వీడని రక్షా బంధనం-వాడని మమతకు వందనం !
---------- వారణాసి నాగలక్ష్మి
"నేను నా ఆత్మ కోసం వెతికాను.కానీ
నా ఆత్మ నాకు కనిపించలేదు. నేను నా దైవం కోసం వెతికాను.కానీ
దైవం కూడా నాకు కనిపించలేదు. నేను నా సోదరుని కోసం వెతికినపుడు
నేను ఆశించిన మూడూ నాకు లభించాయి !"
సోదరుడంటే ఏమిటో ఒక సోదరి ఇచ్చిన
నిర్వచనమది !
ఒక అన్నగారు ‘తన చెల్లెలు వేయిమందిలో ఒకతె అని పువ్వులూ,తారలూ చెపుతున్నా’యంటూ ,తామిద్దరూ జీవించినంతకాలం
కలిసే ఉంటామని చెపుతూ ఆర్ద్రంగా పాడిన పాట,ఒక హిందీ చిత్ర గీతం, మనందరం ఎన్నొ సార్లు విన్నదే. తెలుగు సినీ గీతాల్లో కూడా అన్నాచెల్లెళ్ళ
అనురాగాన్ని వర్ణిస్తూ ఎన్నో పాటలు రచించారు గీత రచయితలు.
'అన్నా! నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్య ఫలం' అని ఒక చెల్లి తలచుకుంటే
‘అన్నయ్య లాంటి కన్నయ్య వుంటే
కన్నులే అక్కర్లేదనీ , ఆ అన్నయ్య చల్లగ నవ్వక పోతే వెన్నెలెంత విరిసినా నిరుపయోగ’మనీ మరో చెల్లెమ్మ పాడుకుంటుంది.కథల్లోనూ, కవితల్లోనూ ఎంతగా వర్ణించినా
ఆ అనుబంధపు గాఢతా ,పవిత్రతా అనుభవైకవేద్యమే గాని వర్ణించసాధ్యమైనది కాదంటారు ఆ భాగ్యాన్ని పొందిన
అదృష్టవంతులు.
మన దేశం వర్ణశోభితమైన పండుగలకూ, ఉల్లాస ఉత్సాహాలకు
మారుపేరైన ఉత్సవాలకీ పెట్టింది పేరు! పరిమళ భరితమైన ,వన్నెవన్నెల పువ్వులూ,ఒంపులు తిరిగే రంగ వల్లులూ, చవులూరించే విందు భోజనాలూ,రుచికరమైన మిఠాయిలూ,నూతన వస్త్రాలూ,బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ
ఆనందాన్ని ద్విగుణీకృతం చేసుకునే ఆచార వ్యవహారాలూ…..లైఫ్ ఈజె సెలబ్రేషన్ అనే ధోరణిని మనలో పెంపొందిస్తాయి
!
సోదరీ సోదరుల మధ్య గల అనురాగ బంధాన్ని శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు వచ్చే రాఖీ పండుగ ఉత్సవం గా జరుపుకుంటారు. ఆ అనుబంధంలోని ప్రేమనూ,ఆప్యాయతనూ ఈ పండుగ రోజున
ఒకరికొకరు ప్రకటించుకుంటారు.అక్కచెల్లెళ్ళు తమ సోదరులు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ,
సకల భోగ భాగ్యాలనూ
పొందాలని ప్రార్ధించుకుంటారు.అన్నదమ్ములు తమ సోదరీ మణుల చేత కుడిచేతి మణికట్టుకు రాఖీ కట్టించుకుని ,వారందించిన మిఠాయిలు తిని,తమకు తోచిన బహుమతులందించి
, వారికే ఆపదా
రాకుండా రక్షించుకుంటామనీ, జీవితాంతం వారి మంచి చెడ్డలు చూసుకుంటామనీ మాట ఇస్తారు.
సున్నితమైన అన్నా చెల్లెళ్ళ మధురానుబంధాన్ని నాజూకైన రంగుల పట్టుదారంతో చేసిన కళాత్మకమైన రాఖీ
బంధనం ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. అందంగా అలంకరించిన రాఖీ
దారం పవిత్ర సూత్రమై, అత్యంత సుందరమైన అన్నా చెల్లెళ్ళ
అనుబంధాన్ని వీడని బంధంగా నిలుపుతుందని నమ్ముతారు. ఈ పండుగ కొక సామాజిక
ప్రయోజనమూ వుందని తోస్తుంది. పుట్టుకతో సహోదరులు కాకపోయినా మానసికంగా సోదర భావం కలిగి వున్న
ఇద్దరు స్త్రీ పురుషులు రాఖీ బంధనంతో ఆ పవిత్ర బంధాన్ని అనుభూతించగలుగుతారు.ఆ స్త్రీ
తను రాఖీ కట్టిన వ్యక్తిని సోదరుడుగా భావించి అతని సర్వతోముఖాభివృద్ధినీ, సుఖ శాంతులనూ కోరుతుంది.ఆ
పురుషుడు తనకు రాఖీ కట్టి సోదరిగా మారిన స్త్రీ యొక్క రక్షణ తన కర్తవ్యంగా భావిస్తాడు.
ఇలాంటి పండుగల వల్ల ఆ సమాజం చక్కని కట్టుబాట్లకు లోబడి నడిచే ఆదర్శ సమాజంగా రూపొందే
సావకాశం ఏర్పడుతుది.
భావనలే అలోచనలవుతాయి.అలోచనలే ఆచరణలకు
దారితీస్తాయి. సత్కార్యాచరణను ప్రొత్సహించే సంప్రదాయాలు చక్కని సమాజ నిర్మాణానికి దోహదం
చేస్తాయి.
సాధారణంగా మనం జరుపుకునే ప్రతి పండుగ
గురించీ పురాణాలలో బహు విధాలైన ప్రస్తావనలు
కనిపిస్తూ వుంటాయి. శ్రీ కృష్ణుడి చేతి మణికట్టుకి గాయమైనపుడు ద్రౌపది తన పట్టుచీర
కొంగుని చింపి గాయానికి కట్టు కట్టిందనీ, ఆ చర్యతో ద్రౌపది తన పట్ల ప్రకటించిన
సోదర ప్రేమకు విచలితుడైన శ్రీ కృష్ణుడు ఆ తరువాత అనేక దశాబ్దాల పాటు ఆమెను కంటికి రెప్పలా
కాపాడుతూ,ఎన్నో సందర్భాలలో ఆమెను ఆదుకున్నాడనీ మహా భారత కథ చెపుతుంది.
శ్రీ కృష్ణుడు రాఖీ బంధనం నాడు వరుసకు చెల్లెలైన ద్రౌపదికి తానిచ్చిన మాటను ద్రౌపదీ
వస్త్రాపహరణ సమయంలో ఆమె మానరక్షణ చేయడం ద్వారా నిలబెట్టుకున్నాడని తెలుస్తొంది.
విష్ణు భక్తుడైన బలి చక్రవర్తి సామ్రాజ్యంలో
శ్రావణ పౌర్ణమి నాడు మారువేషంలో మహా లక్ష్మి స్వయంగా వచ్చి బలి చక్రవర్తి చేతికి రాఖీ
కట్టిందనీ, ప్రతిగా బహుమతి కోరుకొమ్మని చక్రవర్తి అడిగినపుడు తన సౌధాన్నీ, భార్య సాన్నిధ్యాన్నీ వదలి
వచ్చి భక్తుని
రక్షణలో మునిగిపోయిన మహా విష్ణువుని తనకు తిరిగి ప్రసాదించమని లక్ష్మీ దేవి కోరుకుందనీ
ఒక కథ.తన చేతికి రాఖీ కట్టిన స్త్రీ సాక్షాత్తూ మహ లక్ష్మి అని తెలిసిన బలి చక్రవర్తి
ఆమె చేత రాఖీ కట్టించుకున్న తన భాగ్యానికి
పొంగిపోయి, విష్ణు మూర్తిని ప్రార్ధించి
ఆమె కోరిక తీర్చాడని ఈ కథ తెలియజేస్తుంది.
యమధర్మరాజు సోదరి అయిన యమునా
నది తన సోదరుడికి రాఖీ కట్టి, బహుమతిగా చిరాయువుని పొందిందని మరో కథ.తన చెల్లెలి అనురాగానికి
ముగ్ధుడైన యముడు ,ఇకముందు ఎవరైతే తమ సోదరి చేత రాఖీ కట్టించుకుని, ఆమె రక్షణ బాధ్యత స్వీకరిస్తారో వారికి మరణం వుండదని వరమిచ్చినట్టుగా ఈ కథలో చెప్పబడింది!
గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ రాజా పురుషోత్తముడి పై యుద్ధానికి సిద్ధపడినపుడు, పురుషోత్తముడి పరాక్రమం
గురించి తెలిసిన అలెగ్జాండర్ భార్య ,హిందూ యువతి అయిన రుక్సానా, పురుషోత్తముని చేతికి రాఖీ కట్టి ,బహుమతిగా తనను ’ సౌభాగ్యవతిగా దీవించ’మని కోరుతుంది.సోదర భావం మూర్తీభవించిన పురుషోత్తముడు ఆమెకు
మాట ఇస్తాడు .యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం మీద నుంచి పడిపోయినపుడు, అతన్ని తుదముట్టించబోయిన పురుషోత్తముడికి మణికట్టుకున్న రాఖీ కనిపించి తానిచ్చిన మాట గుర్తుకొస్తుంది.అలెగ్జాండర్ని
ప్రాణాలతో విడిచిపెట్టి ఆ కారణంగా యుద్ధంలో ఓడిపోతాడు పురుషోత్తముడు.రాజ్యాలూ,సంపదలే కాక ప్రాణాలు కూడా సోదరికోసం త్యాగం చేయడానికి
సిద్ధపడ్డ సోదరుల సరసన రాజా పురుషోత్తముడు
చరిత్రలో నిలిచిపోయాడు !
గుజరాత్ సుల్తానైన బహదూర్ షా చిత్తూరు
మీదకి దండెత్తి వచ్చినపుడు వారినెదిరించే శక్తి తమ సేనలకు లేదని గ్రహించి, వితంతువైన చిత్తూరు మహారాణి కర్ణావతి , మొఘలు చక్రవర్తి హుమాయూను
సహాయమర్ధిస్తూ రాఖీని పంపిందని చరిత్ర చెపుతోంది. రాఖీ అందుకున్న హుమాయూను
చక్రవర్తి తక్షణమే తన సేనలతో బయలుదేరి చిత్తూరు
చేరేసరికే, చిత్తూరు
కోటను హుమాయూను వశపరచుకున్నాడనీ ,
పదమూడువేలమంది
అంతఃపుర కాంతలతో రాణి ప్రాయోపవేశం చేసిందనీ
,హుమాయూను చిత్తూరు చేరగానే బహదూర్
షా ను పారద్రోలి, కర్ణావతి కుమారుడైన విక్రంజీత్
సింగ్ కి రాజ్యం కట్టబెట్టాడనీ , అప్పటినుండి రాఖీ పౌర్ణమి మరింత ప్రాచుర్యంలోకొచ్చిందనీ చెప్తారు.
రాఖీ పండుగ నాడు లక్ష్మీ దేవిని
పూజించి, గంధమూ ,కుంకుమతో అందంగా అలంకరించిన పళ్ళెంలో తిలకమూ,బియ్యమూ,వత్తులు వేసి నూనె నింపిన
ప్రమిద తో పళ్ళేన్ని సిద్ధం చేస్తారు.ఒక పక్కగా తాజాగా తయారు చేసిన మిఠాయిలనూ ,రాఖీలనూ అమర్చుతారు.అన్న దమ్ములనూ లేదా సోదర భావమున్న ఇతర
బంధుమిత్రులనూ కూర్చోపెట్టి, వారికి తిలకం దిద్దుతారు.వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రార్ధన
చేసి రాఖీని కుడిచేతి మణికట్టుకు బంధిస్తారు.దీపం వెలిగించి హారతిస్తారు.సోదరిని ఎప్పటికీ
ప్రేమానురాగాలతో చూసుకుంటాననీ, జీవితాంతమూ ఆమె రక్షణ బాధ్యత వహిస్తాననీ వచిస్తూ సోదరులిచ్చిన
బహుమతిని స్వీకరించి, వారికి మిఠాయిలను తినిపిస్తారు.
సమాజంలో ఒకవైపు అశాంతీ, అనైతికతా,అత్యాచారాలూ పెచ్చుపెరుగుతున్న తరుణంలో ఇటువంటి పండుగల ద్వారా
సద్భావాలూ ,సత్సంప్రదాయాలూ వ్యాప్తి చెందడం హర్షణీయం.అయితే ఈ ఉత్సవాలు కేవలం కాలక్షేపానికో
,తమ అంతస్తునూ,
ఐశ్వర్యాన్నీ నలుగురికీ
ప్రదర్శించుకుందుకో కాకుండా ఈ పండుగలోని మూల సూత్రాన్ని అర్ధం చేసుకుని తదనుగుణంగా
తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటే మరింత మెరుగైన సమాజంలో మనమంతా నివసించగలుగుతాం.చక్కని
క్షేమ కరమైన సమాజాన్ని భావితరాలకందించ గలుగుతాం !
దక్షిణాది రాష్ట్రాలలో శ్రావణ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అంటారు. ఈ రోజు
నదిలో స్నానం చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి
గాయత్రీ మంత్ర జపమాచరించి పాత జంధ్యాన్ని విసర్జిస్తారు. మూడు పోగుల యజ్ఞోపవీతం వటువు
చేసే కర్మలన్నిటినీ మనసా(గాయత్రీదేవి),వాచా (సరస్వతీ దేవి),కర్మణా(సావిత్రీ దేవి)చేయాలని
(త్రికరణ శుద్ధిని సాధించాలని) సూచిస్తుంది.
నూతన యజ్ఞోపవీత ధారణతో 'ఇకపై మేలైన ప్రవర్తనను కలిగివుంటా’నని దృఢంగా సంకల్పిస్తూ
, గడచిన సంవత్సర కాలంలో తాను చేసిన పాపాలకు క్షమాపణ వేడుతూ
పాత యజ్ఞోపవీతాన్ని విడి చిపెడతారు. ఈ మార్పునే ఉపక్రమ
అంటారు. ఉపక్రమ అంటే ప్రారంభమని (ఉపక్రమించడం)అర్ధం.
మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో ఈ రోజు భక్తులు సముద్రతీరానికి వెళ్ళి కొబ్బరికాయలు సమర్పించే
ఆచారం ఉంది.అందువల్ల దీన్ని నారికేళ పూర్ణిమ అనీ నార్లీ పూర్ణిమ అని కూడా అంటారు.ఈ రోజే హయగ్రీవ జయంతి కూడా.మధు కైటభులనే
రాక్షసులు వేదాలను తస్కరించి సాగర గర్భంలో దాచారనీ, మహావిష్ణువు మానవ శరీరమూ, గుర్రపు తలా గల హయగ్రీవుడి రూపం దాల్చి రాక్షస సమ్హారం చేసి
వేదాలను తిరిగి తీసుకు వచ్చాడని పురాణ కథ.వేదాలలోని జ్ఞాన సంపదను తిరిగి మానవాళికందించిన
హయగ్రీవుణ్ణి విద్యాదాతగా,జ్ఞానదాతగా కొలుస్తారు!
'రేషం కీ డోరీ సే సంసార్
బాంధా హై 'అని ఒక హిందీ కవి చెప్పినట్టు మనిషికీ మనిషికీ మధ్య గల అనుబంధాలే సంసార జగత్తుని
నడిపిస్తున్నాయి.ఆ అనుబంధాలు వాటి వాటి పరిధుల్లో క్షేమకరంగా సాగినంతకాలం సమాజమూ సవ్యదిశలో
ముందుకు సాగుతుంది!.
ఈ పండుగకు నెలరోజుల ముందునుంచే రాఖీలనమ్మే
షాపులు బజారు నిండా దర్శనమిస్తాయి.పరుగు జీవితంలో తీరిక చిక్కని వారు బజారులో దొరికే
స్వీట్లూ,రాఖీలతో ఈ పండుగ జరుపుకున్నా ,సమయమూ ,సరదా రెండూ వున్న వాళ్ళు స్వీట్లతో పాటు రాఖీలను కూడా సొంతంగా
తయారు చేసుకోవచ్చు.
తమ సృజనాత్మకతకు తగినట్టుగా రాఖీని ఎన్నొ రకాలుగా తయారు చేయవచ్చు.తేలికగా చేసుకోగలిగే ఒక పద్ధతిని చూద్దాం.
తమ సృజనాత్మకతకు తగినట్టుగా రాఖీని ఎన్నొ రకాలుగా తయారు చేయవచ్చు.తేలికగా చేసుకోగలిగే ఒక పద్ధతిని చూద్దాం.
పాతిక అంగుళాల పొడవున్న పట్టుదారపు
పోగులని తీసుకోండి.ఇష్టాన్ని బట్టి నాలుగైదు వేర్వేరు రంగుల్ని కూడా ఎన్నుకోవచ్చు.
ఒక నూలు దారంతో ఈ దారాల పోగుకి నాలుగోవంతు
భాగం దగ్గర ఒక ముడిని వేయండి.ముడికి ఒక వైపు పొడుగ్గా వున్న దారాల పోగుని రెండు సమాన
భాగాలుగా విడదీసి రెండిటినీ విడి విడిగా జడల మాదిరిగా అల్లుకుంటూ రండి .అల్లిక పూర్తి కాగానే చివరలను
ముడి వేసి అంచులని టూత్ బ్రష్ లాంటి గట్టి బ్రష్ ఉపయోగించి కుచ్చులుగా చేయాలి. ముడికి
రెండో వైపున్న ఒకవంతు భాగాన్ని టూత్ బ్రష్ లాంటి గట్టి బ్రష్ తో దువ్వి విడి విడి దారాలని
కుచ్చుగా తయారు చెయ్యండి
ఇలా తయారైన బేసిక్ రాఖీ మీద పూసలూ,తళుకులూ 'ఇన్స్ టంట్ గ్లూ'
తో అంటించి అందంగా,ఆకర్షణీయంగా అలంకరించుకోవచ్చు.
ఇవాళ్టి ఫ్రెండ్షిప్ బాండ్స్ ఈ రాఖీల
రూపాంతరాలుగా చెప్పుకోవచ్చు.పరిచయం స్నేహపు పరిధిని దాటి ముందుకు పోతుంటే, అది ఇష్టం లేని అమ్మాయి
రాఖీ కట్టడం ద్వారా 'మనం స్నేహితులుగానే
ఉండిపోదా'మని మృదువుగా
తెలియ జేసే పద్ధతి ఈ రోజుల్లో కళాశాల ప్రాంగణాలలో కనిపిస్తూవుంది.
స్నేహం, ప్రేమగా పెళ్ళిగా పరిణమించాలనీ, ఆ విషయంలో ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో
పనిలేకుండా తను కోరినదే జరిగితీరాలనీ మూర్ఖంగా అలోచిస్తూ,తన దారికి రాని అమ్మాయిల
మీద పైశాచికంగా యాసిడ్ దాడులకు పూనుకునే అబ్బాయిల్లో మంచి మార్పు రావాలనీ ,లివ్ అండ్ లెట్ లివ్ సూత్రాన్ని పాటిస్తూ, రవీంద్ర కవీంద్రులు కోరినట్టుగా మనమంతా వసుధైక కుటుంబంలో
భాగంగా జీవించాలనీ ఈ సందర్భంగా కోరుకుందాం. ఈ సంవత్సరం ఆగస్టు రెండవ
తారీఖున రాబోయే రాఖీ పండుగ సౌభ్రాతృత్వాన్నీ, సద్భావనా సమృద్ధినీ అందిస్తుందని ఆశిద్దాం !
* * *
బాగుంది మీ వీడని రక్షా బంధనం...
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారు!
ReplyDelete