ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలలో మన తాజ్ మహల్‌కు మూడో స్థానం దక్కింది ! ట్రావెలర్స్ ఛాయిస్ అట్రాక్షన్ అవార్డ్స్ 2013లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది సందర్శకులు ప్రపంచంలోని ఇరవై ఐదు అత్యుత్తమ ఆకర్షణీయ ప్రదేశాలకు ఓటు వేశారు. ట్రిప్ అడ్వైజర్స్ అనే అంతర్జాతీయ పర్యాటక వెబ్ సైటు ప్రపంచంలోని అత్యుత్తమ ఆకర్షణీయ ప్రదేశాలలో తాజ్ మహల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించింది. మొదటి స్థానంలో పెరులోని మచ్చుపిచ్చు, రెండో స్థానంలో కాంబోడియా లోని ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం, మూడో స్థానంలో తాజ్ మహల్, నాలుగో స్థానంలో జోర్డాన్‌లోని పెట్రా వరల్డ్ హెరిటేజ్ సైట్, ఐదో స్థానంలో కంబోడియాలోని బయోన్ గుడి నిలిచాయి. తాజ్ మహల్ 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా కూడా గుర్తింపు పొందింది. ఇటీవలే జరిగిన ఎన్నికలో వంద మిలియన్ల ఓట్లతో మన తాజ్ మహల్ ఆధునిక ప్రపంచ అద్భుతాలు ఏడింటిలోకి చేరిపోయింది.
యమునా నదీ తీరాన, మొఘల్ ఉద్యాన వనంలో విహరించ వచ్చి, అక్కడే ఆగిపోయిన జాబిలి తాజ్ మహల్ ! వెన్నెల సున్నితమైన అల్లికగా మారి ఒక అందమైన సౌధంగా రూపొందితే అది తాజ్ మహల్ ! మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడిన తాజ్ మహల్, పర్షియన్, హిందూ మరియు ఇస్లామ్ నిర్మాణ శైలుల అందమైన కలయిక . ముంతాజ్ మహల్ మరణం తర్వాత ఆమె జ్ఞాపకార్థం ఒక కట్టడాన్ని నదీతీరాన నిర్మించాలన్న తలంపుతో షాజహాన్ చక్రవర్తి, ఆగ్రా దగ్గర యమునా నదీ తీరాన అందుకు అనువయిన ప్రదేశాన్ని గుర్తించి, ముంతాజ్ సమాధి నిమిత్తం అక్కడున్న ఒక మహాద్భుత సౌధాన్ని మహరాజా జయసింగు నించి స్వాధీనం చేసుకున్నట్టు షాజహాన్ రాయించిన “బాద్ షా నామా” గ్రంథం లో ప్రస్తావించబడింది. ‘తేజో మహాలయ’ అనే ప్రాచీన శివాలయాన్నాక్రమించి , షాజహాన్ తన భార్య సమాధి కోసం మార్పులు చేయించాడని చెపుతూ, ‘Taj Mahal :The true story’ అనే గ్రంథంలో ప్రొఫఫసర.పి.ఎన్.ఓక్ ,తన వాదన ను బలపరుస్తూ అనేక దృష్టాంతాలను ఉదహరించాడు.
షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలోమొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి పధ్నాలుగో సంతానం గౌహరాబేగంకు జన్మనిస్తూ మరణించింది. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ , షాజహాన్‌ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తనకోసం నిర్మించమని కోరింది. విషాదంలో మునిగిపోయిన షాజహాన్ ఒక సంవత్సరం తరువాత, భార్య కోరిక ప్రకారం 1632వ సంవత్సరంలో తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్ మహల్‌కు ఒక ప్రేరణ అని చరిత్ర చెబుతుంది . అజరామరమైన ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ అద్భుత నిర్మాణం తాజ్ మహల్‌ను చూడాలని ప్రపంచం నలు మూలల నుండి రోజూ వేలమంది సందర్శకులు వస్తారు.
అయితే చరిత్ర కేవలం రాజుల విలాసాలకూ, సాహసాలకూ, రాణుల ప్రేమ పురాణాలకూ మాత్రమే పరిమితమై సామాన్యుల జీవనాన్ని ప్రతిబింబించకపోవడాన్ని నిరసిస్తూ
నైలునది నాగరికతలో సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు ?
అన్న శ్రీ శ్రీ కవిత కు సమాధానం కాకపోయినా దాదాపు ఇరవయి వేల మంది శ్రామికులు దాదాపు 17 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ అద్భుత కట్టడం మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చుతో పూర్తి అయింది. ప్రధాన కట్టడం యొక్క నిర్మాణం 1632 వ సంవత్సరంలో మొదలై 1648 నాటికి పూర్తయింది. తర్వాత చుట్టు ప్రక్కల భవనాలూ , ఉద్యానవనమూ మరో ఐదు సంవత్సరాలకు, అంటే 1653 నాటికి ముగిశాయి. వేల మంది శిల్పులు,హస్త కళా నిపుణులు ఈ నిర్మాణం కోసం పని చేశారు. తాజ్ మహల్ నిర్మాణం, అబ్దుల్-కరీం మాముర్ ఖాన్, మక్రమత్ ఖాన్ , ఉస్తాద్ అహ్మద్ లాహూరి మొదలైన శిల్పుల పర్యవేక్షణలో జరిగింది. బుఖారా నుండి శిల్పులు, సిరియా మరియు పర్షియా నుండి నగీషీ వ్రాత నిపుణులు , దక్షిణ భారత దేశం నుండి చెక్కుడు పనివారు,బలూచిస్తాన్ నుండి రాతిని కోసేవారు, ఒక డోమ్ తయారీ నిపుణుడు, ఒక పాలరాతి పుష్పాలు చెక్కే హస్తకళా కోవిదుడు, ఇంకా ముప్పై-ఏడు మంది సృజనాత్మక కళాకారుల బృందం వీరిలో ఉన్నారు.
తాజ్ మహల్ నిర్మాణం పూర్తి అయిన తరువాత కొద్ది కాలానికే అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్‌ను సామ్రాజ్యాధికారాన్నించి తొలగించి ఆగ్రాకోటకు దగ్గరలో గృహ నిర్భంధం చేసాడు. ఆగ్రా కోట వద్ద తాజ్ మహల్ ను చూస్తూ షాజహాన్ తన శేష జీవితాన్ని గడిపాడు. షాజహాన్ మరణించాక అతన్ని భార్యసమాధి పక్కనే పూడ్చి పెట్టారు.
“శరీరం శిధిలమై చరిత్రలో భాగమైపోతుంది
ప్రేమ సజీవమై పాలరాతి గుండెలో ఒదిగి పోతుంది
అడుగడుగునా ప్రేమ శిల్పచాతుర్యంతో నిండి
తన ఒడిలో చేరమంటూ పిలుస్తుంది "
మరణించి శిధిలమైపోయిన వ్యక్తులమధ్య ఒకప్పుడు పెనవేసుకున్న ప్రేమానుబంధం , వారితోటే నశించి పోకుండా, పాలరాతి గుండెలో సజీవమై ఎప్పటికీ నిలిచిపోవడం, కవయిత్రి రేణుకా అయోల కవితలో హృద్యంగా వర్ణించబడింది.
దేశం లోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటైన తాజ్ మహల్ని చూడడం కోసం ప్రతి ఏటా సుమారు 20-40 లక్షల మంది పర్యటిస్తారని గణాంకాలు తెలుపుతున్నాయి. అందులో పదో వంతుండే విదేశీ సందర్శకులు చలి కాలంలో ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ మాసాలలో అధికంగా పర్యటిస్తారు. ఉత్తర భారతదేశ పర్యటన కోసం వెళ్ళి తాజ్‌ను చూడని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
తొలినాటి మొఘల్ భవనాలు ప్రధానంగా ఎరుపు ఇసుకరాయితో నిర్మించబడుతుండగా,రత్నాలు పొదిగిన తెల్ల పాలరాయి వాడకాన్ని ప్రోత్సహించాడు షాజహాన్ .
భారత దేశంలో అన్ని ప్రాంతాల నుంచి, ఇంకా ఆసియా లోని అనేక ప్రాంతాలనుంచి తెచ్చిన సామానుని తాజ్ మహల్ నిర్మాణంలో వినియోగించారు, రాజస్థాన్ నుండి స్వచ్చమైన తెల్ల పాల రాయి,పంజాబ్ నుంచి, చైనా నుంచి పచ్చలు , స్ఫటికాలు తీసుకువచ్చారు. టిబెట్ నుండి మణులు, ఆఫ్ఘనిస్తాన్నుండి వైఢూర్యాలు, శ్రీలంక నుండి నీలాలు , అరేబియా నుంచి ఎరుపురాయి తీసుకువచ్చారు. తెల్ల పాల రాయిలో పొదగేందుకు ఇరవై ఎనిమిది రకాల రత్నాలను ఏర్చి కూర్చారు. పాలరాతి చలువరాయిని రాజస్థాన్ నుండి, సూర్యకాంతి లేదా పచ్చ రాయిని పంజాబ్ నుండి తెప్పించారు. సామగ్రిని నిర్మాణ స్థలానికి చేర్చడానికి పదిహేను కిలోమీటర్ల పొడవయిన రహదారిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. వెయ్యికి పైగా ఏనుగులు సామగ్రిని రవాణా చేసాయి.
విశాలమైన తెల్లని పాలరాయి తో చతురస్రం గా ఉన్న పునాది మీద నిర్మించబడిన తాజ్ మహల్ అనేక ఇతర మొఘల్ సమాధులలాగే ప్రాథమిక అంశాలలో పర్షియా మూలాలు కలిగి ఉంది.
హిందూ, పర్షియన్ మరియు మొఘల్ కళా నిర్మాణాల కలయిక అయిన ఈ కట్టడానికి పొడవు వెడల్పులు సమానంగా ఉండటం ప్రత్యేకత. తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురం దీనిలో ప్రముఖ భాగం. కట్టడపు రూపకల్పన అన్ని వైపులా సంపూర్ణంగా సమవిభక్తంగా ఉంటుంది. సమాధికి నాలుగు మూలలా నాలుగు మినార్ లు చట్రంగా ఉన్నాయి. సమాధి ఎగువన ఉన్న పాలరాయి గోపురం ఈ నిర్మాణం లోకెల్లా అతిముఖ్యమైన ఆకృతి. దీని పైభాగం తామరపుష్పం ఆకారంలో ఉంటుంది. ఈ లక్షణం సంప్రదాయ పర్షియన్ మరియు హిందూ అంశాల చక్కని సమన్వయాన్నిసూచిస్తుంది. బాల్కనీ కిటికీలలోని పాలరాతి జాలీల ద్వారా , పై కప్పుల ద్వారా లోపలకి ప్రవేశించే వెలుగుల్లో, గది గోడలపైని కళావిన్యాసం కనులకు విందు చేస్తుంది. సంక్లిష్టమైన , రత్న ఖచితమైన నగిషీలలో ద్రాక్ష తీగలు, ఫలాలు , పుష్పాలు కట్టడమంతటా కనిపిస్తాయి. విలువైన రత్నాలు తాపడం చేసిన పేటిక మీద ముంతాజ్‌ని కీర్తిస్తున్న శాసనాలున్నాయి. ఆకుపచ్చని పచ్చిక తివాచీలూ, ఎరుపురంగు కాలిబాటలూ, నేపథ్యంలో అనుక్షణం వన్నెలు మార్చే నీలాకాశం...... విభ్రాంతి గొలిపే ఈ అందాల నిర్మాణానికి మరింత అలౌకిక సౌందర్యాన్ని సమకూరుస్తున్నాయి.
భారత విప్లవ కాలంలో బ్రిటిష్ సైనికులు , ప్రభుత్వ అధికారులు తాజ్ మహల్ గోడల నుండి రత్నాలను, వైఢూర్యాలను పెరికి వేశారు. 19 వ శతాబ్ధం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలకు మరమ్మత్తులు అవసరం అయ్యాయి. అప్పుడు బ్రిటిష్ వైస్రాయి లార్డ్ కర్జన్ ఒక మహా పునర్నిర్మాణ పధకాన్ని తాజ్ మహల్ కోసం ఆదేశించాడు,అది 1908 సంవత్సరానికి పూర్తి అయ్యింది . సాధారణ మొఘల్ చార్‌బాగ్‌లలో దీర్ఘచతురస్రాకారపు వనం, మధ్యలో సమాధి ఉంటుంది. తాజ్ మహల్ ఉద్యానవనం లో మాత్రం సమాధి ఉద్యానవనం చివరిలో ఉంది. మొదట్లో ఇక్కడ విస్తారమైన గులాబీలు,మెట్టతామర పువ్వులు , ఫలవృక్షాలు, కూరగాయల తోటలు ఉండేవనీ , ఆంగ్లేయుల పరిపాలనలో తాజ్ మహల్ నిర్వహణను బ్రిటిషు ప్రభుత్వం చేపట్టినప్పుడు, ఆంగ్లేయులకలవాటైన తీరులో పచ్చిక తివాచీలను పెంచి,ఈ ఉద్యానవనపు రూపంలో కొంత మార్పు చేశారనీ తెలుస్తోంది.
మామూలు రోజుల్లో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సందర్శకులకు ప్రవేశం ఉండే ఈ ప్రదేశాన్ని శుక్ర వారం నాడు మూసివేస్తారు. మసీదులో ప్రార్ధనలకు మాత్రం మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు అనుమతి ఉంటుంది. శుక్రవారాలు మరియు రంజాన్ మాసంలో మినహా మిగతా అన్ని మాసాల్లోనూ పౌర్ణమికి రెండు రోజుల ముందు నుంచి రెండు రోజులు తరువాత వరకు కట్టడాన్ని రాత్రిపూట వీక్షించేందుకు అనుమతి లభిస్తుంది.
వెన్నెలలా కాంతులీనే తాజ్ మహల్ , యమునా నది లో చేరుతున్న వ్యర్ధాలవల్లా, మథురనూనె శుద్ధి కర్మాగారం వల్ల వచ్చే ఆమ్లవర్షాల వల్లా పసుపు రంగులోకి మారడం గమనించి , కాలుష్యాన్ని అదుపులో పెట్టడానికి భారత ప్రభుత్వపు పురావస్తు శాఖ, కొన్నిచట్టాలు చేసి, చర్యలు చేపట్టింది. తాజ్ మహల్ చుట్టూ పదివేల నాలుగు వందల చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని గిరిగీసి , తాజ్ ట్రెపీజియం జోన్ ( TTZ ) గా ప్రకటించింది. ఈ జోన్ లో 40 రక్షిత కట్టడాలున్నాయి.వాటిలో తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ, ఈ మూడు నిర్మాణాలూ ప్రపంచ వారసత్వ సంపదలుగా ఎన్నికైనవి కూడా. 1996 లో సుప్రీమ్ కోర్టు ఈ జోన్ లోని కర్మాగారాల్లో బొగ్గు వాడకాన్ని నిషేధించారు. సహజ వాయువుని మాత్రమే ఇక్కడ వినియోగించేందుకు అనుమతి ఉంది. అలా వీలుకాని పరిశ్రమలను ఈ తాజ్ ట్రెపీజియం జోన్ ( TTZ ) వెలుపలకి తరలించారు. ఇక్కడి వాతావరణం లోని గాలి స్వచ్ఛతని గమనించి నమోదు చేసే పరికరాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్యాన్ని నివారించడం కోసం, కట్టడం దగ్గరలో వాహన సంచారాన్ని నిలిపి వేశారు. పర్యాటకులు వాహనాలు నిలిపే స్థలం నుండి నడిచిగాని, లేదా విద్యుత్ బస్సులో గాని తాజ్ మహల్‌ను చేరుకోవలసి ఉంటుంది.
పర్యాటక రంగం ఎప్పుడూ ఆయా దేశాల్లో ఉన్న అపురూపమైన, చారిత్రక ప్రాధాన్యం ఉన్నప్రదేశాలని బట్టే సందర్శకులని ఆకర్షిస్తుంది. ఎప్పుడూ ఎడతెగక పారే సెలయేరు గురించి లార్డ్ టెన్నిసన్ చెప్పినట్టు
‘మనుషులు ఈ లోకంలోకి వస్తారు పోతారు’
కానీ ఎప్పటికీ నిలిచిపోయే కళాత్మకరూపం తాజ్ మహల్ ! వెన్నెలలో వెండిలా, ప్రభాత వేళ గులాబి రంగులో, సంధ్యా సమయాన కెంజాయలో మెరిసిపోయే తాజ్ మహల్ ప్రాంగణంలో బందీగా, ఆగ్రా కోట నుండి యమునా తటి వరకు పచార్లు చేస్తూ, ప్రియ సతి ముంతాజ్ సమాధి పైనే దృష్టి నిలుపుతూ తన ఆఖరి ఊపిరి వదిలాడు షాజహాన్ చక్రవర్తి.
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధములో నిదురించు జహాపనా !
పండు వెన్నెల్లో వెండ కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో నిదురించు జహాపనా
నీ జీవిత జ్యోతి, నీ మధుర స్మృతి .....ముంతాజ్ సతి సమీపాన నిదురించు జహాపనా !
తెలుగు చలన చిత్ర రంగంలో మొట్ట మొదటి గాయకుడు శ్రీ ఎమ్మెస్ రామారావు ‘ నీరాజనం ’ అనే సినిమా లో ఈ పాట పాడారు. ఈ పాట వింటుంటే కలిగే విషాద మాధురి , తాజ్ మహల్ ని దర్శించి ఆ సౌందర్యం వెనుకనున్న చరిత్రని తలచుకుంటే పదింతలై మనసంతా అలముకుంటుంది. మూడున్నర శతాబ్దాలుగా కొన్ని కోట్లమంది పర్యాటకులని అలరించిన పాలరాతి ప్రేమ మందిరం, పోతపోసిన వెన్నెల గోపురం, తాజ్ మహల్ ప్రపంచ పర్యాటకుల దృష్టిలో తృతీయ స్థానాన్ని పొందడం మన వారి కళాత్మకతకు , నిర్మాణ కౌశలానికి , శిల్ప నైపుణ్యానికీ అందిన పురస్కారమనడంలో సందేహం లేదు.

****
No comments:
Post a Comment