January 5, 2012

ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం లో మొదటి రోజు(1 -1 -2012 ) కథ ' సహ జీవనం'

                                              సహ జీవనం
                                                                           ------- వారణాసి నాగలక్ష్మి

     “రెండేళ్ళకొకసారయినా పుట్టింటికి రావడం మానేశావు. ఈ సారయినా సంక్రాంతికి మనవలిద్దరితో, అల్లుడుగారితో వచ్చి మాతో నాలుగు రోజులు గడుపుతావని ఆశిస్తున్నాను' ఈ వాక్యాలమీదే హారిక చూపు ఆగిపోయింది. ఆ కింద రంగనాథం గారు అల్లుడినాహ్వానిస్తూ రాసిన నాలుగు లైన్లు...
           పిల్లలు చిన్నగా వున్నపుడు ఏడాదికోసారయినా పుట్టింటికి వెళ్ళడం, తీయని జ్ఞాపకాలు మూట కట్టుకుని వెనక్కి రావడం జరిగేది. అంజలి తొమ్మిదో తరగతికొచ్చినప్పటి నుంచీ స్కూలూ, కోచింగులతో జీవితం పరుగు పందెంలా మారిపోయింది. నాలుగు రోజులు ఆ పల్లెటూరిలో గడపడమంటే అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అనే భావనలో పడిపోయారు తనూ భర్తా. ఇంట్లో ఒక్కటొక్కటిగా చోటుచేసుకున్న ఎలెక్ట్రానిక్  వస్తువులూ ఆధునిక సదుపాయాలకలవాటు పడిన  పిల్లలు, తాతగారి ఊరు ప్రయాణం అనగానే 'అబ్బా, కంపూటర్ వుండదూ, డబ్బా టీవీ, ఇష్టమైన చానల్సు ఏవీ రావు అంటూ అభ్యంతరాలు చెప్పడం మొదలెట్టారు. అమ్మమ్మా, తాతగార్లు  పెళ్ళికో, పేరంటానికో వస్తూ, పచ్చళ్ళూ, స్వీట్లూ పట్టుకొచ్చి, కూతురింట్లో నాలుగురోజులుండి వెళ్ళడమే గాని, వీళ్ళు ఆ వూరికి వెళ్ళి అయిదేళ్ళు దాటిపోయింది.
            ఇపుడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువు తున్న అంజలికి  సెమెస్టర్ పరీక్షలై సెలవులిచ్చారు. సుమంత్ తొమ్మిదోతరగతి. వాడికీ హాఫియర్లీ పరీక్షలై సంక్రాంతి సెలవులిచ్చారు.వెళ్తే ఇప్పుడే వెళ్ళాలిఅనుకుంది హారిక.
             సాయంత్రం పిల్లలొచ్చాక అమ్మమ్మ ఉత్తరం చదివి వినిపిస్తూ తన ఆలోచన చెప్పింది హారిక.
            "అమ్మా..ప్లీజ్! నేనీ సెలవుల్లో స్నో వర్ల్ద్ కి వెళ్లాలనుకున్నా. నాలుగైదు సినిమాలు చూడాలనుకున్నా. సమ్మర్ లో మాకు సెలవులుండవు తెల్సా?నైంత్ అవుతూనే టెంత్ పోర్షన్ మొదలు పెట్టేస్తార్ట!అన్నాడు సుమంత్. అంజలి అంతకంటే విసుగ్గా మొహం పెట్టి ఏముందమ్మా ఆ వూళ్ళో దోమలూ, పేడా, మురుగూ తప్ప" అనేసింది.
హారిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పిల్లల్ని చూస్తూ వుండిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి.
"అంజూ! తాతగారిల్లు అంటే  మీకోసం కళ్ళలో వత్తులేసుకుని ఎదురుచూసే అమ్మమ్మా, తాత గారూ కాకుండా మీకు గుర్తొచ్చినవి దోమలూ, పేడా, మురుగూనా?" అంది.
   "అలా ఇమోషనల్ అయిపోతావెందుకమ్మా? తాతగారూ, అమ్మమ్మా అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి మనతో కొన్నాళ్ళుండి వెళ్తున్నారుగా.. వాళ్ళ కోసం ఆ వూరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ దోమలు కుట్టాయంటే ఇంతింత దద్దుర్లు! స్నానానికి గీజర్ లేదు, షవర్ లేదు, గోలెంలో నీళ్ళకి మూత కూడా వుండదు. టాయ్ లెట్స్ కోసం పెరట్లో అంత దూరం పోవాలి" ఇద్దరూ వరసగా తమ ఫిర్యాదులు చెప్పేస్తూ వుంటే హారిక లేచి లోపలి          కెళ్లిపోయింది.
           అంజలి భుజాలెగరేసి ఆ విషయాన్ని వెంటనే బుర్ర నించి తీసేసింది. చేతిలో సెల్ ఫోన్ లోంచి ఎస్సెమ్మెస్ లు పంపించడం, అందుకోవడం ఊపిరి పీల్చినంత సులభంగా సాగిపోతుంటే  చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుంది. సుమంత్ కంప్యూటర్ గేమ్ లో లీనమైపోయాడు.
      చీకటిపడే వేళకి శ్రీహరి వచ్చాడు. అతనికి టీ,స్నాక్స్ తెచ్చిచ్చి, తండ్రి ఉత్తరం అందించింది.
          "సరే ..పిల్లలకి కుదిరితే మీరు ముగ్గురూ వెళ్ళండి. నాకు ఆఫీస్ లో వీలయ్యేలా లేదుఅన్నా డతను.
పిల్లలన్న మాటలు చెప్తే  ఆశ్చర్యపోతూ చూశాడు."అలా అన్నారా? అంటే ఈ సౌకర్యాలు లేని చోట వాళ్ళు వుండలేని స్థితికి వచ్చేశారన్న మాట! ఇందులో మన తప్పే ఎక్కువుంది..వాళ్ళని నేనొప్పిస్తాలే..మీరు ముగ్గురూ వెళ్దురుగాని "అన్నాడు.
             అన్నట్టుగానే ఏం చెప్పాడో గాని పిల్లలిద్దరూ ఒప్పుకున్నారు. చిన్నప్పటిలా అమ్మతోపాటు రాత్రి బస్సెక్కి తెల్లారి తాతగారి ఊరు చేరేసరికి  బాల్యజ్ఞాపకాలెన్నో గుర్తొచ్చాయి ఇద్దరికీ. హారిక కైతే అలవాటు లేని ప్రయాణం వల్ల నడుమూ, కాళ్ళూ పట్టేసినా బస్సు దిగేసరికల్లా చల్లని ప్రభాత పవనాలు చుట్టేసి, మంచు తెరలూ, కళ్ళాపి చల్లిన వాకిళ్ళూ కనిపించి మనసు బాల్యంలోకి పరుగులు తీసింది.
ఎవరి సామాను వాళ్ళు అందుకుని నడుస్తుంటే సుమంత్ హారికతో "చిన్నప్పుడు కొన్ని పనులు ఎంత సిల్లీగా చేసే వాళ్ళమో గుర్తొస్తే నవ్వొస్తోందమ్మా! బస్సులో వస్తుంటే నాకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒకసారి అమ్మమ్మ డబ్బులిస్తే నేనూ, అక్కా, రాజూ, బుజ్జీ, చింటుగాడూ బటాణీలు కొని తెచ్చుకున్నాం. ఇంటికొచ్చాక వాటిని పంచుకున్నాంఅంటూ ఏదో చెప్పబోయాడు. వాడిమాటలు పూర్తి కాకుండానే అంజలి పక పకా నవ్వుతూ "వీడు ఒకటే ఏడుపమ్మా నాకు తక్కువొచ్చాయీ, రాజుగాడికి ఎక్కువొచ్చాయీ అంటూ. అపుడు తాతగారొచ్చి అయిదుగురినీ గుండ్రంగా కూర్చొబెట్టి, బటాణీలు ఒక్కొక్క గింజా ఓపిగ్గా పంచారు. ఆఖరికి ఒక్క గింజ మిగిలింది. ఆ గింజ మా అందరికీ చూపించి పక్కన కాలవలో పడేశారు!"అంది.
సుమంత్ కూడా నవ్వుతూ"అలా పారేశారేంటి తాతగారూ అంటే ఆ ఒక్కటీ ఎవరికిచ్చినా గొడవే కదర్రా అన్నారు. పోనీ మీరు తినక పోయారా? అంటే నాకూ మీ అమ్మమ్మకీ బటాణీలు తినే పళ్ళు కావురా అన్నారు" అన్నాడు. హారిక తండ్రి హాస్యచతురత తలుచుకుని నవ్వుకుంది.
           ఇల్లు చేరేసరికి వాకిట్లో ముగ్గేస్తున్న సీతమ్మ ఎదురొచ్చింది.
          తల్లి ఆయాసపడడం గమనించి "ఈ చలిలో అలా వంగి ముగ్గులేస్తే ఆయాసం రాదా అమ్మా? నువ్వేస్తున్నావేమిటివ్వాళ? దుర్గమ్మ కేమొచ్చింది రోగం? ఇవాళ పనికి రాలేదా?" అంది  హారిక .
ముగ్గు చెయ్యి తగలకుండా పిల్లలిద్దర్నీ దగ్గరికి తీసుకుంటూ "అయ్యో అదేమిటే ..పండగ పూటా అలా అంటావ్? దానికీ వయసు మీద పడింది పాపం. చలిలో పొద్దున్నే రాలేక పోతోంది. ఎనిమిదింటికొస్తుంది. అప్పటిదాకా పాచివాకిలి ఉంచడం ఎందుకని చెంబుడు నీళ్ళు చల్లి, రెండు ముగ్గు చారలేస్తున్నా"అంది నవ్వుతూ.
"అన్నిటికీ అలా సర్దుకుంటావ్ గనకే వాళ్ళూ నిన్నలా ఆటాడిస్తారుఅంది హారిక లోపలికి దారి తీస్తూ.
"లేదులే ..కొడుకు పెద్దాడై ఇంక నువ్వు పనిచెయ్యక్కర్లేదన్నా ఊరికే ఇంట్లో కూర్చుని తినలేనని చెప్పి మన ఇల్లొక్కటే చెస్తోంది. పండక్కి మాత్రం నాగా పెట్టద్దనీ, పిల్లలొస్తున్నారనీ చెప్పాఅంది సీతమ్మ. వడిలి ముడుతలు పడ్ద తల్లి మొహం చూస్తూ 'అమ్మ ఎంత బలహీనంగా కనిపిస్తోందో' అనుకుంది. మనవలిద్దరూ తాతగారిని గాఢంగా హత్తుకున్నారు. తండ్రిని పరీక్షగా చూస్తూ ఏడాదిలోనే ఇంత మార్పా?’ అనుకుంది దిగులుగా.
వేడిగా కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే పక్కింటి అనసూయమ్మ మంచి నీళ్ళు పట్టుకోడానికి వచ్చి,"ఏమిటమ్మా హారికమ్మా? ఇన్నేళ్లపాటు పుట్టింటిక్కూడా రాకుండా ఏమంత రాచకార్యాలు చేస్తున్నావు తల్లీ అంది నిష్ఠూరంగా.
"రాచకార్యాలేం లేవు పిన్ని గారూ! పిల్లల చదువులే రాచకార్యాలు మాకు"అంది నవ్వబోతూ.
"అమ్మకీ, నాన్నగారికీ అంతంత జరాలొచ్చినా పిల్లలెవరూ రాలేదేవిటా అని మేమంతా అనుకున్నం.. ఏమో ఎంతెంత పనుల్లో వున్నారో ఏమో పాపం మీరంతా అందావిడ తేలిగ్గా చురక అంటిస్తూ.
హారిక మనసు చివుక్కు మంది"ఏవిటమ్మా?చాలా ఎక్కువగా వచ్చిందా జ్వరం? చెప్పనేలేదేం?" అంది తల్లి వైపు చూస్తూ.
భలేదానివి..చెప్పక పోవడమేవిటీ? అవాళ నే నీళ్ళు పట్టుకుంటుంటే అమ్మ గారు నీతో ఫోనులో చెప్పలా 'ఇద్దరికీ టెంపరేచరుందనీ కోటయ్య గారొచ్చి మందిస్తున్నారనీ'? మీ అన్నయ్యకీ చెప్పారు, నీకూ చెప్పారు.ఒకళ్ళయినా వస్తారేమో అనుకున్నాయధాలాపంగా అనేసి బిందె నిండడంతో ఆవిడ వెళ్ళిపోయింది.
వెనక నించి సీతమ్మ "అయ్యో అదేవిటండి అల్లా అంటారూ? అంత అవసరమైతే పిల్లలకి కబురు చెయ్యమా, వాళ్ళు రెక్కలు కట్టుకుని రారా?” అంది నొచ్చుకుంటూ.
గేటు దాటుతున్న ఆవిడ"చాల్లెండి చెప్పొచ్చారు! కొడుక్కి చెయ్యి విరిగిందంటేనూ, కోడలికి బెడ్ రెస్టంటేనూ, కూతురికి నడుం పట్టేసిందంటేనూ, మనవరాలికి చికెన్ పాక్సంటేనూ పిలిస్తేనే వెళ్ళారా మీరు? నెల రోజులపాటు పీల్చి పిప్పి చేసే జరాల్తో చిక్కి సగమయ్యారు..కాస్త పత్యం వండి పెట్టడానిక్కూడా కోడలూ రాలా, కూతురూ రాలా.. చాల్లెండి  సమర్ధింపులు"అనడం వినిపించింది.
చిన్నపాటి గాలిదుమారం గిర్రున తిప్పి వదిలినట్టై నల్లబడ్డ మొహంతో అమ్మా నాన్నలవైపు చూసింది హారిక." కాస్త తిక్క మనిషే ఆవిడ ..ఆ మాటలు పట్టించుకోకు. ఏదో రాక రాక పుట్టింటికొస్తే వచ్చిన్రోజే ఈవిడొహర్తివిసుక్కుంది సీతమ్మ.
ఇంతలో దుర్గమ్మొచ్చి "వొచ్చారా పాపగారూ"అంటూ ఇంత మొహం చేసుకుని పలకరించి "అమ్మ గారో..అంట్ల గిన్నెలన్నీ పడేయండి ఒక్కసారే తోమి పోతా"అనడంతో సీతమ్మ లేచి వెళ్ళింది.
సుమంత్ తాతగారి దగ్గరకెళ్ళి "తాతగారూ, ఆవిడకేమన్నా పిచ్చా? మనింట్లో మంచి నీళ్లకి వచ్చి మనతోటే రూడ్ గా బిహేవ్ చేస్తుందేమిటి? మాకన్నా ఆవిడకే మీరంటే ఇష్టమన్నట్టు మాట్లాడుతుందేమిటి?” అన్నాడు కోపంగా.
రంగనాథంగారు చిన్నగా నవ్వి"ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఒకరికొకరు సాయ పడడం ఇక్కడ అలవాటు నాన్నా! మంచి నీళ్ళొక్కటే చూశావు నువ్వు. వాళ్ళింట్లో పూసే మల్లెలూ, గులాబీలూ, కాసే కొబ్బరికాయలూ ఎలా తెచ్చిస్తుందో చూశావా? ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏమిటో మీకు తెలీదురా!" అన్నారు.
తండ్రి చెప్తున్నదేదీ హారిక చెవుల్లో దూరలేదు..ఈ పల్లెటూళ్ళే ఇంత. అందరి విషయాలూ వీళ్ళకే కావాలి అనుకుని చికాకు పడింది.
సీతమ్మ బలవంతం మీద పూర్వకాలంలో లాగా కాకపోయినా నూనె దూమెరుగ్గా రాసుకుని సున్నిపిండితో వొళ్ళు రుద్దుకుని తల స్నానం చేశారు .. హారిక కూరలు తరిగిస్తే సీతమ్మ వంట పూర్తి చేసింది. వంటకాలన్నీ  టేబుల్ మీద అమరుస్తుంటే ఎదురింటి సుందరి వచ్చి హారికనీ పిల్లల్నీ పలకరించి, చిన్న గిన్నెతో  జున్ను  టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. మరో రెండు నిముషాలకి నాలుగిళ్ళ అవతలుండే రాజేశ్వరి వచ్చి'దొడ్డమ్మ గారు చెప్పారు నువ్వొస్తున్నావని..ఇవాళ దొడ్లో కాసిన గుత్తొంకాయలతో కూర చేశా. నీకిష్టమని నాలుక్కాయలు తెచ్చా'..అంటూ చిన్న బౌల్ అందించి వెళ్ళింది. మూత తీసి చూడగానే హారికకే కాదు పిల్లలిద్దరికీ కూడా నోరూరింది.
అంతా కూర్చుని భోజనాలు చేస్తుంటే సుమంత్ అడిగాడు" ఇలా రోజూ చుట్టుపక్కల అందరూ అన్నీ పంచుకుంటారా అమ్మమ్మా?"అని. ఆవిడ వాడి వైపు మురిపెంగా చూస్తూ"రోజూ కాదురా నాగన్నా! ఏవైనా స్పెషల్ చేసుకుంటే ఈ ముసలాళ్ళు తమలా చేసుకోలేరని ఇలా తెచ్చిస్తూంటారు"అంది.
            కళ్ళు మూసుకుని  మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఒక్క క్షణం ధ్యానించి పక్కన పెట్టింది.
"అదేమిటి అమ్మమ్మా?"అడిగింది అంజలి.
"మొదటి ముద్ద పితృ దేవతలని తలుచుకుని పక్కన పెడతారమ్మా"అంది హారిక.
             “మరి తర్వాత దాన్ని పారేస్తారా?"డిగాడు సుమంత్.
"లేదు నాన్నా..మన భోజనం అవగానే ఆ ముద్ద తీసుకెళ్ళి ప్రహరీ గోడ మీదో, నూతి గట్టు మీదో
 పెడితే కాకులూ పక్షులూ తింటాయిఅంది సీతమ్మ.
 “రోజువారీ పనులన్నిటిలో భూత దయని జోడించిన సంస్కృతి మనది అమ్మలూ! నీకు తెలుసుగా చీమలూ, ఇతర కీటకాలూ, పక్షులూ, ముగ్గు అంటే బియ్యప్పిండి తింటాయి. పండగల్లో చేసే ప్రతి పనిలోనూ గమనించి చూస్తే, మనసుకి ఆహ్లాదం కలిగించే కళకి తోడు సహజీవన సూత్రాలు కూడా జత చేసి వుంటాయిఅన్నారు రంగనాథంగారు.
సీతమ్మ "వంటకాలు చల్లారిపోకుండా తినండర్రా"అనడంతో మాటలు తగ్గించి భోజనాలు ముగించారు.
టేబుల్   శుభ్రం చేసి  తల్లితో కబుర్లు చెపుతూ పక్కమీద వాలిన హారికకి నిద్ర ముంచుకొచ్చింది. సాయంత్రమవుతుంటే హాల్లోంచి వినవస్తున్న మాటలకి మెలకువ వచ్చింది.మనవడికి భోగి పళ్ళు పోస్తున్నామనీ, అంజలినీ సుమంత్ నీ కూడా తీసుకుని వస్తే వాళ్లని కూడా పక్కని కూర్చో పెట్టి పళ్ళు పోద్దామనీ అంటోంది అనసూయమ్మ.
"అబ్బే వాళ్ళు అలా రారండీ.పెద్దవాళ్ళయ్యారు గదాఅంటోంది సీతమ్మ.
అక్కయ్య గారూ..భోగి పళ్ళు పోసేది పిల్లలకి దిష్టి తగలకుండా వుండాలని. బస్తీ నించీ పసిడి బొమ్మలా మనవరాలూ, సిసింద్రీ లాంటి మనవడూ వస్తే ఊరి దిష్టి తగలకుండా భోగి పళ్ళు పోసుకుంటే బావుంటుంది. పిల్లలింత పెద్దయ్యాక మీఇంట్లో ఈ పేరంటం  పెట్టుకోరుగదా అని మాఇంట్లో పసివాడితో కలిపి వీళ్ళిద్దరినీ, కుసుమ కూతుర్నీ కూడా కూర్చోపెట్టి పోద్దా మనుకున్నా"అంటోంది అనసూయ. హారిక మనసు ఆవిడ మాటల్లోని ఆత్మీయతకి కరిగిపోయింది.
పొద్దున్న మీకు కోపం వచ్చిందని నాకు తెలుసు లెండి..అయినా పిల్లలకి సేవ చేయించుకోడమే కాదు..చేయడమూ అలవాటు చెయ్యాలి మనం. వాళ్ళు మీ ఆరాలు కనుక్కుని అవసరానికి అడక్కుండానే వచ్చి చేస్తుంటే వాళ్ళ పిల్లలూ నేర్చుకుంటారు..వాళ్లమ్మకవసరమైననాడు వచ్చి చేస్తారు. లేకపోతే రేపెప్పుడో అయ్యో నాకూతురికవసరమైన నాడు దాని కూతురూ, కోడలూ కూడా పట్టించుకోలేదని మీరే బాధపడతారు"అంది. హారిక కళ్ళు చెమర్చాయి.నిజమే.. ఇంత వయసొచ్చి ఎప్పుడూ అమ్మ వచ్చినపుడు ఆవిడ ఇచ్చే ఆసరా కోసం, పుట్టింటికి వెళ్ళినపుడు దొరకబోయే విశ్రాంతి కోసం ఆశిస్తున్నాంఅనుకుంది.
సాయంత్రం భోగి పళ్ళ పేరంటానికి ఎక్కువ బతిమాలించుకోకుండానే వచ్చారు పిల్లలిద్దరూ.
రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిలి తుడిచి, నీళ్ళు చల్లి, పెద్ద రథం ముగ్గు తీర్చారు తల్లీ కూతురూ. పక్క వాళ్ళ ముగ్గులతో పోల్చి తమదే బావుందని మురిసి పోయారు. పక్కలు సర్దుకుని పడుకునే ముందు తల్లి అలమార లోంచి కాలినెప్పులకి రాసుకునే మందు ట్యూబు తీసుకోవడం చూసిన హారిక, ఆవిడ వెనకే వెళ్ళి వద్దంటున్నా వినకుండా కాళ్ళకి మందు మర్దనా చేసింది. అమ్మమ్మ గది లోకి వచ్చిన పిల్లలిద్దరూ నేనూ రాయనా అంటూ పోటీ పడ్డారు. సీతమ్మ నవ్వుతూ"కాళ్ళు రెండే వున్నాయర్రా..ఇంకోటుంటే ముగ్గురికీ మూడూ ఇచ్చేదాన్ని" అంది.
            రాత్రి పిల్లలిద్దరి పక్కనా పడుకుని "మీ సెల్ ఫోన్సూ, ఇయర్ ఫొన్సూ ఏవర్రా?" అనడిగింది హారిక.
నాన్న అవి తీసేసుకున్నారుగా. వెనక్కెళ్ళే వరకూ వాటిని వాడడానికి వీల్లేదన్నారు"అన్నారిద్దరూ నిద్ర మత్తులో.
మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయిన హారికకి నిద్ర పట్టలేదు..తల్లి దండ్రులతో సరే... పిల్లలతో కూడా  ఈ మధ్య కాలం లో తనెప్పుడూ గడపనంత సన్నిహితంగా ఇవాళ గడిపింది. దూరంగా వున్నవాళ్ల మధ్య కమ్మ్యూనికేషన్ ని మెరుగు పరచే ఆధునిక పరికరాలు, భౌతికంగా సమీపంలో నివసించే ఆత్మీయుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతున్నాయి? ఈ పరికరాలకలవాటు పడ్డవాళ్ళు వాటికి ఎడిక్ట్స్ గా మారి, వాటి వాడకం లో ఏమాత్రం అవరోధం కలిగినా అసహనానికి లోనవుతున్నారు. అవతలి వ్యక్తి చెప్పే విషయం పనికొచ్చేదో కాదో తెలుసుకోక ముందే చెవుల్ని స్విచాఫ్ చేసేస్తున్నారు! అమెరికా లో ఎక్కడో స్కూలు పిల్లలకి వారంలో ఒక రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదని ఆంక్ష విధిస్తారని వింది తను. అలా ఇక్కడ కూడా ప్రయత్నిస్తే బావుణ్ణు అనుకుంది.
సంక్రాంతి నాడు ఎదురింటి మేడ మీద ఎగరేసిన గాలి పటాలూ, పక్కింట్లో సంధ్య వేళ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ కన్నెపిల్లలు చేసిన బృంద నాట్యం, రోజూ తాతగారింటికి వచ్చే ఆవుని కనుమ నాడు చక్కగా కడిగి బొట్టు పెట్టి పూజించడం, పిండి వంటలతో భోజనాలు...ఈ సంబరాల మధ్య మిగతా మూడు రోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. సెల్ ఫోన్లూ, ఐపాడ్లూ లేకపోవడంతో పిల్లలిద్దరూ అన్ని సరదాల్లోనూ మనస్పూర్తిగా పాలుపంచుకున్నారు. పరిసరాలను చక్కగా పరిశీలించారు. ప్రశ్నలడిగారు. జవాబులన్నీ శ్రద్ధగా విన్నారు.
నాలుగో రోజు రాత్రి బస్సుకి బయల్దేరుతూ మనవలిద్దరూ, అమ్మమ్మనీ తాతగారినీ గాఢంగా హత్తుకుని ముద్దులు పెట్టారు. బస్సు బయల్దేరుతుంటే రంగనాథంగారు "మళ్ళీ ఎప్పుడు?" డిగారు నవ్వుతూ. మనవలిద్దరూ "దసరాకొస్తాం  తాతా" అన్నారు ముక్త  కంఠంతో.

                                                 ***

            ( ఆకాశ వాణి,  హైదరాబాద్ కేంద్ర ప్రసారం, జనవరి 1, 2012; కౌముది జాల పత్రిక,అక్టోబర్, 2012)


              

5 comments:

 1. చాలా బాగుంది .........

  ReplyDelete
 2. నాగలక్ష్మి గారూ మిమ్మల్ని ఎలా కలవడం చాలా ఆనందంగా ఉందండీ..మీ కథా సంకలనం 'ఆలంబన' నాకు చాలా నచ్చిన పుస్తకం. జీవితానికి అద్దం పడుతూ మీరు రాస్తున్న కథలు మార్గదర్శకంగా ఉన్నాయి. ధన్యవాదాలు

  ReplyDelete
 3. పద్మార్పిత గారు, సీత గారు ! ధన్య వాదాలు.జ్యోతిర్మయి గారు! నా కథలు మీకు నచ్చినందుకు నాకూ ఆనందంగా ఉంది.

  ReplyDelete
 4. చాలా బాగుందండి మీ కథ!. నాకు నా చిన్నప్పటి సంగతులు గుర్తుకు వచ్చాయి.

  ReplyDelete