పరుగెత్తే వసంతాలు !
గతం గాయాల గేయమై కాలానికి గాలమేస్తూంటే
ముందుకి సాగలేక ఆగిపోయా !
రేపటి కోసం ఇంద్రధనుసు రంగుల్లో
నిన్నరాత్రి కన్న కలలేవీ కనిపించక
అదేపనిగా వెతుక్కున్నా !
కాగితపు పడవలెక్కి
రేపటి తీరానికి ప్రయాణమైన నా కలలన్నీ
తెల్లారక ముందే ముంచెత్తిన జడి వానకి తడిసి
గుమ్మం పక్కనుంచే
కొట్టుకుపోతూ కనిపించాయి !
గమ్యం తాలూకు ఊహా చిత్రాలెన్నో
గదిగోడలనిండా వేలాడుతూ ఉండేవి...
అవన్నీ ఏవీ??
ఉండబట్టలేక ఇల్లంతా తిరిగేశా
ఉన్మాదినై ఆకాశమంతా వెతికేశా
గాలిపటాలై ఎగరబోయి
ఎండుకొమ్మలకి చిక్కుకుపోయిన నా ఊహలన్నీ
చివికి చిరిగిపోయి కనిపించాయి..
నిస్పృహ నిలువెల్లా ఆవరించినా
నిలబడక తప్పదు,నడవక పోతే గడవదు!
ఎదురుగా చేరాల్సిన 'టార్గెట్స్ ' భయపెడుతున్నాయి!
ఓ సరదా ప్రేమ కథకి వస్తువు కావాలి , వెంటనే !
అనురాగ రాగంలో ఒదిగే ఉల్లాస గీతం కావాలి , తక్షణమే
!
గడువు దాటిపోతోంది....
ఆత్రంగా అసహనంగా వీధిలోకి అడుగేశా
వసంతాలు '1K రన్' లో పాల్గొంటూ కనిపించాయి !
ఆ కళ్ళలో రాత్రి మెరిసిన నక్షత్రాలన్నీ తళుక్కు
మన్నాయి
వాటినిండా అంతరిక్షాన్నంతటినీ వెలిగించగల ఆశలు
తళతళలాడాయి !
ఆ నవ్వుల్లోంచీ జారిన మల్లెలతో దారంతా పూలబాటై
పోయింది!
ఎంత సుగంధం !
మధుర గేయాలతో నా పుస్తకం నిండిపోయింది !
వెతుక్కుంటున్న
వస్తువు దొరికేసరికి
మనసు దూది
పింజై తేలిపోయింది !
* * *
వావ్....మంచి జ్ఞాపకం.
ReplyDeleteధన్యవాదాలు ప్రేరణా!
ReplyDelete