June 6, 2014

శుభ రాత్రి

      
  (2013, అక్టోబర్ చివరి వారంలో, ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధ్వర్యంలో, ( ప్రస్తుతం National Disaster Management విభాగానికి సెక్రెటరీ గా ఉన్న) శ్రీ పార్ధసారథి గారి నేతృత్వంలో, NACO , APSACS  కలిసి, రాష్ట్రంలో అనేక చోట్ల నించి రచయిత్రులందరినీ ఆహ్వానించి , 'సాహితీ సమారోహణం ' పేర హైదరాబాదు లోని  జూబిలీ హాలు  లో సమావేశపరచి, ఒక అవగాహనా సదస్సు నిర్వహించారు. 
      ఈ సదస్సులో డాక్టర్లూ  ; బాధితులూ ; సెక్స్ వర్కర్స్ , MSM లు , భర్తల  ద్వారా తెలియకుండానే HIV , ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డవాళ్ళూ , హై రిస్క్ గ్రూప్ లో ఉన్నవాళ్ళూ , ఇలాంటి బాధితులకి తక్షణ వైద్య సదుపాయం , ఆసరా అందించగల ప్రభుత్వ శాఖల వారూ ..అందరూ  పాల్గొన్నారు. ఐఏఎస్ అధికారి, నాటి APSACS డైరెక్టర్, శ్రీ పార్ధ సారధి గారు తన  అనర్గళ  ప్రసంగం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న, 'ఎయిడ్స్, HIV కి సంబంధించిన విస్తృత సమాచారాన్ని సులభ గ్రాహ్యంగా అందించి , రచయిత్రులన్దరినీ తమ కలాలని  ఈ సమస్య కు  పరిష్కార దిశగా ఎక్కుపెట్టమనీ , ఈ వ్యాధి బారినపడ్డ వాళ్ళు  నిరాశలో కూరుకు  పోకుండా కర్తవ్య నిర్దేశనం చేసే విధంగా, 'ఆశావహం'గా రచనలు చేసి తమకందించమనీ కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినం(డిసెంబర్ 1) నాటికి ఈ కథలతో ఒక సంకలనాన్ని , కవితలతో మరో సంకలనాన్ని విడుదల చేస్తామనీ చెప్పి అయిదు రోజుల గడువులో రచనలు తమకందాలనీ గడువు నిర్దేశించారు. 
      ఆనాటి కార్యక్రమం ,  తమ తప్పు లేకుండానే క్రూర సమాజపు కోరల్లో చిక్కుకుని బాధితులైన వారి జీవితాలతో  ప్రత్యక్షపరిచయం కలిగిస్తూ ఎంతో  విజ్ఞాన దాయకంగా సాగింది. ఇలాంటి కార్యక్రమం ఇంతకూ ముందెప్పుడూ జరగలేదనీ , ఎయిడ్స్ నివారణలో ఈ సదస్సు ఎంతో ఉపయోగిస్తుందనీ ఆహూతులైనవాళ్ళందరం అనుకున్నాం. రచనల విషయంలో రచయిత్రులకేవైనా సందేహాలు కలిగితే, ఆ రోజు హాజరైన NACO , APSASCS ఉద్యోగులూ , వైద్యులని సంప్రదించవచ్చని చెప్పారు. 
     ఆరోజు జరిగిన సమావేశంలో బాధితుల జీవిత కథలు మనసు కరిగిస్తే , అమల , మమత రఘువీర్ గార్ల ప్రసంగాలు సూటిగా మనసుకి తాకాయి. అతితక్కువ సమయం ఇచ్చినా సదస్సు ఫలితంగా  వారికందిన ఎనభై కథల్లోంచి 59 కథలని 'ఆశా దీపం' కథా సంకలనం గా, ఎంపికైన కవితలతో  'చిగురంత ఆశ' కవితా సంకలనంగా  2014 మే 30 వ తేదీన , హోటల్ Moksh లో ఆవిష్కరించారు. చూపులకి సుకుమారంగా, నవ్వులు చిందిస్తూ మల్లెపువ్వులా కనిపించే  విశిష్ట అతిధి అక్కినేని అమల  మాటలు, పూలరేకులలో చుట్టబడిన తూటాల్లా సమస్యల్ని సూటిగా తాకడం చూశాక ఆమె పట్ల చాలా గౌరవం కలిగింది. 
     ఎంపికైన కథల్లో ఎనిమిది కథలకి ఉత్తమ కథలుగా, కవితల్లో నాలుగు కవితలకి ఉత్తమ కవితలుగా పురస్కారాలు లభీంచాయి. మామిడి హరికృష్ణ గారు, మమతా రఘువీర్ గారు, ఐనంపూడి శ్రీలక్ష్మిగారు ఈ పుస్తకాలకి సంపాదకీయం అందించారు.
     ఐనంపూడి శ్రీలక్ష్మి ఆలోచనామృతమైన ఈ వినూత్న ప్రయోగానికి ఒక ఉన్నతాధికారిగా  దిశానిర్దేశం చేసి, తన సంపూర్ణమైన తోడ్పాటునిచ్చిన  పార్థసారధి గారి నుంచి , ఇలాంటి మంచి సామాజిక ప్రయోజనమున్న అన్ని కార్యక్రమాలకీ తన సహకారమందిస్తున్న అమల గారి నుంచి ఆ వేదిక మీద ఒక చిన్న పురస్కారం అందుకోవడం సంతృప్తిని కలిగించింది. 
    అతి తక్కువ వ్యవధిలో ఒక వాస్తవ సంఘటనకు నేనిచ్చిన కథారూపం శుభరాత్రి , ఒక కథగా ఏ స్థానంలో నిలిచినా గాని ఒక సామాజిక ప్రయోజనం కోసం అల్లబడినది  కనుక ఆ ప్రయోజనం నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నాను.)  
శుభ రాత్రి 
                 'ఖుషీ ఖుషీ గా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ, హుషారుగా వుందాములే... నిషా కనులదానా ! ' లోగొంతులో పాడుతూ రెండో అంతస్తులో మనోజ్ఞ టేబుల్ దగ్గరకొచ్చేసరికి నా కోసమే చూస్తోందేమో  చురుగ్గా టేబుల్ సొరుగుకి తాళం వేసేసి, నన్ను గట్టిగా హత్తుకుంది. అది ఆఫీసే అయినా తన కేబిన్ ఒక పక్కగా ఉండడంతో తొంగి చూస్తే గాని అక్కడ్నించి  మేం ఎవరికీ కనిపించం. తన సంతోషం  అంటు వ్యాధిలా నన్నంటుకుంది !
మనోజ్ఞ చెంప మీద ప్రేమగా ముద్దు పెట్టి "ఆడదాన్నైపోయా గాని లేక పొతే ఎగరేసుకుపోదును! " అన్నా.
తను కూడా 'ఎగిరిపోతే ఎంత బావుంటుందీ? ఎగిరిపోతే ఎంత బావుంటుంది?' అంటూ కూనిరాగం తీసింది. ఒక వింత సంతోషంతో తన మొహం మెరిసిపోతోంది ! లేత గులాబీ రంగులో అలసిన అరవిందం లా కనిపిస్తున్న తన కళ్ళలో, ఎండిన కొమ్మలకి మళ్ళీ కొత్త చిగుళ్ళేసినట్టు సంతోషం చిందులేస్తోంది ! నవ్వంటే ఏమిటో మర్చిపోయి, తనలో తనే కుంచించుకు పోయిన మనోజ్ఞ, ఇవాళ మనోజ్ఞంగా, సార్ధక నామధేయగా కనిపిస్తోంది ! ఆ కలువ కళ్ళు నక్షత్రాల్లా తళుక్కుమన్నాయి. 
" పద పదా.. ఎక్కువ టైం  లేదు .. ఏదో  అదృష్టం కొద్దీ ఇప్పటికిప్పుడు కొన్నా టికెట్లు దొరికాయి " అంది గబగబా నడుస్తూ. లేటెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తెరిపి తన గొంతులో వినిపిస్తోంది.
" ఏమిటంత తొందర తల్లీ? ఇంకా చాలా టైముంది సినిమా మొదలవడానికి " అన్నా తననందుకుంటూ . 
"సినిమాకి ముందు కాఫీడే లో ముఖ్యమైన పని వుంది" అంది .
"అవునవును ... మర్చేపోయా అమ్మాయిగారికి ' కాఫీ విత్ సమోసా'  చాలా ముఖ్యమైన పనే ! " నవ్వుతూ ఒప్పుకున్నా .
 లిఫ్ట్ లో నా చెయ్యి పట్టుకుని "మనసంతా చెప్పలేని రిలీఫ్ గా ఉందే మీనా.. మళ్ళీ ఇన్నాళ్ళకి మనిషినైనట్టుంది ! ఇంక ఇంత  కన్నా వివరంగా వర్ణించ లేననుకో! " అంది ట్రాన్స్ లో ఉన్నట్టు . 
తన చేతిని పట్టుకుంటూ " ఇవాళ నిన్ను చూస్తుంటే మళ్ళీ కాలేజి రోజులు గుర్తోస్తున్నాయే. అప్పటి  మనోజ్ఞ మళ్ళీ ప్రత్యక్షమైనట్టుంది " అన్నాను . 
కాఫీ డే లో సమోసా తింటూ కాఫీ తాగుతూ బోలెడు కబుర్లు చెప్పుకున్నాం . 
"అప్పట్లా ఓ మంచి జోకు చెప్పవే" అన్నా. ఆ  రోజుల్లో మనోజ్ఞ జోకులు సీమ టపాకాయిల్లా పేలేవి . 
" ఊ ....   ఏం చెప్పనూ ...? " అంటూ కొంత సేపు ఆలోచించింది. చుబుకం మీద చూపుడు వేలితో కొట్టుకుంటూ అలోచిస్తున్నట్టుంటే " సరే ఇలా అయితే ఇక్కడే సినిమా అయిపోతుంది .. ఏదో ఒకటి చెప్పవే తల్లీ " అన్నాను . 
ఒక మొగుడు గాడు పెళ్ళాంతో అన్నాట్ట 'జబ్బీ దేఖో కిసీ ఔర్ కీ ఖుషీ కేలియే సోచ్ తే హో .. కభీ కభీ ఖుద్ కీ  ఖుషీ కె లియే  భీ సోచా కరో" అని. అప్పుడా  పెళ్ళాం అందిట ' ఆప్ సే షాదీ కర్నా ఖుద్ ఖుషీ హీ  హైనా ? ' అని " . 
ఇద్దరం నవ్వుకున్నాం . 
" ఆ జోకు నే మొదట విన్నది వేరేలా ...  పెళ్ళాం మొగుడితో అంటే అతగాడు ఇచ్చిన సమాధానం అది. ఆ దరిద్రుడితో  పెళ్లి తర్వాత నాకు హాస్యానిక్కూడా స్త్రీ గురించి అలా అనబుద్ది కాలేదు. వాడితో పెళ్లి నిజానికి నాకు ఆత్మ హత్య తో సమానమే. అందుకే  అలా మార్చా" అంది. ఆ మాటకి ఒక్కసారి మనసంతా పిండేసినట్టైనా నేనూ తన లాగే నవ్వేస్తూ, "దుఃఖ సముద్రంలో మునిగి ఖుద్ ఖుషీ  చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా నీలా ధైర్యం తెచ్చుకుంటే, అందమైన జీవితం  ఆహ్వానిస్తుందనిపిస్తుంది మనూ ..నిజం  ! మనసుంటే మార్గం ఉంటుందని చూపించావు !" అన్నాను ప్రేమగా . 
కాస్త కాఫీ తాగి సమోసా తిని థియేటర్ చేరేసరికి సరిగ్గా ఆట మొదలైంది. అదో ఫీల్ గుడ్ మూవీ. ఇప్పుడు మనోజ్ఞ చూడదగ్గ సినిమా. జనం పలచగా ఉన్నారు. తెరకి  దూరంగా  ఎదురుగా కూర్చుంటూ  " అబ్బ ఎన్నాళ్లైందో స్క్రీన్ కి  ఇంత  దూరంగా కూర్చుని హాయిగా సినిమా చూసి " అంది. 
"ఒకసారి ఇలాగే ఏదో సినిమాకెళ్తే  రాజీవ్ అన్నాడు  గుర్తుందా ....' ఒకే స్క్రీన్ మీద రెండు సినిమాలు నడుస్తున్నట్టుంది . నేనిటు వైపు చూస్తానే .. నువ్వటు వైపు చూడు ... ఒకళ్ళ కొకళ్ళం  కథ చెప్పుకుందాం' అని ! "
            మనోజ్ఞ నవ్వి" స్క్రీన్ కి  దగ్గరగా కూర్చుంటే అంత  పెద్ద తెర  మీద ఏం  కథ నడుస్తోందో ఏమర్ధమవుతుంది? .. అందుకే ఆరో వరసకన్నా తక్కువ దూరం వుంటే నేనసలు ఆ టికెట్లు తీసుకోను" అంది . కథలో లీనమై పోయి హాస్య సన్నివేశాల్లో హాయిగా నవ్వుతూ  ఎంజాయ్ చేసినా హీరో హీరోయిన్లు   సన్నిహితం గా ఉండే సన్నివేశాల్లో మాత్రం తన మొహం వివర్ణమైపోయింది. తన చేతి మీద నా చెయ్యి వేసి మృదువుగా రాస్తూ ఉండిపోయా .. తనని  తాను నిగ్రహించుకుంటూ నా వైపు చూసింది కొలనుల్లాంటి కళ్ళతో.  కొంత సేపటికి తిప్పుకుని రుమాలుతో కళ్ళు తుడుచుకుని
            " అదంతా గతం. గడిచిపొయిన కాలం .. ఒక పెద్ద  పీడకల ! " అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ . 
ఇంక పర్వాలేదు. ఇదింక ముందుకు దూసుకుపోతుంది అనుకున్నా . 
తొమ్మిదింటికల్లా నన్నింటి  దగ్గర దింపేసి అది వెళ్ళిపోయింది. గేటు తెరుస్తుంటే రాజీవ్ గుమ్మం లో కనిపించాడు చెయ్యి పైకెత్తి ఊపుతూ. అనుకుంటూనే ఉన్నా నేనిల్లు చేరేసరికి ఎయిర్ పోర్ట్  నించీ వాడూ వచ్చేస్తాడని . 
"ఎంత సేపైందిరా వచ్చి ? " అనడిగా . 
" ఎనిమిదింటికి వస్తానని చెప్పా కదా... టైమంటే టైమే .. నే రాగానే మీ గోడ గడియారం ముళ్ళు సరిచేసుకుంది తెల్సా ?  "  గొప్పగా అన్నాడు . 
" నువ్వు మారవురా .... నువ్వూ  నీ బడాయిలూను ! భోజనాలయ్యాయా ? "అన్నా చెప్పులు విడుస్తూ . 
" ఎక్కడా? నువ్వు రాకుండా పిన్నీ బాబాయ్ నాకు భోజనం పెడతారా తల్లీ .. ఆకలేస్తుంటే నువ్వు ఎప్పుడొస్తావా అని పొట్ట పట్టుక్కూచున్నా" అన్నాడు.  
ఓరి నీ అసాధ్యం కూలా ! నాయనా తినరా అది ఫ్రెండ్ తో సినిమాకి పోయిందీ, దానికి ఆలస్యం అవుతుందీ , అక్కడ ఏ పాప్ కార్నో లాగించి వచ్చి ఆకల్లేదన్నా ఏం చెయ్యలేం.. తినరా బాబూ, అంటే వినకుండా అదొచ్చాకే తింటానని హఠం వేసుక్కూచుని, ఇప్పుడిలా అప భ్రంశం కూతలు కూస్తావురా ? “ వెనక నించీ అమ్మ చెయ్యెత్తి కొట్టబోయింది.
" కొట్టుకోకండి. రెండు నిముషాల్లో వచ్చేస్తా ..నా పొట్టలో పరుగెడుతున్న ఎలకల సాక్షిగా  సినిమాలో నేనే  పాప్ కార్నూ తిని ఎరగను" అని సముదాయించి బాత్రూమ్ లో దూరాను . 
హడావుడిగా స్నానం కానిచ్చి వచ్చేసరికి , భోజనాల బల్ల మీద వేడి వేడి వంటకాలతో ముగ్గురూ ఎదురు చూస్తున్నారు . 
పక్కన కూర్చోగానే నా కంచంలో ప్రేమగా కూర వడ్డిస్తూ " ఎంత నిర్లక్ష్యమే నీకు ? రిసీవ్ చేసుకుందుకు ఎయిర్ పోర్ట్ కి రాక పోగా , ఉరుకులు పరుగులతో నేనే వస్తే , నువ్వు మాత్రం ఎవరో గొట్టం గాడితో సినిమాకి పోతావా ? “ అన్నాడు 
నాయనా బాబూ ! .. నేనే గొట్టం గాడితోనూ సినిమాకి పోలేదు .. నీకో దురలవాటుంది. అంతా  నీలాగే అనుకుంటావు . అయినా ఎయిర్ పోర్ట్ అంత దూరం పోయాక మేమెవరం రిసీవ్ చేసుకోవడానికి అక్కడికెళ్లడం మానేశాం .. ఇప్పుడంతా ఇంటి నుంచే హాయ్.. ఇంటి నుంచే బై ! "
 “ పిన్నీ ! ఇది మాట మార్చేస్తోంది గమనించావా ? అయినా అదేం చెపితే అది నువ్వు నమ్మేయడమేవిటీ ? ఖండాంతరాల నించీ నాలాంటి అన్న గారు తనని చూడడానికొస్తుంటే ఎదురు రాకుండా, పాతికేళ్ళ కూతురు ఎవరో స్నేహితురాలితో ఫస్ట్ షో  సినిమా కెళ్లానంటే నమ్మేస్తావా ? " అన్నాడు . 
నాన్న నవ్వుతూ ఇంక నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ నువ్వింటికి  రాగానే స్వాగతం చెప్పేవాళ్ళు వేరే వస్తున్నారు కదరా.. ఏమైంది పెళ్లి చూపుల ప్రహసనం ?” అనడిగారు .
పెదవి విరుస్తూ ఎక్కడ బాబాయ్ ? అమ్మావాళ్ళు చూడమన్న ఆరుగుర్ని చూశా వరస పెట్టి . ఒక్కరిలో నయినా నే కోరుకునే లక్షణాల్లేవు అని, నావైపు చూస్తూ  "విరక్తి కలిగిందనుకో .. ప్రతి వాళ్ళకీ జీతం ఎంతో ఆ లెక్కే  గాని, జీవితం ఏమిటో , దాన్ని ఎంత అర్థవంతంగా జీవించచ్చో ... ఆ అవగాహన  లేనే లేదు" అన్నాడు .
ఓరినీ అయితే .. ఈ సారీ అంతే సంగతులా ? నీ పెళ్లికి ఏం చీరలు కట్టుకోవాలా , ఏ  నగలు పెట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే ఇలా హ్యాండిచ్చేశావేమిట్రా ? మళ్ళీ ఒంటికాయ్ సొంటి కొమ్ములా సింగిల్ గా ఫ్లైట్ ఎక్కడమేనా ?” అన్నా
నీ లాంటి బాధ్యత తెలియని చెల్లెలున్న అన్నగారికి పిల్ల ఎలా దొరుకుతుందే  ? ‘ఒరేయ్ అన్నయ్యా , ఇలా నా ఎరికలో ఓ అప్సరస ఉందిరా .. కొంచెం సాహిత్యం, కొంచెం సంగీతం, కాసింత హాస్యం అన్నీ సమపాళ్ళలో రంగరించి బ్రహ్మ దేవుడు నీకోసమే తయారు చేసినట్టున్నాడూ.. రా వచ్చి చూసుకో.. కావలిస్తే కాస్త మధ్యవర్తిత్వం నెరుపుతానూ ... అని చెప్పాలా వద్దా ? ఎంత సేపూ ఫారిన్ చాక్లెట్లు తెస్తావా లేదా , చంపేస్తాను ఏమనుకున్నావో అంటూ శూర్పణఖ లాగా బెదిరించడమే గాని ఉపయోగం ఏముంది నీ వల్ల ? " 
..మరే ! ఎనిమిదేళ్లుగా బంగారు బొమ్మ లాంటి అమ్మాయి నాతో పాటు మనింటికి వస్తూ, షాపింగులకీ , షికార్లకీ నాతో తిరుగుతూ ఎన్నిసార్లు కనిపించినా, బభ్రాజమానంలా, మొద్దబ్బాయిలా ఊరుకుండి పోయి , ఇప్పుడు నన్నంటే ఏం లాభం ? “ అన్నా.
ఒక్క క్షణం వాడు మౌనం గా ఉండిపోయాడు . మనోజ్ఞ పెళ్లి కుదిరిందని తెలియగానే వాడెంత అప్ సెట్ అయిపోయాడో గుర్తొచ్చింది . అప్పటిదాకా పెద్ద పెద్ద చదువులూ, ఎమ్మెన్సీ లలో ఉద్యోగాలూ, విదేశాల్లో ఉద్యగాలూ అంటూ పరుగులు తీసిన వాడు  ఒక్కసారిగా బ్రేక్ వేసినట్టు ఆగిపోయి, “ అదేమిటే మనోజ్ఞ ఎంబియ్యే చేస్తానందన్నావుగా ? అప్పుడే పెళ్ళేమిటి? అంటూ తెగ బాధ పడిపోయాడు.
పోనీ ఇప్పుడైనా మాట్లాడరా పెళ్లి ఇంకా అయిపోలేదుగా అన్నాగాని వాడు సంకోచిస్తూ ఉండిపోయాడు . మనోజ్ఞ కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా కుదిరిన మరు క్షణం నించీ అతని చుట్టూ అందమైన ఊహలల్లుకుంటూ,  సంతోషంగా కనపడడంతో నేనూ ఊరుకుండి పోయాను !   వాళ్ళ నాన్నగారు పోయాక   తల్లి ఆరోగ్యం అంతంత మాత్రం గా ఉండడం తో ఆవిడని వదిలి వేరే దేశం  వెళ్లడం  తనకి  ఇష్టం లేకపోయింది. పెళ్ళయ్యాక  ఆవిడకి దగ్గరలోనే ఉండాలనుకుంటున్న తనకి, ఈ సంబంధం అన్ని విధాలా అనుకూలంగా తోచింది . ఇవన్నీ చూశాక రాజీవ్ కీ , మనూ కీ పొత్తు కుదరదని నేననుకున్నాను. 
            తర్వాత మనోజ్ఞ జీవితం లో వచ్చి పడ్డ తుఫాను గురించి వాడికి నేను చెప్పలేదు. ఎవరికీ తెలియ నివ్వకుండా ఉంచాలని ఇద్దరం అనుకున్నాం . అమ్మా నాన్నలకి కూడా వాళ్ళు విడిపోయారని తెలుసు గాని ఎందుకో తెలీదు. ఆ బడబాగ్నిని  అది నా ఒకర్తె తోనే పంచుకుంది. బంధు మిత్రుల్లో ముఖ్యులైన అతి కొద్ది మందికి తప్ప ఈ విషయం ఇతరులెవరికీ తెలియదు. APSACS  , ఏ ఆర్ టీ , ఐ సి టీ సి ఉద్యోగులు కొద్ది మందికి  తెలియడం మాత్రం తప్పనిసరి. వాళ్ళు వృత్తి పట్ల నిబద్ధత గల వాళ్ళు. ఎథిక్స్ కి ప్రాముఖ్యత నిచ్చే స్టాఫ్ కావడంతో దానికి ఎలాంటి సమస్యా ఎదురవలేదు. ప్రశాంతంగా ఆఫీస్ లో తన పని తాను పని చేసుకుంటోంది ఇన్నాళ్ళుగా. 
కొద్ది సేపటి మౌనం తర్వాత రాజీవ్ " ఇప్పుడు తనెక్కడుంది ?" అనడిగాడు.
అమ్మ వాడికి కూర మారు వడ్డిస్తూ " ఎవరూ ? మనోజ్ఞ గురించా ? ఆ పెళ్లి వారం తిరక్కుండానే పెటాకులైంది నాన్నా ! బంగారం లా మెరిసిపోయే పిల్ల, నల్ల కప్పేసిన వెండి సెమ్మెలా తయారైంది .. ప్చ్.. అయినా ఈ కాలం పిల్లలకి ఇండివిడ్యువాలిటీ ఎక్కువ .. ఆడా మగా ఒకలాగే చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటుంటే నువ్వా   నేనా అన్న అహంభావాలడ్డొస్తాయి ..ఎవరో ఒకరు సర్దుకోవాల్సిన పరిస్థితిలో నేనే ఎందుకు సద్దుకోవాలనే ఆలోచన వస్తే ఆ పెళ్లి పెటాకులే మరి " అంది. 
నాకు ఛర్రుమని కోపం వచ్చింది. ఎన్ని సార్లు చెప్పినా అమ్మ ఆలోచనా ధోరణి మారదు. ఆవిడ మనోజ్ఞ ని అర్థం చేసుకోవాలంటే ఏం జరిగిందో పూర్తిగా తనకి చెప్పాలి.  అది నాకిష్టం లేదు. తమకి తెలియని జీవితాల గురించి చాలామంది  ఎందుకిలా జడ్జ్ మెంటల్ గా  ఉంటారో
            “అవునమ్మా! ఎవరో ఒకరు సర్దుకోవాల్సిన పరిస్థితిలో ఆడపిల్లలే సర్దుకోవాలని ఎందుకు ఆశిస్తారు ? అయినా మనోజ్ఞ పెళ్లి ఫెయిలవడానికి  కారణాలు చాలా చాలా.. వేరు . వాటిని చర్చించడం వల్ల ఉపయోగం లేదు . ప్లీజ్ .. వదిలేయ్ ! “ అన్నా.  
తినడం ఆపి మమ్మల్నే చూస్తున్న రాజీవ్ " మనోజ్ఞ డివోర్స్ తీసుకుందా ?”  అన్నాడు ఆశ్చర్యంగా .
అదో పెద్ద కథరా.. అదంతా ఇప్పుడు చెప్పడం కష్టం అంటూ మాట మార్చాను. చూస్తూండగానే పదకొండైంది. అమ్మ నాన్నగారూ పడుకున్నారు.
రాజీవ్ కి పడక ఏర్పాట్లు చూసి రేపు మాట్లాడుకుందాంరా . చాలా నిద్రొస్తోంది ! “అని గుడ్ నైట్ చెప్పి నా గదిలోకి వెళ్లి పోయాను. 
పడుకున్నానే గాని ఆలోచనల తేనెటీగలు జుమ్మని ఒకటే రొద. అరగంట ప్రయత్నించాక నిద్రాదేవి మెల్లగా కరుణించి  నా కళ్ళ మీదకి చల్లని పరదా కప్పింది . నిద్రకీ , మెలకువకీ మధ్య ఊగుతున్న నాకు తలుపు మీద వేళ్ళతో కొట్టిన చప్పుడూ, “ చిన్నీ! నిద్ర పోయావా అన్న రాజీవ్ పిలుపూ వినిపించాయి. కూర్చుని లైట్ వేశాను .
సారీ చిన్నీ .. నాకు నిద్ర పట్టడం లేదు. నీతో అర్జెంట్ గా మాట్లాడాలనిపిస్తోంది. కొన్ని విషయాలు క్లారిఫై చేసుకోవాలి అన్నాడు. 
నా నిద్ర మత్తంతా వదిలిపోయింది .
రా.. లోపలికొచ్చి కూర్చో అంటూ కుర్చీ చూపించా.
అలా బాల్కనీలో కూర్చుందాం రా అన్నాడు. నాకెందుకో వాడు మళ్ళీ మనోజ్ఞ గురించే అడుగుతాడని తోచింది. విషయమంతా చెప్పాలా వద్దా? అది అత్యంత గోప్యంగా ఉంచుకున్న విషయాన్ని ఇతర్లకి చెప్పే అధికారం నాకెక్కడిది ? అని సందిగ్ధంలో పడ్డాను. వదిలేసిన జుట్టు రబ్బర్ బాండ్ లో బంధించి బయటికొస్తుంటే  
 కొంచెం కాఫీ ? “ అన్నాడు కళ్ళు చికిలిస్తూ, నిద్రనించి లేపినందుకు నొచ్చుకుంటూ
  “ఇప్పుడే తెస్తాఅంటూ వంటింట్లోకి నడిచా. 
  కాఫీ కప్పులతో బాల్కనీ లో కూర్చోగానే 
" చిన్నీ! మనోజ్ఞ డివోర్స్ ఎందుకు తీసుకుంది ? " అన్నాడు  సూటిగా . 
నేనప్పటికి  మనసులోపలి సందిగ్ధాన్ని జయించి వాడికన్నీ చెప్పాలని నిశ్చయించుకున్నా. అలా చెప్పడం వల్ల మేలేగాని కీడు జరగదని నాకు తోచింది.  “ఎందుకంటే ఆ మొగుడు వెధవ  హెచ్ ఐ వీ పాజిటివ్ అని తెలిసింది,  పెళ్ళైన రెండో రోజే  " అన్నాను నేనూ సూటిగా. తుళ్ళి పడ్డాడు రాజీవ్ .
" ఎలా ? " 
ఎలా ఏమిటి ? ఆ దుర్మార్గుడికి ఎంత మందితోనో సంబంధాలున్నాయిట ! హెచైవీ ఎలా అంటుకుంటుందో నీకు చెప్పక్కర్లేదు కదా " అన్నా.
నేనడిగింది అది కాదు... తనకెలా తెలిసిందని అడిగా. అయినా హెచైవీ రకరకాలుగా అంటుకోవచ్చు. రక్తం ఎక్కించి నప్పుడో , పుట్టినపుడు తల్లి ద్వారానో . పాజిటివ్ అయినంత మాత్రాన  నైతికంగా పతనమైన వాళ్లే అనుకోవడం సరికాదు ! " కరుణగా అన్నాడు రాజీవ్.
 ఒక్క క్షణం సిగ్గు పడ్డాను అలా అనేసినందుకు.  " అది కాదురా ! అతనికి  లేని అలవాట్లు లేవుట. పెళ్ళికి ముందే హెచైవీ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వాడు చెప్పకుండా పెళ్లి చేసుకుని, ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయడానికి తెగించాడు కదా ! " అన్నాను కోపాన్ని అదుపు చేసుకుంటూ.
రాజీవ్ కళ్ళు తడిగా తళతళలాడుతూ కనిపించాయి .
సరే మరి తనకంత వెంటనే ఎలా తెలిసింది ?”  అన్నాడు జీరపోయిన గొంతుతో .
వాళ్ళ పెళ్ళైన రెండో రోజు పొద్దున్నే ఇది పువ్వులా తయారై ఏదో మాగజీన్ చదువుకుంటుంటే దాని సెల్ కి  ఫోన్ వచ్చిందిట. ఎవరా అని తీస్తే, అతని ఫ్రెండెవరోట. తన పరిచయం చేసుకుని ‘ సారీ సిస్టర్ .. మీకు  షాకింగ్  న్యూసే  అయినా మీ మేలు కోరి చెపుతున్నాను . సురేష్ హెచైవీ పాజిటివ్ పేషెంట్ అని చెప్పాట్ట “ 
వెధవ  అప్పుడు చెప్పడమెందుకు ? ముందే చెప్పేడవచ్చుగా ?  అన్నాడు రాజీవ్ . 
అదేదో ఐ ఎస్ డీ కాల్ లే...ఏ దేశం లో ఉన్నాడో అతను ! ఫ్రెండ్స్ ద్వారానో,  ఫేస్బుక్ ద్వారానో తెలిసి ఉండచ్చు వీళ్ళ పెళ్లి గురించి . లేదా చెప్పనా వద్దా అని గుంజాటన పడి కూడా ఉండొచ్చు. కానీ అతనా ఫోన్ కాల్ ద్వారా చేసిన మేలు ఇంతా అంతా కాదు అన్నాను. 
సరే అప్పుడేమైంది ?” అన్నాడు
ఏముందీ ..ఇది నిశ్చేష్ట గా అలా కూర్చుంది పోయింది . తండ్రి లేని పిల్ల.. మేనమామలూ, పెదనాన్నా కలిసి పూనుకుని పెళ్లి చేశారు. ఏదో మంచి పొజిషన్ లో ఉన్నాడు. చూడ్డానికి  అందంగా ఉన్నాడు. ఈడూ జోడూ అనుకున్నారు గాని ఇలా దెబ్బతింటామని ఎవరూహిస్తారు ? ఒడ్డూ పొడుగూ, చదువూ, హోదా, కుటుంబ వివరాలూ ఇవన్నీ చూసుకున్నారు గాని అసలైన విషయం ... అతనికేవైనా ఇలాంటి అంటు రోగాలున్నాయా అన్న విషయం ఎంత మంది చూసుకుంటున్నారు పెళ్ళికి ముందు ? కులం, గోత్రం, అటు ఏడు తరాలు , ఇటు ఏడు తరాలు అంటూ పాకులాడే బదులు ఇవాల్టి పరిస్థితికి తగినట్టు అవసరమైన ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించే ఆనవాయితీ పెట్టుకోవడం ఎంత అవసరం ?"
సరే విషయం చెప్పు అసహనంగా అన్నాడు రాజీవ్.
ఆ ఫోను కాల్ తో పిడుగు పడ్డట్టు అయిపోయి, ఎవరితో చెప్పుకోవాలో తెలీని స్థితిలో వెర్రిదానిలా కూర్చుని ఉండిపోయింది మనోజ్ఞ . వాళ్ళ అమ్మ గారు ముందే హార్ట్ పేషెంట్ .. పెళ్ళైన మర్నాడే ఈ విషయం వింటే ఏమైపోతారో అని బెంగ. ఇంకోవైపు రేడియో ఆక్టివ్ పదార్ధంలా అప్పటికే ఆ క్రిమి తన శరీరం లో ఏ విస్ఫోటనానికి పూనుకుందో  అని భయం.. అవాళ నేను ఆఫీసుకెళ్తూ, దాని వస్తువులేవో నాదగ్గరుంటే ఇచ్చేసి వెళ్దామని వాళ్లింటికి వెళ్ళా. అప్పటికా త్రాష్టుడింకా  నిద్రలోనే ఉన్నాడు. విషయం తెలియగానే అది వద్దంటున్నా వినకుండా వాళ్ళ పెద్ద  మేనమామ కి ఫోన్ చేశా నేనే. ఆయన ఇక్కడే పోలీస్ డిపార్టుమెంటులో ఉన్నారు. పావుగంట లో ఆయన ఇంటికి వచ్చేసారు. ఆయనకి తెలిసిన వాళ్లెవరో ఎయిడ్స్ కంట్రోల్ విభాగం లో పని చేస్తున్నారట. వాళ్ళేమో వెంటనే దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లమనీ అక్కడ ఐ సి టీ సి లో హెచైవీ ఇన్ ఫెక్ట్ అయిందేమో తెలుసుకునే టెస్ట్ చేయించమనీ చెప్పారు ! ఆయన  తిన్నగా వాళ్ల బెడ్ రూమ్ లోకెళ్లి , నిద్రపోతున్న అతన్ని ఒక్క తన్ను తన్ని లేపి, జీపులో కూలేశారు.. మనూ వాళ్ళమ్మ గారికి విషయం చెప్పకుండా దానికేదో కడుపు నెప్పిగా ఉందనీ, ఒకసారి ఆసుపత్రికి తీసుకెళ్ళి చూపించి వస్తామనీ చెప్పి బయల్దేరాం. అక్కడ హెచ్ ఐ వీ కోసం టెస్ట్ చేస్తే అతనికి పాజిటివ్ అని వచ్చింది ! "
" ఓ గాడ్ ! " అన్నాడు రాజీవ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ .
వాళ్లు వెంటనే చెప్పేశారు హెచైవీ పాజిటివ్  వాళ్లు ఆ విషయం దాచి పెళ్లి చేసుకుంటే లీగల్ గా ఆ పెళ్లి చెల్లదుట!  అదో రిలీఫ్ .. విడాకుల కోసం  కోర్టు చుట్టూ తిరగక్కర్లేదు
మరి మనోజ్ఞ టెస్ట్ ఎలా వచ్చింది ? “
తనకి నెగటివ్ అని వచ్చింది. అంటే తనకి ఇంతకు ముందు లేదని .. అయితే ముందురోజు  రాత్రి తను ఎక్స్ పోజ్ అయింది గనక అపుడు ఇన్ ఫెక్ట్ అయిందా లేదా అన్నది వెంటనే తెలియదు. ఒకవేళ హెచైవీ క్రిమి తన శరీరంలో ప్రవేశించినట్టైతే దానిపై ఎదురుదాడికోసం శరీరం తయారు చేసే యాంటీ బాడీస్ నే ఈ పరీక్ష గుర్తించ గలదు. ఆ యాంటీ బాడీస్ తగినంతగా తయారవడానికి కొంత సమయం... అంటే ఆరు వారాల్నించి ఆరు నెలల దాకా ... పడుతుంది. అయితే తను ఇన్ ఫెక్ట్ అయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది గనక తనని యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్   సెంటర్ , ఏ ఆర్ టీ కి రిఫర్ చేశారు. వెంటనే తీసుకెళ్లమని తొందర పెట్టారు.
అప్పుడు సురేష్ ని అక్కడే వదిలేసి , మనోజ్ఞని ఒకర్తెనీ తీసుకుని ఏ ఆర్ టీ సెంటర్ కి వెళ్లాం.
  అక్కడ మాకొక చాలా ముఖ్యమైన విషయం తెలిసింది అదేమిటో తెలుసా ? గాంగ్ రేప్ కి గురైన అమ్మయిల్నైనా, ఇలా ఇన్ఫెక్టెడ్ వ్యక్తిని తెలియక పెళ్ళాడిన అమ్మాయిల్నైనా,  ఆ దుర్ఘటన జరిగిన వెంటనే , ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, ఏదైనా ప్రభుత్వాసుపత్రి లో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ కి తీసుకెళ్లాలి. వాళ్ళు సరైన కౌన్సిలింగ్ చేశాక హెచైవీ కోసం టెస్ట్ చేసి, వెంటనే  ఏ అర్ టీ  సెంటర్ కి పంపుతారు. ఈ టెస్ట్ రిపోర్ట్ సాధారణంగా నెగటివ్ అని వస్తుంది. ఎందుకంటే వాళ్లు అప్పటికి  ఇన్ఫెక్ట్ అయినా కూడా విండో పీరియడ్ లో ఉంటారు గనక రిపోర్ట్ లో పాజిటివ్ అని రాదు. అయినా ఎక్స పోజ్ అయి ఉన్నారు గనకా , వెంటనే ట్రీట్ చేస్తే  ఇన్పెక్షన్ ఒక వేళ అంటుకుని ఉన్నా కూడా నివారించవచ్చు కనకా,  పి ఈ పి అనే చాలా శక్తివంతమైన 'యాంటీ బయాటిక్' మందుని బాధితురాలికి ఇస్తారు. దుర్ఘటన జరిగిన డెబ్భై రెండు గంటలలోగా ఈ  మందు ఇస్తేనే ఇన్ఫెక్షన్ రాకుండా ఆపే అవకాశం ఉంటుంది. ఈ మందు వాడడం వల్ల  ఎన్ని  సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఆపకుండా ఇరవై ఎనిమిది రోజులూ వాడాలి. అప్పుడే  ఆ ఇన్ ఫెక్షన్ సోకకుండా చేసే అవకాశం ఉంటుంది " 
 " అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ? "
" ఒకటేమిటి ? వాంతులూ, డయేరియా, నాసియా, ఎనీమియా, జాండీస్, ఒంటి మీద దద్దుర్లు  ...... "
"మనోజ్ఞ కివన్నీ ... "
"ఆ . అన్నీ జరిగాయి .. ఎంత ఓర్చుకుందో పాపం ! అలా ఇరవై ఎనిమిది రోజులూ వాడాక ముప్ఫయ్యోరోజున మళ్ళీ టెస్ట్ చేశారు . అపుడూ నెగటివ్ వచ్చింది. అలా మళ్ళీ మూడు నెల్ల కోసారి , ఆరునెలల కోసారి టెస్ట్ చేశాక అప్పుడు కూడా నెగటివ్ అని వస్తేనే హెచ్ ఐ వీ లేదని నిర్ధారిస్తారు ! అప్పటి దాకా విక్టిం కి ఆందోళన తప్పదు ! మనూ కి ఆర్నెల్ల తర్వాత చేసే పరీక్ష రిపోర్టు ఇవాళే వచ్చింది! "   
ఆదుర్దాగా ముందుకి వంగి ఏమని ?” అనడిగాడు రాజీవ్.
హాయిగా నవ్వేస్తూ అందుకే కదా సినిమా కెళ్లా ఆ గొట్టం గాడితో “  అన్నా.
తను కూడా పెద్దగా నవ్వుతూ అయితే కథ సుఖాంతమన్న మాట ! అన్నాడు.
అంతేగా మరి! కానీ ఆ ట్రామా నించీ కోలుకోవడం అంత తేలిక కాదు.
" అది సరే ... మరి డెబ్భై రెండు గంటల తర్వాత వస్తే ఏం  చేస్తారు ? "
 "చేసేదేముంది ? ఆ టైం పీరియడ్ దాటాక వచ్చిన వాళ్లకైతే చికిత్స చేస్తారు గాని నివారించలేరు. వాళ్ళు ఇన్ఫెక్ట్  అయారని నెలకో మూణ్నెల్లకో  తెలిస్తే వాళ్లకి చికిత్స చేసి పూర్తిగా నార్మల్ స్థితికి తీసుకురావడం  ఇప్పుడైతే అసంభవం  ! అందుకే అలాంటి అకృత్యాలు జరిగినపుడు  సమయం చాలా చాలా విలువైనది. పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా దాచుకుంటే నివారించ గలిగే రోగాన్ని కూడా పెంచి పోషించి నట్టేగా!  రేప్ విక్టిమ్స్ కి అయితే హెచ్ ఐ వీ వచ్చే అవకాశం చాలా ఎక్కువట
అవును.. నీతిలేని వాళ్లేగా అలాంటి పనులకి పాల్పడేది..వాళ్లకి ఆ రోగాలు ఉండే అవకాశం ఎక్కువే
ప్రస్తుతానికైతే వాళ్ళు హెచ్ ఐ వీ పాజిటివ్ పీపుల్ గా తేలే అవకాశమూ ఉంది. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండే అవకాశమూ ఉంది. ఇంకా కొత్త కొత్త పరిశోధనలు జరిగి ఇంకా మంచి మందులు మార్కెట్ లోకొస్తే ఆలస్యమైనా కూడా ఇన్ఫెక్షన్ నివారించ గలుగుతారేమో ! నిజానికి ఇప్పుడున్న పి ఈ పి  మందు ఈ మధ్య కాలం లో కనుక్కున్నదే .. ఇదివరకు అంటే ఎయిడ్స్ వ్యాధిని కనుక్కున్న చాలా కాలం వరకూ మనోజ్ఞ లాంటి వాళ్ళని రక్షించే మందే  లేదు ! అప్పట్లోవెంటనే ట్రీట్ మెంట్ తీసుకున్నా నియంత్రణే గాని నివారణ లేదు .
 “ అందుకే అలాంటప్పుడు వెంటనే రిపోర్ట్ చెయ్యాలి. ఎందువల్లైనా రిపోర్ట్ చెయ్యడం ఇష్టం లేని వాళ్లు కూడా  ఐ సి టీ సి లో రిజిస్టర్ చేసుకుంటే చాలు , సరైన చికిత్స దొరుకుతుంది. ఖర్చంతా ప్రభుత్వమే  భరిస్తుంది.  మంచి శిక్షణ పొందిన వాలంటీర్స్ , కౌన్సెలర్స్ ఎంతో సమర్ధంగా, ఎన్నో విధాలుగా వాళ్లకి సాయం చేస్తారు. హెచైవీ పాజిటివ్ పేషెంట్స్  మంచి చికిత్స తీసుకుంటే బీపీ, షుగర్ పేషెంట్ల లాగే మందులు వాడుతూ హాయిగా జీవించచ్చు !”
రాజీవ్ పకపకా నవ్వుతూ ఇప్పుడు మన మాటలు ఎవరైనా వింటే ఎయిడ్స్ కంట్రోల్ వాళ్ల యాడ్ కాంపెయిన్ అనుకుంటారు అన్నాడు.
నిజంగా అలాంటి కాంపెయిన్స్ మనలాంటి వాళ్లం కూడా చెయ్యాలేమో అనిపిస్తుంది తెల్సా ? ఇలాంటి గవర్నమెంట్ సంస్థల  పట్ల నాకున్న తేలిక భావం మనోజ్ఞ విషయంలో వాళ్ళందించిన సాయం తర్వాత పూర్తిగా మారిపోయింది. వాళ్ళంటే ఎంతో గౌరవం కలిగింది "  అన్నాను . 
అక్కడ పనిచేస్తున్న వాళ్ళు  చేస్తున్న సేవ గురించి ఎంత వివరిస్తే సరిపోతుంది ? డబ్బు కోసం  అమాయక బాలికల్ని  బలవంతంగా సెక్స్ వర్కర్స్ గా మార్చే నికృష్టులూ , కాముకులై , నివారణ లేని రోగాలంటించుకుని  అమాయకులైన భార్యలకి  నిర్లజ్జగా  అంటించే మొగుళ్ళు , తెలిసి తెలిసి భార్యలనీ , వాళ్ళ నించి పుట్టబోయే పిల్లల్నీఅ వ్యాధి గ్రస్తుల్ని చేసే దుర్మార్గులు ... వీళ్ళ సంఖ్య తామర తంపరగా పెరిగి పోతుంటే, ఎంత మంది వాలంటీర్స్ నిరంతరాయంగా పనిచేస్తే సరి పోతుంది ?  ప్రపంచంలో ఏ  మూలైనా నీళ్ళని కలుషితం చేస్తే ,  వ్యక్తి  తన జీవిత కాలంలో ఆ నీటి కాలుష్యానికి గురి కాక తప్పదంటారు .. మరి ఇలా మానవాళి మనుగడ కోసం , పునరుత్పత్తి కోసం  నిర్దేశించబడ్డ అవయవాల్ని కలుషితం చేస్తే మానవ జాతి ఏమైపోతుంది సమాజమంతటా ఉగ్రవాదాన్ని మించి చొచ్చుకుపోయిన ఈ చీకటి ప్రపంచం గురించి ఏం చేస్తే మనుషులు మనుషులుగా బతగ్గలుగుతాం
నీలాకాశంలో మినుకు మినుకు మంటున్న నక్షత్రాలని చూస్తూ ఆలోచనల్లో మునిగి ఇద్దరం కొంత  సేపు మౌనంగా ఉండిపోయాం .. అలా నక్షత్రాల్లా  దూరంగానే అయినా  ఏదో ఆశ మినుకు మినుకు మంది!  ఎయిడ్స్ ని మొదటి సారి గుర్తించినపుడు ఈ మందులు లేవు ! ఇంతటి అవగాహన లేదు ! ఇవాళ  త్రుటిలో ఆ వ్యాధి బారి నుంచి మనోజ్ఞ తప్పించుకుందంటే అది శాస్త్ర విజ్ఞానపు పురోగతి వల్లే. ఏ  కొద్ది మందో, నిరంతరం మరింత మంచి ఆరోగ్య వంతమైన సమాజం కోసం కృషి సలుపుతూండడం వల్లే ! హెచ్చైవీ పట్లా,  ఎయిడ్స్ పట్లా ఇప్పుడున్నంత స్టిగ్మా, ఇంతటి వివక్షా లేకపోతే ఈ ముసుగులు తగ్గి ఇంకొంత  ధైర్యంగా అనుమానమున్న ప్రతివాళ్ళూ పరీక్ష చేయించుకుంటారేమో ! సమాజపు సహకారంతో తమ వ్యాధికి శ్రధ్దగా మందులు వాడతారేమో
ఎంత రాత్రయిందో ఏమో మరి కాసేపటికి బాల్కనీ లోంచి మాక్కనిపించే ఆకాశం లోకి  పూర్ణ చంద్రుడు షికారుకొచ్చాడు .
రాజీవ్ మెల్లిగా లేచి  నా చేతిని తన రెండు చేతుల మధ్యా పట్టుకుని థాంక్  యు చిన్నీ ! నా మనసిప్పుడు కొంత నెమ్మదించింది.. మరో వైపు ఇంకాస్త బరువుగానూ తయారయిందినుకో అంటూ రేపేం  జరగబోతోందో తెలీదుగాని , ఈ శరచ్చంద్రికల సాక్షిగా  మనసారా నా శుభా కాంక్షలు మనోజ్ఞకి పంపిస్తున్నా! " అన్నాడు ఆర్ద్రంగా. 
వాణ్ని ఆట పట్టిస్తూ " అబ్బో ! పెద్ద కవిగారు ! రేపు అగ్ని సాక్షిగా ఇంకేమన్నా చేస్తారేమో ఎవరికీ తెలుసు ? " అన్నా. గుడ్ నైట్ చెప్పుకుని వెళ్లి పడుకుంటే  ఆలోచనల  తేనెటీగలు ఎక్కడికి పోయాయో ... తీయని స్వప్నాలు రాత్రిని శుభ రాత్రిగా మార్చాయి ! హాయిగా నిద్ర పట్టింది !                                                 


***

6 comments:

  1. Katha, kathavastuvu, visleshana chaala baavunnaayi. Nirvaahakulaki krutgnataabhinandanalu. Cover page maarchunte inka baavundedi.

    ReplyDelete
  2. Thank you Arun Rajam garu. Meerannatte marokaru koodaa annaaru cover page gurinchi.

    ReplyDelete
  3. KADHA CHAALAA BAGUNDI.Atuvanti sensitive subject meeda yekkadaa aapakunda chandiviche kadha raayatam kastam ..manchi kadha raasinanduku abhinandanalu.

    ReplyDelete
  4. heart touching story with useful information...

    ReplyDelete