‘ఎవరికి ఎవరు సొంతము? ఎంతవరకీ బంధము?’ ‘జీవన తరంగాలు’ లోని ఈ పాట ఇలాంటి సందర్భాల్లో గుర్తురాక మానదు.
యద్దనపూడి సులోచనారాణి అనగానే ముందు గుర్తొచ్చేది నా బాల్యం.
మర్సిపూడి నుంచి నూజివీడు వెళ్లే రహదారికి పక్కన అడవిలాంటి మా ప్లీడరు గారి తోట. కనుచూపుమేరలో మరో
ఇల్లు కనపడని ఆ ఒంటరి ఇంట్లో, అమ్మకీ తరచూ
వచ్చి కొన్నాళ్లుండి వెళ్ళే మా బంధువులకీ బయటి ప్రపంచంతో సంబంధాన్ని కలిపేవి పోస్టులో
వచ్చే వారపత్రికలూ మాసపత్రికలే.
వాకిట్లో కళ్లాపి చల్లి ముగ్గులు తీర్చిన ప్రాంగణం. ఓ పక్కగా
దుక్కి దున్నడానికీ, బండి నడపడానికీ తయారుగా
ఉండే ఎడ్లు. వాటి కొమ్మలకి గాఢమైన పసుపో ఎరుపో ఆకుపచ్చో… దట్టంగా పట్టించిన రంగులు.
మెడలో అందమైన పూసల గొలుసులు. అలాగే విశాలమైన కళ్లతో మౌనంగా సంభాషించే ఆవులూ, ఆనందానికి
పర్యాయపదాలా అన్నట్టు గంతులేసే లేగలూ. ఇది ప్రభాత దృశ్యం.
భోజనాలు కాగానే తలో పుస్తకం పట్టుకుని పెద్ద హాలుకి అటూ ఇటూ
పెంకులతో వేసిన వసారాల్లోకి తయారయే అత్తలూ, పిన్నులూ, వదినలూ. ఆ వెనకే అమ్మా. ఆ పత్రికల్లోని
సీరియళ్ల గురించిన చర్చలు ఆ వాతావరణంలో ఒక ఆహ్లాదాన్ని నింపేవి. ఇది మధ్యాహ్నపు దృశ్యం.
ఈ సమూహాలు సాయంత్రమయేసరికి ఒకోసారి వీధి వసారా అరుగులమీదికి
మారుతూ ఉండేవి. పెద్దవాళ్లకి పని సమయాల్లో తీరిక లేకపోయినా వేసవి రెండునెలలూ పుస్తకాల
పిచ్చి ఉన్న పిల్లలు కొందరం ఎక్కడో ఒక అరుగో, గూడో వెతుక్కుని పుస్తకాల్లో లీనమయిపోయేవాళ్లం.
సాయంత్రాలు చీకట్లు కమ్మి రాత్రులయ్యేవి. అప్పటి కరెంటు దీపాలు చీకటిని తరమాలని నానా
కష్టాలూ పడేవి. ఆ చిరు వెలుగుల్లోనే భోజనాలు పూర్తయ్యేవి. పిల్లా పాపా ముసలీ ముతకా
అంతా వీధి వరండా కింద ఆరుబయట వాల్చిన మంచాల మీదకి చేరేవారు. ఇది రాత్రి దృశ్యం.
ఇంతమందికీ వండి వడ్డించి, ఇల్లు సర్దుకుని, పనులన్నీ పూర్తి
చేసుకుని( మేమూ ఉడత సాయం చేసేవాళ్ళం), చదువుతున్న నవలో సీరియలో మరీ నచ్చితే, మధ్యాహ్నం
ఆపిన చోటి నుంచి కొనసాగించేందుకు ఆ పుస్తకాన్ని వెతికి తెచ్చుకునేది అమ్మ. కాంతి చాలినంత
లేకపోయినా అలాగే పుస్తకాన్ని పూర్తి చేసేది. మా చిన్న మేనత్తా, కొందరు కజిన్స్ కూడా
డిటో. ఇలాంటి వాతావరణంలో పెరుగుతున్న మనం మాత్రం వేరేగా ఎలా ఉంటాం?
ఆ తోటలోని జాజులూ
మల్లెల పరిమళాన్నీ, ఆ లేగ దూడల గంతుల సౌందర్యాన్నీ, ఆ వేప కొమ్మల చేదు వాసనల కమ్మని
గాలినీ, ఆరు బయట నక్షత్రాల తళుకుల్నీ, వెండి వెన్నెలనీ, అనంతంగా వ్యాపించే ఆ వినీలాకాశాన్నీ
ఆ సన్నివేశాల్లోంచి తీసేయడం ఎలా సాధ్యం కాదో, ఆ జ్ఞాపకాల్లోంచి యద్దనపూడి సులోచనారాణి గారినితీసేయడమూ అలాగే సాధ్యంకాదు.
ముఖ్యంగా ‘బంగారు కలలు’ సీరియల్ నడుస్తున్న రోజులు నాకు కళ్లకి
కట్టినట్టు జ్ఞాపకం. నా కన్నా బాగా పెద్దవాళ్లైన మా కజిన్స్ అంతా ఆ కాసిని పేజీలూ వారమంతా
దాచుకుని తిరిగి తిరిగి చదువుకునేవారు. ఆ రచనలు- అందని సీమల గురించిన ఆశలు రేపి, అసంతృప్తిని
రగిలించే ఎండమావులు కావు. కమ్మని ఊహలతో జీవితాన్ని మధురం చేసే సుందర స్వప్నాలు. బృందావనం
ఎలా ఉండేదో ఎవరికి తెలుసు? మా ‘ప్లీడరు గారి తోట’ మాత్రం ఆ ఊహని వాస్తవంలోకి దించే
అపూర్వ సీమ. అందులో యద్దనపూడి సులోచనారాణి ఒక మురళీ గానం.
కొంచెం పెద్దయాక ‘మీనా’ నవలని చదివాను. అందులో మీనా కథ కన్నా
కృష్ణ కారెక్టర్ నన్ను ఆకర్షించింది.
With the principal and classmates - Bapatla Agriculture college |
'కృష్ణా' అని పిలవబడే నవయువకుడు రామకృష్ణశాస్త్రి |
ఆరడుగుల ఆజానుబాహువు. పచ్చని ఛాయ. అందమైన వంపు
తిరిగిన భుజాలు. తీరైన ముఖ కవళికలు. అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్ గా ఉద్యోగంలో చేరి, అప్పటి కలెక్టర్ గారి ముందు ఎక్రోబాటిక్ ఫీట్స్ అద్భుతంగా చేసి, ‘మిస్టర్ బాపట్ల’ గా
పేరుపొందిన బలిష్టమైన సుందర దేహం.
తన తోటనీ, పశు సంపదనీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి
సంరక్షించే వ్యక్తిత్వం. అబద్ధాలనీ, మోసాన్నీ ఎంతమాత్రం సహించలేని మనస్తత్వం. ఎదుటి
వ్యక్తి ఎంతటివాడైనా సరే, తను నమ్మినదాన్ని నిర్భీతిగా సూటిగా ఆ వ్యక్తికి చెప్పగలిగే
ధైర్యం.
ఇవన్నీ ‘కృష్ణా’ అని పెద్దలంతా పిలిచే మా నాన్నగారిలో అచ్చుగుద్దినట్టు కనపడే
లక్షణాలు. ఇక కొన్ని వర్ణనలు సరిగ్గా సులోచనారాణిగారు నాన్నగారిని చూసి రాశారా అనిపించేలా
తోచేవి. ముఖ్యంగా తోటలో పువ్వులు కోయించే సన్నివేశం. ఆవు ఈనేటపుడు ఆ మూగ ప్రాణికి సహాయపడి,
లేగ దూడ కాలి గోళ్లు తీసే సన్నివేశం. భోజనం చేసేటపుడు గబగబా తినేసి మళ్లీ పనిలోకి చొరబడే
అలవాటు. పనివాళ్లని సొంత మనుషుల్లా ఆదరించే సుహృద్భావం. ఇలా ఎన్నో....
రాత్రివేళ మా వరండాకి కాస్త దూరం లో వేప చెట్లకింద రాముడూ
లక్ష్మణుడూ అనే రెండు కోడెద్దుల్ని కట్టి ఉంచేవారు. ఒకసారవి రాత్రి వేళ ఎందుకో కలహించుకుని
కట్లు తెంచుకున్నాయి. ఎత్తైన వరండా అరుగుమీద
నిద్రపోతున్నవాళ్లం ఆ కలకలానికి నిద్ర లేచాం. అపుడు నాకు కనిపించిన దృశ్యం,
నా మనో ఫలకం మీద ఇప్పుడే జరిగినంత తాజాగా మిగిలిపోయింది.
పండు వెన్నెల్లో తెల్లని ఆ
ఎద్దులు రెండూ ఒకదాన్నొకటి భీకరంగా పొడుచుకుని కట్లు తెంపుకోవడం, నాన్నగారు అరుగు మీద
నుంచి ‘రాముడూ’ అని గట్టిగా అరుస్తూ నాలుగంగల్లో వాటి దగ్గరకు చేరడం, రాముడి వీపు మీద
నాన్నగారు రెండు మూడుసార్లు గట్టిగా చరచడం, అవి నాన్నగారిని గాయపరుస్తాయేమో అని భయభ్రాంతులమై
చూస్తూన్న మాకు ఆశ్చర్యం గొలిపేలా, మంత్రించినట్టు రాముడు నాన్నగారికి తలవంచడం, లక్ష్మణుడు
దూరంగా పారిపోవడం… మరపురాని దృశ్యం.
రాముణ్ని కోప్పడి కట్టుగొయ్యకి కట్టేసి, అంత రాత్రివేళ నాన్నగారు లక్ష్మణుణ్ని వెతుకుతూ వెళ్లారు. సుమారు
పదేళ్ల వయసున్న నేను, నాన్నగారు క్షేమంగా రావడం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం ఇప్పటికీ
గుర్తే. లక్ష్మణుణ్ని కూడా వెతికి తీసుకొచ్చి కట్టేశాక, “పొద్దున్నే వెళ్లచ్చుకదా నాన్నగారు?
పాములవీ ఉన్నా కనిపించని ఇంత రాత్రివేళ, ఇంతెత్తు గడ్డీ మొక్కలూ ఉన్న పొలాల్లోకి ఎందుకు
వెళ్ళారు?” అనడిగాను.
“అలా మన పశువుల్ని వదిలేస్తే అవి వేరే రైతుల పొలాల్లో అడ్డదిడ్డంగా
తిరిగి, వాళ్ల పంట పాడు చేస్తే ఎలా అమ్మా? తప్పు కదా?” అన్నారు! ఈ సంఘటనే కాదు ఎన్నో సందర్భాలలో నాన్నగారు మీనా
లోని కృష్ణ పాత్రకి వాస్తవరూపంగా కనిపించేవారు. ఆయన అక్కచెల్లెళ్లకి, తమ్ముళ్ల కీ ఆయనంటే
ఆరాధన. పిల్లలం మా విషయం వేరే చెప్పక్కర్లేదు.
సులోచనా రాణిగారితో ఈ విషయాలన్నీ కొన్ని సందర్భాల్లో పంచుకోవడం
జరిగింది. ఆవిడ ఎంతో సంతోషించి, “కృష్ణ కారెక్టర్ ని తమ వాళ్లతో ఐడెంటిఫై చేసుకున్న
వాళ్లున్నారు గాని, ఇలా తండ్రిలో చూసిన మొదటి వ్యక్తివి నువ్వే నాగలక్ష్మీ! నాకు మీ
నాన్నగారిని చూడాలని ఉంది. తీసుకెళ్తావా?“ అన్నారు.
“అంతకంటేనా?” అని నేనూ, మా అమ్మాయీ (కారు డ్రైవింగ్ కి) సిద్ధం
అయిపోయాం.
అపుడు నాన్నగారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు.
When he was working as an agriculture demonstrator |
నాన్న గారి పేరు రామ కృష్ణ శాస్త్రి. తాతగారూ, పెద్ద తాతగారూ,
మామ్మా, పెద్దత్తా… ఇలా ఆయనకన్న పెద్దవాళ్లంతా ఆయన్ని ‘కృష్ణా’ అనే పిలిచేవారు. మీనా
లో కృష్ణ తల్లి పిలిచినట్టే!తమ పిలుపులోనే ప్రేమంతా రంగరించి పిలిచే వారు.
సులోచనారాణిగారు ఇలా వస్తానన్నారనీ, నాన్నగారిని చూస్తానన్నారనీ
చెపితే “కృష్ణ , కృష్ణలా ఉన్నపుడు చూడాలమ్మా. ఇలా మంచం మీదున్నపుడు కాదు” అన్నారు.
అయినా ఎలాగో ఒప్పించాను. అమ్మ కూడా చాలా ఉత్సాహపడింది, తన అభిమాన రచయిత్రిని చూడబోతున్నానని.
సరిగా అనుకున్న రోజుకి ముందు రోజు సులోచనారాణిగారు ఫోన్ చేసి “నాకు ఒంట్లో బాగా లేదమ్మా,
జ్వరం వచ్చి బాగా నీరసంగా ఉన్నాను. కొంచెం తగ్గాక వస్తాను” అన్నారు. తర్వాత వారమ్మాయి
అమెరికా నించి వచ్చిందనీ బిజీగా ఉన్నాననీ అన్నారు.
ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్నగారు పోవడం జరిగింది. నాన్నగారి
మరణ వార్త విన్నాక ఫోన్ చేసి “మీ నాన్నగార్ని చూడాలని ఎంతో అనుకున్నాను గానీ, చూడలేకపోయానమ్మా”
అని తన సంతాపం వ్యక్తం చేశారు.
‘లేఖిని’ సంస్థ ప్రతి ఏటా రచయిత్రులకి అందించే పురస్కారాల్లో
ఉత్తమ కథా రచనకిచ్చే పురస్కారం అంతకు ముందు నాకు లభించింది. ఆ పురస్కారాన్ని లేఖిని
అధ్యక్షులైన సులోచనారాణి గారి చేతులమీదుగా అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ లేఖిని
రచయిత్రులు కొందరిని వారింటికి High Tea కి పిలిచారు. వాసా ప్రభావతిగారు, తమిరిశ జానకి
గారు మొదలైన సీనియర్ రచయిత్రులతో పాటు నేనూ, ఇంకొంతమంది రచయిత్రులూ వెళ్లాం. ఆ సమావేశం
ఎంతో ఆత్మీయంగా ఆహ్లాదంగా జరిగింది. అందరం ఆమెతో ఫొటోలు తీసుకున్నాం. ఆమెతో జతపడిన
ఎన్నో జ్ఞాపకాలు… ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధంగా. ఆ రోజు అందరి వదనాలూ పువ్వుల్లా విచ్చుకున్నాయి,
ఆ జ్ఞాపకాల పరిమళాలని వెదజల్లుతూ.
అనేక సందర్భాలలో సులోచనారాణిగారిని కలవడం జరిగింది. నాకెంతో
సంతోషాన్నిచ్చే జ్ఞాపకాలవి. ఆమె మృదుభాషిణి. మెత్తని కంఠస్వరం. మాటల్ని తూచి తూచి మాట్లాడేవారు.
‘మనం పెద్దవాళ్లమయ్యాక ఎలా జీవితాన్ని గడపాలనుకుంటున్నామో
పాతిక ముప్ఫై ఏళ్లనించే ఆలోచించి, దానికి తగిన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి’ అనేవారు.
అలాగే తన మార్గాన్ని కూడా సుస్పష్టంగా నిర్దేశించుకున్నారు. తాను ఒంటరి అయినా ఎందరో
ఆపన్నులకి తోడూ నీడా ఇస్తూ, వృద్ధాశ్రమాలకి ఆసరా అందిస్తూ, ఎప్పుడూ ఇంట్లో తిరుగాడే
మనుషులతో జీవించే వారు.
ఈ సందర్భంలో కొండవీటి సత్యవతితో జతపడిన ఒక సంఘటన గుర్తొస్తోంది.
చాలాకాలం క్రితం భూమిక బృందంతో రచయిత్రులం కొందరం పోలవరం యాత్రకి వెళ్లి, నరసాపురంలో
ఒకరోజున్నాం. అక్కడి కాలేజీ యాజమాన్యం, మాతో ఒక సాహితీ సమావేశం ఏర్పాటు చేశారు. భూమిక
స్త్రీవాద పత్రిక. స్త్రీవాద రచనలని ప్రశంసిస్తూ ఆ సమావేశానికి వచ్చిన కొందరు సాహిత్యాభిమానులు,
కిందటి తరంలో యద్దనపూడి వంటి వారు కాలక్షేపపు సాహిత్యం రాశారనీ; ప్రస్తుత స్త్రీవాద
రచయిత్రులు మాత్రమే సీరియస్ సాహిత్యం రాస్తున్నారనీ అనగానే, సత్యవతి దానికి అభ్యంతరం
చెపుతూ, సీరియస్ సాహిత్యం అప్పుడూ ఉందనీ; కానీ వంటిళ్లలోనూ ఇంటి చాకిరీతోనూ మగ్గిపోయే
స్త్రీలనీ, అంతంత మాత్రం చదువులకి మాత్రమే నోచుకున్న ఆడవాళ్లనీ పుస్తక పఠనం వైపు లాక్కుని
వచ్చింది మాత్రం యద్దనపూడి వంటి రచయిత్రులే అనీ చెప్పి వారిని తక్కువ చేయవద్దని కోరింది.
ఆ రోజుల్లో స్త్రీలకి దొరికే కొద్దిపాటి సమయంలో ఆ నవలల ద్వారా అందే సుకుమార హృదయ స్పందనా,
అందమైన కలల లోకంలో విహరించి వచ్చిన ఆహ్లాదమూ ఎంతో ముఖ్య పాత్ర పోషించాయి. అవి వారికి
ఉత్సాహంతో మళ్లీ పనిలోకి చొరబడే శక్తిని ఇచ్చాయంటే సత్య దూరం కాదు.
ఈ రోజు పొద్దున్న సులోచనారాణి గారి నిష్క్రమణ వార్త విని టీవీ
పెడితే వనిత ఛానెల్ లో ఆవిడకి నివాళిగా ఆమెతో ఒక యాంకర్ చేసిన ముఖాముఖి వస్తోంది. చివరలో
ఒక ప్రశ్నకి జవాబిస్తూ ఆమె “ఇదే నా ఆఖరి ఇంటర్వ్యూ. ఇంక ఎవరికీ చెప్పబోవడం లేదు. జాగ్రత్తగా
వినమ్మా. నాకు పాఠకుల ప్రేమ పుష్కలంగా దొరికింది. నేను పోయిన తర్వాత సంతాప సభలు చేయడం,
దండలవీ వేయడం, బాధపడడం నాకు ఇష్టంలేదు. చక్కగా మీరంతా నాకు ‘ వెళ్లి రామ్మా ‘ అని చెప్పండి.
ఇలాగే ప్రేమగా తలచుకోండి” అన్నారు.
https://www.youtube.com/watch?v=xH_BhvpZwRU
https://www.youtube.com/watch?v=xH_BhvpZwRU
మరణంలో కూడా ఆమె కలల రాణిగానే కదిలి పోయారనిపిస్తుంది. ఒక ఠీవి! ఒక హుందాతనం!
పాఠకలోకం ఆమెను ప్రేమగా తలుచుకుంటూనే ఉంటుంది. ఆమె ఆకాంక్షించినట్టే, ‘వెళ్లి రామ్మా’
అని ఆత్మీయంగా కోరుతుంది.
x
ReplyDeleteయద్దనపూడి వారిని చాలా అయిన గా తలచు కున్నారు. చాలా బాగుంది.
తన కలంతో కాలాన్ని కట్టిపడేసి కలల మేఘాలతో ఆవృతం గావించి మధురవృష్టి ని కురిపించిన రాణికి నివాళి.
జిలేబి
ధన్యవాదాలండి!
Deleteఆవిడ చివరి ఇంటర్వ్యూ చూసాను. ఆ వీడియో కూడా ఇక్కడ పోస్ట్ చేస్తే బాగుంటుంది.ఆవిడ మరణం కూడా హుందాగా ఉంది.సునాయాస మరణం అనేది అదృష్టం కదా ?
ReplyDeleteథాంక్సండీ. వీడియో లింక్ పొందుపరచాను.
Delete“అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, .....” లభించే అదృష్టవంతులు అరుదుగా ఉంటారు 🙏.
ReplyDeleteచక్కటి నివాళి.
కృతజ్ఞతలండి మీ స్పందనకు!
DeleteBeautiful tribute!
ReplyDeleteచాల బావుంది నాగలక్ష్మి. నాకు ఎప్పుడు కూడా మీనా నవలలో కృష్ణ క్యారెక్టర్ అంటే చాల ఇష్టము. దాన్ని నువ్వుమీ నాన్నగారి లో చూసుకోవడం ఇంకా బావుంది. కూతుర్లకి ఎప్పుడు తండ్రే హీరో . దాన్ని నువ్వు నిజం చేసావు. కుడోస్ నాగలక్ష్మి
ReplyDeleteథాంక్యూ మణీ! కృష్ణని నేను నాన్నగారిలో చూసుకోలేదు. నాన్నగారు అలాగే ఉండేవారు. అయితే ఒక మూడు నాలుగు గంటల్లో చదివేసే నవల కాదు కదా జీవితం. ఆయన్ని యాభై సంవత్సరాలు దగ్గరగా గమనించాను.చాలామంది కూతుర్లకి తండ్రే హీరో నిజమే గాని ఒక కూతురిగా కాకుండా ఆయనని ఒక పరిశీలకురాలి దృష్టితో చూసి రాసిన వాక్యాలవి!!
Delete