July 4, 2014

విముక్త

                                              విముక్త
                                                                                        కథ , ఇలస్ట్రేషన్  by వారణాసి నాగలక్ష్మి 


                   

                                                                             విముక్త

          "మామ్మగారూ! ఇంక నేను బతకడం వృధా అంటూ ఒక్కసారిగా ఆవిణ్ణి పట్టుకుని వల వలా ఏడ్చేశాను. ఆ క్షణంలో నాకు పరిసరాలన్నిటా  నా 'బంగా'రుకొండ, ముద్దుగా 'బంగా' అని మేమిద్దరం పిలుచుకునే మూడేళ్ళ బుజ్జిబాబు తప్ప ఇంకేమీ కనిపించడం మానేసింది. నేనేం చేస్తున్నానో అర్ధం కాని ఒక అయోమయం ... అనుక్షణం నా కొంగు పట్టుకుని తిరుగుతూ బూరెబుగ్గలతో ముద్దులోలికిపోయే బంగా కనిపించకుండా పోయి నాలుగ్గంటలు దాటిపోయింది. పుట్టి బుధ్ధెరిగిన నాటి నుంచి ఈ నాటి వరకు విన్న తప్పిపోయిన పిల్లల గాధలన్నీ బుర్రలో తిరగడం మొదలెట్టాయి.
          నా జీవితం, బంగా తప్పిపోక ముందూ, తప్పిపోయిన తర్వాతా అనేలా, రెండుగా విడిపోతున్నట్టని పించింది. వాడి కోసం వెతుకుతూ వెర్రిదానిలా పక్క వీధులన్నీ తిరిగాను. పక్కవాళ్ళు కూడా వేర్వేరు దిక్కులలో వెతికేందుకు వెళ్ళారు. ఆలస్యమవుతున్న కొద్దీ ఆశ సన్నగిల్లిపోతోంది, ఆందోళన పెరిగిపోతోంది.
ఇంక ఎప్పటికీ నా బంగారు తండ్రినింక చూడలేనేమో, వాడి బూరె బుగ్గల్నిముద్దాడ లేనేమో, పుత్ర పరిష్వంగ సుఖాన్నిక అనుభూతించలేనేమో, ఇక జీవితాంతం  పంచ ప్రాణాలూ పోగొట్టుకుని కూడా బతికే ఉన్నశవంలా బతుకీడవడమేనేమో!
    బంగా మీద కేంద్రీకరించబడ్డ నా జీవిత శేషభాగం వాడు లేకుండా ఎలా గడుస్తుందో కళ్ళముందు కనిపిస్తూ, ఆ వేదన ఒక మహాగ్ని లాగా నన్ను కాల్చేస్తుంటే సరిగా ఊపిరి పీల్చలేని స్థితికి వచ్చాను. రాజీవ్  కాంపులో ఉండడంతో మా అపార్ట్ మెంట్ కాపలాదారుని వెంట తీసుకుని వెళ్లి, పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, సమస్తం కోల్పోయిన దానిలా వెనక్కొచ్చిన నాకు వీధి గుమ్మంలో అరుగు మీద కూర్చుని ఆందోళనగా ఎదురుచూస్తున్న  మామ్మగారు  కనిపించారు. వాళ్ళ గేటూ, మా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ గేటూ పక్కపక్కనే .
          ఆవిణ్ణి చూడగానే నా లోపలి దుఖమంతా సునామీలా నన్ను కుదిపేస్తూ బయటికి ప్రవహించింది. గేటు తెరిచి ఒక్కంగలో ఆవిడ ముందు నేల మీద కూలబడి, ఆవిడ నడుం చుట్టూ  చేతులేసి, ఒడిలో తలపెట్టి పొగిలి పొగిలి  ఏడ్చాను.
"మాటలు కూడా సరిగా రాని పసివెధవ మామ్మగారూ! టైముకి అన్నం కలిపి పెడితే అటూ  ఇటూ పరుగులు పెడుతూ, మూతి తిప్పేస్తూ, తను తినడం కూడా అమ్మకి ఫేవర్ అన్నట్టు బ్రహ్మ ప్రయత్నం మీద రెండు ముద్దలు తినే చంటి ముండ, ఆకలేస్తే నసపెట్టి ఏడవడమే గాని ఇది కావాలీ అని అడగడం కూడా తెలీని పసి వాడు, నాలుగ్గంటలైంది ఇప్పటికి, కనపడకుండా పోయి ... ఆకలికి అల్లల్లాడి పోతూ ఉంటాడు మామ్మగారూ, అమ్మ కనపడక పొతే బెంగటిల్లి పోతాడు ... నేను రోజూ పూజించే దేవుడు నాకింత గర్భ శోకం పెడతాడని కల్లో కూడా అనుకోలేదు.. వాడినేం చేద్దామని పట్టుకు పోయారో  మామ్మగారూ .. తనని తాను కాపాడుకోవడం తెలీని చంటి వాడు, బయటి లోకంలో ఎన్ని దుర్మార్గాలున్నాయో ఊహకూడా లేని పసి వెధవ ... నాకింక ఎలా దొరుకుతాడు .. మా ఆయనకి  నామొహం ఎలా చూపించను? వాణ్ని తీసుకెళ్ళి బిచ్చమెత్తుకుందా మనుకున్నారో, కళ్ళూ కాళ్ళూ ... " మాట పైకి రాక పెద్ద పెట్టున బావురుమంటుంటే మామ్మగారు నా  మొహం పైకెత్తి " అపశకునం మాటలు మాట్టాడకు తల్లీ .. నా మాట నమ్ము.  పిల్లాడు క్షేమంగా వస్తాడు" అన్నారు.
           వెర్రిగా ఆమె మొహం చూస్తూ "వస్తాడా ? నా బంగా క్షేమంగా వచ్చేస్తాడా?" అన్నాను కడుపు లోంచి దుఃఖ కెరటాలు ఎగసిపడుతుంటే.
          "వస్తాడమ్మా మా రాజా రాలేదూ? అలాగే వస్తాడు" అన్నారు. రాజా అంటే మామ్మగారబ్బాయి డాక్టర్ రాజారావు గారు.
          "వాడపుడు మూడేళ్ళ పిల్లాడమ్మా. మా ఆడబడుచు ఏలూరు నించి వచ్చింది. ఎగ్జిబిషన్ చూడాలనుందంటే వెళ్లాం. అప్పట్లో వీఐపీ సూట్కేసులు కొత్తగా వస్తున్నాయి. అలాంటిది కావాలనుకుంది. బేరం చేసినంతసేపూ వాణ్ని చేత్తో పట్టుకునే ఉన్నాను ...  కొనేటపుడు  రెండు నిమిషాలు పిల్లాడి చెయ్యి వదిలానంతే. ఆ రెణ్ణిమిషాల్లోనే నా  కొంగు పట్టుకుని ఉన్న పిల్లాడు కాస్తా ఎటువైపు  వెళ్లి పోయాడో. మా ఆడబడుచుని అక్కడే నిలబడమని చెప్పి, ఆ జన సముద్రంలో ఒకటే వెతుకులాడాను. పదినిముషాలు పది యుగాల్లా గడిచాయి తల్లీ.. ఆ రోజుల్లో ఎగ్జిబిషన్ లో ఇల్లా పిల్లలు తప్పిపోవడం మామూలే. ఇక వాడు  ఎప్పటికీ దొరకడేమో అనే భయంతో, అమ్మ లేని పిల్లాడి బతుకు ఎలా నడుస్తుందో అని విలవిల్లాడిపోయాను ఆ కొంచెం సేపట్లోనే. అనుక్షణం కదిలిపోయే జనసమ్మర్దంలో ఏ  వైపు వెళ్లినా మిగిలిన అన్ని దిక్కులూ వదిలేసినట్టేగా .. అదృష్టం కొద్దీ మా ఇలవేల్పు నాయందుండి, ఆ పక్కనే కొంచెం దూరంలో బెలూన్ల షాపు దగ్గర పిల్లల మధ్య నిలబడి ఉన్నాడు, వెర్రి మొహం వేసుకుని. అప్పుడే కొంచెం అనుమానం వచ్చిందేమో అమ్మ కనపడడం లేదేమిటా అని, ఇంతట్లోకే మేం వాణ్ని చూడ్డం  జరిగింది"
          మామ్మగారి మాటలు సగం సగమే నాకు బుర్రకెక్కుతున్నాయి. వాళ్ళబ్బాయి ఆవిడకి దొరికారు గాని నా కొడుకు నాకు దొరుకుతాడని నమ్మకమేమిటి? పావుగంటసేపు నేను కనిపించకపోతే బెంగ పెట్టేసుకునే చంటి వాడు ఇంతసేపు నేలేకుండా ఎంత కక్కటిల్లిపోతున్నాడో .. ఎలాంటి షాక్ కి గురయ్యాడో? నా తల వేడెక్కిపోయింది .
          ఇంతలో నా  వెనక రిక్షా బెల్లు గణ గణా మోగింది. ఒక్కుదుటున లేచి గేటు వైపు తిరిగాను .. గేటు ముందాగిన రిక్షాలోంచి నా వైపు చూపిస్తూ 'అమ్మ అమ్మ' అంటున్న బంగా! నాకు వెర్రి ఆనందంతో ఒళ్ళు తెలియలేదు. నాలుగంగల్లో గేటు దాటి రిక్షా దగరకెళ్లాను .. ఏడ్చేడ్చి వడిలిపోయిన బంగా నీరసంగా నావైపు చేతులు చాచాడు. వెంటనే వాణ్ని లాక్కోకపోతే మాయమైపోతాడేమో అన్నట్టు అమాంతం వాణ్ని ఎత్తుకుని హత్తుకున్నాను. వాడు నన్ను కరుచుకుపోయాడు.
వర్షిస్తున్న కళ్ళతో వాడి  పక్కనే కూర్చున్న ముసలాయనని చూశాను ... 'ఏమిటమ్మా మాటలు కూడా సరిగా రాని  పసివాడిని అలా వదిలేస్తారా? ' అంటూ ఏదో అడుగుతున్నారాయన. అమాంతంగా, ఎడం భుజం మీదున్న బంగాతో సహా రిక్షా లోకి వంగిపోయి, ఆయన పాదాలు కుడిచేత్తో తాకి, నెత్తికి రాసుకున్నా. ఆ క్షణంలో నా కృతజ్ఞతని అంతకన్నా ఎలా చెప్పాలో తెలియలేదు.
          వెనక నించి ఎక్కడ దొరికాడు బాబూ ? దేవుడే  పంపినట్టు వచ్చారు మా పిల్లాణ్ణి  మా కప్పగించడానికి! లోపలికి  రండి అన్నారు మామ్మగారు .
          "లేదమ్మా..నే వెళ్ళాలి. ఇంటి దగ్గర మా ఆవిడ ఒక్కత్తే ఉంది. ఎదురుచూస్తూ ఉంటుంది నా కోసం" అన్నారు. 
          "బాబాయి గారు ఒక్క నిముషం .. రిక్షా కైనా డబ్బులివ్వనివ్వండి అన్నాను కంగారుగా.
          "మరి ఇంతసేపు తిరిగాను నాకేమీ ఇవ్వవా తల్లీ ? " కళ్ళు చికిలిస్తూ అన్నారు పరిహాసంగా . 
          నేనేమనాలో తెలీక ఇబ్బందిగా చూసాను.
          ఆయన నవ్వి "తల్లి దగ్గరికి పిల్లాడిని చేర్చిన ఆనందాన్ని మించింది ఏముందమ్మా ... కానీ జాగ్రత్త తల్లీ .. నీ ఆదుర్దాలో పిల్లాడెక్కడ  దొరికాడో కూడా కనుక్కున్నావు కాదు... పక్క వీధిలో కమ్యూనిటీ హాల్లో బ్రైట్  స్కూలు వార్షికోత్సవం జరుగుతోంది. పిల్లలకి పోటీలు జరుగుతున్నాయి. మా మనవడు కూడా ఉన్నాడని నేనూ మా ఆవిడా వెళ్లాం. ఈ రిక్షా అబ్బాయి మా అవుటుహౌసు లోనే ఉంటాడులే.. ఎక్కడికెళ్లాలన్నా ఇతని రిక్షా లోనే వెళ్తూంటాం. ఉత్సవం అయిపోయి అంతా  వెళ్ళిపోయారు. మా అమ్మాయీ వాళ్ళని పంపించి, నేనూ మా ఆవిడా కూడా  వెళ్లబోతుంటే వీడు ఏడుస్తూ కనిపించాడు.
ఈ పసివాడు ఎవరి తాలూకు  అని  అక్కడున్న వాళ్ళెవరినడిగినా తెలీదన్నారు. 'ఇల్లెక్కడ నాన్నా' అనడిగితే చెయ్యి చూపించాడుగాని ఏమీ గుర్తులు చెప్పలేకపోయాడు. రిక్షాలో ఎక్కించుకుని, వాడు అటూ ఇటూ చేతులు చూపిస్తుంటే  తిరుగుతూ వస్తున్నాం. చివరికి చాకోలేట్లూ, బిక్కీలూ ఎక్కడ కొనుక్కుంటావు' అంటే ' సీరామా లో కొంతుంది అమ్మ' అన్నాడు” చిన్నపిల్లాడిలా అభినయిస్తూ చెప్పి, “అయితే  దగ్గరలోనే ఉంటారని నమ్మకం కలిగి, మా ఆవిడని ముందు ఇంట్లో దింపి 'శ్రీ రామా' షాపు కి తీసుకొచ్చా. అక్కడి నుంచి చక్కగా చూపించాడు ఇల్లు!"  నవ్వుతూ చెప్పేసి, "ఇంక నే వెళ్తానమ్మా, పిల్లాడు జాగర్త!" అన్నారు తర్జని చూపిస్తూ .
          "బాబాయి గారూ! కొంచెం మజ్జిగ తీసుకోండి" ప్రాధేయ పడుతూ అడిగాను .
          "ఇల్లు తెలిసిందిగా మళ్ళీ వస్తాలేమ్మా, ముందు పిల్లాడిని కళ్ళారా చూసుకో! వాడికేదైనా తినిపించు, స్కూలు ఫంక్షన్ కదా వాళ్ళేవో బిస్కెట్లూ, చాకోలేట్లూ పెట్టారనుకో .... జాగ్రత్త తల్లీ .. పిల్లాడు  జాగ్రత్త! నువ్వు పోనీవోయ్ " అన్నారు. 
రిక్షా కదిలిపోయింది. మనసు కృతజ్ఞతతో భారమయింది ఒక్క క్షణం. మరుక్షణం బంగాని గాఢంగా హత్తుకుని ముద్దుల్లో ముంచెత్తాను. 
          " ఏడ్చేడ్చి సోలిపోయాడమ్మా. వాడినేం మాట్లాడించకు. లోపలికి తీసుకెళ్ళి అన్నం తినిపించు" అన్నారు  మామ్మగారు.  అప్పుడేసింది వెర్రి ఆకలి.  పొద్దుటి నుంచి ఏమీ తినలేదని గుర్తొచ్చింది. 
          "సాయంత్రం కనిపిస్తాలెండి మామ్మగారూ" అంటూ మా ఇంటికి వెళ్ళిపోయాను. 
          అలా నాకే అతుక్కు పోయిన పిల్లాడితో రోజంతా ఇల్లు కదలాలనిపించలేదు. తెల్లారి లేచేసరికి రాజీవ్ వచ్చేశారు. తనకి ఆవేళ, మర్నాడూ  సెలవు. వాడూ స్కూలుకి డుమ్మా. రోజంతా ఆయన వొళ్ళో వాడూ, భుజాలకి వేళ్ళాడుతూ నేనూ. జరిగిందంతా రాజీవ్ కి చెప్పాం ఎవరి భాషలో వాళ్ళం. మళ్ళీ ఇలా జరక్కుండా ఎలా ఉండాలో వాడికి జాగ్రత్తలు చెపుతూ, నాకు నేను చెప్పుకుంటూ, మూడో నాటికి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాం. సోమ వారం నాడు వాడిని స్కూలులో దింపేసి, రాజీవ్ ఆఫీసుకి  వెళ్ళిపోయాడు. ఇద్దరూ వెళ్ళాక అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని సర్దుకుని బాల్కనీ లో కొచ్చేసరికి మామ్మ గారి ఒళ్ళో తలపెట్టుకుని ఏడవడం గుర్తొచ్చింది. ఇల్లు తాళం పెట్టి కిందకొచ్చి, వాళ్ళ గేటు తీసుకుని అలవాటైన చనువుతో  లోపలికెళ్ళాను.
          ముందు గది దాటి డైనింగ్ హాలు గుమ్మం దగ్గరకేళ్ళేసరికి ఒక్కసారిగా లోపల్నించి వినపడ్డ కటువైన మాటలు ఉలిక్కిపడేలా చేశాయి. లోపల రాజారావు గారు మామ్మగారితో మాట్లాడుతున్నారు. విషయమేమిటో అర్ధం కాలేదు గాని "బుద్ధిలేకపోతే సరి...  ఏళ్ళొచ్చాయి ఎందుకూ" విసురుగా అన్నమాట చెవిలో పడింది. ఇంతలో ఆయన ఫోను మోగింది .
          "డాక్టర్ రాజారావ్ హియర్" అంటూ ఆయన ఒక పక్కగా ఉన్న క్లినిక్ గదిలోకి వెళ్ళిపోయారు. ఇబ్బందిగా వెనక్కి అడుగేసిన నన్ను ఆయన చూడలేదు. ఎవరో పేషంట్ కాబోలు 'బయల్దేరుతున్నాననీ, పదిహేను నిముషాల్లో ఆసుపత్రి చేరుకుంటా'ననీ చెప్పి, "అమరావతి గారూ! తలుపేసుకోండి" అంటూ వంటావిడని పిలిచారు.
          తల్లికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆయన కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం చూస్తే చివుక్కుమనిపించింది. కారు వెళ్ళిన చప్పుడూ, గేటు మూసిన చప్పుడూ వినపడ్డాక నేను లోపలి వెళ్లాను.
          నిశ్శబ్దంగా లోపలికి అడుగేస్తుంటే మామ్మగారు కనిపించారు. డైనింగ్ టేబుల్ వెనకగా దేవుడి గది పక్కనున్న కుర్చీలో కూర్చున్న ఆవిడ  కిటికీ లోంచి బయట తోటలోకి  చూస్తున్నారు మౌనంగా. గంధం రంగు పాత పట్టుచీర, నుదుట గంధం బొట్టు, పూర్తిగా నెరిసిపోయి వేలి ముడిలో ఒదిగిపోయిన జుట్టు. విచారంగా ఉన్నా తేజస్సుతో వెలుగుతున్న ఆవిడ కళ్ళ నుంచి, ముడతలు పడ్డ చెంపల మీదుగా కారుతున్న కన్నీటి తడి, కిటికీ లోంచి లోపల పడుతున్న వెలుగులో మెరుస్తూ కనిపించింది.
 ఆ దృశ్యం నన్ను చకితురాలిని చేసింది. మృదు స్వభావీ, భయస్తురాలూ అయిన మామ్మగారు, రావుగారు ఎపుడేనా ఈసడించినట్టు  తీసి పారేస్తే ఆ బాధకి విలవిలలాడతారేగాని కంటి వెంట ఒక చుక్క నీరు రానీరు. మామూలుగా చిన్న బాధ కలిగినా కన్నీరు కార్చే ఆవిడ, కొడుకు మాటలకి మాత్రం ఎంత కష్టం కలిగినా కంట తడి పెట్టరు. తల్లి కంట నీరు తెప్పించిన కొడుక్కి మోక్షం లభించదుట! తల్లి క్షమించినా కూడా ఆ బిడ్డకి శాపం తగులుతుందిట! అది ఆవిడ గాఢ నమ్మకం! అందుకే ఎంత దుఖం వచ్చినా కన్నీరు కారకుండా ఆపుకుంటారు!
ఆవిడ ఈ విషయం చెప్పగానే 'కొడుకు మీద ఎంత ప్రేమ ఈవిడకి!' అని ఆశ్చర్యం కలిగింది. భార్య కోరిందని తల్లి గుండె కాయని తీసుకెడుతున్న కొడుకు, జారి పడితే, అతని చేతిలోని తల్లి గుండె 'నాయనా దెబ్బ తగిలిందా' అనడిగిన కథ గుర్తొచ్చింది. ఆవిడ మాటలు విన్నపుడు బంగా కూడా పెద్దయ్యాక ఇలాగే ఉంటాడా అని సందేహం, బెంగా కలిగాయి.
          ఇవాళ ఆవిడ తడి కళ్ళు చూడగానే, ఆ మాటలు గుర్తొచ్చాయి. నా గుండె తరుక్కు పోయింది.
          అలికిడి వినపడగానే  చటుక్కున కళ్ళు తుడుచుకుని, వివర్ణమైన మొహాన్ని చిరునవ్వుతో అలంకరిస్తూ "దామ్మా! జయా ! ఎలా ఉన్నారు తల్లీ ?" అన్నారు .
          "బావున్నాం మామ్మగారూ, తుఫాను వెలిసి పోయిందిగా?" నవ్వుతూ వెళ్లి ఆవిడ పక్కనే డైనింగ్ కుర్చీ మీద కూర్చున్నా.
          "అవును తల్లీ .. ఎంత గండం తప్పింది! ఏడీ చిన్ని కృష్ణుడు? బడికి పంపేశావా?" అన్నారు .
          "అవును మామ్మగారూ, పన్నెండింటికి వెళ్లి తీసుకు వస్తా" అన్నా.
          "ఇదుగో చూడూ, నిన్ననే అబ్బాయి పేషెంట్లెవరో తిరుపతి నించీ స్వామి అభిషేక జలం, ప్రసాదం తెచ్చారు. వాడి మీద చల్లి, మీరూ చల్లుకోండి.. ప్రసాదం తీసుకోండి. రక్ష!" అన్నారు, నా చేతిని తన రెండు చేతుల మధ్యా పట్టుకుంటూ.
          ఆ ప్రేమకి మనసు నిండిపోయి, కుర్చీ ఆవిడ దగ్గరగా జరుపుకున్నాను. ముడతలు పడి నరాలు పైకి తేలిన ఆవిడ చేతుల్ని పట్టుకుని "మామ్మగారూ! ఆవేళ  హడావుడిగా వెళ్ళిపోయాను కదా .. రెండు రోజులూ నన్నస్సలు వదలలేదు పిల్లాడు. భయపడిపోయాడు పాపం. దానికి తోడు  వాళ్ళ నాన్న కూడా వచ్చారుగా...  టైము తెలీకుండా గడిచిపోయింది. నిన్నే వచ్చి మీతో ఒక్క మాట చెప్పి వెళ్ళాల్సింది" అన్నా .
          "అయ్యో పర్లేదమ్మా" అని 'వాడు ఎలా వెళ్ళాడో, వచ్చాక ఏం వివరాలు చెప్పాడో' అన్నీ తరిచి తరిచి అడిగి, "పోన్లే తల్లీ అదృష్టవంతురాలివి. నీ కొడుకు నీకు దొరికాడు .. .. మా రాజా లాగే వీడూ దొరుకుతాడని నే చెప్పలేదూ?" అన్నారు.
          "అవును మామ్మగారూ! మీ దీవెన ఫలించి  నా బిడ్డ నాకు దొరికాడు. లేకపోతే  ఇలా ప్రాణాలతో ఉండేదాన్నా?" అన్నా. 
          ఆవిడ నిర్లిప్తంగా నవ్వి " అంతేనమ్మా, అడ్డాల నాడైనా, గడ్డాల నాడైనా తల్లికే బాధ! తప్పిపోయిన పిల్లాడు ఎలాగో ఒకలా బతకనేరుస్తాడు గాని ఆ తల్లి జీవచ్చవమై బతుకీడుస్తుంది .. తనే ఆధారమైనవాడు తను లేనిదే బతకలేడని  అమ్మలంతా అనుకుంటారు. కానీ ముసలిదై  కొడుకు మీద ఆధారపడి జీవించే తల్లికి ఎదురయ్యే అనుభవాలు చెప్పనలవి కాదు" అన్నారు.
          ఇందాకటి దృశ్యం కళ్ళలో మెదిలింది. రాజారావు గారి పరుష వాక్యాలు గుర్తొచ్చాయి. నాలుగేళ్లుగా వాళ్ళింటితో అనుబంధం నాది. అప్పటికి బంగా ఇంకా పుట్టలేదు. రాజీవ్ ఉద్యోగ రీత్యా ఈ మహా నగరానికి వచ్చి, శ్రీనగర్ కాలనీ లో ఇల్లు తీసుకుని కాపురం  మొదలుపెడుతుంటే అమ్మ ఒకటికి పది సార్లు చెప్పింది, శ్రీనగర్ కాలనీ లోనే మా దూరపు బంధువులున్నారనీ, వీలుచూసుకుని పలకరించి రమ్మనీ. పెద్దావిడ కొడుకూ కోడలూ ఇద్దరూ డాక్టర్లనీ, వాళ్ళ పిల్లలు అమెరికాలో స్థిర పడిపోయారనీ చెపుతూ, వాళ్ళకి  విశాలమైన పెద్ద ఇల్లూ, తోటా ఉన్నాయనీ, ఒక అవుట్ హౌసు కూడా ఉందనీ చెప్పి, వాళ్ళకీ మాకూ నచ్చితే అందులో ఉండచ్చని కూడా అంది. రాజీవ్ ఆసక్తి చూపించక పోయేసరికి నేనూ ఊరుకున్నాను. అప్పట్లో కాలనీ  ఇంకా అపార్ట్మెంట్ల తో నిండి పోలేదు. అక్కడక్కడ  పెద్ద చెట్లు ఆవరించిన ఇండిపెండెంట్ ఇళ్లు ఉండేవి. మొదటి అంతస్తులో ఉన్న మా ఫ్లాట్ లో బాల్కనీలోకొస్తే పక్కింటి పెరడంతా కనిపించేది.
బంగా పుట్టాక నేను ఉద్యోగం మానేసెయ్యడంతో, వాడూ, నేనూ చాలా సేపు ఆ బాల్కనీ లో గడిపేవాళ్ళం. వాడు నేర్చుకున్న మొదటి మాటలన్నీ వాళ్ళ తోట చూస్తూనే. పూల తీగలూ, కూర పాదులూ, పెరటి గుమ్మానికి ఎదురుగా తులసి కోటా, పై నించీ కనిపిస్తూ ఉండేవి. విచ్చిరాలిపోయే పూలని చూస్తుంటే నా మనసు ఆగేది కాదు. బాల్కనీ లోంచి వాళ్ళ పెరటి వైపు తొంగి చూస్తూ నేనూ, గ్రిల్ లోంచి తన ఆట వస్తువులేవో కింద పడేస్తూ, వాళ్ళ తోటవేపు చూపించి  ఏవో ప్రశ్నలడుగుతూ బంగా ....  ఇద్దరికీ ఆ తోటతో ఏదో బంధం ఏర్పడి పోయింది.
నేల మీద ఒక్క మొక్క కూడా పెరిగే అవకాశం లేని మా కాంప్లెక్స్ పక్కనే దాదాపు వెయ్యి గజాల ఆవరణ లో అందమైన మేడా, చుట్టూ ఫల వృక్షాలూ, పూల తీగెలూ నన్నాకర్షిస్తే, చెట్ల కొమ్మల మీద తిరిగే ఉడతలూ, రెక్కలు టపటప లాడిస్తూ ఎగిరే పక్షులూ బంగాని ఆకట్టుకునేవి. వద్దనుకున్నా వాళ్ళ ఆవరణలో తిరిగే పనివాళ్ళూ, వంట మనిషీ, అప్పుడపుడు హడావుడిగా నాలుగడుగులేసి వెళ్ళిపోయే డాక్టర్ దంపతులూ, ముఖ్యంగా పసిడి వర్ణంలో మెరిసిపోతూ కచ్చాపోసిన తేలికైన పట్టు చీరల్లో పొద్దుటి పూటా, పల్చని నేత చీరల్లో సాయంత్రం పూటా మెల్లిగా అడుగులేసే మామ్మగారూ మా దృష్టి నాకర్షిస్తూ ఉండేవారు.
          ఒక రోజు మామ్మగారు తులసి కోట దగ్గర పడిపోవడం చూసి, వంటింట్లో ఉన్న నా దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు బంగా.
          "తాతమ్మ పప్పోయింది ... అక్కల" కంగారుగా విషయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే బాల్కనీ లోకి పరుగు తీశా. పెరట్లో తులసికోట దగ్గర పడిపోయి లేవడానికి ప్రయత్నిస్తున్నారు మామ్మగారు. వెంటనే బంగానెత్తుకుని, వీధి తలుపు తాళం పెట్టి మా కాంప్లెక్స్ బయటి కొచ్చి, వాళ్ళ గేటు దాటి  పెరట్లోకి పరుగెత్తాను.
అదే మొదటిసారి  వాళ్ళింటికి వెళ్ళడం. మేం చుట్టూ తిరిగి వెళ్తుంటే, డైనింగ్ హాలు కిటికీ లోంచి మమ్మల్ని చూశారు డాక్టర్ దంపతులు. మామ్మగారు పడిపోయారని చెప్తూ నేను వెనక్కి వెళ్లేసరికి వాళ్ళూ పెరట్లోకి వచ్చారు. అప్పటికావిడ లేచి కూచున్నారు. కాలు చీల మండ  దగ్గర బుస బుసా పొంగి ఉంది. మా నాన్నమ్మ గుర్తొచ్చి నా కళ్ళంట  నీళ్ళు తిరిగాయి .
          "మామ్మగారూ, బాగా నెప్పిగా ఉందా" అంటూ ఆవిడ దగ్గరగా మోకాళ్ళ మీద కూర్చున్నా.
          ఈ లోపు రాజారావు గారు, మేఖల గారూ  పెరటి మెట్లు దిగి వచ్చారు. ఆయన ఎర్రబడిపోయిన మొహంతో భార్య వైపు తిరిగి, ఎడమ అరచేతిని మామ్మగారి వైపు చూపిస్తూ "ఎనభై ఏళ్ళొచ్చి చిన్నపిల్లలా ఈ మెట్లు ఎక్కుతూ, దిగుతూ తిరగద్దని లక్ష సార్లు చెప్పాను ... వింటుందా ?" అన్నారు కఠినంగా.
          మేఖల గారు, జరిగింది తనకేం నచ్చలేదన్నట్టుగా, అయినా అది తనకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా మొహం పెట్టి "నాగేష్!" అంటూ డ్రైవర్ ని పిలిచి ప్లాస్టిక్ కుర్చీ తెమ్మన్నారు .
          ఇంతలో మామ్మగారు  లేవడానికి ప్రయత్నిస్తుంటే "మళ్ళీ పనికిమాలిన అభిమానం ఒకటి. వాడూ నేనూ లేవదీస్తున్నాం కదా, మాట్టాడకుండా ఊరుకోదు  ..  ఇష్టం వచ్చినట్టు తిప్పితే, ఆ కాలు పనికి రాకుండా పోతుంది...  ఇప్పుడే చెప్తున్నా" అన్నారు గదిమినట్టు .
          అంత నెప్పినీ పళ్ళ బిగువున భరిస్తూ కళ్ళు మూసుకున్నారు మామ్మగారు .
          రాజా రావు గారు, నాగేష్ కలిసి ఆవిడని కుర్చీ లోకి చేర వేశారు. బంగా భయపడి పోయి నా కుచ్చిళ్ళు  పట్టుకుని చూస్తూండి పోయాడు. వాళ్ళిద్దరూ జాగ్రత్తగా కుర్చీని లోపలికి  తీసుకెళుతుంటే మేఖల గారు నా వైపు 'నువ్వెవరు' అన్నట్టు చూశారు. అక్కడి నుంచే మా ఇంటి వైపు చూపించి, నా పరిచయం చేసుకుని, మామ్మగారు పడిపోయినట్టు వీడే చూసి నాకు చెప్పాడంటూ బంగాని చూపించాను. తలూపి లోపలికెళ్ళి పోయారావిడ. నేనెలా వచ్చానో అలాగే చుట్టూ తిరిగి, గేటు వైపు వెళ్లాను చంకలో పిల్లాడితో.
గేటు తెరుస్తుంటే ఇంట్లోంచి రాజా రావు గారు వచ్చి, "థాంక్సమ్మా ... థాంక్స్ ఫర్ ది కన్సర్న్ " అని, మేము బయటికి వెళ్ళగానే గేటు వేసుకున్నారు.    
మర్నాడు  మామ్మగారిని పలకరించడానికి వెళ్ళినపుడు అమ్మ ఇచ్చిన వివరాలు చెపితే " మా పాపక్కయ్య మనవరాలివా నువ్వూ?"అంటూ ఆవిడ ఆనంద పడిపోయారు. రాజారావు గారు కూడా కాస్త ప్రసన్నంగా కనిపించి, 'అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండమ'ని చెప్పి తోటలో పువ్వులూ, కాయలూ కావాలంటే పట్టుకెళ్లమని చెప్పారు.
మామ్మగారి కాలి కట్టు విప్పేదాకా తరచూ వెళ్తూ ఉండేవాళ్ళం నేనూ బంగా. వాడికి తాతమ్మ ఎంతో  నచ్చేశారు. ఆవిడ ముడతలు పడ్డ చేతులు పట్టుకుని 'బోమీతా చేతులు' అనేవాడు వాడు ముద్దుగా. బోర్నవిటా పాలపై మీగడ తరకలా ఉంటాయిట ఆ ముడతలు. అలా మొదలు పెట్టిన రాక పోకలు కొన్నాళ్ళకి అలవాటుగా మారిపోయాయి. ఆవిడతో ఒక ఆత్మీయ బంధం ఏర్పడింది. మామ్మగారమ్మాయి శారద గారు కూడా నన్ను వాత్సల్య దృష్టితో చూసేవారు. బంగాని ఎంతో ముద్దు చేసేవారు. వాళ్ళ బంధువులంతా నాకూ బాగా పరిచయమై పోయారు.
          రాజారావు గారికి సర్జన్ గా, శస్త్ర చికిత్సలో నిపుణులుగా మంచి పేరుంది. ఆయన పనిచేసే చోట స్టాఫ్ అందరికీ ఆయన మాటంటే వేద వాక్కు. అనవసరమైన కండని, నైపుణ్యంతో కోసి తీసేసినట్టే, అక్కర్లేదనిపించే సంభాషణనీ, సెంటిమెంట్లనీ చులాగ్గా కత్తిరించేయడం ఆయన పధ్ధతి. తల్లిని చూసుకోవడం  తన బాధ్యతగా  ఆయన స్వీకరించినా, అది విధి నిర్వహణలాగే గాని అందులో ప్రేమా, ఆప్యాయత కనపడనివ్వరు. రోజులో ఒక్కసారైనా  ఆవిడ దగ్గరగా కూర్చోవడం, ఆప్యాయంగా మాట్లాడడం, ఒంట్లో బావుండకపోతే ప్రేమగా స్పృశించడం కనిపించదు.
పెద్దగొంతుతో అరవడం గాని, తిట్టడం గాని అలవాటు లేని ఆయనకి  కోపం వస్తే, ఎదుటి వ్యక్తికి మధ్యాహ్న మార్తాండుడు కనిపిస్తాడు. ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడే ఆయన, తన అభిప్రాయాలకి విరుద్ధంగా ఏదైనా జరిగితే సహించలేరు. ఆయన మాట తీరు కూడా ఆయన వృత్తికి తగినట్టే, మెత్తగా  కత్తి  దించి కోసినట్టు  ఉంటుంది. ఓసారి ఆయన కసురుకుని వెళ్ళిపోయాక  చిన్నబోయి ఉన్న మామ్మగారితో అదే అంటే "అవునమ్మా...కాపోతే ఎనస్థీసియా ఉండదు గనక భరించడం కష్టం" అన్నారు.
          ఆలోచనల్లోంచి  వర్తమానంలోకి వచ్చి, దిగులుగా ఉన్న ఆవిడ మొహం చూస్తూ "మామ్మగారూ, ఎందుకో కోపంగా ఉన్నారు బాబాయి గారు" అన్నాను మెల్లిగా, ఎక్కడో ఒకచోట తన మనసులో భారాన్ని దించుకుంటే ఆవిడకి మంచిదనిపించి.
"ఎందుకేమిటమ్మా?  పేషెంటు లైతే వాడు చెప్పినట్టు మందులేసుకోవడం అవసరం. ఆసుపత్రి స్టాఫ్ అయితే డాక్టర్ గారి ఆర్డర్స్ తుచ తప్పకుండా పాటించడం అవసరం! అలాగే ఇంట్లో ముసలమ్మ కూడా వాడి  మనసులో ఏమనుకున్నాడో దానికి అనుగుణంగా నడుచుకోవద్దూ. దానిక్కూడా మనసుంటే ఇబ్బందే" అన్నారు నిష్ఠూరంగా.
          "మరి మేఖల గారు ఎలా మానేజ్ చేస్తారో" అన్నాను. 
          "మా కోడలా? ఇద్దరూ సమ ఉజ్జీలేగా ... బాధలేదు. నా అవసరం వాళ్లకి లేదన్న విషయం తెలిసిందే. నాకు తిండికి లోటు చెయ్యరు, బట్టకి తక్కువ చెయ్యరు. వేళకింత తిని కృష్ణా రామా అనుకుంటూ పడి ఉంటే  వాళ్లకి బావుంటుంది. మాటా మంతీ లేకుండా బొమ్మలా ఎంత సేపని ఉండను? ఏ విషయంలోనూ ఆసక్తీ, కుతూహలం లేకుండా ఎలా బతకడం? పోనీ ఆ  పైవాడైనా , 'నీ పనులన్నీ చేసేశావు కదే ముసలిదానా .. ఇంక రా' అని వెనక్కి రప్పించుకోడు  .. శరీరానికి ఏ ఇబ్బంది వచ్చినా అపర ధన్వంతరి నా కొడుకే .. వెంటనే మందూ, మాకూ పడిపోతాయి. ఆ యముడైనా ఎలా పట్టుకుపోతాడు పాపం" అక్కసుగా అన్నారు .
          ఆవిడని చూస్తుంటే చిన్న పిల్లలా కనిపించారు. మళ్ళీ కళ్ళలో సన్నగా కదిలిన  నీటి పొర ఆవిడ నిగ్రహ శక్తికి లోబడి అక్కడే ఆగిపోయింది.
          దగ్గరగా జరిగి ఆవిడ భుజాల చుట్టూ చేతులేసి "మామ్మగారూ, ఎన్నో పుస్తకాలు చదువుతారు. ఈ వలయం కొత్తదేమీ కాదుగా. మీరలా బాధ పడుతుంటే ఏమీ బాలేదు"  అన్నా ఆవిడనెలా ఓదార్చాలో తెలీక.
ఒక్క క్షణం నావైపు చూసి, చిన్నగా నవ్వి, నా చేతిని ఆపేక్షగా పట్టుకుని, "అప్పుడప్పుడిలా అనిపిస్తుంది గానీ నాకేం తక్కువమ్మా? కాకపొతే ... ఆ భగవంతుడు ముసలాళ్లందరికీ కావాలనుకున్నపుడు వెళ్ళిపోగలిగే ఇచ్చాశక్తి  ఇస్తే బావుండేదనిపిస్తుంది" అన్నారు దేవుడి గది వైపు చూపు తిప్పి.
          మళ్ళీ తనే "పాపిష్టి దాన్ని! అనవసరంగా కంట తడి పెట్టాను. ఇలాంటి కొడుకు అందరికీ దొరుకుతాడా? దేనికీ లోటు రానివ్వడు! నెత్తి మీద పెట్టుకు చూసుకుంటాడు నా తండ్రి" అన్నారు !
          ఇంతలో పదకొండున్నర అయిందని చెపుతూ గోడ గడియారం గంట కొట్టింది. బంగాని తీసుకు రావడానికి  స్కూలుకి బయల్దేరాను. 
                                                        * * *

          అలా వచ్చేశాక మళ్ళీ వెళ్ళడం పడలేదు. తర్వాత నాలుగు రోజులకి మామ్మగారి భర్త ఆబ్దికం. ఆవిడ కూతురూ, పిల్లలూ కాక దగ్గరి బంధువులు ముగ్గురు నలుగురు వచ్చారు. శారదగారు వస్తూనే నాగేష్ తో కబురు పంపించారు 'సాయంత్రం వచ్చి తాతగారి ప్రసాదం తీసుకోమనీ, బంగా కోసం ఏవో బొమ్మలు తెచ్చా'ననీ. ఆ సాయంత్రం నేను వెళ్లేసరికి  మామ్మగారు పెరటి గట్టు మీద కూర్చుని ఉన్నారు. మొహం ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువ మాట్లాడలేదు గాని చల్లని నవ్వు ఆవిడ మొహమంతా పరుచుకుని ఉంది. బంగాని దగ్గరగా పిలిచి బుగ్గలు పుణికి ముద్దాడారు. కాసేపు కూర్చుని, శారద గారితో మాట్లాడి వచ్చేశాం .
          మర్నాడూ, మూడోనాడూ కూడా నే వెళ్ళినపుడు మామ్మగారి వదనంలో వింతైన ప్రశాంతత కనిపించింది. అంతకు ముందు చాలాకాలంగా ఆవిడ మొహంలో చోటు చేసుకున్న విచార రేఖ ఒక్కసారిగా మాయమవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. శారద గారు మాత్రం ఆవిడ సరిగా తినడం లేదనీ, మాటలు కూడా తగ్గించేశారనీ  చెప్పి బాధ పడ్డారు.
          నాలుగో రోజు పొద్దున్న కాఫీ కప్పులతో బాల్కనీ లోకి వెళ్లేసరికి వాళ్ళ పెరట్లో నిండా జనం. పని మనిషి చేతులు తిప్పుతూ అమరావతి గారితో పెద్దమ్మగారు ఎలా పోయారో చెపుతోంది. బంగాని చూస్తూండమని రాజీవ్ తో చెప్పి, నేను పరుగులతో వాళ్ళింటికి వెళ్లాను. అప్పటికే మామ్మగారి భౌతిక కాయాన్ని ఆఖరి చూపులకోసం తయారు చేస్తున్నారు.
          ఆవిడ నిష్క్రమణ నన్నెంతగా ప్రభావితం చేస్తుందో నేనెపుడూ ఊహించలేదు. వారం రోజుల పాటు ఒళ్ళెరగని జ్వరంతో మంచానికంటుకు పోతే అమ్మా, నాన్నగారూ వచ్చారు నాకు సాయంకోసం, రాజీవ్ కి తోడుగా పిల్లాడిని చూసుకోవడం కోసం. పన్నెండో  రోజుకి కాస్త తేరుకున్నాను కదా అని వైకుంఠ సమారాధనకి  వెళ్తుంటే అమ్మా నాన్నగారూ మా  వెంట వచ్చారు.
          మామ్మగారి అందమైన ఫోటో ఒకటి టేబుల్ మీద పెట్టి, మల్లెపూల మాలలతో, గులాబీ విడి పూలతో అలంకరించారు. సన్నని అగరు ధూపం ఆవిడ చుట్టూ మెలికలు తిరుగుతూ వందనం చేస్తోంది. పిండి వంటల వాసనలూ, వచ్చిన బంధుమిత్రుల సరదా సంభాషణలూ, నవ్వులూ ... అక్కడంతా పండగ వాతావరణం కనిపించింది. 
          నొచ్చుకుంటూ "ఇదేమిటమ్మా ఆవిడ పోయినందుకు ఎవరికీ బాధే లేనట్టుంది?" అన్నాను అమ్మతో. 
          "ఎనభై దాటిన మనిషి సహజ మరణం పొందితే అది పండగగా చేసుకోవాలంటారు జయా! ఎవరూ మంచాన పడి  తీసుకుని, తీసుకుని  పోకూడదు. అనాయాస మరణం ఒక వరం. అది  అందరికే దొరకదు. ఆవిడకేం మహారాణిలా వెళ్ళిపోయింది. పోయినప్పుడు ఆవిడ మొహం ఎంతో  ప్రశాంతంగా ఉందని నువ్వే అన్నావుగా. అంటే ఆ స్థితిలో ఆవిడకేదో సుఖం, శాంతీ దొరికాయన్న మాట!" అంది నెమ్మదిగా.
నిజమే. ఆఖరి రోజే కాదు అంతకు నాలుగు రోజుల ముందు నించీ, కారణం ఏమిటో గాని ఆవిడ చాలా స్థిమితంగా, తేటనీటి కొలనులా అనిపించారు. నీరెండలో కమలంలా వెలుగుతూ కనిపించారు.
ముందు అందరితో పాటు పలకరించినా, భోజనాలయ్యాక శారద గారు నా దగ్గరగా వచ్చి"జ్వరం పూర్తిగా తగ్గిందా?" అని అడిగి, "ఆవిడకీ నీకూ ఏమిటో ఆ బంధం... అమ్మ వెళ్ళిపోయిన వెంటనే ఒక్కసారిగా డీలా పడిపోయావు " అన్నారు ఆప్యాయంగా.
చేతిలో ఉన్న సన్నని నూలు సంచీ తెరిచి ఒక మెత్తని షాల్ తీసి నా చేతిలో పెట్టారు. అది  మామ్మగారు తరచుగా కప్పుకుంటూ వచ్చిన పష్మినా శాలువా. లేత గోధుమ రంగులో ఉన్న ఆ శాలువా అంచు అంతా సున్నితమైన ఎంబ్రాయిడరీ చేసి ఉంది. ఆ స్పర్శ నాకేదో సుఖాన్నిచ్చింది. ఏదో ప్రేమని అందించింది.
          "జయా! ఈ శాలువా తన గుర్తుగా నీకిమ్మని అమ్మ చెప్పింది" అన్నారు .
          నేను నిర్ఘాంతపోయి "ఎప్పుడు  చెప్పారు?" అన్నాను.
          "చెపితే ఆశ్చర్య పోతావ్. సరిగ్గా ముందురోజు సాయంత్రం చెప్పింది" అన్నారు నా కళ్ళలోకి చూస్తూ.
          నేను అవాక్కుగా ఉండి పోయాను. 
          "నాన్నగారి తద్దినం తర్వాత అంతా వెళ్ళిపోయాక నేనూ అమ్మా తన గదిలో పడుకుంటున్నాం కదా. ఆ రోజు కొంచెం నీరసంగా కనిపించింది గాని మనిషి సంతోషంగానే ఉంది. అసలు ఊహకూడా కలగలేదు అదే తన ఆఖరి రోజని. మాటలు తగ్గించేసింది కదా అంతకు ముందే. ఆవాళ  రాత్రి మాత్రం, ఎప్పుడో రాసి ఉంచిన చిన్న నోటు పుస్తకం నాకిచ్చి తన తర్వాత అందులో ఉన్నట్టుగా చెయ్యమంది. ఆ పుస్తకంలో తన వస్తువులు ఎవరెవరికి  ఏమివ్వాలో వివరంగా రాసి ఉంచింది. అదంతా ఎప్పటి నుంచో నాలుగైదు విడతలుగా రాసి పెట్టినట్టుంది. నీకు ఈ శాలువా ఇవ్వమని మాత్రం నాతో చెప్పింది " అన్నారు. 
           నాకు కళ్ళు చెమర్చాయి. ఆత్రంగా "ఇంకా ఏమైనా చెప్పారా?" అన్నాను .
          "ఇంకేమీ చెప్పలేదు జయా! ఎందుకూ ?" అనడిగారు .
          "ఒక్కసారి ఆ పుస్తకం నేను చూడచ్చా?" అన్నాను అభ్యర్ధిస్తూ.
          "దానిదేముంది...  అలాగే చూడు" అన్నారు.
          ఇద్దరం మామ్మగారి గదిలోకి నడిచాం. ఆవిడ మనోభావాలకి గుర్తుగా మిగిలి పోయిన ఆ విలువైన పుస్తకం ఆ  గదిలో  చిన్న పుస్తకాల అలమారలో మిగిలిన పుస్తకాలతో పాటు ఉంది. ఆవిడ పిల్లలకోసం వదిలిన వస్తువులు పెద్ద విలువైనవి కాకపోవచ్చు. 
           ఆ పుస్తకాన్ని నా చేతిలోకి  తీసుకుంటే ఆవిడ మెత్తని చేతుల స్పర్శ అనుభూతి లోకి వచ్చింది. అందులో పేజీలు  గబా గబా తిరగేస్తుంటే ఎప్పటి నుంచో ఆవిడ రాసుకున్న పాటలూ, పద్యాలూ, ఏవో అంత  ప్రాముఖ్యత లేని విషయాలూ రకరకాల ఇంకులతో కనిపించాయి. ఒక చోట కొత్త ఇంకుతో రాసిన వాక్యాలు వీటిలో కలిసి పోయి ఉన్నాయి .. అవే నేను వెతుకుతున్న వాక్యాలు .. నా సందేహానికి జవాబిస్తున్నట్టు కనపడ్డాయి.
          "వాడేమి పసివాడా, అమ్మ కనపడకపోతే బెంగ పడడానికి ? వాడి గురించి నాకింత వ్యాకులత అవసరమా? బంగా వయసులో అయితే వదిలి వెళ్ళరాదు. ఎప్పుడైతే తల్లి కోసం పిల్లవాడు బెంగపడడని ఖరారుగా తెలుస్తుందో అప్పుడు ఆ తల్లి తన బిడ్డని, తన పాశం నుంచి విముక్తుడిని చెయ్యాలి. అతడినే పట్టుకు వేళ్ళాడుతూ వెనక్కి లాగరాదు. నేను పోతే ఇతడెట్లా బతుకుతాడు అనేంతగా ఒక ఎదిగిన బిడ్డ, తల్లి పట్ల ప్రేమ కలిగి ఉంటే, అది ఆ తల్లి ఇహ పరాలకి  మంచిది గాదు. సంతానం తల్లి పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉంటే,ఇక ఆ తల్లి ముక్తిని పొందేదెలా?" 
           మామ్మగారి చేతి రాతలో ఆవిడ రాసేటపుడు ఉపయోగించే భాషలో ఆ వాక్యాలు చదవగానే  నా శరీరంలో ఒక మెరుపు తీగ సర్రుమని పాకినట్టు ఒళ్ళు జలదరించింది. ఆవిడ తనని తాను జయించి, కొడుకు పట్ల డిటాచ్ మెంట్ కోసం ప్రయత్నించి, రాజారావు గార్ని బంధవిముక్తుడిని చేశారన్నమాట…ఆ ఊహ నన్ను విభ్రాంతికి గురిచేసింది.
          అంతసేపు వాడిని వదిలేసినందుకు అలుగుతూ బంగా మా దగ్గరకి పరిగెత్తుకొచ్చాడు. నా కుచ్చిళ్ళు పట్టుకు లాగుతూ "అమ్మా! దా...  ఎంత సేపూ?" అంటూ మారాం మొదలెట్టాడు. మామ్మ గారిచ్చిన శాలువా భుజం మీద వేసుకుని, బంగా నెత్తుకుని, మౌనంగా కదిలాను. 
                                                                    
                                                                        *****

(ఫిలడెల్ఫియా లో ఆటా పదమూడవ కన్వెన్షన్ సందర్భంగా నిర్వహించిన ఆటా కథల పోటీలో  నా కథ కి బహుమతిచ్చి , బొమ్మకూడా నేనే వేసుకునే అవకాశం ఇచ్చిన  ATA కార్యవర్గానికి ధన్యవాదాలు. 
            13
వ ఆటా మహాసభల జ్ఞాపక సంచిక, జూలై 2014)

8 comments:

 1. మీ భావ జాలముల గాలములో మునిగి తేలు మమ్ము కరుణ కన్నీరు గా మారి బయటకు లాగుతుంది అండీ.. ఎంత సున్నితముగా జీవిత సత్యములను ఆవిష్కరిస్తారో. అభినందనలతో

  ReplyDelete
 2. మీ స్పందనకీ , ప్రశంసకీ కృతజ్ఞతలు ఉష గారు !

  ReplyDelete
 3. Good plot, realistic characterization, apt narrative and symbolic illustration.
  One question: why does she need to look at the notebook?

  ReplyDelete
 4. It surprised Jaya to know that Bamma garu asked Sharada to give her shawl to Jaya after her demise.She wondered whether Bamma garu knew that her last journey was about to commence. She was aware of Bamma garu's habit of noting down important things in her note book. She looks into it to see if she left any clues. She also wanted to know the reason for the sudden change in her attitude during the last few days of her life.

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. కథ చాలా బావుంది నాగలక్ష్మి గారూ...చాలా ముసలి తనం మీదపడ్డవాళ్ళే కాదు...కాస్త వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఎవరికీ భారం కాకుండా ,ఈ కాళ్ళు చేతులూ ఆడకుండానే తీసుకెళ్ళు దేవుడా అని ప్రార్ధించటం నేను చూశాను....అందుకు మా అమ్మే ఒక ఉదాహరణ...మంచాన పడి కన్నబిడ్డలకు భారం కాకుండా ఆ భగవంతుడు తీసుకెళితే చాలనుకునేవారు ఆవిడ....రాధిక గారు వ్రాసిన సమీక్ష ,ఆ లింక్ మాకు ఓపెన్ అవటం లేదు కానీ, అమ్మ మీద చనువుతోనో.విసుగుతోనో విసుక్కునే కొడుక్కి బుధ్ధి వచ్చినట్టు వ్రాస్తే అది బావుండేదేమో ( ఒక మామూలు ఆలోచనా ధోరణికి అలవాటు పడ్డ వాళ్ళము కనుక...) కానీ అంత పెద్ద వయసు వచ్చినాక ఆపలేని పరిష్కారం మీరు సూచించిందే.....అసలు మామ్మగారు కొడుకు పట్ల అంత మమకారం అన్ని రోజుల పాటు నిలుపుకోవటమే గొప్ప....ఆ తరువాతయినా ఆవిడ ఆ బంధాన్ని వదలగలిగేలా ఆలోచన చెయ్యటము ముదావహం....నా కామెంట్ లో బంధం వదలగలగటం అంటే ప్రాణం వదల గలగటమని కాదు ..గమనించగలరు

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు కృతజ్ఞతలు నాగజ్యోతి గారు!

   Delete
 7. చాలా బాగుందండీ. No words to say

  ReplyDelete