August 10, 2013

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం !

                              

      
              

  "చాలా కాలం క్రితం  మన భవితవ్యాన్ని మనమే నిర్ణయించుకుందుకు సన్నధ్ధులమయ్యాం. ఇప్పుడా సమయం వచ్చింది.  ప్రపంచం యావత్తూ నిద్రలో మునిగినప్పుడు, అర్ధరాత్రి పన్నెండు కొట్టగానే స్వతంత్ర భారతి చేతన పొంది మేల్కొంటుంది ! పాత నుంచి కొత్త లోకి మనం అడుగు పెట్టే క్షణం, ఒక యుగం అంతమై , ఎంతో కాలంగా అణచివేయబడ్డ ఒక దేశపు ఆత్మ, గొంతు పెగల్చుకుని, తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే ఇటువంటి క్షణం, చరిత్రలో అరుదుగా వస్తుంది ! మనమంతా భారత దేశం కోసం, దేశ ప్రజల కోసం, అంతకు మించి మానవ జాతి కోసం అంకిత మవుతామనే ప్రతిజ్ఞ పూనేందుకు సరైన సమయం ఈ పవిత్ర క్షణమే!“ 
       అన్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ మాటలు  ( ప్రసిద్ధమైన Tryst with destiny ప్రసంగం )  క్రిందటి తరం లోని ప్రతి వ్యక్తికీ మరపురాని మథుర వాక్యాలు. 
        రెండు వందల సంవత్సరాల ఆంగ్ల పరిపాలనలో తమ  స్వేచ్ఛాస్వాతంత్ర్యాలనూ, జవసత్త్వాలనూ కోల్పోయిన భారతీయులంతా తమ శరీరాల్లోని ప్రతి అణువునూ ఒక చెవిగా చేసుకుని ఆ శుభ వార్త కోసం  ఎదురు చూశారు. ఎడతెగని తుఫాను తాకిడికి నేలవాలిన మహావృక్షపు  శిథిల శేషాల నుంచే సరికొత్త చిగుళ్లు మొలకలెత్తినట్టుగా ఒక కొత్త భారత జాతి జీవం పోసుకుంది. పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పధ్నాలుగవ తేదీ నాటి అర్ధరాత్రి , తెల్లవారితే  పదిహేను అనగా మన భారతావని స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.          
        ప్రపంచంలోని అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం పుట్టిన రోజుగా ఆగస్టు 15 వ తేదీ గొప్ప ప్రాముఖ్యతని సంతరించుకుంది. లక్షలాది దేశభక్తుల త్యాగాల ఫలంగా లభించిన ఈ వరాన్ని దేశప్రజలంతా హర్షాతిరేకంతో స్వాగతించారు. అంతటి ఆనందానికి , కొండంత ఆవేదనను జోడిస్తూ అఖండ భారత దేశం రెండు ముక్కలైంది. హిందూ ముస్లిం అల్లర్లలో లక్షలాది అమాయకులు మాన ప్రాణాలు , ఆస్తులు , ఇళ్లూవాకిళ్లూ తమకలవాటైన పరిసరాలూ కోల్పోయారు.
        చరిత్ర లోకి తొంగి చూస్తే భారత స్వాతంత్ర్య సంగ్రామం  1857 సంవత్సరం లోమీరట్ లో జరిగిన  సిపాయి తిరుగుబాటుతో మొదలయినట్టు కనిపిస్తుంది. అప్పటిదాకా తిరుగుబాటు ఎరుగని బానిసల్లా, తమ చైతన్యాన్ని , స్వేచ్చాప్రియత్వాన్ని మరచిపోయి బతికిన భారతీయుల్లో ఒక్కసారిగా మార్పు తెచ్చిన సంఘటన సిపాయి తిరుగు బాటు అనవచ్చు. బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలన  పట్ల దేశ ప్రజల్లో ఏర్పడ్డ నిరసన భావం 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్దాపనకు దారితీసింది. 1907 లో కాంగ్రెస్ పార్టీలో బాల గంగాధర తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్‌ చంద్ర పాల్ఈ లాల్‌బాల్‌పాల్ త్రయం విదేశీ వస్తు బహిష్కరణకు పిలుపునిచ్చారు. స్వదేశీ ఉద్యమాన్నిలేవనెత్తారు.
       భారత స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటి ప్రజా ఉద్యమం 1905 లో ప్రజ్వరిల్లిన వందేమాతరం ఉద్యమం. 1906 లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన  దాదాభాయ్ నౌరోజీ స్వరాజ్యం కోసం పిలుపునిచ్చారు. అహింసా మార్గంలో సహాయ నిరాకరణోద్యమం ద్వారా అప్పటికే సౌతాఫ్రికా లో భారతీయుల సమాన హక్కుల కోసం పోరాడి గెలిచిన న్యాయవాది గాంధీజీ మాతృదేశం పట్ల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం 1914 లో స్వదేశానికి తిరిగి వచ్చారు.
          జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలాబాగ్  తోట లో రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సమావేశమైన నిరాయుధ స్త్రీ, పురుషులు , పిల్లలపైన, బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పది నిమిషాలపాటు కొనసాగిన ఈ కాల్పుల్లో అధికారిక ప్రకటన వేరుగా ఉన్నా వాస్తవానికి  వెయ్యిమందికి  పైగా మరణించారనీ ,  రెండువేల మందికి పైగా గాయపడ్డారనీ అంచనా.
ఈ సంఘటనకు నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ ఠాకూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును తిరిగి ఇచ్చివేశారు. ఈ సంఘటన 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా  సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. ఆ తర్వాత జరిగిన ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలు స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు. ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ 1930 మార్చి లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం , బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదలిపోవాలని డిమాండ్ చేస్తూ 1942 లో తలపెట్టిన "క్విట్ ఇండియా" ఉద్యమాలలో గాంధీజీ నిర్దేశించిన మార్గంలో  భారత జాతి అంతా నడిచింది. అప్పటివరకు స్వతంత్ర భారతదేశం కోసం  ప్రతిభా వంతమైన  ప్రణాళిక లేక అస్తవ్యస్తంగా నడిచిన భారతప్రజలని గాంధీజీ ఒక్క తాటిపై నడిపించారు. ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం; ఆవేశం స్థానంలో అహింసను ఆయుధాలుగా గాంధీజీ మలచిన తీరు ప్రపంచదేశాలను విస్మయానికి గురి చేసింది.
     లాలా లజపతి రాయ్ , సరోజినీ దేవి, సర్దార్ వల్లభభాయి పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ , బాబూ రాజేంద్రప్రసాద్, గోపాలకృష్ణ గోఖలే, టంగుటూరి ప్రకాశం పంతులు, సర్వేపల్లి రాధాకృష్ణన్,చక్రవర్తి రాజగోపాలాచారి  వంటి గాంధేయవాదులూ, రాజ్ గురు , సుఖ్ దేవ్, ఖుదీరామ్ బోస్, మదన్ లాల్ ధింగ్రా, చంద్రశేఖర ఆజాద్ , సుభాష్ చంద్ర బోస్  వంటి విప్లవ యోధులూ, అకుంఠిత దీక్షతో లక్ష్యసాధనే ధ్యేయంగా స్వాతంత్ర్యసంగ్రామంలో అనితర సాధ్యమైన పాత్రలను పోషించారు. లాఠీ దెబ్బలకూ , కఠినమైన జైలు జీవితానికీ  వెరవకుండా తమ ఆస్తిపాస్తులనూ, కుటుంబ జీవన సౌఖ్యాన్నీ త్యజించి, మాతృభూమి దాస్యవిమోచన కోసం  ఆత్మార్పణ  చేశారు.
    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత దేశాన్ని ఇంకా పట్టి ఉంచగలిగే శక్తి తమకు లేదని ఆంగ్లేయులు గ్రహించారు. భారతం లో పోటెత్తుతున్న స్వాతంత్ర్యపోరాటపు ఉధృతి , ఇక ఈ దేశంపై పరాయి పాలన సాగదని వారికి తెలియజెప్పింది. 1947 ఆగస్టు 15 వ తేదీన భారతదేశానికి స్వరాజ్యం సిధ్ధించింది. అఖండ భారతం రెండు దేశాలుగా విడిపోయింది . ఢిల్లీ రాజధానిగా భారత్ , కరాచీ రాజధానిగా పాకిస్తాన్ ఏర్పడ్డాయి. మహ్మదాలీ జిన్నా, ముస్లిం రాజ్యమైన పాకిస్తాన్ కి గవర్నర్ జనరల్ గా కరాచీలోనూ , స్వతంత్ర భారత దేశానికి మొదటి ప్రధానమంత్రిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీలోనూ ప్రమాణ స్వీకారం చేశారు.
     మిన్నంటే ఉత్సవ సంబరాల నడుమ జాతిపిత మహాత్మా గాంధీ కోసం ప్రజలంతా ఎలుగెత్తి పిలిచారు, ప్రార్థనలు చేశారు.కానీ మహాత్ముడు ఈ ఉత్సవానికి దూరంగా కలకత్తాలో ఉండి, దేశ విభజన , తదనంతరం చెలరేగిన మతకలహాల  వల్ల దు:ఖితుడై , 24 గంటల ఉపవాస దీక్షలో మునిగి, హిందూ ముస్లిం సఖ్యతను, శాంతినీ కోరుతూ ప్రసంగించారు. లార్డ్  మౌంట్ బాటన్  గవర్నర్ జనరల్ గా మరొక పది నెలల పాటు స్వతంత్ర పరిపాలనకు తోడ్పాటునందించారు. ఆ తర్వాత గవర్నర్ జనరల్ గా పదవీ బాధ్యత చేపట్టిన చక్రవర్తి రాజగోపాలాచారి , ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూల సారథ్యంలో స్వతంత్ర భారతదేశం మనుగడ సాగించింది.
    మన జాతీయపండుగలు మూడింటిలో స్వాతంత్ర్యదినోత్సవం ఒకటి  (మిగిలిన రెండూ రిపబ్లిక్ డే, మహాత్మా గాంథీ పుట్టిన రోజు) . భావి తరాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం తమ ప్రాణాలర్పించిన  త్యాగ ధనులకి మన మంతా నివాళులర్పించే రోజిది. ఈ సందర్బంగా  పాఠ శాలల్లోనూ, కళా శాలల్లోనూ ఆకాశవాణి, దూరదర్శన్ వంటి ప్రసార మాధ్యమాల్లోనూ అనేక రకాల పోటీలూ, ప్రత్యేక కార్యక్రమాలూ చోటుచేసుకుంటాయి . బహుమతి ప్రదానోత్సవాలు జరుగుతాయి. ప్రధాన మంత్రి, దేశ రాజధాని ఢిల్లీ లోని ఎర్రకోట పైన జాతీయ పతాకాన్ని ఎగరేసి, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర రాజధానీ నగరాల్లో కూడా పతాకావిష్కరణ , సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రంగు రంగుల దీప తోరణాలు కార్యాలయాల మీద , గృహ సముదాయాల మీదా తళుకులీనుతుంటే, కూడళ్ళ లోనూ, ఇంటి పైకప్పుల మీదా, ప్రభుత్వకార్యాలయాల మీదా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంటే, ప్రజలంతా దేశ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజుని గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు . విదేశాల్లో కొన్ని ప్రాంతాలలో  ఆగస్టు పదిహేనవ తేదీని ఇండియా డే గా వ్యవహరిస్తారు.
       జాతీయపతాకం ఎగరేయడంలో పాటించాల్సిన  పద్దతులు, సంప్రదాయాలు కేంద్రప్రభుత్వం రూపొందించిన ఫ్లాగ్ కోడ్-ఇండియా లో కనిపిస్తాయి. ఈ కోడ్ ప్రకారం  మన జాతీయపతాకం లో ఆకుపచ్చ, తెలుపు, నారింజరంగుల్లో కనిపించే అడ్డ పట్టీలు ఒకే వెడల్పులో ఉండాలి. మధ్యలో ఉన్న తెలుపురంగు పట్టీపైని నావిక నీలి ధర్మచక్రంలో 24 గీతలుండాలి. అన్ని గీతల మధ్య దూరం సమానంగా ఉండాలి. దీనికి వాడే వస్త్రం చేనేత వస్త్రమై ఉండాలి. జాతీయపతాకంలో కాషాయరంగు అగ్రభాగాన ఉండాలి. పతాకాన్నిఏవిధమయిన ప్రకటనలకు ఉపయోగించరాదు. జాతీయపతాకం వాడుకలో ఫ్లాగ్ కోడ్-ఇండియా లోని  నియమాలన్నీ పాటించాలి .
       దేశ విభజన సమయంలో మొదలైన దారుణ మారణహోమం తర్వాత మన దేశంలో అనేకసార్లు మత పరమైన కల్లోలాలు చెలరేగాయి.1961లో జబల్పూర్ లో,1979 లో జమ్ షె డ్ పూ ర్ , ఆలీ గర్ లలో , 1980 లో మొరాదాబాద్ లో హిందూ ముస్లిమ్ ల మధ్య రేగిన కలహాలలో వేలమంది ప్రాణాలు కోల్పోయారు.1984 లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో ప్రజ్వరిల్లిన సిక్కుల ఊచకోత పదిహేను రోజులపాటు కొనసాగింది. 1992 లో తీవ్ర రూపం దాల్చిన అయోధ్య లోని బాబ్రీ మస్జిద్ – రామ జన్మ భూమి వివాదం ఎంత మందిని పొట్టన పెట్టుకుందో లెక్కలేదు. అలాగే 2002 లో గుజరాత్ లో ని గోద్రాలో మొదలైన విధ్వంసం  వేలమంది మృతికి కారణమై ఇరు వర్గాల లోనూ మరచిపోలేని తీవ్రమైన గాయాలను మిగిల్చింది. 2008 లో ఒడిశా లో మత మార్పిడుల నేపధ్యంలో తలెత్తిన హిందూ క్రిస్టియన్ మతకలహాలలో ఇరవై మంది చనిపోగా పన్నెండు వేల మంది నిర్వాసితులయారు.
       2012 జూలై లో అస్సామ్ లో  బోడోలకూ, ముస్లింలకూ మధ్య మొదలైన  కలహాలు  అతి త్వరలో దాదాపు వంద మంది మరణానికీ ,నాలుగు లక్షల మంది నిరాశ్రయులవడానికీ దారితీసింది. ఒక ప్రజాస్వామిక దేశమైన భారత దేశం లో ఒక ప్రాంతానికి చెందిన వారిపై హింసకు పాల్పడడం, వారు ఇతర ప్రాంతాలలో వృత్తి ఉద్యోగాలు సాగించకుండా అడ్డుకోవడం, వారిని భయభ్రాంతులను చేసి , స్వస్ధలాలకు తరిమి వేయడం ఇటీవలి కాలంలో మొదలైన విచారకరమైన పరిణామం. చట్టవ్యతిరేకంగా అస్సామ్ లోకి చొరబడిన బంగ్లాదేశీయుల వల్ల ఈశాన్యప్రాంతాల రక్షణ వ్యవస్థ, ఉద్యోగావకాశాలే కాక దేశ భద్రత కూడా ముప్పు ఏర్పడుతోందన్నది జగమెరిగిన సత్యం.
       ఈ మతకలహాలన్నిటి వెనకా అంతర్జాతీయ మతోన్మాద శక్తుల ప్రమేయం ఉందని తెలిసినా, తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాద కార్యకలాపాలను చూసీ చూడనట్టు వదిలేసే అగ్ర రాజ్యాలు, తమ రాజకీయ తంత్రాల కోసం ప్రపంచ శాంతిని పణంగా పెడుతున్నాయి. దశాబ్దాలుగా శాంతి కాముక దేశమైన భారత్ , పొరుగు దేశపు పన్నాగాలలో,  వారు నిరంతరాయంగా సృష్టిస్తున్న ఉగ్రవాదపు జ్వాలల్లో చిక్కుకుని హింసకు గురవుతుంటే చోద్యం చూస్తున్న అగ్రరాజ్యం  , ఆ మంట మిన్నంటి తమనంటుకునే సరికి  ఉగ్రవాదమన్నది అప్పుడే మొదలైనట్టూ , తమ దేశం ఒక్కటే ఆ దుష్ఫలితాలకు గురైనట్టూ గంగవెర్రులెత్తడం ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞులందరినీ విస్తుపోయేలా చేసింది.
           లంచగొండితనం , మతోన్మాదాలకు తోడుగా ఉగ్రవాదం మన దేశ ప్రగతినెంతగా అతలాకుతలం చేస్తోందో తెలుసుకోవాలంటే మనకు స్వాతంత్ర్యం వచ్చాక గడచిన అరవై ఆరు సంవత్సరాలలో కేరళ , తమిళనాడు , కోయంబత్తూరు, ఆంధ్ర ,కర్ణాటక , మిజోరం, మణిపూర్, త్రిపుర , అస్సాం, నాగాలాండ్, వారణాసి, అయోధ్య, ఢిల్లీ, పంజాబ్ , బీహార్, జమ్మూ, కాశ్మీర్, పూనా, ముంబై ..ఇలా దేశంలోని అనేక రాష్ట్రలలో, ప్రధాన పట్టణాలలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులను పరిశీలించాలి. ఈ దాడుల వల్ల జరిగిన తక్షణ ధన , ప్రాణ నష్టం  ఒకెత్తయితే , నిందితులను పట్టుకోవడానికీ , కోర్టులలో వారి విచారణకూ , జైళ్లలో వారి పోషణ కూ అయ్యే  ధననష్టం  మరొక ఎత్తు.  ప్రాణాలకు తెగించి పట్టుకున్న నేరస్థులను బేషరతుగా విడిపించుకుందుకు ఉగ్రవాద సంస్థలు విమానాల హైజాకింగ్  వంటి దారులనెంచుకోవడం వల్లా, ఉక్కు పాదంతో వారి ఆగడాలను అణచలేని ప్రభుత్వాల మెతకదనం  వల్లా ఎదురయ్యే బహుముఖమైన నష్టం ఇంకొక ఎత్తు.
        2008 సంవత్సరం నవంబరు 26 వ తేదీన ముంబై లో ఛత్రపతి శివాజీ టెర్మినస్ లోనూ, తాజ్ మహల్ పాలెస్ హోటల్ , ఓబరాయ్ ట్రైడెంట్ ల పైనా జరిగిన దాడికి కారకులైన వారిలో పట్టుబడిన ఒకే ఒక్క ఉగ్రవాది అజ్మల్ కసబ్ ని, సుదీర్ఘ విచారణానంతరం 2012 నవంబరు 21 న ఉరితీసే వరకు మన ప్రభుత్వం అతని మీద పెట్టిన ఖర్చు(ప్రభుత్వ లెక్కల ప్రకారం)  29.5 కోట్లు ! బాధితుల కుటుంబాలకి ఇచ్చిన నష్ట పరిహారం , ఆ ఘటన కు సంబంధించిన ఇతర ఖర్చులు  లెక్కిస్తే మొత్తం ఖర్చు వంద కోట్లు దాటిందని ఒక అంచనా.
       స్వతంత్ర భారతి పుట్టిన నాటి నుండి నేటి వరకు  మన దేశం మరే ఇతర దేశం పైనైనా దండెత్తిన, దాడి చేసిన సంఘటన ఒక్కటి కూడా లేదు. మన దేశం కళల కాణాచి. అతిథులెవరైనా సరే ఆదరించడమే మనకు తెలుసు. స్నేహానికి చిరునామా ఉంటే అది మన దేశమే. 1600 లకు పైగా గుర్తించబడ్డ భాషలున్న, అనేక మతాలూ, సంస్కృతులు మిళితమైన  మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక .
       “నేను భారత దేశం నలు చెరగులా తిరిగాను గాని ఒక్క బిచ్చగాడిని గాని, ఒక్క దొంగని గాని చూడలేకపోయాను. అంతటి సంపద, అంతటి నైతిక విలువలు, సామర్థ్యమూ ఉన్న ప్రజలని చూశాక ఇలాంటి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఈ దేశపు వెన్నెముకని విరిస్తే గాని సాధ్యపడదని నాకర్ధమైంది. ఈ దేశపు బలమంతా వీరి ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం లో ఉంది. వీరి ప్రాచీన విద్యా విధానాన్ని, సంస్కృతినీ తొలగించి , ఆంగ్ల భాషా, సంస్కృతులే గొప్పవని వారనుకునేలా చేయగలిగితే , భారతీయులు వారి ఆత్మ గౌరవాన్నీ , తమదైన సంస్కృతినీ కోల్పోయి మనకు వశమవుతారు   
     1835 వ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగిస్తూ మన దేశం గురించి అన్న మాటలివి !
    “ పలు మతాల భాషల పరిమళాల కదంబం ,
      పలు రీతుల సంగమం మా భారత కుటుంబం !
     సకళకళారామమిదే మా నివాసము ,
     అందరినీ ఆదరించు స్వర్గధామము
     ఇలాతలము పై వెలసిన స్నేహ దీపము , 
     సమత మమత రూపమే మా దేశము ! ”
     అంటూ సగర్వంగా ప్రకటించే పాట విన్నపుడు నేటి అల్లకల్లోల పరిస్ధితులు గుర్తొచ్చి ఆ వర్ణన అతిశయోక్తిగా అనిపించినా  చరిత్రలో మన దేశం గురించి విదేశీ పర్యాటకుల అభిప్రాయాలు చదివితే, మన నిజ స్వరూపం ఇదేనని , శతాబ్దాల పరాయి పాలనలో మనం మన మూలాలని కోల్పోయామనీ అర్ధమౌతుంది.
     రాజకీయ రంగం లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేళ్లూనుకుపోయిన లంచగొండితనం, సామాన్య పౌరుల్లో నిండిపోయిన అలసత్వం, ఆరోగ్యకరమైన సమాజంలో సగభాగమై నిలవాల్సిన స్త్రీ పట్ల గౌరవం లేకపోవడం, సమిష్టి సంపదల పట్ల , సదుపాయాల పట్ల మనం కనపరచే బాధ్యతారాహిత్యం  గమనిస్తే  ముందు తరాల భవిష్యత్తు కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం తమ ప్రాణాలనే అర్పించిన మహాపురుషుల త్యాగానికి మనం అర్హులమేనా అనే ప్రశ్న అంకుశమై పొడుస్తుంది.
      ఎంత అరకొర దుస్తులు ధరించిన స్త్రీనైనా ముందు మనిషిగా చూసే దేశాల పక్కనే నిండుగా దుస్తులు ధరించినా, నిండా నాలుగేళ్లు లేని పాపాయి నైనా హృదయస్పందన లేని భోగవస్తువుగా పరిగణించే మనవారి అనాగరికత తల దించుకునేలా చేస్తుంది. గనుల కుంభకోణాలూ, నదులపై అనుమతులే లేని ప్రాజెక్టులూ, వాటి వల్ల ఏర్పడుతున్న విధ్వంసాలూ గమనిస్తే సహజవనరుల పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల  మన నిర్లక్ష్యం  గగుర్పాటు కలిగిస్తుంది !
       ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు పదవినడ్డం పెట్టుకుని స్వాహా చేసిన వేల కోట్ల ప్రజా ధనం , ప్రభుత్వోద్యోగుల అన్యాయార్జితమైన నల్లధనం స్విస్ బ్యాంకులలో మూలుగుతున్నా, అక్రమాస్తుల రూపంలో కళ్లెదుట కనిపిస్తున్నా, మన ప్రభుత్వం పార్టీ ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్టుండిపోవడం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రభుత్వాలెన్ని మారినా  ఉగ్రవాదాన్ని అణచడం పట్ల మన వైఖరి ఒకలాగే ఉంది. మన శాంతి కాముకత పొరుగు వారి దృష్టికి అసమర్థతగా, చేయెత్తి  పిలుస్తున్న అవకాశంగా పరిణమిస్తోంది !
       “పదవీ వ్యామోహాలూ, కుల మత భేదాలు , భాషా ద్వేషాలూ చెలరేగే నేడు
         ప్రతి మనిషీ మరియొకరిని దోచుకునే వాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునే వాడే !
        ఆకాశం అందుకునే ధరలొక వైపు అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు
        అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు అలముకున్న ఈ దేశం ఎటు దిగజారు ? “ 
       అయిదు దశాబ్దాల క్రితమే మహాకవి శ్రీ శ్రీ  రచించిన ఈ గీతం నేటి పరిస్థితులకీ అద్దం పడుతోందంటే , కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్న సమస్యలనెదుర్కొని పరిష్కరించుకోవడంలో మనమెంత విఫలమౌతున్నామో స్పష్టమౌతోంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్నెదిరించి అహింసా మార్గంలో వారిని తరిమి కొట్టగలిగిన మన పూర్వుల మానసిక, నైతిక, ధార్మిక శక్తి కి మనం వారసులం కాలేక పోతున్నామన్న చేదు నిజం స్పష్టమౌతుంది.
      అయితే ఇటీవల సీబీఐ వెలికి తీసిన కుంభకోణాలు, వాటి పూర్వా పరాలూ చూస్తే ఎంత పెద్ద పదవి లో ఉన్న వారి పైనైనా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం, ఒత్తిళ్లకు లొంగకుండా అరదండాలేయడం గమనిస్తే కారుచీకట్లలో సుదూరంగానైనా ఒక కాంతిపుంజం కనిపించి మన దేశ ఉజ్వల భవిత పట్ల కొద్దిపాటి నమ్మకం కలుగుతుంది. దేశ రాజధానిలో జరిగిన నిర్భయ అత్యాచారం పట్ల ప్రజానీకపు ప్రతిస్పందన గమనిస్తే సామాన్యుల్లో ఇప్పటి వరకు కనిపించిన అలసత్వం , నీరస స్వభావం క్రమక్రమంగా తొలగిపోయి దేశ యువతలో వివేకానందుడు ఉద్బోధించిన కార్యశూరత్వం, దేశ వ్యాప్తంగా గాంధీజీ కలలుగన్న ప్రజాస్వామ్యం సాధ్యమౌతాయన్న ఆశ కలుగుతుంది.
     మూడు దశాబ్దాలలో సామాజికంగానూ, పర్యాటక రంగంలోనూ, పర్యావరణ పరిరక్షణలోనూ, రక్షణ వ్యనస్ధ పరంగానూ, విలువల్ని పరిరక్షించుకోవడం లోనూ అద్బుతమైన ప్రగతి సాధించిన అతి చిన్న దేశం సింగపూర్. నిబధ్ధత , దార్శనికత ఉంటే ఆ దేశ పురోగతికి ఆకాశమే హద్దని నిరూపించింది. చెప్పుకోదగ్గ సహజ వనరులేవీ లేకపోయినా ప్రపంచంలోనే అతి తక్కువ నేరాలు నమోదయ్యే ఈ దేశం ఎన్నదగ్గ ఆర్ధక సుస్థిరతనీ, పురోగతినీ సాధించి , ప్రపంచదేశాల నడుమ సగర్వంగా నిలబడింది. పరిపాలనలో ఏ విధమైన శిక్షణా లేని వ్యక్తులు ప్రజా ప్రతినిధులై ; విద్యాధికులై , శ్రమకోర్చి, శిక్షణ పొందిన ప్రతిభగల అధికారులపై హుకుం చలాయించే వ్యవస్థలో మార్పు రావాలంటే మన లక్ష్యం సరైన వ్యక్తులనెన్నుకోవడం వైపుండాలి. వ్యక్తులలో మార్పు, వ్యవస్ధలో మార్పుకి దారితీస్తుందనేది జగమెరిగిన సత్యం. మనలో సమిష్ఠిగా వచ్చే మార్పే మన దేశ భవితను మార్చగలదు.
       స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబర పడగానే సరికాదోయీ,
       సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయీ !
       ఆగకోయి భారతీయుడా! కదలి సాగవోయి ప్రగతి దారులా!

అంటూ శ్రీ శ్రీ పలికిన విజయగీతికను ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మననం చేసుకుంటూ, ప్రగతి దారుల్లో కదలి సాగేందుకు అందరమూ సన్నద్ధులమౌదాం!                                           ****

No comments:

Post a Comment