March 7, 2013

మార్చి నెల 'నది' మాస పత్రికలో ప్రచురితమైన శివరాత్రి ప్రత్యేక వ్యాసం


                  చిక్కని చీకటిలో ఆధ్యాత్మిక వెన్నెల ధార - మహా శివరాత్రి
                                                          ---  వారణాసి నాగలక్ష్మి

        శివ రాత్రి పర్వదినం శివ శక్తుల విలీనాన్ని సూచిస్తుంది.ప్రతి నెలా కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు మాస శివరాత్రి వస్తుంది.అయితే మాఘ మాసంలో వచ్చే మాస శివరాత్రిని, మహా శివరాత్రి పర్వదినంగా భక్తులు పండుగ జరుపుకుంటారు. ఈ పర్వ దినం మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. ఒక ప్రత్యేకమైన గ్రహ కూటమి ఈ నాడు జరిపే పూజలకూ,పుణ్య కార్యాలకూ విశిష్ట ఫలాలను ఇస్తుందని హిందువుల నమ్మకం.
       పురాణాల్లో మహాదేవుని మహిమలకు సంబంధించిన కథలెన్నో కనిపిస్తాయి .ఈ శివరాత్రి పర్వదినం తనకత్యంత ప్రియమైనదనీ, ఈ రోజు నియమానుసారం ఉపవాసముండి తనను పూజించి, తన జపం చెసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతారనీ   సాక్షాత్తూ ఈశ్వరుడే పార్వతీ దేవికి చెప్పినట్టుగా పురాణాలలొ ప్రస్తావించబడింది.

       భారతదేశంలో అనాదిగా శివారాధన కొనసాగుతూ ఉంది.మొహంజొదారో శిధిలాలలొ కూడా ధ్యాన మగ్నుడై ఉన్న శివుని మూర్తి కనిపించింది.కాలక్రమేణా రూపరహితుడై, 'ప్రకాశించే జ్యోతి ‘ రూపంలో ఉన్న శివలింగారాధన ప్రాచుర్యం లోకి వచ్చింది.ఈ రూపాన్ని హైందవేతరులు సరిగా అర్థం చేసుకోలేక పోయారని ఒక వాదం.
మహా శివరాత్రి నాడు అర్థ రాత్రి సమయంలో మొదటి సారిగా శివుడు లింగాకారంలో ఉద్భవించాడనీ, బ్రహ్మ,విష్ణువుల పూజలందుకున్నాడని పురాణ కథనం.అందువల్ల శివరాత్రి పర్వదినాన్నే శంకరుని పుట్టిన రోజుగా పరిగణిస్తారు.లక్ష్మీ సరస్వతి,సీతా సావిత్రివంటి దేవతలు కూడా శివరాత్రి ఉపవాసాన్ని పాటించినట్లు పురాణాలు చెపుతున్నాయి.మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించే భక్తులు మహా శివరాత్రి నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించి , ప్రతి నెలా వచ్చే శివరాత్రి నాడు రోజంతా ఉపవాసముండి ,అర్థ రాత్రి వరకు జాగరణ చేసి ,లింగోద్భవ వేళ శివలింగార్చన చేసుకుంటారు.వివాహితులు వైవాహిక జీవన సాఫల్యత కోసం,అవివాహితులు మంచి సంబంధం కుదరి వివాహం జరగడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం రివాజు.శివ రాత్రి మంగళ వారం నాడు వచ్చిందంటే  ఆనాటి పూజ మరింత విశిష్టఫలాలనిస్తుందని  చెప్పుకుంటారు. శివరాత్రి నాడు నిష్ఠగా శివ పూజ చేసి శివానుగ్రహం పొందిన వారికి దుష్ట శక్తుల నుంచి రక్షణ లభించి జ్ఞాన సిధ్ధి చేకూరుతుందని , అనుకూల వాతావరణం ఏర్పడి శివ సాయుజ్యం లభిస్తుందనీ భక్తుల నమ్మకం.
     శివలింగం సాధారణంగా స్వయంభువుగా గాని , రాయి,లోహం,చెక్క,స్ఫటికం,హిమము లేదా జెమ్ స్టోన్స్ తో గాని తయారు చేసినదై గాని ఉంటుంది. రూపరహితుడైన పరమేశ్వరుని సూచిస్తూ శివలింగం సాగతీసిన గోళాకారంలో ఉంటుంది.పరాశక్తికి ప్రతీక అయిన వృత్తాకారపు పీఠంపై నిలిపిన  శివలింగం, శివ శక్తుల మేళనాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి, పూర్వజన్మల దుష్కర్మల బరువుని తగ్గించుకుందుకు శివరాత్రిని మించిన మంచి సమయం లేదంటారు.నిత్య పూజతో పోలిస్తే శివరాత్రి పూజ వల్ల వచ్చే సత్ఫలితం కొన్ని లక్షల రెట్లు ఉంటుందని, రోజంతా ఉపవాసముండి,రాత్రంతా  శివ సహస్ర నామాలను పఠిస్తూ జాగరణ చేసి స్వామికి అభిషేకం  చెసిన వారు శివానుగ్రహం  పుష్కలంగా పొందుతారని పెద్దలు చెపుతారు.

 శివారాథనలోని ఆంతర్యం:

           మహాశివరాత్రి నాటి శివారాధనకు పాటించవలసిన ఆరు నియమాలు శివపురాణం లో నిర్దేశించబడ్డాయి. శివలింగానికి అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చించడం ఆత్మ ప్రక్షాళనను సూచిస్తుంది.స్నానానంతరం స్వామికి  సింధూరం అలంకరించడం సచ్చీలత ను అలవరచుకోవడాన్ని సూచిస్తుంది.ధూప సమర్పణ సంపదలబ్ధినీ , తైల దీపాన్ని వెలిగించడం జ్ఞాన సిధ్ధినీ సూచిస్తుంది. నైవేద్యాన్ని సమర్పించడం ఆయుర్వృద్ధికీ, కామితార్థ  సిధ్ధికీ సహకరిస్తుంది .
          ‘ ఓం నమశ్శివాయ ‘  అనే అయిదక్షరాల మంత్రాన్ని శివ పంచాక్షరి అంటారు.ఈ పంచాక్షరి మనిషి వెన్నెముకపైనుండే  చక్రాలను నిర్దేశించే  నియమాలను సూచిస్తుంది.'న ' అన్నమయ కోశాన్ని,'మ ‘ ప్రాణ మయ కోశాన్ని,'శి ‘ మనోమయ కోశాన్ని,'వ ‘ విజ్ఞానమయ కోశాన్ని,'య ‘ ఆనందమయ కోశాన్ని ,'ఓం' శబ్దం పాంచభౌతిక శరీరం లోని ఆత్మనూ సూచిస్తాయి. ఈ పంచాక్షరీ జపం వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుంది.
రాజు చిత్రభానుని వృత్తాంతం:
            మహా భారతం లోని శాంతి పర్వంలో అంపశయ్య మీదున్న భీష్మాచార్యుడి నోట  చిత్రభానుడనే రాజు మహా శివరాత్రి పూజలు సాగించిన విధానపు ప్రస్తావన వస్తుంది.
జంబూద్వీపాన్ని పాలించే ఇక్ష్వాకు వంశస్థుడైన రాజు చిత్ర భానుడు మహా శివరాత్రి నాడు ఉపవస దీక్షలో ఉండగా అష్టావక్రుడనే ముని రాజ సభకు వస్తాడు.
           ‘ రాజా ! ఈ రోజు నువ్వు ఉపవాస దీక్ష పట్టిన కారణమేమిటి? ‘ అని ప్రశ్నిస్తాడు.
          చిత్ర భానుడికి తన పూర్వ జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకముండడం వల్ల తన కథను మునికి ఈ విధంగా తెలియపరుస్తాడు.
           పూర్వ జన్మలో చిత్ర భానుడు వారణాసి పట్టణంలో సుస్వరుడనే ఒక వేటగాడు.అతడు తన భార్యా ,ఒక బిడ్డడితో ఒక పూరి పాకలొ జీవిస్తూ ఉండేవాడు.ఏపూటకాపూట గడవడమే కష్టంగా ఉన్న జీవితం వారిది.ప్రతిరోజూ అడవికి పోయి వేటాడి వేటాడి చివరికి దొరికిన వేటతa సుస్వరుడు ఇల్లుచెరేవాడు.ఆ పూటకదే వారికి భుక్తి.ఒక రోజు వేటకి వెళ్ళిన అతనికి జంతువులూ పక్షులూ చాలా దొరికాయి.వాటన్నిటినీ తన సంచిలో వేసుకుని ఆనందభరితుడయ్యాడు సుస్వరుడు.రెట్టించిన ఉత్సాహంతో ఇంకా వేటాడ దలచి మరింత దూరం అడవిలోకి చొచ్చుకు పోయాడు.ఇంతలో చీకట్లు కమ్మాయి.దారి తప్పిన సుస్వరుడు భయంకరమైన క్రూర మృగాలను తలచుకుని భయపడుతూ ఒక చెట్టెక్కి కూర్చున్నాడు.
           అతని శరీరపు వాసన పసిగట్టిన అడవి జంతువులు అతనున్న చెట్టుకింద చేరాయి.వాటిని తరమడం కోసం సుస్వరుడు చెట్టు కొమ్మల్నీ ఆకుల్నీ   తెంపి వాటిమీదకు విసరడం  మొదలుపెట్టాడు.చెట్టుకింద ఆకలితో కూర్చున్న మృగాలతో రాత్రంతా అతనికి  నిద్రలేకుండా పోయింది. అయితే కాకతాళీయంగా అతనెక్కిన చెట్టు బిల్వ వృక్షం కావడం, ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉండడంతో అతను విసిరిన బిల్వదళాలు తిన్నగా శివలింగంపైన పడ్డాయి.ఆ రోజు శివరాత్రి ! ప్రాణభయంతో రాత్రంతా తనకు తెలియకుండానే  జాగరణ చేసి బిల్వ దళాలతో శివుని పూజించాడు సుస్వరుడు. తెల్లవారగానే అతడు వారణాసికి తిరిగి వచ్చి తనకు దొరికిన వేటను అమ్మి, భోజనానికి కావసిన వస్తువులను కొని , ఇంటికి తెచ్చాడు.సరిగ్గా అతడు ఆహారాన్ని తీసుకోబోయే సమయానికి ఒక అపరిచిత వ్యక్తి భిక్షాటనకు వచ్చాడు. సుస్వరుడు అతనికి సరిపడా ఆహారాన్నిచ్చి,తన భోజనం ముగించాడు.
చివరికి సుస్వరుడు మరణ శయ్యపై ఉన్నపుడు   అతని ఆత్మను శివ సాన్నిధ్యానికి తీసుకు వెళ్ళడానికి శంకరుని భటులిద్దరు వచ్చారు.అప్పుడు శివసేవకులిద్దరి మాటలవల్ల సుస్వరుడికి తాను అడవికి వెళ్ళినప్పుడు  రోజంతా వేటాడుతూ అభోజనంగా ఉన్నాడనీ,ఆ రాత్రి శివరాత్రి అనీ ,రాత్రంతా మృగాల  భయానికి తాను  జాగరణ చేశాడని ,తానెక్కిన చెట్టు బిల్వ వృక్షమనీ,ఆ చెట్టు మొదట్లో శివలింగం ఉందనీ,తాను చెట్టు నించి తెంపి, విసరిన బిల్వదళాలు శివార్చనకు దారితీశాయనీ తెలిసింది.తను భార్యా పిల్లలను తలచుకుని కార్చిన కన్నీళ్ళు శివలింగాన్ని అభిషేకించాయని  అవగతమయ్యింది.
           పూర్వజన్మలో  తెలియకుండా చేసిన శివ రాత్రి వ్రతం వల్లనే తాను కొన్ని యుగాల పాటు శివ సాన్నిధ్యం లో నివశించి, మరు జన్మ లో  చిత్ర భానుడిగా జన్మించి రాజ్యాధికారాన్ని పొందానని మునీశ్వరుడికి వివరించాడు చిత్రభానుడు.
         పై కథ ఒక రూపకాలంకార ప్రక్రియ.వేటగాడు వన్య మృగాలను వేటాడి చంపినట్టే,ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న భక్తుడు కామ, క్రోధ ,లోభ ,మోహ ,మద ,మాత్సర్యాలను అధిగమించవలసి ఉంటుంది. కీకారణ్యం, ప్రలోభాలకు లోనయ్యే మనసునీ,అననుకూల మానసిక స్థితినీ సూచిస్తుంది.ఆధ్యాత్మిక మార్గం సుగమం కావాలంటే వ్యక్తి తనలోని మృగ లక్షణాలను పరిహరించవలసిందే.వేటగాని పేరు సుస్వరుడు.అంటే శ్రావ్యమైన స్వరమున్నవాడు. ఇది భక్తుని కి ఉండవలసిన చిత్తశుధ్ధి,వాక్శుధ్ధిల ఆవశ్యకతని సూచిస్తుంది.యమనియమాలను శ్రధ్ధతో పాటించే వ్యక్తికి,తనలోని దుర్లక్షణాలను నిగ్రహంతో క్రమశిక్షణతో జయించిన వ్యక్తికి ఒక యోగికి ఉండే సుగుణాలు అలవడతాయి.  తేలికైన శరీరం, నిబ్బరం,ముఖ వర్చస్సు,సుస్వరము ఆ వ్యక్తిలో  మొదట కనపడే చిహ్నాలు.
            బిల్వ వృక్షం వెన్నెముకని సూచిస్తుంది.బిల్వ దళాల ప్రతి రెమ్మకూ మూడు ఆకులుంటాయి.ఈ మూడు ఆకులూ ఇడ,పింగళ,సుషమ్న అనే మూడు నాడులకూ ప్రతీకలు. ఇవి శివుని మూడు కన్నులనీ కూడా సూచిస్తాయి. సుస్వరుని జన్మ స్థలం వారణాసి.యోగులు ఆజ్ఞా చక్రాన్ని వారణాసి అంటారు.రెండు కనుబొమల మధ్య ఉండే కేంద్రమే ఆజ్ఞా చక్ర స్థానం. ఇది ఇడ,పింగళ,సుషమ్న నాడులు కలుసుకునే స్థలం.ఆజ్ఞా చక్రం మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసే వ్యక్తి సుఖ లాలసనూ,దుర్గుణాలనూ జయించగలుగుతాడు. ఆత్మావలోకనం చేయగలుగుతాడు. ఆధ్యాత్మికం గా ఎదగాలనుకునె వ్యక్తి ఆజ్ఞా చక్రంపై మనసుని నిలిపి ధ్యాన మగ్నుడైతే క్రమంగా ఇంద్రియాలను జయించగలుగుతాడని యోగ  శాస్త్రం చెపుతుంది.

            బిల్వ వృక్షాన్ని ఎక్కడం అనేది , కుండలినీ శక్తిని ,అన్నిటి కన్నా క్రింద ఉండే నాడీ కేంద్రం అయిన మూలధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు లేవనెత్తడాన్ని సూచిస్తుంది. సుస్వరుడు తాను అడవిలో వేటాడి చంపిన పక్షులనూ, జంతువులనూ మూటకట్టి చెట్టెక్కడం,రాత్రంతా మెలకువగా ఉండడం  మనకు సూచిస్తున్నదేమంటే , సాధకుడు తన మానసికమైన  దుర్గుణాలను,దురాలోచనలను  అచేతనావస్థలోకి పంపి యోగి వలె యమ నియమాలను పాటిస్తూ ఉన్నత స్థితికి చేరాడనీ,ఏకాగ్ర చిత్తంతో ధ్యాన మగ్నుడయాడనీ . రాత్రంతా మేలుకుని ఉండడం ,ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వ్యక్తికి అవసరమైన ఎరుకకీ,ఏకాగ్రతకీ చిహ్నం.అతడు కొద్దిసేపు కూడా ఏమరుపాటుగా ఉండకూడదని అర్థం.శివ శబ్దం జాగ్రదవస్థలోనూ, స్వప్నస్థితిలోనూ, నిద్రావస్థలోనూ కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని  సూచిస్తుంది.మూడు ఆకులను కలిపి ఉంచిన మారేడు దళాలతో శివుని అర్చించడం ఈ మూడు స్థితులకూ అతీతమైన జ్ఞానసిధ్ధిని పొందాలనే సంకల్పాన్ని సూచిస్తుంది.
         
            ఇక్కడ అతని భార్యా బిడ్డలు ఇహలోకాన్ని సూచిస్తారు.భగవదనుగ్రహం కోరే వ్యక్తి ప్రేమకు ప్రతిరూపంగా మారాలి.భార్యా పిల్లలను తలచుకొని అతడు కన్నీరు కార్చడం కూడా యోగికుండవలసిన  విశ్వ ప్రేమను సూచిస్తుంది. యోగ మార్గం లో  ప్రాధమిక దశ  సకల ప్రాణికోటితో సహానుభూతిని కలిగి ఉండడం.అనాలోచితంగానే అతడు బిల్వదళాలను తెంపి విసరడం  యోగి తన సాధనలో భాగంగా ఆజ్ఞా చక్రం పైన ధ్యాస నిలిపి ధ్యానించడాన్ని సూచిస్తుంది. ఇది యోగ మార్గం లోని రెండవ దశ అయిన స్వప్నావస్థ.రాత్రంతా అతడు జాగరణ చేయడం  యోగి మూడవ దశ అయిన  నిద్రావస్థను విజయవంతంగా దాటడాన్ని, తెల్లవారడం ,ఉషోదయమైనాక అతడికి శివలింగం కనపడడం, యోగి చివరికి నాలుగవదైన సమాధి స్థితిని చేరడాన్ని  సూచిస్తుంది.సాధన క్రమంలో తగినంత కృషి తరువాత భగవత్సాక్షాత్కారం జరుగుతుందని  తెలియజేస్తుంది.తెలియకుండానే సాధన చేసినా యోగికి  ఫలితం దక్కినట్టే సుస్వరుడు ఉద్దేశ్యపూర్వకంగా చేయక పోయినా భగవత్కృపకు పాత్రుడయ్యాడు.
సుస్వరుడు ఇంటికి వెళ్ళి ఒక అపరిచితుడికి ఆహారాన్ని అందిస్తాడు.ఆ అపరిచితుడెవరో కాడు.కొత్త వ్యక్తిగా మారిన సుస్వరుడే.క్రితం రోజు తాను చంపిన కామ ,క్రోధ ,మోహ ,లోభ ,మద ,మాత్సర్యాలే అతను అందుకున్న ఆహారం.అందులో కొంత భాగాన్నే మార్పు చెందిన సుస్వరుడు భుజించాడు.మిగిలిన భాగాన్ని భుజించి హరించడానికి అతడు మరు జన్మలో చిత్ర భానుడిగా జన్మించవలసి వచ్చింది! శివ లోకానికి వెళ్ళినా అతనికి జన్మ రాహిత్యం సిధ్ధించలేదు.సలోక్య,సామీప్య,సారూప్య స్థితుల తర్వాతదే సాయుజ్యం.విష్ణులోకంలో స్వామికి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు కూడా తిరిగి జన్మించడం ఇటువంటిదే!

మహా శివుని ప్రసన్నత :

        సృష్టి సంపూర్ణమయ్యాక శివ పార్వతులు కైలాస పర్వతం పై నివశించడానికి వెళ్ళినపుడు పార్వతీ దేవి భర్తను ప్రశ్నిస్తుంది "స్వామీ !భక్తులు ఏ విధంగా పూజిస్తే మీకు అధికమైన  ప్రసన్నత కలుగుతుంది? " అని.
అందుకు స్వామి ఈ విధంగా ప్రత్యుత్తరమిస్తాడు  "దేవీ!మహా శివరాత్రి నాడు భక్తులు నన్ను కోరి ఉపవాసముండడం ,మిగిలిన అభిషేకాలూ,పుష్పార్చనలూ,ధూపదీప నైవేద్యాలకన్నా నాకెక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది.ఆనాటి రాత్రి ప్రతి మూడు గంటలకూ ఒకసారి చొప్పున రాత్రి పన్నెండు గంటలలో చతుర్విధాలుగా నన్ను పూజించినపుడు నేను ప్రసన్నుడనవుతాను.మణి మాణిక్యాలతో,సుగంధ సుమాలతో పూజించడం కన్నా బిల్వదళాలతో  అర్చించినపుడు నేనెక్కువ సంతుష్టుడనవుతాను.మొదటి జాములో పాలతోనూ,రెండవ జాములో పెరుగు తోనూ,మూడవ జాములో నేయితోనూ,నాలుగవదీ ఆఖరిదీ అయిన తెలవారు జామున తేనెతోనూ నాకు అభిషేకం చేసి, మరునాడు స్నానాదికాలు ముగించి, పరిశుధ్ధుడై నన్ను పూజించి ,బ్రాహ్మణులకు భోజనం పెట్టి, తన ఉపవాస దీక్షను ముగించవచ్చు.నాకు దీన్ని మించిన పూజలేదు."  మహాశివుని సమాధానం విన్న పార్వతీ దేవి ఈ విషయాన్ని తన చెలికత్తెలకు చెప్పగా కాలక్రమేణా ఇది జగద్విదితమయిందని లోకోక్తి.

ఆత్మాత్వాం గిరిజా మతి:పరిజనా:ప్రాణాశ్శరీరం గృహం
పూజాతే విషయోప భోగ రచనా నిద్రా సమాధిస్థితి:
సంచార:పదయో:ప్రదక్షిణ విధి:స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం //

‘ ఓ మహేశ్వరా!నీవు ఆత్మవు.బుధ్ధి పార్వతి.నా ప్రాణములు నీ పరిజనములు.నా శరీరమే నీ గృహము.నా విషయోప భోగ రచనయే నీ పూజ.నిద్ర సమeధి  స్థితి.పాదముల సంచారమే నీకు ప్రదక్షిణము.నా సమస్త వచనములు నీకు స్తోత్రములు.ఈ విధముగా నేను చేయు కర్మలే నీకు ఆరాధనము ‘ అంటూ చేసే మానసిక పూజ, పూజల్లోకెల్లా ఉత్తమమైనదిగా విజ్ఞులు చెపుతారు. నిజమైన  భక్తులు తమ దైనందిన కర్మలన్నిటినీ   శ్రద్ధతో నిర్వర్తిస్తూ, అదే శివారాధన గా భావిస్తూ, కర్తవ్యాన్ని ఏమరక,  యోగ మార్గంలో చిదానంద స్వరూపులై  జీవితాన్ని కొనసాగిస్తారు.దీనినే అంతర్యాగం అంటారు.

            ఈ సంవత్సరం మార్చి నెల పదవ  తారీకున వచ్చే ‘ శివరాత్రి ‘ పర్వదినం నాడు భక్తులంతా అంతర్ముఖులై, మానసారణ్యంలోని  మృగ లక్షణాలను వదిలించుకుని,పరమేశ్వర కృపకు పాత్రులవాలని కోరుకుందాం . చెవులు చిల్లులు పొడిచే మైకుల వాడకం మాని , అంతరాత్మ ప్రబోధాన్ని వినే ప్రయత్నం చేద్దాం.దేహమే దేవాలయమని , జ్ఞానమే దైవమనీ  తెలుసుకుని,  పరమేశ్వరుడు కొలువుండే మనో మందిరాన్ని నిర్మలంగా , సుగంధభరితంగా ఉంచుకుని  ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత సోపానాలని అధిరోహించేందుకు ఉద్యుక్తులమౌదాం.  

                                                                                                   

1 comment:

  1. బాగుందండి .తెలుగు వెలుగు లో మీ పుట్టిల్లు కథ బాగుంది

    ReplyDelete