August 6, 2012

కర్మయోగి

 ముందుకొచ్చి తొంగి చూస్తూ చప్పరించి వెనకడుగేస్తూ 
ఎంతసేపో ఎదురుతెన్నులు చూశాక
దూరంగా...ఆకాశం నేలా కలిసే చోట
చుక్కలా ప్రత్యక్షమౌతావు  !     
వంపులు తిరుగుతూ, తోకచుక్కలా సాగుతూ ముందుకొస్తావు   
చెవులు గింగుర్లెత్తిస్తూ   దృష్టి పథాన్నాక్రమిస్తావు   
రొప్పుతూ రోజుతూ దగ్గరకొచ్చి నిట్టూరుస్తూ ఆగుతావు 
లోపల్నుంచి మనుషుల్నీ వస్తువుల్నీ బయటికి నెట్టేస్తూ 
చుట్టుముట్టిన కొత్తవాళ్ళని 
ఆత్రంగా ,అస్తవ్యస్తంగా ,అయస్కాంతంలా నీలోకి లాక్కుంటావు !
ఆయాసం  తీరేదాకా , స్వేద బిందువులారేదాకా   
కాస్తంత విశ్రాంతి తీసుకుంటావో లేదో 
భారంగా శరీరాన్నీడుస్తూ   మళ్ళీ ప్రయాణమౌతావు ...   
రవ్వంత దూరం సాగేసరికి సత్తువొస్తుంది కాబోలు
సర్రున దూసుకుపోతావు ! 
కిటికీ రెప్పలు తెరిచి పక్క చూపులు చూసుకుంటూ 
పగలనక రాత్రనక పరుగులు పెడతావు !

పంట పొలాలు పచ్చటి తివాచీ పరచినా 
నదులూ కాలువలూ రవ్వల పువ్వులు విసిరినా
వెండి మబ్బుల గాలిపటాలు వినువీధిలో విహరించినా
చెట్లూ గట్లూ ఉత్సాహం పట్టలేక పరుగులు తీసినా 
అలా  కళ్ళప్పగిస్తావే గాని నీలో ఏమార్పూ కనపడదు !
కొండ అంచుల్లోనూ, అడవి నట్టింట్లోనూ,లోయ వాలుల్లోనూ 
పైకి పోయే పొగని పట్టుకు వేళ్ళాడుతూ
పూరిపాకలు కనపడగానే 'కుహూ..'అని పలకరిస్తావు
ఆమని వస్తోందని ఆశలు కల్పిస్తావు ! 

ఎక్కడో  ఎప్పుడో ఓ చోట ఆగనా వద్దా అని ఆలోచనలో పడతావు 
తక్కుతూ తారుతూ నిక్కుతూ నీలుగుతూ 
జనంలో కొస్తావు...ఒకటే మొహమాటం నీకు 
అంతటి  సంకోచం నీకే గాని 
నీకోసం ఎదురు చూసేవాళ్ల౦దరికీ   ఎంత సంబరమో !
వేల చేతులతో నిన్ను తడిమి 
టీలూ కాఫీలూ పూలూ పళ్ళూ ఇడ్లీ వడా పూరీ ఉప్మా 
ఒకటేమిటి  సమస్తం అందిస్తారు 
కాలక్షేపానికి వార పత్రికలూ వార్తా పత్రికలూ పల్లీలూ బఠానీలూ 
అన్నీ తెచ్చిచ్చి తీసుకోమని  ప్రాధేయ పడతారు  !

అలాంటపుడు నీకెంత నిర్లక్ష్యమో !
పుచ్చుకున్నంత  పుచ్చుకుని విదిలించి పారేస్తావు !
వెంటపడి వేడుకుంటుంటే నిర్దయగా వదిలేసి ముందుకి సాగిపోతావు
ఎంత కాఠిన్యం అనిపిస్తు౦దొకోసారి  !
అది కాఠిన్యం కాదు కర్తవ్యం అంటావు !

ఆ మూల నించీ ఈ మూల దాకా రోజుల తరబడి ప్రయాణాలు సాగిస్తావా 
ఎక్కడో ఒక చోట కాళ్ళు బారజాపి నిద్రకు పడతావు 
కదలవు మెదలవు 
కుంభకర్ణుడి  తమ్ముడిలా 
చప్పుడన్నది లేకుండా పడి వుంటావు 
దిక్కులేని జీవాలు నిన్నాసరా చేసుకుని 
నీ నీడన చోటు చూసుకున్నా, ఎక్కి తొక్కినా 
కిమ్మనకుండా ఊరుకుంటావు  !
అపుడేమో నీ జాలి గుండెకి కళ్ళు చెమ్మగిల్లి చూపు మసకేస్తుంది !

బడలిక తీరి కాస్తంత శక్తి పుంజుకోగానే 
' ద  షో మస్ట్ గో ఆన్ ' అంటూ 
ఆగమని నీ వెంటపడే వాళ్ళని 
అదిలించి విదిలించి ఎలాగో వొదిలించుకుని 
ముందుకి సాగిపోతావు  !

గొప్ప కర్మయోగివి సుమా నువ్వు !                                                      


4 comments:

  1. ఏమైయ్యుంటు౦దా అని ఉత్కంఠతో చదివాను. భలే వ్రాశారు.

    ReplyDelete
  2. ధన్యవాదాలండి జ్యోతిర్మయి గారు !

    ReplyDelete