వెదురు బొంగుని వేణువుగా ఊదుతూ
పొలాల కావల బీడంతా తిరుగుతాడు
పసుల కాసే ఆ పసివాడు..
పెద్దల సేవా పిల్లల ఆలనా
పెద్దింటి కోడలిగా పనుల్లో సతమతమై
మనసూ తనువూ అలసిన వేళ..
అనుకోకుండా వినిపిస్తుంది వాడి మురళి
చల్లని పిల్ల గాలిలా వచ్చి నన్ను చుట్టేసి
కట్టేస్తుంది!
మబ్బు పట్టిన మధ్యాన్నం ఒకలా
గుబులు పుట్టే శిశిర సంధ్యలో ఇంకోలా
చిక్కని మౌనం కప్పిన చీకటిలో మరోలా..
వెన్నెల్లోనూ, కొమ్మల నీడల్లోనూ
విరిసే పూలమీదా,తడిసిన ఆకుల మీదా ....
అంతటా ఆ పాట వ్యాపిస్తుంది
పాపాయికి పాల బువ్వా , బుజ్జాయికి గోరుముద్దా
తినిపించి ,జోకొట్టి నిదురపుచ్చి,
పతి సాన్నిధ్యంలో పవళించే వేళ
ఆ పాట అలలు అలలుగా తేలి వస్తుంది. .
వచ్చీరాని వాడి పాట..
గాలివాటున వొచ్చేసి
నా గుండెలో గూడు కట్టేస్తుంది..
వాడి అవ్యక్త భావాలెన్నిటినో
నా మస్తిష్కంలో పేరుస్తుంది..
ఆ పాటలోని తడి నా కంటిలోకి జారి
కన్నీరై పోతుంది ...
ఎవరింటి పసి వాడో ..ఎవరింట పని వాడో ..
పిడికెడన్నమైనా తిన్నాడో.. పస్తున్నాడో..
అమ్మ గోరుముద్దల రుచి తెలుసో లేదో ..
పాల బుగ్గల పసితనం కరిగిందో లేదో..
ఊరుమాటు మణిగేదాకా గొడ్ల పనీ ఇంటి పనీ కానిచ్చి
దొర కోసం పక్క పరిచి కాళ్ళు పిసుకుతాడు కాబోలు!
లోకమంతా కలల్లో తేలే వేళ
మురళి తీసి మోవికానిస్తాడు !
జాబిల్లి చల్లదనం, వెన్న ముద్ద కమ్మదనం
కన్నయ్య కన్నుల్లో జాలువారే కరుణరసం
రంగరించి రసం తీసి వేణువులో చొప్పిస్తాడు !
వెతలన్ని మరపిస్తూ వెదురునే మురిపిస్తాడు !
తల్లడిల్లే హృదయాలని తల్లిలా ఊరడిస్తాడు..
వేదననే నవ్వించే వేదాంతి తానై
అమ్మలకే జోలపాడి జోకొడ తాడు !
అందమైన పదాలతో భావం బాగుందండి.
ReplyDeleteThank you Padmarpita garu !
ReplyDelete