April 12, 2013

తుల్జా భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు


   
                                                                         
          భూమిక అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. మార్చి పన్నెండున ఉదయం పది గంటలనుండి సాయంత్రం అయిదు గంటలదాకా భూమిక సభ్యులంతా ఆక్స్ ఫాం ఇండియా ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సంస్థలతో కలిసి జరుపుకోబోయే ఉత్సవానికి ముందుగానే ఆహ్వానాలందడంతో సరిగా పది అయ్యేసరికి నేనూ మరొక రచయిత్రి శ్రీమతి సుజల గారూ కాచిగూడాలోని తుల్జా భవన్ కి చేరుకున్నాం. పూల సజ్జలోంచి కొండ మల్లెలు విచ్చుకుంటున్నట్టు ఎదురుగా నవ్వులు పంచుతూ సత్యవతి. మేము లోపలికి అడుగు పెట్టీ పెట్టక ముందే ఎదురొచ్చి ఆప్యాయంగా హత్తుకుంది.కలుసుకుని చాలా రోజులైందేమో ఇద్దరం  మైత్రీ బంధంలో ఒక్క క్షణం పరిసరాలు మరిచాం.తేరుకునేసరికి చేతిలో కెమేరా క్లిక్ చేస్తూ సుజాతా మూర్తి గారు.
తుల్జా భవన్ ప్రాంగణమంతా షామియానాలకింద తెల్లని వస్త్రంతో అందంగా అలంకరిచబడి ఉంది.వేదిక ధవళ కాంతులతో అతిధులకోసం ఎదురుచూస్తోంది.అటూ ఇటూ వరసగా కర్రలు పాతి ,తెలుపు రంగు వస్త్రాలు చుట్టి సిద్ధం చేసిన స్టాల్స్. అన్నీ మహిళలకి సంబంధించిన సమస్యలూ,వాటిని ఎదుర్కొనే విధానాలూ, వారికి తోడ్పడే చట్టాలూ...వీటి గురించి తెలియజేసే చిత్రాలతో నిండి కనిపించాయి.ఒక వైపు ఎండిన ఆకులూ ,పూరేకులతో ముక్తవరం వసంత లక్ష్మి గారు తయారు చేసిన అందమైన కళాఖండాలు ప్రదర్శనకు తయారవుతున్నాయి.రెండొ వైపు ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన మహిళలు తయారుచేసిన అందమైన ఎంబ్రాయిడరీ చీరలూ ,వస్త్రాలూ. APMSS, అస్మిత ,ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ ,SAFA India,షాహీన్,REDS, SWARD సంస్థలు , రోడా మిస్త్రీ కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్ధులు  స్టాల్స్ ఏర్పాటు చేశారు.
శ్రీవిద్యా స్పెషల్ స్కూల్ విద్యార్ధులు  ఉప్పొంగే ఉత్సాహంతొ ఒకవైపు కుర్చీల్లో సర్దుకుంటుంటే రెండో వైపు రెయిన్ బో హోంస్ విద్యార్ధులు హరివిల్లులై విస్తరించారు. ఎదురు చూస్తున్న అతిధులంతా వచ్చేసరికి మరో గంట పట్టింది.
ముందుగా శ్రీవిద్యా స్పెషల్ స్కూల్ విద్యార్ధులు  కొన్ని పాటలకి నాట్యం చేసారు.వారెన్నుకున్న కళాప్రదర్శనలో వాళ్ళు చూపించిన నిమగ్నత ముచ్చట గొలిపింది.వాళ్ళకి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయినులు అక్కడే నిలబడి స్వంత తల్లుల్లాగా ఆతుర పడడం చూస్తే తల్లిదండ్రుల పక్కనే గురువుకి దైవసమానమైన  స్థానం ఎందుకిచ్చారో అర్ధమైనట్టనిపించింది!
సత్యవతి అప్పటిదాకా చేస్తున్న తన పర్యవేక్షణ ముగించి , చురుగ్గా సభ ప్రారంభించింది. ఆహూతులంతా వేదిక నలంకరించగానే అందర్నీ పరిచయం చేసింది .
ఎదురుగా కూర్చుని ఉన్న చిన్నారుల్ని ఉద్దేశ్యించి ఈరోజు ప్రత్యేకత ఏమిటని అడిగింది నవ్వుతూ.
వాళ్ళు కోలాహలంగా మహిళాదినోత్సవం అన్నారు.
ఇది ఉత్సవమేనా ? “అని సత్యవతి ప్రశ్నించగానే ఏమాత్రం తడబాటు లేకుండా అవునని వాళ్ళు జవాబిచ్చారు.
ఎందుకు చేసుకుంటున్నాం ఈ పండగ ?మనం ఏమన్నా సాధించమా ?” అనడిగింది.
అవును సాధించాం అని ముక్త కంఠం తో పిల్లలంతా సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఏం సాధించాం ? “అని సత్య అడగ్గానే మన హక్కులు అన్నారు వాళ్ళు.
మన హక్కులు కొన్ని సాధించాం.. ఇంకా కొన్ని సాధించాలి కదా ? “అంటే అవునన్నారు.
ముఖ్యంగా ఏం సాధించాల్సి ఉంది?’ అంటే స్త్రీలకు భద్రత అని కొంచెం పెద్ద పిల్లలు చెప్పారు.
నిర్భయకి ముందూ తరవాతా దేశ యువతలో వచ్చిన మార్పుని ప్రస్తావించి ఈనాటి ఉత్సవం అంతా ఒక ఫ్రేం లో బిగించినట్టు కాకుండా కలిసి మాట్లాడుకుంటూ సరదాగా చేసుకుందామని సూచించింది సత్య. ముందుగా ఆక్స్ఫాం  ప్రోగ్రాం ఆఫీసర్ రంజన గారిని మాట్లాడమని కోరింది.రంజన నేటి స్త్రీలూ, పిల్లలూ ఎదుర్కొంటున్న సమస్యల్ని గురించి కొద్ది సేపు మాట్లాడి మనమంతా వాటినెలా ఎదుర్కోవచ్చో వివరించి,మనమంతా తలుచుకుంటే ఈ ప్రపంచాన్ని ఎంతో అందంగా చేయగలమని చెపుతూ ముగించారు.
తర్వాత SWARD ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్ధాయిలో మహిళ లంతా కలిసి మహిళా దినోత్సవం మొదటిసారి జరుపుకుని వంద సంవత్సరాలు దాటిందనీ, మన గ్రామాల్లో ఈ ఉత్సవం  జరుపుకోవడం మొదలైనది ఎనభయ్యవ దశకం నుంచని చెప్పారు.మహిళలకి ఓటుహక్కు , వేతనాల్లో సమానత్వపు హక్కు  ఇలా ఎన్నో సాధించినా ఇంకా ఆడవాళ్ల హక్కుల్ని కాలరాస్తూ హింస జరుగుతూనే ఉంది.మహిళకి. ఇంకా తన శరీరంపై తనకు హక్కు లేని విధంగా జీవిస్తూ ఉంది.రేప్ అంటే అదే కదా!’అన్నారు. గృహ హింసకి,రేప్ కి గురైన అమ్మాయిలు చాలా కుంగుబాటుకి లోనౌతారు.సరిగ్గా మాట్లాడలేరు.కేవలం అలాంటి వాళ్ళని మాట్లాడించడానికే దాదాపు ఏడెనిమిది సిట్టింగ్స్ తీసుకోవలసి వస్తుంది.ఇంక వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంత ప్రయత్నం అవసరమౌతుందో ఊహించవచ్చు అన్నారు.
తర్వాత ప్రముఖ నటి జమున గారమ్మాయి, చిత్రకారిణి స్రవంతి జూలూరి మాట్లాడారు.వంద సంవత్సరాలుగా అవనిలో సగం,ఆకాశంలో సగం అంటూ స్త్రీలు ఉద్యమిస్తున్నా female feticide, domestic violence, rape వంటి నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయే గాని తగ్గుముఖం పట్టకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. మహిళలు మౌనంగా హింసని భరించినన్నాళ్ళూ , ప్రతిఘటించకుండా పరువు కోసం పాకులాడినంతకాలమూ ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఒక గృహ హింస బాధితురాలిగా ,హింసని ప్రతిఘటించి బయటికి వచ్చిన స్త్రీగా తోటి స్త్రీలు తమపై,తమ తోటి వారిపై జరుగుతున్న హింసను వ్యతిరేకించాలనిజాగో స్త్రీఅనే శీర్షికతో చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేశాను.నా రక్షణ కోసం కరాటే నేర్చుకున్నాను.ఎన్నో సంవత్సరాలుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నానుఅన్నారు.
చాలా సందర్భాలలో గృహ హింసకి లోనై బయట పడిన స్త్రీ తనని తాను నిందించుకుంటుంది.తనవల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని నమ్ముతూ గిల్ట్ ఫీలింగ్కి లోనవుతుంది.అది సరికాదు.నిర్భయ సంఘటన తర్వాత సమాజపు ఆలోచనల్లో పెద్ద మార్పు వచ్చింది.హింసని సమాజం కూడా ఎదిరించాల్సిన ఆవశ్యకత ఉందని, అప్పుడే కాలం చెల్లిన చట్టాల్లో మార్పు వస్తుందని నిర్భయ ఉదంతం తెలియజేసిందన్నారు.ఒకవైపు చట్టం హక్కులకోసం పోరాడమంటుంది. మరోవైపు బాధితులనే పీడిస్తుంది.కేరళలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయి తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసినపుడు ఆమెపైనే కేసు రిజిస్టర్ అయింది.ఇలాంటపుడు చట్టం ఎవరి వైపుందా అని అనుమానం వస్తుందన్నారు. ఎప్పుడైతే మౌనం వీడి మనం మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతామో, సహించడం మాని ఎదిరించడం నేర్చుకుంటామో అప్పుడే సమాజంలో మంచి మార్పుసాధ్యమౌతుందని చెపుతూ తన ప్రసంగాన్నిముగించారు.
శ్రీవిద్య ప్రత్యేక పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతి వెంకట్ గారు మాట్లాడుతూ అన్నిరకాల వైకల్యాల కన్నా మానసిక వైకల్యం ఎంతో బాధాకరమని,అలాంటి వైకల్యానికి లోనైన పిల్లల్ని జనజీవన స్రవంతిలోకి తీసుకు రావడం చాలా కష్టమనీ చెప్పి ,వాళ్ళని తమ పనులు తామే చేసుకోగలిగేలా తీర్చిదిద్దడమే తమ ముందున్నపెద్ద సవాలు అన్నారు.
తర్వాత మాధవి గారు ప్రసంగిస్తూ సమాజంలో సగభాగమైన మహిళల హక్కులకు సంబంధించి, వారు గౌరవాదరాలతో జీవించే అవకాశాల గురించి ఇలాంటి సభ జరుగుతున్నపుడు అందులో అధిక భాగం స్త్రీలే ఉంటే ఆ సభ సఫలం కానట్టే అన్నారు.మగవాళ్ళు కూడా సమసంఖ్యలో పాల్గొన్నపుడే,తమతో సహజీవనం సాగించే మహిళల మనోభావాలు , అవసరాలు వారికి అర్ధమై, ఆ సభ లక్ష్యం నెరవేరుతుందనీ ,patriarchal society లో సరైన మార్పు రావాలంటే ఆ భావజాలానికి అలవాటు పడ్డ స్త్రీ పురుషులిరువురూ మారాలని చెప్పారు.కేవలం హింస పోవడంతోనే మంచి మార్పు రాదు.వ్యక్తి సరైన గౌరవం పొందుతూ జీవించగలగాలి.ఇలాంటి  విషయాల్లో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం లభించాలంటే జనం నుంచి ప్రొటెస్ట్ రావాలి.దాన్ని మీడియా ఫోకస్ చెయ్యాలి.నిర్భయ విషయంలో రెండూ జరిగాయి.అన్నిసార్లూ అలా జరగదు.ఎందుకంటే దానికి ఎన్నో కారణాలుంటాయి.ఇదీ అని చెప్పలేం. 2000 సంవత్సరంలో ఇంఫాల్‌ లో-- విమానాశ్రయం సమీపంలో సైన్యం 10 మంది పౌరులను కాల్చిచంపినందుకు నిరసనగా,  క్రూరమైన భద్రతా దళాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా)కు వ్యతిరేకంగా  మణిపూర్‌ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిళ  ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.   దీక్షమొదలుపెట్టి  12 సంవత్సరాలు పూర్తయ్యాయి. క్రితం సంవత్సరం అన్నా హజారేకు మద్దతుగా ఆమె ఒక ప్రకటన చేసేవరకు ఆమెగురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఆ ప్రకటన తర్వాతే అంతా తనని గమనించారు. తనప్రాంతంలో ప్రజాస్వామిక విలువల కోసం ఆమె పోరాడుతూ చివరికి ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది.అది నేరమని తనపై కేసు పెట్టింది ప్రభుత్వం.విచారణ జరుగుతోంది. ఇప్పుడీ  విషయం మీడియాలో కనిపిస్తోంది. అలాగే సూర్యనెల్లి కేసు.ట్రయల్ కోర్టు నించి సుప్రీమ్ కోర్టుదాకా సుదీర్ఘ ప్రయాణం ! నిర్బయ తర్వాత లైంగిక అత్యాచారాలు ఇంకా పెరిగాయని అంతా అంటున్నారు.అత్యాచారాలు పెరగలేదు. వాటిని పరువు పోతుందని భావిస్తూ మౌనంగా భరించే స్థితి నించి, ప్రతిఘటించి , ధైర్యంగా రిపోర్ట్ చేసే స్థితి వచ్చింది.అంతే.ఇప్పుడు సమాజం నించి సపోర్ట్ లభించి,సరైన శిక్షలు సకాలంలో పడితే ఇలాంటి అత్యాచారాలూ,హింసలూ తగ్గుముఖం పడతాయనడంలో సందేహంలేదని చెపుతూ ముగించారు.
మహిళా కమిషన్ కార్యదర్శి రాజ్యలక్ష్మి గారు మాట్లాడుతూ ప్రభుత్వం సదుద్దేశ్యంతో స్త్రీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా అది సామాన్య ప్రజ వరకు వచ్చేసరికి, మధ్యలో పనిచేసే ఎందరో వ్యక్తుల వల్ల,వారి చిత్తశుద్ధి లోపం వల్ల, కొంత dilute అయిపోతుంది. దానికి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. సమాజంలో సరైన మార్పు రావాలంటే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని gender sensitization చేయాలి. రేపటి పౌరుల తయారీలో కుటుంబం పాత్ర చాలా ఉంది.పిల్లల్ని పెంచేటపుడు,ఏది సాధించినా , సాధించకపోయినా మంచి పౌరులుగా మాత్రం మిగలాలని వారికి నేర్పాలి. ఆడపిల్లలకి good touch, bad touch మధ్య తేడాని తెలియజెప్పాలి.ఇంట్లో,పనిచేసే ప్రదేశాల్లో లైంగిక దాడి జరిగే సూచన కనబడితే వెంటనే ఎలా అప్రమత్తం కావాలో చెప్పాలి.చేతికి ఏది దొరికితే దానితో తమని రక్షించుకుంటూ , నలుగురికీ వినిపించేలా అరుస్తూ ప్రతిఘటించాలని ఆడపిల్లలకి నేర్పించాలి. ఉత్తర ప్రదేశ్ లోని గులాబీ దండు నుంచి స్ఫూర్తి పొందిన మన రాష్ట్రపు  సమతా దండుసభ్యులు వంగపూలరంగు చీరలు ధరించి, ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ  ప్రత్యక్షమై న్యాయం కోసం పోరాడతారు. సమతా దండుపేరిట ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థలో సభ్యులైన వీరు సాటి మహిళల సమస్యలపై సమరభేరి మోగిస్తారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పది గ్రామాల్లో వీరు సేవలందిస్తున్నారు. గృహహింస, బాల్య వివాహాలు, క ట్నం వేధింపులు, ఆస్తిహక్కు, సంక్షేమ పథకాలు వంటి విషయాల్లో వీరు మహిళలకు బాసటగా నిలుస్తున్నారు. సమాజ సేవకు చదువు, హోదాతో పనిలేదని వీరు నిరూపిస్తూ మేధా పాట్కర్ చేతుల మీదుగా నవీన అవార్డు కూడా పొందారు. బాధలను వౌనంగా భరించకుండా మహిళలు నిరసన గళం విప్పినపుడే మార్పు సాధ్యమౌతుందని చెపుతూ బాధిత స్త్రీలకు బాసటగా నిలిచిన భూమికను అభినందించారు రాజ్యలక్ష్మి గారు.
తర్వాత వికలాంగ మహిళల తరఫున కొల్లి నాగేశ్వర రావుగారు ప్రసంగించారు. అడ్వొకేట్ శేషవేణి గారు మాట్లాడుతూ “A promise is a promise-To end violence against women” అంటూ ఈ సంవత్సరం UN ప్రకటించిన నినాదాన్ని గుర్తు చేశారు. చాలా మంది తమ పక్కింట్లోనో, తెలిసిన చోటో గృహ హింస జరుగుతుంటే తమకు సంబందించిన వారు కాకపోవడంతో మౌనంగా ఉండిపోతారనీ, domestic violence కి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చనీ, వారి పేరు చెప్పాల్సిన అవసరం లేదనీ వివరించారు. ఈ విషయం చాలామందికి తెలియదనీ,దీనికి ప్రచారం అవసరమని చెప్పారు.
కార్యక్రమం జరుగుతుండగా  అమన్ వేదిక రెయిన్బౌ హోమ్స్ నుంచి సాహితి అనే ఎనిమిదేళ్ల అమ్మాయిని పిలిచి మాట్లాడమని కోరింది సత్యవతి. ఇంకా పసి ప్రాయం వీడని ఆ పాప ధైర్యంగా మైక్ అందుకుని తల్లిదండ్రులు తమ కన్న పిల్లల ని పెంచేటపుడు ఆడపిల్లలకీ మగపిల్లలకీ మధ్య చూపించే వ్యత్యాసాన్ని ప్రశ్నించింది.మగ పిల్లలు ఏడిస్తే ఆడపిల్లలా ఏడుస్తావేమిరా అంటారనీ,ఆడపిల్లలు హాయిగా నవ్వితే ఏమిటది మగపిల్లల్లాగా?”అంటూ తిడతారనీ , పుస్తకాల సంచీ బడిలో పడేసి ఆటలకి పారిపోయే మగపిల్లల్ని సంతోషంగా బడికి పంపుతారనీ,శ్రద్ధగా చదువుకునే ఆడపిల్లల్ని చదువు మానిపించి ఇంటి పనిలో పెట్టేస్తారనీ  చెప్పగానే అంతా ఆపాప పరిశీలనకీ,అన్యాయాన్ని ప్రశ్నించిన తీరుకీ హర్షధ్వానాలు చేశారు.
సభ పూర్తవుతూనే అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాం. విరామం తర్వాత శ్రీ విద్య పాఠశాల నుంచి specially abled పిల్లలు హృదయంగమంగా బృంద నాట్యాలు చేశారు. వారందరి తరఫునా ఒక పాప తమకు శిక్షణ నిచ్చే గురువు గారి గురించి పసి హృదయంతో మనసారా పొగుడుతుంటే అక్కడున్నవాళ్ళ కళ్ళు చెమర్చాయి.
అలాగే సామాజిక అంశాలపై రెయిన్ బౌ హోమ్స్ పిల్లలు ప్రదర్శించిన నాటికలు. వాళ్ళని చూస్తుంటే ఆర్దికంగా  పై తరగతిలో  పుట్టి అన్ని సౌకర్యాల మధ్య పెరుగుతున్న పిల్లల కన్నా తమ హక్కులూ బాధ్యతల గురించి తెలుసుకోవడంలో వీళ్ళెంత ముందున్నారో అనిపించి ఆశ్చర్యం కలిగింది. పాత నగరం నుంచి వచ్చిన షాహీన్ బృందం  ఘోషాని ప్రశ్నిస్తూ ఖవ్వాలీని ప్రదర్శించారు.
చుట్టూ ఏర్పాటు చేసిన అంగళ్ళలో స్రవంతి గీసిన చిత్రాలు,వసంత లక్ష్మి గారి కళాకృతులు,షాహీన్ సంస్థ వారి ఎంబ్రాయిడరీ చీరలూ,స్త్రీ హక్కులూ చట్టాల గురించిన అవగాహన కోసం ప్రదర్శనకు పెట్టిన ప్లకార్డులూ ,బొమ్మలూ తీరిగ్గా ఆస్వాదించి వెనుదిరిగాం నేనూ,సుజలగారూ. బిందువుగా మొదలై సింధువుగా మారబోతున్న మహిళా శక్తి కి నిదర్శనం అక్కడ కనిపించి, ప్రకృతిలో -- సంఖ్యలోనూ,సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి ఆవశ్యకమైన మార్పు త్వరలో రాబోతోందన్నఆశతో ఇల్లు చేరాం.


4 comments:

 1. ఆ రోజు జరిగిన దాని గురి౦చి కళ్ళకు కట్టినట్లుగా బాగా రాసారు నెను మీతో ఉన్నా మీరు రాసినది చదువుతు౦టే మళ్ళీ చూస్తున్న అనుభూతి కలిగి౦ది

  ReplyDelete
 2. చాలా బాగారాసారు

  ReplyDelete
 3. కృతజ్ఞతలు సుజలగారు! ఆ తర్వాత హఠాత్తుగా ఒకరోజు కొండవీటి సత్యవతి ఫోన్ చేసి 'ఆ రోజు సమావేశం గురించి అర్జంటుగా రిపోర్టు కావాలి ,ఎవరెవరో రాశారు గాని అవేవీ సమగ్రంగా లేవు 'అనడిగారు.అప్పటికప్పుడు గుర్తున్నదంతా క్రోడీకరించి రాసి పంపించాను. ఈ నెల భూమికలో వచ్చింది.
  పద్మార్పిత గారు,కృతజ్ఞతలు !

  ReplyDelete
 4. నాగలక్ష్మి గారి కథ నిత్యనూతనం..తల్లి దండ్రులూ పిల్లలూ ఆలోచించవలసిన విషయం..ఇంత మంచి కథ ఎన్ని సార్లు చదివినా ఎ ఎంతోకొంత నేర్చుకోవలసింది ఉంది అనిపిస్తోంది.నాగలక్ష్మి గారికి అభినందనలు.

  ReplyDelete