July 9, 2014

నాన్నకో ఈ మెయిల్

                                  -- కథ , ఇలస్ట్రేషన్  by వారణాసి నాగలక్ష్మి     నాన్నా ! మీరు ఇండియా కి తిరిగి వెళ్ళినప్పట్నుంచీ మా ఇల్లంతా బోసిపోయింది. 

    నేనైతే ఎంతగా మిమ్మల్ని మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను. మరీ చిన్నప్పుడంతా ఏమోగాని  స్కూలు రోజులనించి, పెళ్లి అయి  సునీల్ తో ఇక్కడికి వచ్చేదాకా, నాకు నువ్వు చేసిన గారాబం, పంచిన అనురాగం అనుక్షణం గుర్తొస్తూనే ఉన్నాయి. చిన్ని పాపాయి పురిటి సమయం లో అమ్మ కన్నా ఎక్కువగా నువ్వు  చూపించిన ఆప్యాయత, చిన్న చిన్న విషయాలలో కూడా నువ్వు కనపరచిన ప్రత్యేకమైన శ్రద్ధ గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. 

   అమ్మ ఆసుపత్రిలో నాదగ్గరుండిపోతే నువ్వు పెద్ద పాపని చూసుకుంటూ, ఇంటి నించీ బాలెంత పత్యం వండి పంపడం తలచుకుంటే గొంతు లో ఏదో అడ్డుపడ్డట్టై మాట రాదు!  సునీల్ అమ్మనీ, నన్నూ, పసి పాపాయినీ  ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేసరికి, ఎదురొచ్చిన నిన్నునేనెప్పటికీ మర్చిపోలేను. ఇల్లంతా శుభ్రంగా సర్ది, పళ్ళెంలో ఎర్రనీళ్ళతో సహా ఎదురొచ్చి, నాకు దిష్టి తీసిన నువ్వు, దగ్గరుండి పురుడు పోసిన  అమ్మలాగే అనిపించావు . 'ఇలాంటివన్నీ నీకెలా తెలిశాయి నాన్నా?' అనడిగినపుడు  'మనసుంటే మార్గం ఉంటుంది రా తల్లీ' అంటూ నవ్వుతున్న నీ  మొహం వెయ్యికాండిళ్ళ  బల్బులా వెలిగిపోయింది! ఇవన్నీ మరీ మరీ గుర్తొచ్చి, రోజూ ఫోనులో మాట్లాడుతూనే  ఉన్నాకూడా, ఇవాళ నీకో  ఉత్తరాన్ని, ఈ మెయిల్లోనే  అనుకో, మళ్ళీ మళ్ళీ  చదువుకుందుకు వీలుగా రాయాలనిపించింది ! 

    మీరిద్దరూ వెళ్ళిపోయాక, ఒక్కసారిగా ఒంటరితనం చుట్టేసినట్టయింది నాన్నా! సోనూ ని చూసుకుంటూ, చిట్టి పాపాయి పనులు చక్కబెట్టుకుంటూ, ముద్దొచ్చినపుడల్లా  ఇద్దరికీ ఫోటోలు తీస్తూ, ఇంటి పనులు పూర్తి  చేసేప్పటికి ఒకటే అలసట అనిపిస్తోంది. మామ్మా, తాతగార్ల సేవలు చేస్తూ, నీ కన్నీ అమరుస్తూ, ఇంతకన్నా ఎక్కువ పనులు సమర్ధించుకుంటూ,  మమ్మల్నిద్దరినీ  అమ్మ ఎలా పెంచిందో అనిపిస్తోంది. 

    నిన్న మనం మాట్లాడుకున్నపుడు  చెప్పాను కదా...  మూడురోజుల క్రితం సునీల్ అట్లాంటా వెళ్ళాడు, వారం రోజుల పని మీద. ఇంటి పనులన్నీ అయాక, పిల్లలు నిద్రపోతున్న వేళ, ఎన్నో జ్ఞాపకాలు నా మనస్సులో సినిమా రీళ్ల లా తిరిగి పోయాయి. సునీల్ తో నా పెళ్ళికి ముందు జరిగిన నాలుగైదు పెళ్లి చూపులూ, అబ్బాయి తరఫు వాళ్ళు నేను నచ్చలేదన్నపుడు నువ్వు ఆగ్రహంతో మండి పడి పోవడం, వాళ్ళు నచ్చిందన్నపుడు   ఒకటికి పది సార్లు వాళ్ళ వివరాలు సేకరించి, ఏవో  వంకలెన్ని, ఆ  సంబంధం వదిలేయడం....  'ఇలాగైతే ఎలాగండీ ఆడపిల్ల పెళ్లి చేసేదీ' అని అమ్మ దిగులు పడుతుంటే, 'దీనికి తాతలాంటి సంబంధం తెస్తానే నా బంగారుతల్లికి' అంటూ అమ్మ భయాలు అర్ధరహితమంటూ కొట్టిపారేయడం  ... అన్నీ  గుర్తొచ్చాయి. 

   నీకు నచ్చచెప్పలేక అమ్మ నెత్తి కొట్టుకుని, అమ్మమ్మతోనూ, పిన్ని తోనూ ' ఇలా అయితే చిన్నదాని పెళ్లి అయినట్టే' అంటూ  మొత్తుకోవడం తలచుకుంటే నవ్వొచ్చింది. చివరికి  సునీల్ సంబంధం  నచ్చాక కూడా అదే పనిగా  వాళ్ళ కుటుంబం గురించి, అతని గురించి వాకబు చేస్తుంటే ' నీకింత ప్రేమ ఏమిటా నామీద' అని ఆశ్చర్యం వేసింది. మా నాన్న 'లాఖోంమే ఏక్ ' అని గర్వం కలిగింది.  

   ఏనాటి నుంచి పొదుపు చేశారో ఏమో.. ఏ లోటూ  లేకుండా, అందరూ మెచ్చేలా పెళ్లి చేసి, నన్ను అత్తవారింటికి పంపుతూ అమ్మ కన్నా ఎక్కువగా ఏడ్చిన నిన్నుచూస్తే  అడుగు ముందుకు పడలేదు నాన్నా  ! 

   ఆలోచనల్లో ఇంకా వెనక్కి వెళితే  నా ఎమ్మెస్ చదువు నాటి జ్ఞాపకాలు. మాస్టర్స్ కోసం నేను కాలిఫోర్నియా  వచ్చేటపుడు ఒక్కసారిగా మీద పడ్డ పనులన్నిటికీ వేసవి ఎండల్లో నా వెంట నువ్వు రావడం ఎలా మర్చిపోతాను ? గ్రాడ్యుయేషన్  సెర్మనీ పూర్తి చేసుకుని  వెనక్కి వచ్చినపుడు ఎయిర్పోర్ట్ లో అమ్మ కన్నా ముందు పరుగెత్తుకొచ్చి, నన్ను హత్తుకున్న నువ్వు ఉద్వేగంతో వణకడం ఇప్పటికీ జ్ఞాపకమే. ఆఫీసు నించీ నాకోసమే రోజూ తొందరగా ఇంటికోచ్చేస్తూ నేను మీతో ఉన్న ఆ ఏడాది లో నన్నొక ప్రత్యేక వ్యక్తిగా ట్రీట్ చేయడం గుర్తొస్తే మళ్ళీ జన్మలో కూడా నీకే కూతుర్నై పుట్టాలనిపిస్తుంది నాన్నా ! 

   జ్ఞాపకాల్లో అంతకన్నా వెనక్కి వెళ్తే...  కాలేజీ నించి ప్రాజెక్టుల బరువులు భుజాన వేసుకుని వేళ్ళాడుతూ, ఆలస్యంగా, నీరసంగా ఇల్లు చేరినపుడు  'కాళ్ళూ చేతులూ కడుక్కురామ్మా' అంటూ అమ్మ ఒకవైపు తరుముతున్నా, 'నువ్వుండు...  పిల్ల అలిసిపోయి వచ్చిందనే ఆలోచనైనా లేదు ?' అంటూ అమ్మని కసురుకుని, చల్లని జ్యూసో, వేడి హార్లిక్సో కలిపి తెచ్చి, నోటికందిస్తూ నువ్వు  చేసిన గారాబం మరిచిపోలేను నాన్నా.  పరీక్షల్లో  రాత్రి తెల్లవార్లూ  చదువుకుంటుంటే, అమ్మతో పాటుగా నువ్వూ  అటొచ్చీ ఇటొచ్చీ నా కోసం తాపత్రయ పడ్డ రోజులు ఫోటో ఫ్రేమ్ కట్టినట్టు నా మనసులో నిలిచి పోయాయి. అంతకంటే ముందు...  ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో, నాకోసం నువ్వు కూడా నాలుగింటికే లేచి నన్ను కోచింగ్ క్లాసులో దింపి, మళ్ళీ క్లాసు పూర్తయ్యే లోపే వచ్చేసి, బయట వెయిట్ చేస్తూ నిలబడే వాడివి కదా. నాకైనా, అక్కకైనా నువ్వు అందించిన ఆసరా 'ఇంత', 'అంత'  అంటూ మాటల్లో వ్యక్తపరచడం సాధ్యమా ! మార్కులు తక్కువైతే చివాట్లు పెట్టి, మళ్ళీ ఏ  అఘాయిత్యం చేసుకుంటామో అని వణికిపోయే నిన్ను కొన్నిసార్లు మోసం చేసి, దొంగతనంగా మేం సినిమాలకి చెక్కేసిన సంగతి నీ కిప్పటికీ తెలీదు కదా ! 

   ఎంసెట్ , బిట్ శాట్ , ఏ ఐ ట్రిపులీ ఇంకా ఏవేవో పరీక్షల గందరగోళాల్లో మాకు మతిపోకుండా  కంటికి రెప్పలా కాపాడింది నువ్వేగా నాన్నా ! మా రాంకులు చుక్కల్లోకి పోతుంటే, ఆశల నక్షత్రాలు మినుకు మినుకు మనకుండా,  దోసిలి పట్టి ఆరని జ్యోతుల్లా వాటిని వెలిగించింది నువ్వేగా ! చివరికి కౌన్సిలింగ్ సమయం  దగ్గర పడుతుంటే, ఎంత ముఖ్యమైన పనులున్నా ఆఫీసుకి సెలవు పెట్టి, సిటీ చుట్టుపక్కల ఉన్న కాలేజీలన్నీ తిరిగి తిరిగి, మంచీ చెడూ విచారించి, ఆ తతంగమంతా పూర్తై  మంచి చోట బీటెక్ లో చేరేదాకా ఎక్కడా రాజీ పడని నువ్వు, నా భవిష్యత్తుకి వేసిన బంగారు బాట ఫలితమేగా ఇవాల్టి నా వర్తమానం ? ఇంకా వెనక్కి వెళితే, హై స్కూల్లో ఆట పాటల్లో బహుమతులు గెలిచి, ఇంటికి  పట్టుకొచ్చినపుడల్లా నింగినంటే కెరటంలా ఉప్పొంగిపోయి, ఆ బహుమతుల కోసం ఒక షోకేస్ చేయించిన నువ్వు మాకిచ్చిన ప్రోత్సాహం ఎంతో ఎలా చెప్పను ?

   అలాంటి, ఆకాశ విహారం లాంటి జీవితం నించి ఒక్కసారిగా నేల మీదికి పడ్డాక అప్పటి మధుర  స్మృతులు తలుచుకుంటే కలిగే నోస్టాల్జియాని మాటల్లో పెట్టడం అంటే మాటలు కాదులే ! నేల మీద పడడం ఏమిటీ అని ఆశ్చర్య పోతున్నావా ? పాపం సునీల్ ..  తనకి మళ్ళీ ఆడపిల్లే పుట్టిందిగా.   

   రెండోసారీ  ఆడపిల్లే పుట్టేసరికి  అతనెంత మాత్రం ఊహించనిది  జరిగిపోయింది. ఎంతో  ఆశాభంగం కలిగినా, ముందుతరం కన్నా ఈ విషయంలో మరికొంత విషయ పరిజ్ఞానం ఉన్నందువల్లో ఏమో,  బయటికి ఏమీ అనలేక మింగుకుని, ఎవరి మీదో తెలీని కోపాన్ని, అసహనాన్నీ, ఉండీ ఉడిగీ బయటికి కక్కుతున్న అతన్ని చూసినపుడల్లా నువ్వు  గుర్తొచ్చి కళ్ళ నీళ్ళు తిరుగుతున్నాయి. మీరు వెళ్ళినప్పటి నించీ మొహం మాడ్చుకుని తిరుగుతూ, వీలయినంతమటుకు నన్ను తప్పించుకు తిరుగుతుంటే, నిలదీసి అడగకుండా ఉండలేకపోయా నాన్నా. 

    'ఇద్దరు పిల్లలున్నపుడు ఒకపాపా, ఒక బాబూ కావాలని కోరుకోవడం తప్పా? ' అన్నాడు ! అతని మూర్ఖత్వానికి విస్తుపోయినా తేరుకుని ' సైన్స్ ఇంతగా తెలిసీ నన్ను తప్పు పడుతున్నావా ? పుట్టబోయే బిడ్డ జెండర్ నా చేతులో ఉందా? '  అన్నాను. ఉందిట ! మగ పిల్లాడు కావాలనుకున్నపుడు ఎక్స్ , వై క్రోమోజోములలో వై క్రొమొజొమ్ ని ఎన్నుకోవలసింది స్త్రీ యేట ! LOL ... 

   తొమ్మిది నెల్లూ మోసి నరకయాతన పడి, ఒక అద్భుత ఆవిష్కరణలో పాలుపంచుకున్న నన్నూ, ఆ అద్భుతాన్నీ కూడా అవమానిస్తున్న అతన్ని, ఏ గుర్తులూ  వదలకుండా జాగ్రత్త పడుతూ  కించ పరుస్తున్న అతన్ని ఏమనగలను ? 

    ఇలా రాసి నిన్ను బాధ పెడుతున్నానేమో...ఇన్నేళ్ళ నీ శ్రమ ఫలితంగా ఈ స్థితికి చేరిన నీ గారాల పట్టి, మనసునిండా  లోతైన ముళ్ళు గుచ్చుకుని విలవిల లాడుతుంటే నీకు కలిగే బాధని ఊహించగలను. కానీ నీతో పంచుకోకుండా ఉండలేక పోతున్నా నాన్నా.. ఎందుకంటే నాకు ఏడెనిమిదేళ్లు  వచ్చినప్పటినుంచీ, నా ప్రతి విజయం లోనూ నువ్వు  తోడున్నావు. నా అపజయాల్లో ఆలంబన ఇచ్చి విజయం వైపు నడిపించావు. అందుకే నా మనసుకింత దగ్గరైన నీకు ఈ విషయం చెప్పకుండా ఉండడం నా వల్ల  కావడం లేదు . 

    ఇదంతా చదివి బాధ పడకు నాన్నా! ఇది కొత్తా కాదు వింతా కాదు ! 

    పాతే ... రోతే !

    సునీల్ రేపటి తండ్రి. ఇవాళతను ఒట్టి మగవాడు. సగటు మగవాడు. ఇవాల్టి పసి నవ్వులు అతన్ని కదల్చక పోయినా, రేపు అమ్మా నాన్నలకి గర్వకారణమయ్యేలా నా పిల్లలు ఎదిగినపుడు 'వీళ్ళు నా పిల్లలు' అని ఆతను గర్వంగా చెప్పుకుంటాడు. నువ్వు ఇప్పటి పరిస్థితి తల్చుకుని మనసు కష్టపెట్టుకోవద్దు. అయితే అప్పటి వరకూ నేననుభవించే వేదన, చేయాల్సిన ఒంటరి ప్రయాణం తప్పవు. ఇలా అంటుంటే నా మనసే 'ఎందుకు తప్పవు ? ' అనడుగుతోంది. ఏం  చెప్పను నాన్నా, ఇద్దరు పసి పిల్లలతో బయట ఒంటరిగా జీవించడం అంత  తేలిక కాదుగా. వెంటనే కాకపోయినా కొన్నేళ్ళ తర్వాతైనా అతనూ నీలాగా మారతాడని నాకు నమ్మకం.

   నాన్నా! నువ్వు మర్చిపోయావేమో ... మా ఇద్దరినీ బంగారు తల్లులు అని గర్వంగా చెప్పుకునే నువ్వే నేను  పుట్టినపుడు 'ఇద్దరూ ఆడముండల్నే కన్న'దని అమ్మని , పురిట్లో పునర్జన్మ ఎత్తిన బాలెంతని, చీదరించుకుని, రెండేళ్ళు కూడా లేని అక్కని విదిలించుకుని వెళ్ళిపోయావని అమ్మమ్మ చెప్పింది. అప్పుడు తాతా, అమ్మమ్మా రాజు బావ పెళ్ళికొచ్చి, మనింట్లో ఉన్నారు. టెన్నిస్ టోర్నమెంట్ లో వెండి కప్పులు గెలిచామని  లోకల్ వార్తా పత్రికలో వస్తే 'నా కూతుళ్ళు' అంటూ నువ్వు గర్వంగా చెప్పుకుంటుంటే, ఉండబట్టలేని  అమ్మమ్మ వంటింట్లో అమ్మ దగ్గర నోరుజారింది. మూతి తిప్పుతూ 'అబ్బో కాకేం ? లక్ష్మీ సరస్వతుల్లా ఇద్దరు పాపాయిలు పుడితే 'ఇద్దరూ ఆడముండలే' అని చీదరించుకుని, నా వరాల తల్లిని ఈటెల్లాంటి మాటలతో గాయ పరిచి వెళ్ళిపోయింది ఈ  మహానుభావుడు కాదూ? ' అమ్మ దగ్గర చేతులు తిప్పుతూ మెల్లిగానే అన్నా నాకు వినిపించి, విలవిల్లాడిపోయాను. అది అబద్ధం అని లోలోపలే గింజు కున్నాను. అక్కకి చెప్పుకుని ఏడ్చుకున్నాను. ఎన్ని రాత్రులో ఎవరినీ అడగలేక దెబ్బతిన్న పిట్టల్లా  గిలగిల లాడి పోయాం. 
చుట్టాల్లో వాళ్ళనీ, వీళ్ళనీ ఇరుకున పెట్టి కూపీ లాగి, నిజాలు తెలుసుకుని, కొన్నాళ్ళు మూగవాళ్లమయ్యాం ఇద్దరం. అయినా అప్పటికి మాకు లోకజ్ఞానం లేక గానీ, మమ్మల్ని ఆకాశానికెత్తే నువ్వే అమ్మని ఎంత చులకనగా చూసేవాడివో నాకు గుర్తుంది. 

    ఎందుకు నాన్నా అలా ఉండేవాడివి? ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా అమ్మ కోరికలేమిటో  తెలుసుకుందుకు, ఆవిడ అభిప్రాయాలకి కొంచెమైనా విలువిచ్చేందుకు ప్రయత్నించని నువ్వు, నీ కూతుళ్ళ వైవాహిక జీవితం  అద్భుతంగా, స్వర్గ సమానంగా ఉంటుందని ఎలా ఆశిస్తావు?  అత్తా ఒకింటి కోడలే అంటారుగాని తండ్రీ ఒకామెకు భర్తే  అనరేం ? భార్యని చులకనగా, యంత్రంలా చూసి, తనకే అంకితమైన పువ్వులాంటి కోమల హృదయాన్ని గాయపరచడం ద్వారా ఎక్కడెక్కడో కలిగిన  అసంతృప్తుల తాలూకు అసహనాన్నితీర్చుకుంటూ...  ఎందుకు నాన్నా మగవాళ్లి లా ఉంటారు ? 

    మూడు రోజులై ఊరెళ్లిన సునీల్ ఇప్పటిదాకా ఫోనైనా చెయ్యలేదు. పసిపిల్లలిద్దరితో ఎలా మానేజ్ చేస్తున్నానో అనే ఆలొచనైనా లేకుండా, 'తీరికలేని పని' వంక పెట్టుకుని, నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేయడం ద్వారా కసి తీర్చుకుంటున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నదాన్ని, పిల్లలు పెద్దవాళ్ల యే దాకా ఎవరో ఒకరం చూసుకోవాలికదా  అని మానిపించేసి , ఇంటికే అంకితమైపోయిన నాకు కొంచెమైనా రిలీఫ్ ఇవ్వకుండా, స్పష్టమైన కారణం చెప్పకుండా కాల్లో ముల్లులా కనిపించకుండా నొప్పిస్తున్నాడు!

    ఇలా చెప్పానని బెంగ పడాల్సినదేం  లేదులే నాన్నా. గొడవపడి విడి పోవడమో, బజారుకెక్కి రచ్చ చేసుకోవడమో అవుతుందని భయపడకు. అలా ఏమీ జరగదు. తల్లిని గనక కడుపుతీపిని జయించలేను. ముద్దులొలికే పసిపాపలిద్దర్నీ ఒంటరిగానే పెంచుతాను. ఆతను తన పనిలో చురుగ్గా ముందుకు సాగిపోతూ, స్నేహితులతో డిన్నర్లూ, కాన్ఫరెన్స్ లూ, సినిమాలూ, బిజినెస్ ట్రిప్ లూ  ..ఇలా తన ఆటవిడుపులూ, కార్పోరేట్ నిచ్చెన మెట్లూ చూసుకుంటుంటే, తన ఆనందాలని బయట వెదుక్కుంటూ ఉంటే, నేను పిల్లలిద్దరూ మిడిల్ స్కూల్కి వచ్చేదాకా ఆపసోపాలు పడతాను. నా ఆశా భంగాలూ, ఒంటరి తనాలూ ఒకర్తేనే మానేజ్ చేసుకుంటూ, వివక్షని తట్టుకుంటూ, అర్థాంతరంగా ఆగిపోయిన కెరీర్ ని మెల్లిగా అప్పుడు పునర్నిర్మించుకోవడం మొదలెడతాను. 
    
     అప్పుడు ఆతను రంగం లోకి అడుగుపెడతాడు. అప్పటిదాకా ఊరినించీ వచ్చినపుడు పిల్లలకి కానుకలు తెస్తూ, ఎప్పుడేనా ఖాళీగా ఉండి  తోచనపుడు వాళ్ళతో ఆడుకుంటూ గడిపి, తండ్రి పోస్ట్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన మనిషి అప్పుడు హఠాత్తుగా వాళ్ళ విలువ గుర్తిస్తాడు. నా కూతుళ్ళు అంటూ ముద్దు చేస్తాడు. ఒక్కసారిగా వాళ్ళ ప్రపంచం తానైపోయి, అమ్మని పక్కకి తోసేస్తాడు. అప్పుడపుడే జ్ఞానం వస్తున్న పసివాళ్లిద్దరి మానసాకాశంలో నిండు జాబిల్లిలా వెలిగిపోతాడు. 

    మంచిదే. కానీ నాన్నా, ఈ క్రమంలో నేను కోల్పోయే  జీవితం మాటేమిటి? నిండు యవ్వనంలో భర్త నించి పొందాలని ఆశించే ముద్దు ముచ్చట్ల మాటేమిటి? జీవిత భాగస్వామి, సహచరుడు, సుఖ దుఖాల్లో నాతోడుగా నడుస్తాడు అని  నమ్మి, ప్రేమించి, హృదయాన్ని అర్పించిన వ్యక్తి,  ఇంత అవకాశవాది అని తేలితే కలిగే  బాధ, తగిలే  దెబ్బ తట్టుకోవడం అంత తేలిక కాదుగదా. 

    అయినా  ఇవన్నీ నిన్ను అడుగుతున్నానేమిటా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. అయోమయంగా కూడా ఉంది ..  నేను ఏం  చెప్పాలని ఈ లేఖ మొదలెట్టానో, రాస్తూ రాస్తూ ఎటు దారి మళ్లి పోయానో అర్ధం కావడం లేదు! మీ ఇద్దరి వైవాహిక జీవితానికి ఎక్స్ టెన్షన్ లా లేదూ నా జీవితం ? ఇలా రాస్తున్నానని నాకు నీ మీద ప్రేమ లేదనుకోవద్దు. ఈ ప్రపంచంలో నా కత్యంత ఇష్టమైన నువ్వు, నాకు అంతే ఇష్టమైన అమ్మతో ఎందుకలా ప్రవర్తించావు నాన్నా? నువ్వు  తర్వాత మారిపోయావు  ... మాకు పుట్టింట్లో మంచి జీవితం దొరికింది. కానీ అమ్మ తన యవ్వన కాలాన్ని గాయపడ్డ హృదయంతో గడిపింది కదా! ఇప్పుడు సునీల్ ఎలా ప్రవర్తించినా ఎప్పుడో, పదేళ్ళకో పదిహేనేళ్లకో మారతాడు. ఎందఱో అలా మారారు. గతం తలుచుకుని లాభమేముంది అని నేనూ అప్పటికి సర్దుకుపోతాను. 

    ఒకవేళ సర్దుకోలేక ఇప్పటి విషయాలు ప్రస్తావిస్తే, నన్ను కన్నవాళ్ళూ,  నేను కని  పెంచినవాళ్ళూ, రేపు అవసరమై కన్సల్ట్ చేయాల్సి వస్తే ఆ సైకియాట్రిస్టూ... అంతా అనక మానరు ...  బాధకలిగించే గతాన్నితలుచుకుని ఏం సాధిస్తావని ! అదంతా వదిలేసి ముందుకి సాగిపొమ్మని సలహా ఇస్తారు ! జీవితం విలువైనదనీ, గతాన్ని తవ్వుకుంటూ దుఃఖంలో గడపకూడదనీ మందలిస్తారు ! పదేళ్లో, పదిహేనేళ్లో పైకి చెప్పుకోలేని వేదన అనుభవించిన మనిషి, గతకాలపు సాలెగూడులో చిక్కుకుని, విలవిలలాడుతుంటే ఆత్మీయులే చిరాకు పడతారు . 

    మరి నేరానికి శిక్ష ఎరగని ఒక జాతి ఎలా మారుతుంది నాన్నా ? 

   నాన్నా, ఇది మామూలు ఉత్తరం అయితే ఇంత సమయం తీసుకుని రాసినా, కవర్లో పెట్టి, చిరునామా రాసి, పోస్ట్ చేసే లోపు నా మనసు మారిపోయేది. ఎందుకిలాంటి ఉత్తరం రాయడం అనిపించి చించి పారేసే అవకాశ లేకపోలేదు. ఇలా ఎందరో  ఇంతకు  ముందు రాసి ఉంటారు ... అవి ఏ  తండ్రికీ, అదే ఏ మగవాడికీ చేరక పోవడానికి కారణం అదే! కానీ ఇది ఈమెయిలు కదా!  నేనంత సేపు ఆగదలచుకోలేదు ! దీనికి నీ  దగ్గర జవాబు ఉండదని తెలిసి కూడా, నీ నించి  జవాబు కోరకుండానే, ఈ లేఖ మీది send బటన్ ని  ఇప్పుడే నొక్కేస్తున్నా ..  

                                                   ***
              ( మొదటి ప్రచురణ 'మాలిక ' జాల పత్రిక , జూలై 2014)


ప్రముఖుల స్పందన:

        చాలా బాగుంది కథ. హించని పద్ధతిలో సమస్యను ప్రవేశపెట్టారు. సాధారణంగా ప్రారంభించి అసాధారణంగా ముగించారు . సున్నితమైన మానవ సంబంధాల పట్ల మనుషులెంత బాధ్యతగా ఉండాలో చక్కగా చెప్పగలిగినందువల్ల ఇది మంచి కథ  అయింది. 
      - కాత్యాయని కేతవరపు
( ప్రముఖ విశ్లేషకురాలు , 'సాహిత్యాకాశం లో సగం' వంటి విమర్శనా గ్రంథాల రచయిత్రి , ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ )

12 comments:

 1. Heart Touching

  ReplyDelete
 2. కదిలించే కథ.. కొందరినైనా ఆలోచింపేజేస్తే.. ఇంకా బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. అందుకేగదండీ అను గారు, ఈ ప్రయత్నం! మీ స్పందనకు కృతజ్ఞతలు !

   Delete
 3. నాగలక్ష్మీ ,
  చక్కని లేఖా కథనం ..నాన్న కి ఒక ఈ మైల్ అంటూ మొదలు పెట్టి ,నాన్న వేలు పట్టుకుని నడుస్తున్న మమ్మలని హఠాత్తుగా భర్త లో తండ్రి కి పరిచయం చేసి ,భర్త అయినా ,తండ్రి అయినా ,ముందు మగవాడు ..అంతేనా ? అని ప్రశ్నించేలా చేసి , ఇంకా ఎన్నేళ్ళు ? ఆడవారు తమని తాము రక్షించుకుంటూ ,ఉనికి కోసం పోరాటాలు చేస్తూ ,అని నిట్టుర్చేలా చేసి ,మార్పు ఒక్కరిలో అయినా వస్తే బాగుండును ,ఈ కథ చదివి అని ఆశ పుట్టించేలా ఉంది మీ కథ ....మనసుని కదిలించింది ..
  వసంత లక్ష్మి

  ReplyDelete
  Replies
  1. మార్పు వస్తోంది వసంత గారు. కానీ రావాల్సిన దిశలో వస్తోందా, రావలసినంత వేగంగా వస్తోందా అనేవి మన ముందున్న ప్రశ్నలు ! ఈ లోపే ఆడపిల్లల నించి ఎగస్తున్న backlash ఎటు దారితీస్తుందో అని దిగులు ... Thank you for your response !

   Delete
 4. ఈ తరం తండ్రులు గత తరం తండ్రులు తప్పక చదవాల్సిన క(వ్య)థ! ఈ కథ చదివి కొందరైనా మారతారని ఆశిస్తూ

  ReplyDelete