోగలిగేలా ప్రయత్నించాలి.
నే వెళ్ళేసరికి చలపతి కూడా ఇంటికొచ్చేసి ఉన్నాడు. సుజాత సెలవులో ఉంది. ముగ్గురినీ హాల్లో సమావేశపరిచే ప్రయత్నం ఫలించింది.
ప్రకాష్! అయామ్ ష్యూర్ యు హావ్ యువరోన్ రీజన్స్ ...అవి మేం కూడా తెలుసుకుంటే మంచిది కదా.. ఎందుకిలా చేశావు? నీ మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెపితే ఇంట్లో ఇప్పటికన్నా మేలైన వాతావరణం ఏర్పడుతుందిఅది అందరికీ మంచిది నాన్నా..ముందుగా ప్రకాష్ ని అడిగాను.
వాడు నోరు విప్పలేదు. ఎన్నివిధాల ప్రయత్నించినా నీకు తెలియదత్తా,ఇలాంటి డిస్కషన్స్ వేస్టత్తాఅంటూ  దాటేశాడు. కొంతసేపాగి చలపతే అన్నాడు పోన్లే అక్కా...ఏది ఎందుకు జరిగిందో వాడేమీ చెప్పక్క ర్లేదులే.. ఇక ముందేం చేద్దామనుకుంటున్నాడో చెపితే చాలు. ఇంటర్లో వీడికొచ్చిన మార్కులకి, ఎమ్సెట్ లో, ఏఐట్రిపులీ లో వచ్చిన రాంకులకీ చెప్పుకోదగ్గ ఏ కాలేజీలోనూ సీటురాదు. మానేజ్మెంట్ సీటు కొనే స్థోమత నాకు లేదు. మరి ఏం  చెయ్యాలో  ఆలోచించుకోవాలి కదా !”
మళ్ళీ ప్రకాష్ వైపు చూశాను. వాడి మొహం నిండా పరుచుకుని స్పష్టంగా కనిపిస్తున్న నిరసన జ్వాలలు ఏం చేస్తే చల్లారుతాయి?  ఏ పరిస్థితులు వాడిని ఇల్లొదిలి వెళ్ళేలా చేశాయి ? అవే పరిస్థితులు ఇంకా ఉంటే చక్కదిద్దడం ఎలా ? ఇవి తేలాలంటే వాడు పారిపోక ముందు ఏం జరిగిందో తెలియాలి. అక్కడ పడ్డ చిక్కుముళ్ళు విప్పాలి.
ప్రకాష్ నోటి నుంచి సమాధానం రాబట్టడానికి చాలా ప్రయత్నించాల్సి వచ్చింది. ఒకసారి మొదలంటూ పెట్టాక ఒకటొకటిగా ఎన్నో సంఘటనలు  చెప్పుకుంటూ పోయాడు ! వాడి మేనత్త కొడుకు రమేష్ తో, క్లాస్ మేట్ చంద్రశేఖర్ తో,  పక్కింటి చక్రధర్ తో, సుగుణతో పోలుస్తూ తల్లీ తండ్రీ ఏమన్నారో, వాడు చదివే కాలేజీలో చేర్పించడానికి ఎన్ని లక్షలు గుమ్మరించారో చెపుతూ ఎంత ఒత్తిడి పెట్టారో చెప్పి, ఆ టెన్షన్ లో తను సరిగా పరీక్షలు రాయలేకపోయాననీ,  పాసవడమే గొప్ప అనే స్థితికి వచ్చాననీ చెపుతుంటే వాడి కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలిపోయాయి. మార్కులొచ్చాక సుజాత ఎన్ని మాటలందో, ఎంత తిరస్కారంగా చూసిందో చెపుతుంటే నా మనసు మెలిపెట్టి తిప్పినట్టయింది.
మాట్లాడితే ఎంత డబ్బు కట్టారో, ఎంత కష్ట పడ్డారో చెప్తారు. నా కోసం అంత కష్ట పడొద్దని చెప్పుచొక్కాతో కళ్ళూ , ముక్కూ తుడుచుకుంటూ ఉక్రోషంగా అన్నాడు.
ఆలోచిస్తూ సుజాత వైపు చూశాను. అభావంగా ఉన్న ఆ మొహం చూస్తే ఆశ్చర్యం వేసింది.
“  చలపతీ ! ... ఏమంటావురా ?” అన్నా మెల్లగా.
ఏమనగలనక్కా! చాలా పొరపాటు చేశాం. నిజమే..ఇప్పుడు వాడికేం చెయ్యాలనుందో అదే చెయ్యనీ.. వాడెలా నిర్ణయిస్తే అలాగే చేద్దాం చర్చ నించి తప్పుకుంటున్నవాడిలా, కీలక పదవికి రాజీనామా చేసిన వాడిలా అన్నాడు.
మళ్ళీ సుజాతనే చూస్తూ సుజా! నువ్వొక విషయం  చెప్పాలి...ఇలా మీ విషయాల్లో అనవసరంగా కల్పించుకుంటున్నాననుకోవడం లేదు గదా! పొద్దున్న చూసి వెళ్ళాక కొంచెం తీరిగ్గా మాట్లాడాలనిపించి మళ్ళీ వచ్చాను అన్నాను. ఈ సమావేశం ముగ్గురికీ ఇష్టం లేదని అర్థమవుతూనే ఉంది. ఇష్టం లేదనే కంటే దీనివల్ల ఉపయోగం ఉండదనుకుంటున్నారంటే సమంజసంగా ఉంటుందేమో.
చీర అంచు వేళ్ళతో సాపు చేస్తూ  లేదొదినా!  ఈ రోజుల్లో ఎవరి విషయం ఎవరిక్కావాలి? ఎంతోమంది నీ సలహా కోసం ఎదురు చూస్తూంటారు. మా మీద ఆపేక్షకొద్దీ నువ్విలా ఇంటికొచ్చి మరీ ..ఆగిపోయింది.
అబ్బా అలా ఫార్మల్ గా అయిపోకు సుజా...కుటుంబసభ్యులు ముగ్గురూ ఒకచోట కూర్చుని మనసుకి కష్టం అనిపించిన విషయాలు ఘర్షణ లేకుండా చర్చించుకోవచ్చు కదా అనీ..వాడి మాటలన్నీ విన్నావు కదా! ఇపుడు నీ మనసులో ఏముందో చెప్పుసాధ్యమైనంత మృదువుగా అన్నాను.
తలెత్తి ఏదో చెప్పబోయిన సుజాత తిరస్కారంగా ఉన్న కొడుకు మొహం చూసి ఆగిపోయింది. నేను చెప్పేదేం లేదు వదినా ! వాడన్నవన్నీ నిజమేఅని ఊరుకుంది.
అలా అంటే ఎలా సుజా! కొంచెం సానుకూలంగా ఆలోచించు! వాడి వయసెంతని? ప్రతిమనిషికీ ఒక కెపాసిటీ ఉంటుంది కదా..దాన్ని మించి సాధించాలంటే సాధ్యమా ? వాడు గొప్ప ఇంజనీర్ కావాలనీ, ఐఐటీ లోనో, బిట్స్ లోనో చదవాలనీ మీకు కోరిక ఉండి ఉండొచ్చు. అది సాధించాలనే తపన వాడిలో లేకపోయినా, అందుకు తగిన తెలివితేటలూ , ధారణశక్తీ తక్కువైనా వాడికది సాధ్యమవదు ! మనం సాధించలేనిదాన్ని, మన మనసు కోరుతోంది గనక వాడి నెత్తిన రుద్దడం సరికాదు కదా. అందులోనూ నువ్వూ చలపతీ ఒకటై పోయి వాడిని మానసికంగా ఒంటరి వాడిని చేశారేమో ఆలోచించుకోండి. వాడిలో ఈ ఇల్లూ, ఈ కుటుంబం తనదనే భావం లేకుండా పోవడానికి కారణమేమిటి ? ఇపుడు చూడు...
నా మాటలు పూర్తి కాకుండానే అవునొదినా ! ప్రపంచమంతా చిన్నపిల్లలూ, వృధ్ధులూ నిస్సహాయులనీ , బలహీనులనీ, మధ్యవయసు వాళ్ళంతా బలవంతులూ క్రూరులూ అనీ అనుకుంటుందినవ్వింది సుజాత.
            ఆ మాటలకి  అవాక్కై, తేరుకుంటూ అదేం మాట సుజా? వేరే వాళ్ళతో తరచూ కంపేర్ చేస్తుంటే  కష్టంగా ఉందంటున్నాడు వాడు. వాడి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనది కాదంటావా?  అన్నాను.
          “అవునొదినా వాడి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినేలా ప్రవర్తించి పొరబాటు చేశాం. వాడి క్లాసులోనే వాడి లాగే పెరిగిన కుర్రాళ్ళు శ్రద్ధతో, క్రమశిక్షణతో చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటుంటే వాళ్ళతో వీడిని పోల్చడం తప్పే! మార్కులు మరీ తక్కువొచ్చినపుడు అడగడం తప్పే...క్లాసులో సరిగా పాఠాలు చెప్పడం లేదంటే మరి మిగిలిన పిల్లలెలా చదవగలుగు తున్నారని అడగడం తప్పే. లెక్చరర్స్ ని వాడూ వీడూ, ఇడియెట్,స్టుపిడ్ అంటే అలా అనద్దని వారించడం తప్పే! విద్యార్థిగా శ్రద్ధ పెట్టి చదవాల్సిన టైమ్లో గంటలుగంటలు టీవీ చూడద్దనీ, పనికిరాని వీడియో గేమ్స్ ఆడద్దనీ చెప్పడం తప్పేగోడకి చేరబడి కింద కూర్చున్న సుజాత మాటల్లో కనిపించకుండా దాక్కున్న ఆవేశం! అదురుతున్న పెదవులూ, ఎర్రబడ్డ ముక్కూ, సన్నని నీటిపొరతో తడిగా మెరుస్తున్న పెద్ద కళ్ళూ, గంజి లేక వంటికి అతుక్కుపోయిన  నూలు చీరా....
        “సుజా! ప్లీజ్ ..నేనలా అన్నానా ? ఇది తప్పు, ఇది ఒప్పు అని నేనేమీ క్లాసిఫై చెయ్యడం లేదు. అలా చెప్పడానికి
నేనెవర్ని? వాడు పరాయి వాడు కాదు మీ ఇద్దరికీ కొడుకు. వాడి మీదే పంచప్రాణాలూ పెట్టుకుని ఇవాళ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఎంత బాధో ఊహించగలను కాబట్టే చెపుతున్నా. పరిస్థితులెలా వచ్చినా పిల్లలకీ తల్లిదండ్రులకీ మధ్య కమ్యూనికేషన్ తెగిపోకూడదు! అందుకే కలిసి మాట్లాడుకుందాం అంటున్నా. రెండు పక్షాలుగా విడిపోయి కాకుండా, ఎవరికి వాళ్ళం అవతలి వాళ్ళ దృష్టికోణాన్ని అర్ధం చేసుకుందామనే ధోరణితో చర్చించుకుందామంటున్నాఅనునయంగా అంటూ చలపతి వైపు చూశాను. సుజాతకి కొంచెం దూరంలో పేము కుర్చీలో  కూర్చుని బాల్కనీ బయటి ఆకాశాన్ని చూస్తున్నాడు వాడు. రసహీనమైన పల్చని నవ్వు వాడి పెదవుల మీద.
           “మా పంచప్రాణాలూ వాడి మీద పెట్టుకున్నాం గాని వాడికి మా మీద ఎలాంటి భావం ఉందో మాకు తెలీదు వదినా!
ఎపుడైనా చెట్టునించి కాయకి పోషణ అందుతుంది గాని కాయ నించి చెట్టుకి రాదుగా! నువ్వింత అభిమానంతో తాపత్రయ పడుతున్నావు గనక  సరే అంటున్నా....తప్పకుండా చర్చించు కుందాం...టెన్త్ తర్వాత బెస్ట్ బ్రెయిన్స్ కాలేజీలో  ఎందుకోసం చేరాడో, ఎవరి కోరిక మీద చేరాడో వాడినడగు అంది నన్ను సూటిగా చూస్తూ.
             ప్రకాష్ వైపు ప్రశ్నార్థకంగా చూశా. వాడు మాట్లాడకుండా గోడ వైపు చూస్తూ కూర్చున్నాడు.
పోటీపరీక్షలొద్దనుకున్నవాడు ఐఐటీలో సీటుకోసం కోచింగిచ్చే కాలేజీలో చేర్పించమని అంత హఠం ఎందుకు చేశాడో అడుగు. లక్షన్నర ఫీజా? పుస్తకాలకీ, వాన్ లో వెళ్ళి రావడానికి ఇంకో యాభై వేలా? మా లాంటి వాళ్ళ కి అందుబాటులో ఉండే చదువేనా అది ? మనింటి దగ్గర కాలేజీ ఫలితాలు బావున్నాయి కద నాన్నా అంటే  ససేమిరా.. వింటేనా ? వాడి స్కూలు ఫ్రెండ్స్ సురేషూ, సందీపూ, బాబీ, బుజ్జీ, వెంకూ, టెంకూ అంతా అక్కడ చేరిపోతున్నారు. వీడూ అక్కడే చేరాలి! వాళ్ళకి ఎక్కీ తొక్కీ డబ్బుంది. మనకేముంది ? రెక్కల కష్టంతో ఈ ఫ్లాట్ మీద లోను కట్టుకుంటూ ఎలాగో మానేజ్ చేస్తున్నాం. మా లాంటి వాళ్ళ పిల్లలు ఎంత బాధ్యతగా ఉండాలి ?
ఐఐటీ లేదా బిట్స్ లో చదవాలని గాఢమైన కోరిక ఉండి, అందుకోసం ఎంతైనా కష్టపడతానని వాడు సిద్ధపడి ఉంటే, శ్రద్ధతో చదివి ఉంటే,  ఇంత ఫీజు కట్టినందుకు సీటు రాక పోయినా మేం బాధపడేవాళ్ళం కాదు. అసలా కోరికే లేని వాడికి ఇంత హైఫై కాలేజీ ఎందుకు? వేసవి ఎండ తెలీకుండా చదువు సాగడానికి ఏసీ రూములు, పొద్దున్న ఆరింటి నించి రాత్రి పదకొండు దాకా తెరిచి ఉంచే సూపర్ లైబ్రరీ, ఎప్పుడు డౌట్స్ వొస్తే  అప్పుడే క్లియర్ చేసేసే ఫాకల్టీ  అంటూ చెప్పిందే చెప్పి, రెండు రోజుల పాటు అలిగి, తిండి మానేసి, మమ్మల్ని ఒప్పించి  ఈ కాలేజీలో చేరినవాడు, తన లక్ష్యం చేరాలని ప్రయత్నం చెయ్యాలా వద్దా ? నేను స్కూలు నించి నాలుగున్నరకి ఇల్లు చేరతాను. వాడి క్లాసులు ఒంటిగంటకే అయిపోతాయి. కాలేజీ లైబ్రరీ లోనో, స్టడీ ఏరియా లోనో కూర్చుని హోమ్ వర్క్ చేసుకోవచ్చు. వచ్చిన డౌట్స్ వచ్చినట్టుగా క్లారిఫై చేసుకోవచ్చు. ఆ సౌకర్యాలకోసమే కదా అంతడబ్బు కట్టింది! ఏదీ లేదు...కాలేజ్ అవర్స్ అయిపోగానే ఇంటికొచ్చేసి ఏం చేసేవాడో వాడికే తెలియాలి. నేను నాలుగింటికి లేచి ఇంటి పనీ, వంట పనీ పూర్తి చేసి, ఆదరా బాదరా తెమిలి, వాడికి డబ్బా కట్టిచ్చి, ఎనిమిదింటికల్లా స్కూలు బస్సెక్కితే, పెట్టిన తిండి లంచవర్లో వాడికిష్టమైతే తినడం, లేకపోతే ఫ్రెండ్స్ తో పక్కనున్న ఫుడ్ జాయింట్ లో కాలక్షేపం చేసుకోవడం ! ఏమిట్రా ఇదీ అంటే విసుగు. ఏంటమ్మా ! బుర్ర వేడెక్కి పోతే  కాస్సేపు  కాంటీన్ కి వెళ్ళడం కూడా తప్పేనా? ‘ అంటూ అలక !” మంద్ర స్వరంతో అన్నిటికీ అలవాటు పడిపోయినట్టు చెప్పుకుపోతోంది సుజాత.
అప్పటిదాకా చలనం లేకుండా వింటూ కూర్చున్న ప్రకాష్ చివాల్న లేచి వెళ్ళి పోబోయాడు. వాడి చెయ్యి పట్టుకుని ఆగు నాన్నా..మన వెర్షన్ చెప్పినంత సేపూ అమ్మా నాన్నా కదలకుండా విన్నారు కదా...వాళ్ళు చెప్పేది మనమూ వినాలి !” అన్నాను.
ఒక నిముషం నిశ్శబ్దం తర్వాత విరక్తి నిండిన చిన్న నవ్వు నవ్వి, మళ్ళీ మెల్లిగా చెప్పడం మొదలు పెట్టింది సుజాత ఆ కాలేజిలో ముప్పాతిక వంతు పిల్లలు డబ్బుకి లోటు లేని ఇళ్ళనించి వచ్చిన వాళ్ళే. మిగిలిన కొద్ది మందీ తెలివి తేటలొకటే కాకుండా రాత్రీ పగలూ శ్రమించి, భవిష్యత్తుకి  పునాదులేసుకోవాలనే కోరిక కూడా ఉన్నవాళ్ళు ! మనం ఈ రెండు కోవలకీ చెందని వాళ్ళం. ఈ విషయం ఎంత వివరించి చెప్పినా తిండి మానేసి హఠం చేసి, వాడి పట్ల మాకున్న ప్రేమని, మమ్మల్ని బ్లాక్ మెయిల్ చెయ్యడానికి ఆయుధంలా వాడుకుని, తను కోరుకున్న చోట చేరాడు. రెండేళ్ళ చదువు గురించి ఎన్ని ప్రామిస్ లు చేశాడో లెక్క లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే చిత్తశుద్ధి, ఆ మాట ఇస్తున్నప్పుడు కూడా లేకపోతే  ఏమనాలి?
వాడి పాఠాలు నా ప్రైమరీ టీచర్ స్థాయికి అర్థమయ్యేవి కావు. పేరెంట్స్ మీట్ కి వెళ్ళినపుడల్లా ఖాళీ వర్క్ బుక్సూ, పూర్తి కాని ఆన్సర్ షీట్సూ చూపించి లెక్చరర్స్ అడిగే ప్రశ్నలకి మొదట్లో అయితే దిమ్మెరపోయామంటే నమ్ము. ఏమిటిరా ఇదీ  అంటే  తన సీబీయస్సీ సిలబస్ కీ, వీళ్ళఇంటర్ మీడియెట్ సిలబస్ కీ చాలా తేడా ఉందనీ, మెల్లిగా పికప్ చేసేస్తాననీ వాగ్దానాలు !.. మాకూ బోల్డంత అనుభవమేమీ లేదు గదా ఇలాంటి వాటిల్లో? వాడేం చెపితే అది నమ్ముతూ వచ్చాం. ఎప్పుడూ లేనిది స్పెషల్ క్లాసులనీ , కంబైండ్ స్టడీస్ అనీ చెప్పి కొన్ని సార్లు సినిమాలకీ, షికార్లకీ కూడా చెక్కేశాడు. ఎంత ప్రేమగా పెంచాం? ఎంత నమ్మకం ఉంచాం వాడి మీద? మాతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి ?”
నెమ్మదిగా మాట్లాడుతున్నా , పదునుగా, ఆవేదనగా ఉన్న ఆ మాటలు కళ్ళప్పగించి వింటూండి పోయాను.
ప్రకాష్ కుర్చీలో ఇబ్బందిగా, అసహనంగా కూర్చున్నాడు. కొంతసేపటి మౌనం తర్వాత
పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వాళ్ళలా పెర్ ఫామ్ చెయ్యాలని ఆశించడం, ఆదేశించడం తప్పని అందరూ అంటున్నారు. నేనూ అలాగే అనుకున్నాను. నా చిన్నపుడు అనేవారు స్పర్ధయా వర్ధతే విద్యాఅని. ఎవరిలో మంచి కనిపించినా నేర్చుకోవచ్చు, స్ఫూర్తి పొందచ్చు. కానీ ఇపుడు చదువు పేర రాచి రంపాన పెట్టేయడానికీ, సున్నితంగా సజెస్టివ్ గా ఇతరుల్లో నేర్చుకోదగ్గ అంశాలని సూచించడానికీ తేడా తెలుసుకోలేకుండా ఉన్నారు పిల్లలు! విద్యార్ధి దశలో క్రమశిక్షణ ఎంత అవసరమో, కోతిలా గంతులేసే మనసుని నిగ్రహించడం ఎంత ముఖ్యమో తెలిసీ, వాళ్ళకిష్టమైనట్టు వాళ్ళని చదువుకోనీయమనీ, వాళ్ళు హాండిల్ చెయ్యలేనంత స్వేచ్ఛని వాళ్ళకివ్వమనీ  సలహాలు చెప్పేవాళ్ళు, తమ ప్రయోగాలన్నీ ఇతరుల పిల్లల మీద చేసేవాళ్ళు  ఎక్కువై పోయారు. పిల్లలు హద్దు మీరితే గట్టిగా గద్దించే ధైర్యం తల్లిదండ్రులకి లేదు ప్రస్తుతం. కొన్నాళ్ళాగితే మనదేశంలో కూడా తల్లిదండ్రులు కోప్పడ్డారని పిల్లలు కంప్లైంట్ చేస్తే, తీసుకెళ్ళి జైల్లో పారేస్తారేమో! ఆ చట్టాల పుణ్యమా అని అమెరికన్లెంత బాగుపడ్డారో నాకు తెలీదులే...
మా అక్క కొడుకు ఇంట్లో తల్లికి అన్నివిధాలా సాయపడుతూ చదువు లోనూ రాణిస్తున్నాడు. మరి మా ఇంట్లో ? లేచిందగ్గర్నించి, పడుకునే దాకా తెమలని పని తో సతమతమైపోతున్నా అయ్యో అమ్మ అలిసిపోతోందేఅన్న ఆలోచన కూడా లేదు వాడికి. ఏదైనా చిన్న పని చెప్పబోతే, కాలేజిలో తనెంత టైరై పోయాడో , ఇంకా ఎంత వర్కుందో వివరాలు !!
మేం ఎవరితోనూ వాడిని పోల్చకూడదు గాని వాడు మాత్రం సందీప్ స్పోర్ట్స్ షూస్ కొనుక్కున్నాడనీ, బాబీ బర్త్ డే పీజా హట్ లో సెలబ్రేట్ చేసుకున్నాడనీ, సుధీర్ రోజూ బెంజ్ కార్లో వస్తాడనీ  పోల్చుకోవచ్చు !”
సుజాత ఒక్కక్షణం ఆగగానే చలపతి అందుకుని,ఎంతసేపైనా ఇదిలా సాగుతూనే ఉంటుందిలే అక్కా!ఒకరోజు రెండురోజుల కథ కాదు కదా.. రెండేళ్ళ యాక్షన్, రియాక్షన్, ఇనాక్షన్ స్టోరీ....ఇంక ఇవాళ్టికి ఆపేద్దాం.. కొంచెం కాఫీ తాగి వేరే కబుర్లు చెప్పుకుందాం...అంటూ లేచాడు. నాకు విసుగొస్తుందేమో అన్న భయం, ఇన్నాళ్ళుగా కొడుకు తెలుసుకుందుకు ప్రయత్నించని తమ మనో వేదన ఇవాళైనా వాడికర్థమయేలా చెప్పగలగాలన్న తాపత్రయం రెండూ చలపతి ముఖంలో కనిపిస్తూనే  ఉన్నాయి.
చలపతి వంటింటి వైపు వెళ్తుంటే సుజాత వాడివైపు చూస్తూ మీ తమ్ముడి వైపొక్కసారి చూడు వదినా ! జుట్టంతా పలచబడి బట్టతలైపోయింది. నిద్రచాలక కళ్ళచుట్టూ చారలు...మనిషెంత తగ్గిపోయారో చూశావా? ఆఫీసులో విపరీతమైన పని వత్తిడి. ఈ రిసెషన్ పుణ్యమా అని ఎపుడు ఊడతాయో తెలీని ఉద్యోగాలు.. ఇపుడు పెరిగిపోయిన ఖర్చుల కోసం సాయంత్రాలు వేరే చోట పార్ట్ టైమ్ జాబ్ లో చేరారు. ఇంటికొచ్చి వెళ్ళడానికి కుదరక అక్కడే ఏదో ఉడిపి హోటల్లో రెండిడ్లీలు తిని, రాత్రి పదింటి దాకా పని చేసి ఇంటికొస్తారు. ప్రైవేటు స్కూల్లో టీచరుగా నా జీవితం మీకు తెలీనిది కాదు. వాడికిపుడు పద్ధెనిమిదేళ్ళు. ఓటుహక్కు వచ్చేసింది. పాలకులనెన్నుకోగల సమర్ధుడు! కానీ నీలాంటి విజ్ఞుల దృష్టిలో నిస్సహాయుడు. తల్లిదండ్రుల క్రౌర్యానికి బలైపోతున్న పసివాడు. నీ దాకా ఎందుకు.. వాడి దృష్టిలో కూడా అంతే..
చలపతి  ఆ మాటలకి కంగారుగా వెనక్కొచ్చి సుజా ! ఏమిటది ? ఏం మాట్లాడుతున్నావు?” అన్నాడు.
నువ్వుండు చలపతీ ! చెప్పనీఅంటూ వారించాను.
యాభయ్యేళ్ళ తండ్రీ, నలభయ్యేడేళ్ళ తల్లీ తనకవసరమైనవన్నీ అమర్చి పెట్టాలని కోరుకునే వాడికి, ఆ సంసారానికి తన కంట్రిబ్యూషన్ ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం లేదా? మోనిటరీ గా అడగడం లేదు. రాత్రి పదింటికి ఇంటికొచ్చే తండ్రి మనసు సంతోషపడేలాగా ఒక ప్రేమ నిండిన మాట ! ఎంత చదువు చదివేస్తున్నా చిన్నపాటి డైవర్షన్ లాగా కాస్త మంచినీళ్ళందించడం, చేతిలో బాగ్ అందుకోవడం... ఏదీ లేదు! ఏదైనా చెప్పబోతే వినేందుకు సంసిద్ధత లేదు. అమెరికా లోలా స్వేచ్ఛ కావాలి.... వాళ్ళలా పదహారేళ్ళకే తమ కాళ్ళమీద తాము నిలబడాలనే కాంక్ష లేదు.వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ లేబర్  మనకెలా నచ్చుతుంది? వేరే పిల్లల్లో ఏదైనా  సుగుణం కనిపిస్తే మేం చెప్పకూడదు. వాడికేవేవో అర్థాలు తోస్తాయి! వాడు మాత్రం తన స్నేహితుల పేరెంట్స్ తో అస్తమానూ మమ్మల్ని పోల్చి మేమెంత పనికిమాలిన తల్లిదండ్రులమో చెప్పకుండానే మాకర్థమయ్యేలా  చెయ్యచ్చు. బాబీ వాళ్ళమ్మ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాణ్ణి పికప్ చేసుకుంటుంది! ప్రియాంకా వాళ్ళమ్మ బిజినెస్ ఎగ్జిక్యూటివ్! చాలా మోడర్న్ గా, స్టైలిష్ గా ఉంటుంది. శాండీ వాళ్ళ నాన్న సింగపూర్ నించీ, ఆస్ట్రేలియా నించీ మంచి మంచి గిఫ్టులు తెస్తాడు...!!
ఒకసారి కాలేజిలో పేరెంట్స్ మీట్ కి వెళితే వాడికి మా పక్కన కూచోడానికే నామోషీ అయింది ! మమ్మల్ని పిలిచేదాకా కారిడార్లోనే తచ్చాడాడు! నిలదీసి అడిగితే ఇదీ విషయం! నువ్వింకాస్త బాగా తయారవచ్చు కదా..ఇలా అప్పలమ్మలా ఎందుకుంటావ్అని విసుక్కున్నాడు. నేను తెల్లబోయాను !”
సుజాత మాటల ప్రవాహంలో కొట్టుకుపోతూ మొదటిసారిగా వాళ్ళిద్దరినీ గమనించాను. నిజమే రెండేళ్ళలో ఇద్దరిలో ఎంత మార్పొచ్చింది! పదేళ్ళ వయసు పెరిగినట్టున్నారు! కళ్ళల్లో ఎంత ఉదాశీనత!
నా చిన్నపుడు అమ్మా, నాన్నా, మామ్మా అంతా చెప్పేవారు...వాళ్ళమ్మాయిని చూడు ఎంత శ్రద్ధ ! వీళ్ళమ్మాయిని చూడు ఎంత పనితనం! వాణ్ణి చూడు ఎంత పొదుపు, వీడికెంత వ్యవహార జ్ఞానం,.....వినయం, సహనం, మాటతీరు...ఒకటి కాదు, ఎవరిలో ఏ మంచి కనపడినా చెపుతుంటే వింటూ, జీవితానికి కావలసినవన్నీ నేర్చుకుంటూ ఎదిగాం. ఇవాళ పిల్లల ముందు ఎవరినీ మెచ్చుకోకూడదు. ఎవరితోనూ పోల్చకూడదు. నువ్వింతవాడివి, అంతవాడివి అంటూ వాళ్ళనే పొగుడుతూ, చిన్న చిన్న పనులక్కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి. వాళ్ళే సర్వ శ్రేష్ఠులని తీర్మానిస్తే  ఇంకెవర్ని చూసి నేర్చుకుంటారో మరి? తప్పిజారి, విసిగి పోయి, ఒకమాటన్నామంటే ఇల్లొదిలి పారిపోతారు ! ఇంకా ఏమైనా కూడా చెయ్యచ్చు!!"
 తలూపుతూ ఊఁ..ఏమైనా చెయ్యచ్చు! అపుడు పిల్లాడినీ కోల్పోయి, సమాజం సానుభూతీ కోల్పోయి, జీవచ్ఛవాల్లా బతుకీడ్వాల్సి వస్తుంది...
పసిప్రాయం నించీ వాళ్ళ అవసరాలన్నీ అనుక్షణం గమనిస్తూ, ప్రతీదీ నేర్పిస్తూ, మంచి చెడులు వివరిస్తూ ఇన్నేళ్ళూ పెంచుకుని, ఇవాళ అవసరమనిపించిన ఒకమాట స్వతంత్రంగా అనేందుకు లేదు. సహజంగా యధాలాపంగా మాట్లాడ్డానికి వీల్లేదు. జాగ్రత్తగా మసలుకోవాలి! ...నాకు తెలీకడుగుతాను వదినా.. ఇవాళ తల్లిదండ్రులు పిల్లలకిస్తున్న స్వేచ్ఛవల్ల అంతా మంచే జరుగుతోందంటావా? చాలా ఇళ్ళల్లో తల్లిదండ్రులు పిల్లల్ని చూసి భయపడుతున్నారని నీకు తెలుసా? చాలా చోట్ల పిల్లలకీ పేరెంట్స్ కీ మధ్య సంబంధం తుమ్మితే ఊడే ముక్కులా తయారైందంటే కాదనగలవా?
"మాకన్నా వాడు బాగా బతకాలనే కోరికతో వాడు కోరిన చోట తల తాకట్టు పెట్టి చేర్పించాం గాని, రేపు వాడు ఫలానా ఇన్స్ టిట్యూట్ లో ఇంజనీరింగ్ చేస్తున్నాడని చెప్పుకుని గర్వపడాలనో, మా తీరని కోరికలన్నీ వాడి నెత్తిన రుద్దాలనో కాదు. ఆఫీసులోనూ, ఇంట్లోనూ ఎన్నో కమిట్ మెంట్స్, ప్రెషర్స్ ఎదుర్కొంటూ, అపురూపంగా పెంచుకున్న పిల్లలు తృణీకరిస్తే, అవమానం పాలు చేస్తే, బతుకెంత రోత అనిపించినా మా లాంటి వాళ్ళు ఎక్కడికీ పారిపోలేరుగా? బతికి తీరాల్సిందే! వాడి ప్రవర్తనకి కుంగి పోయి మేం ఎటన్నా పారిపోతే వాడు మమ్మల్ని వెతికి తీసుకొస్తాడంటావా?” పెదవుల మీద నవ్వు పులుముకుంటూ అడిగింది.
ఆ శుష్కహాసం బరువుగా నా గుండెని తాకింది. ఇంతలో చలపతి కాఫీ కప్పులున్న ట్రే పట్టుకొచ్చాడు. ముందుగా ప్రకాష్ దగ్గరకెళ్ళి బోర్నవిటా తీసుకో నాన్నాఅంటూ విడిగా పెట్టిన మగ్గు తీసి వాడికిచ్చాడు.
కళ్ళెత్తి వాడు వాళ్ళనాన్నని చూస్తూంటే తడిగా ఉన్న వాడి కళ్ళు అద్దాల్లా తళతళలాడాయి. బోర్నవిటా మగ్గు అందుకుంటూ అయామ్ సారీ నాన్నా!...” అనబోయాడు. గొంతుకేదో అడ్డం పడ్డట్టయింది. కళ్ళ నించి రెండు ముత్యాలు రాలి పడ్డాయి. చెప్పలేకపోయినది కళ్ళతో వ్యక్తపరుస్తూ వాళ్ళమ్మ వైపు చూశాడు.
కాఫీ తాగి కొంత సేపు కూర్చున్నాక ఇంటికి బయల్దేరుతుంటే కారు దాకా వచ్చి థాంక్స్ చెపుతూ వీడ్కోలిచ్చారు చలపతీ, సుజాతా. వాళ్ళనించి నేనివాళ నేర్చుకున్నదానికి మాటల్లో కృతజ్ఞత చెప్పాలనిపించక అలాగే వచ్చేశాను.

                                         *     *    *   *
(2013 ఉగాది కథల పోటీలొ ప్రధమ బహుమతి పొంది, 25-4-13 ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమైన కథ)


38 comments:

 1. వారణాసి నాగలక్ష్మిగారు,
  మీ కథ భూమిలో చదివాను. మీరు బ్లాగులో ఎప్పుడెప్పుడు పోస్ట్ చేస్తారా అని చూస్తున్నాను. నిజంగా ఫోటో ఫ్రేం కట్టి ప్రతి ఇంట పిల్లలచేత పారాయణం చేయించాల్సిన కథ.ఇంటినిండా జిరాక్సులే జిరాక్సులు. పిల్లలను అనవసర వత్తిడికి గురిచేసే తల్లిదండ్రులు ఉన్నారు.లేరనలేం.కాని వారి ఆరాటంలోని మరోకోణాన్ని మీరు స్పృశించిన తీరు అమోఘం.మీ కథనం సెలయేరులా మొదలై నదిలా నడయాడి కడలిలా ఎగిసిపడింది. చివరికది నయాగరా హోరులా ప్రతిధ్వనిస్తూనే ఉంది. శుభాభినందనలు.

  ReplyDelete
 2. ఉమాదేవి గారు, వెంటనే స్పందించిన మీకు కృతజ్ఞతలు.తోటి రచయిత/త్రి ని మనసారా అభినందించే హృదయం ఉన్న మీకు అనేక అభినందనలు !

  ReplyDelete
 3. చాలా బాగుందండి .
  అందరకి తెలిసిన , తెలియని కోణం .
  ఇదే ఎప్పట్నిండో అనుకుంటున్నాను .
  అద్దం లో చూపించారు ఏంతో వివరంగా .
  కథ చదివి, కాసేపు ఆలోచిస్తూ ఉన్నాను .
  నిజమే . ఉమాదేవి గారి అభిప్రాయమే నాదీను .
  Thank you for such a great story.
  :venkat

  ReplyDelete
 4. నాగలక్ష్మి.. చాలా చాలా నచ్చింది ఈ కధ. మీరు అన్నట్లు ఇంట్లో ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి. తల్లి తండ్రులు తమకి అన్నీ అమర్చి పెట్టాలని ఆశించే పిల్లలు, బదులుకు మనమేం ఇస్తున్నాం వాళ్లకి అని ఒక్క క్షణం ఆలోచించి చూసుకోవాలి. ఏదో తెలుగు సినిమాలో చూసాను. హీరోయిన్ అప్పుడే ఉద్యోగంలో చేరి ఉంటుంది. సాయంత్రం ఇంటికి రాగానే "అమ్మా! నాకు ఒక కప్పు కాఫీ వెంట తెచ్చి పెట్టు. చాలా అలిసి పోయాను" అంటూ ముద్దుగా చెప్పి మేడ మీద తన గదిలోకి వెళ్లి పోతుంది.ఆ అమ్మ కూడా మురిపెంగా తన కూతురికి కాఫీ కలపడానికి లోపలి వెళ్తుంది. అంతలో ఆ అమ్మాయి స్నేహితులు, స్నేహితురాళ్ళు అంతా ఊకుమ్మడిగా వచ్చి ఆమె పుట్టిన రోజు అని, పార్టీ ఇచ్చి తీరాలి అని బలవంత పెట్టి, ఆమెను భుజాల మీద మోసుకు పోతున్నట్లు సీన్. అంతా అల్లరి మూక అందులో అబ్బాయిలూ ఉంటారు.
  నాకు తెలియక అడుగుతాను. కాఫీ అమ్మ కలిపి ఇచ్చినా అమ్మతో ముచ్చట్లు చెబుతూ సరదాగా గడపడానికి కూడా తీరిక, ఓపిక లేని ఆ కదానాయికకి బాయ్ ఫ్రండ్స్ తో మాత్రం గడపటానికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది.

  ReplyDelete
 5. చాలా బాగుందండి కథ.
  Especially I liked the sentence
  "-ప్రపంచమంతా చిన్నపిల్లలూ, వృధ్ధులూ నిస్సహాయులనీ , బలహీనులనీ, మధ్యవయసు వాళ్ళంతా బలవంతులూ క్రూరులూ అనీ అనుకుంటుంది"
  So correct!
  Thanks for sharing
  Sharada

  ReplyDelete
  Replies
  1. నాక్కూడా పై వాక్యం చాలా నచ్చిందండీ. కథ కూడా బాగుంది.

   Delete
 6. Anonymous గారికి,నారాయణ స్వామి గారికి,యోగేంద్ర గారికి కృతజ్ఞతలు.

  గౌరీ, TV, సినిమా లాంటి powerful media పూర్తిగా వ్యాపారాత్మకం కాకుండా ఉంటే , అత్యంత ఆవశ్యకమైన చిన్న చిన్న విషయాలెన్నో వాటి ద్వారా పిల్లల మెదళ్ల లోకి ఎక్కించవచ్చు.వినోదమే ప్రధానమైనా సమాజానికవసరమైన సంస్కారం అందులో మిళితం చేయలేరా అనే ప్రశ్న నన్ను వేధిస్తుంది.ప్రతి సినిమాలోనూ ఎవరో ఒకరికి ఏదో ఉత్తరం వస్తుంది.ఆ కవరు చింపి ఆ రెండు ముక్కలూ చెరో వైపూ నేలమీద పడేసి సీరియస్ గా ఉత్తరం చదువుతుంది ఆ పాత్ర.
  హీరో ప్రపోజ్ చేస్తే హీరోయిన్ తిరస్కరిస్తుంది.అయినా వెంటబడి అల్లరి చేస్తుంటే కొన్నాళ్లకి ప్రేమలో పడి పోతుంది.ఒకటా రెండా ఇలాంటి సినిమాలు ?వాస్తవ జీవితంలో అందుకు భిన్నంగా జరిగితే ఈ హీరోలు తట్టుకోలేక విలన్లైపోవడమో,ఆత్మహత్యలకి పాల్పడడమో చేస్తున్నారు.ఇలా ఎన్నో ఉన్నాయి చర్చించవలసినవి. ఇది వేదిక కాదు .. ఏమైనా స్పందించినందుకు కృతజ్ఞతలు !

  ReplyDelete
 7. అనుకోకుండా తారసపడింది ఈ కథ నాకు. ఏకబిగిన చదివించింది మీ కధనం... మోత్తం చదివేసరికి నా కళ్ళు చెమర్చాయి..బహుశా ఒక తల్లిని అయినందువల్ల ఈ కథ నా హృదయాన్ని తాకింది. మా 9yrs అమ్మాయికి చదివి అర్థం అయేలా చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ఒక confusion ని clear చేసింది ఈ కధ..మీకు సర్వదా కృతజ్ఞతలు.

  ReplyDelete
 8. ప్రణిత గారు, మీకు నచ్చినందుకు సంతోషం...మీ అమ్మాయికి చదివి వినిపిస్తానన్నందుకు మరింత సంతోషం ! సమయం వెచ్చించి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు !

  ReplyDelete
 9. Nagalaxmi garu...First of all let me congratulate for writing the PRIZE WINNING STORY.. for a reputed Telugu magazine. I used to purchase the telugu magazines and read the stories from which I learned a lot from the good stories.. and I can tell your AMMA NAANNA O COLLEGE ABBAYI is one among those good stories and ofcourse ..anduke prize vachindi...Its really very good to read the story..and I can see the experience and expertise of a writer in the sentences. HATS OFF TO YOU NAGALAXMI GARU......Kandal sreenivsa rao

  ReplyDelete
  Replies
  1. Thank you Srinivasa Rao garu !Sorry for the delayed reply(I was away on vacation).It is nice to know that busy doctors like you still make some time to read literature !

   Delete
 10. చాలా బాగుంది. కథ మొదట్లో రొటీన్ స్టోరీనే కదా అనుకున్నాను కాని ముందుకు సాగుతున్న కొద్దీ ఆపకుండా చదివించారు. సూపర్ !

  ReplyDelete
  Replies
  1. Exactly! నేనూ ముందర 'హమ్మో.. మరొక IIT coaching, పిల్లల మీద తల్లిదండ్రుల జులుం, పీడిత పిల్లలు.. ' వద్దు అనుకుని చదవలేదు. చాలా బాగా రాశారు. అభినందనలు.

   Delete
  2. కృష్ణప్రియ గారికి ధన్యవాదాలు.

   Delete
 11. శ్రీనివాస రావు గారికి,నాగార్జున గారికి థన్యవాదాలు !

  ReplyDelete
 12. PATURI.KOTESWRARAO,Rtd,Executive Director,VignanGroupApril 24, 2013 at 11:58 AM

  AMMA NANNA OKA COLLEGE ABBAYI is an excellent story written by Smt.Varanasi.Nagalakshmi.The story depicted the psychology of a disinterested student, an anxious and highly aspiring mother and a helpless father. The psychiatric doctor is apart from her professional expertise is very pragmatic in dealing the critical situation of the three involved in the problem.
  Nagalakshmi garu gave a real picture of the Hi-Fi parents on the parents day in the college.In conclusion the sketch is an eye opening for the unpragmatic and very ambitious parents and aimless students with casual living.
  I wish Smt.Varanasi.Nagalakshmi to continue take up social problems and make the concern to think seriously.

  ReplyDelete
 13. కథ చాలా బాగుందండి. నాణానికి రెండో వైపు చూపెడుతూ ఇప్పటి చాలా మంది తల్లిదండ్రుల మానసిక స్థితిని..కొంత మంది పిల్లల్లో ఉండే బాధ్యతా రాహిత్యాన్ని చాలా ప్రభావవంతంగా చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. మీకు నచ్చినందుకు చాలా సంతోషమండి.

   Delete
 14. కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆలొచలు చాలా చక్కగా ప్రతిబింబించారు. నా స్నేహితులందరితో పంచుకుంటాను.

  ReplyDelete
 15. కధ చాలా బాగుంది లక్ష్మి గారు. కౌమార దశలొ పిల్లల ఆలొచలు చాలా చక్కగా ప్రతిబింబించారు. నా స్నేహితులందరితో పంచుకుంటాను.

  ReplyDelete
 16. Excellent Story..

  ReplyDelete
  Replies
  1. హరి రామ్ గారికి , Anonymous గారికి కృతజ్ఞతలు !

   Delete
 17. Chaala chaala bagundandi
  Many many thanks, As i came to know the other angle!!!
  Manaspoothirthigaa Kruthagnathalu:)

  ReplyDelete
 18. సుమా ! మనస్పూర్తిగా స్పందించినందుకు సంతోషం తల్లీ ! కేవలం మన దృక్కోణం నుంచే కాక అవతలివారి దృక్కోణం నించి కూడా చూడడానికి ప్రయత్నిస్తే ఎన్నో సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి. మీలాంటి సానుకూల దృక్పధం ఉన్నవాళ్ళు సాహిత్యాభిలాషులు కూడా అయితే వారి ఎదుగుదలకు నింగే సరిహద్దు !అనేక శుభాకాంక్షలు !

  ReplyDelete
 19. నిజంగా చాలా బాగుందండి. ప్రతి మాటా అవునుకదూ అని మనసు అంతరాత్మని అడగటం మొదలుపెట్టింది. ఈ కోణం తెలిసినదే అయినా, ఇంత విపులంగా తెలియచేసింది మాత్రం మీరే! అన్నింటికన్నా సంతోషం యండమూరి గారు మీ కథని తన రచనకు ఆధారం చేసుకోవటం! ఈ కథలో నాకు బాగా నచ్చిన వాక్యాలు.."“నా చిన్నపుడు అమ్మా, నాన్నా, మామ్మా అంతా చెప్పేవారు...వాళ్ళమ్మాయిని చూడు ఎంత శ్రద్ధ ! వీళ్ళమ్మాయిని చూడు ఎంత పనితనం! వాణ్ణి చూడు ఎంత పొదుపు, వీడికెంత వ్యవహార జ్ఞానం,.....వినయం, సహనం, మాటతీరు...ఒకటి కాదు, ఎవరిలో ఏ మంచి కనపడినా చెపుతుంటే వింటూ, జీవితానికి కావలసినవన్నీ నేర్చుకుంటూ ఎదిగాం. ఇవాళ పిల్లల ముందు ఎవరినీ మెచ్చుకోకూడదు. ఎవరితోనూ పోల్చకూడదు. నువ్వింతవాడివి, అంతవాడివి అంటూ వాళ్ళనే పొగుడుతూ, చిన్న చిన్న పనులక్కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి. వాళ్ళే సర్వ శ్రేష్ఠులని తీర్మానిస్తే ఇంకెవర్ని చూసి నేర్చుకుంటారో మరి? "

  ReplyDelete
 20. నాగలక్ష్మిగారూ అద్భుతమైన ఇంటింటికద . పిల్లలలోను ,పెద్దలలోను ఇద్దరిలోను అలాంటి కోరికలు ఉంటున్నయి.
  అవి జరగనప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు . మనస్తత్వ చిత్రీకరణ చాలాబాగుంది.ఇది చదివినవారిలో కొంతమందిలోనైనా మార్పు రావాలని కోరుకుంటూ..... మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను

  ReplyDelete
  Replies
  1. కథ చదివి స్పందించినందుకు కృతజ్ఞతలండి!

   Delete
 21. నమస్కారం అమ్మా.మీరు అనుమతిస్తే ఆర్థిక లాభాపేక్ష కోసం కాకుండా సామాజిక చైతన్యం కోసం ఇదే అంశంతో లఘుచిత్రం రూపొందించవచ్చా..

  ReplyDelete
 22. ఏదో మామూలు కథే అనుకుంటూ బ్లాగ్ క్లోజ్ చేయబోతూ మళ్ళీ చదివినందుకు ఒక గొప్ప కథ మిస్ అవలేదు అన్న ఆనందంతో - ఇంత మంచి కథకు బహుమతి పొందిన మీకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను :)

  ReplyDelete