(మార్చ్ ఎనిమిదవ తేదీ 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' సందర్భంగా ' నది ' మాస పత్రిక ప్రచురించిన ప్రత్యేక వ్యాసం. )
మహిళా దినోత్సవం -------------వారణాసి నాగలక్ష్మి
మహిళాదినోత్సవం జరుపుకోవడం
మొదలై నేటికి వంద సంవత్సరాలు దాటింది. అంతకు ముందు పురుషాధిక్య సమాజం లో అన్ని రంగాలలోనూ స్త్రీ వివక్షకి
గురవుతూనే ఉన్నా మహిళలంతా ఏకమై ఈ పరిస్థితి పట్ల తమ నిరసన
తెలియజేసిన సందర్భాలు చరిత్రలో చాలా తక్కువ. ఇంటి
నాలుగు గోడల మధ్య ఉన్నన్నాళ్ళూ ఎంతటి హింసనైనా
ప్రతిఘటించకుండా మౌనంగా భరించడమే వీరికి అలవాటు. కరువు
కాటకాలలో స్త్రీలు కూడా ఇల్లు దాటి బయటికి వచ్చి పనిచేయాల్సిన అవసరం ఏర్పడ్డపుడు
మాత్రమే మొదటి సారిగా వీరి ప్రతిఘటన చరిత్ర
కెక్కిందని చెప్పుకోవచ్చు.
పనిచేసే చోట ఉన్న దుర్భర పరిస్థితులూ, అమానుషమైన నిబంధనల
పట్లా , అతి తక్కువ వేతనాల పట్లా నిరసన
తెలియజేస్తూ న్యూయార్క్ లోని గార్మెంట్ వర్కర్స్(స్త్రీలు), 1857 మార్చి నెలలో చేసిన సమ్మె, తరువాతి కాలం లో అనేక
మార్పులు చెందింది. సరిగ్గా యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మార్చి నెలలో న్యూయార్క్
నగర వీధుల్లో పనివేళలు తగ్గించాలనీ, వేతనాలు పెంచాలనీ,
ఓటు హక్కునివ్వాలనీ , బాల కార్మికులని
నియమించరాదనీ కోరుతూ దాదాపు పదిహేను వందలమంది మహిళలు సమ్మె చేశారు. ఆర్ధిక
సుస్థిరతని, మెరుగైన జీవన ప్రమాణాలని సూచించే "బ్రెడ్ అండ్ రోజెస్" వీరి ఈ
సమ్మెలో నినాదమైంది. ఈ సమ్మెకు స్పందనగా అదే సంవత్సరంలో
సోషలిస్ట్ పార్టీ అఫ్ అమెరికా, ఫిబ్రవరి ఆఖరి ఆదివారాన్ని
జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1909 లో ఫిబ్రవరి 28 న మొదలుపెట్టి కొన్నేళ్ళ
పాటు ఫిబ్రవరి ఆఖరి ఆదివారాన్ని ‘మహిళా దినోత్సవం’ గా అమెరికా
అంతటా జరుపుకున్నారు.
ఆ తర్వాతి సంవత్సరం అంటే 1910 లో డెన్మార్క్ లోని కొపెన్హాగన్
లో మొదటి అంతర్జాతీయ మహిళా సమ్మేళనం జరిగింది . ఇందులో పదిహేడు
దేశాలు ప్రాతినిధ్యం వహించాయి. మొదటిసారిగా పార్లమెంట్ కి ఎన్నికైన మహిళలు
ముగ్గురు ఈ సమావేశానికి హాజరు కావడం విశేషం. అంతర్జాతీయంగా స్త్రీల హక్కులకోసం ,
సమానావకాశాల కోసం పోరు సలిపేందుకు కు ఈ
రోజుని కేటాయించడం జరిగింది. అలా 1911 నుంచి అంతర్జాతీయంగా
అనేక దేశాలు, స్త్రీల హక్కుల కోసం, అన్ని రంగాల లోనూ సమానావకాశాలు సాధించుకోవడం
కోసం, హింసని ప్రతిఘటించి, కుటుంబ శాంతిని, సమాజ
శ్రేయస్సును పరిరక్షించుకోవడం కోసం మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day ) గా జరుపుకుంటున్నాయి. వివిధ రంగాలలో విజేతలుగా, మార్గ దర్శకులుగా నిలచిన స్త్రీలని గుర్తించి ఈ
రోజు సత్కరించడం ఒక ఆనవాయితీ గా మారింది.
మహిళాదినోత్సవం !
మహిలో మహోత్సవం !
మహోదయం వైపుగా మహిళలదీ
ప్రస్ధానం !
సద్భావం, సహకారం, ప్రోత్సాహం,
ప్రోద్బలం, స్త్రీలంతా పరస్పరం అందిస్తే అదే జయం !
అసమానతనెదిరిస్తూ, స్త్రీ హింసను నిరసిస్తూ, ఆలోచన సాగరమై, ఆకాశంలో
సగమై
అతివలు
గళమెత్తిన శుభదినం
!
ఐక్యత ప్రకటించుటెంత సుందరం !
పురుషులిరువురు
మానసికబలం లో సరిసమానులే అయినా నైతిక బలం లో మాత్రం స్త్రీ పురుషునికన్నా ఎన్నో
రెట్లు శక్తి వంతురాలని గాంధీజీ అభిప్రాయం. సమాజం విలువలతో కూడినదై నైతికంగా
బలంగా ఉండాలంటే అందులో స్త్రీల పాత్ర గణనీయంగా ఉండాలి. ఏసమాజంలో స్త్రీలు చులకనగా చూడబడతారో , ఏ సమాజంలో వారి భద్రత ప్రశ్నార్ధక మవుతుందో అక్కడ శాంతి సౌభాగ్యాలు కరువవుతాయి. అందుకే గాంధీజీ స్త్రీ అర్ధరాత్రి నిర్భయంగా సంచరించ గలిగినపుడే నిజమైన
స్వాతంత్ర్యం వచ్చినట్టు భావిస్తానన్నారు. నేడు
పట్టపగలు కూడా అలా సంచరించలేని పరిస్థితి ఏర్పడింది !
స్త్రీ
పురుషులిద్దరికీ సమానావకాశాలు లభించడం వల్లా , స్త్రీ విద్య వల్లా స్త్రీలు మాత్రమే పురోగతి సాధిస్తారనుకుంటే అది సరికాదు. సెకండరీ స్కూలు విద్య పూర్తిచేసిన స్త్రీల సంఖ్యలో ఒక్క శాతం వృద్ధి , ఆ ప్రాంత ఆర్ధిక రంగంలో 0.3 శాతం ప్రగతికి
కారణమవుతోందని పరిశోధనలు తెలుపుతున్నాయి . పేద దేశాలు త్వరితగతిన అభివృద్ధి
చెందాలంటే ఆయా దేశాల్లోని ఆడపిల్లలు విద్యావంతులు కావడం అత్యంతావశ్యక మయినప్పటికీ
అలాంటి దేశాల్లో ఆడపిల్లలని బడికి పంపడానికి సంసిద్ధత తక్కువగానే కనిపిస్తోంది.
మగపిల్లల్ని బడికి పంపిస్తూ ఆడపిల్లలు ఇంటిపనిలోనూ, ఎడ పిల్లల ఆలనా పాలన లోనూ సహాయ
పడతారని వాళ్ళని ఇంట్లోనే ఉంచేసే తల్లి తండ్రులు కనిపిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలకి ఉచితవిద్య అందుబాటులోకి వచ్చి ముప్ఫై ఏళ్లు దాటినా అట్టడుగు
వర్గాల్లో ఇప్పటికీ అదే పరిస్థితి.
A
promise is a promise-To end violence against women” అంటూ మొదలైన కిందటి సంవత్సరపు మహిళా దినోత్సవ సంబరాలలో ఒక
అడ్వకేట్ మాట్లాడుతూ గృహ హింస దేశమంతటా సర్వ సాధారణ మై
పోయిందనీ, చాలా మంది తమ పక్కింట్లోనో ,
తెలిసిన చోటో గృహ హింస జరుగుతుంటే తమకు సంబందించిన వారు కాకపోవడంతో మౌనంగా
ఉండిపోతారనీ, గృహ హింసకి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఫిర్యాదు
చేయవచ్చనీ, వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదనీ వివరించారు. ఇరుగుపొరుగుల్లొ
గాని , బంధు మిత్రుల్లో గాని ఎవరైనా గృహ హింస బాధితులు
కనిపిస్తున్నా అనవసర గొడవల్లో ఇరుక్కోవడమెందుకనే
ఆలోచనతో చాలామంది మిన్నకుండి పోతారు. సమాజం లో కనిపించే లోపాల పట్ల
సమాజమంతా ఉమ్మడిగా బాధ్యత వహించినపుడు ఆ లోపాలని సరిదిద్దడం తేలికవుతుంది.
అనేక రంగాలలో ఈ వందేళ్ళలో స్త్రీలు చెప్పుకోదగ్గ ఎన్నో
మార్పులకి శ్రీకారం చుట్టారు . స్త్రీలు అడుగుపెట్టని రంగం, తమ ప్రత్యేకతని
చాటని రంగం లేదన్న పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద
కాలంలో విద్య, సాంకేతిక , ఆరోగ్య
రంగాలలో స్త్రీలు చెప్పుకోదగ్గ పురోగతి సాధించినా , చట్టాలూ,
రాజ్యాంగపరమైన హక్కులూ స్త్రీకి
అనుకూలంగా ఉన్నా కూడా సామాజిక భద్రత విషయంలో అన్ని వర్గాలలోనూ ఇంకా సాధించవలసింది
ఎంతో ఉండిపోయింది. మహిళ ఇంకా తన శరీరంపై తనకు హక్కు లేని విధంగా జీవిస్తూ ఉంది.
ఆత్యాచారాలూ, పుట్ట బోయే శిశువు ఆడపిల్ల అయితే భ్రూణ హత్యలూ , యాసిడ్ దాడులూ, వర కట్నమరణాలూ ఇలా రకరకాలుగా స్త్రీ మనుగడ ప్రశ్నార్ధక మైన పరిస్థితి. ప్రపంచ
వ్యాప్తంగా ఎన్నో దేశాలలో స్త్రీ పురుష నిష్పత్తి సరిసమానంగానో, స్త్రీ సంఖ్య కొంచెం ఎక్కువగానో ఉండగా మన దేశంలో మాత్రం స్త్రీల సంఖ్య
తగ్గి పోతూ వస్తోంది.
పురుషాధిక్య సమాజం కావడం వల్ల తలెత్తిన ఈ సమస్యకి పరిష్కారం, స్త్రీ పురుషుల సమతుల్యతని భగ్నం
చేయడం వల్ల తలెత్తే దారుణ పరిస్థితిని సమాజం అర్ధం చేసుకున్నపుడే
లభిస్తుంది. దేశం లోని కొన్ని
ప్రాంతాలలో విపరీతంగా తగ్గిపోయిన స్త్రీల సంఖ్య వల్ల ఒకే స్త్రీని పలువురు వివాహమాడే
స్థితి ఏర్పడింది. స్వచ్చంద సంస్థలెన్నో రాబోయే తరాలు ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితిని
దృష్టిలో ఉంచుకుని పరిష్కారదిశలో చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం మేల్కొని స్త్రీ
శిశు సంక్షేమ పధకాలెన్నొ చేపట్టింది. కొద్దికాలం క్రితం
కంటే ఇప్పుడిప్పుడే స్త్రీ పురుష నిష్పత్తి కొంత మెరుగవుతున్నా స్త్రీల పై
అత్యాచారాల విషయంలో మాత్రం పరిస్థితి అంతకంతకూ విషమిస్తూ వస్తోంది. దీనికి కారణం
సమాజంలో దిగజారుతున్న నైతికి విలువలూ, పెరిగిపోతున్న వస్తు వినిమయ సంస్కృతి. నిందితుల
విషయంలో అలసత్వ ధోరణి వల్ల, ఇంతవరకూ ఉన్న చట్టాలలో
లొసుగుల వల్ల, చట్టాల అమలులో జరిగే జాప్యం వల్ల ,
పరువు కోసం పాకులాడే మనస్తత్వాల వల్ల దోషులు తేలికగా తప్పించుకోగలుగు
తున్నారు.
భారతదేశంలో
చట్టం స్త్రీకి ఎంతో అనుకూలంగా రూపొందించబడింది. భారతీయ సంవిధానంలోని ప్రతి
అంశం మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంది. స్త్రీలపై జరుగుతున్న
అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన
దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు చేశారు. ఈ చట్టాలు సక్రమంగా అమలయినట్లయితే దేశంలో మహిళల పట్ల వివక్ష, అత్యాచారాలు ఈ సరికే
ముగిసిపోయేవి. పని చేసేచోట
స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలనీ, మహిళా ఉద్యోగుల
కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, స్నానాల గదులు
ఏర్పాటు చేయాలనీ, ఏ మహిళను కూడా దాస్యభావంతో
చూడకూడదనీ, బలాత్కారం నుంచి
బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉందనీ, వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం నేరమనీ, వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు
ఉంటాయనీ చట్టం చెపుతోంది. అయితే తమకనుకూలంగా
ఉన్న ఎన్నో అంశాల గురించిన ప్రాధమిక అవగాహన కూడా లేకుండా ఎందరో మహిళలు జీవిస్తుంటే
చట్టం తెలిసిన స్త్రీలు కూడా సమాజం ఆమోదించదేమో అనే భయంతో హింసను సహిస్తూ, మరెందరో
అదే హింసకు గురయ్యే పరిస్థితిని కల్పిస్తున్నారు. నిర్భయ ఘటన తర్వాత
సమాజపు ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చిందని చెప్పుకోవాలి . హింస వ్యక్తిగతమైనదైనా దాన్ని
సమాజమంతా కలిసి ఎదిరించాల్సిన ఆవశ్యకత ఉందని, అలా
ఎదిరించినపుడే కాలం చెల్లిన చట్టాల్లో మార్పు వస్తుందని
నిర్భయ ఉదంతం తెలియజేసింది .
నిర్భయ తర్వాత అత్యాచార నిర్మూలన కోసం ఏర్పడ్డ నిర్భయ చట్టం
, దోషులుగా నిరూపించబడ్డ వారికి 20 సంవత్సరాలకి తక్కువ
కాకుండా (అవసరమైతే జీవిత కాలమంతా అనుభవించేలా) జరిమానాతో సహా జైలు శిక్ష, విధించేలా, న్యాయ
విచారణ త్వరితగతిన ముగిసేలా ‘నిర్భయ ఆక్ట్’ అమలులోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల
రక్షణ కోసం 20 బిల్లియన్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అయినా అత్యాచారాల సంఖ్యలో తగ్గుదల కనిపించడం లేదు. నేషనల్ క్రైమ్
రికార్డ్స్ బ్యూరో అందించే లెక్కలు, గత అరవై
అయిదేళ్ళలో అత్యాచారాలు ఎనిమిది వందల రెట్లు పెరిగాయనీ , నేడు
ప్రతి 22 నిముషాలకీ ఒక అత్యాచారం జరుగుతోందనీ, ప్రతి 58 నిమిషాలకీ ఒక ఇంటి కోడలు వరకట్న
దురాచారానికి బలవుతోందనీ, ప్రతి 51 నిముషాలకీ ఒక స్త్రీ బహిరంగంగా వేధింపుకి గురవుతోందనీ తెలియ జేస్తున్నాయి. 2002
నుంచి 2010 లోపు జరిగిన 153 యాసిడ్ దాడి కేసుల్లో, ఎందరో బాధిత
మహిళలు తమ రూపు రేఖల్ని కోల్పోయారు. చావుకు మించిన హింసకు లోనయ్యారు. ఇలా యాసిడ్ దాడుల దారుణ కాండ సాగుతూనే వున్నా ఈ నాటికీ షాపుల్లో యాసిడ్
తేలిగ్గా, ఎంతో చవకగా
దొరుకుతూనే ఉంది!
ఈ నేరాలని అరికట్టాలంటే చట్టాలు చేస్తే సరిపోదు. దుర్ఘటనలు
జరగక ముందే అలాంటి అవకాశాలున్న ప్రాంతాలని గుర్తించడం, అక్కడ అవసరమైన భద్రతా
ఏర్పాట్లు చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అందుబాటులో మహిళా
లాయర్లు , వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవడం, పబ్లిక్ రవాణా వ్యవస్థని మరింత పకడ్బందీగా ఉండేలా ఏర్పాటు చెయ్యడం అవసరం. బాధితులకి సమర్ధులైన సైకాలజిస్టుల సేవలు
అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ హింసకి, రేప్ కి, ఆసిడ్ దాడికి గురైన అమ్మాయిలు చాలా కుంగుబాటుకి లోనౌతారు. కొంతమంది తమ వల్లే అలాంటి
పరిస్థితి వచ్చిందని నమ్ముతూ ‘గిల్ట్ ఫీలింగ్’కి లోనవుతారు. సరిగ్గా
మాట్లాడలేరు. కేవలం అలాంటి వాళ్ళని మాట్లాడించడానికే సైకాలజిస్ట్ లకి దాదాపు ఏడెనిమిది సిట్టింగ్స్ తీసుకోవలసి వస్తుంది. ఇంక వాళ్ళని మామూలు
స్థితికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం అవసరమౌతుందో ఊహించవచ్చు. ఇటువంటి బాధితుల విషయంలో సమాజ దృష్టి కోణంలో మార్పు
రావాలి. తమ తప్పేమీ లేకపోయినా సమాజం చిన్నచూపుకి గురవుతూ, శారీరక మానసిక
వేదన అనుభవించే పరిస్థితి వీరిది. స్త్రీ
బాధ్యతలూ, విధుల పట్ల సమాజంలో ఉన్న నమ్మకాలే ఈ పరిస్థితికి కారణం. సమాజమంతా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి వ్యక్తులు స్వస్థత
పొందడానికి ఇరుగు పొరుగులూ, బంధు మిత్రులూ సహకరించాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. పోలీస్ వ్యవస్థలోను, చట్టాల అమలు లోను
సానుకూలమైన మార్పు వచ్చినపుడే, సగటు పురుషుడి ఆలోచనా ధోరణిలో
మార్పు వచ్చినపుడే ఈ సమస్యకి సమాధానం లభిస్తుంది.
సమాజంలో సగభాగమైన మహిళల హక్కులకు సంబంధించి, వారు
గౌరవాదరాలతో జీవించే అవకాశాల గురించి జరిగే సభలలో సాధారణంగా అధిక భాగం స్త్రీలే ఉంటారు. అటువంటపుడు ఎవరిలో మార్పు రావలసిన అవసరం ఉందో
వాళ్ళు పాల్గొనని సభ వల్ల ఆశించిన మార్పు సాధ్యం కాదు. మగవాళ్ళు కూడా సమసంఖ్యలో పాల్గొన్నపుడే, తమతో సహజీవనం సాగించే మహిళల మనోభావాలు , అవసరాలు వారికి అర్ధమై,
ఆ సభ లక్ష్యం నెరవేరుతుంది. పురుషాధిక్య
సమాజంలో సరైన మార్పు రావాలంటే ఆ భావజాలానికి అలవాటు పడ్డ స్త్రీ పురుషులిరువురూ
మారాలి. అలా అని కేవలం స్త్రీలపై హింస తగ్గిపోవడంతోనే మంచి
మార్పు రాదు. ఆమె సరైన గౌరవం పొందుతూ జీవించగలగాలి. అందుకు దోహదం చేసే సమసమాజం మనం
నిర్మించుకోగలగాలి. పురుషుడు తన భార్యనో, కింది ఉద్యోగినో కించ పరుస్తూ తన
కుమార్తెకు మాత్రం సమాజంలోనూ, అత్తవారింటిలోనూ గౌరవాదరాలు లభించాలని ఆశించడం
అత్యాశే అవుతుంది.
రేపటి పౌరుల తయారీలో కుటుంబం పాత్ర కూడా చాలా ఉంది. పిల్లల్ని
పెంచేటపుడు, ఏది సాధించినా , సాధించకపోయినా మంచి పౌరులుగా
మాత్రం మిగలాలన్న ప్రాధమిక సూత్రాన్నివారికి నేర్పాలి. సమాజంలో సరైన మార్పు
రావాలంటే కుటుంబమే లక్ష్యంగా gender
sensitization జరగాలి. ఆడపిల్లలకి
రకరకాల స్పర్శల మధ్య తేడాని తెలియజెప్పాలి. ఇంట్లో, పనిచేసే
ప్రదేశాల్లో లైంగిక దాడి జరిగే సూచన కనబడితే వెంటనే ఎలా అప్రమత్తం కావాలో
చెప్పాలి. చేతికి ఏది దొరికితే దానితో తమని రక్షించుకుంటూ, నలుగురికీ
వినిపించేలా అరుస్తూ ప్రతిఘటించాలని ఆడపిల్లలకి నేర్పించాలి.
బాధలను మౌనంగా భరించకుండా
మహిళలు నిరసన గళం విప్పినపుడే మార్పు సాధ్యమవుతుందని అందరికీ తెలిసినా ఇంటి గుట్టు
బయట పెట్ట కూడదనో , వంశ ప్రతిష్ఠ కి భంగం వాటిల్లకూడదనో
, తల్లిదండ్రులు సమ్మతించరనో , ఇల్లు
దాటితే ఇంతమాత్రపు రక్షణ కూడా లభించదనో ...ఇలా బాధితుల
మనసులో గూడు కట్టుకున్న ఏదో ఒక నిశ్చితాభిప్రాయం ,
భయం వారిని మౌనంగా హింసని భరించేలా చేస్తోంది.
ఉత్తర ప్రదేశ్ లోని ‘గులాబీ దండు’ నుంచి స్ఫూర్తి పొందిన మన రాష్ట్రపు ‘సమతా దండు’
సభ్యులు వంగపూవు రంగు చీరలు ధరించి,
స్త్రీల పట్ల అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ ప్రత్యక్షమై న్యాయం కోసం
పోరాడతారు. సాటి మహిళల సమస్యలపై సమరభేరి మోగిస్తారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు
మండలంలోని పది గ్రామాల్లో వీరు సేవలందిస్తున్నారు. గృహహింస, బాల్య
వివాహాలు, కట్నం వేధింపులు, ఆస్తిహక్కు,
సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో వీరు మహిళలకు బాసటగా నిలుస్తున్నారు.
సమాజ సేవకు చదువు, హోదాతో పనిలేదని వీరు నిరూపిస్తూ మేధా
పాట్కర్ చేతుల మీదుగా నవీన అవార్డు కూడా పొందారు.
రాష్ట్రంలో ఎన్నో
సంస్థలున్నప్పటికీ గ్రామీణ మహిళల గురించి పనిచేసేవి చాలా తక్కువ. గ్రామీణ మహిళల సర్వతోముఖాభివృద్ధే
లక్ష్యంగా పనిచేసే మహిళా సమత, రాష్ట్ర విద్యాశాఖలో స్వతంత్ర
ప్రతిపత్తి గల ఒక సంస్థ. 12 జిల్లాల్లో 71
మండలాల్లో పని చేస్తున్న ఈ సంస్థ ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లోని మహిళల కోసం
పనిచేస్తుంది. గ్రామీణ మహిళల జీవితాలు అనామకంగా ముగిసిపోకుండా వారి అభివృద్ధి
గురించి, వారిని స్వశక్తివంతుల్ని చేయడం కోసం పనిచేస్తోంది. వారిని పంచాయితీ ఎన్నికల్లో
పోటీ చేయించి, 1,874 మంది స్త్రీలను వివిధ
పదవులకు ఎన్నికయ్యేలా పాటుపడటం మహిళా సమత సాధించిన అత్యుత్తమ విజయాలలో
ఒకటి. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా అలాంటి సంస్థలో భాగమై, తనే సంస్థగా, సంస్థే
తనుగా, అహర్నిశలు సంస్థ గురించే ఆలోచిస్తూ ముందుకు సాగుతున్న పోలవరపు ప్రశాంతి
,
సమస్యల్లో ఉన్న స్త్రీలకి అండగా నిలిచి, హెల్ప్
లైన్ నడుపుతూ ‘ భూమిక ‘ స్త్రీ వాద పత్రికను
తీర్చిదిద్దుతున్న కొండవీటి సత్యవతి వంటి వారు ప్రభుత్వ సంస్ధలను మించి
స్త్రీల అభివృధ్ధికోసం, సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు.
నిర్బయ తర్వాత లైంగిక అత్యాచారాలు ఇంకా పెరిగాయని కొందరి
అభిప్రాయం. ప్రతిరోజూ వార్తా పత్రికల్లో కనిపిస్తున్న అత్యాచార ఘటనలు ఆ
అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. జీవన సరళిలో మార్పుల వల్ల నైతిక విలువలు పడిపోవడం,
పిల్లల ఎదుగుదల లో ముఖ్య పాత్ర వహించే తల్లి కూడా సంపాదన కోసం ఉద్యోగానికి
వెళ్ళాల్సి రావడం, కనీసావసరాల విషయంలో సగటు మనిషి దృష్టికోణం మారి, ధనసంపాదనే పరమావధిగా
పనిచేస్తూ, పిల్లల పెంపకం పట్ల శ్రద్ధ వహించలేకపోవడం, అత్యంత శక్తివంతమైన ప్రచార
సాధనమైన సినిమా, టీవీ లలో స్త్రీలపై నేరాలను ఆసక్తి
కరంగా, స్త్రీ శరీరాన్ని కన్స్యూమర్ ఐటం లాగా చూపించడం....
ఇలా దేనివల్ల నైతేనేమి అత్యాచారాల సంఖ్య పెరుగుతూనే
ఉంది. ప్రభుత్వం సదుద్దేశ్యంతో స్త్రీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా
అది సామాన్య ప్రజ వరకు వచ్చేసరికి మధ్యలో పనిచేసే ఎందరో వ్యక్తుల వల్ల, వారి చిత్తశుద్ధి లోపం వల్ల, ఆశించిన సత్ఫలితాలు
లభించడం లేదు .
అయితే వాటిని పరువు పోతుందని భావిస్తూ మౌనంగా
భరించే స్థితి నించి, ప్రతిఘటించి , ధైర్యంగా
రిపోర్ట్ చేసే స్థితి వచ్చింది. ఎంతో కాలంగా తమ పట్ల
హింస జరిగితే పెదవి విప్పి చెప్పలేక నిశ్శబ్దంగా తమలో తామే కుమిలిపోయిన స్త్రీలు
ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి రిపోర్ట్ చేస్తున్నారు.
బాధితులకి
సమాజం నించి సపోర్ట్ లభించి, నిందితులకి కఠిన మైన శిక్షలు, సకాలంలో పడితే ఇలాంటి అత్యాచారాలూ, హింసలూ తగ్గుముఖం పడతాయనడంలో సందేహంలేదు. ఈ
మార్చ్ ఎనిమిదవ తేదీన మనమంతా జరుపుకోబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకృతిలో
సంఖ్య లోనూ, సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి ఆవశ్యకమైన
మార్పు త్వరలో వస్తుందని ఆశిస్తూ మనవంతు ప్రయత్నం సాగించేందుకు సన్నద్ధులమౌదాం .
*********************
మహిళాదినోత్సవం గురించి మీరు రాసిన వ్యాసం చాలా బావుందండి. చాలావివవరణాత్మకంగా రాసారు. అభినందనలు.
ReplyDeleteకృతజ్ఞతలు భారతి గారు!
ReplyDelete