ఉగాది వస్తోందిట !
ఎవరో చెప్పారు...
దేనితో స్వాగతించను?
ఏమీ తోచలేదు..
అరవయ్యేళ్ళ పాత పెంకుటిల్లు
ఆరంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్సుగా
మారే క్రమంలో
గూళ్లు కోల్పోయిన గువ్వలతో పాటే
అంతరించిపోయిందేమో
ప్రతిసారీ కుహూ కుహూ అంటూ
ఉగాదిని స్వాగతించే
కోకిలమ్మ వినిపించకుండా పోయింది !
రెమ్మా కొమ్మా కనిపించని కాంక్రీటు
అడవిలో
శిశిరానికీ వసంతానికీ
తేడా ఏముందని ఆమని అలిగింది!
ఇన్నేళ్లూ శిశిరంలో ఆకులు రాల్చెసి
వసంతం లొ చిగురులు తొడిగి
పూలతో కాయలతో
పిల్లలూగే ఉయ్యాలలతో
కళ కళలాడే చెట్లతో పాటే
మావి పూతల్లో చెలరేగే కూతలమ్మ కూడా
మౌనగీతమై కనుమరుగై పోయింది !
గుమ్మాలకి వాడని ప్లాస్టిక్ ఆకుల
తోరణాలు స్వాగతిస్తే
సెల్ ఫోను రింగు టోనై కొకిల కూత
పలకరిస్తే
ఉగాది వస్తుందా ?
వస్తుందేమో....
ఆశల చిగురుల గుబురుల్లో
కోకిలల కొత్త గొంతులు వినిపిస్తూ
కుళ్లిన వ్యవస్థ లోంచే
కొత్త మొలకలు పుట్టుకొస్తాయని
చెప్పేందుకైనా
ఉగాది వస్తుందేమో..
మళ్లీ మన నేలను నందన వనంగా మార్చేందుకు
నందన నామం ధరించి
ఉషోదయాన్ని తెస్తుందేమో !
' లీగల్ రిపోర్టర్ ' లో నందన ఉగాది సందర్భంగా ప్రచురితమైన కవిత.
ReplyDeletechakkaga raasaarandi, manchi feel thao.
ReplyDeleteThank you !
ReplyDelete