January 5, 2012


ఆకాశవాణి సంక్రాంతి కథోత్సవం లో మొదటి రోజు(1 -1 -2012 ) కథ ' సహ జీవనం'

                                              సహ జీవనం
                                                                           ------- వారణాసి నాగలక్ష్మి

     “రెండేళ్ళకొకసారయినా పుట్టింటికి రావడం మానేశావు. ఈ సారయినా సంక్రాంతికి మనవలిద్దరితో, అల్లుడుగారితో వచ్చి మాతో నాలుగు రోజులు గడుపుతావని ఆశిస్తున్నాను' ఈ వాక్యాలమీదే హారిక చూపు ఆగిపోయింది. ఆ కింద రంగనాథం గారు అల్లుడినాహ్వానిస్తూ రాసిన నాలుగు లైన్లు...
           పిల్లలు చిన్నగా వున్నపుడు ఏడాదికోసారయినా పుట్టింటికి వెళ్ళడం, తీయని జ్ఞాపకాలు మూట కట్టుకుని వెనక్కి రావడం జరిగేది. అంజలి తొమ్మిదో తరగతికొచ్చినప్పటి నుంచీ స్కూలూ, కోచింగులతో జీవితం పరుగు పందెంలా మారిపోయింది. నాలుగు రోజులు ఆ పల్లెటూరిలో గడపడమంటే అమూల్యమైన సమయాన్ని వృధా చేయడమే అనే భావనలో పడిపోయారు తనూ భర్తా. ఇంట్లో ఒక్కటొక్కటిగా చోటుచేసుకున్న ఎలెక్ట్రానిక్  వస్తువులూ ఆధునిక సదుపాయాలకలవాటు పడిన  పిల్లలు, తాతగారి ఊరు ప్రయాణం అనగానే 'అబ్బా, కంపూటర్ వుండదూ, డబ్బా టీవీ, ఇష్టమైన చానల్సు ఏవీ రావు అంటూ అభ్యంతరాలు చెప్పడం మొదలెట్టారు. అమ్మమ్మా, తాతగార్లు  పెళ్ళికో, పేరంటానికో వస్తూ, పచ్చళ్ళూ, స్వీట్లూ పట్టుకొచ్చి, కూతురింట్లో నాలుగురోజులుండి వెళ్ళడమే గాని, వీళ్ళు ఆ వూరికి వెళ్ళి అయిదేళ్ళు దాటిపోయింది.
            ఇపుడు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువు తున్న అంజలికి  సెమెస్టర్ పరీక్షలై సెలవులిచ్చారు. సుమంత్ తొమ్మిదోతరగతి. వాడికీ హాఫియర్లీ పరీక్షలై సంక్రాంతి సెలవులిచ్చారు.వెళ్తే ఇప్పుడే వెళ్ళాలిఅనుకుంది హారిక.
             సాయంత్రం పిల్లలొచ్చాక అమ్మమ్మ ఉత్తరం చదివి వినిపిస్తూ తన ఆలోచన చెప్పింది హారిక.
            "అమ్మా..ప్లీజ్! నేనీ సెలవుల్లో స్నో వర్ల్ద్ కి వెళ్లాలనుకున్నా. నాలుగైదు సినిమాలు చూడాలనుకున్నా. సమ్మర్ లో మాకు సెలవులుండవు తెల్సా?నైంత్ అవుతూనే టెంత్ పోర్షన్ మొదలు పెట్టేస్తార్ట!అన్నాడు సుమంత్. అంజలి అంతకంటే విసుగ్గా మొహం పెట్టి ఏముందమ్మా ఆ వూళ్ళో దోమలూ, పేడా, మురుగూ తప్ప" అనేసింది.
హారిక ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై పిల్లల్ని చూస్తూ వుండిపోయింది. ఆమె కళ్ళు చెమర్చాయి.
"అంజూ! తాతగారిల్లు అంటే  మీకోసం కళ్ళలో వత్తులేసుకుని ఎదురుచూసే అమ్మమ్మా, తాత గారూ కాకుండా మీకు గుర్తొచ్చినవి దోమలూ, పేడా, మురుగూనా?" అంది.
   "అలా ఇమోషనల్ అయిపోతావెందుకమ్మా? తాతగారూ, అమ్మమ్మా అప్పుడప్పుడు ఇక్కడికే వచ్చి మనతో కొన్నాళ్ళుండి వెళ్తున్నారుగా.. వాళ్ళ కోసం ఆ వూరే వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ దోమలు కుట్టాయంటే ఇంతింత దద్దుర్లు! స్నానానికి గీజర్ లేదు, షవర్ లేదు, గోలెంలో నీళ్ళకి మూత కూడా వుండదు. టాయ్ లెట్స్ కోసం పెరట్లో అంత దూరం పోవాలి" ఇద్దరూ వరసగా తమ ఫిర్యాదులు చెప్పేస్తూ వుంటే హారిక లేచి లోపలి          కెళ్లిపోయింది.
           అంజలి భుజాలెగరేసి ఆ విషయాన్ని వెంటనే బుర్ర నించి తీసేసింది. చేతిలో సెల్ ఫోన్ లోంచి ఎస్సెమ్మెస్ లు పంపించడం, అందుకోవడం ఊపిరి పీల్చినంత సులభంగా సాగిపోతుంటే  చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుకుంది. సుమంత్ కంప్యూటర్ గేమ్ లో లీనమైపోయాడు.
      చీకటిపడే వేళకి శ్రీహరి వచ్చాడు. అతనికి టీ,స్నాక్స్ తెచ్చిచ్చి, తండ్రి ఉత్తరం అందించింది.
          "సరే ..పిల్లలకి కుదిరితే మీరు ముగ్గురూ వెళ్ళండి. నాకు ఆఫీస్ లో వీలయ్యేలా లేదుఅన్నా డతను.
పిల్లలన్న మాటలు చెప్తే  ఆశ్చర్యపోతూ చూశాడు."అలా అన్నారా? అంటే ఈ సౌకర్యాలు లేని చోట వాళ్ళు వుండలేని స్థితికి వచ్చేశారన్న మాట! ఇందులో మన తప్పే ఎక్కువుంది..వాళ్ళని నేనొప్పిస్తాలే..మీరు ముగ్గురూ వెళ్దురుగాని "అన్నాడు.
             అన్నట్టుగానే ఏం చెప్పాడో గాని పిల్లలిద్దరూ ఒప్పుకున్నారు. చిన్నప్పటిలా అమ్మతోపాటు రాత్రి బస్సెక్కి తెల్లారి తాతగారి ఊరు చేరేసరికి  బాల్యజ్ఞాపకాలెన్నో గుర్తొచ్చాయి ఇద్దరికీ. హారిక కైతే అలవాటు లేని ప్రయాణం వల్ల నడుమూ, కాళ్ళూ పట్టేసినా బస్సు దిగేసరికల్లా చల్లని ప్రభాత పవనాలు చుట్టేసి, మంచు తెరలూ, కళ్ళాపి చల్లిన వాకిళ్ళూ కనిపించి మనసు బాల్యంలోకి పరుగులు తీసింది.
ఎవరి సామాను వాళ్ళు అందుకుని నడుస్తుంటే సుమంత్ హారికతో "చిన్నప్పుడు కొన్ని పనులు ఎంత సిల్లీగా చేసే వాళ్ళమో గుర్తొస్తే నవ్వొస్తోందమ్మా! బస్సులో వస్తుంటే నాకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఒకసారి అమ్మమ్మ డబ్బులిస్తే నేనూ, అక్కా, రాజూ, బుజ్జీ, చింటుగాడూ బటాణీలు కొని తెచ్చుకున్నాం. ఇంటికొచ్చాక వాటిని పంచుకున్నాంఅంటూ ఏదో చెప్పబోయాడు. వాడిమాటలు పూర్తి కాకుండానే అంజలి పక పకా నవ్వుతూ "వీడు ఒకటే ఏడుపమ్మా నాకు తక్కువొచ్చాయీ, రాజుగాడికి ఎక్కువొచ్చాయీ అంటూ. అపుడు తాతగారొచ్చి అయిదుగురినీ గుండ్రంగా కూర్చొబెట్టి, బటాణీలు ఒక్కొక్క గింజా ఓపిగ్గా పంచారు. ఆఖరికి ఒక్క గింజ మిగిలింది. ఆ గింజ మా అందరికీ చూపించి పక్కన కాలవలో పడేశారు!"అంది.
సుమంత్ కూడా నవ్వుతూ"అలా పారేశారేంటి తాతగారూ అంటే ఆ ఒక్కటీ ఎవరికిచ్చినా గొడవే కదర్రా అన్నారు. పోనీ మీరు తినక పోయారా? అంటే నాకూ మీ అమ్మమ్మకీ బటాణీలు తినే పళ్ళు కావురా అన్నారు" అన్నాడు. హారిక తండ్రి హాస్యచతురత తలుచుకుని నవ్వుకుంది.
           ఇల్లు చేరేసరికి వాకిట్లో ముగ్గేస్తున్న సీతమ్మ ఎదురొచ్చింది.
          తల్లి ఆయాసపడడం గమనించి "ఈ చలిలో అలా వంగి ముగ్గులేస్తే ఆయాసం రాదా అమ్మా? నువ్వేస్తున్నావేమిటివ్వాళ? దుర్గమ్మ కేమొచ్చింది రోగం? ఇవాళ పనికి రాలేదా?" అంది  హారిక .
ముగ్గు చెయ్యి తగలకుండా పిల్లలిద్దర్నీ దగ్గరికి తీసుకుంటూ "అయ్యో అదేమిటే ..పండగ పూటా అలా అంటావ్? దానికీ వయసు మీద పడింది పాపం. చలిలో పొద్దున్నే రాలేక పోతోంది. ఎనిమిదింటికొస్తుంది. అప్పటిదాకా పాచివాకిలి ఉంచడం ఎందుకని చెంబుడు నీళ్ళు చల్లి, రెండు ముగ్గు చారలేస్తున్నా"అంది నవ్వుతూ.
"అన్నిటికీ అలా సర్దుకుంటావ్ గనకే వాళ్ళూ నిన్నలా ఆటాడిస్తారుఅంది హారిక లోపలికి దారి తీస్తూ.
"లేదులే ..కొడుకు పెద్దాడై ఇంక నువ్వు పనిచెయ్యక్కర్లేదన్నా ఊరికే ఇంట్లో కూర్చుని తినలేనని చెప్పి మన ఇల్లొక్కటే చెస్తోంది. పండక్కి మాత్రం నాగా పెట్టద్దనీ, పిల్లలొస్తున్నారనీ చెప్పాఅంది సీతమ్మ. వడిలి ముడుతలు పడ్ద తల్లి మొహం చూస్తూ 'అమ్మ ఎంత బలహీనంగా కనిపిస్తోందో' అనుకుంది. మనవలిద్దరూ తాతగారిని గాఢంగా హత్తుకున్నారు. తండ్రిని పరీక్షగా చూస్తూ ఏడాదిలోనే ఇంత మార్పా?’ అనుకుంది దిగులుగా.
వేడిగా కాఫీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటుంటే పక్కింటి అనసూయమ్మ మంచి నీళ్ళు పట్టుకోడానికి వచ్చి,"ఏమిటమ్మా హారికమ్మా? ఇన్నేళ్లపాటు పుట్టింటిక్కూడా రాకుండా ఏమంత రాచకార్యాలు చేస్తున్నావు తల్లీ అంది నిష్ఠూరంగా.
"రాచకార్యాలేం లేవు పిన్ని గారూ! పిల్లల చదువులే రాచకార్యాలు మాకు"అంది నవ్వబోతూ.
"అమ్మకీ, నాన్నగారికీ అంతంత జరాలొచ్చినా పిల్లలెవరూ రాలేదేవిటా అని మేమంతా అనుకున్నం.. ఏమో ఎంతెంత పనుల్లో వున్నారో ఏమో పాపం మీరంతా అందావిడ తేలిగ్గా చురక అంటిస్తూ.
హారిక మనసు చివుక్కు మంది"ఏవిటమ్మా?చాలా ఎక్కువగా వచ్చిందా జ్వరం? చెప్పనేలేదేం?" అంది తల్లి వైపు చూస్తూ.
భలేదానివి..చెప్పక పోవడమేవిటీ? అవాళ నే నీళ్ళు పట్టుకుంటుంటే అమ్మ గారు నీతో ఫోనులో చెప్పలా 'ఇద్దరికీ టెంపరేచరుందనీ కోటయ్య గారొచ్చి మందిస్తున్నారనీ'? మీ అన్నయ్యకీ చెప్పారు, నీకూ చెప్పారు.ఒకళ్ళయినా వస్తారేమో అనుకున్నాయధాలాపంగా అనేసి బిందె నిండడంతో ఆవిడ వెళ్ళిపోయింది.
వెనక నించి సీతమ్మ "అయ్యో అదేవిటండి అల్లా అంటారూ? అంత అవసరమైతే పిల్లలకి కబురు చెయ్యమా, వాళ్ళు రెక్కలు కట్టుకుని రారా?” అంది నొచ్చుకుంటూ.
గేటు దాటుతున్న ఆవిడ"చాల్లెండి చెప్పొచ్చారు! కొడుక్కి చెయ్యి విరిగిందంటేనూ, కోడలికి బెడ్ రెస్టంటేనూ, కూతురికి నడుం పట్టేసిందంటేనూ, మనవరాలికి చికెన్ పాక్సంటేనూ పిలిస్తేనే వెళ్ళారా మీరు? నెల రోజులపాటు పీల్చి పిప్పి చేసే జరాల్తో చిక్కి సగమయ్యారు..కాస్త పత్యం వండి పెట్టడానిక్కూడా కోడలూ రాలా, కూతురూ రాలా.. చాల్లెండి  సమర్ధింపులు"అనడం వినిపించింది.
చిన్నపాటి గాలిదుమారం గిర్రున తిప్పి వదిలినట్టై నల్లబడ్డ మొహంతో అమ్మా నాన్నలవైపు చూసింది హారిక." కాస్త తిక్క మనిషే ఆవిడ ..ఆ మాటలు పట్టించుకోకు. ఏదో రాక రాక పుట్టింటికొస్తే వచ్చిన్రోజే ఈవిడొహర్తివిసుక్కుంది సీతమ్మ.
ఇంతలో దుర్గమ్మొచ్చి "వొచ్చారా పాపగారూ"అంటూ ఇంత మొహం చేసుకుని పలకరించి "అమ్మ గారో..అంట్ల గిన్నెలన్నీ పడేయండి ఒక్కసారే తోమి పోతా"అనడంతో సీతమ్మ లేచి వెళ్ళింది.
సుమంత్ తాతగారి దగ్గరకెళ్ళి "తాతగారూ, ఆవిడకేమన్నా పిచ్చా? మనింట్లో మంచి నీళ్లకి వచ్చి మనతోటే రూడ్ గా బిహేవ్ చేస్తుందేమిటి? మాకన్నా ఆవిడకే మీరంటే ఇష్టమన్నట్టు మాట్లాడుతుందేమిటి?” అన్నాడు కోపంగా.
రంగనాథంగారు చిన్నగా నవ్వి"ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఒకరికొకరు సాయ పడడం ఇక్కడ అలవాటు నాన్నా! మంచి నీళ్ళొక్కటే చూశావు నువ్వు. వాళ్ళింట్లో పూసే మల్లెలూ, గులాబీలూ, కాసే కొబ్బరికాయలూ ఎలా తెచ్చిస్తుందో చూశావా? ఇచ్చి పుచ్చుకోవడం అంటే ఏమిటో మీకు తెలీదురా!" అన్నారు.
తండ్రి చెప్తున్నదేదీ హారిక చెవుల్లో దూరలేదు..ఈ పల్లెటూళ్ళే ఇంత. అందరి విషయాలూ వీళ్ళకే కావాలి అనుకుని చికాకు పడింది.
సీతమ్మ బలవంతం మీద పూర్వకాలంలో లాగా కాకపోయినా నూనె దూమెరుగ్గా రాసుకుని సున్నిపిండితో వొళ్ళు రుద్దుకుని తల స్నానం చేశారు .. హారిక కూరలు తరిగిస్తే సీతమ్మ వంట పూర్తి చేసింది. వంటకాలన్నీ  టేబుల్ మీద అమరుస్తుంటే ఎదురింటి సుందరి వచ్చి హారికనీ పిల్లల్నీ పలకరించి, చిన్న గిన్నెతో  జున్ను  టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. మరో రెండు నిముషాలకి నాలుగిళ్ళ అవతలుండే రాజేశ్వరి వచ్చి'దొడ్డమ్మ గారు చెప్పారు నువ్వొస్తున్నావని..ఇవాళ దొడ్లో కాసిన గుత్తొంకాయలతో కూర చేశా. నీకిష్టమని నాలుక్కాయలు తెచ్చా'..అంటూ చిన్న బౌల్ అందించి వెళ్ళింది. మూత తీసి చూడగానే హారికకే కాదు పిల్లలిద్దరికీ కూడా నోరూరింది.
అంతా కూర్చుని భోజనాలు చేస్తుంటే సుమంత్ అడిగాడు" ఇలా రోజూ చుట్టుపక్కల అందరూ అన్నీ పంచుకుంటారా అమ్మమ్మా?"అని. ఆవిడ వాడి వైపు మురిపెంగా చూస్తూ"రోజూ కాదురా నాగన్నా! ఏవైనా స్పెషల్ చేసుకుంటే ఈ ముసలాళ్ళు తమలా చేసుకోలేరని ఇలా తెచ్చిస్తూంటారు"అంది.
            కళ్ళు మూసుకుని  మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఒక్క క్షణం ధ్యానించి పక్కన పెట్టింది.
"అదేమిటి అమ్మమ్మా?"అడిగింది అంజలి.
"మొదటి ముద్ద పితృ దేవతలని తలుచుకుని పక్కన పెడతారమ్మా"అంది హారిక.
             “మరి తర్వాత దాన్ని పారేస్తారా?"డిగాడు సుమంత్.
"లేదు నాన్నా..మన భోజనం అవగానే ఆ ముద్ద తీసుకెళ్ళి ప్రహరీ గోడ మీదో, నూతి గట్టు మీదో
 పెడితే కాకులూ పక్షులూ తింటాయిఅంది సీతమ్మ.
 “రోజువారీ పనులన్నిటిలో భూత దయని జోడించిన సంస్కృతి మనది అమ్మలూ! నీకు తెలుసుగా చీమలూ, ఇతర కీటకాలూ, పక్షులూ, ముగ్గు అంటే బియ్యప్పిండి తింటాయి. పండగల్లో చేసే ప్రతి పనిలోనూ గమనించి చూస్తే, మనసుకి ఆహ్లాదం కలిగించే కళకి తోడు సహజీవన సూత్రాలు కూడా జత చేసి వుంటాయిఅన్నారు రంగనాథంగారు.
సీతమ్మ "వంటకాలు చల్లారిపోకుండా తినండర్రా"అనడంతో మాటలు తగ్గించి భోజనాలు ముగించారు.
టేబుల్   శుభ్రం చేసి  తల్లితో కబుర్లు చెపుతూ పక్కమీద వాలిన హారికకి నిద్ర ముంచుకొచ్చింది. సాయంత్రమవుతుంటే హాల్లోంచి వినవస్తున్న మాటలకి మెలకువ వచ్చింది.మనవడికి భోగి పళ్ళు పోస్తున్నామనీ, అంజలినీ సుమంత్ నీ కూడా తీసుకుని వస్తే వాళ్లని కూడా పక్కని కూర్చో పెట్టి పళ్ళు పోద్దామనీ అంటోంది అనసూయమ్మ.
"అబ్బే వాళ్ళు అలా రారండీ.పెద్దవాళ్ళయ్యారు గదాఅంటోంది సీతమ్మ.
అక్కయ్య గారూ..భోగి పళ్ళు పోసేది పిల్లలకి దిష్టి తగలకుండా వుండాలని. బస్తీ నించీ పసిడి బొమ్మలా మనవరాలూ, సిసింద్రీ లాంటి మనవడూ వస్తే ఊరి దిష్టి తగలకుండా భోగి పళ్ళు పోసుకుంటే బావుంటుంది. పిల్లలింత పెద్దయ్యాక మీఇంట్లో ఈ పేరంటం  పెట్టుకోరుగదా అని మాఇంట్లో పసివాడితో కలిపి వీళ్ళిద్దరినీ, కుసుమ కూతుర్నీ కూడా కూర్చోపెట్టి పోద్దా మనుకున్నా"అంటోంది అనసూయ. హారిక మనసు ఆవిడ మాటల్లోని ఆత్మీయతకి కరిగిపోయింది.
పొద్దున్న మీకు కోపం వచ్చిందని నాకు తెలుసు లెండి..అయినా పిల్లలకి సేవ చేయించుకోడమే కాదు..చేయడమూ అలవాటు చెయ్యాలి మనం. వాళ్ళు మీ ఆరాలు కనుక్కుని అవసరానికి అడక్కుండానే వచ్చి చేస్తుంటే వాళ్ళ పిల్లలూ నేర్చుకుంటారు..వాళ్లమ్మకవసరమైననాడు వచ్చి చేస్తారు. లేకపోతే రేపెప్పుడో అయ్యో నాకూతురికవసరమైన నాడు దాని కూతురూ, కోడలూ కూడా పట్టించుకోలేదని మీరే బాధపడతారు"అంది. హారిక కళ్ళు చెమర్చాయి.నిజమే.. ఇంత వయసొచ్చి ఎప్పుడూ అమ్మ వచ్చినపుడు ఆవిడ ఇచ్చే ఆసరా కోసం, పుట్టింటికి వెళ్ళినపుడు దొరకబోయే విశ్రాంతి కోసం ఆశిస్తున్నాంఅనుకుంది.
సాయంత్రం భోగి పళ్ళ పేరంటానికి ఎక్కువ బతిమాలించుకోకుండానే వచ్చారు పిల్లలిద్దరూ.
రాత్రి భోజనాలయ్యాక వీధి వాకిలి తుడిచి, నీళ్ళు చల్లి, పెద్ద రథం ముగ్గు తీర్చారు తల్లీ కూతురూ. పక్క వాళ్ళ ముగ్గులతో పోల్చి తమదే బావుందని మురిసి పోయారు. పక్కలు సర్దుకుని పడుకునే ముందు తల్లి అలమార లోంచి కాలినెప్పులకి రాసుకునే మందు ట్యూబు తీసుకోవడం చూసిన హారిక, ఆవిడ వెనకే వెళ్ళి వద్దంటున్నా వినకుండా కాళ్ళకి మందు మర్దనా చేసింది. అమ్మమ్మ గది లోకి వచ్చిన పిల్లలిద్దరూ నేనూ రాయనా అంటూ పోటీ పడ్డారు. సీతమ్మ నవ్వుతూ"కాళ్ళు రెండే వున్నాయర్రా..ఇంకోటుంటే ముగ్గురికీ మూడూ ఇచ్చేదాన్ని" అంది.
            రాత్రి పిల్లలిద్దరి పక్కనా పడుకుని "మీ సెల్ ఫోన్సూ, ఇయర్ ఫొన్సూ ఏవర్రా?" అనడిగింది హారిక.
నాన్న అవి తీసేసుకున్నారుగా. వెనక్కెళ్ళే వరకూ వాటిని వాడడానికి వీల్లేదన్నారు"అన్నారిద్దరూ నిద్ర మత్తులో.
మధ్యాహ్నం చాలాసేపు నిద్రపోయిన హారికకి నిద్ర పట్టలేదు..తల్లి దండ్రులతో సరే... పిల్లలతో కూడా  ఈ మధ్య కాలం లో తనెప్పుడూ గడపనంత సన్నిహితంగా ఇవాళ గడిపింది. దూరంగా వున్నవాళ్ల మధ్య కమ్మ్యూనికేషన్ ని మెరుగు పరచే ఆధునిక పరికరాలు, భౌతికంగా సమీపంలో నివసించే ఆత్మీయుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతున్నాయి? ఈ పరికరాలకలవాటు పడ్డవాళ్ళు వాటికి ఎడిక్ట్స్ గా మారి, వాటి వాడకం లో ఏమాత్రం అవరోధం కలిగినా అసహనానికి లోనవుతున్నారు. అవతలి వ్యక్తి చెప్పే విషయం పనికొచ్చేదో కాదో తెలుసుకోక ముందే చెవుల్ని స్విచాఫ్ చేసేస్తున్నారు! అమెరికా లో ఎక్కడో స్కూలు పిల్లలకి వారంలో ఒక రోజు ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకూడదని ఆంక్ష విధిస్తారని వింది తను. అలా ఇక్కడ కూడా ప్రయత్నిస్తే బావుణ్ణు అనుకుంది.
సంక్రాంతి నాడు ఎదురింటి మేడ మీద ఎగరేసిన గాలి పటాలూ, పక్కింట్లో సంధ్య వేళ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ కన్నెపిల్లలు చేసిన బృంద నాట్యం, రోజూ తాతగారింటికి వచ్చే ఆవుని కనుమ నాడు చక్కగా కడిగి బొట్టు పెట్టి పూజించడం, పిండి వంటలతో భోజనాలు...ఈ సంబరాల మధ్య మిగతా మూడు రోజులూ మూడు క్షణాల్లా గడిచిపోయాయి. సెల్ ఫోన్లూ, ఐపాడ్లూ లేకపోవడంతో పిల్లలిద్దరూ అన్ని సరదాల్లోనూ మనస్పూర్తిగా పాలుపంచుకున్నారు. పరిసరాలను చక్కగా పరిశీలించారు. ప్రశ్నలడిగారు. జవాబులన్నీ శ్రద్ధగా విన్నారు.
నాలుగో రోజు రాత్రి బస్సుకి బయల్దేరుతూ మనవలిద్దరూ, అమ్మమ్మనీ తాతగారినీ గాఢంగా హత్తుకుని ముద్దులు పెట్టారు. బస్సు బయల్దేరుతుంటే రంగనాథంగారు "మళ్ళీ ఎప్పుడు?" డిగారు నవ్వుతూ. మనవలిద్దరూ "దసరాకొస్తాం  తాతా" అన్నారు ముక్త  కంఠంతో.

                                                 ***

            ( ఆకాశ వాణి,  హైదరాబాద్ కేంద్ర ప్రసారం, జనవరి 1, 2012; కౌముది జాల పత్రిక,అక్టోబర్, 2012)


              

నల్ల మల మీద మల్లెల్ని చల్లిన జాబిల్లి - భూమిక యాత్రానుభవం

                                             నల్ల మల మీద మల్లెల్ని చల్లిన జాబిల్లి
                                                                                                 -వారణాసి నాగలక్ష్మి     
ప్రతి సంవత్సరంలాగే ఈసారీ సత్యవతి లేఖ అరిటాకులో చుట్టిన మల్లెల పొట్లంలా వచ్చి చేరింది స్నేహ పరిమళాలు వెదజల్లుతూ. కర్నూలు, శ్రీశైలం విజ్ఞాన విహార యాత్ర గురించి ముందే తెలిసినా ‘అబ్బ ఏం వెళతాంలే’ అనుకున్నవాళ్ళం కాస్తా ఆ గాఢమైన పరిమళం చుట్టేయగానే ఒక్కొక్కళ్ళమే ‘మేం వస్తున్నాం’ అంటూ ఎస్‌యంఎస్‌లు పంపేశాం.
ప్రతి సంవత్సరం తను చేపట్టే ఈ కార్యక్రమం ఎంతో ప్రణాళికాబద్ధంగా, జోరుగా హుషారుగా సాగే షికారులా ఉంటూనే ఎన్నో విషయాలు తెలుసుకునేందుకు, ప్రకృతిలో మమేకమవుతూనే ఒకరికొకరం స్నేహసుమాలు అందించుకుని దగ్గరయ్యేందుకు తోడ్పడుతుందనేది భూమిక సభ్యులందరికీ తెలిసిన విషయమే. భూమిక ట్రిప్‌ అంటే పరిసరాలను తెలుసుకుంటూ స్నేహ పరిమళాలను పంచుకునే యాత్ర. కలుసుకుని కలబోసుకునే ప్రయాణం ‘మూడు కొప్పులు ఒకచోట చేరి ఘర్షణ లేకుండా మనలేవనే నానుడి ఎంత అవాస్తవమో, సత్యదూరమో తెలియజెప్పే పర్యటన. ‘ఆడవాళ్ళకీ సమయ పాలనకీ చుక్కెదురు’ అనుకునే వాళ్ళకి ఇంత టైట్‌ షెడ్యూల్‌ని అనుకున్నది అనుకున్నట్లుగా ఉత్సాహభరితంగా పూర్తిచేసుకు రావడమే రచయిత్రులిచ్చే సమాధానం అనిపించేలా సాగే ప్రయాణం. ఇవన్నీ తెలిసిన విషయాలే కావడంతో చకచకా సీట్లు నిండిపోవడమేకాక చివరికి మరికొంత మంది చేరడంతో ముందుగా బుక్‌ చేసిన బస్సు మార్చి 28 సీటర్ల బస్‌ బుక్‌ చేయాల్సి వచ్చింది.
నవంబరు 10 వ తారీకున అనుకున్నవిధంగా భూమిక ఆఫీస్‌ దగ్గర బస్సు బయలుదేరింది 8 గంటలకి. సత్యవతి, గీత, సుజాతామూర్తిగారు, అమూల్య గారితో బయల్దేరిన బస్సు దారిలో ఒక్కొక్కరినే ఎక్కించుకుంటూ సరోజిని కంటి ఆసుపత్రి దగ్గరకు చేరేసరికి తొమ్మిది గంటలైంది. అక్కడ నేను, రజిత ఇంకా కొంతమంది కొత్త మిత్రులతో ఎక్కాం. హర్షధ్వానాలతో నిండు వాహనం రివ్వుమంటూ రింగురోడ్డెక్కింది. పాత మిత్రుల్ని పలకరించి, కొత్తవాళ్ళని పరిచయం చేసుకునేసరికి చక్కగా ప్యాక్‌ చేసి తెచ్చిన టిఫిన్‌ పొట్లాలు అందరికీ అందించారు గీత. బస్సులో డ్రైవర్‌కి సాయంగా వచ్చిన క్లీనర్‌ రమేష్‌ పొట్లాలు చురుగ్గా అందుకుని అందరికీ అందించి, మంచినీళ్ళు కూడా కావాలన్నవాళ్ళకి తెచ్చిచ్చాడు. వేడి ఇడ్లీలు, గారెలు, విడిగా ప్యాక్‌ చేసిన చట్నీ చాలా రుచిగా అనిపించాయి. సమయం ఆదా అవడమే కాకుండా ప్రయాణం చేస్తూ అలా తినడం బాగా అనిపించింది. అంతా గీతకి (అలా చక్కగా ప్లాన్‌ చేసినందుకు, ప్యాక్‌ చేయించినందుకు) థాంక్స్‌ చెప్పాం.
బస్సు మహబూబ్‌నగర్‌ అడ్డాకులలో ఒక పావుగంట ఆగింది. టీ బ్రేక్‌! మళ్ళీ ప్రయాణం మొదలై ఒంటిగంట దాటుతుంటే కర్నూలులో సత్యవతి గారింటికి చేరాం. అక్కడ వేడివేడిగా భోజనం చేసి ముప్పావు గంటలో మళ్ళీ బస్సెక్కాం. మాకు అవసరమయ్యే చిన్న చిన్న ఏర్పాట్లకోసం, దారి చూపించడం కోసం మాదన్న మాతో బస్సులో వచ్చారు. దారిలో సహజంగా ఏర్పడ్డ రాక్‌ గార్డెన్స్‌  చూసుకుంటూ నాలుగు గంటలకి మహానంది చేరాం. ప్రయాణంలో కబుర్లు చెప్పుకుంటూ తినడానికి ఎన్నోరకాల తినుబండారాలూ, కమలా పళ్ళూ తెచ్చారు సత్యవతి గారు, గీత. కమలాలు చాలా తియ్యగా ఉండి దాహానికి విరుగుడుగా పనిచేశాయి. ‘తిన్నవాళ్ళకి తిన్నంత అన్నట్టు’ బస్తా నిండుగా తెచ్చిన కమలాలు అక్షయపాత్రలో ఆహారంలా కనిపించాయి. పాటలు, జోకులతో ‘కలసి ప్రయాణం, కలదు వినోదం’ పాటలా సాగింది సమయం. దారికటూ ఇటూ అరటి తోటలు, పసుపు పొలాలు. వాతావరణం కూడా అటు వేడీ, ఇటు చలీ-రెండూ లేకుండా అత్యంత ఆహ్లాదకరంగా అనిపించింది.
ఇంతలో ‘మహానంది’ చేరామని సూచిస్తూ పెద్ద నంది విగ్రహం కనిపించింది. మరికొంత దూరంలో ఆలయం. ఆరోజు కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయ ప్రాంగణమంతా రద్దీగా ఉంది. ముందుగా ఆలయం మధ్యలో ఉన్న మహాకుండం దగ్గరకు వెళ్ళాం. చతురస్రాకారంలో నిర్మించిన ఆ జలాశయంలోకి నిరంతరంగా ప్రవహిస్తున్న స్వచ్ఛమైన జలధార. చల్లని నీళ్ళు చూస్తే నీళ్ళలోకి దిగాలనిపించినా చీకటిపడేలోగా నల్లమల అడవిదారిలో ఆహోబిలం దాకా వెళ్ళాల్సి ఉండడంతో అక్కడ పాదాలు మాత్రం కడుక్కుని, ఆలయం లోపలికి వెళ్ళాం. ఆలయ ప్రాంగణంలో కొన్ని ఫోటోలు తీసుకుని బస్సెక్కాం.
సమర్ధుడైన డ్రైవర్‌ కావడంతో ప్రయాణం చాలా సాఫీగా సాగింది. నల్లమల అడవుల్లోంచి ప్రయాణిస్తుంటే ఆ స్వచ్ఛమైన గాలి, పచ్చని పొలాలు  ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయి. వేరుసెనగ, వరి, కాబేజి, వరి, పసుపు, జొన్న తోటలు కొంతదూరం కనిపించాక పూర్తిగా అడవి ప్రాంతంలోకి ప్రవేశించాం. హఠాత్తుగా సత్యవతి ఎనౌన్స్‌మెంట్‌… ‘అదుగో చందమామ’ అంటూ. అంతా అటు చూశాం. అపుడే చంద్రోదయమైంది. మబ్బులు లేని ఆకాశంలో కార్తీక పౌర్ణమి నాటి చంద్రుడు చల్లని వెన్నెల చల్లుతూ మాతో పాటు ప్రయాణించాడు. కొంతసేపు బస్సుకి కుడివైపు, మరికొంతసేపు ఎడమవైపు ఆ పూర్ణబింబం దోబూచులాడుతూ కనిపిస్తుంటే. పాకే పాలబుగ్గల పాపాయిలతో దోబూచులాడే అమ్మల్లాగా మేమంతా అలౌకికానందాన్ని అనుభవించాం. మా బస్సు చేసే స్వల్పమైన శబ్దం తప్ప ఇంకేవిధమైన శబ్దం వినిపించని అడవి. దట్టమైన కొమ్మలతో మా ప్రయాణానికి మౌన సాక్షుల్లా పచ్చని చెట్లు… మధ్యలో సాగే దారి మీదంతా ‘చల్లినారమ్మా! వెన్నెల చల్లినారమ్మా!’ పాట గుర్తొచ్చేలా పుచ్చపువ్వులాంటి వెన్నెల. ‘బస్సు వెనక్కి చూడకండమ్మా’ అంటూ మాదన్న చెప్పగానే ‘ఎందుకు’ అని అడిగాం. ‘బస్సు లైలు వెలుగులో పక్కకి తప్పుకున్న జంతువులు బస్సు ముందుకి సాగగానే రోడ్‌ మీద సంచరిస్తాయని సమాధానం! అలా రెండుగంటల ప్రయాణం.
సరిగ్గా 7.50కి కొండమీదున్న లక్ష్మీనరసింహస్వామిల ఆలయ ముఖద్వారం చేరుకున్నాం. పున్నమి వెన్నెల్లో కొండమీదున్న ఆ ఆలయం ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పనలవి కాదు. రాతి మధ్యలో దొలిచినట్టున్న గర్భగుడిలో కిందా పైనా అంతా ఏకశిల.  అక్కడంతా ఒక దివ్యమైన నిశ్శబ్దం, చల్లదనం. అంతటా వ్యాపించిన స్వచ్ఛమైన ప్రాణవాయువు. బయటికి వచ్చి ముఖద్వారం ముందున్న చదునైన విశాల ప్రాంగణంలో నిలుచుంటే ఎదురుగా టేకు, రోజ్‌వుడ్‌ చెక్కలు పేర్చినట్టున్న, పొరలు పొరలుగా అమరిన కొండరాళ్ళు ఆ కొండ శిఖరాలపైకి దృష్టి సారిస్తే నీలాకాశంలో పూర్ణబింబం.
‘కొండలపైన కోనలలోన గోగులు పూచే జాబిలి’ అంటే ఇదేనేమో అనుకున్నా. లేత పసుపు రంగులో విరిసే గోగుపూలు నాకు తెలుసు. ఆ సమయంలో చందమామ సరిగ్గా అదే రంగులో కనిపించాడు. కురిసే వెన్నెల కూడా అదే రంగు!
వంపులు తిరిగిన ఆ మెట్లూ, రాళ్ళలోంచి మొలకెత్తి వృక్షాలైన చెట్లూ, మధ్యలో రాళ్ళను తడుపుతూ జారే జలధారలు… ఆ ప్రకృతిని తనివితీరా ఆస్వాదించి, పక్కనున్న దారిలో చెక్కవంతెన మీదుగా నడిచి జలపాతం దాకా వెళ్ళాం. చెక్కవంతెనలో కొన్ని చెక్కలు కొద్దిగా ఎత్తుపల్లాలతో ఉన్నాయి. ఆ నిశ్శబ్దంలో ఎక్కువ ఉధృతి లేని ఆ జలపాతం చేసే నీళ్ళ శబ్దం వింటే ప్రకృతి మాతో మాట్లాడు తున్నట్టనిపించింది. ఆ జలపాతం కొండపైన ఎక్కడినుంచో వస్తోంది. పైకి, ఇంకా పైపైకి వెళ్ళడానికి చెక్కవంతెనలూ, రాళ్ళ కాలిబాటలూ ఉన్నాయి. కానీ అది సమయం కాదు.
‘యెరాతే యె మౌసమ్‌ నదీకా కినారా’ అని ఒకరు పాడితే ‘జాము రాతిరి జాబిలమ్మ’ అని మరొకరు కూనిరాగం తీశారు. ఎక్కువమందికి మనసుల్లో కువకువలాడినవి మౌనగీతాలే!
ఎవరికీ ఆ ప్రదేశం వదిలి వెళ్ళిపోవాలనిపించలేదు. అంతా ‘ఇంకా ముందు రావలసింది’ అని నిట్టూర్పులు విడుస్తుంటే సత్యవతి, గీత ఆలోచనలో పడ్డారు. వీలైతే రాత్రి ఇక్కడెక్కడైనా ఉండి పొద్దున్న మళ్ళీ ఈ ప్రదేశాలని తనివి తీరా కళ్ళారా చూసుకుని వెళదామని. సత్యవతి అయితే అక్కడి వాచ్‌మేన్‌ కూతుర్ని అడిగింది. అందరం సర్దుకుని పడుకుందుకు ఒక గది దొరుకుతుందా అని. ఆ అమ్మాయి పడుకోవచ్చంటే మా వెంట వచ్చిన అఫీషియల్స్‌ రిక్వెస్ట్‌ చేశారు అలా వద్దని. సరే కొండకింద ఊళ్ళో ఏదైనా ఏర్పాటు దొరుకుతుందేమో అని చూడాలనుకున్నాం. వెనక్కి వస్తుంటే అక్కడే తాత్కాలిక నివాసాలేర్పరచుకున్న కొద్దిమంది భిక్షువులు, సాధువులు ఎదురయ్యారు. వాళ్ళలో ఒక ముసలామె తంబుర మీటుతూ సగం మత్తులో ఏదో పాటలు పాడింది. అంతా ఆమె చేత పాడించుకుని తోచినదేదో ఇచ్చారు. వదల్లేక వదల్లేక ఆ ప్రాంతం వదిలి బస్సెక్కాం. వచ్చిన దారినే తిరిగి ఊళ్ళోకి వచ్చి హరిత గెస్ట్‌ హౌస్‌ చేరాం. అక్కడ రాత్రి భోజనం, మూడు రూముల వసతి దొరికాయి. అక్కడున్న ఉయ్యాలల్లో చిన్న పిల్లల్లాగా ఊగాం అందరం. పాటలు పాడుతూ భోంచేసి, సామాను రూముల్లోకి చేరవేశాం. సామాన్లన్ని బస్సు దింపి రూముల్లోకి  తీసుకెళ్ళడానికి రమేష్‌, మాదన్న ఎంతో సాయం చేశారు. రూముల్లో ఉన్న మంచాలకు తోడు చాపలు మరికొన్ని పరుపులు ఏర్పాటు చేసారు గెస్ట్‌ హౌస్‌ వాళ్ళు. మేం స్నానాలు చేసి రిఫ్రెష్‌ అయి వచ్చేసరికి, ఆ విశాలమైన ఆవరణలో గచ్చునేలమీద పూల మొక్కలకి దూరంగా చాపలన్నీ పరిచి కూర్చుని ఉన్నారు సత్యవతీ, గీత, రజిత, మంజరి, శ్యామల మొదలైన వాళ్ళంతా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అంతా అక్కడ చేరాం. అంతా చిన్న చిన్న కూనిరాగాలు తీస్తుంటే గీత ‘ఆ మాట అంటదే కోడిపిల్లా’ అంటూ ఒక పల్లెపాట పాడింది. పైన జాబిలి నవ్వులకు పోటీగా కింద నవ్వుల మీద నవ్వులు విరిశాయి. ఎవరికి గుర్తొచ్చిన జోకులు వాళ్ళు చెప్పారు. మంజరి, శ్యామల, నేను, చెప్పిన జోకులకి అంతా పడి పడి నవ్వారు. మళ్ళీ పొద్దున్నే లేచి కొండమీదికి వెళ్ళాలనీ; మా అడవి అందాల దర్శన కార్యక్రమం అంతా పూర్తై 8 గంటలకి  ముందుగా వేసిన షెడ్యూల్‌ ప్రకారం ‘యాగంటి’ కి ప్రయాణం సాగాలనే నిర్ణయమైంది కనుక ఇంకా కొంతసేపు వెన్నెల తాగాలని ఉన్నా అక్కడితో సరిపుచ్చి గెస్ట్‌ హౌస్‌లోకి నడిచాం. ఆక్కడ కూడా దారికటూ ఇటూ ఎన్నో పూల మొక్కలు. నైట్‌క్వీన్‌ గాఢమైన సువాసనలు. రూముల్లో తెల్లటి దుప్పట్లు, దిళ్ళు ఎక్స్‌ట్రాగా ఇచ్చారు. సౌకర్యంగా పడుకున్నాగాని, ఛార్జింగ్‌కి పెట్టిన సెల్‌ఫోను, కెమెరా ఆలోచనల్లోకి దూరి నిద్ర పట్టలా. వీటిని మించి రంగు రంగుల రాళ్ళతో చెక్కినట్టున్న కొండలు, వనదేవత దర్శనార్ధం ఏర్పాటు చేసిన పుష్పకవిమానంలా ఆ చెక్కవంతెన, జనావాసాలన్నిటినీ వ్యర్ధాలతో దుర్భరంగా తయారుచేసుకుని, ప్రాణ వాయువుల కోసం కొండకోనల్లోకి ఆత్రంగా వచ్చిన ఈ అల్పప్రాణుల్ని చూసి పకాపకా నవ్వే పసిబాలుడిలా చందరయ్య…. మనసంతా అవ్యక్తమైన ఉద్వేగానికి లోనై ఒక అపూర్వానుభవం అనుభూతిలోకొచ్చింది. మనసున మల్లెల మాలలూగుతుంటే, కన్నుల వెన్నెల డోలలూగుతుంటే నిద్రా మెలకువా కాని స్థితిలో నాలుగు గంటల దాకా గడిపారు. గీత పాడిన కోడిపిల్ల పాట…… విన్నాయో ఏమో రెండుగంటలు కాకముందే కోళ్ళు కొక్కొరొకో అంటూ కూశాయి. అమూల్యగారు, శోభ, లత లేచి తయారైపోయారు. గీత, సత్య తర్వాత ఆఖరికి నేను వెచ్చటి నీళ్ళలో తలస్నానం చేసి, సామానంతా రూముల్లోనే వదిలేసి, హాండ్‌బాగ్స్‌ మాత్రం తీసుకుని బస్సెక్కాం. మళ్ళీ వనదేవి నాట్యవిలాసం చూస్తూ, శిలల్లో శిల్పాల్ని దర్శిస్తూ తీరిగ్గా కొండెక్కాం. ఒకవైపు చంద్రుడింకా కనిపిస్తుండగానే ఉల్లిపూవు ఛాయలో రవిబింబం కనిపించి అపూర్వంగా అనిపించింది. అక్కడక్కడ కనిపించే చలిమంటలతో, పక్కనున్న జలపాతంలో పంచభూతాలూ అక్కడే కొలువైనట్టనిపించింది. అందంగా దృఢంగా కఠినంగా కనిపించే పొరలు పొరల కొండరాళ్ళ మీదుగా పాకిన  పచ్చటి ఆకులతీగలు, రాళ్ళమీది చెమ్మను పీల్చుకుంటూ వాటిలోకి చొచ్చుకుపోయిన వేళ్ళూ… ప్రతి దృశ్యమూ రమణీయమే. అన్నీ చూసుకుంటూ చెక్కవంతెన దాటి జలపాతం చేరి దాని పక్కనున్న చెక్క మెట్లెక్కి మరో పెద్దవంతెన దాటి, నచ్చినచోట ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగాం. అడపా దడపా ఎదురయ్యే ఒంటరి యాత్రికులు తప్ప దాదాపు నిర్మానుష్యంగా ఉంది అడవి. ఎక్కడో ఎత్తుగా ఎదిగిన చెట్ల శాఖలమీంచి దూకుతూ కనిపించిన కోతులూ, కొండ ముచ్చులూ…. కొంత దూరం తర్వాత నేను సమీర వెనక్కి తిరిగాం. మంజరి, సమత ముందుకెళ్ళారు. అంతకుముందే సత్య, గీత బృందం ఇంకో కిలోమీటరు దూరం వెళ్ళిపోయారు. మేం కొంత ఫోటోలు తీసుకుంటూ ఆలస్యం చేసి వెనకపడ్డాం.
వెనక్కొచ్చి కొండకోనల ఫోటోలు కొన్ని తీసుకునేసరికి ముందుకెళ్ళిన బృందాలు వెనక్కొచ్చాయి. అంతా కలిసి కొండదిగి బస్చు చేరాం. హరిత గెస్ట్‌ హౌస్‌ చేరి, కబుర్లూ నవ్వుల మధ్య టీతాగి బస్సెక్కాం. పాపులర్‌ డిమాండ్‌ని అనుసరించి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్‌ పార్సిల్స్‌ బస్సులో. 10.20 అయ్యేసరికి యాగంటి చేరాం. ఇక్కడి రాళ్ళ అందం వర్ణించనలవి కాదు. ఎరుపు, పసుపు, నలుపు, ఒకలాంటి నీలం రంగుల్లో మెరిసిపోయే ఆ రాతి పలకలూ, అవి అందంగా పేర్చితే తయారైనట్టున్న కొండలూ… ఈ కొండలన్నీ చుట్టూ కాపలా కాస్తుంటే మధ్యలో వెలిసినట్టున్న ‘యాగంటీశ్వరుడు’…
పదిహేను నిముషాలు ‘కాఫీ బ్రేక్‌’ తర్వాత 11.30 కల్లా బెలూమ్‌ గుహల దారి పట్టాం. ‘అవుకు’ రిజర్వాయర్‌, చెర్లపల్లి మైనింగ్‌ చూసుకుంటూ ప్రకృతి నాస్వాదిస్తూ, పైరగాలి పీలుస్తూ ‘బెలూమ్‌ గుహలు’ చేరాం. విశాల ప్రాంగణంలో, అర్థ చంద్రాకృతిలో సహజంగా ఏర్పడ్డ లోతైన గుహలు బెలూం గుహలు. వీటిని ఎక్స్‌ప్లోర్‌ చేయక పూర్వం ఇదొక బిలం అని భావించేవారనీ, బిలం కాస్తా ఆంగ్లేయుల మాటల్లో బెలుమ్‌ అయిందనీ చెప్పారు.
దక్షిణ భారతదేశంలో ఇదే అత్యంత పెద్దదైన గుహల వ్యవస్థ అని చెప్పచ్చు. ముఖద్వారం దగ్గర 10 మీ. లోతు, 10 మీ. వెడల్పు ఉన్న ఈ గుహలు 29 మీటర్ల లోతు వరకు సాగుతాయి. దారికిరువైపులా సహజంగా ఏర్పడ్డ స్టాలక్టైట్‌, స్టాలగ్మైట్‌ అమరికలు; కొన్ని చోట్ల విశాలంగాను, కొన్నిచోట్ల ఇరుకుగాను ఉండే, వివిధ ఆకృతుల్లో కనిపించే సొరంగ మార్గం; అక్కడక్కడ నీటి మడుగులు; ఇవన్నీ చక్కగా కనిపించేలా ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు (ఆర్ట్‌గేలరీలో పెయింటింగ్స్‌ కోసం ఏర్పాటుచేసిన ఫోకస్‌ లైట్స్‌ లా) … వీటన్నిటినీ చూస్తూ ముందుకు సాగితే కలిగిన అనుభూతి లోకాతీతమైనదంటే అతిశయోక్తి కాదు. పై నేలకు సమాంతరంగా సాగిన విశాల సొరంగ మార్గం మెల్లగా ఇరుకుగా మారి ఒకచోట మూడుగా చీలిపోయింది. రెండు దారులు వలయాకారంగా తిరిగి ఒకచోట కలుస్తాయి. ఇదంతా కలిపి మొత్తం మూడు కిలోమీటర్లకు పైగా సాగే దూరం. వేలాడే స్ఫటికాకృతులు గల ప్రదేశాన్ని ‘కోటి లింగాలు’ అని, నీటిమడుగు కనిపించే ప్రదేశాన్ని ‘పాతాళగంగ’ అని స్థానికులు పిలుచుకుంటారు. ఈ పాతాళగంగ మధ్యలో స్వయంభువైన శివలింగం కనిపిస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ జలధారలోకి పొరపాటున జారిపడితే ఎక్కడికి కొట్టుకుపోతామో అని జాగ్రత్తగా కదిలాం. ఆ నీటిని తాకితే ఒక అనిర్వచనీయానుభూతి. భూగర్భంలో ఎంత చైతన్యం!? ఎన్ని వింతలు?
‘ఇపుడు 30 అడుగుల లోతులో ఉన్నాం, ఇపుడు 40 అడుగుల లోతుకి చేరాం’ అంటూ చివరికి 120 అడుగుల లోతుకి చేరుతుంటే గాలి తక్కువవుతున్న భావనకి లోనై క్లాస్ట్రోఫోబిక్‌ ఫీలింగ్‌ కలిగింది. కొన్ని చోట్ల ఒక మనిషి మాత్రమే పట్టే సన్నని సొరంగ మార్గం. మసక చీకటి. కొన్ని ప్రత్యేక స్థలాల్లో ఆక్సిజన్‌ పంపింగ్‌కి ఏర్పాటు ఉంది. అంతా చూసి వెనక్కు తిరిగి బయటికి వచ్చేసరికి ప్రకృతి ప్రసాదాలైన గాలీ, వెలుతురూ ఎంత అమూల్యమైనదో కదా అనిపించింది! వీటిని మించిన వరాలు వేరే ఏమీ లేవనిపించింది.
వెనక్కు తిరిగి వస్తుంటే సొరంగ మార్గంలో ప్రతిమ, సుభాషిణి కనిపించారు. ప్రతిమకి అనుకోకుండా కలిగిన అస్వస్థత వల్ల వాళ్లిద్దరూ మాతో టూర్‌కి రాలేకపోయారు. మమ్మల్ని కలవడం కోసం ప్రత్యేకించి వచ్చి, మాతో కలిసి అక్కడ వనభోజనంలో పాలుపంచుకున్నారు. ఎంతో ఆదరభావంతో ఆత్మీయతతో మాకు భోజనం ఏర్పాట్లు చేసి, స్వయంగా వడ్డించారు సత్యవతి పరిచయస్తులు. కృతజ్ఞతలు చెప్పుకుని, ప్రతిభ, సుభాషిణిలకి వీడ్కోలిచ్చి మళ్ళీ ప్రయాణం కొనసాగించాం. అపుడు మధ్యాహ్నం రెండు గంటలు. 6 గంటలుపైగా ప్రయాణం ఉందన్నారు. ట్రావెల్‌ ప్లానింగ్‌లోనూ, మేనేజిమెంటులోనూ, సమయాన్ని సరిగ్గా ప్రణాళిక ప్రకారం విభజించి పాటించడంలోనూ గీత సూపర్బ్‌ అని చెప్పాలి. చల్లని నవ్వు, మెత్తని మాట వెనక దాగిన ఉమెన్‌ ఆఫ్‌ స్టీల్‌ అంటే అతిశయోక్తి కాదు. ప్లాన్‌ ప్రకారం టీమ్‌ని నడిపించడం గీత, సత్య.. ఇద్దరూ చక్కని బ్యాలెన్స్‌తో నిర్వహించారు.
మొత్తం టూర్‌లో ఇదే దీర్ఘప్రయాణం. కనుచీకటి పడేసరికి టీ బ్రేక్‌ కోసం ఆగాం. చాలా చక్కగా డ్రైవ్‌ చేస్తున్న డ్రైవర్నీ, చిరునవ్వుతో అందరికీ పళ్ళూ, స్నాక్స్‌ అందిస్తూ హుషారుగా తిరిగే రమేష్‌ (క్లీనర్‌) నీ అంతా మెచ్చుకున్నారు.
మళ్ళీ అడవి దారుల్లో వెన్నెల ప్రయాణం మొదలైంది. బస్సులో పాటలు ఊపందుకున్నాయి. అంత్యాక్షరీ కొంతసేపు, స్వేచ్ఛగానం కొంతసేపు, కొండ మలుపుల్లో నవ్వులు కురిశాయి. ఆహ్లాదం వర్షపు జల్లైంది. కొంతమంది నిద్రలోకి జారుకుంటే కొంతమంది ఇంకా పున్నమి చంద్రుడిలాగే పూర్ణబింబంలా వెలుగుతున్న చంద్రుడి అందాన్ని ఆస్వాదించారు. మొత్తానికి ఎవరికీ ప్రయాణం దీర్ఘమనిపించినట్టు లేదు! శ్రీశైలం చేరేసరికి 10 గంటలైంది రాత్రి. శ్రీ వాసవీ కన్యాకా పరమేశ్వరి సత్రంలో బస ఏర్పాటైంది ముందుగానే. ఇద్దరిద్దరికి ఒక్కొక్క రూమ్‌ కేటాయించారు. డబుల్‌ బెడ్స్‌ ఉండడంతో అందరికీ సౌకర్యంగా అనిపించింది. పద్మగారికీ, నాకూ ఒక రూమ్‌. వీలైనంతలో అందరికీ వీలుగా ఉండేలా రూములు కేటాయింపు శ్రద్ధతో చేసారు సత్యవతి, గీత. హాండ్‌బాగులతో రూములకి నడిస్తే సామానంతా మాదన్న ప్రభృతులు చేరవేశారు. అంత సామానూ వాళ్ళకి వదిలేయడం బాగా అనిపించక కొంతమంది మోయగలిగిన వాళ్ళ లగేజి స్వయంగా తెచ్చుకున్నాం- ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న గదులకి. హాయిగా స్నానం, భోజనం, నిద్ర.
ధ్యానం చేసుకుంటూ పడుకుంటే గాఢంగా నిద్రపట్టి, సరిగ్గా 4 గంటలకి మెలకువొచ్చింది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి వేడి నీళ్ళు అమ్మే మనిషి వచ్చి తలుపు కొట్టింది. ఒక బిందె రూ.20. ఇద్దరం చెరో బిందె కొనుక్కుని హాయిగా వేడినీటి తల స్నానం చేశాం. చాలా ఫ్రెష్‌గా అనిపించింది. తెల్లవారుజామున అలా తయారై బయటికి రాగానే, 5.30 కల్లా గుడివైపుకి దారి తీశారంతా. దారికటూ ఇటూ పూజ సామగ్రి అమ్మే షాపులు. నాకిదొక కన్నులపండుగైన దృశ్యం. ఆ రంగుల అమరిక, ఆ వాతావరణం ఒక అద్భుతమైన పెయింటింగ్‌లా కనిపిస్తుంది. తొలి సంధ్య వేళలో ఆ రంగులు ఒక రకంగా, మలి సంధ్యమేళలో మరో రకంగా ఆహ్లాదాన్నిస్తాయి! అప్పటికి పూర్తిగా తెల్లవారింది. ఎవరూ ఇపుడు షాపింగ్‌ చేయొద్దని, రాత్రి చాలా సమయం దొరుకుతుందని సత్య చెప్పింది. అంతా సత్రంలో రెండు భవనాలకీ మధ్యనున్న ఓపెన్‌ ఏరియాలో వేడి వేడి టీ కాఫీలు, టిఫిన్లు తీసుకున్నాం. మధ్యాహ్న భోజనం ఆలస్యమవుతుందని మళ్ళీ మళ్ళీ వడ్డిస్తే, ఇడ్లీ, వడ, పొంగల్‌ తినేశాం. మధ్యాహ్నం మిడ్‌ మార్నింగ్‌ స్నాక్‌లాగా తినడానికి పుణుకులు ప్యాక్‌ చేయించారు. ఉదయం 8.45 అయేసరికి అంతా బస్సులో సర్దుకున్నాం. మంచినీళ్ళు, కెమెరా వగైరాలతో హాండ్‌బాగులు బరువెక్కాయి.
9 గంటలకి రోప్‌వేలో రిజర్వాయర్‌ మీద ప్రయాణించి కొండల అందాలు ఆస్వాదించాం. తాడుకి వేళ్ళాడే ప్లాస్టిక్‌ బుట్టలో నలుగురు నలుగురు చొ||న డేమ్‌ మీదికి చేరాం. అక్కడినించి దిగి కొంతదూరం నడిచి మోటారు బోటు దగ్గరకొచ్చాం. ఈ దారంతా అటూ ఇటూ నదిలో వదిలేందుకు వీలుగా తయారు చేసిన పూల దొన్నెలు. ఇద్దరు ముగ్గురు వాటిని కొనుక్కున్నారు. బోటు ఎక్కేముందు వాటిని నీటిలో వదిలి వచ్చారు. అందరం బిలబిలా బోటెక్కి చిన్నపిల్లల్లా మంచి సీట్లకోసం పోటీపడ్డాం. హైదరాబాదులో ప్రయాణం మొదలైనపుడే గీత చెప్పింది ‘మొదట ఏ సీటులో కూర్చున్నారో అక్కడే ప్రయాణం ముగిసేదాకా కూర్చోవద్దనీ, ముందు కూర్చున్న వాళ్ళు వెనక సీట్లకి, వెనకవాళ్ళు ముందుకి మారుతూ కూర్చోవాలనీ’. అలాగే బస్సుదిగి మళ్ళీ ఎక్కిన ప్రతీసారీ వీలైనంతవరకు సీట్లు మారుతూ ముఖపరిచయాలు స్నేహాలుగా మారే ప్రయత్నాలు చేసుకున్నాం అందరం. పరిచయం పెరిగే కొద్దీ; వ్యక్తిగత వివరాలు, వ్యక్తులుగా ఒక్కొక్కరూ ఎదుర్కొన్న కష్టాలు తెలిసిన కొద్దీ ఒకరిపట్ల ఒకరికి గౌరవభావం, సహానుభూతి పెరిగాయి.
ఈసారి నాపక్కన శ్యామలగారు కూర్చున్నారు. ఇద్దరం కబుర్లలో మునిగాం. కొన్ని ఫోటోలు తీసుకున్నాం. కొద్దిగా ఎండ అనిపించినా చుట్టూ ఉన్న నీటి చల్లదనం వల్ల పరిసరాలన్నీ ఆహ్లాదకరంగా అనిపించాయి. చుట్టూ కొండలు. మధ్యలో నీటితో నిండిన విశాలమైన రిజర్వాయర్‌. ఒకటీ అరాగా కదులుతున్న బోట్లు, అలల తళతళలు. మేమెంతమంది ఉన్నామో షుమారుగా అంతమంది ఉన్న ఇతర ప్రయాణీకులు. రజిత ఒక ఫోటో తీయమంటే చుక్కాని దగ్గరకు నడిచాను. అక్కడ కూర్చున్న కుర్రవాళ్ళని రిక్వెస్ట్‌ చేస్తే జరిగి, తనకి బోటు చివరిదాకా వెళ్ళడానికి చోటిచ్చారు. టైటానిక్‌ భంగిమలో ఫోటో చాలా బాగా వచ్చింది. నవ్వుతూ ”మై బెస్ట్‌ ఫోటో!” అంది రజిత.
ఇంతలో మధ్యలో వేసిన కుర్చీలు అటూ ఇటూ జరిపి మధ్య చోటు ఖాళీ చేశారు సత్యా, సమతా. సమత కొన్ని పూలదొన్నె మధ్యలో పెట్టి బతుకమ్మ పాటలు పాడుతూ ఆ దొన్నె చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. ఒకరి తర్వాత ఒకరం అంతా ఆ అడుగుల్లో అడుగులు కలిపి లయబద్ధంగా చప్పట్లు కొట్టాం. అంతటా పండుగ వాతావరణం అలముకొంది. చూస్తున్నవాళ్ళు కొంతమంది హర్షిస్తే, కొంతమంది నొసలు విరిచారు.
నీటిమీద పడవ ప్రయాణాలు రెండు రకాలు. మోటారు బోటుమీద అలల ఊగులాట లేకుండా ప్రయాణించడం ఒకరకం. తెడ్లు వేసే తెరచాప పడవమీద గాలివేటుకి అనుగుణంగా అలలమీద ఊగుతూ సాగడం రెండోరకం. ఎలా ప్రయాణించినా కనిపించే దృశ్యమాలిక దాదాపు ఒకటే. జలాశయం ఏదైనా కూడా, చుట్టూ కొండలూ, చెట్లూ, పైని ఆకాశం, కింద కదిలే నీళ్ళూ కాలం చల్లని కార్తీకమాసం. లేత ఎండ. చల్లని గాలి. సృజనాత్మక హృదయాల సాన్నిహిత్యం. ప్రయాణం సరదాగా సాగింది.
బోటు ఒడ్డు చేరింది. దిగినచోటు నుంచి అక్కమహాదేవి గుహలు ఒక ఫర్లాంగు దూరంలో ఉన్నాయి. దారి ఎగుడు దిగుడుగా ఉన్న కాలిబాట. పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించినా అందరితోపాటు వాళ్ళూ అడుగులేశారు. ముఖ్యంగా సుజాతామూర్తిగారు, ఎక్కడా ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, చక్కని సానుకూల దృక్పథంతో, అభ్యుదయభావాలతో ఉత్సాహంగా ప్రయాణంలో పాలుపంచుకున్నారు. తను తెచ్చుకున్న సంచులు కూడా ఎవరినీ మోయనివ్వలేదు. చక్కగా తీరుగా ఉంచుకున్న శరీరాకృతితో ప్రయాణానికనువుగా ధరించిన సల్వార్‌ కమీజుల్లో మాతో నడిచిన ఆవిడ వయస్సు ఏడు పదులపై మాటే అంటే నమ్మడం కష్టం.
దూరం నించి గుహల ఆకారం కళాత్మకంగా కనిపించింది. ముఖద్వారంలాగా ఒక శిలాతోరణం. నీటి కోతవల్లో, గాలి ఒత్తిడివల్లో బలహీనమైన మట్టి కొట్టుకుపోగా మిగిలిపోయిన రాతి పొరలు ఎంతో అందమైన ఆకారాల్లో నిలిచిపోయాయి. వాటిని చుట్టుకుంటూ లతలూ, నాటి ఖాళీల్లో సర్దుకుని నిటారుగా ఎదిగిన హరిత వృక్షాలూ… కళ్ళారా వాటిని చూసుకుంటూ ముందుకి నడిచాం. మాతో వచ్చిన గైడ్‌ ఆ గుహల వైశిష్ట్యాన్నీ, శివునికోసం అక్కమహాదేవి చేసిన తపస్సు వివరాలనీ చెపుతుంటే వింటూ కొన్ని ఫోటోలు తీసుకున్నాం. బెలూమ్‌ గుహల మాదిరిగా ఇక్కడి విద్యుద్దీపాలు లేవు. అయితే ఈ గుహల సొరంగం నిడివి ఎక్కువలేదు. తిన్నగా వెళ్ళివస్తే అయిదు నిమిషాల ప్రయాణం. లోపల దారి ఇరుకుగా ఎత్తు తక్కువగా ఉంది. టార్చిలైట్లుగాని, బయట బడ్డీ కొట్లో అమ్మే కొవ్వొత్తులుగాని వెంట తీసుకెళ్లమని గైడ్‌ సలహా. కొంతమంది కొవ్వొత్తులు కొనుక్కున్నాం. ఒకరి తర్వాత ఒకరం లోపలికెళ్ళి బాగా తలవంచి కొంతదూరం వెళ్ళాక దారి వంపు తిరిగి మరీ ఇరుకైంది. కొవ్వొత్తి వెలుగులో అక్కమహాదేవికి శివదర్శనం లభించిన చోటు చూసి వెనక్కి వచ్చాం. మమ్మల్ని గైడ్‌ చేయడానికి మార్గమధ్యంలో ఒక గైడ్‌, లోపల మరొక గైడ్‌ అంతసేపు గుహల లోపలే ఉన్నారు. మాలాంటి వాళ్ళకి ఆ  పది నిముషాలే ఊపిరాడనట్టుగా అనిపించింది. గుహల అంతర్భాగం దాదాపుగా బెలూమ్‌ గుహల మాదిరిగానే ఉంది – స్పటికాకార స్టాలక్టెట్‌ స్టాంగ్మైట్‌ గోడలతో. ప్రవేశద్వారం దగ్గర అక్కమహాదేవి విగ్రహం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఒంటరిగా ఉండిపోయిన ఒక స్త్రీ మూర్తి ధ్యానంలో మునిగి కనిపించింది. ఒక మూలగా చిన్న బడ్డీ కొట్టు ఉంది. అక్కడ టీ, కాఫీలు, కొవ్వొత్తులు, బిస్కట్లు అమ్ముతున్నారు. సత్య అందర్ని అడిగి కావాలన్న వాళ్ళకి కాఫీ ఇప్పించారు. కొంతసేపు తీరుబాటుగా ఆ రాతి పలకలమీద కూర్చుని కబుర్లాడుకుని, నవ్వుకుని తిరుగుదారి పట్టాం.
రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట సేదతీరి, మళ్ళి 3 గంటలకి జెన్‌కో పవర్‌హౌస్‌కి ప్రయాణమయాం.  నీరు ప్రవాహ వేగంవల్ల టర్బైన్లు తిరగడం, విద్యుచ్ఛక్తి జనించడం, వాటికి సంబంధించిన యంత్రాలు వివరిస్తూ చూపించాడు అక్కడున్న యువ ఇంజనీరే. దేశంలోని 12 అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టులలో ఇది ఒకటి. సన్నని నిచ్చెన మెట్లమీదుగా నాలుగైదు అంతస్తులు ఎక్కీ దిగీ అన్నీ చూసేసరికి కొంత అలసట అనిపించింది. అక్కడినుంచి ప్రత్యేక అనుమతితో డామ్‌ దాకా వెళ్ళాం . అయిదుగురు సభ్యుల జట్లుగా చీలి, ఒక జట్టు తర్వాత మరొకటిగా. లోపల పెద్ద పెద్ద తేనె తుట్టెలున్నాయని, నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళాలని, శబ్దమయితే అవి డిస్టర్బ్‌ అయి వెంటపడి కుడతాయని హెచ్చరించారు ముందుగానే. శ్రీకృష్ణ కమీషన్‌ సభ్యులు వెళ్ళినపుడు వెంటాడి కుట్టాయని చెప్పారు. జాగ్రత్తగా లోపలికి వెళ్ళాం. డామ్‌ మీద నుంచి మరింత స్పష్టంగా అందంగా కనిపించాయి కొండలూ, తుంగభద్రానదీ ప్రవాహం. తళ తళలాడుతున్న నీళ్ళు సంజవన్నెల్లో మనోహరంగా కనిపించాయి.
వానగాని, సెలయేరుగాని, నిండుగా పారే నదిగాని, ఉవ్వెత్తున ఎగిసిపడే కడలి తరంగాలు గాని, ఉధృతమైన జలపాతంగాని, గల గలమంటూ గులకరాళ్ళమీదకి దూకే పిల్లఏరుగాని స్వచ్ఛమైన నీటికి సంబంధించిన ఏ దృశ్యమైనా ఏ శబ్దమయినా ఎంత ఆహ్లాదాన్నిస్తుందో! లోగొంతులో చిన్నగా మాట్లాడుకుంటూ, కళ్ళతో ప్రకృతి రామణీయతని ఆస్వాదిస్తూ వెనక్కి వచ్చాం. డామ్‌ దగ్గర ఇద్దరు ముగ్గురు ఫోటోగ్రాఫర్స్‌ పదిరూపాయలకొక ఫోటో అంటూ కనిపించారు. భూమిక అందరికీ తలో ఫోటో స్పాన్సర్‌ చేసింది, ఆనకట్ట నేపథ్యంగా.
అయిదవుతుంటే అంతా బస్సెక్కి ఫాలధార-పంచధార చేరాం.  కొండ పగుళ్ళనుంచి పంచధారలుగా (ఐదు ధారలుగా) ఉరికి వచ్చే జలాలు చల్లగా ఏ కాలంలో అయినా ఒకే మాదిరిగా ప్రవహిస్తాయట. వీటిలో ఒక్కొక్క ధార ఒక్కొక్క రుచితో ఉంటుంది. శివుని ఫాలం నుండి కిందికి దూకే ధారలుగా వీటిని ఫాలధార అని చెప్పుకుంటారు. రాళ్ళు, నీళ్ళు, చెట్లు- ఈ మూడిటినీ ఒకేచోట మనసారా చూడగలిగితే గొప్ప ప్రశాంతత లభిస్తుందనిపించింది ఇక్కడ కొంతసేపు గడిచేసరికి. ఆ రా తి  మెట్లన్నీ ఎక్కుతూ, నీటితుంపర్ల చల్లదనాన్ని అనుభవిస్తూ, చెట్లగాలి పీలుస్తూ బస్సు ఆగినచోటికి చేరాం. దారిలో మెట్లకి రెండు వైపులా మూలికలూ, ఆకులూ, మొక్కలూ, బెరళ్ళూ అమ్ముకునేవాళ్ళు కనిపించారు. చిన్న కవర్లో పెరుగుతున్న సరస్వతి మొక్కని కొన్నాను వర్షిణి కోసం. బస్సు ప్రక్కనే చాయ్‌ దుకాణం. అందరం చిరుచలిలో వేడి టీ తాగి పూర్తిగా చీకటి పడేసరికి సత్రం చేరుకున్నాం. ఎనిమిదింటిదాకా అక్కడి షాపుల్లో గాజులూ, పూసలూ వగైరాలు కొనుక్కుంటూ తిరిగారంతా. ఎనిమిదిన్నరకి శనివారం టిఫినుగా ఉప్మా, తర్వాత అందరం సత్రం మేడమీదున్న విశాలమైన ఆవరణలోకి రూముల్లో ఉన్న చాపలు తీసుకునివెళ్ళి, పరుచుకుని తీరిగ్గా సమావేశమయ్యాం. అయిదు నిమిషాల పిచ్చాపాటీ కాగానే ఈ యాత్రపట్ల సభ్యులందరి స్పందన అడిగింది గీత. అంతా తమ తమ అభిప్రాయాలూ, అనుభూతులూ పంచుకున్నారు. కుటుంబాలతోనో, విడిగానో చేసే యాత్రలకీ, భూమిక యాత్రలకీ మధ్య తారతమ్యాన్ని రకరకాలుగా వివరించారు. ఈ యాత్రలో ఎవరికి వారు తమ అస్తిత్వాన్ని అనుభూతించగలిగామని, ఇతర బాధ్యతల్లోనో బంధనాల్లోనో ఒత్తిళ్ళలోనో మరిచిపోయిన తమ స్వంత వ్యక్తిత్వాన్ని, ఇష్టాయిష్టాలని గుర్తించగలిగామని అన్నారు. అప్పుడు సత్యవతి కల్పించుకుని ”ఇలాగే మీరంతా కూడా యాత్రలు ప్లాన్‌ చేయలబ్బా! ఎపుడూ మేమే చేయాలని ఆశించకుండా మీరు కూడా ముందుకు రావాలి. ఏ పనైనా మొదలు పెట్టిన వాళ్ళే ఎప్పటికీ దాన్ని నిర్వహించాలంటే ఎలా? ఈసారి మీరెవరైనా నిర్వహిస్తే నేనూ జాయినవుతాను. లేకపోతే లేదు” అంది చిరుకోపంతో.
”మీకున్న కాంటాక్ట్స్‌! దక్షత మాకు లేవు మేడమ్‌. మరెలా ఇంత ట్రిప్పు ప్లాన్‌ చేయడం?” అన్నారు శోభ.
”అయితే చిన్న ట్రిప్‌ ప్లాను చెయ్యండి. తక్కువ సదుపాయాలున్నా ఫర్వాలేదు. అయినా ఎవ్వరూ తెలియని గౌహతి లాంటి చోట  పొద్దుటినుంచి సాయంత్రం దాకా ఖాళీ సమయం దొరికితే నేనేం చేశానో చెపితే మీరు నమ్మరు. ఒక ఆటో మాట్లాడుకుని అతనికి నేను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చెప్పి అవన్నీ చూపించి సాయంత్రం నాలుగింటికల్లా ఎయిర్‌పోర్ట్‌లో నన్ను దింపాలని మాట్లాడుకున్నాను. అతను ఒప్పుకుని ఎంతో శ్రద్ధతో అన్నీ చూపించి, వాటి గురించి చక్కగా వివరించి, నాలుగయ్యేసరికి ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చాడు. చివరికతను మంచి ఫ్రెండయిపోయాడు. ప్రపంచమంతా చెడ్డవాళ్ళే ఉండరండీ. ఎక్కువశాతం మంచి వాళ్ళే ఉంటారు. భయపడి బయటకి రాకపోతే ప్రోగ్రెస్‌ ఎలా అవుతామండీ?” అని ప్రశ్నించింది సత్య.
అపుడు కొందరు వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని క్లిష్టపరిస్థితుల గురించి, చేదు అనుభవాల గురించి వివరించారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్టవాలో తెలుసుకోవాలనీ, ఆటో ఎక్కినపుడు పరిసరాలు గమనించకుండా సెల్‌ఫోన్లలో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకుంటూ అలౌక్యంగా ఉండకూడదనీ, దుర్మార్గులు కూడా పిరికిగా, అపనమ్మకంగా ఉండేవాళ్ళనే టార్గెట్‌ చేస్తారని అంది సత్య. అంతా ఆలోచనల్లో మునిగారు.
(తరువాయి భాగం మరోసారి )

January 1, 2012

సహజీవనం

Radio అందుబాటులో ఉండి, పన్నెండు నిమిషాల సమయం ఉంటే..........
 ఈ రోజు రాత్రి 8 .15  గంటలకు ఆకాశవాణి అన్ని తెలుగు చానళ్ళ నుంచి కథా ఉత్సవం లో భాగంగా నా కథ ' సహ జీవనం ' ప్రసారమవుతుంది.
వచ్చే ఆది వారం సాయంత్రం  నారీ భేరి కార్యక్రమంలో మరి కొంత మందితో ' పుస్తక pathanam - తల్లుల కర్తవ్యం ' అంశం  మీద  పంచుకున్న  నా  అభిప్రాయాలు   ETV 2  నుండి  4PM  కి ప్రసారమవుతాయి. వానచినుకులనాస్వాదించే మిత్రుల అమూల్యాభిప్రాయాలకు స్వాగతం !