April 5, 2013

ఏప్రిల్ నది మాస పత్రికలో ఉగాది ప్రత్యేక వ్యాసం

తెలుగు వారికి  చైత్ర శుద్ద పాడ్యమి నాడు ఉగాది పండుగ తో నూతన సంవత్సరం ఆరంభమౌతుంది. ఈ సంవత్సరం  ఏప్రిల్ నెల పదకొండవ తేదీన  ఉగాది పండుగ తో శ్రీ విజయ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఇది ప్రభవ ,విభవ మొదలైన అరవై సంవత్సరాల వర్ష వలయంలో ఇరవై ఏడవది.

          ఉగాది ముహూర్తం అన్ని శుభ కార్యాలను ప్రారంభం చేయడానికి అనువైనదిగా, జన హృదయాలలో ఉల్లాసం , ఉత్సాహం నింపే శుభ తరుణంగా  భావించబడుతోంది. దానికి సూచనగా ప్రకృతి కూడా లేచివుళ్ళతో , రంగు రంగుల పూలతో ముస్తాబవుతుంది. చెట్లన్నీ రాలిన ఆకుల స్థానంలో క్రొత్త చిగుర్లు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. కోయిలల కూనిరాగాలతో లోకం పులకిస్తుంది. ఈ కూని రాగాల కోకిలమ్మలను కవ్వించే తుంటరి పిల్లల అల్లరితో వాతావరణం రాగరంజితమౌతుంది. మామిడి చెట్లకు ఊరిస్తూ గుత్తులుగా వేళ్ళాడే పిందెలు ఊరగాయలకోసం తయారైపోతాయి. హిందూ జీవన విధానంలో ఉగాది పండుగకున్నప్రాధాన్యత ఇంతా అంతా కాదు.

         కర్ణాటక లో  యుగాది పేర , మహారాష్ట్ర లో గుడిపడవ పేర ,రాజస్థాన్ లో థాప్నా పేర, సింథీలు చేటిచండ్ పేర, మణిపురీలు సజిబు నోంగ్మ పంబ పేర, మారిషస్ లోనూ, ఇండొనీషియా లోనూ, బాలి లోనూ  న్యేపి పేర ఇదే రోజున కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పండుగ చేసుకుంటారు.ఇదే రోజున కాకపోయినా పంజాబులో బైశాఖిగా, తమిళనాడులో పుతండుగా  నూతన సంవత్సరాగమనాన్ని  ఆనందోత్సాహాలతో జరుపుకునే ఆచారం ఉంది.

                 బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోఙునే ఉగాది పండుగగా జరుపుకుంటారు. ప్రజానురంజకంగా రాజ్యపాలన సాగించిన  శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినది ఉగాది రోజే. శ్రీరాముడి నవరాత్రులు కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతాయి. అధర్మపరులైన కౌరవులకీ, ధర్మమూర్తులైన పాండవులకూ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో జరిగిన యుద్దంలో కౌరవుల నోడించిన ధర్మరాజు తన పట్టాభిషేకానికి ఉగాదినే ఎంచుకున్నాడు. అందుకే ఉగాది పర్వదినాన్ని ధర్మానికి విజయం లభించిన రోజుగా భావిస్తారు. 
 వెయ్యేళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీట ధారణ చేసినదీ కూడా ఉగాది నాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. నిత్య జాగృతమైన ప్రజా జీవితంలోనే  దేశసమైక్యతను కాపాడగలిగే శక్తి ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. భారత సమాజం భోగాభాగ్యాలలో మైమరచి ఉన్నప్పుడు భారతదేశంపై విదేశీయులైన శకులు దండెత్తి , భారతభూమి నాక్రమించి, మధ్య భారతం దాకా వచ్చారు. సభ్యత, సంస్కృతీ , ధర్మాచరణ తెలియని  శకులు  భారతదేశం లో జరిపిన అక్రమాలకు, అత్యాచారాలకు అంతు లేదు. నీరసులై, జడులై, చైతన్యరహితులైన  సాధారణ ప్రజలను  సంఘటిత పరచి, వారిలో ధర్మనిష్ఠను, సంఘీ భావాన్ని, పౌరుష శక్తులను నింపి శకులను పూర్తిగా ఓడించిన మహనీయుడు శాలివాహనుడు. ఆనాటి విజయగాథకు చిహ్నంగా ఉగాది నుండి శాలివాహన శకం ప్రారంభమైంది. అందుకే  నూతనకార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదని హిందువులు భావిస్తారు.
వేసవి తాపానికి దివ్యౌషధమైన ఉగాది పచ్చడిని వేపపూలతో, కొత్త చింతపండుతో, బెల్లంతో ,మామిడి పిందెలు,ఉప్పు,కారాలతో తయారుచేస్తారు.ఈ పచ్చడిని తినడం వలన చైత్రం నుండి మొదలయ్యే మండుటెండల తాకిడిని తట్టుకొనే శక్తి శరీరానికి లభించి, వాతావరణ మార్పు వలన వచ్చే జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటివి నశిస్తాయని నమ్మకం. అందుకే మన ఋషులు ఈ పచ్చడిని పండుగలో భాగంగా పెట్టారు.ఉగాదికి సంకేతంగా చెప్పుకునే షడ్రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. మానవునికి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ.
               జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలూ, అనుభూతులూ ఉంటాయి. ఆ అనుభూతులన్నిటినీ సమభావనతో స్వీకరించడం ప్రతి వ్యక్తికీ అవసరం. సరికొత్త ప్రకృతి అందించే చెరుకు ముక్కలు లేదా కొత్త బెల్లం నుంచి తీపి (సంతోషం), కొత్త చింత పండు రసం నుంచి పులుపు ( అసహ్యం లేదా అయిష్టం) , ఉప్పు (భయం), మిరియాలు లేదా మిరపకాయలతో కారం( కోపం), మామిడి పిందెల నుంచి వగరు( ఆశ్చర్యం ), వేప పూలు అందించే చేదు ( విషాదం) ....ఈ ఆరు రుచుల సమ్మేళనంతో తయారయే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం కూడా. మానవుడు తన జీవనయానంలో కష్ట సుఖాలు, కలిమిలేములు, సంతోష సంతాపాలు అన్నిటినీ  స్వీకరించాలనీ , ఆయా సమయాల్లో కలిగే మనోభావాలను సంయమనంతో నిగ్రహించుకోవాలనీ  ఉగాది పచ్చడి సూచిస్తుంది.పరుగు పందేన్ని పోలిన ఈనాటి జీవన విధానంలో సంప్రదాయ రీతిలో ఆహారాన్ని తయారు చేయడం మాని, కేవలం తీపి, పులుపు, ఉప్పు , కారం మాత్రమే   సేవించడం వల్ల ఆరోగ్యానికవసరమైన సమతులాహారం శరీరానికి అందడం లేదు. వగరు , చేదు రుచులు ఆహారంలో తీసుకోక పోవడం వల్లా , దానికి తోడు వత్తిడి నిండిన యాంత్రిక జీవనం గడపడం వల్లా  చిన్నవయసు లోనే రక్తపోటు , మధుమేహం దాడి చేస్తున్నాయి. అవసరమైన పరిమాణంలో షడ్రుచులనీ సేవించడం ఆరోగ్యానికి అవసరమని ఆయుర్వేదం చెపుతుంది.

                ఈ  పండుగకు కొద్ది రోజులు  ముందుగానే, అటకలతో సహా అన్నిగదులలోనూ బూజు దులిపి, ఊడ్చి, శుభ్రం చేసుకోవడంతో పండుగ ఏర్పాట్లు మొదలవుతాయి. ఉగాది వంటి పర్వదినాలలో నువ్వులనూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటాయని శాస్త్రోక్తి. కాబట్టి మామూలు రోజులలో ఎలా స్నానం చేసినా, ఉగాదినాడు మాత్రం పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి, కుంకుడురసం లేదా సీకాయపొడితో తలారా స్నానం చేయడాన్నే అభ్యంగన స్నానం అంటారు. అనంతరం నూతన వస్ర్తాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి, గడపలకు పసుపు, కుంకుమలు అలంకరిస్తారు. మామిడాకులతో , వివిధ రకాల పుష్పమాలలతో తోరణాలు కట్టి,  ఇష్టదేవతల విగ్రహాలను పూజించి, శుచిగా చేసిన పిండివంటలను, ఉగాది పచ్చడిని నివేదిస్తారు. దేవుడి మందిరంలో కొత్తపంచాంగాన్ని ఉంచుతారు. పంచాంగానికి ఆ సంవత్సరపు అధిదేవత ఎవరైతే వారిని  షోడశోపచారాలతో పూజిస్తారు. ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని నివేదన చేసి, ఇంటిల్లిపాది ఉగాది పచ్చడిని సేవిస్తారు.

                 సాయంత్రపు వేళ కొత్త బట్టలు ధరించి దగ్గర లోని దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణ కార్యక్రమానికి హాజరవుతారు. ఉగాదినాటి పంచాంగ శ్రవణం గంగాస్నాన ఫలంతో సమానమంటారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు భాగాలను కలిపి పంచాంగం అంటారు. చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ పంచాంగం సూచించిన ప్రకారం  ముఖ్యమైన పనులకు  శ్రీకారం చుడతారు. గ్రహఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వల్ల గ్రహదోషాలు నివారించబడి, వినేవారికి ఆరోగ్యం, యశస్సు, ఆయుష్షు వృద్ధి పొంది, సంపదతో కూడిన సకల శుభఫలాలు లభిస్తాయని పెద్దలు చెపుతారు.

బంగారు రంగుల రంగారు జివురుల 
సింగారముగ జెట్టుజేమలలర 
మంద మందంబుగా మలయానిలంబులు 
కమ్మ కమ్మగ వీవగా దొడంగె 
శుక పిక,శారికల్  సుకముగా బాడుచు
            ప్రియముగా,వీనుల విందొనర్చె  
వాసంత మన్మధుల్ స్వాగత సుమధూళు 
లర్పింప  వేచిరి ఆదరమున   

శ్రీ యుగాది వేం చేసేను శ్రీకరముగా
 రమ్ము పింగళ మూర్తి రారమ్ము వేగ 
పిండివంటల భుజియించి ప్రీతితోడ 
మంగళ మ్ముల మాకు నొసంగు దేవ 

అంటూ ఉగాది వేంచేసిన విధానాన్ని  వర్ణిస్తూ ,  నివేదించిన  పిండి వంటలారగించి శుభ ఫలాలనందించమని కోరుతూ కవిగారు అల్లిన పద్యంలో ఉగాది వేళ ఉదయించే ప్రకృతి  సొగసులు రమణీయంగా  వర్ణించబడ్డాయి. ప్రపంచంలో ఎక్కువ పూలు వికసించేది, పండ్లలో రాజయిన మామిడిపండు విరివిగా లభించేదీ, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కుందపుష్పాలు అంటే మల్లెపూలు పూసేదీ, కోకిల పాడేదీ వసంత ఋతువులోనే! అందుకనే  నాటి నుంచి నేటి వరకు వసంత ఋతువర్ణన చేయని కవులు, రచయితలు లేరంటే అతిశయోక్తి కాదు. 

కవిసమ్మేళనాల నిర్వహణ ఉగాది ప్రాశస్త్యాన్ని తెలిపే మరో విశేషం గా చెప్పుకోవచ్చు. గతంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లు  కవి సమ్మేళనాలకు ఎంతో ప్రాముఖ్యతనిచ్చేవి. ఇప్పటికీ అనేక వేదికలపై  ఉగాదినాహ్వానిస్తూ , సమకాలీన సమాజపు తీరు తెన్నుల్ని వర్ణిస్తూ కవులు ,తాము రచించిన కొత్త కవితలను వినిపించడం , ప్రతిభావంతులైన కళాకారులకు సన్మానాలు చేసి వారి ప్రతిభను  గౌరవించడం  సంప్రదాయంగా కొనసాగుతోంది. ప్రభుత్వమూ, పేరుపొందిన ప్రభుత్వేతర సంస్ధలూ అందించే  ఉగాది పురస్కారాలు మన సంప్రదాయ కళలను ఒక తరం నుండి మరో తరానికి  పదిలంగా అందిస్తూ వస్తున్న కళాకోవిదులకు స్పూర్తినీ, తమ సేవకు గుర్తింపు లభించిందన్న సంతృప్తినీ కలిగిస్తాయి. ఔత్సాహిక కళాకారులకు  ప్రోత్సాహాకరంగా నిలుస్తాయి.ఈ ఉగాది వేళ తెలుగు నేలపై జన్మించి జాతీయ ,అంతర్జాతీయ స్థాయిల్లో పురస్కారాలు పొంది మనకు గౌరవాన్ని తెచ్చి పెట్టిన మహానుభావులందరికీ వందనాలర్పిస్తూ,ఇంతవరకు  ఏ కారణం చేతనైనా తమ ప్రతిభకు సరైన గుర్తింపు పొందని ప్రతిభా మూర్తులను, నూతన సంవత్సరం తగిన రీతిలో సత్కరిస్తుందని ఆశిద్దాం. విజయనామ సంవత్సరం సర్వులకూ వారి వారి కృషికి తగిన ఫలితాన్ని , ఎన్నుకున్న రంగంలో విజయాన్ని అందించాలని కోరుకుందాం !

1 comment: