‘ మరో హృదయం
మరో ఉదయం ’ ఒక సమీక్ష
- వారణాసి నాగలక్ష్మి
అనుభవజ్ఞుడైన
వైద్యుడు రచయితా,
విధ్యుక్త ధర్మం తెలిసిన వ్యక్తీ కూడా
అయితే తన రంగానికి సంబంధించిన ఎన్నో విషయాలను పాఠకులెందరికో సమర్థవంతంగా గా
తెలియపరచడమే గాక తోటి వైద్యులకూ రోగులకూ కూడా మార్గ నిర్దేశనం చేయగలుగుతాడు. డా. కనుపూరు
శ్రీనివాసులు రెడ్డి
గారి నవల '
మరో హృదయం మరో ఉదయం ' అక్షరాలా ఈ మాటని ఋజువు
చేస్తుంది.
రచయిత ముందు మాటలోని మొదటి వాక్యం లోనే " నిశితంగా ఆలోచించి ,వైద్యం చేసే ఏ వైద్యుడైనా వ్యాధి ఎలా పరిణమిస్తుందో తెలుసుకోగలడని నా గట్టి
నమ్మకం " అంటారు. నవల
అంతటా ఇదే భావన,ఇదే ఆశ కనిపిస్తుంది.ప్రతీ వైద్యుడూ తన దగ్గరకు వచ్చే
రోగికి తనకు తోచిన వైద్యం చేసి చేతులు దులుపుకుంటే సరికాదనీ,రోగ నిర్ధారణ సమయంలో మేధనూ,తర్కాన్నీ ఉపయోగించి మానసిక శారీరక శ్రమ కోర్చి
రోగికి అత్యుత్తమమైన చికిత్సని అందించాల్సిన బాధ్యత అతనికి వుందనీ నొక్కి
చెప్తుంది ఈ నవల.
అదే
సమయంలో రోగులంతా నిస్సహాయులూ, విచక్షణ తెలిసిన మర్యాదస్తులూ
అనుకోవడం కూడా అమాయకత్వమేనంటారు. చాలా తక్కువ శాతం ఉన్న ఉత్తమ వైద్యుల విషయానికొస్తే ఈనాటి
రోగులకు అలాంటి వాళ్లు నచ్చనే నచ్చరంటారు. డిగ్రీలనుబట్టి నైపుణ్యాన్ని కొలవడం ,అనుభవం యొక్క అవసరాన్ని తక్కువ అంచనా వేయడం,స్వ కులస్తులైతే బాగా చూస్తారని గుడ్డిగా నమ్మడం….ఇలాంటి రోగుల్లోని
మూర్ఖత్వాన్నీ, మరో
వైపు రోగం ముదరపెట్టి చావుబతుకుల్లో వున్న వ్యక్తి ని తీసుకొచ్చినపుడు చేయగలిగిందేమీ లేదంటే 'ఎంత
డబ్బైనా మొఖాన కొడ తాం ' అంటూ
డబ్బు పొగరు చూపించడాన్నీ,ఆ వ్యక్తి బతక్కపోతే దౌర్జన్యానికి
దిగీ,కోర్టుకి లాగీ అల్లరిపెట్టే అరాచకత్వాన్నీ రచయిత దగ్గరగా గమనించినట్టు అర్థమవుతుంది
ఈ నవల చదివితే. తను
గమనించిన అంశాలనూ, తనకెదురైన అనుభవాలనూ క్రోడీకరించి
వైద్యులకూ,రోగులకూ కూడా ఉపయోగించే ఆసక్తి కరమైన ,కరుణార్ద్రమైన నవలను పాఠకులకందించారు డా. కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.
ఈ కథ డాక్టర్ శ్రీని,డాక్టర్ స్వాతి ల దాంపత్య
జీవితం లోని అన్యోన్యతనీ ,వారిద్దరి మధ్యా గల అనురాగాన్ని ఎంతో హుందాగా వర్ణిస్తూ
సాగుతుంది.అనుభవజ్ఞుడూ, వృత్తిలో నిష్ణాతుడూ అయిన డా.శ్రీని కి అర్థ రాత్రి వేళ
తీవ్రమైన గుండె నెప్పి రావడంతో నవల ఆరంభమవుతుంది.పాఠకుడికి గుండెనెప్పి అంటే ఇలా వుంటుందా
అనిపించేలా వర్ణిస్తూనే, స్మారకం
ఉండీ లేనట్టుగా ఉన్న రోగిని చూస్తూ చుట్టూ ఉన్న నర్సులూ,వార్డు
బాయ్ లూ,డాక్టర్లూ ,ఇతరులూ ఎలా వ్యవహరిస్తారో అత్యంత సహజంగా కళ్లకు కట్టిస్తారు.చదువుతుంటే ఎవరికైనా
' ఆరోగ్యమెంత మహా భాగ్యం !' అనిపించక మానదు.కథనం సులభంగా సరళంగా ఉండడం వల్ల పాఠకుడు
సులువుగా, అప్రయత్నంగా
డా.శ్రీని , డా. స్వాతి ల అంతరంగాల్లోకి చొచ్చుకు పోతాడు.వారి వేదననీ
,ఆత్రుతనీ ,భయాన్నీ ,కల్లోలాన్నీ తను కూడా అనుభవిస్తాడు..జీవితంలో ఎపుడో ఒకప్పుడు
అంతుపటని రోగంతో,ఓ కొలిక్కి రాని రోగ నిర్ధారణతో అవస్థపడిన వాళ్ళంతా ఈ
నవల చదువుతూ డా.శ్రీని మానసిక స్థితిని అనుభూతిస్తారు.
రచయిత శైలి ముక్కుసూటిగా
సాగిపోతుంది.తనను తనే విమర్శించుకోగల నిజాయితీ ,బాధితులెవరైనా వారి వైపు
నిలుచుని వారి దృక్కోణం లోంచి విషయాన్ని చూడగల 'ఓపెన్ మైండ్ ' పాఠకులని
విస్మయ పరుస్తాయి.
డాక్టరూ,ప్రస్తుతం
రోగీ అయిన శ్రీనిని అనుక్షణం కనిపెట్టుకు చూసే అతని భార్య స్వాతి ఎందరో సగటు స్త్రీల
ప్రతినిధిగా కనిపిస్తుంది.
రచయిత డాక్టర్ కూడా కావడం వల్ల ప్రభుత్వాసుపత్రులూ,ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలూ,అక్కడి వాతావరణం ప్రతిభావంతంగా చిత్రీకరించి వ్యవస్థ లోని
దిగజారిపోయిన విలువల్ని నిర్మొహమాటంగా అతిశయోక్తి ఎరుగని సహజత్వంతో ఎత్తి చూపించారు.అన్ని
రంగాల్లోనూ వ్యాపించిన లోభం ,లంచగొండి తనం నిర్లక్ష్య వైఖరీ వైద్యరంగంలో వ్యాపిస్తే
రోగుల గతి ఏమవుతుందో మనసు కంపించేలా వర్ణించారు.
"పేషంటు చెప్పేదంతా నిజం కాదు.చిన్నదాన్ని పెద్దది చేసి
చెపుతున్నాడు అనుకుంటాడు డాక్టరు.డాక్టర్ చెప్పేదంతా నిజం కాదు.డబ్బు గుంజడానికి జబ్బుని
భయంకరంగా చెపుతున్నాడు అనేది పేషంట్ ఆలోచన.రెండూ
సరికాదు.డాక్టర్ పేషంట్ ప్రతి మాటనూ శ్రద్ధగా వినాలి.పేషంట్ పూర్తి నమ్మకంతో డాక్టర్
దగ్గరికెళ్లాలి "
"నీ అహంకారానికీ,
అశ్రద్ధకూ,తెలివితక్కువతనానికీ
రోగిని బలిచేయకు.నీకు తెలియకపోతే నిజం వొప్పేసుకో.మరో మంచి డాక్టర్ దగ్గరకు పంపు..పేరు
కోసం , డబ్బుకోసం రోగుల ప్రాణాల్తో ఆటలాడకు "
అంటూ రచయిత చేప్పే మాటలు ప్రతి వైద్యుడూ, ప్రతి
రోగీ శిరసావహిస్తే చికిత్సారంగంలో గొప్ప మార్పు సంభవిస్తుందంటే అతిశయోక్తి కాదు.
రెండు
బై పాస్ సర్జరీల తరువాత అనేక వ్యయ ప్రయాసలకోర్చి
అనేక సార్లు మృత్యు ముఖం లోకి వెళ్ళి తిరిగి వచ్చి, చివరికి తనకు ‘ ఇదే చివరి రోజా.. మరో ఉదయం ఉందా ?లేదా? ‘ అనుకుంటాడు
డా. శ్రీ ని. ఆ స్థితిలో దేశం లోనే మొట్ట మొదటి గుండె మార్పిడి
చికిత్స ఛేయించుకున్న డా. శ్రీ ని కథకు ' మరో హృదయం మరో ఉదయం 'అనే పేరు పెట్టదం అత్యంత
సమంజసం గా ఉంది !
కథనం విజ్ఞాన
దాయకంగా ఆలోచనాత్మకంగా సాగినా కొంతమటుకు ఆటో
బయాగ్రఫీ లాగా అనిపించడం వల్లా, అక్కడక్కడ కనిపించిన పునరుక్తి వల్లా వేగంగా చదివించే
గుణం కొరవడింది. ఇటువంటి
ఉపయోగకరమైన నవల విషయంలో అది ఎన్న దగ్గ దోషం కాదని చెప్పవచ్చు. రోగి లో మానసిక స్థైర్యమూ,డాక్టర్
అందించే మనో బలమూ రెండూ వున్నపుడు ఇలా అవసరమైన ఎందరికో కొత్త హృదయాలు సజావుగా అమరి, కొత్త ఉదయాలు లభిస్తాయని ఆశను కలిగిస్తుందీ నవల. రచయితకు అభినందనలు !
* * *
Malayamarutham song is very good.....infact the rendering and composing was also done very well....
ReplyDelete