December 19, 2012


రంగుమారిన నందివర్థనాలు
                    


అద్దంలో చూసుకున్నాను
ఎంతకీ అంతుపట్టక...
ఎక్కడో గాయమైంది
వెతికినా కనిపించని చోట!
పండీ పండని కేశాల్ని
ఒత్తుగా కప్పుకున్న కపాలం లోనా ?
అబ్బే..అక్కడ కాకపోవచ్చనిపించింది

కొంచెం కిందికి చూశాను...
బీటలు బారినా శిధిలావస్థకి
చేరని భవనంలా నా వదనం
ముడుతలు ఇంకా పేరుకోని ఫాలభాగం..
దాని వెనక అయ్యుంటుందా?   ఏమో...

ఒకప్పటి తెల్లటి నందివర్థనాల స్థానంలో
నీరుకావి పంచ పీలికల్లా నా కళ్లు...
వాటిలో దశాబ్దాల దుఖాశ్రువుల నకళ్ళు..
దెబ్బతిన్న పక్షుల్లా నిందిస్తున్న దృక్కులు!

ఎందుకలా ??
ఎవరి తప్పుకో చెదరి పోయిందేం నా కల ?
వేళ్ల మీద పెయిన్ బామ్ చూసుకుంటూ
గాయమెక్కడో వెతుక్కున్నాను

మెల్లగా ఎగసిపడే మధ్యాహ్నకెరటంలా నా హృదయం
ఆ సముద్రాంతర్భాగంలో ఎక్కడని వెతకను?
భూమ్మీద మూడొంతులు నీరే ఉందిట !
ఎక్కడని రాయనీ లేపనాన్ని?

చెలియలి కట్ట వెనకే విరిగి పడే దు­ఖం
ఎప్పుడో ఏ పౌర్ణమికో రెప్పల్ని తోసుకుని పొంగుతుంది
మళ్ళీ మర్నాడే ఏమీ జరగనట్టు సర్దుకుంటుంది
ఇలాంటప్పుడు నా బాల్యం నాకిచ్చెయ్ అంటే ఎవరిస్తారు?

ఒకప్పటి చల్లటి తెల్లటి ప్రభాత కుసుమాలు ,
ఆ నంది వర్ధనాలు….మందారాలయ్యాయంటే
మళ్లీ కాలేవు ...మంచి ముత్యాలు
ఒకసారి జీరలు తేలాయంటే
ఇక ఎప్పటికీ కావవి – వెన్నెల వాకిళ్ళు!
స్ఫటిక స్వచ్ఛత కోల్పోయాక
నిలవవు పసి నవ్వుల లోగిళ్ళు..

అయినా ..నా పిచ్చిగాని ఇవన్నీ
పై పూతలకు లొంగని లోతైన గాయాలు !

                    **********

( నవ్య వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక 2006)

2 comments:

  1. నిజమే...
    super గా రాశారు....

    ReplyDelete