ఆగని ప్రయాణం
-------------వారణాసి నాగలక్ష్మి
ఒక మేఘం తడిపేసి పోతుంది
ఒక రాగం కుదిపేసి పోతుంది
గుండెల్లో తడి ఉంటే ఒక భావం
పాటై పోయి మనసంతా చుట్టేసి
పోతుంది !
ఒక మొగ్గ చిగురుల్లో
పుడుతుంది
లేతాకుల పొత్తిలి లో
సొమ్మసిల్లి నిద్రిస్తుంది
తొలి కిరణం పిలిచిందంటే
పులకిస్తూ వికసించేసి
పరిమళమైపోతుంది !
ఒక తలపు హృదయంలో జనిస్తుంది
మదిలోపల మథనై మమకారమవుతుంది
మమతలతో పొదరిల్లేసి మధుర
స్వప్నాల ధారలతో
రంగవల్లికలల్లేస్తుంది !
ఒక జల సెలయేరై పరిగెడుతుంది
నేస్తాల జతకట్టేసి నది తానై
నర్తిస్తుంది
సాగరసంగమానికి సమాయత్తమౌతూనే
వెచ్చని గగన విహారం విలాసంగా
సాగిస్తుంది !
ఒక రేఖ చుక్కలుగా
విడిపోతుంది
చిరాకు పరాకులతో
ఛిన్నాభిన్నమౌతుంది
చక్కని రూపం కోల్పోయి
చిక్కు ప్రశ్నై మిగులుతుంది
చిన్నబోయి నిలుస్తుంది!
పుట్టిన ప్రతిజీవీ ప్రయాసకు
లోనౌతుంది
తనదైన ప్రయాణాన్ని తపిస్తూ
సాగిస్తుంది
ముందుకు పోతున్నట్టు
భ్రమిస్తూ
ఆగని చక్రభ్రమణంలో ఆత్రంగా
పాల్గొంటుంది !
(కౌముది లో వెలువడిన నా కవిత)
No comments:
Post a Comment