December 28, 2011

2 . పొంచి ఉన్న ఎడారి 


ఇది ఒకప్పుడు శ్రమ  జీవుల బృందావనం
ఇక్కడ పాలూ పెరుగూ వెన్నా నెయ్యీ పొంగి పొర్లేవి!
చీకటితో మేలుకోవడం పని చేస్తూ పాడుకోవడం
మంచిని మెచ్చుకోవడం వెంట తెచ్చుకోవడం
దీపం కొండెక్కేలోగా  ఆదమరచి నిద్రపోవడం
 అలవాటు వీళ్ళకి !

ఒక్కసారిగా ఎక్కడెక్కడినుంచో
డబ్బు సంచులు ఇక్కడికొచ్చాయి !
నిలవుంటే మురిగిపోయే పాడిపంటల స్థానాన్ని
దాచినకొద్దీ పిల్లల్ని పెట్టే కాసులాక్రమించాయి !
దాచినకొద్దీ ఇంకా  దాచాలని 
దోచుకునైనా వీలైనంత  దాచుకోవాలని
తపన మొదలైంది !

పంచుకోవడం ఆత్మీయత పెంచుకోవడం ఎప్పటి మాటో....
ఇపుడంతా అమ్ముకోవడం కొనుక్కోవడమే !

విద్యుద్దీపాల వెలుగుల్లో
సహజమైన వెలుగు చీకట్లతో పనిలేక
రాత్రీ పగలూ ఏకమైపోయాయి !
గ్లోబలైజేషన్ పుణ్యమా అని
కార్యాలయం ,గృహప్రాంగణం ---
సరిహద్దుగీత చెరిగిపోయింది !
పని వుంటే పగలు ,పని ముగిస్తే రాత్రి !

ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు
ఇల్లు చేరాక దొరికే తీరుబాటుని మింగేస్తోంది
ఆహార నిద్రాదుల విషయంలో మనిషికీ ప్రకృతికీ సంబంధం తెగిపోయింది
అందమైన సూర్యోదయాన్ని చూసినా
అందరికీ గుర్తొస్తున్నది మరో తెమలని పనిదినమే !
ఏసీ స్విచ్చేస్తే  చల్లదనం
ఫ్రిజ్  తెరిస్తే శీతల పానీయం
అవెన్  లో పొగలు కక్కే ఆహారం
వీటికి అలవాటు పడ్డ ప్రాణానికి
ప్రాణ వాయువు పెద్దక్కకి
 ప్రాణం మీదికొచ్చిందని తెలిసినా
పట్టించుకునే ఓపిక లేదు

కనిపించని కాంతి తరంగాల విన్యాసాలలో
మునిగి తేలుతూ ఉక్కిరిబిక్కిరవుతున్నా
సుఖలాలస నుంచీ పుట్టిన అలసత్వం
నిన్న    రాదు   .రేపు   లేదు..నేడే  నిజం  అంటోంది  !
పంట  పొలాలన్నీ  సెజ్  లుగా  మారాక
సేద్యం  లేదు..స్వేదం లేదు..
రేపటితరం గురించి ఆలోచించే సమయం లేదు..
రైతు గుండెల్లో  మిగిలిందొకటే.. ఖేదం !


మెక్డోనాల్డ్స్ ,కే ఎఫ్ సి ,పీజా జాయింట్లు 
మన వీధుల్లోకి చొచ్చుకుని వచ్చి
కోచ్ పోటేటోలని తయారు చేస్తుంటే
భారతంలో కూడా యువ శరీరాలు భారమైపోతున్నాయి !

"నాగరకత కి ముందు అడవులూ..
నాగరకత అంతాన ఎడారులూ "


అని పెద్దలు చెప్పిన మాట 
పచ్చి వాస్తవమై ఎదురుగా నిలిచింది !
పొంచి వున్న ఆ ఎడారిని తరిమి కొట్టకపోతే 
మానవాళి మనుగడ ప్రశ్నార్ధకమై    నిలుస్తుంది!
తలదాచుకుందుకు తల్లి ఒడి మిగలకుండా పోతుంది !!






6 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. బ్లాగ్ తెరచినందుకు చాలా సంతోషం నాగలక్ష్మీ. స్వాగతం.. (నేను బద్ధకంతో రాయట్లేదీమధ్యన.. కానీ బ్లాగరినే మరీ..)
    "సెజ్ లతో, సేద్యం లేదు, స్వేదం లేదు.." ఎంత బాగుందో (బాధాకరంగా..)! అంటే తెలుసు కదూ.. కవిత బాగుంది.. భావం హృదయాన్ని తడుతోంది.
    స్వచ్చమైన తెలుగులో చక్కని భావాల్ని ఆస్వాదించ బోతున్నందుకు చాలా ఆనందం గా ఉంది.
    భానుమతి.

    ReplyDelete
  3. వచ్చేసారా? వెల్కం వెల్కం నాగలక్ష్మిగారు..

    ReplyDelete
  4. భానుమతి గారూ, ధన్యవాదాలు !
    ఒకవైపు మన దేశంలో కథలూ నవలలూ అలవోకగా రాసేస్తూ ,అటు అమెరికా లో పిల్లలదగ్గరికి వెళ్తూ వస్తూ 'నాకు బద్ధకం' అంటే మేం ఒప్పు కోం !

    ReplyDelete
  5. జ్యోతి గారూ! స్వాగతించే సాహిత్యాభి లాషులుంటే రాకుండా ఎలా వుంటాం ?

    ReplyDelete