సరళీస్వరాలు
‘సరిగమ సరిగమ సరిగమ పదనిస.. సనిదప సనిదప సనిదప మగరిస’ తలుపు తెరవగానే పక్కింటి వాళ్ళ పాప ‘అవని’ సంగీత సాధన వినిపించింది.
లిఫ్ట్ బటన్ నొక్కి నాలుగు గుమ్మాల మధ్య ఉన్న కామన్ స్పేస్ లో నిలుచున్నా, లయ బద్ధంగా మెట్లెక్కుతూ దిగుతూ ఉన్న అవని కంఠధ్వని వింటూ.
‘సరిగమ సరిగమ సరిగమ పదనిస.. సనిదప సనిదప సనిదప మగరిస’ తలుపు తెరవగానే పక్కింటి వాళ్ళ పాప ‘అవని’ సంగీత సాధన వినిపించింది.
లిఫ్ట్ బటన్ నొక్కి నాలుగు గుమ్మాల మధ్య ఉన్న కామన్ స్పేస్ లో నిలుచున్నా, లయ బద్ధంగా మెట్లెక్కుతూ దిగుతూ ఉన్న అవని కంఠధ్వని వింటూ.
అమ్మ చిన్నప్పుడు అక్కలిద్దరినీ తెల్లవారుజామునే లేపేసి, ఇలాగే సంగీతపాఠాలు సాధన చేయిస్తుంటే, దుప్పటి ముసుగులో చెవులు మూసుకుని విసుక్కుంటూ పడుకోవడం గుర్తొచ్చింది. ఇప్పటికి కనీసం ఏడాదిగా వింటున్నా ఇవే స్వరాలు! ఏమిటో ఆ పిల్లకైనా విసుగురాదా అవే స్వరాలు రోజూ పాడడానికి?
లిఫ్ట్ తలుపు మూస్తుంటే "ఆరోగ్యం కోసం వాకింగ్
కి వెళ్తూ, మూడో అంతస్తు నించి లిఫ్టులో కిందికి దిగుతారు.
కారెక్కి పార్కు కెడతారు. మళ్ళీ వాకింగ్ అయ్యాక కార్లో వెనక్కొచ్చి, లిఫ్టెక్కి ఇంటికెడతారు “ సూర్య మాటలు
గుర్తొచ్చాయి.
నిజమే. అనాలోచితంగా యాంత్రికంగా
అయిపోయింది దైనందిన జీవితం. మూడంతస్తులు ఎక్కి దిగలేని శరీరం
కాదు. ఆలోచిస్తే ఖర్చుల్ని నియంత్రించుకోవడం, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం, సరైన ప్రయారిటీస్
నిర్దేశించుకోవడం అంత కష్టమేం కాదు. కానీ దాదాపు మూడేళ్లుగా
ఇదే దినచర్య పాటిస్తున్నా ఎప్పుడూ సూర్య చెప్పిన విషయం నా
దృష్టికి రాలేదు! లిఫ్ట్ కోసం ఎదురుచూసే సమయంలో చక చకా
కిందికి దిగిపోవచ్చు. కరెంటు ఆదా.
కార్లో పార్కు చేరేలోగా రెండు ఫోన్లొచ్చాయి. మొదటిది, మా కంటే ముందుగా పార్కు చేరిన వాకింగ్ ఫ్రెండ్ శివరావు గారినించి. దగ్గర్లో ఉన్నానని చెప్పి
పెట్టేశాను. రెండోది మోహన్ నించి. తీయకుండా
వదిలేశా, కారు దిగాక చేద్దామని. ఏం చెయ్యాలో
తేల్చుకోలేక చాలా రోజులుగా నిర్ణయం తీసుకోవడం వాయిదా వేస్తూ వస్తున్నా. ఆలస్యం
అయిన కొద్దీ అవకాశం చెయ్యిజారిపోతుందేమో అనిపించింది.
"అవకాశం సంగతటుంచి సందిగ్ధత విషం లాంటిది. అది మన్ని రోగిష్టి వాళ్ళని చేసి విడిచిపెడుతుంది"
అనిత మాటలు గుర్తొచ్చాయి.
కారు పార్క్ చెయ్యగానే మోహన్ కి ఫోన్ చేశా. వాడు చెడామడా చివాట్లు
పెట్టాడు.
"ఎన్నాళ్ళు చేస్తావురా
ఇలా పనికిమాలిన చాకిరీ? వచ్చిన ఆఫర్ నచ్చితే సరేనను. లేదా నేను స్టాగ్నేట్ అయిపోదలచాను,
నీ ఆఫర్ నాకొద్దని పిళ్ళై కి చెప్పెయ్” అని
టప్పున ఫోన్ పెట్టేశాడు. చిరాగ్గా అనిపించింది. ‘ఊరికే అరుస్తాడెందుకూ? వాడిలాగా వెనకాల డబ్బుకొండేదైనా ఉంటే నేనూ టకటకా నిర్ణయాలు తీసుకుందును’
గొణుక్కున్నాను గట్టిగా ఏమీ అనలేక.
పచ్చదనంతో తొణికిసలాడుతూ
కెబీఅర్ పార్కు లోపలికి ఆహ్వానించింది. చికాకులన్నీ గేటు
బయట వదిలేసి లోపల పది నిముషాలు నడిచేసరికి ముందుగా అనుకున్న ప్రకారం శివరావు గారూ, ఇంకో ఇద్దరు మిత్రులూ ఎదురయ్యారు. ఆత్మీయంగా నవ్వుతూ చెయ్యూపి, వాళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ కొనసాగించారు
శివరావు గారు.
"నీతీ నిజాయితీ విషయం లో
కడుపు నిండిన వాడికీ, కడుపు కాలే వాడికీ ఒకటే రూలు న్యాయం
కాదు. కడుపు నకనక లాడుతున్నపుడు కనుచూపు మేరలో ఎక్కడా ఆకలి తీరే మార్గం
కనిపించనపుడు, పండో, కాయో, బ్రెడ్డు ముక్కో దొంగచాటుగా అయినా తీసుకుని క్షుద్బాధ తీర్చుకోవాలనుకోవడం
సహజం. మీరేదో ప్రయాణంలో ఉంటారండీ .. ఎక్కడా భోజనం దొరకని పరిస్థితి. అప్పుడు కూడా
మీరూ, వాడూ ఒకటి కాదు. మీ జేబు
నిండా డబ్బుంది. రెండు మూడు కార్డులున్నాయి గీకడానికి పనికొచ్చేవి. ఆకలి
దంచేస్తున్నా మీకో ధీమా ఉంటుంది, ఎక్కడో ఓ చోట కావాల్సింది కనపడగానే కొనుక్కోగలిగే శక్తి మీకుందని. పక్క
వాడి సంచిలో పళ్ళో, తినుబండారాలో కనిపిస్తున్నా మిమ్మల్ని
మీరు సంబాళించుకోగలుగుతారు. 'ఉపవాసం కూడా మీ లాంటి వాడి ఆరోగ్యానికి మంచిదే' అనే ఓ గ్రహింపు కూడా మీకు సాయం
చేస్తుంది.
“వాడికి రెక్కాడితే
గాని డొక్కాడదు. డొక్కాడితే గాని గాని రెక్కాడించే శక్తి రాదు. డొక్కాడే అవకాశం అక్కడ లేదు. అలాంటపుడు కూడా
అబద్ధాల జోలికి, దొంగతనం వైపుకి పోకుండా ఉండే వాడు
ఉత్తమోత్తముడే గాని, అసాధారణ
పరిస్థితుల్లో కనీసావసరాల కోసం నేరాలు చేసేవాళ్లకి శిక్ష వేసేటపుడు జడ్జికి మానవతా
దృక్పథం అవసరం” శివరావు గారు తన సహజ ధోరణిలో చెపుతూ పోతుంటే,
" నిన్న న్యూస్ లో చూపించిన హీరోయిన్
సంగతేమిటంటారు?” అంటూ తిమ్మారెడ్డిగారు నిన్నటి వార్తల్లో
ముఖ్యాంశంగా వచ్చిన ఒకప్పటి బాలనటి గురించి ప్రస్తావించారు.
బాల
నటిగా సినీ రంగం ప్రవేశించి,జాతీయ స్థాయి పురస్కారం పొంది, ఈ మధ్యనే
కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన లేత వయసు అమ్మాయి, ఒక హై ప్రొఫైల్ వ్యాపార వేత్తతో నగరంలోని
అయిదు నక్షత్రాల హొటల్లో జరిగిన రెయిడ్ లో పట్టుబడింది. ఇది రెండోసారిట ఇలా ఆమె
పట్టుబడడం! అన్ని టీవీ చానళ్లలోనూ అదే వార్త ప్రసారమవుతుంటే, ఆ వయసుకి దగ్గర్లో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులందరిలో ఏదో అభద్రతా భావం.
ఆ పిల్ల పట్ల, ఆ తల్లిదండ్రుల పట్ల సానుభూతి.
"రెస్క్యూ హోమ్ లో పెట్టారుగా. మూడు నెలలు అక్కడే ఉంచుతారు. ఈ అవకాశాన్ని వాడుకుని
మంచి మార్పు తీసుకురావచ్చు. లేదా కంటి తుడుపులాగా కానిచ్చేసి
వదిలేయచ్చు. చెప్పలేం.”
“ఆమెది అసాధారణ పరిస్థితి అంటారా సార్?” అనంతయ్య గారు అడిగారు.
“చిన్నప్పుడే, ఇంకా
సరైన వ్యక్తిత్వం ఏర్పడక ముందే తళుకు బెళుకుల ప్రపంచం పరిచయమైతే, దారి చూపించే గాడ్ ఫాదర్ ఎవరూ లేకపోతే, గాడి
తప్పకుండా నడవగలగడం సామాన్యం కాదు. “
“ఎంత
అవసరంలో ఉంటే మాత్రం ఆ వృత్తే ఎంచుకోవాలా, శరీరాన్ని తాకట్టు పెట్టి అంత హై
ప్రొఫైల్ జీవితం అవసరమా అనిపిస్తుంది సార్? ఆ పిల్లని
చూస్తుంటే ఆ వయసులో ఉన్న మన ఇళ్ళలో పిల్లలంతా గుర్తొచ్చారు. అలాంటి ఆడపిల్ల బతకడానికి
అంతకంటే గౌరవంగా ఇంకేం
దొరకదా? "
ఢిల్లీ లో ఉద్యోగం చేస్తున్న
తిమ్మారెడ్డిగారమ్మాయిది అదే వయసు. ఆడపిల్లల మీద అఘాయిత్యాల
గురించి తరచూ వచ్చే వార్తలకి తల్లడిల్లుతూ, అమ్మాయిలకి
ఇంతకంటే సురక్షితమైన వాతావరణాన్ని కల్పించలేక పోతున్నామని బాధపడుతూ ఉంటారాయన.
"ఎందుకు దొరకవు దొరుకుతాయి గాని, నాలుగైదు సినిమాలు చేసేసరికి
సంపాదిస్తున్న డబ్బుకి తగినట్టు అవసరాలు, ఖర్చులు
పెరుగుతాయి. తర్వాత కూడా అదే విధంగా రాబడి లేకపోతే అలవాటు
పడ్డ సౌకర్యాలూ, జీవన విధానం మార్చుకోవాల్సి వస్తుంది. కొత్త
అవకాశాలు ఎప్పుడొస్తాయో తెలియదు. వస్తాయని ఎదురుచూస్తూ, అలాగే
బతుకు సాగించడానికి ప్రయత్నిస్తూ, అప్పుల్లో పడిపోతారు!
చిన్నాచితకా ఉద్యోగాలతో ఆ అప్పులు తీర్చలేని స్థితి వస్తుంది … రకరకాల వత్తిళ్లు .. కొన్నాళ్ళు ఎలాగో తట్టుకున్నా చివరికి
లొంగిపొతారు"
నిన్న టీవీలో చూసిన ఆ అమాయకమైన మొహం, సాలెగూడులో చిక్కుకున్న కీటకంలా కనిపించింది.
తిమ్మారెడ్డి గారి దిగులు నా మనసులోకి కూడా
పాకింది. నా పిల్లలు పదహారేళ్ళ రమ, పదకొండేళ్ళ
రాజూ గుర్తొచ్చారు. ఆ బయటి ఆపదల సంగతి అలా ఉంచి, ఇంట్లోకి దూరిపోయిన అంతర్జాలంతో ఉపయోగాలెన్ని ఉన్నా, పొంచి ఉన్న ప్రమాదాలూ తక్కువేం కాదు. ఎస్సెమ్మెస్
టక్కుటక్కులు, బయటికి వినిపించకుండా మెల్లగా చెవిలో సాగే
సెల్ ఫోన్ కబుర్లూ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటికిపుడు, హోమ్ వర్క్ చేస్తున్నట్టుగా కనిపిస్తూనే, తెలియకుండా
సాగించే ఇన్టర్నెట్ సర్ఫింగ్ తోడైంది. అనిత ఒక్కోసారి
పిల్లలతో వేసారిపోతూ, చెప్పిన మాట వినరనీ , వినయం, సంయమనం లేవనీ, అసహనం
పెరిగిపోయిందనీ మొత్తుకుంటూ ఉంటుంది.
ఎవరికి వాళ్ళం ఆలోచనల్లో
మునిగి కొంత దూరం మౌనంగా నడిచాం.
పెద్ద చెట్లూ, బండ రాళ్ళూ, నీటి చెలమలతో సహజమైన వనాన్ని తలపించే ఈ పార్కులో నడకంటే ఒక ఉల్లాసం! బెరుకు లేకుండా హాయిగా తిరుగాడే నెమళ్ళూ, ఉడతలూ,
ఎగిరే పక్షుల్ని గమనిస్తూ, కబుర్ల మధ్య సాగే
వాకింగ్ అలవాటయ్యాక నా ఆరోగ్యం కొంత మెరుగయ్యింది. హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న శివరావు గారు మాలాంటి నలుగుర్ని వెంట
పెట్టుకుని పార్కులో కాలిబాట మీద నడుస్తూ, ఒక విషయం లోంచి ఇంకో విషయం లోకి చొచ్చుకుపోతూ, హాస్యం
వొలికిస్తుంటే
నడక శ్రమ తెలియ కుండా నాలుగు కిలో మీటర్లూ యిట్టే అయిపోతాయి.
మాటల మధ్య సగం దూరం దాటేసి మలుపు తిరిగాం. చెట్ల కొమ్మల
మీదికి పాకిపోయిన అడవి జాజి తీగల నించి పూల వాసన గుప్పుమని నాసికా పుటాలకి తాకింది!
గాఢంగా గాలి పీల్చి వదిలే లోపే, నేలమీది ఎండు కొమ్మలూ ఆకుల మధ్య నించి సరసరమని చప్పుడూ, రెక్కలల్లల్లాడే ధ్వనీ వినిపించాయి.
అదేమిటో అర్ధమయ్యే లోపే దాదాపు ఆరడుగుల పొడుగున్న పెద్ద పాము మాకు నాలుగైదు అడుగులు దూరంలో దారి మధ్యకి అతి వేగంగా పాకుతూ వచ్చింది. చిన్న పక్షి ఒకటి, దాని నోట్లోంచి తప్పించుకుని ఎగర బోయి, మళ్ళీ నేలకి
జారింది. పాపం, దాని రెక్కలకి గాయమైనట్టుంది. రెప్పపాటులో
సర్వశక్తులూ కూడగట్టుకుని, నేలకి దగ్గరగా ఉన్న కొమ్మల మీదికి
చేరింది. అతి కష్టం మీద మృత్యు ముఖం లోంచి తప్పించుకుని,
ఒక కొమ్మ మీంచి ఇంకో కొమ్మ మీదికి చిన్నగా
ఎగురుతూ, శక్తి చాలక పడిపోబోతూ ఎలాగో దూరానికి వెళ్ళిపోయింది.
ఎంత చురుగ్గా దాన్ని వెంబడించినా, వెనక మనుష్యసంచారం వల్ల దాని ఏకాగ్రత చెదిరినట్టై పాముకి పట్టు కుదరలేదు.
చిక్కినట్టే చిక్కి జారిపోయిన ఆహారంతో పాముకి
చిర్రెత్తు కొచ్చినట్టుంది. భుస్సుమంటూ, సరసరా శబ్దం చేస్తూ,
రెండో వైపు పొదల్లోకి మాయమైపోయింది.
సర్పద్రష్టలమై మేం అలా నిలబడి పోయాం. తేరుకుందుకు
రెండు నిముషాలు పట్టింది.
నా మనసులో ఇందాకటి వార్త మెదిలింది. లేత మనసులతో, శరీరాలతో వ్యాపారాలు సాగించే
నికృష్టులు ఆ పాముల్లా పొంచి ఉంటారు.
అదే పైకి
అన్నాను.
శివరావు గారు నవ్వి “ఈ తరం పిల్లల ముందు ఎన్నో ఆకర్షణలున్నాయి సురేశ్. అవే పెద్ద పాములు. వాటి నోళ్లలో పడకుండా తమని తాము రక్షించుకోవడాన్ని వాళ్ళకి నేర్పించడమే
మనం చెయ్యాల్సింది. మంచి వ్యక్తిత్వం ఏర్పడితే ఇంక వాళ్ళని
వాళ్ళు కాపాడుకోగలుగుతారు !” అన్నారు.
నడక పూర్తి చేసుకుని, చెట్ల కింద సిమెంటు గట్టు మీద కాసేపు సేదతీరి, ఇంటిదారి పట్టాను.
కారు పార్క్ చేసి మెట్లెక్కి
పైకి వెళ్లేసరికి గుమ్మం దగ్గరికే వినిపించింది, కొత్తగా కొన్న ఐపాడ్ కోసం పిల్లల కీచులాట.
షూస్ విప్పి వాళ్ళ గదిలోకి వెళ్లి, మౌనంగా చూస్తూ నిలబడ్డాను. రమ నన్ను చూసి, ఐపాడ్
రాజు పక్క మీద పడేసి, కోపంగా అమ్మ గదిలోకి వెళ్ళిపోయింది. రాజు సంతోషంతో వెలిగి పోతున్న మొహంతో దాన్ని
చేతిలోకి తీసుకుని, అందులో మునిగిపోయాడు, నన్నే మాత్రం పట్టించుకోకుండా.
మంచి స్కూలు, వెళ్లి రావడానికి ఏసీ బస్సు సౌకర్యం, ఖరీదైన బట్టలు, ఆహారం, ఇల్లూ, ఆధునిక వసతులూ,
సినిమాలూ, సరదాలూ…ఒక్కసారిగా
వీటిల్లో కొన్ని మాయమైపోతే వీళ్ళేమై పోతారు? ఇవన్నీ ఇస్తున్న
మేం, వాళ్ళు సరైన
వ్యక్తిత్వం పెంపొందించుకునేందుకేం చేస్తున్నాం? ఇద్దర్నీ
దగ్గరికి తీసుకుని ఏదో చెప్పాలనిపించింది. ఇద్దరి స్పర్శలోంచి ఏదో మమతల ప్రవాహాన్ని అనుభూతించాలనీ, ‘బెంగ పడద్దు నాన్నా, మేం బానే ఉంటాం' అన్న భరోసాని అందుకోవాలనీ అనిపించింది.
"స్నానం చేసి వచ్చేయండి. వంటయిపోయింది. అత్తయ్య పూజ
చివరికొచ్చింది" అంటూ వంటింట్లోంచి అనిత పిలుపు
వినపడేదాకా ఆలోచనల చిక్కుముళ్ళు.
స్నానాలగదిలో దూరి షవర్ తిప్పాను. వెచ్చటి నీళ్ళు వానలా పడుతుంటే, కరెంట్ బిల్లు కట్టలేదని గుర్తొచ్చింది. ఈ
సారి చాలా ఎక్కువొచ్చింది బిల్లు. జీతం పెరుగుతూనే ఉన్నా
ఖర్చులు దాన్ని మించి పెరుగుతున్నాయి. పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించినప్పటి జమాఖర్చుల లెక్కలకీ, ఇప్పటి
లెక్కలకీ పోలిక లేదు. నాతో చదువుకున్న స్నేహితుల్లో చాలా మంది నాకన్నా మంచి
ఉద్యోగాల్లో ఉన్నారు. మోహన్ కి నన్ను పైకి లాగాలని కోరిక. కానీ మూర్తి గారితో నా అసోసియేషన్ ఇవాల్టిది కాదు. ఎన్నోసార్లు నాకు అండగా నిలబడ్డారు.
నాన్న పోయినపుడూ, చెల్లి పెళ్ళికీ ఆయనిచ్చిన సపోర్ట్ ఎలా
మర్చిపోతాను?
కావలసినప్పుడు సెలవులు పెట్టుకుందుకు
ఇక్కడున్న స్వతంత్రం ఎక్కడా ఉండదు. పనెక్కువగా
ఉన్నపుడు రాత్రీ పగలనకుండా పని చేస్తానని ఆయనకి తెలుసు. నన్నంతగా అభిమానించినందుకు నేనూ ఆయన వెంట
స్థిరంగా నిలబడి, ఒడిదొడుకుల్లో కంపెనీని ముందుకు
తీసుకెళ్ళాను. మా ఉత్పత్తులకి మార్కెట్లో మంచి పేరుంది. కానీ ఎథిక్స్ ఎథిక్స్ అంటూ వేళ్ళాడే మూర్తిగారికి పెద్ద
పెద్ద లాభాల మీద దృష్టి లేదు. మార్కెట్ ట్రెండ్ ప్రకారం నాలాంటి వాళ్లకి కళ్ళు తిరిగే జీతాలొస్తున్నాయి. ఎన్నాళ్ళిలా ఇదే ఉద్యోగంలో ?
ఇక్కడే ఇలాగే ఉండిపోతే నా కమిట్ మెంట్స్ సరిగా తీర్చుకోగలనా అనిపిస్తోంది. నా సమర్ధతకి తగిన అవకాశాలు వస్తుంటే, సంపాదించుకునే వయసులో ఇలా నిలవనీరులా నిలబడిపోనా ? పిళ్ళై
ఇస్తున్న ఆఫర్ చాలా ఆకర్షణీయంగా ఉంది, వాళ్ళ కంపెనీ
ప్రొజెక్షన్ బావుంది. జీతం ఇక్కడొస్తున్నడానికి
రెట్టింపు. అయితే ప్రయాణాలెక్కువుంటాయి. ఒత్తిడి కొంత ఎక్కువగా
ఉంటుంది ఇక్కడ కన్నా .. అయితే ఏమిటి ? ఇంకా
సంపాదించే వయసేగా?
రాజుకి అండర్ గ్రాడ్ అమెరికాలో చెయ్యాలనుంది.
రమ పెళ్లికింకా ఏడెనిమిదేళ్ళుందంతే. రెండేళ్ళ క్రితం రమేష్ కూతురి పెళ్లి చేసినపుడు ఎనభై లక్షలయిందిట. ఫ్లాట్ తాలూకు
లోనింకా ఆరేళ్ళ పాటు కట్టాలి !
మూర్తి గారితో చెప్పడానికి మొహమాటంగా ఉంది.
మోహన్ తిట్టినపుడల్లా వెంటనే చెప్పెయ్యాలనుకుంటాను. మళ్ళీ చప్పబడి పోతాను. ప్చ్ ..
స్నానం పూర్తి కానిచ్చి
కబోర్డ్ తెరిచాను. ఎదురుగా తెల్లటి పోచం పల్లి లాల్చీ,
లేత రంగు చారల పైజామా. ఎప్పుడో శిల్పారామం
లో కొన్నవి. ఎప్పటిలాగే వాటిని పక్కకి జరిపి ‘నైకీ’ టీషర్ట్, షార్ట్స్ తీశాను వేసుకుందామని.
"నేత బట్టలు కట్టుకుంటే,
మనకి సౌకర్యం, వాళ్లకి ఉపాధీ"
"సెలవురోజు కట్టుకునే బట్టలు కళ్ళకి చల్లగా హాయిగా ఉండాలి. వేసుకున్న
వాళ్ళకీ, ఇంట్లో చూసేవాళ్లకీ కూడా
ఆహ్లాదంగా ఉండాలి"అనిత మాటలు గుర్తొచ్చాయి.
టీ
షర్టు, షార్ట్స్ కూడా సౌకర్యంగానే ఉంటాయి. ఇక్కడంతా అలాంటి
బట్టలే వేసుకుంటారు. అదొక స్టైల్ స్టేట్ మెంట్! అలా అలవాటైపోయాక ఇంట్లో అవి తప్ప
వేరేవి వేసుకోబుద్ధి కావడం లేదు.
"మీకు తెలుపు చాలా
బావుంటుంది" అనిత మాటలు గుర్తొచ్చి, తీసిన బట్టలు పక్కన
పెట్టేసి, లాల్చీ పైజామా వేసుకున్నా. వంటికి దగ్గరగా, మెత్తగా హాయిగా ఉన్నాయి.
భోజనాల బల్ల దగ్గరకెళ్ళేసరికి అప్పటికే అంతా నాకోసం ఎదురుచూస్తున్నారు. కూర వడ్డిస్తున్న అనిత
తలెత్తి చూసింది. ఆమె కళ్ళు తళుక్కుమన్నాయి.
"అబ్బ హాయిగా ఉన్నావురా నాన్నా! ఆ మట్ట లాగుల్లో
మొద్దబ్బాయిలా ఉండేవాడివి" అంది అమ్మ.
కంచంలో వడ్డించినవి చూస్తూ "ఏమిటీ కూర ? అల్లం పెట్టి చేస్తానన్నావుగా
వంకాయ కూర ?” అడిగాను.
"అన్నానూ. సరిగ్గా సమయానికి కరెంటు పోయింది. కూర పొడి ఉంటే, అదేసి దింపేశా" అంది అనిత.
"నీ ఇల్లు చల్లగుండా… ఎంత బద్ధకవే? అల్లం, పచ్చిమిర్చీ దంచడానిక్కూడా మిక్సీ కావాలిటే?
చిన్న రోలు లేదూ?" అమ్మని అనుకరిస్తూ
అన్నా. అమ్మ నవ్వింది..
"అయినా ఈ మిక్సీలూ, గ్రైండర్లూ, అవెన్లూ ఇవన్నీ వచ్చేసి బద్ధకాలు పెరిగి పోయాయమ్మా!" అన్నా ఉడికిస్తూ.
"ఆ మరే .. వీధి చివర మంగలి
షాపుకి మనం కార్లో వెళ్తాంగా ?" అంది అనిత. పిల్లలు ఫక్కుమన్నారు.
రమని చురుగ్గా చూసి "మనమేమో, టీవీ పెట్టుకుని, సోఫాలో కూలబడి, అవీ ఇవీ నముల్తూ, అటుగా ఎవరెళ్ళినా 'అమ్మా కాస్త ఆ ఫానెయ్యవా? మామ్మా! కొంచెం ఆ పిల్లో ఇటు
పడెయ్యవా?’ అంటాం!" అంటూ రమకీ, "సైకిలు అమ్మేస్తానంటే ‘నాక్కావాలి, అమ్మద్దు’ అంటాం. అది
తుప్పు పట్టి పోతూ ఉంటుంది. మనం వాడం, ఎవరికీ ఇవ్వం!" అంటూ రాజుకీ, చెరోటీ అంటించి
శాంతించింది అనిత.
"అమ్మా, మా ముగ్గురివాటా అయిపోయింది. ఇంక మిగిలింది నువ్వే! కాసుకో మరి " అన్నా.
అమ్మ నవ్వి,"దాని జోలికి పోకపోతే అదేమీ అనదురా. నీకేమో నోరూరుకోదు. నాలుగు తగిలాక
బుద్ధొస్తుంది" అంది.
రమ మూతి ముడుచుకుని "మరి
నన్నెందుకు మామ్మా అనడం? నేనేమన్నాను అమ్మనీ?" అంది అలుగుతూ.
"అమ్మ చెప్పిందాంట్లో తప్పేముందమ్మా? అలాంటి చిన్న చిన్న
పన్ల కోసం ఎవర్నీ అడగకూడదు. అలాంటి అవసరాలన్నీ అవకాశాలుగా
తీసుకుని, నీక్కావల్సినవి నువ్వే చేసుకుంటూ, తిరుగుతూ ఉంటే తీరువుగా, ఆరోగ్యంగా ఉంటావు. స్థూలకాయానికి బద్ధకం
కూడా ఓ కారణం” అని, "అయినా
అదేమందనే దాన్ని అంటావు భోజనం దగ్గర?" అంటూ అనితని కసిరింది అమ్మ.
"గొడవంతా మీ అబ్బాయి వల్లే అత్తయ్యా" నా వైపు కోర చూపు విసురుతూ, పెదవుల
వెనక నవ్వు బిగించింది అనిత.
తినడం పూర్తి చేసి విసురుగా చెయ్యి కడుక్కుని, గదిలోకి వెళ్ళిపోయింది రమ.
రాజు అమ్మ గదిలోకెళ్ళి కంప్యూటర్
పెట్టుకున్నాడు. వాడి చదువు, రమ పడకా అమ్మ గదిలో. ఇద్దరికీ మామ్మతో అనుబంధం ఉండాలని అలా ఏర్పాటు చేసింది
అనిత.
భోజనాలవగానే సర్దుళ్లు పూర్తి చేసి, అమ్మ సోఫాలో
నడుం వాలిస్తే, అనిత అక్కడే టీవీ ముందు కూలబడింది. నేనూ కూర్చోబోయి ఆగి, రమ దగ్గర
కెళ్ళాను. నా ఉనికి గమనించగానే రమ చేతి వేళ్ళు చురుగ్గా కదిలాయి. చేతిలోని ఐప్యాడ్
తెరమీది బొమ్మ మారిందని గ్రహించాను, తన మొహం మీద
ప్రతిఫలించిన వెలుగులని బట్టి.
ప్రశాంతంగా మొహం పెట్టి,
రమ పక్కనే కూర్చుని " ఏం చేస్తున్నావ్
తల్లీ " అన్నా.
చెవుల్లోంచి ఇయర్ ఫోన్స్
తీసేస్తూ "రాజూ నేనూ అగ్రీ అయ్యాం నాన్నా! సెలవు రోజుల్లో ఒంటి గంట దాకా
ఐపాడ్ వాడిది. తర్వాత నాదీ" అంది .
కొంతసేపు దానితో కబుర్లు
చెప్పి, రాజు దగ్గరకెళ్లాను. వాడు ఆడుతున్న కంప్యూటర్ గేమ్
చూస్తూ నిలబడ్డా. తుపాకీతో ఎడా పెడా పేల్చిపారేస్తున్నాడు ఎదురొచ్చిన వాళ్ళని.
"ఇదేం ఆటరా? "
“'కౌంటర్ స్ట్రైక్' నాన్నా.
ఇందులో నేను టెర్రరిస్టుని,
పోలీసుల్ని చంపెయ్యాలి" అన్నాడు ఆటలో నిమగ్నమై.
ఒక్కసారి కుదిపి వదిలినట్టయింది .
"అదేం చెత్త ఆటరా? నువ్వు టెర్రరిస్టు అవడం ఏమిటి? పోలీస్ గా ఉండచ్చుగా?"
అన్నాను.
"ఏంటి నాన్నానువ్వూ. ఇది జస్ట్ ఒక గేమ్
అంతే. ఇక్కడంత నీతి సూత్రాలు
అక్కర్లేదు " అన్నాడు అంతరాయానికి విసుక్కుంటూ .
"ఆట అయితేనేమిటి? టెర్రరిస్టుల
వల్ల ఎన్నిసమస్యలో నీకు తెలీదూ? మొన్న'వరల్డ్ పీస్ డే' అని మీ స్కూల్లో జరుపుకున్నారు.
టెర్రరిజం ఎందుకు మంచిది కాదో ఉపన్యాసాలు దంచారు?"
"అబ్బ! అన్నిటికీ అలాగే చెప్తావు నాన్నా! చిన్నప్పుడు నువ్వు దొంగా
పోలీస్ అట ఆడలేదా? నువ్వెపుడూ పోలీసేనా? దొంగ అవలేదా ఆటలో?" చిరాగ్గా అని డిష్యూం డిష్యూం అంటూ పేల్చెయ్యడంలో
మునిగి పోయాడు.
'మా ఆటల్లో హింస
లేదురా నాన్నా. పేరుకి దొంగ అన్నా,
దాక్కోవడం వరకే గాని, దొంగతనం చెయ్యడం కూడా
ఆటలో భాగం కాదు...’ ఎంతో
చెప్పాలనుకున్నాను గాని ఇది సమయం కాదన్పించి హాల్లోకి వచ్చాను నిట్టూరుస్తూ.
చిన్నప్పుడు వాళ్ళు మాతో పంచుకునే సమయం కోసం ఎదురుచూసేవాళ్ళు.
ఇప్పుడు చేసి తీరాల్సిన హోమ్ వర్క్ అయ్యాక,
వాళ్ళకి దొరికే సొంత స్పేస్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటపుడు
ఎవరి జోక్యాన్నీ సహించలేక పోతున్నారు!
టీవీలో నిన్నటి హీరోయిన్ అరెస్టు గురించే ఏదో చర్చ. అమ్మ కునుకు తీస్తోంది. అనిత
శ్రద్ధగా టీవీ చూస్తోంది.
పక్కన కూర్చుని “అనితా, పిల్లలు చూశావా ఇంటర్నెట్ కి బాగా అలవాటు
పడిపోతున్నారు? వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో మనం ఓ కంట కనిపెట్టాలి. మనతో వాళ్ళ ఇంటరాక్షన్
తగ్గిపోకుండా చూసుకోవాలి” అన్నాను .
"అవునండీ.. వాళ్లక్కాస్త
ప్రకృతితో సంబంధం ఉండేలా చూడాలి. బలవంతంగా నిద్రలేపేసి వాకింగ్ కి తీసుకుపోవాలి. రమ బొద్దుగా తయారవుతోంది"
“మోహన్ చెప్పే జాబ్ తీసుకుంటే ఇవన్నీ కుదరవు. ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్ళు కొంచెం సర్దుకోవలసి వస్తుంది "
“అవునా?” నిరుత్సాహంగా
అంటూ టీవీ వైపు దృష్టి తిప్పింది.
ఎవరో మహిళ గట్టిగా అడుగుతోంది ‘వ్యభిచారం ఒకరే చెయ్యరు కదా? ఆ పిల్ల ఒకత్తే ఎలా వార్తల్లోకి వచ్చింది?
ఆమెతో పాటు ఉన్న బిజినెస్ మాన్ ఎవరో ఎందుకు బయట పెట్టలేదు? డబ్బూ, పవర్ఫుల్ కనెక్షన్స్ ఉన్నవాళ్లకి ఒక న్యాయం,
అవి లేని వాళ్లకి ఒక న్యాయం.. ఎందువల్ల?"
అని అడుగుతోంది .
నాకు హఠాత్తుగా ఒక సంఘటన గుర్తొచ్చింది.
"అనితా నీకు గుర్తుందా, కిందటి మాటు మీ చెల్లెలు వచ్చినపుడు, మనం సెంట్రల్ లో సినిమాకి వెళ్లాం?
అప్పుడు మిమ్మల్ని గేటు దగ్గర ఉండమని
సెల్లార్ లో కారు తీసుకు రావడానికి వెళ్లాను, గుర్తుందా?"
"అవునూ" ప్రశ్నార్ధకంగా చూసింది.
"అప్పుడు నేను కారు డోర్ తెరిచి
కూర్చోబోతుంటే ఒకమ్మాయి నాదగ్గరకొచ్చింది అనితా. ఖరీదైన బట్టలూ, చెప్పులూ వేసుకుని ఉంది. గుప్పుమని పెర్ఫ్యూమ్. 'వెరీ
రీజనబుల్ అంకుల్ .. జస్ట్ టూ థౌ జండ్ ఫర్ టూ
ఆర్స్' అంటుంటే నాకు మతి పోయింది. 'సారీ'
అని ఎవరో తరుముతున్నట్టు కార్లో కూచుని వచ్చేశాను" అన్నాను.
ఆ సంఘటన ఇప్పుడే జరిగినంత తాజాగా గుర్తొచ్చి ఎలాగో అనిపించింది.
"అవునా? అసలీ
విషయం మీద మా కాలేజీలో ఒక సెమినార్ జరిగింది తెలుసా ? చాలామంది
స్టూడెంట్స్, పేరెంట్స్, మా స్టాఫ్
అందరూ, పోలీస్ ఉన్నతాధికారులు కొందరు, ముగ్గురు
లీడింగ్ సైకియాట్రిస్టులు… ఇంతమంది పాల్గొన్నారు అందులో.
చాలా మంచి ప్రోగ్రాం. ఒక పోలీస్ ఐజీ ఏం చెప్పారో తెలుసా..ఎందరో స్టూడెంట్స్, మంచి కుటుంబాలనించి వచ్చినా,
సెల్ ఫోన్స్, పెర్ఫ్యూమ్స్, ఆఖరికి ఫాషనబుల్ దుస్తుల కోసం, చెప్పుల కోసం కూడా
దొంగతనాలు
చేస్తున్నార్ట !
“చిన్న ఊళ్ళ నించి వచ్చిన కొందరు పిల్లలు
తల్లిదండ్రుల భయం, పర్యవేక్షణా లేకపోవడం,
తోటి పిల్లల బట్టలూ, ఎలెక్ట్రానిక్ పరికరాలూ
చూసి, వాళ్లకి దీటుగా కనపడ్డం కోసం, ఎలాగైనా వాటిని
సంపాదించాలని వ్యభిచారానిక్కూడా సిద్ధమవుతున్నార్ట. కార్లూ, మోటార్ సైకిళ్ళూ, ఫోన్లూ దొంగతనం చేస్తున్న వాళ్ళలో ఇలాంటి
యువకులూ, అమ్మాయిలూ ఎందరో ఉన్నారట. ఆ సెమినార్లో
తల్లిదండ్రులకీ, లెక్చరర్లకీ ఎన్నో సూచనలిచ్చారు సైకియాట్రిస్ట్లు. పేరెంట్స్ ఎన్నో ప్రశ్నలడిగారు.
ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలని అంతా అనుకున్నాం"
“అవునా నాకు చెప్పనేలేదేం?”
“ఏమిటోనండీ…ఇదివరకు
మల్లె మొక్క మొగ్గేసినా మీతో చెప్పేదాన్ని. ఇప్పుడలా కుదరడమే
లేదు "
"మల్లెమొక్కకేం భాగ్యమే? రెండు కుండీలలో తెచ్చుకుని
బాల్కనీలో పెట్టుకో!" కళ్ళుమూసుకు పడుకునే పక్కకి తిరుగుతూ అంది అమ్మ .
“మల్లెమొక్క గురించి అనలేదత్త య్యా, తీరిక లేకపోవడం గురించి అన్నాను" ఉక్రోషంగా అంది అనిత, ‘అన్నీ వింటూనే ఉంటారు’ అన్నట్టు నావైపు చూపు
పారేస్తూ.
"అదా…ఈ
ఉద్యోగంలోనే లేని తీరిక కొత్త ఉద్యోగంలో ఎలా వస్తుందే?" కునుకు పూర్తయినట్టుంది మెల్లిగా లేస్తూ అడిగింది.
"ఎలా అమ్మా మరి? పిల్లల
చదువులూ, పెళ్ళిళ్ళూ అన్నీ ఎదురుగా ఉన్నాయి కదా!
లక్షలతో పని" అన్నాను.
"అంత ఖర్చు పెట్టి చేస్తేనే పెళ్ళేమిట్రా?
అంతకన్నా ఆప్యాయంగా తక్కువ ఖర్చులో చెయ్యలేమా? "
"మీరు బలే చెప్తారత్తయ్యా! పెళ్లి హాలుకే రెండు నించి పది లక్షల దాకా
అవుతోంది. ఒక ప్లేటు పెళ్లి భోజనం, మూడొందలకి తక్కువలేదు
ఇప్పుడే. ఏడెనిమిదేళ్ళ తర్వాత మాట చెప్పక్కర్లేదు "
అంది అనిత.
"వాహీ పెళ్ళికి ఎనభై లక్షలయిందిట తెల్సా
అమ్మా?"
"దాని విడాకులక్కూడా బానే
ఖర్చవుతోంది"
అనితా,
నేనూ అవాక్కయ్యాం.
“అదేమిటమ్మా?” నా ప్రశ్న పూర్తయ్యేలోపే
“అవున్రా. పెళ్లి చేసేసి, అమెరికా పంపేసి ‘హమ్మయ్య’
అనుకున్నారు. అక్కడ వాళ్ళిద్దరికీ ఏ మాత్రం పడలేదు. ఏడాది తిరక్కుండా పెళ్లి పెటాకులైంది. అది వెనక్కొచ్చేసి పాత ఉద్యోగంలోనే చేరింది. ఇప్పుడు దాని కొలీగ్ చేసుకుంటానంటున్నాట్ట. ఇద్దరికీ ఇష్టమయింది. ఈ విడాకులు
శాంక్షనయితే వాళ్లకి రిజిస్టర్డ్ మారేజ్
చేద్దామనుకుంటున్నారు" మనవరాలి విషయంలో వాళ్ళక్క
పడ్డ బాధ అమ్మ మొహంలో
తారట్లాడింది. "ఇపుడా ఎనభై లక్షలూ ఎవరికి పెట్టినట్టు?"
నా మనసు రమేష్ దంపతుల్ని
తలుచుకుని ఉసూరుమంది.
చిక్కు ముడేదో శ్రద్ధగా విప్పుతున్నట్టు “ఏవేవో ఇన్వెస్ట్ మెంట్లూ, పాలసీలూ, కొత్త కొత్త వస్తువులూ, వాటి మెయింటెనెన్సంటూ అవేవో
కాయితాలూ..దొరికే కాస్త సమయంలో
సగం ఈ పేపరు వర్క్ కే సరిపోతుంది. మిగిలింది ఆ టీవీకీ,
కంప్యూటర్ కీ కళ్లప్పగించడానికి సరిపోతుంది. వారంలోఒక రోజు టీవీ, కంప్యూటర్ ఆపేసి, షాపింగులు తగ్గించుకుంటే కబుర్లకీ,
అవసరమైన పన్లకీ, పిల్లల పెరుగుదలలో
పాలుపంచుకుందుకీ టైం దొరుకుతుంది" అంది అమ్మ.
“బోల్డు డబ్బు సంపాదించి
పిల్లల జీవితాలు తీర్చిదిద్దుదామనుకుంటున్నావు. ఈ సూపర్ ఫాస్ట్, ఈ మానసిక వైకల్యాల యుగంలో వాళ్లకి అవసరమైనది డబ్బుకాదు, మీ టైము! నీ సమయం వెచ్చించి డబ్బు సంపాదించి వాళ్లకివ్వడం కన్నా, నీ సమయాన్నే వాళ్ళకిచ్చి, వాళ్ళు మంచి వ్యక్తిత్వం
ఏర్పరచుకుందుకు సాయం చెయ్యి. సంగీతంలో సరళీ స్వరాల సాధన చూడు ఎన్నాళ్ళు చేయిస్తారో. ఎందుకో తెలుసా? స్వర స్థానాలు స్థిరపడాలని. అలా స్థిరపడితే ఆరోహణ అయినా, అవరోహణ అయినా అపశ్రుతి లేకుండా సాగుతుంది. మంచి అలవాట్లు ఏర్పడేదాకా, సరైన వ్యక్తిత్వం సమకూర్చుకునేదాకా తల్లిదండ్రులు పిల్లల వెంట ఉండాలి. చదువూ తెలివీ ఉన్న భార్య, ఇద్దరు ముచ్చటగా పిల్లలు. అవసరాలకి సరిపడా
డబ్బుంది. అయినా తృప్తి చెందక ఎండమావుల వెనక పరుగెడుతున్నావేమో ఆలోచించుకో
నాన్నా"
చెప్పింది మా బుర్రల్లోకి ఇంకేదాకా ఆగి “జీవితాన్ని సంక్లిష్టం చేసుకోకండి నాన్నా! సరళం చేసుకోండి. ఉన్న సంతోషాన్ని
వదిలేసుకోకండి" అంది నిమ్మళంగా.
ఒక మౌన రాగం చాలాసేపు మా చుట్టూ తారట్లాడింది.
అనిత టీ పెట్టడానికి వెళుతుంటే, నేను మోహన్ కి
ఫోన్ చేద్దామని లేచాను.
****
( స్వాతి సపరివారపత్రిక ‘కథ కథ కథ’ కథల పోటీ-2015లో
9,999/- రూపాయల బహుమతి పొంది, 14-8-2015 సంచికలో ప్రచురితమైన కథ)
Your story is the need of the hour.Congrats once again.
ReplyDeleteథాంక్యూ ఉమాదేవి గారు!
DeleteYour story is the need of the hour.Congrats once again.
ReplyDeleteVery good narration! Reflects the scenario in present society, hearty congratulations!
ReplyDeleteThank you Vijayalakshmi!
Delete